Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’-16

[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]

భాగ్యనగర సౌభాగ్యం:

1975 జూన్ 1

యాభై ఏళ్ల నాటి మాట.

నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు.

కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా 1967 డిసెంబరు 16న చేరిన నేను 1974 ప్రారంభంలో ఆకాశవాణి పత్రిక ‘వాణి’లో అడ్వర్టయిజ్‌మెంట్ చూసి ఆకాశవాణిలో ప్రొడ్యూసర్ పోస్టుకు అప్లయి చేశాను. ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది. అప్లయి చేసిన సంగతి మరచిపోయిన సందర్భంలో హైదరాబాదు ఆకాశవాణిలో ఇంటర్య్వూకి ఆహ్వానం వచ్చింది. పాత బిల్డింగ్‌లో డైరక్టర్ గది ముందు స్వయంవర రాకుమారుల్లా 24 మంది కూచొన్నాం. ఆకాశవాణి వివిధ కేంద్రాలలో పని చేస్తున్న 8 మంది కూడా అందులో ఉన్నారు. ఖాళీలు మూడు (విజయవాడ, విశాఖపట్నం, కడప కేంద్రాలు) స్టేషన్ డైరక్టరు పి. బాలగురుమూర్తి ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్. ఆకాశవాణి డైరక్టర్ జనరల్ పక్షాన ప్రతినిధి – విజయవాడ డైరక్టరు బాలంత్రపు రజనీకాంతరావు. ప్రత్యేకాహ్వానితులు ఉస్మానియా తెలుగు శాఖాధిపతి ఆచార్య బి. రామరాజు.

నలభై నిముషాలు ప్రశ్నలు సంధించారు. సారాంశం – “మీరు గవర్నమెంటు ఉద్యోగంలో రూ.355 బేసిక్ తీసుకొంటున్నారు. ప్రొడ్యూసర్ స్కేలు రూ.350. అంటే ఐదు రూపాయలు జీతం స్కేలు తక్కువ. పై పెచ్చు కేవలం మూడేళ్ల కాంట్రాక్టు ఉద్యోగం. పెన్షన్ లేదు. పెద్దలుగా మేం ఇచ్చే సలహా మీరు ఆకాశవాణికి రావాలంటే ఉన్న ఉద్యోగం రాజీనామా చేయాలి. కాబట్టి విరమించుకోండి.”

“ధైర్యే సాహసే లక్ష్మీ!” అన్నారు పెద్దలు.

వినయంగా వారికి విన్నవించుకొన్నాను.

“నాకు ఆకాశవాణి అంటే ప్రీతి. నేను రాజీనామా చేసి చేరుతాను” అన్న మాటలు విని వారు నవ్వుకొన్నారు.

నన్ను కడపకు సెలక్టు చేశారు.

విజయవాడలో స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తున్న ఉషశ్రీని విజయవాడకు, విశాఖపట్టణంలో అదే పోస్టులో వున్న పి.వి.విజయభూషణశర్మను విశాఖకు సెలక్టు చేశారు. ఆగస్టు 16, 1975న నేను కడప గడప తొక్కాను.

హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో రచయితకి సన్మానం

భాగ్యనగరంలో తొలి అడుగు:

ఉద్యోగరీత్యా హైదరాబాదులో తొలిసారిగా 1982 అక్టోబరు 5న ఆకాశవాణిలో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా యు.పి.యస్.సి. ద్వారా సెలక్ట్ అయి అడుగు పెట్టాను. కడప మిత్రులు వీడ్కోలు ఘనంగానే జరిపి పంపారు. అసెంబ్లీ కెదురుగా నిజాం కాలం నాటి మహోన్నత భవనాలలో స్టూడియో, ఆఫీసు కాంపెక్సు వున్నాయి. చుట్టూ బ్యారక్స్‌లో మరి కొన్ని ఆఫీసు రూములు,  వార్తా విభాగం, ఇటు పక్క నిజాం క్లబ్. 1984లో పాత భవనాలు పడగొట్టి నూతన భవన నిర్మాణం జరిగింది. 1988లో నూత్న భవనాలు వచ్చాయి.

పాత తరం:

నిజాం అధీనంలో 1935 నుండి పని చేస్తున్న ‘డక్కన్ రేడియో’ 1950 ఏప్రిల్ 1న ఆకాశవాణిగా రూపుదాల్చింది. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ,  ఆంగ్ల భాషలో ప్రసారాలు జరిగేవి. స్టేషన్ డైరక్టర్లుగా ఉన్నత ప్రమాణాలు ప్రదర్శించిన వ్యక్తులు పని చేశారు. వారిలో ప్రముఖులను స్మరిస్తాను. ఆద్యులు – అయ్యగారి వీరభద్రరావు. విజయవాడలో పని చేసి 1965-66 మధ్య హైదరాబాదు బదలీ మీద వచ్చారు. అదే రీతిలో విజయవాడ కేంద్రంలో 1949-50 మధ్య వ్యవహరించిన యం.వి రాజగోపాల్ హైదరాబాదు డైరక్టరుగా అంతకు ముందు 1955-57 మధ్య వున్నారు. ఆయన తర్వాత I.A.S   సాధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య శాఖ డైరక్టరయ్యారు. పసల గురుమూర్తి, (1974-75) తర్వాత పుల్లెల వెంకటేశ్వర్లు మూడేళ్లు డైరక్టరు (1975-78). వారు ప్రమోషన్‌పై ఢిల్లీ ఆకాశవాణి డిప్యూటీ డైరక్టరు జనరల్ అయ్యారు. యు.పి.యస్.సి ఇంటర్వ్యూ బోర్డులో వుండి నన్ను అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా 1982లో సెలక్టు చేశారు. నిక్కచ్చిగా వ్యవహరించే అధికారి. అంతకు ముందు డి.డి.జి హోదాలో యస్.యన్.మూర్తి పని చేశారు. మూడో వ్యక్తిని నేను. 2001 నుండి 2005 వరకు దూరదర్శన్‌లో అడిషనల్ డైరక్టరు జనరల్ హోదా పొందాను. తెలుగువారైన మిత్రులు, సౌజన్యమూర్తి ఆర్.వెంకటేశ్వర్లు ఆకాశవాణి డైరక్టర్ జనరల్ హోదా సాధించిన తొలి తెలుగు వ్యక్తి. ఇటీవల కాలంలో వార్తా విభాగానికి చెందిన యన్. వేణుధరరెడ్డి ఆ పదవిని అధిష్టించారు.

నేను 1982 అక్టోబరులో చేరినపుడు నిష్కామకర్మ యోగి యస్.రాజారాం స్టేషన్ డైరక్టర్. ఆయన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు. మైసూరు వాసుదేవాచారి మనుమలు. 1983 జనవరి 31న రిటైరయ్యారు. మద్రాసులో కళాక్షేత్ర  డైరక్టర్‌గా విశ్రాంతి జీవనం సుఖమయంగా గడిపారు. రుక్మిణీదేవి అరండేల్‌కు ప్రీతి పాత్రులు.

మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడుతో రచయిత

భువన విజయ సభ:

1970-80 దశకంలో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం భవన విజయ సభలా వుండేదని గొల్లపూడి మారుతీరావు అభివర్ణించారు. ఆయన హైదరాబాదులో ఉద్యోగరీత్యా ప్రవేశించే నాటికి దిగ్దంతులైన వ్యక్తులు కార్యక్రమ రూపశిల్పులు. లబ్ధ ప్రతిష్ఠులు. వారు పని చేయడం వల్ల రేడియో ఖ్యాతి పెరిగింది. మా తరం వారికి అందులో పని చేయడం వల్ల అంతో, యింతో పేరు వచ్చింది. శ్రోతలను అలరించిన పాత తరం మహానీయుల గూర్చి ఒక్కొక్క పేజీ వ్రాయాలి.

స్థానం నరసింహారావు (1902-71):

రంగస్థలం స్త్రీ పాత్ర ధారణలో దిట్ట ఆయన. గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. 1920లో నాటక రంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాలు స్త్రీ పాత్రలు ధరించారు. సమ్మోహన రీతిలో ప్రేక్షకుల నలరించారు. 1970లో  పద్మ శ్రీ అలంకృతులయ్యారు. ఆయా రంగాలలో నిష్ణాతులను కాంట్రాక్టు పద్ధతి పై ఆకాశవాణిలో ప్రొడ్యూసర్లుగా నియమించే విధానంలో భాగంగా ఆయన 1956లో హైదరాబాదులో నాటక విభాగ ప్రొడ్యూసర్‌గా చేరారు. శ్రవ్య నాటకాలకు రూపకల్పన చేశారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897-1980):

పిఠాపురం సమీపంలోని చంద్రపాలెం వాసి.  హైదరాబాదు కేంద్రంలో 1952-64 మధ్య ప్రసంగ శాఖ ప్రొడ్యూసరు. దాశరథి వీరి విభాగంలో అసిస్టెంట్ ప్రొడ్యూసరు. ఆ తర్వాత మదరాసు బదలీ అయింది. ఇద్దరు  సినీరంగంలో లబ్ధప్రతిష్ఠులు. ఇద్దరు పాటల రచయితలు.

నాయని సుబ్బారావు (1899-1978):

విద్యా ప్రసారాల విభాగ ప్రొడ్యూసరు. వీరి కుమార్తె నాయని కృష్ణకుమారి తెలుగు విశ్వవిదయాలయ వైస్ ఛాన్స్‌లర్. నాయని వ్రాసినదంతా సువర్ణమే అన్నారు దేవులపల్లి.

రేడియో అన్నయ్య (1905-1984) రేడియో అక్కయ్య (1908-80)  గా ప్రసిద్ధులైన నాయపతి రాఘవరావు, కామేశ్వరిలు బాలల కార్యక్రమ రూపశిల్పులు. బాలబాలికలతో సృజనాత్మకతను వెతికి తీసి ‘బాలానందం’ నడిపిన మహనీయులు.

త్రిపురనేని గోపీచంద్ (1910-1962):

ప్రముఖ నవలా రచయిత. అంగలూరులో జన్మించిన వీరు హైదరాబాదులో 1957లో గ్రామస్థుల కార్యక్రమ నిర్వాహకులుగా చేరారు. గోపీచంద్ కుమారుడు సాయిచంద్ సినీనటుడు.

మునిమాణిక్యం నరసింహారావు (1898-1973):

కాంతం కథలతో ప్రఖ్యాతి గడించారు. హైదరాబాదు కేంద్రంలో విద్యా ప్రసారాలను తీర్చిదిద్దారు.

బుచ్చిబాబు (1916-1967) అనబడే శివరాజు వెంకట సుబ్బరావు 1945 నుండి మదరాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్. వీరి సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి బెంగుళూరులో స్థిరపడ్డారు.

మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారయణ్, కేంద్ర సమాచార ప్రసార శాఖల మాజీ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గార్లతో రచయిత

పాత తరం ఇతర ప్రముఖులు:

భాస్కరభట్ల కృష్ణారావు(1918-1963) ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా 1951 నుండి 1966 వరకు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. కథా రచయిత వడ్లమూడి గోపాలకృష్ణయ్య హైదరాబాదులో ప్రొడ్యూసర్‌గా 1964-66 మధ్య నియమితులయ్యారు. వేటూరి సహజానంద పంచవర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్. వారణాసి రామమూర్తి హిందీలో గొప్ప పండితులు. హిందీ ప్రసంగాల రూపకర్త. ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చేయడంలో దిట్ట. కేశవ పంతుల నరసింహ శాస్త్రి  ‘కేయూరాణి విభూషయంతి’ అనే సంస్కృత పాఠాల నిర్వాహాకులుగా ఆంధ్ర శ్రోతలకు సుపరిచితులు.

నండూరి విఠల్, శారదా శ్రీనివాసన్‌ల జంట రేడియో నాటకాలకు పట్టం గట్టారు. విఠల్ దూరదర్శన్ హైదరాబాదు తొలి రోజుల్లో తీర్చిదిద్దారు. వీరి ‘విషకన్య’ నవల ప్రసిద్ధం.

మల్లాది నరసింహాశాస్త్రి రామకృష్ణ శాస్త్రి కుమారులు. మూడు దశాబ్దాలు స్క్రిప్ట్ రైటర్‌గా కార్యక్రమాలకు పుష్టి చేకూర్చారు. వీరి కోడలు శైలజాసుమన్ ఆకాశవాణి, దూరదర్శన్ లలో డైరక్టరుగా పని చేశారు.

డా. సి. నారాయణ రెడ్డి, గుమ్మడి గార్లతో రచయిత

మహిళా చక్రవర్తులు:

సంగీత సమ్రాట్టులు:

వీరే గాక చెరుకుమల్లి భాస్కరరావు, దండమూడి మహీధర్, వసీం అక్తర్, అజిత్ అఫ్సర్, కె. చిరంజీవి (నాటకాలు) మొదలి అరుణాచలం, యన్.వి.యస్ ప్రసాదరావు ప్రభృతులు తెలంగాణా శ్రోతలను అలరించారు. ఆర్.సి.వి.రెడ్డి తెలంగాణా యాసలో కార్యక్రమాలు చేసి  శ్రోతల మెప్పు పొందారు. వీరందరూ పాతతరం  ప్రతినిధులు. మా తరం ప్రతినిధుల గూర్చి తర్వాత ముచ్చటిస్తాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version