[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
విజయవాడలో విజయభేరీ (1978 – 1997):
విజయవాడ అనగానే కృష్ణానదీ తీరం గలగలలు వినిపిస్తాయి. కనకదుర్గ కాలి అందెలల ఘలంఘలలు ఘోషిస్తాయి. స్వాతంత్ర సమరయోధులు, త్రివర్ణ పతాక నిర్మాత పింగళి వెంకయ్య ప్రభృతుల పాదముద్రలు కనిపిస్తాయి.
శ్రోతలను నిద్రనుండి మేల్కొలికే ఆకాశవాణి సుప్రభాత గీతాల భక్తిరంజని వినిపిస్తుంది. అట్టి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో 1978 – 1997 రెండు దశాబ్దాల మధ్య కాలంలో నేను రెండు హోదాలలో రెండు మార్లు పనిచేశాను.
తొలి దఫా ఉషశ్రీ స్థానంలో బదిలీ మీద కడప ఆకాశవాణి నుండి ప్రొడ్యూసర్‌గా విజయవాడ కేంద్రానికి 1978 నవంబరులో వచ్చి 1980 జూన్ వరకు తెలుగు ప్రసంగశాఖ ప్రయోక్తగా వ్యవహరించాను. దేశ మొత్తం మీద తిరిగి కడప, హైదరాబాదు, ఢిల్లీ, అనంతపురం, కడపల మీదుగా రెండో దఫా విజయవాడ స్టేషన్ డైరక్టరుగా 1995 మార్చి నుండి 1997 అక్టోబరు వరకు బాధ్యతలు నిర్వహించాను. ఆయా కాలాలలో ప్రసిద్ధ వ్యక్తులను స్మరించడానికే ఈ ఉపోద్ఘాతం.
శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారితో రచయిత
ప్రసార ప్రముఖులు:
1978లో నేను విజయవాడలో చేరే నాటికి దృశ్య మాధ్యమాలు ఆంధ్రదేశంలో లేవు. రాజమండ్రి నుండి సూళ్లురుపేట వరకు ఆకాశవాణి విజయవాడ ప్రసార పరిధి. దిగ్దంతులైన ప్రముఖులు ప్రసారాలకు దిగ్దర్శనం చేశారు. భువన విజయసభలో అష్టదిగ్గజ కవుల వలె ఆయా కాలాలలో అక్కడ ప్రముఖులు శ్రోతల్ని రంజింపజేశారు. బాలాంత్రపు రజనీకాంతరావు వంటి ప్రసార రంగ భీష్ములు అలంకరించిన సింహాసనంపై నేను కూర్చునే అవకాశం 1995లో లభించింది. కొందరి విశేషాలు ఉటంకిస్తాను.
యస్.యన్.మూర్తి:
సూరి నారాయణమూర్తి విజయవాడ వాస్తవ్యులు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర డైరెక్టరుగా పని చేసిన తొలి తెలుగు వ్యక్తి, రెండో వాడిని నేను (1997-2000). ఆయన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్‌గా పని చేసి 1971లో రిటైరయి 1981 జనవరిలో విజయవాడలో కన్నుమూశారు. డి.డి.జి. స్థాయి కెదిగిన మరో ప్రముఖులు పుల్లెల వెంకటేశ్వర్లు. 2001లో ఆ స్థానం నేను సంపాదించాను. అందరినీ పేర్కొనే అవకాశం తక్కువ గాబట్టి దిగ్దర్శనంగా కొద్ది మందిని ప్రస్తావిస్తున్నాను.
మాజీ గవర్నర్ శ్రీమతి వి.ఎస్. రమాదేవి గారితో రచయిత
బందా కనకలింగేశ్వర రావు (1907-1968):
కృష్ణా జిల్లా ఆటపాకలో జన్మించిన వీరు ఏలురులో కొంత కాలం న్యాయవాద వృత్తి చేపట్టారు. నాటకరంగంలో విశేషానుభవం గల వీరిని ఆకాశవాణిలో నాటక విభాగ ప్రొడ్యూసర్‌గా 1956లో నియమించారు. 12 సంవత్సరాలు అనేక నాటకాలు రేడియోకి రూపొందించారు. మరుగున పడిన యక్షగానాలు రికార్డు చేయించి భద్రపరచారు. ఉత్తమ నటుడిగా 1963లో రాష్ట్రపతి అవార్డు పొందారు.
విజయవాడ కేంద్ర స్టేషన్ డైరక్షర్లుగా పి.ఆర్.రెడ్డి, దుర్గాభాస్కర్, పి.వేదవతి, మంగళగిరి ఆదిత్య ప్రసాద్, యం.కృష్ణకుమారి గణనీయ కృషి చేశారు. దాక్షిణాత్యులైన శ్రీనివాసన్, అయూబ్, కులకర్ణిలు చిరస్మరణీయులు.
పింగళి లక్ష్మీకాంతం (1894-1972):
విశ్వవిద్యాలయ ఆచార్యుల నెందరినో తీర్చిదిద్దిన పరమ గురువు లక్ష్మీకాంతం. కృష్ణా జిల్లా ఆర్తమూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ ఫ్రొఫెసర్‌గా నియమితులయ్యారు. విజయవాడ ఆకాశవాణిలో ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా ఎన్నో వినూత్న కార్యక్రమాల రూపకల్పన చేశారు. ఆ పదవిలో నేను 1978 – 80 మధ్య పని చేయడం నా అదృష్టం. పింగళి, కాటూరి కవుల ‘సౌందరనందం’ ప్రశస్తం.
బాలాంత్రపు రజనీకాంతరావు (జనవరి 1920 -2018 ఏప్రిల్):
‘రజని’గా పిలువబడే వీరు పింగళి లక్ష్మీకాంతం శిష్యులు. 1944 నుండి 1978 వరకు ఆకాశవాణి వివిధ కేంద్రాలలో పని చేశారు. 1971-76 మధ్య విజయవాడ కేంద్ర డైరక్టరుగా ఎన్నో కార్యక్రమాలతో శ్రోతల్ని ఆకట్టుకున్నారు. ఉషశ్రీచే ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రారంభింప చేసి శ్రోతల మన్నలందారు. 1972లో వీరు రూపొందించిన ‘కొండ నుంచి కడలి దాకా’ రూపకానికి టోక్యో బహుమతి లభించింది. ఎందరికో గురువు. నన్ను, ఉషశ్రీని రేడియో ప్రొడ్యూసర్లుగా సెలక్టు చేసిన కమిటీలో ఆయన సభ్యులు.
డా. బాలమురళీకృష్ణ (1930 జులై – 2016 నవంబరు):
తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన వీరు కర్ణాటక సంగీతంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. 8వ ఏట సంగీత కచేరీ చేశారు. 1965 ప్రాంతంలో మదరాసు, విజయవాడ కేంద్రాలలో సంగీత విభాగ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటిక అకాడమీ అధ్యక్షులు. పద్మవభూషణ బిరుదాంకితులు.
జంధ్యాలగారు, భమిడిపాటి గారితో రచయిత
వోలేటి వెంకటేశ్వర్లు (1928 – 1989):
కర్టాటక, హిందూస్థానీ సంగీతాలలో దిట్టయైన వోలేటి ముమ్మడివరంలో జన్మించారు. శ్రీపాద పినాకపాణి శిష్యురికంలో సంగీత రహస్యాలు అభ్యసించారు. 1956 నుండి విజయవాడ సంగీత విభాగ ప్రొడ్యూసర్‌గా భక్తిరంజని కార్యక్రమాలకు వన్నె తెచ్చారు. సంగీత విభాగంలో పని చేసిన యన్. సి. హెచ్. కృష్ణమాచార్యులు, అన్నవరపు రామస్వామి (పద్మశ్రీ), శ్రీరంగం గోపాలరత్నం, సుందరపల్లి సూర్యనారాయణమూర్తి, బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి ప్రభృతులు చిరస్మరణీయులు.
ఉషశ్రీ (1928-1990):
పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు (ఉషశ్రీ) విజయవాడ కేంద్రం ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా అఖండ ఖ్యాతి గడించారు. భారత, రామాయణాలు ప్రవచన రూపంలో ప్రసారం చేసిన ఘనాపాఠీ. 1975 జూలైలో మేమిద్దరం ప్రొడ్యూసర్లుగా నియమితులమయ్యాము.
హేమాహేమీలు:
శంకరమంచి సత్యం, శ్రీగోపాల్, లత, వింజమూరి శివరామరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, జి.వి.కృష్ణారావు, ఏడిద కామేశ్వరరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, జలసూత్రం లక్ష్మీనాథ శాస్త్రి, నండూరి సుబ్బారావు, సి.రామమోహనరావు, పి.యస్. భట్, సుత్తి వీరభద్రరావు, వింజమూరి లక్ష్మీ – చిరస్మరణీయులు. వీరి గురించి ఒక్కొకరిని ఒక పేజీ మించి అయినా వ్రాయదగిన మహనీయులు.
పత్రికా రంగ ప్రముఖులు:
విజయవాడ అనగానే దిన పత్రికలు వినీలాకాశంలో వెలుగులు విరజిమ్మిన 70వ దశకం గుర్తుకొస్తుంది. ఛానళ్ల సునామీ దాడి లేని ఆ రోజుల్లో దినపత్రికలు, ఆకాశవాణి ప్రజాసందోహానికి కబుర్లు అందేజేశాయి. ఛానళ్ల వలె తాజా వార్తల పేర వ్యాఖ్యానాలు జోడించిన రోజులు కావవి.
ఆంధ్రపత్రిక:
దినపత్రికలలో తొలిగా నిలిచేది ఆంధ్రపత్రిక. మదరాసు, విజయవాడ, హైదరాబాదు నగరాలలో ప్రధాన కార్యాలయాలు వుండేవి. శివలెంక శంభు ప్రసాద్ గారి తర్వాత శివలెంక రాధాకృష్ణ స్వయంగా సంపాదక బాధ్యతలు వహించారు. విజయవాడ నడిబొడ్డులో ఆంధ్రరత్న భవనంలో పత్రిక నడిచేది. వారపత్రిక, భారతి మాస పత్రికలు మదరాసు నుండి వెలువడేవి. ఆంధ్రపత్రిక వార పత్రిక కథల పోటీలు నిర్వహించేది. పద్య కవితలు, సాహిత్య వ్యాసాలు ప్రచురించేది. కమర్షియల్ వాతావరణంలో నిలదొక్కుకోలేక మూతబడింది. వీరాజీ, నండూరి పార్ధసారథి ప్రభృతులు సంపాదకవర్గంలో ఆణిముత్యాలు.
ఆంధ్రప్రభ:
గోయెంకా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపులో భాగంగా ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో కాలూనింది. 1938 ఆగస్టు 15న మదరాసులో ఆరంభమైంది. నార్ల వెంకటేశ్వరరావు సహాయ సంపాదకులు. 1942లో సంపాదక బాధ్యతలు చేపట్టి 1959 వరకు కొనసాగి రాజీనామా చేశారు. 1958- 70 మద్య రెండు సార్లు ఆయన రాజ్యసభ సభ్యులు. తర్వాతి కాలంలో ఆంధ్రప్రభ వారపత్రిక దీపావళి కథల పోటీలు, ఉగాది నవలల పోటీలు నిర్వహించేది.
ఆంధ్రజ్యోతి:
నార్ల వెంకటేశ్వరరావు సంపాదకులుగా, కె.యల్.యస్.ప్రసాద్ సారథ్యంలో ప్రభకు పోటీగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆరంభమైంది (1960 జూలై). కొత్త ఒరవడిని సృష్టించింది. నార్ల తరువాతి తరంలో త్రిమూర్తులు ఆంధ్రజ్యోతి దిన, వార, సినీ పత్రికల బాధ్యతలు చేపట్టారు. వీరే నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తుర్లపాటి కుటుంబరావులు. నండూరి సంయమనం గల సంపాదకులు. వారపత్రికకు పట్టాభిషేకం చేసి కథానవలల సృష్టికి దాసోహం చేసిన వ్యక్తి, పురాణం సీత పేరుతో ప్రసిద్ధులైన సుబ్రహణ్యశర్మ. జ్యోతిచిత్ర ద్వారా సినీ రంగ ప్రముఖుల జీవన గమనాలు చిత్రించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావు. ఆయనకు పద్మశ్రీ లభించింది. బాలమిత్రకు శశికాంత శాతకర్ణి, వనితాజ్యోతిని సత్యనారాయణ సజావుగా నిర్వహించారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ జ్యోతిలో పని చేసి ఆకాశవాణిలో చేరారు.
తర్వాతి కాలంలో ఈనాడు, వార్త, ఆంధ్రప్రత్రికలు పాఠకులకు తాజా వార్తలతో ఉర్రూతలూగించాయి. ఏ.బి.కె.ప్రసాద్ సారథ్యంలో దినపత్రికలు వార్తా వ్యాఖ్యాలకు, ఇన్వెస్టిగేషన్ జర్నలిజానికీ నాంది పలికాయి. సిద్ధాంతాలకు కట్టుబడి నడిచిన విశాలాంధ్రలో సి.రాఘవాచారి, ఏటుకూరి బలరామమూర్తి పల్లెపల్లెకూ వార్తలతో రెండో పార్శ్వాన్ని చూపారు. ప్రజాశక్తి ఈ కోవలో నడిచింది. స్వాతి వారపత్రిక మేమూరి బలరామ్ సారథ్యంలో కథా నవలా రచయితలకు పట్టం గట్టింది. ఆనందజ్యోతి వార పత్రికను ఆర్.యస్.మూర్తి కొంత కాలం నడిపారు. పి.టి.ఐ వార్తా సంస్థ ప్రతినిధిగా కృష్ణమూర్తి భవన్స్ జర్నలిజం కోర్సు నడిపారు. నేను 1980లో ఆ సంస్థ నుండి జర్నలిజం డిప్లోమా పొందాను.
కోట శ్రీనివాసరావు గారితో రచయిత
కవిసమ్రాట్ సామ్రాజ్య రాజధాని – విజయవాడ:
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చరితార్థం చేసిన నగరం విజయవాడ. ఆయన యస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా వున్న సమయంలో నందమూరి తారకరామారావు చదివారు. పి.వి.నరసింహారావు అభ్యర్ధన మేరకు విశ్వనాథ కరీంనగర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పదవి నిర్వహించారు. తొలిసారిగా తెలుగువారికి జ్ఞానపీఠ బహుమతి వారి రామాయణ కల్పవృక్ష కావ్యానికి లభించింది. వారి కుమారులు అచ్యుతదేవరాయలు చక్కని కవి. పావనశాస్త్రి రచయిత. విజయవాడలో గత ఐదు దశాబ్దాలకు ముందు వెలసిన ప్రముఖలను ప్రస్తావిస్తాను.
పద్య కవిగా యశస్సు గడించారు పైడిపాటి సుబ్బరామశాస్త్రి, ఆ తరానికి చెందిన కవి పండితులలో డా. ప్రకాశచంద్ర శతపథి, గూడూరు నమశ్శివాయ, గురజాడ రాఘవశర్మ (మచిలీపట్నం), పువ్వాడ శేషగిరి రావు, తిక్కన సోమయాజి (బందరు), కోటగిరి విశ్వనాథ శర్మ, నాగళ్ల గురుప్రసాదరావు, శనగన నరసింహస్వామి, జంధ్యాల మహతీ శంకర్, దిగవల్లి శివరావు, కుందుర్తి సత్యనారాయణ, వింజమూరి శివరామరావు ప్రభృతులు ప్రాతఃస్మరణీయులు.
ఆధునిక కవిగా వేగుంట మోహనప్రసాద్, కథా రచయితగా పెద్దిబొట్ల సుబ్బరామయ్య, నవలా రచయితగా డా. కొమ్మూరి వేణుగోపాలరావు, లత తమదైన శైలిలో ప్రసిద్ధిగాంచారు. మహళాభ్యుదయ రచయిత్రిగా, మాంటిసోరి కళాశాల వ్యవస్థాపకులుగా వి.కోటీశ్వరమ్మ ప్రసిద్ధురాలు. కె.బి.యన్. కళాశాల తెలుగు శాఖాధిపతి చివుకుల సుందరామ శర్మ, వారి సోదరులు మార్కండేయశాస్త్రి (డిప్యూటీ డైరెక్టరు, ఓరియంటల్ కళాశాల), శాతవాహన కళాశాల అధ్యాపకులు పింగళి వెంకటకృష్ణారావు, పుచ్ఛా పూర్ణానందం, పోలవరపు కోటీశ్వరరావు, యం.సి.దాస్, నగరంలోని సాహిత్య సభలకు వన్నె తెచ్చిన ఘనులు.
గుంటూరు జిల్లా కీర్తి చంద్రికలు:
తుమ్మపూడి సంజీవదేవ్, కొత్త సచ్చిదానంద మూర్తి, జంధ్యాల పాపయ్యశాస్త్రి, జాషువా, ప్రసాదరాయ కులపతి, ఏలూరిపాటి అనందరామయ్య, మైలవరపు శ్రీనివాసరావు, రామమోహనరావ్, పులిచర్ల సాంబశివరావు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గణనీయులు, కొర్రపాటి గంగాధరరావు, పోలాప్రగడ సత్యనారాయణ దంపతులు, కొండముది శ్రీరామచంద్రమూర్తి దంపతులు, బండ్లమూడి సత్యనారాయణ, జానకీదేవి, వెలగా వెంకటప్పయ్య, దక్షిణామూర్తి కోస్తా ప్రాంత స్మరణీయులు.
హరికథకులలో ములుకుట్ల సదాశివశాస్త్రి, పద్మశ్రీ కొత్త సచ్చిదానంద శాస్త్రి, వీరగంధం వెంకట సుబ్బారావు, బెజవాడ నాగరత్నమ్మ ప్రభృతులు ఆకాశవాణి కళాకారులు. నాగార్జున విశ్వవిద్యాలయ ఆచార్య పరంపరలో తూమాటి దోణప్ప, బొడ్డుపల్లి పురుషోత్తం, గంగప్ప, బేతవోలు రామబ్రహ్మం, యార్లగడ్డ బాలగంగాధరరావు, ఆకురాతి పున్నారావు, టి. నిర్మల, ప్రభావతీ దేవి ప్రభృతులు ముఖ్యులు.
సుదీర్ఘమైన ఈ పట్టికలో పలువురిని స్మరించకపోవడం స్థలాభవమే.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
