[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
రాయలసీమ రాజకీయ చతురులు
అనంతపురం జిల్లా:
గత సంచికలలో చిత్తూరు, కడప జిల్లాల రాజకీయ ముఖచిత్రం ప్రదర్శించాను. అనంతపురం ప్రభుత్వ కళాశాలలో కొద్ది కాలం అధ్యాపకులైన సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి (1962-67) పదవులు అలంకరించారు. ఆ కళాశాల విద్యార్థి నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత రాష్ట్రపతిగా (1977-82) కీర్తి పొందారు. అవిభక్త మదరాసు రాష్ట్రంలో 1946లో శాసనసభ్యులై 1949లో కుమారస్వామి రాజా మంత్రివర్గంలో స్థానం పొందారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం కర్నూలులో ఏర్పడినప్పుడ ప్రకాశం మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. తిరిగి 1962లో రెండవ దఫా ముఖ్యమంత్రి. జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు 1977లో రాష్ట్రపతి పదవి నధిష్టించారు. సంజీవరెడ్డి సోదరుడు నీలం రాజశేఖరరెడ్డి (1918) భారతీయ కమ్యూనిస్టు పార్టీ నేత. 1938లో కమ్యూనిస్టు పార్టీలో చేరి మూడు సంవత్సరాలు రహస్య జీవితం గడిపారు. యుద్ధ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొని జైలు జీవితం గడిపారు. తన యావదాస్తిని కమ్యూనిస్టు ఉద్యమానికే దానం చేసిన ఘనుడు. ఈ సోదరుల బావ తరిమెల నాగిరెడ్డి (1917-76) మదరాసు లయోలా కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివే రోజులలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలకు హాజరైనందుకు బ్రిటీషు ప్రభుత్వం జిరిమానా విధించింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు కమ్యూనిజంతో పరిచయమైంది. తన బావ అయిన సంజీవరెడ్డిని 1952లో ఓడించి మదరాసు శాసనసభ్యుడయ్యారు. 1957లో అనంతపురం లోక్‌సభసభ్యులు, 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు.
1977లో నాటి విద్యాశాఖామంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారితో
పాతతరం నాయకులలో గుత్తి కేశవ పిళ్లె (1860-1933) ప్రముఖులు. గుత్తిలో న్యాయవాదిగా వుంటూ 1885 డిసెంబరులో బొంబాయిలో జరిగిన భారతీయ కాంగ్రసు ప్రథమ సభలకు ప్రతినిధిగా వెళ్లారు. 1917-18 మధ్య ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. 1919లో చెన్నపురి శాసనమండలి ఉపాధ్యాక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1926లో తిరిగి ఆ పదవని చేపట్టారు. ‘కూలీ కింగ్’గా ఆయన కూలీల పక్షపాతి. రామబహుదూర్, దివాన్ బహుదూర్ బిరుదులను బ్రిటీషు ప్రభుత్వం ప్రకటించింది.
కల్లూరు సుబ్బరావు (1897-1973) నిష్కామ కర్మయోగి. హిందూపురం సమీపంలోని కల్లూరులో జన్మించారు. దత్తత మండలాలుకు (CEDED DISTRICTS) ‘రాయలసీమ’ అని నామకరణం చేసింది ఆయనే. 1937లో మదరాసు శాసనసభకు ఎన్నికయ్యారు. తిరిగి 1945లో గెలుపొందారు. 1956-67 మధ్య ఆంద్ర ప్రదేశ్ శాసనసభ్యులు. గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ర ముఖ్యమంత్రిగా వున్న సమయంలో శాసనసభ ఉపసభాపతి. 1967లో పద్మశ్రీ వరించింది.
పైడి లక్ష్మయ్య (1904-1987) తొలి పార్లమెంటుకు 1952లో అనంతపురం నుండి ఎంపికయ్యారు. నీలం సంజీవరెడ్డితో ప్రగాఢ మైత్రి వలన తన కుమారునకు ‘సంజీవరెడ్డి’ అని నామకరణం చేశారు. ఆయనే పి.యల్. సంజీవరెడ్డి (IAS). లక్ష్మయ్య ఆంధ్ర ప్రదేశ్ ఎండోమెంట్ కమీషనరుగా, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులుగా వున్నారు.
1978లో కడపలో ఓ సమావేశంలో డా. సి. నారాయణరెడ్డి, శ్రీశ్రీ గార్లతో
అనంతపురానికి చెందిన భజన అంజనప్ప నెల్లూరు రిజర్వుడు నియోజిక వర్గం నుండి మూడు మార్లు 1957, 1962, 1967లలో లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. నామినేషన్ వేసి వెళ్లిపోయేవారని జన శ్రుతి. అనంతపురం పార్లమెంటు సభ్యులుగా అనంత వెంకటరెడ్డి 1989, 1991లలోను; ఆయన కుమారులు అనంత వెంకటరామిరెడ్డి 1996, 1998, 2004, 2009లలోను గెలిచారు. పి.ఆంధోని రెడ్డి 1967, 71లోను; దరూరి పుల్లయ్య 1977, 80లోను; 1999లో కాలవ శ్రీనివాసులు, 2014లో జె. సి. దివాకరరెడ్డి పార్లమెంటు సభ్యులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రులు:
అనంతపురం జిల్లా నుండి భిన్న మంత్రివర్గాలలో మంత్రులుగా వ్యవహరించిన ప్రముఖులు.
- కదిరికి చెందిన అగిశం వీరప్ప – విద్యుచ్ఛక్తి శాఖ. 1981.
- కదిరికి చెందిన మహమ్మద్ షకీర్ – పర్యాటక, అటవీ శాఖలు –
- యం. లక్ష్మీదేవి – కల్యాణదుర్గం – స్త్రీ శిశుసంక్షేమ శాఖ –
- చల్లా సుబ్బరాయుడు – తాడిపత్రి – న్యాయశాఖ.
- జి. నాగిరెడ్డి – ధర్మవరం నియోజకవర్గం – చిన్న తరహా నీటి పారుదల శాఖ.
- పల్లె రఘునాధరెడ్డి – ధర్మవరం నియోజకవర్గం – సాంస్కృతిక శాఖ.
- జె.సి.దివాకరరెడ్డి – తాడిపత్రి, రోడ్లు భవనాల శాఖ – 2004-2006.
- పయ్యావుల కేశవ్ – ఉరవకొండ – ఆర్ధిక శాఖ 2024.
- యస్. సవిత – బి.సి.సంక్షేమ చేనేత శాఖలు – 2024.
- సత్యకుమార్ యాదవ్ – ధర్మవరం నియోజిక వర్గం – ఆరోగ్యశాఖ –
కర్నూలు ముఖచిత్రం:
కర్నూలు మండల సాహితీ వైజయంతి అనగానే స్పరించే వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తమరావు (1883-1960). జాతిపిత గాంధీ చేత ‘ది బ్రేవ్ హరి సర్వోత్తమరావ్’ అని ప్రశంసలందుకొన్న విరాణ్మూర్తి. బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలతో ప్రభావితులై దేశ ద్రోహ నేరం కింద నిర్భందితులైన తొలి తెలుగు వ్యక్తి గాడిచర్ల. 1927లో నంద్యాల నియోజకవర్గం నుండి మదరాసు కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 1930 నుండి రాజకీయాలకు దూరమై గ్రంథాలయోద్యమానికి నడుం కట్టారు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం చైర్మన్.
1988లో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో శ్రీ నాగఫణి శర్మగారితో
మార్కాపురంలో ఆంధ్ర పండితులుగా అధ్యాపనలు కొనసాగించిన గాడేపల్లి వీరరాఘవశాస్త్రి (1891-1945) గద్వాల సంస్థాన ఆస్థాన పండితులు. వీరిది ఎర్రగొండ పాళెం. అవధానాలలో దిట్ట. మార్కాపురం డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులు కె.రాజమల్లాచారి విద్వత్కవి. యామినీ సరస్వతి నవలా రచయితగా హైదరాబాదులో కొన్ని చలన చిత్రాలకు స్క్రిప్టు వ్రాశారు. శతావధాని ఉప్పల వేంకటశాస్త్రి ఇక్కడి రచయిత.
ఆధ్యాత్మిక రంగంలో శ్యామచరణ బాబా నంద్యాలలో వెలుగొందారు. కర్నూలులో సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులు డా. అప్యజోడు వెంకటసుబ్బయ్య తర్వాత కావలి జవహర్ భారతి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. తిరుమల దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి. సిల్వర్ జూబ్లీ కళాశాల చరిత్ర ఉపన్యాసకులు రాపాక ఏకాంబరాచార్యులు గొప్ప పరిశోధకులు. ‘అవధాన సర్వస్వం’ అనే పేర వెయ్యి పుటల బృహధ్గ్రంథంలో వందల కొలది అవధానుల జీవన రేఖలు అందించారు.
కర్నూలు మెడికల్ కాలేజికి చెందిన డా. శ్రీపాద పినాకపాణి కర్ణాటక సంగీతంలో శిఖరప్రాయులు, వారి సతీమణి బాలాంబ గాయని. ఆ కాలేజి ప్రిన్సిపాల్‌గా పి.యస్.ఆర్.కె. హరనాధ్, భాస్కరరెడ్డి, కృష్ణమోహన్, ప్రసిద్ధులు. హరనాధ్ సతీమణి పి. సావిత్రి గైనకాలజిస్టు. కుమారుడు డా. జగన్నాధ్ క్యాన్సర్ వైద్య నిపుణులు (బొంబాయి) కర్నూలు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి సంగీత విద్వాంసులు.
రాజకీయ చిత్రపటం:
1953 అక్టోబరులో కర్నూలు రాజధానిగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి, నీలం సంజీవరెడ్డి, ఉపముఖ్యమంత్రి. 1955లో బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956 నవంబరు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 1921 – మే 1972) తొలి దళిత ముఖ్యమంత్రి (1960-62). దళిత అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షులు. ఉమ్మడి మదరాసు రాష్ట్ర మంత్రి. లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కార్మిక శాఖా మంత్రి (1964-66). ఆయన సతీమణి కృష్ణవేణి రాష్ట్ర మంత్రి. సంజీవయ్య సోదరుడు మునుస్వామి రాష్ట్ర మంత్రిగా పని చేశారు.
కర్నూలు జిల్లా రాజకీయ ప్రత్యేకత – ఈ జిల్లా నుండి ఇద్దరు ముఖ్యమంత్రులు -దామోదరం సంజీవయ్య, కోట్ల విజ్యభాస్కరెడ్డి సారథ్యం వహించడం, అదే రీతిలో నంద్యాల నియోజకవర్గం ఒక రాష్ట్రపతిని – నీలం సంజీవరెడ్డి 1977లోను, ఒక ప్రధాన మంత్రిని 1991 లోను గెలిపించి చరిత్రను సృష్టించింది.
శ్రీయులు పద్మనాభం, రావి కొండలరావు తదితరులతో
కోట్ల విజయభాస్కరెడ్డి రాజకీయాలలో ఆజానుబాహుడు (1920 ఆగస్టు – 2001 సెప్టెంబరు). కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్‌గా రెండు మార్లు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు మార్లు (1982-83, 1992-94) పని చేశారు. పార్లమెంటు సభ్యులుగా ఆరు సార్లు ఎన్నికయ్యారు. 1977, 1984, 1989, 1991, 1992. కేంద్రంలో షిప్పింగ్, రవాణా, పరిశ్రమల శాఖాల మంత్రి – 1983-84. కేంద్ర న్యాయ, కంపెనీ వ్యవహారాల మంత్రి – 1991-92. వీరి కుమారులు కోట్ల సూర్యప్రకాశరెడ్డి 1991, 2004, 2009లలో లోక్‌సభ సభ్యులు. 2012 అక్టోబరులో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి.
కర్నూలు లోకసభకు 1952లో ప్రజాసోషలిస్టు పార్టీ పక్షాన గడిలింగన్న గౌడ్; హెచ్. సీతారామరెడ్డిలు ఇద్దరూ గెలుపొందారు. లింగన్న స్వతంత్ర పార్టీ తరపున 1967లోను గెలుపొందారు. బళ్లారికి చెందిన సీతారామరెడ్డి ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో 1947-52 మధ్య రెవెన్యూ, పరిశ్రమల శాఖ మంత్రి.
ఏరాసు అయ్యపురెడ్డి (1920-2009) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖా మంత్రి. కర్నూలు లోక్‌సభకు తెలుగు దేశం పార్టీ తరఫున 1984లో గెలుపొందారు. సాహిత్యాభిమాని. వీరి కుమారులు ప్రతాపరెడ్డి శ్రీశైలం శాసనసభ్యులు.
శ్రీ ధారా రామనాథశాస్త్రి గారితో
నంద్యాల నియోజక వర్గం నుండి 1991 ఉపఎన్నికలో (ప్రతాపరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో) పి. వి. నరసింహారావు (ప్రధానమంత్రిగా నియమితులయిన పిదప) ఎన్నికయ్యారు. 1977లో నంద్యాల నుండి బి.యల్.డి పార్టీ అభ్యర్థిగా గెలిచిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. నంద్యాల నుండి నాలుగు సార్లు – 1967,1971,1978,1980లో గెలిచిన పెండేకంటి వెంకట సుబ్బయ్య హోంశాఖ సహాయ మంత్రి (1980-84). తర్వాత బీహారు, కర్నాటక గవర్నరు. నంద్యాల నుండి రాయసం శేషగిరిరావు 1952లో స్వతంత్ర అభ్యర్ధి. ఈ నియోజక వర్గ లోక్‌సభ సభ్యులు – మద్దూరి సుబ్బారెడ్డి (1984), బొజ్జా వెంకటరెడ్డి(1989), భూమా నాగిరెడ్డి (1996, 99); యస్. పి. వై. రెడ్డి 2004, 2009, 2014.
కె. బి. నరసప్ప రాయలసీమ అభివృద్ధి బోర్డు చైర్మన్. కర్నూరు జిల్లా నుండి పని చేసిన ఇతర రాష్ట్రమంత్రులు – కె. ఇ. కృష్ణమూర్తి, కె.ఇ. ప్రభాకర్; బి.శేషశయనా రెడ్డి, బి. వి. మోహన్ రెడ్డి, టి. జి. వెంకటేష్, యం.డి. ఫరూఖ్, అఖిల – ఆ తరానికి చెందిన యోధులు. టి. జి. భరత్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.