[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
రాయలసీమ సాంస్కృతిక వైజయంతి (1975-2000)
1975 తర్వాత రాయలసీమ నాలుగు జిల్లాలలో రచయితల సంఘాలు ఉధృతంగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాయి. చిత్తూరు జిల్లా రచయితల సంఘం పి. రాజగోపాల నాయుడు, బి. భాస్కరచౌదరి సారథ్యంలో ఏటా సమావేశాలు నిర్వహించింది. ఆకస్మికంగా మరణించిన నూతలపాటి గంగాధరం స్మారక పురస్కారాలు అందిచండం ఆనవాయితీ. తిరుపతిలో సాహితీ మిత్రమండలి సమావేశాల ప్రసంగపాఠాల గ్రంథం కూడా వెలువడింది. పులికంటి కృష్ణారెడ్డి తన పేర రెండు, మూడు సంవత్సరాలు పలువురికి ఘనంగా అవార్డులందించారు.
అనంతపురం రచయితల సంఘాలు కోలకలూరి ఇనాక్, ఆశావాది ప్రకాశరావుల భిన్న సారథ్యంలో అష్టావధానాలు, సాహిత్య గోష్ఠులు జరిపాయి. శాంతినారాయణ తన ధర్మపత్ని పేర పురస్కారాలు ప్రకటిస్తూన్నారు. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అభ్యుదయ రచయితల సంఘ సారథ్యం వహిస్తున్నారు. లలిత కళాపరిషత్ సాహిత్య సాంస్కృతిక నాటిక సంస్థలకు వారధి.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, డా. శ్రీదేవి గార్లతో 1978లో
కడప రచయితల సంఘం మల్లెమాల వేణుగోపాలరెడ్డి, జానమద్ది హనుమచ్ఛాస్త్రి నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమావేశం 1977లో కడపలో నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ఆ సమావేశాలలో అకాడమీ అధ్యక్షులు డా. బెజవాడ గోపాలరెడ్డి, కార్యదర్శి దేవులపల్లి రామానుజ రావు పాల్గొన్నారు. వైశ్య ప్రబోధిని సంపాదకులు పాలాది లక్షీకాంత శెట్టి, దోమా వెంకటస్వామిగుప్తా పీఠం ఏర్పరచి ఏటా అవధానులను సత్కరించారు. భూతపురి సుబ్రమణ్యశర్మ పెద్దన సాహిత్యపీఠాన్ని బెజవాడ గోపాల రెడ్డితో 1994లో ప్రారంభోత్సవం చేయించారు. బ్రౌన్ లైబ్రరీ ఆధ్వర్యంలో నెల నెలా సాహితీ గోష్ఠులు కొనసాగుతున్నాయి.
కర్నూలు రచయితల సంఘం కార్యదర్శి రోశయ్య సారథ్యంలో సభలు – సమావేశాలు నిర్వహించింది. తర్వాతి కాలంలో కె.సి.కల్కార గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్మారక సభలు నిర్వహిస్తున్నారు. నంద్యాలలో సూరన కళాపీఠానికి డా. గెలిని సహదేవుడు, గొట్టి ముక్కల సుబ్రమణ్యశాస్త్రి ప్రధాన వ్యక్తులు. కర్నూలులో యం.డి. వెంకట సుబ్బయ్య ప్రతి నెలా సాహితీ సమావేశాలు జరిపి మూడు సంకలనాలు వెలువరించారు. వివిధ ప్రాంతాలలో చిరు సంఘాలు బయలుదేరి ఆయా సందర్భాలననుసరించి భువన విజయాలు, అష్టావధాన, శతావధానాలు, కవిగోష్ఠులు నిర్వహిస్తున్నాయి. దాసరి వెంకటరమణ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత.
అనంతాక్షరి:
‘నాటకాంతంహి సాహిత్యం’ అని నానుడి. ఆంధ్ర నాటక పితామహుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853-1912) అనంతపురం జిల్లా ధర్మవరంలో జన్మించారు. బళ్లారిలో సరసవినోదినీ సభకు 1886లో అధ్యక్షులు (వీరి చెల్లెలు బళ్లారి రాఘవ తల్లి). ముప్ఫై దాకా నాటకాలు రచించారు. కమలాపురంలో జన్మించిన కోలాచలం శ్రీనివాసరావు (1854-1919) పౌరాణిక, చారిత్రక నాటకాలు వ్రాశారు. వీరిని ఆంధ్రచరిత్ర నాటక హితామహా బిరుదంతో సత్కరించారు.
కవిసమ్మేళన కవులు
తాడిపత్రిలో జన్మించిన రాఘవాచార్యులు (1880-1946) బళ్లారి రాఘవగా ప్రసిద్ధులు. షేక్‌స్పియర్ నాటక పాత్రలకు జీవం పోశారు. ‘సుజనరంజని’ పేరుతో బళ్లారిలో నాటక సమాజ స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తో సత్కరించింది. రొద్దం హనుమంతరావు (1906-1986) పెనుగొండలో జన్మించారు. స్థానం నరసింహరావు సరసన శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుని పాత్ర పోషించారు. వీరి కుమారులు ఆర్. ప్రభాకరరావు ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. హైదరాబాదులో కిన్నెర సాంస్కృతిక సంస్థకు చిరకాల అధ్యక్షులు.
తాడిపత్రిలో 1912లో జన్మించిన కె.వి.రెడ్డి సినీరంగంలో చరిత్ర సృష్టించారు. వాహిని, విజయ సంస్థల ద్వారా ఎన్నో ఉత్తమ చిత్రాలకు దర్శకులు. పైడి లక్ష్మయ్య (1904-1987) శ్రీశైలీయం. హేమారెడ్డి మల్లమ్మ తదితర నాటకాల కర్త. తొలి పార్లమెంటులో లోక్‌సభ సభ్యులు (1952). వీరి కుమారులు పి. యల్. సంజీవరెడ్డి కేంద్రంలో కార్యదర్శి. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరిని కట్టమంచి రామలింగారెడ్డి తన గురువుగా భావించేవారు. శర్మగారి కుమారులు జయంత తిరుపతి విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాచార్యులుగా రిటైరయ్యారు.
చియ్యేరులో జన్మించిన పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-1991) బహు గ్రంథకర్త. కడపలో స్థిరపడ్డారు. చిలుకూరు నారాయణరావు (1890-1952) దత్త మండలాలకు ‘రాయలసీమ’ అని నామకరణం చేసిన ఘనుడు. అనంతపురం కళాశాలలో పని చేశారు.
డా. బెజవాడ గోపాలరెడ్డి గారితో 1993
తరిమెల గ్రామంలో జన్మించిన విద్వాన్ విశ్వం (1915-1987) ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకులుగా సుప్రసిద్ధులు. అసలు పేరు మీసరగండ విశ్వరూప శాస్త్రి. రాయలసీమ కరువును చిత్రించే ‘పెన్నేటి పాట’ వారి విశిష్ట కావ్యం. కళాప్రపూర్ణ బిరుదాంకితులు. సాధన పత్రికా సంపాదకులుగా చిరపరిచితలైన పప్పూరి రామాచార్యులు (1896-1972) పత్రికా నిర్వహణలోనూ, రాజకీయాలలోను ఆరితేరిన ఘనులు. అనంతపురం మునిసిపల్ చైర్మన్‌గా (1947-51), శాసన సభ్యులుగా (1955-61) రాజకీయాలలో మేటి.
రాయలసీమ కవుల చరిత్రను ఐదు సంపుటాలుగా వెలువరించిన కల్లూరు అహోబలరావు (1901-1990) హిందూపురంలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు రాఘవేంద్రరావు శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాలను నిర్వహిస్తూన్నారు. బెళ్లూరి శ్రీనివాసమూర్తి, ప్రభృతులు ఈ జిల్లా పాతతరం ఘనాపాఠీలు.
శతాబ్ది కళాశాల:
అనంతపురం ఆర్ట్స్ కళాశాల 1916 జులై 8న ప్రారంభమైంది. 2017లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కళాశాలలో సర్వేపల్లి రాధకృష్ణన్ అధ్యాపకులు. ఈ కళాశాల పూర్వ విద్యార్ధులు – నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య ఘనకీర్తి నార్జించారు. రాష్ట్రమంత్రులు – ఇ.అయ్యపురెడ్డి, జె.సి.దివాకరరెడ్డి, యం.రఘవీరారెడ్డి; న్యాయమూర్తులు జస్టిస్ జయచంద్రారెడ్డి, జస్టిస్ పి.ఓబుల్ రెడ్డి, జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి, జస్టిస్ మోతిలాల్ నాయక్, జస్టిస్ చల్లా కొండయ్య; వివిధ విశ్వవిద్యాలయాల వి.సి.లు. ఓ.పుల్లారెడ్డి, యం.శాంతప్ప. కె.హనుమంతప్ప.
ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా నక్కా రామారావు ప్రభృతులు ప్రసిద్ధులు. మా సహాధ్యాయి యం.మల్లికార్జునరావు గతంలో ప్రిన్సిపాల్ (2003 -2004), ఉరవకొండలో కూడా ప్రిన్సిపాల్.
జె.యన్.టి.యు.:
అనంతపురంలో జె.యన్.టి.యు ప్రాచీనం. ఇక్కడి ప్రిన్సిపాల్ వై.వెంకటరామిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా, యూ.పి.యస్.సి. సభ్యుడిగా వ్యవహరించారు. అధ్యాపకులు డి. స్వామినాధన్ ప్లానింగ్ కమిషన్ మెంబరు. ఇక్కడ విద్యార్ధి యస్.పి. బాలసుబ్రహ్మణ్యం. మరో విద్యార్థి గోపాలరెడ్డి హైదరాబాద్ జె.యన్.టి.యు. వి.సి. అయ్యారు.
పుట్టపర్తి సత్యసాయిబాబా గారితో 1992
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులు మహనీయులు – కోరాడ మహాదేవశాస్త్రి, కె.నాగభూషణరావు, తుమ్మపూడి కోటీశ్వరరావు, శలాక రాఘునాథశర్మ, కోలకలూరి ఇనాక్, హెచ్.యస్. బ్రహ్మానంద, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, పి.యల్. శ్రీనివాసరెడ్డి, దేవకి దంపతులు, బుద్ధన్న, శేషశాస్త్రి విశిష్టులు. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుత శాఖాధ్యక్షులు. ఆంగ్ల శాఖాధ్యక్షులు సి.ఆర్.విశ్వేశ్వరరావు, విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ (2008-11). వీరు అనంత లక్ష్మీకాంత సాహితీ పురస్కారం అందుకొన్నారు.
సత్యసాయి మహిళా కళాశాల ప్రిన్సిపాల్‍గా క్రమశిక్షణకు మారు పేరైన జె.హేమలత తెలుగు సాహిత్యంలో దిట్ట. పుట్టపర్తి కళాశాలలో ఆచార్యులు, మాధవరాజు, ప్రఫుల్ల పరిశోధకులు.
హిందూపురంలో డిగ్రీ కళాశాల ప్రాచీనం, తెలుగు శాఖలో కర్రా వెంకట సుబ్రమణ్యం, సర్రాజు లక్ష్మీ నరసింహరావులు అధ్యాపక వరేణ్యులు. లేపాక్షి ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు మేడవరం నారాయణశర్మ, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య చిరస్మరణీయులు.
అనంతపురం జిల్లా కదిరికి చెందిన గంగిశెట్టి లక్ష్మీనారాయణ కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా 2005-2008 మధ్య విద్యాభివృద్ధికి కృషి చేశారు. 2025 ఆగస్టులో అమెరికాలో కన్నుమూశారు.
నగరం నడిబొడ్డున వెలసిన లలితకళాపరిషత్ కార్యదర్శి ఏ.నరసింహమూర్తి సాంస్కృతిక కార్యక్రమాల ద్రష్ట. అమళ్లదిన్నె గోపీనాథ్ హస్యచతురుడు. కవిగా ఏలూరి యంగన్న ప్రసిద్ధులు. అమళ్లదిన్నె రమణ ప్రసాద్ అనంతపురం జిల్లా రచయితల జీవన రేఖలను 600 పుటల గ్రంథంగా వెలువరించారు. ఈ జిల్లా వారైన ఇద్దరు అవధానులకు – ఆశావాది ప్రకాశరావు, మాడుగల నాగఫణిశర్మలకు పద్మశ్రీలు లభించాయి.
అనంతపురం కథా రచయితలకు కాణాచి. సింగమనేని నారాయణ, శాంతి నారాయణ, సడ్లపల్లి చిదంబరరెడ్డి, బండి నారాయణస్వామి, బిక్కి కృష్ణ ప్రముఖులు. బండి నారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (2019).
చిలుకూరి దేవపుత్ర కథకులు. గుత్తి రామకృష్ణ స్వాతంత్ర సమరయోధులు. బత్తుల వెంకట్రామిరెడ్డి గ్రంథాలయోద్యమ నిర్వాహకులు.
అనంతపురం విశ్వవిద్యాలయం ప్రారంభ దశలో డా.యస్.శ్రీదేవి అవిరళ కృషితోనే సంస్థకు మంచి పునాది ఏర్పడింది. ఆచార్య యం. ఏబెల్ తొలి వైస్ ఛాన్స్‌లర్ (1981-87). ఆచార్య కె.వెంటకరెడ్డి, యం.జె.కేశవమూర్తి ప్రభృతులు విశ్వవిద్యాలయ ప్రగతికి కారకులు.
పుట్టపర్తి సత్యసాయి విశ్వవిద్యాలయంకి 1990 ప్రాంతంలో వి.యస్.సంపత్ వైస్ ఛాన్స్‌లర్. ఐ.ఎ.యస్.కు రాజీనామా చేసిన కె.చక్రవర్తి రిజిష్ట్రారు. సంప్రదాయబద్ధ విద్యావిధానానికి అది పెట్టింది పేరు. ప్రసన్న కుమార్ స్వామి ప్రంసంగాల ఆంగ్లానువాదకులు. స్వామికి అగ్రజులు – జానకి రామయ్య, కల్నల్ జోగారావులు రథసారథులు.
అనంతపురం నేషనల్ సాయిబాబా కళాశాల విద్యాబోధనలో మంచి పేరు సంపాదించింది. అడ్వకేట్ పి. లక్ష్మినారాయణ రెడ్డి కరస్పాండెంట్‌గా కాలేజి నిర్వహణ జరిగింది. డా. పి.రమేష్ నారాయణకు ప్రిన్సిపాల్‍గా మంచి పేరు.
అనంతపురం జిల్లా నుండి పలువురు ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ అధికారులుగా ఘనకీర్తి వహించారు. పైడి లక్ష్మయ్య కుమారులైన పి.యల్. సంజీవరెడ్డి కడప జిల్లా కలెక్టరుగా, బ్రౌన్ గ్రంథాలయ స్థాపనకు మూల పురుషులు. పక్క జిల్లా అయిన కడపకు చెందిన నందలురు నుండి ముగ్గురు ఐ.యస్. అధికారులు వివిధ ప్రాంతాలలో ఉన్నత పదవులధిష్టించారు. ఏ.యు.శర్మ బీహార్ చీఫ్ సెక్రటరీ. జగత్పతి మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీ. ఏ.వి.యస్ రెడ్డి ఆంధ్ర అదనపు చీఫ్ సెక్రటరీ. కడపకు చెందిన కె.జయభారతరెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ. జె.టి.చారి తమిళనాడు అదనపు చీఫ్ సెక్రటరీ. వై.వి.రెడ్డి, రాఘవేంద్రరావు, విశ్వనాథ్, లక్ష్మీనారాయణ, ప్రేమ చంద్రారెడ్డి ఇతర ఐ.ఎ.ఎస్. అధికారులు.
పోలీసు అధికారులుగా అత్యున్నత స్థానాలు అలంకరించిన ఘనులు రొద్దం ప్రభాకరారవు, డి.జి.పి, ఇస్మాయిల్ పుల్లన్న (అడిషనల్ డి.జి.పి.), జె. వి. రాముడు, డి.జి.పి, ఎ.కె.ఖాన్ డి.జి.పి., కె. అరవింద రావు, డి.జి.పి., నారసింహప్ప ఆదాయ పన్ను శాఖలో ఉన్నతాధికారిగా రిటైరయ్యారు. జస్టిస్ చల్లా కొండయ్య (1918-2008) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (1979-80) గా న్యాయకోవిదులు. జస్టిస్ మోలీలాల్ నాయక్, హైకోర్టు జడ్జి.
గుంతకల్ రైల్వే డివిజన్ దక్షిణ మధ్య రైల్వేలో తలమానికం. ఇక్కడ 1975 నుండి 1995 వరకు పలువురు సినీయర్ అధికారులు డివిజనల్ రైల్వే మేనేజర్లుగా పదవి నలంకరించి ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచారు. వారిలో కెప్టన్ ఏ.యస్. రాధాకృష్ణ, యం.రాజారావు, వెంకటరత్నం, యస్.గోపాలం ప్రముఖులు.
అనంతపురం జిల్లా దర్శనీయ స్థలాలలో లేపాక్షి, కదిరి, తిమ్మమ్మ మర్రిమాను, పెన్న అహోబిలం, తాడిపత్రి, ప్రశాంతి నిలయం పుట్టపర్తి ప్రముఖాలు.
బాలమేధావిగా గణిత కెక్కిన శ్రీనిధి శాస్త్రీయ సంగీతంలో కళానిధి. సంధ్యామూర్తి సంగీత నృత్య పాఠశాల ద్వారా శోభారాణి వంటి ప్రముఖులను లోకానికి అందించింది. అనంతపురంలో ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ నడుస్తోంది. గరికపాటి గురజాడ తెలుగు శాఖలో ఉపన్యాసకులు. డీన్‌గా షీలారెడ్డి వ్యవహరిస్తున్నారు. రాజేశ్వరి మహిళా చైతన్య వారధి.
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.