[తరాలు మారుతున్నాయి. సమాజం వేగంగా పరుగులు తీస్తోంది. విశ్వగ్రామం అనే సిద్ధాంతం ప్రబలింది. 1947లో పుట్టి 80వ ఏట కాలిడబోతున్న ప్రముఖ రచయిత డా. రేవూరు అనంత పద్మనాభరావు మూడు తరాల ప్రముఖులతో కలిసి మెలిసి తిరిగారు. ఆ జ్ఞాపకాల పందిరిని దారావాహికంగా అందిస్తున్నారు.]
మా స్వగ్రామం చెన్నూరు. అది చిన్న ఊరు. రెండు వందల గడపలు. మూడు మజరా గ్రామాలు. 1947 జనవరి నాటి మాట. నేను పుట్టే నాటికి స్వాతంత్రోదయం కాలేదు. రోడ్డు సౌకర్యం, ఆసుపత్రి సౌకర్యం, ఎలక్ట్రిసిటీ లేవు. చెరువు నీటిపై ఆధారపడి వంద ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసేవారు గ్రామస్థులు. ఒక RMP డాక్టరు అందరి బాగోగులు చూసేవాడు. ఆయన పొరుగూరు నుండి సైకిల్ వారానికొకసారి వచ్చిపోయేవాడు.
1952 జనరల్ ఎన్నికలు యథావిధిగా జరిగిపోయాయి. పంచాయతీలు ఏర్పడిన తొలి రోజుల్లో ఆములూరు వెంకట సుబ్బయ్య ప్రెసిడెంట్. రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. 15 కుటుంబాలు ఒక వర్గం. ఒకే ఒక్క రెడ్డి కుటుంబం వ్యతిరేక వర్గం. 10 ఎకరాల బీడు భూమి కోసం రెండు వర్గాలవారు పది సంవత్సరాలు హైకోర్టులో వ్యాజ్యం నడిపారు. ఒక కుటుంబానికి కుందిన వెంకటసుబ్బారెడ్డి కేసు గెలిచి భూమి పేదల పరమైంది
గుడి:
ప్రధానంగా రామ మందిరం, శివాలయం ఉళ్ళో గుడులు. ఆంజనేయుడు, వీరభద్రుల గుడులకు తోడు అంకమ్మ, పోలేరమ్మ, చావడులు ఉండేవి. ఉగాదితో మొదలై శ్రీరామనవమితో రామమందిరం వార్షికోత్సవాలు ఘనంగా జరిగేవి. 9 రోజులు ఒక్కక్క ఉభయకర్తలు ఒక్కొక్క రోజు ఉత్సవాలకు సహకరించేవారు.
శ్రీరామనవమినాడు కల్యాణం, ధర్మకర్త మెడలో పూలమాల వేసి వాహనంపై సీతారాములను ఊరి నాలుగు వీధులలో ఊరేగించేవారు. శివరాత్రిరోజు శివపార్వతుల కల్యాణం.
ఇది ధార్మిక సంపద. సంవత్సరంలో ఒక వారం రోజులు పొరుగూరు హరిదాసులు వచ్చి హరికథా సప్తాహం చేసేవారు. ఊర్లో యజమానులు తమ ఇంట పండిన ధాన్యం ఆయనకు యథాశక్తి దానం చేసేవారు. వీధి భాగవతాలు కూడా అడపాదడపా రాత్రి 10 గంటలకు మొదలై తెల్లవారిన దాకా సంబరంగా జరిగేవి.
బడి:
1947 నాటికే పంచాయతీ ప్రాథమిక పాఠశాల వుంది. ఒకటి నుండి ఏడో తరగతి వరకు చదువు చెప్పేవారు. ఒక హెడ్‍మాస్టరు, ఒక ఎలిమెంటరీ టీచరు వుండేవారు. అన్ని తరగతులు ఒక గదిలో వుండేవి – యాభైమంది దాకా చదువుకునేవారు. చుట్టుపక్కల మజరా గ్రామాల నుండి రెండు కిలోమీటర్లు నడిచి కొందరు వచ్చేవారు. 1951-1955 మధ్య నేను అక్కడ నాలుగో తరగతి వరకు చదివాను. ఆటస్థలం లేదు. పాపయ్య అయ్యవారు హెడ్మాష్టరు. గోపాలకృష్ణమూర్తి సార్ మరో టీచరు. పాపయ్యగారు ట్రాన్స్‌ఫర్ మీద వెళ్ళగా, ‘జాన్’ అయ్యవారు బదిలీ మీద వచ్చారు. ఆయన బహుకుటుంబీకుడు. ఆ గ్రామం నుండి తొలిసారిగా 1965 లో బి.ఏ. డిగ్రీ సంపాందించింది నేనే. బడిని అప్పర్ ప్రైమరీ స్కూల్ స్థాయికి పెంచాలని ప్రయత్నంచి విఫలమయ్యాము. మజరా గ్రామం కట్టుబడిపాళెంలో 7వ తరగతి వరకు నడుస్తున్నది ఇప్పుడు. అప్పట్లో ఎంట్రన్స్ పరీక్ష పెట్టి 5, 6 తరగతులు చదవకుండానే 2nd ఫారంలో చేర్చుకొనేవారు. అలా నేను 1955లో బుచ్చిరెడ్డిపాళెం హైస్కూల్‌లో జూన్ నెలలో 2nd ఫారంలో (7వ తరగతి) చేరాను.
ఈ తరం బడి:
పదేళ్ల తర్వాత 2025 ఉగాదినాడు రామమందిర ఉత్సవాల ఉభయకర్తగా మా వూరుకి వెళ్ళాను. బడి, బల్లలు అన్ని హంగులూ ఏర్సడ్డాయి, ‘మన బడి’ కార్యక్రమం నడుస్తోంది. ఐదు తరగతులకు కలిపి ఆరుగురు విద్యార్థులు ఉన్నారని హెడ్మాస్టర్ చెబితే ఆశ్చర్యం వేసింది. కారణం తల్లిదండ్రులు తమ పిల్లలను బుచ్చిరెడ్డిపాళెంలో కాన్వెంటుకు పంపుతున్నారు. కాన్వెంటు బస్సు వచ్చి పిల్లలను తీసుకెళుతుంది. ప్రభుత్వ పాఠశాల దుస్థితి అలా వుంది. దానిని ఆనుకొని ఉండే రామమందిరం కూడా శిథిలావస్థలో వుండి ఎప్పుడు కూలిపోతుందా? అనే దయనీయ పరిస్థితిలో వుంది.
పంచాయతీ బోర్డు:
తొలినాళ్ల నుండి పంచాయతీ ఎలెక్షన్లు జరుగుతూ వున్నాయి. ఆములూరు వెంకటసుబ్బయ్య రెండు దఫాలు, నర్రా కలిచేటి వెంకురెడ్డి పది సంవత్సరాలు, నర్రా చెంచురామరెడ్డి పది సంవత్సరాలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లుగా వ్యవహరించారు. 1970ల నాటికి ఎలక్షన్లలో వేడి మొదలైంది. మజరా గ్రామానికి చెందిన వేముల ఆదిశేషయ్య ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో దగదర్తి మండల అధ్యక్షలుగా కూడా ఒక టెరం ఆయన పనిచేశారు. గ్రామ పంచాయతీ భవనం ఇప్పుడు నూతనంగా నిర్మించారు. అప్పట్లో పంచాయతీ రేడియో వుండేది (1950ల నాటి మాట). ఉదయం, సాయంత్రంతో వార్తలు మైక్‌లో వినిపించేవి. నాటికలు, హరికథలు ఆసక్తిగా వినేవారు.
రహదారి సౌకర్యం:
మాకు 10 మైళ్ల దూరంలో బుచ్చిరెడ్డిపాళెం టౌన్. అక్కడికి వెళితేగాని బస్సు లేదు. మరో దారిలో 6 మైళ్ల దూరంలో సున్నపుబట్టి దగ్గర నెల్లూరు – కావలి ట్రంకురోడ్డు మీదుగా బన్సులు పట్టుకునేవాళ్లం. ఇప్పుడు అదే సమీపంలో త్వరలో దగదర్తి విమానాశ్రయం రాబోతోంది. మా వూరికి దగ్గరలో విమాన సౌకర్యం అంటే సంతోషంగా వుంది. ఇప్పుడు నెల్లూరు – కావలి బస్సులు వెళ్లడానికి బుచ్చిరెడ్డిపాళెం మీదుగా రోడ్డు ఏర్పడి మా ఊరికి బస్సు సౌకర్యం కలిగింది. బస్టాండులో హోటల్, దాని పక్కనే వైన్ షాప్ వచ్చి నాగరిక ప్రపంచానికి చేరువయ్యాము. ఆటో సర్వీస్ ఏర్పడింది. పాల డిపో నడుపుతున్నారు. నెల్లూరుకు పాలు రోజూ తరలిస్తున్నారు. పాల శీతలీకరణ కేంద్రం, మహిళా డైరీ సహకార సంఘ భవనం నూతనంగా నిర్మించారు. తురిమెర్లకు వెళ్లి బస్సు ఎక్కాలంటే నీళ్ల కాలువలో దిగి వెళ్ళాల్సి వచ్చేది (1970 దాకా).
వైద్య సౌకర్యం:
2015 నాటి వరకు మా గ్రామానికి వైద్య సౌకర్యం లేదు. మూడు మైళ్ల దూరంలో తురిమెర్లలో పి.హెచ్.సి. 1970ల నాటికి ఏర్పడింది. గ్రామాలలో పనిచేయడం ఇష్టం లేక డాక్టర్లు వచ్చేవారు కాదు. ప్రసవాలు జరిగేవి కాదు. మా ఊళ్ళో 60ల నాటికి ఆగ్జిలరీ నర్సులు వచ్చి పోతూండేవారు. 2025 మార్చిలో అనపల్లి కృష్ణారెడ్డి దంపతుల స్థల దానంతో ఆయుష్మాన్ భారత్ విలేజీ హెల్త్ క్లినిక్ నూతన భవనం ఎం.ఎల్.ఏ. ప్రారంభించారు. డాక్టరు రావలసి ఉందని గ్రామీణులు చెప్పారు. దీర్ఘవ్యాధులకు, అత్యవసర కేసులకు ఇప్పుడు 30 కిలోమీటర్ల దూరంలోవున్న నెల్లూరులోని కార్పొరేట్ ఆసుపత్రులు శరణ్యమయ్యాయిు. మారుతున్న పల్లె పటానికి అది నిదర్శనం. ఊళ్లో సిమెంట్ రోజు వచ్చాయి. మంచి నీటి సౌకర్యం కుళాయిల ద్వారా ఏర్పడింది. రెండు, మూడు కార్లు ఊర్లో ఉన్నాయి.
జమీందారీ వాసనలు:
బుచ్చిరెడ్డిపాళెంలో ‘దొడ్ల’ కుటుంబం వారి జమీందారీలో మా చెన్నూరు గ్రామం ఆ రోజుల్లో భాగం. వారి తరఫున అన్నదాత వెంకటసుబ్బయ్య అనే కరణం వుండేవారు. ఆయన రైతుల దగ్గర శిస్తులు ధాన్యరూపంలో వసూలు చేసేవారు. జమీందారు సంవత్సరానికో, రెండు సంవత్సరాలలో లెక్కలు సరిచూచుకోనేవారు. జమీందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత మామూలు రైతుల పరంగా పట్టాలు పంపిణీ చేశారు. శివాలయానికీ, రామాలయానికి ఇనాం భూములు ఉండేవి. వాటి మీద ఆదాయంతో అర్చకులు నైవేద్యాలు సమర్పించేవారు. దొడ్ల లక్ష్మీ నరసారెడ్డికి 26 ఎకరాల భూమి వుండేది. ఆయన జీపులో వచ్చిపోయేవారు. తరువాత 1955 ప్రాంతంలో ఆయన బుచ్చిరెడ్డిఫాళెం సమితి ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు.
రంగస్థల నాటకాలు:
కలిచేది కోదండరామరెడ్డి, భూస్వామి. ఆయనకు సంతానం లేదు. నాటకాలాంటే యిష్టం. తాను స్వయంగా బాలనాగమ్మ నాటకంలో ప్రధానపాత్ర అయిన కార్యవర్ధిగా వేషం వేసేవారు. రెండేళ్లకొకసారి నాటక ప్రదర్శనలుండేవి. నేల టికెట్, బెంచి టికెట్ అమ్మవారు, గూడూరు సావిత్రిని పిలిపించి బాలనాగమ్మల్లాగా వేయించేవారు. ఊళ్ళో ఔత్సాహితులతో నెల రోజులు రిహార్సల్సు జరిపించి పెట్రోమాక్స్ లైట్ వెలుతుర్లో రాత్రి 10 గంటల నుండి తెల్లవారే వరకు నాటకం వేసేవారు. పెద్దరెడ్డిగారికి అగ్రసింహాసనం, నటీమణికి ఆతిథ్యం యివ్వడానికి రెడ్డిగారు సంబరపడేవారు. విద్యుచ్ఛక్తి లేని ఆ రోజుల్లో పెట్రోమాక్స్ లైట్ల వెలుతురే ఆధారం.
అసెంబ్లీ ఎన్నికలు:
చెన్నూరు గ్రామం కావలి రెవిన్యూ డివిజన్ పరిధిలో కోవూరు తాలూకాలో భాగం. 1952 నుండి సాధారణ ఎన్నికలన్నీ అక్కడా జరిగాయి. తొలుత కోవూరు నియోజకవర్గంలో భాగం, మంగళగిరి నానాదాస్ కాంగ్రెస్ పక్షాన గెలిచారు. కమ్యూనిస్టు పార్టీ పక్షాన బసవారెడ్డి శంకరయ్య ప్రత్యర్థి. ‘డూడూ బసవన్న’ అని వ్యంగ్యంగా ఆయనపై పాటలు ప్రత్యర్థి వర్గంవారు ప్రచారంలో భాగంగా చేసేవారు. క్రమేణా బుచ్చిరెడ్డిపాళెం రెడ్ల ప్రాబల్యం తగ్గించడానికి అల్లూరు నియోజకవర్గం ఏర్పడింది. బెజవాడ పాపిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. గిద్దలూరు సుందర రామయ్య ఒక దఫా గెలిచారు. రాజకీయ తంత్రంలో భాగంగా మా ఊరు కోవూరు, అల్లూరు నియోజక వర్గాలలో భాగమైంది. 2024 ఎన్నికలలో కావలి నియోజకవర్గం ఏర్పడింది. చెన్నూరు కావలి నియోజకవర్గంలో భాగమై పోయింది. తెలుగుదేశం పక్షాన కావ్య కృష్ణారెడ్డి గెలుపొందారు. కావలి, బోగోలు, అల్లూరు, దగగర్తి మండలాలు అందులో భాగం.
మారుతున్న పల్లె ముఖచిత్రం:
గత ఏడు దశాబ్దులుగా నేను చూసిన గ్రామ ముఖచిత్రం నాగరిక లక్షణాలు సంతరించుకుంది. గ్రామంలో వీధులు సిమెంట్ రోడ్లయినాయి. కానీ వీధికి రెండు పక్కల వున్న ఇళ్లు వెలవెబోతున్నాయి. గ్రామస్థులు నెల్లూరు టౌన్‌కు అనేక కారణాలతో వలస వెళ్లారు. కావలి – కనుపూరు కాల్వ ద్వారా సుభిక్షంగా వ్యవసాయానికి నీరు లబ్ధి పొంది ఎకరం 20 లక్షల దాకా పలుకుతోంది. సినిమా హాలు, పెట్రోలు బంకు, హోటలు, వైన్ షాపు పట్టణ వాతావరణాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అంతంత మాత్రమేనని అర్చకులు చెప్పినపుడు బాధ కలిగింది. అయినా ఊరు మారింది. మనుషుల మనస్తత్వాలు మారాయి. మామ, అత్త, అక్క, బావ, అన్న, వదినెలని ఆప్యాయంగా పిలుచుకొనే రోజులు మళ్ళీ రావాలని ఆశ!
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.