[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల తూర్పు భాగవత కళాకారుడు డా. బి. కె. శంకర్రావు గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]
కళాకారుడే అధ్యాపకుడై పాఠాలు బోధిస్తే..
ఆ.. ఆ.. ఆ..
“వాణి పయోజ పాణి సుఖవాణి ఘనా ఘన నీలవేణి
కల్యాణ మెరుoగబోణి జలజాసను పట్టపురాణి
సైకతశ్రోణి శరత్సుధాఘ్రణి విశుద్ధ యశోరమణీయ సద్గుణ శ్రేణి
మదాననంబున వశియిoపున నామ్ర సుధీర్ మరున్మని..
జలజా సంభవుని రాణి వినవే పూబోణి
అమలా కమలా నయన అంబుజ వదాన
విజయరాముని బ్రోచిన శ్రీ భీమసింగుని
విజయ గోపాల సుతుని వెలది మము రక్షింపవే.”
(తూర్పు భాగవత కళాకారులు తమ ప్రదర్శనకు ముందుపాడే ప్రార్థనాగీతము)
ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి వహించిన జనరంజకమైన వీథి భాగవతాలను గొల్ల భాగవతులు, యానాది భాగవతులు, మాల భాగవతులు, చిందు భాగవతులు మొదలైనవారు ప్రదర్శించేవారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, శ్రీకాకుళం, గంజాం జిల్లాలలో దీనిని ‘తూర్పు భాగవతం’ అని పిలుస్తారు. భాగవతం అంటే కృష్ణ సంబంధమైన కథలను ప్రదర్శించడం. దీనిలో తూర్పుభాగవతులవారు ప్రదర్శించే కథలు భామాకలాపం, పారిజాతపహరణం కథ మొదలైనవి. భాగవతం ప్రదర్శించే వారిని ‘భాగవతమేళాలు’ అంటారు. ఒక్కొక్క మేళాకు సుమారు పదిమంది సభ్యులు ఉంటారు. వీరు సంగీత, నృత్య, వాద్య కళాకారులు.
ఈ భాగవతాలు అమ్మవారి జాతరలలోనూ, నవరాత్రి ఉత్సవాలలోనూ ప్రదర్శించుతారు. ఆంధ్రదేశమంతటా కథ ఒకటే అయినా తూర్పుభాగవత ప్రదర్శనలో పాటలకు సంబంధించి ప్రత్యేకమైన బాణీలు, దరువులు, ద్విపదలు, కందపద్యాలు, వృత్తాలు, అర్థచంద్రికలు, ఏల పదాలు, చూర్ణికలు, కథ నడిపే విధానం విలక్షణమైనవి. తూర్పు భాగవతానికి ఆయువుపట్టు మృదంగ విన్యాసమే!
తూర్పు భాగవత ప్రదర్శకులలో ఆయా గ్రామాలకు సంబంధించిన భాగవత కళాకారులు ఆ ఊరి పేరుని తమ పేరు ముందుకి తెచ్చుకున్నంత ప్రఖ్యాతి కలిగినవారు. వారిలో కోమటిపల్లికి చెందిన బొంతలకోటి జగన్నాథంగారు, బొంతలకోటి రామ్మూర్తిగారు మొదలైనవారు ప్రముఖులు. ఆ రోజులలో విజయనగరం, బొబ్బిలి, కశింకోట, సాలూరు, పార్వతీపురం మొదలైన సంస్థానాల జమీందారులు ఈ కళను ఎంతో ఆదరించి పోషించారు.
అన్ని ప్రాచీన కళలలాగే ఈ కళ కూడా నేడు అంతరించిపోతున్నది. ‘కళ కళ కోసమే తప్ప ఉపాధి కోసం కాదు’ అనే నానుడి ప్రజలలో వచ్చింది. అందువలన ఇతర వృత్తులలో ప్రవేశిస్తూ ఈ కళను వదిలిపెడుతున్నారు. జానపదులకు ఎంతో ఆనందాన్ని కలిగించే ఈ తూర్పు భాగవతకళను బ్రతికించడం అంటే దానిని ప్రదర్శించడం మాత్రమే కాదు భవిష్యత్తు తరాలకు దానిని అందజేయడం అనే ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకొని పల్లె నుంచి ప్రపంచస్థాయి దాకా ఈ కళను దీని గొప్పతనాన్ని అందించిన ఒక తూర్పు భాగవత కళాకారుడే అధ్యాపకుడిగా ఈనాటి మన గురుపరంపరాలోని గురువు కోమటిపల్లికి చెందిన బొంతల కోటి శంకర్రావు గారు.
కళాకారుడే అధ్యాపకుడైతే..
అధ్యయనంలో నూతనవరవడి
విద్యార్థులు చైతన్య స్వరూపాలై
తరగతిగదిలో కళారూపాల ప్రదర్శనలు
పిల్లల నయనాలలో జ్ఞానజ్యోతులు
విద్యార్థులు పాఠశాల లాంగ్ బెల్ అయిన తర్వాత ఎంత హుషారుగా ఇంటికి వెళతారో అంతే హుషారుగా మర్నాడు ఉదయం పాఠశాలకు రావడానికి ఉత్సాహాన్ని చూపించాలని ఆశయంతో పనిచేస్తున్నారు ఈనాటి మన గురుపరంపరామ్ లోని గురువు, అత్యున్నత పురస్కారాలు ఎన్నిటినో అందుకున్న డాక్టర్ బొంతలకోటి శంకర్రావు గారు.
ఉపాధ్యాయుడు మరియు తూర్పు భాగవత కళాకారుడు అయిన శ్రీ బొంతల కోటి శంకర్రావు గారు
విజయనగరంజిల్లాలో కోమటిపల్లి తూర్పుభాగవత కళాకారులకు ప్రసిద్ధి. వారసత్వంగా తనకు వచ్చిన జనరంజకమైన కళను వదులుకోకుండా దానికి ఆధునికతను జోడించి విద్యార్థులకు క్లిష్టమైన భావనలపట్ల అవగాహనను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వృత్తినీ, ప్రవృత్తినీ కలగలిపి వినూత్నశైలిలో విద్యాబోధన చేస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకుని తన ఊరునూ, తన కళనూ భారతదేశ శిఖరాగ్రాన నిలపాలని ప్రయత్నిస్తున్నారు. ప్రప్రధమంగా కళారూపాలతో బోధనను చేపట్టి దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
డా. బొంతల కోటి శంకరరావు కోమటిపల్లి; బొబ్బిలి మండలం బొంతలకోటి రామమూర్తి భాగవతార్, పార్వతమ్మలకు నాలుగవ తేదీ మే నెల 1971లో జన్మించారు.
తల్లి శ్రీమతి బొంతల కోటి పార్వతమ్మ, తండ్రి శ్రీ బొంతల కోటి రామమూర్తి భాగవతార్
అచ్చుతరావు, రామదాసు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క వరలక్ష్మి. ముగ్గురు చెల్లెళ్లు. పెద్దచెల్లి సావిత్రి, తర్వాత లక్ష్మీ, ఆఖరు చెల్లి రాధ.
అన్నయ్య వ్యవసాయం మరియు టైలరింగ్.
నాన్నగారు ఉద్యోగం వచ్చిన మొదటలోనే చనిపోయారు.
శంకర్రావుగారు ఆడపిల్లల పెళ్లిళ్లు తానే కుటుంబ బాధ్యత వహించి చేశారు. అమ్మ ఇటీవల కాలం చేశారు.
తోబుట్టువులు
బొంతలకోటి శంకర్రావు పుట్టిన మొదలు తూర్పు భాగవత కళాకారుల పాటతో, వాయిద్యాలతో పెరిగారు. శంకరరావు తన 5వ సంవత్సరం నుంచి గాయకుడిగా పదవ ఏటనుంచి రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీతం, గిటార్, కీబోర్డ్, హార్మోనియం తన చిన్నాన్న సాంబమూర్తిగారి వద్ద నేర్చుకున్నారు.
ప్రాథమిక విద్యను కోమటిపల్లిలోనే పూర్తి చేసారు. వారిది మధ్యతరగతి కుటుంబము. వ్యవసాయం పైన ఆధారపడిన కళాకారుల కుటుంబము. తండ్రి బొంతలకోటి. రామమూర్తిగారి దగ్గర సంగీతం కళారూపాల విశిష్టత తెలుసుకున్నారు. తూర్పుభాగవతం ప్రదర్శనలకు తండ్రి వెళితే వారితో వెళ్ళేవారు.
పరిసరప్రాంతాలలో ఏ ప్రాచీన జానపద ప్రదర్శన జరిగినా వెళ్లడమే కాక ఆ ప్రదర్శన లోని పాటలను అలానే పాడేవారు. 5వ తరగతి వరకు కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక విద్య చదివే సమయంలో ఉపాధ్యాయులైన ఆదిలక్ష్మిగారు, సావిత్రిమ్మగారు తరగతి గదిలో పాటలు పాడుతూ శంకరరావుతో పాడించేవారు. వీరి చిన్నాన్న బొంతలకోటి సాంబమూర్తి గారు 3వ తరగతి చదివేటప్పుడే బుర్రకథ నేర్పించారు. ఆ రోజుల్లో పిల్లల బుర్రకథ అంటే ఎంతో ఉత్సాహముతో ప్రతి గ్రామంలో ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. ఇతర రాష్ట్రాలలో కూడా బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చేవారు. శంకరరావు ప్రధాన కథకుడిగా గానం చేసేవారు. 3000 బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. స్వచ్ఛమైన ఉచ్చారణతో, రాగయుక్తముగా పాడే శంకరరావు గాత్రం చాలా బాగా ఉండేది. అందరినీ ఆకర్షించేది. గ్రామాలలో ఏ కార్యక్రమం జరిగినా ఇతనితోనే పాటలు పాడిoచేవారు. తూర్పు భాగవత ప్రదర్శనలకు తన తండ్రితో వెళుతూ జావళీలు నేర్చుకున్నారు. కొన్నిసార్లు కృష్ణుడి వేషం వేసేవారు. హార్మోనియమ్ నేర్చుకొని భాగవతంకు వాయించేవారు. తన 5వ ఏట నుంచి బుర్రకథ ప్రదర్శనలు ఇస్తూ విద్యతో పాటు బుర్రకథ గానం సంగీతం, భాగవతం వంటి కళారూపాలతో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఖరగ్ పూర్, భిలాయి, జైపూర్ మొదలైన నగరాలలో ప్రదర్శనలతో సామాజిక స్పృహకు శ్రీకారం చుట్టారు.
విద్య: రాజా కాలేజీ బొబ్బిలిలో ఇంటర్మీడియట్; డిగ్రీ చదివారు.
ఎం.ఏ. సైకాలజీ, ఎం.ఏ. చరిత్ర, ఎం.ఏ. సోషియాలజీ & ఎం.ఇడి, పి.జి.డిప్లమోలు జర్నలిజం, పి.జి. డిప్లమో పబ్లిక్ రిలేషన్లు, పి.జి.డిప్లమో వయోజన విద్య, పి.జి.డిప్లమో నటన దర్శకత్వం.
అతి చిన్న వయసులో బెంగళూరుకు చెందిన ‘భారత వర్చువల్ పీస్ అండ్ ఎడ్యుకేషన్’ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు,
వృత్తి: శంకర్రావుగారు రెండుసార్లు డి.ఎస్.సి. రాసి రెండుసార్లూ సెలెక్టు ఆయారు. అది అతనికి వృత్తి పట్ల గల మక్కువని తెలియజేస్తుంది. మొదటిసారి డి.ఎస్.సి. రాసి సెకండరీ గ్రేడు టీచరుగా సెలెక్టు ఆయారు.
సెకండరీ గ్రేడ్ నుండి స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ రావాలంటే 28 సం.లు పడుతుంది. అందువలన రెండవ సారి డి.ఎస్.సి.రాసి స్కూల్ అసిస్టెంట్‌గా సెలెక్టు ఆయారు.
అలాగే నిత్య విద్యార్ధిగా వివిధ సబ్జెక్టులలో ఎన్నో డిగ్రీలను పొందారు.
శంకర్రావుగారు తన వృత్తిధర్మముగా అనేక గ్రామాలలో పని చేశారు.
తన వృత్తినీ, ప్రవృత్తినీ కలిపి ముందుకు వెళ్ళడము మొదటిరోజు నుంచే ప్రారంభించారు.
1998 నుండి 2001 వరకు దాసుపేట 2001 నుండి 2002 వరకు గడసామ్
2002 నుండి 2005 వరకు దుగ్గేరు 2005 నుండి 2013 వరకు దేవుపల్లి
2013 నుండి 2023 వరకు గంగచోళ్ళపెంట 2023 నుండి ప్రస్తుతము వరకూ గుర్ల తమ్మిరాజు పేటలో పని చేస్తున్నారు.
దాసుపేటలో పనిచేసేటపుడే 2000 సం.లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
భార్య: బొంతలకోటి లక్ష్మి
ప్రస్తుతం ప్రిన్సిపాలుగా లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, గజపతినగరంలో పని చేస్తున్నారు.
ఇద్దరు కుమారులు.
బొంతలకోటి. జస్వంతకుమార్ (MBBS) పూర్తి చేసి హౌస్ సర్జన్ చేస్తున్నాడు.
చిన్నబ్బాయి బొంతలకోటి. వివేక్ వర్ధన్ 9th class చదువుతున్నాడు.
శ్రీ శంకర్రావు గారు భార్య లక్ష్మి మరియు కుమారులు జస్వంత్ కుమార్ , వివేకవర్ధన్
పాఠశాలలో వివిధ సబ్జెక్టుల సిలబస్ పూర్తిచేసి మార్కులు సంపాదించుకోవడమే లక్ష్యంగా వెళుతున్న ఈ రోజులలో ఈ విధంగా కళారూపాలతో విద్యాబోధన చేయడం ఆచరణీయమేనా? దీని లక్ష్యం ఏమిటి? అని అడిగితే
పల్లెటూరిలో, పిల్లలు సాధారణంగా వ్యవసాయ పనులు వృత్తి పనులు లేదా ఆర్థికస్తోమత బాగులేక చదువులో వెనుకబడి ఉన్న కారణంగా అనేకమైన కారణాలతో బడి అంటే భయం కలిగి ఉంటారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టి ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాలలో విద్యాబోధన జరగాలి అన్నది లక్ష్యము అని తెలిపారు.
ప్రవృత్తిపరంగా తాను చిన్నపుడు గడిపిన జీవనవిధానాన్ని తరగతి గదిలోకి తెచ్చే ప్రయత్నాలు, పాఠశాల మధ్యలోనే ప్రాథమిక స్థాయి గాని, ఉన్నత స్థాయి గాని పూర్తి చేయకుండా వారు మధ్యలో బడి మానివేయకుండా ఉండేందుకుగాను సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా బోధన చేయాలనే తలంపుతో పాఠాలను అందరికీ అర్థమయ్యే విధంగా పాటల రూపంలోకి తర్జుమా చేసి పాటలకు వాద్యపరికరాలను కూడా జోడింపు చేసి బోధన సాగిస్తున్నారు.
అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల ద్వారా కళారూపాల యొక్క నమూనాలను తయారు చేయించి శాశ్వతత్వాన్ని చేకూర్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు’; ‘ఆంధ్రరత్న’ పురస్కార గ్రహీత పాఠశాలలోని ఏ సబ్జెక్టు అయినా ఎంత క్లిష్టమైన అంశమైనా విద్యార్థులకు ఉత్సుకతను పెంచే విధంగా బోధించడానికి జానపద కళారూపాలు దోహదం చేస్తాయని తాను నమ్మిన సత్యాన్ని శిక్షణా తరగతులలోనూ, పాఠశాలలోనూ, తరగతి గదులలోను, ఐక్యరాజ్యసమితి వేదికపైనా, అంతర్జాతీయ సదస్సులలోనూ ఎలుగెత్తి చాటుతారు.
ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యం, పిల్లల అభ్యసనాభివృద్ధి, పిల్లల భాషాభివృద్ధి తదితర అంశాలపై ఆంగ్లవిద్య ఆవశ్యకతను గురించి శిక్షణలు అందుకునే సమయంలో ఈ అత్యంత ప్రాచీనమైన జానపద కళారూపాలను గురించి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రాథమిక స్థాయి నుండి, ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు, పలువురు ఉపాధ్యాయులకు కూడా ఈ రంగంలో శిక్షణను ఇస్తున్నారు.
తాను నేర్పుతున్న తనకు వారసత్వంగా సంక్రమించిన కళారూపాలను విజయనగరం జిల్లాలో తెర్లాం, చీపురుపల్లి, లక్కవరపుకోట మండలాలలో గల అనేక ప్రాథమిక స్థాయి పాఠశాలల నుండి ఉన్నత స్థాయి పాఠశాలల వరకు ఈ బోధనలను అందరకూ పరిచయం చేస్తున్నారు.
శ్రీ శంకర్రావుగారు తన 16 సం.ల వయసు నుండి ఈనాటివరకూ చేస్తున్న కార్యక్రమాలు అందుకున్న పురస్కారాలూ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా అందరినీ కలుపుకుంటూ, విద్యార్ధులను చైతన్యపరుస్తూ, మార్గదర్శిగా ఉండడం సాధ్యమా? అని..
1987 నుండి 1992 వరకు ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ‘అక్షర చైతన్యగీతికలు’ రచనలతో పాటు సామాజిక చైతన్యాన్ని పలు ప్రదర్శనలు నిర్వహించారు.
1990లో అక్టోబర్ రెండు నుండి నవంబర్ 14 వరకు ‘అక్షర కళాయాత్ర ఉద్యమం’లో రచనాకర్తగా, గాయకునిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారి కృషిని అభినందిస్తూ హైదరాబాద్ ‘త్యాగరాజ గానసభ’లో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బి.పి.ఆర్.విఠల్ ద్వారా ఉత్తమ గాయకునిగా సత్కారం పొందారు.
1991లో ‘జాతీయ సమగ్రత’ మీద చేసిన కళారంగ కృషికి మానవ వనరుల అభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎం.లక్ష్మీనారాయణగారి చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
1992లో యూ.జి.సి. నిర్వహించిన రాష్ట్రస్థాయి రచనల వర్క్ షాప్‌లో ఈయన రచించిన వయోజన విద్య; జనాభా విద్యలకు అనుసంధానమైన 150 గీతాల్లో ఉత్తమ సామాజిక చైతన్యగీతాలుగా 20 పాటలను రాష్ట్రంలో ప్రధమంగా ఎంపిక చేశారు.
2004 సెప్టెంబర్ ఐదున జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై విజయనగరం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ గారి చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. సమాజానికి ఉపయోగపడే సేవలను అందించడమే తన జీవిత లక్ష్యం అని శంకర్రావుగారు అంటారు. సామాజిక చైతన్యానికి కృషి చేసే మంచి ఉపాధ్యాయునిగా తన జీవితం తన తండ్రిగారి ఆశయం నెరవేరాలని దానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు.
మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిఫలింప చేసే ఈ పాట తనకు ఎంతో ఇష్టం అంటారు..
సాకీ: చందమామ చందమామ ఓ చందమామ చందమామ చందమామ ఓ చందమామ
పల్లవి:
మన పల్లె పాతకాల పద్ధతులాచారాలు ఎక్కడనో దాగుండి పోయానో
ఏదో సాధించామని గొప్పలు చెప్పే కంటే నిజాలను నెమరు వేసుకుందాము మన పల్లె
చరణం 1
నీళ్లలో పేడనుకలిపి ముంగిల్లలో కల్లాపులు చల్లడం మనము మరచినాము
ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయుట ఏనాడోమనము మరచినాము మన పల్లె
చరణం 2
కాకులకు గ్రద్దలకు ముందు వంట బువ్వముద్దలు పెట్టడం మనము మరిచినాము
ఆవు వంటి జంతువులను పూజించుట మరచినాము ఆచారము మంట గలిపినాము మనపల్లె
చరణం3
చెట్లకు పుట్లకు మొక్కుట ప్రదక్షణలు చేయుట మూఢనమ్మకాలుగాను పలికినాము
పక్షి జంతుజాలంపై మనిషికున్న ఆదరాభిమానాలకు ఇదే నిదర్శనం మనపల్లె
చరణం 4
సాంప్రదాయ వంటకాలు బూరెలు గారెలు అరిసిలు సోడంబలి తర్వాని మరచినాము
హాట్ హాట్ పాస్ట్ ఫుడ్స్ ఆవురావురంటూ తింటూ అల్సర్ గ్యాస్ట్రిక్ ల పాలైనాము మన పల్లె
చరణం 5
సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మరచి సహజ ఎరువు కషాయాలు మరచినాము
పురుగుమందులు చల్లి మేలు చేసే వానపాము వంటివి చంపాము మన పల్లె
చరణం 6
పంట పొలాలు రియల్ ఎస్టేట్ లుగా మార్చినాము చెట్లునరికి చెరువులాక్రమించినాము
పక్షులకు జంతువులకు కూడు గూడు లేకుండా బలవంతపు చావులు తెచ్చాము మనపల్లె
చరణం 7
సాంప్రదాయ పద్ధతులు మళ్ళీ కొనసాగించి ప్రకృతి సంరక్షణకు కదులుదాం
అనేక జీవులు బ్రతకగా ఒకే భవిష్యత్తుగ ప్రకృతి మిత్రులుగాను మారుదాం మనపల్లె
***
మరుగున పడుతున్న జానపద కళారూపాలను ప్రస్తుత తరానికి పరిచయం చేయటంలో సంగీత వాద్యపరికరాలతో పాటు పాటలు, కోలాటం, బుర్రకథ, తప్పెటగుళ్ళు, నృత్యం మొదలైన జానపదకళలను మేళవించి విద్యార్థులకు అర్థమయ్యేలాగా పాఠాలను బోధిస్తున్నారు.
నూతన విద్యావిధానంలో ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయితగా ఇతను చూపించిన అనేక అంశాలను పాఠాలలో చొప్పించి రూపకల్పన చేశారు.
పాటలు, బుర్రకథలు, నాటికలు స్వయంగా రాయడం, నటించడం, ప్రచారం చేయడం, తన విద్యార్థులతో వేయించడం ద్వారా తన గ్రామం యొక్క పేరు దశదిశలా మారు మ్రోగేలాగా కృషి చేస్తున్నారు.
విద్యార్ధులతో తరగతి గదిలో తప్పెటగుళ్ళు
చుట్టూ విద్యార్థులు చేతిలో కీ బోర్డు పాటలతో పాఠాలు
విద్యార్థినులతో కోలాటం ఆడిస్తూ పాఠాలను వల్లిస్తూ
జానపద నృత్య సంగీత కళారూపాలతో విద్యాబోధన ఈ నాలుగు మూల స్తంభాలు విద్యార్థులకు బడి అంటే భయం పోయి ఆహ్లాదకరమైన తరగతి గది విద్యార్థులను సమాజాన్ని ఆకర్షితులను చేస్తుంది.
పాఠశాలలో తరగతి గదిలో వీరు చేసే కార్యక్రమాలను ఎఫ్.ఎం. రేడియోవారు; దూరదర్శన్ వారు; సప్తగిరి ఛానల్ వారు ఆకాశవాణి హైదరాబాద్; విశాఖపట్నం కేంద్రాలవారు రికార్డులు చేసి వాటిని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.
ఈ ప్రాజెక్టు సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయడైరెక్టరు విద్యాశాఖ (ఆర్జెడి) అన్నపూర్ణమ్మగారు; జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ వై. బాలయ్యగారు; డైట్ ప్రిన్సిపాల్ ఫ్రాంక్లిన్ గారు కళారూపాలతో కూడిన విద్యాబోధన గల సి.డి.లను విడుదల చేసి ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
విద్యార్ధులకు తెలిసిన వాద్య పరికరాలను ఉపయోగిస్తూ పాఠాలను పాటలుగా పాడుతూ పాడిస్తూ వారి యొక్క భాగస్వామ్యం ఎక్కువగా ఉండేటప్పుడు వారిలో ఒక చురుకుదనం కలిగి క్లిష్టమైన అంశాలను కూడా వాళ్ళు అవగాహన చేసుకుని ముందుకు సాగుతారు అని నమ్మి ఈ విధానాన్ని అనుసరిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు.
తరగతిగదిలో ప్రవేశపెట్టిన నూతన ఒరవడి వలన విద్యార్థులు కూడా కళాకారులుగా తయారవుతున్నారు. విద్యార్థులలో ఉండే అంతర్గతశక్తులు వెలికి వచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పాఠాలు అన్నింటినీ కళారూపాలుగా ఆయన మలిచారు. వీటన్నింటినీ ఆడియోలు, సిడిలుగా విడుదల చేశారు.
ఈయన రూపొందించిన అనేక సి.డి.లలో సరిగమ సి.డి.ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యగారు ఆవిష్కరించి ఆయనను అభినందించారు.
1993 నుంచి చైతన్య సంస్థ ద్వారా మూఢనమ్మకాలు, సారానిషేధం వంటి కార్యక్రమాలతో మన్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలో 1998 నుంచి 2004 వరకు 1000 డ్వాక్రా సంఘాల ఏర్పాటు 100 రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసి 1500 మంది వయోజనులకు విద్యను అందించడంలో భాగస్వాములు అయ్యారు. విద్యారంగంలో పాటలు సాహిత్యంతో సాంఘికశాస్త్ర పాఠాలకు సరిగమలు జోడించి బోధించారు విద్యార్థులకు హత్తుకునేలా బోధించడం బొంతలకోటి ప్రత్యేకత!
రాష్ట్రపతులు శ్రీ ఆర్ వెంకట్రామన్; శ్రీ రామ్ నాథ్ కోవింద్ మరియు డా.అబ్దుల్ కలాం చేతులమీదుగా ‘ఉత్తమ ఉపాధ్యాయుడి’గా అవార్డు అందుకున్నారు.
అంతర్జాతీయస్థాయిలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల నుంచి ప్రశంసలు పొందారు.
ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు
ఏ.పి. కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫార్మింగ్ సహకారంతో ‘జట్టు ట్రస్ట్’ రూపొందించిన ‘కషాయాలు-ద్రావణాలు’ అనే లఘుచిత్రం ఫిలిం ఫెస్టివల్ 2022లో స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రానికి కాంతికుమారురెడ్డి దర్శకత్వం వహించగా మాటలు, పాటలను బొంతలకోటి శంకర్రావుగారు అందించారు.
కేంద్రప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ జాతీయస్థాయిలో ‘అగ్రి ఫిలిం ఫెస్టివల్ 22’ పోటీలను నిర్వహించినప్పుడు ‘కషాయాలు-ద్రావణాలు’ చిత్రం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. పురుగుమందులు, రసాయనక ఎరువుల వినియోగంతో వ్యవసాయం సర్వనాశనం అయిందని సంప్రదాయ ఎరువులు, కషాయాలు ద్రావణాలతో ప్రకృతి వ్యవసాయం చేయాలన్న అంశానికి రైతులకు అర్థమయ్యేలా వివిధ కళారూపాలతో విడమరిచి చెప్పారు. స్పెషల్ జ్యూరీ అవార్డును కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బి.సి. పాటిల్ చేతుల మీదుగా అవార్డుతో పాటు 10,000/ నగదు ప్రోత్సాహక బహుమతి కూడా ప్రధానం చేసారు.
20 సం.లుగా జానపద కళారూపాలతో సంగీత వాద్య పరికరాలతో వినూత్నంగా పాఠాలు బోధించినందుకు రాష్ట్రపతి అవార్డ్ ఇచ్చారు.
రచనలు:
శంకర్రావు గారు 5,000 పాటలు, 100కు పైగా నాటకాలు 45 చిన్న కథలు వ్రాయడమే కాకుండా వాటిని గ్రామస్థాయిలో, పాఠశాలల స్థాయిలో ప్రదర్శనకు అనుగుణంగా తయారు చేశారు. అతని యొక్క రచనలు ప్రధానంగా సమాజంలోని దురాచారాలను, చెడు అలవాట్లను, మూఢనమ్మకాలను, బాల్య వివాహాలను, వరకట్న మరణాలను గురించి, చదువు-విద్య-ఆరోగ్యము గురించి రాస్తూ ఉంటారు.
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలలకు అవసరమైన పుస్తకముల రూపంగా, సిడిల రూపంగా, లఘుచిత్రాల రూపంగా అనేకమైనవి అందించారు.
శ్రీ బొంతల కోటి శంకర్రావు గారు రచించిన పుస్తకాలు
శంకర్రావుగారి రచనలు– సి. డి. లు మరియు పుస్తకాలు
- పాటలతో పాఠాలు
- మనోపథం
- చైతన్య గీతాలు
- జనజాగృతికళారూపాలు
- కషాయాలు-ద్రావణాలు
- బాలరక్షకళాతరంగిణి
- సాక్షర భారత కళారూపాలు
- పల్లె మారింది
- సాంఘికంలోసరిగమలు
- నీరు చెట్టు
- బడినుండిపొలంబడికి
- జీవవైవిద్యం పర్యావరణం
- అక్షరమే ఆయుధం
- ప్రకృతి మిత్ర
- ప్రకృతిలో- స్వచ్ఛభారత్
అందుకున్న పురస్కారములు
అత్యున్నతమైన రాష్ట్రపతి పురస్కారంతోపాటుగా సుమారు 300 పురస్కారాలు పొంది ఆయన తన ప్రతిభను చాటుకున్నారు జీవవైవిద్య సదస్సుకు ‘ప్రకృతి మిత్ర’ అనే సిడిని అందించి, ఆయన తన గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటుకున్నారు.
కూలర్ సినిమాలో ఆయన రచించిన “తెగిపడ్డ ఆ నింగి చుక్కలం” అనే పాటకు రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. స్త్రీ సామ్రాజ్యం; ప్రేమరథం సినిమాల్లో జనజాగృతి గీతాలను రచించారు. విజయనగరం జిల్లా కలెక్టర్లు రాధా; రజత్ కుమార్; ఆనంద్ ప్రశంసాపత్రాలు అందించారు. అప్పటి డైరెక్టర్ ఝాన్సీ గారి చేతులమీదుగా ఎస్ఎస్సి విశ్వవిద్యాలయం ద్వారా మరొకసారి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. 1991లో విద్యాశాఖ డైరెక్టర్ వి.వెంకటశేషయ్య ప్రశంసాపత్రాన్ని అందించారు. 1996లో ధాన్యలక్ష్మి జానపద కళారూపానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వేణుగోపాలకృష్ణ చేతులమీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆయన ప్రతిభను వెతుక్కుంటూ అనేక పురస్కారాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లభించాయి.
భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావుగారిప చేతులు మీదుగా పురస్కారం.
భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులు మీదుగా పురస్కారం.
భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా పురస్కారం. ఫోటో
భారత ఉప రాష్ట్రపతి డా. ఎం. వెంకయ్య నాయుడు చేతులు మీదుగా పురస్కారం.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ కె. రోశయ్య చేతులు మీదుగా పురస్కారం.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రీ శ్రీ కె. కిరణ్ కుమార్ చేతులు మీదుగా పురస్కారం.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా పురస్కారం.
విజయనగరం జిల్లాకి చెందిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిగారు కేంద్ర విమానయానశాఖా మంత్రి చేతుల మీదుగా
బొబ్బిలి శాసనసభా సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ చేతులు మీదుగా పురస్కారం.
ప్రస్తుత విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ పుస్తకావిష్కరణ
2010లో కామన్వెల్త్ అంతర్జాతీయ బాల సాహిత్య పురస్కారం
2011లో అత్యున్నతమైన రాష్ట్రపతి అవార్డు (Mumbai SNDT women’s University) Lifetime achievement award
2012లో.U.N.O.(ఐక్యరాజ్య సమితి) జీవవైవిద్య అంతర్జాతీయ అవార్డు, లీడ్ఇండియా జాతీయపురస్కారం, నేషనల్ గ్రీన్ టీచర్ అవార్డు
2013లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
2014లో సాక్షర భారత్ జాతీయ పురస్కారం
2016లో ఉత్తమ రచయితగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అవార్డ్
2017లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా
2018లో బెస్ట్ నేషనల్ టెక్స్ట్ బుక్ రైటర్ అవార్డ్
2019లో గౌరవ డాక్టరేట్ అవార్డు బెంగళూరు విశ్వవిద్యాలయం
2022లో నేషనల్ లిటరసీ అవార్డ్
2023లో నేషనల్ గ్రీన్ కోర్ అవార్డ్
2024లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్ నేషనల్ ఐకాన్ అవార్డ్
2025లో కొణతాల రామలింగస్వామి నేషనల్ అవార్డ్
సుమారు 250 వరకు అవార్డులు జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఉన్నాయి.
గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు
తెలుగు తేజం పురస్కారం
గంగచోళ్ళపెంట గ్రామంలో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలుగుతేజం’ అవార్డును బహుకరించింది. “మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావుగారు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, హైదరాబాదులోని బిర్లా సైన్స్ ఆడిటోరియంలో ఈ అవార్డును అందించారని, వందలకొద్ది జానపద పాటలు పాడడంలోనూ, విద్యారంగంలో నూతన వరవడిలో పాఠ్యపుస్తకాలు రచించడంలోనూ, వినూత్న జానపద కళారూపాలతో పాఠాలు బోధించినందుకుగాను ఈ అవార్డు అందినట్లు, తను అందుకున్న 300 అవార్డు శ్రీ పి.వి.నరసింహారావుగారి పేరు మీదుగా అందుకోవడం మధురస్మృతి” అని శంకర్రావుగారు తెలిపారు.
ప్రముఖుల చేతులమీదుగా లఘు చిత్రం పుస్తకావిష్కరణ
ఉపాధ్యాయునిగా పనిచేసిన కొన్ని ప్రదేశాలలోని అనుభవాలు
బొండపల్లి మండలం దేవుపల్లిలో సోషల్ మాస్టర్‌గా పనిచేశారు.
45 నిమిషాలు తరగతి గదిలో ఎంత క్లిష్టమైన పాఠాన్నైనా సరళమైన పదాలతో పాటలుగా మలచి తన మధురగానంతో విద్యార్థులకు బోధించేవారు. విద్యార్థులకు పాటలతో పాఠాలుచెప్పడం వలన చదవడంలో ఉన్న స్తబ్ధతను తొలగిస్తుంది
6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఆసక్తితో ఆయన చుట్టూమూగి ఏకాగ్రతతో ఆలకించి ఆనందిస్తారు. పాఠం పూర్తి అయిన తర్వాత చప్పట్లు మిన్ను ముట్టుతాయి. ఆయన సంగీత వాద్యపరికరాలైన హార్మోనియం, ఘటం, తబలా, గిటారు, కీబోర్డు, డోలక్, జముకు, మొదలైన వాయిద్యాలను అవలీలగా వాయించగలరు.
వీరి ప్రతిభను గుర్తించి విద్యార్థులు పాల్గొంటూ ఉండగా రికార్డు చేయాలని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంవారు వారి పాఠశాలకే వచ్చి కార్యక్రమాన్ని రికార్డింగ్ చేసి ప్రసారం చేస్తూ ఉంటారు. పాటలతోనే కాకుండా నృత్యవిన్యాసాలను కూడా విద్యార్థులకు శంకర్రావుగారే నేర్పి వారిని మంచి కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు.
విశాఖపట్నంలో రచించి, గానంచేసి, సంగీతాన్ని అందించిన, “ఆరు బయట వద్దు– మరుగుదొడ్డి ముద్దు” అనే పాటల సి.డి.ని గౌరవ విద్యా శాఖామంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావుగారు, మరియు ఎం.ఎల్.సి శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడుగారు ఆవిష్కరించారు.
జాతీయ ఉత్తమఉపాధ్యాయ అవార్డ్ స్వీకరణ సందర్భాన్ని పురస్కరించుకుని యలమంచిలిలో ఎం.ఎల్.సి. శ్రీ పి.చలపతిరావు గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సాహిత్యవేత్తలు సత్కరించారు.
పల్లె నుంచి అంతర్జాతీయస్థాయికి
హైదరాబాదులో 19 రోజులు పాటు జరిగిన అంతర్జాతీయ జీవవైవిద్యసదస్సులో శంకర్రావుగారు ఉపాధ్యాయ పర్యావరణ పరిరక్షణపై ఉపాధ్యాయుడి పాత్రగా ప్రతిరోజు తన కళారూపాలను ప్రదర్శించారు. ఆయన తయారుచేసిన చైతన్య కళారూపాలను విద్యార్థులతో వేదికపై ప్రదర్శింపచేశారు. రూపకర్త అయిన శంకర్రావును అంతర్జాతీయ సభకు ఆహ్వానించిన అంతర్జాతీయ ప్రతినిధులు ఈ జానపద కళారూపాల సి.డి.ని ఆవిష్కరించారు. అనంతరం ఆ పాటలను ఆలపించారు. వీటిని తిలకించిన ప్రతినిధులు ప్రశంసించారు.
‘ప్రకృతిమిత్ర’ సి.డి.ని నేషనల్ గ్రీన్ కోర్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు ప్రపంచ జీవ వైవిధ్య సదస్సుకు పరిచయం చేశారు. అనంతరం శంకర్రావుగారు సి.డి. లోని ముఖ్య విషయాలను గురించి మాట్లాడారు.
ఈ సి.డి.లో ఉన్న ముఖ్య విషయాలు ముందుగా ‘వందేమాతరం’ అంటూ ప్రారంభించి దేశంలో జీవవైవిధ్య గొప్పతనాన్ని చాటి చెప్పిన శంకర్రావు గారు ఒక్కో అంశానికి ఒక్కో కళా రూపాన్ని ఎన్నుకున్నారు. దేశంలో కనుమరుగవుతున్న సంప్రదాయాలు ఆచారాలు ఏ విధంగా జీవవైవిధ్యానికి విఘాతం కలిగిస్తున్నాయి. అనే అంశాన్ని మన పల్లె పాతకాల పద్ధతులు అంటూ బృందగానంలో వివరించారు. సకల జీవరాశుల మొరలను కన్నతల్లీ! ఓ నేలతల్లమ్మా! రూపకం ద్వారా వివరించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులతో కలిగే నష్టాలను రామునా చందనాలో అనే జానపదంలో పొందుపరిచారు. సమస్త జీవరాశుల ప్రాధాన్యాన్ని మార్పు కోసం అనే బుర్రకథ ద్వారా చిత్రీకరించారు. వీటితో పాటు పాట, తప్పెట గుళ్ళు, బాలే వంటి కళారూపాలతో అవగాహన కల్పించారు.
ప్రకృతి మిత్ర సి.డి. లోని కళారూపాలను 150 మంది విద్యార్థులచే ప్రదర్శన యోగ్యంగా మలిచి ప్రదర్శింప చేయడమే కాకుండా తాను కూడా స్వయంగా గానాలాపన చేసి దేశ ఘన కీర్తిని ఎలుగెత్తి చాటారు. జానపద కళారూపాలకు ప్రపంచవ్యాప్తంగా భారతీయ జానపద కళారూపాల గొప్పదనాన్ని తెలియజేశారు.
దక్షిణాఫ్రికా పర్యావరణం మంత్రి ప్రకృతి మిత్ర సి.డి. లో గల పూర్తి సారాంశాన్ని అడిగి తెలుసుకున్నారు. వీటిని ప్రచారం చేసేందుకు కొరియా దేశాలతో చెందిన పర్యావరణ మంత్రి సుసాంగ్ ఓ తమ దేశంలో పర్యావరణాన్ని రక్షించుకునేందుకు కొన్ని కళారూపాలు సహకరిస్తాయని శంకర్రావుగారిని అభినందించారు. ఈ సదస్సు ద్వారా తను కూడా ఎన్నో విషయాలను తెలుసుకున్నానని శంకర్రావు గారు తన వినమ్రతను వినయాన్ని చాటుకున్నారు.
లఘు చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంటూ..
ప్రపంచ దేశాల ప్రతినిధుల సమక్షంలో సత్కరించబడడం ఎంతో ఆనందదాయకం అని శంకర్రావుగారు తెలిపారు. జిల్లాకు తిరిగి వచ్చిన తర్వాత కలెక్టర్ శ్రీ ఎం. వీరబ్రహ్మయ్యగారు ఏజెన్సీ రామారావుగారు; జిల్లావిద్యాశాఖ అధికారి కృష్ణారావుగారు వీరిని అభినందించారు.
మెంటాడ మండలం జీడిపేట జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పనిచేశారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బొంతలకోటి శంకర్రావుగారి తరగతిలో నల్లబల్లపై ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది.
“ఒక తరగతిలో పాఠం చెప్పడానికి అదే తరగతిలోని విద్యార్థులకు అర్థమయ్యేలా పాట చెప్పడానికి తేడా ఉంది. మొదటిది మాస్టారికి జీతం ఇస్తే, రెండోది విద్యార్థికి జీవితాన్ని ఇస్తుంది. నల్లబల్లా, పుస్తకము, సుద్దముక్కా ఈ పరిధిని దాటి ఉపాధ్యాయుడు ఆలోచిస్తే విద్యార్థి భవిష్యత్తు బంగారం అవుతుంది. ఈ హద్దులను చెరిపేస్తూ బోధనలో నూతన పద్ధతిని ప్రవేశపెట్టి, ఆయన తరగతిగదినిమారుస్తున్నారు. తన అభిరుచిని విద్యార్థుల పురోగతికి వినియోగిస్తూ అంతర్జాతీయంగాఖ్యాతిని అర్జిస్తున్నారు. ఆయన పేరు బొంతలకోటి శంకర్రావు తన విభిన్నతీరుతో విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతున్న ఉపాధ్యాయుడు”.
వీరి గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విధంగా అంటారు.
“జానపద కళారూపాలతో బోధన అనేది ఒక వినూత్న ప్రక్రియ. పాటలు పాడుతూ, సంగీత వాద్యపరికరాలతో సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలను, పాట, బృందగానం, జముకుల కథ, వీధి నాటిక, బుర్రకథ, తప్పెటగుళ్ళు, కోలాటం లాంటి ప్రక్రియలతో బోధన చేయడం గొప్ప విశేషం. మా పాఠ్యాంశాల కంటే సోషల్ మాస్టర్ పాఠ్యాంశాలు కళారూపాలతో బోధన చేయడంవల్ల పిల్లలు ఎంతో ఆకర్షితులై, ఆడుతూ, పాడుతూ, పాఠాలు నేర్చుకుంటున్నారు. సాంఘిక శాస్త్రంలో మంచి ఫలితాలు కూడా సాధిస్తూ తల్లిదండ్రుల్లో కూడా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని శంకర్రావుమాస్టారు నింపుతున్నారు. మా పాఠశాలకు అంతర్జాతీయ గుర్తింపును, ఐక్యరాజ్యసమితి మన్ననలు అందించారు.”
సహ ఉద్యోగులు ఇలా అంటారు.
“శంకరరావు మాస్టరుగారి బోధన కళాబోధన. తనే బాణీలు కూర్చుతూ, రచనలు చేస్తూ, హార్మోనియం, కీ బోర్డ్, గిటార్ వాయిస్తూ తరగతి గదిని సంగీత కళా నిలయంగా మార్చేస్తున్నారు. మా పాఠశాల శంకరరావు మాస్టర్ వల్ల ఆహ్లాదంగా, ఉల్లాసంగా మారిపోతుంది. పిల్లలు ఒత్తిడికి, భయానికి లోనుకారు. ఆనందంగా ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకుంటారు. వీరితో పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం.”
వల్లూరి అయోధ్య రామా, తెలుగు స్కూల్ అసిస్టెంట్; జి.ప.ఉన్నత పాఠశాల; జి.టి.పేట; మెంటాడ మండలం
శంకర్రావుగారు పర్యావరణ ప్రేమికుడు: మొక్కల పెంపకముపై ఆసక్తి:
జన్మతః వారసత్వంగా రైతుబిడ్డ. మొక్కలపై అనురక్తి వాటిని పెంచడంలో మెళకువలూ ఉగ్గుపాలతోనే వచ్చాయి. బోధనలోనూ, మొక్కల పెంపకములోనూ ఎందరికో మార్గదర్శి. ఆచరణయోగ్యమైన విషయాలను చెప్పిందే చేసి చూపిస్తారు. ఇతరులకు పర్యావరణం గురించి చెప్పడం మాత్రమే కాదు తాను స్వయంగా తన ఇంటి మిద్దెపై (టెర్రస్ మీద) ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటారు. మొక్కలనూ, మట్టినీ ప్రేమించే గుణం కలిగిన శంకర్రావుగారు తన టెర్రస్ మీద ఒక పెద్ద తోటను పెంచుతున్నారు.
ఇతరులకు ఆదర్శవంతమైన మిద్దె తోట పెంపకం
అందులో కూరగాయలు, ఆకుకూరలతో పాటు వివిధఫలాలు ఇచ్చే మొక్కలు కూడా పెంచుతున్నారు. తాను పెంచడమే కాదు తన ఇరుగుపొరుగు వారికి కూడా ఏ విధంగా టెర్రస్ గార్డెన్ పెంచగలము అనేది మనకు ఆదాయంతో పాటు ఆనందాన్ని సంతృప్తిని ఇవ్వడంతో పాటుగా వాతావరణంలో ఉన్న గాలి, నేల, నీరు వీటిని కూడా మనం కలుషితం కాకుండా ఏ విధంగా రక్షించుకోగలము అనే విషయాన్ని అందరకు తెలియజేస్తూ ఉంటారు.
మనం ఎప్పుడు చూసినా శంకర్రావుగారు స్కూల్లో ఉంటే పిల్లలు చుట్టూ మూగి ఉండగా వారితో వారి సందేహాలను తీరుస్తూ కనిపిస్తారు. ఇంటి వద్ద ఉంటే మొక్కలను సంరక్షణ చేస్తూ కనిపిస్తారు. సుమారుగా 2000 చదరపు అడుగుల స్థలాన్ని టెర్రస్ గార్డెన్‌గా మిద్దె తోటగా ప్రారంభించారు. వంగ, చిక్కుడు, కాకర, ఆనప మొదలైన కాయగూరలు; కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వంటి ఆకుకూరలు; జామ, పైనాపిల్, బ్లూ నేరేడు, ఆరెంజ్, మామిడి మొదలైన ఫలవృక్షాలు; సుమారుగా 80 రకాల చెట్లు ఆయన మిద్దెతోటలో ఉన్నాయి అంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ తోట పనిలో అతనికి సహాయకులుగా భార్య శ్రీమతి లక్ష్మి మరియు కుమారులు జస్వంత్ కుమార్; వివేకవర్ధన్ కూడా తండ్రికి సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఒక పెద్ద బాస్కెట్ నిండా టమోటాలు, వంకాయలు, ఆకుకూరలు కోసి ఇరుగుపొరుగు వారందరికీ కూడా పంచడం వలన, వారిని కూడా మిద్దె తోట పెంపకానికి ఉన్ముఖులను చేస్తారు. పూల తోటలలో లిల్లీ పూలు, గులాబీలు, దాలియాలు, ఇంకా ఔషధ మొక్కలైన వేప, అలోవెరా, నేలవేము, అతిబల, చక్కెర వ్యాధికి ఆయుర్వేద మందు అయిన తిప్పతీగ పెంచుతారు.
ముఖ్యమైన విశేషం ఈ మొక్కల పెంపకంలో రసాయన ఎరువులను గాని రసాయన క్రిమిసంహారక మందులను గాని మన ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఇతర ఏ విధమైన పదార్థాలను వాడరు.
ఒక ఉపాధ్యాయునిగా ప్రకృతి వ్యవసాయాన్ని తాను అవలంబిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు. ఆధునిక కాలంలో మానసిక శారీరక ఆరోగ్యాల కోసం బయట తిరిగేటటువంటి పద్ధతిని వదిలిపెట్టి మొక్కలతోనూ, పిల్లలతోనూ గడపడంలోనే ఆయన ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు.
“తన స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు తన ఇంటికి వచ్చి విత్తనాలు అడిగి తీసుకొని వెళుతూ సలహాలను కూడా అడిగి తెలుసుకుని వెళుతూ ఉంటే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని” అంటారు.
ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఆర్గానిక్ పంటలను పండించడంలో ఎంతో ప్రాధాన్యత నిస్తోంది. దానిని సుమారు ఒక 20/30 సంవత్సరాలకు ముందే అతను తన ఇంటి నుండే ప్రారంభించారు.
“మాస్టారూ నమస్తే” అంటూ వారి వివరాలను తెలుసుకోవడం ప్రారంభించిన నాకు మహాభాగవతంలో పోతన రాసిన పద్యం గుర్తుకు వచ్చింది.
“ఇంతింతై! వటుఁడింతయై, మఱియుఁ దానింతై! నభోవీధిపై
నంతై! తోయద మండలాగ్రమున కల్లంతై! ప్రభారాశిపై
నంతై! చంద్రునికంతయై ధ్రువునిపై నంతై! మహర్వాటిపై
నంతై! సత్య పదోన్నతుం డగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై//”
తన వృత్తి – ప్రవృత్తికి సంబంధించిన విశేషాలు చాలా చక్కగా చెప్పారు.
కళలు జీవకళలు. అవి అజరామరము. కళను అధ్యాపకవృత్తితో కలిపి చైతన్యవంతముగా చేసే ఆయన ప్రయాణం భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ పేజీగా నిలిచిపోవాలని ఆశీస్సులు అందిస్తూ..
(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచిట అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం వెలువరించారు.