[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని దారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల ప్రముఖ నాట్యాచార్యులు డా. వేదాంతం రాధేశ్యామ్ గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే।
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥
సప్తతి దాటిన వయసులో సప్తవర్ష బాలుడిలా వేదికపై నర్తించే ఆ స్నిగ్ధ మనోహరరూపం, శ్వేత దంత రుచి పంక్తిపై సదా చిరునవ్వు, ఆ అభినయంలో హొయలు, ఎగిరి గంతేసినా, గింగరాలు తిరుగుతూ వేదికనంతా చుట్టేసినా, లక్షణంగా స్వస్థానానికి రాగలిగే ఆ ఒడుపూ అపురూపం.
అందరిలో ఉంటే సాధారణ వ్యక్తిలాగా, నాట్యం నేర్పే వేళ ఆచార్యునిలా, వేదికపై నర్తించే వేళ ఏ పాత్ర అయినా ఆ పాత్రలో ఒదిగిపోయే తీరు, డా. రాధేశ్యామ్ గారి రూపురేఖలే కనపడని పాత్రోచిత గాంభీర్యం, సిద్ధేంద్ర కళాపీఠంలో కూచిపూడి ఆచార్యులైన డా. రాధేశ్యామ్ గారి స్వంతం.


రాధేశ్యామ్ గారు
కూచిపూడి గ్రామం:
ఏ గ్రామం పేరు చెబితే విశ్వవ్యాప్తంగా చిరుమువ్వల సవ్వడులు గలగలమంటాయో, ఏ నర్తన పరమశివునికి అత్యంత ప్రియమైనదో, ఏ నాట్యము నటశేఖరుని కలలపంటో, ఆ కూచిపూడి భాగవతుల కుటుంబంలో జన్మించి, నటరాజు సేవలో తాను తరించి, ఇతరులను తరింపచేస్తున్న కూచిపూడి కళాకారుడు ఎన్నెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందినా, నాట్యయోగిలా అంతర్ముఖులై యోగ జీవనం గడుపుతున్న వేదాంతం డా. రాధేశ్యామ్ గారు నాట్యగురు పరంపరలోని నాట్యాచార్యులు.
డా. రాధేశ్యామ్ గారి జీవిత విశేషాలు
డా. రాధేశ్యామ్ గారు 1955 నవంబరు 1వ తేదీన కూచిపూడి గ్రామంలో జన్మించారు. ఆయన వేదాంతం వెంకట సూర్యనారాయణ, సత్యవతమ్మల మూడో కుమారుడు. చిన్ననాటి నుండి తండ్రి, పినతండ్రి, సోదరులు ప్రదర్శించే కూచిపూడి నాట్యం పట్ల ఆకర్షితులైన డా. రాధేశ్యామ్ ఐదో ఏటనే పినతండ్రి ‘కూచిపూడి నృత్యవాచస్పతి’ బిరుదాంకితులైన శ్రీ వేదాంతం పార్వతీశంగారి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణకు అంకురార్పణ చేశారు.
కూచిపూడి నాట్యంలో ప్రారంభంలోని అగజానన పద్మార్కం.. అంటూ గణేశుని పైన, అంబా పరాకు.. దేవి పరాకు అంటూ శారదా దేవి పై పాడే ప్రార్థనాశ్లోకాలు ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయో చివరలో ‘వందే!వందే!’ అంటూ పాడే ‘కూచిపూడి పతాక వందనం’ కూడా అంతే ప్రాముఖ్యత కలది. దీనిని డా. రాధేశ్యామ్ గారి చిన్నాన్న గారైన వేదాంతం పార్వతీశం గారు రచించారు.
కూచిపూడి అగ్రహారంలో గల పెద్దలంతా నాట్యగురువులే! నాట్యాన్నే దైవంగా నమ్మినవారే! ఆ గ్రామము సత్య-ధర్మ-శాంతి-ప్రేమలకు ఆలవాలమైనది. గురువు శిష్యులపై చూపే వాత్సల్యము పుత్ర భావనయే!
కొంతమంది గురువులు దీనిని కళారూపంగా భావించి కొత్త తరాలను తయారు చేస్తుంటే, మరికొందరు చలనచిత్రరంగం ద్వారా ఈ కళను ఎక్కువ మందికి చేరవేయాలని సంకల్పించారు. పౌరాణిక సినిమాలు తీయాలంటే అవి విజయవంతం కావడానికి సంప్రదాయానురక్తులైన ఈ గ్రామ పెద్దలే వెన్నుదన్ను.
నాట్య ప్రదర్శనలు:
డా. రాధేశ్యామ్ గారి చిన్నతనంలోనే వేసిన మొట్టమొదటి వేషం గణపతి. అందుకేనేమో నాటి నుంచి నేటిదాకా అవిఘ్నంగా వీరి నాట్య జీవితం కొనసాగుతోంది.
గురువుగారైన వేణుగోపాలకృష్ణశర్మగారి ప్రోత్సాహంతో ఐదు సంవత్సరాల వయసులో 1960లో భక్తప్రహ్లాదలో ప్రహ్లాదుడుగా వేసారు.
తల్లి ప్రోత్సాహంతో కృష్ణుడి వేషం వేశారు.
వేదాంతం సత్యనారాయణశర్మ గురువుగారి ప్రోత్సాహంతో స్త్రీ పాత్రలకు శ్రీకారం చుట్టారు. గొల్లభామ, సత్యభామ, రాజనర్తకి వంటి పాత్రలు వేశారు.
వీరికి నాట్యశాస్త్రంలోని మెలకువలు తెలిపిన గురువు శ్రీ ‘పద్మభూషణ్’ డాక్టర్ వెంపటి చిన్నసత్యంగారు. ఇతను చెన్నైలో ‘కూచిపూడి ఆర్ట్ అకాడమీని’ స్థాపించారు. అనేకమంది ప్రపంచ ప్రసిద్ధి పొందిన కూచిపూడి నృత్య కళాకారులు అక్కడ తయారయ్యారు.
వారితో నా ఇంటర్వ్యూ ఇలా సాగింది.
ముందుగా మీ స్వగ్రామం అయిన కూచిపూడి గురించి మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి?
“మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథి దేవోభవ”


తల్లి వేదాంతం సత్యవతమ్మ తండ్రి వేదాంతం సూర్యనారాయణ శాస్త్రి గారు
మా తల్లి సత్యవతమ్మ తండ్రి వేదాంతం సూర్యనారాయణ శాస్త్రి గారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యరూపం కూచిపూడి. శాస్త్రీయ నృత్య కళారూపాలలో కూచిపూడికి ప్రత్యేకస్థానం ఉన్నది.


కూచిపూడి గ్రామం
కృష్ణాజిల్లాకు చెందిన మొవ్వ మండలంలోని కుచేలపురం కాలక్రమంలో కూచిపూడి గ్రామంగా మారింది.
17వ శతాబ్దానికి చెందిన సంగీత విద్వాంసుడు, మహాకవి అయిన సిద్ధేంద్రయోగి జానపద కళారూపమైన నృత్యాన్ని శాస్త్రీయ నృత్యరూపంగా మార్చారు.


సిద్ధేంద్ర యోగి


సిద్ధేంద్రయోగి స్థాపించిన కూచిపూడి కళా పీఠం
పూర్వకాలంలో బ్రహ్మదేవుడు బ్రహ్మానందమును కలుగచేయు నాట్యశాస్త్రమును రచించుటకు ఋగ్వేదము నుండి వాద్యమును, యజుర్వేదము నుండి అభినయమును, సామవేదం నుండి గానమును అధర్వణవేదము నుండి రసములను గ్రహించి ఈ నాట్యశాస్త్రమును రచించెను.
ఇది భక్తి సాంప్రదాయానికి చెందిన భాగవతమేళం. అనేక నాటకాలు, నృత్య నాటకాలు రచించారు. కూచిపూడి కళాపీఠమును స్థాపించి ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రసిద్ధ శిక్షణా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో కూచిపూడి నృత్యానికి స్థానం దక్కింది. ‘కూచిపూడి’ అనే గ్రామం పేరుతో ఒక నాట్యం ప్రసిద్ధి చెందడం చాలా అరుదైన విషయం.
వేదాంతం వారి వంశం గురించి మీకు తెలిసినంత చెప్పండి?
కూచిపూడి వంశంలో మా ముత్తాతగారైన వేదాంతం జనార్ధనంగారు; మా తాతగారు వేదాంతం వేంకటాచలపతిగారు, మా తండ్రిగారైన వేదాంతం సూర్యనారాయణశాస్త్రిగారు, నేనూ, నా కుమారులు ఈ విధంగా 5 తరాల వరకూ నేను చెప్పగలను. మేము ఆరుగురు అన్నదమ్ములం. అందరూ వారి పిల్లలతో సహా పెద్ద కుటుంబాలుగా ఈ గ్రామంలోనే ఉంటూ ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు.


శ్రీమతి వెంకటలక్ష్మి గారు & డా. రాధేశ్యామ్ గారు
వీరికి ఇద్దరు కుమారులు – శ్రీ సత్యనరసింహశాస్త్రి మరియు శ్రీ సిద్ధేంద్ర వరప్రసాద్, వీరిరువురూ కూడా నృత్య విభాగంలోనే ఉన్నారు.


కుమారుడు శ్రీకృష్ణునిగా తండ్రి సత్యభామ అరుదైన ఫోటో
భక్తప్రహ్లాదలో నరసింహ స్వామిగా ఒక కుమారుడు నటించగా ఒకరు బిస్మిల్లా ఖాన్ పురస్కారం పొందడం ఆనందదాయకం కదా ఏ తండ్రికైనా!
నాట్యంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి?
సన్మార్గాన్ని ప్రజలు విడిచి పెడుతున్న తరుణంలో బ్రహ్మదేవుడు ప్రజలకు మంచి విషయాలను, భగవంతుని కథలను అందించడానికి నాట్య వేదాన్ని సృష్టించి భాగవతులకు అందించాడు. మొదటిలో వీరు సంచార జీవనంతో ఊర్లు తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. దీన్ని యథాతధంగా ప్రదర్శించాలి తప్ప కల్పితాలు చొప్పించకూడదు. సకల కళల సమాహారమే నాట్యం.


8 రకాల నాట్యవిభాగాలు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని భరతనాట్యం, కథాకళి, కథక్, కూచిపూడి, ఒడిసి, మణిపురి, మోహినీఅట్టం, సత్రియా అను ఎనిమిది నృత్య కళారీతులలోని ఒకటైన ‘కూచిపూడి’ నృత్యానికి పేరెన్నిక గన్నది.
ఈ నాట్యం సుమారు రెండవ శతాబ్దం నుండి ఉన్నది. రామాయణ, భారత, భాగవతాలలోని సన్నివేశాల ఆధారంగా నాటకాలు తయారు చేస్తారు.
భరతముని నాట్యశాస్త్రం గురించి ఒక పుస్తకము రాశారు. తరువాతి కాలంలో ఆ పుస్తకము మహర్షి సిద్ధేంద్ర యోగి మరియు ఇతర నృత్య భాగవత పండితులచే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణానది తీరంలోగల ‘కూచిపూడి’ అనే గ్రామంలో అభివృద్ధి చేయబడింది. వీరిలో భాగవతుల, వేదాంతం, వెంపటి, చింత, పసుమర్తి, మహంకాళి, దర్భా, జోస్యుల మొదలైన వంశాలకు చెందిన కళాకారులు ప్రముఖులు.
ఈ సంప్రదాయ నృత్యం శతాబ్దాలుగా గురు-శిష్య పరంపరలో నేర్పబడడం ప్రదర్శించబడటం జరుగుతున్నది. ఇది అభినయానికి, భావవ్యక్తీకరణకు అవకాశంగల నృత్యం.
లయబద్దంగా కదిలే పాదాలు – శిల్పసదృశ్యమైన నృత్య భంగిమలు. ప్రారంభంలో పురుషులే అన్ని పాత్రలను వేసేవారు. తరువాత కొంతకాలానికి స్త్రీలకు కూడా ప్రాతినిధ్యం లభించింది.
ముఖ్యంగా కూచిపూడి నాట్యం కొన్ని ప్రధాన సూత్రాల మీద ఉంటుంది. 1.తాళము, లయ, 2.అభినయము 3.నాట్యము 4.నవరసాలు 5.లాస్య తాండవముల మిళితం 6.ఆహార్యము
కూచిపూడి యొక్క నాట్యపద్ధతిలో ఇవన్నీ అంతర్భాగంగా ఉన్నాయి.
సంప్రదాయ పద్ధతిని పరిరక్షిస్తూనే ఆధునికతని మేళవించి కొన్ని ప్రధానమైన ప్రక్రియలను వర్ణము, తరంగం, తిల్లానా, పదము, జావళి, శబ్దము, కీర్తన అనే తయారు చేశారు. ఈ విభాగాలలో జనరంజకంగా నర్తకులు నర్తిస్తారు. యక్షగానాలు, భామాకలాపం, హాస్యపూరితమైన పగటివేషాలు, గొల్లకలాపం, కేళికలు, శివలీలలు, వ్యస్త నృత్యంశాలు, తరంగాలు, అష్టపదులు మొదలగునవి కూడా వీటిలోకే చేరుతాయి.
శ్రీ నందికేశ్వర ప్రోక్తమైన ‘అభినయదర్పణం’లో ప్రార్థన శ్లోకం:
ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయమ్ ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్//
చతుర్విధ అభినయాలు ఉంటాయి.
కొందరు ప్రముఖ కూచిపూడి కళాకారులు ‘పద్మభూషణ్’ డాక్టర్ వెంపటి చిన్నసత్యంగారితో పాటు ‘పద్మభూషణ్’ డాక్టర్ శోభానాయుడు, డాక్టర్ ఆనందశంకర జయంత్, వైజయంతి కాశి, రాజారాధారెడ్డి దంపతులు, ఉమా మురళీకృష్ణ, హేమమాలిని, ప్రభ, యామిని కృష్ణమూర్తి మొదలగువారు భారతీయ నాట్యశాస్త్రంలో కూచిపూడికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.
డాక్టర్ వెంపటి చినసత్యంగారితో మీ ప్రయాణంలో ఒక మరపురాని సంఘటన ఏదైనా చెప్పగలరా?
1984వ సం. నాకు 29 సంవత్సరంల వయసు ఉన్నప్పుడు అమెరికాలోని న్యూ జెర్సీలో వెంపటి చినసత్యం గారితో వెళ్లి నాలుగు నెలలు ప్రదర్శనల కోసం ఉన్నాము. రుక్మిణి కళ్యాణం, హరవిలాసం, భామాకలాపం కొన్ని సోలో నృత్యాలు వేసే అవకాశం నాకు దక్కింది. అతను ద్రోణాచార్యుడు అయితే నేను ఏకలవ్య శిష్యుడిని. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత నిర్వాహకులు ‘శ్రీకృష్ణ పారిజాతం’ నాటకం వేయమన్నారు. అందులో ‘నారద’ పాత్ర నన్ను వరించింది. కానీ ఆ నాటకం గురించి నాకు పూర్వపరిచయం లేకపోవడం వలన చాలా సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో ‘గురు’పాదాలే శరణ్యమయ్యాయి.
సత్యభామ పాత్రధారి నాకు సన్నివేశాలు తెలిపారు. సన్నివేశాలు తెలిస్తే ఆశువుగా అల్లుకుపోగల నైపుణ్యం నాకు గురువులూ, దైవమూ ప్రసాదించిన భిక్ష.
ఆ రోజు ఆ పాత్రలో ఎంత తాదాత్మ్యం చెందానంటే ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించడం, నారదుడు బ్రహ్మాండంగా నటించారని సభాముఖంగా తెలియజేయడం, మా అన్నగారు మరియు గురువుగారైన వెంపటి చిన సత్యంగారు నన్ను గర్వంగా సభకు పరిచయం చేయడం, నా జ్ఞాపకాలలో ఒక మధురస్మృతి. ఈ కళ భగవదత్తము పరమేశ్వరానుగ్రహం.
అలాంటిదే మరియొక సంఘటన 2008వ సం.లో అమెరికాలోని సిలికానాంధ్రలో ‘భక్తప్రహ్లాద’ వేయడానికి అవకాశం దొరికింది. రసహృదయులైన ప్రేక్షకులు ఉంటేచాలు. అర్ధరాత్రి అయినా రంజింప చేయగల కళాకారులకు భారతదేశంలో కొరత లేదు. సాక్షాత్తు సిద్ధేంద్రయోగి గారే తన ముందున్న ప్రేక్షకుడిగా భావించి, అంతటి భయభక్తులతో నర్తిస్తారు. ఎనిమిది గంటల నిడివిగల ‘భక్తప్రహ్లాద’ నాటకాన్ని వేయడానికి వీరికి దొరికిన సమయం నిజంగా అర్ధరాత్రి 12 గంటలే! నాటకం యొక్క వ్యవధిని మూడు గంటల సమయానికి కుదించుకోగలిగారు. ఇంకా ఇంకా సమయం తగ్గుతూ ఉంటే ఆయా పాత్రలు తమ పాత్రను రక్తి కట్టించడంలో ఎప్పుడైనా ఎక్కడైనా అసాధ్యం కావచ్చునేమో కానీ సాక్షాత్తు ఆ నటరాజు అనుగ్రహం పుష్కలంగాగల కూచిపూడి నర్తకులకు సాధ్యమే! 25 నిమిషాలలో నాటకాన్ని ముగించగలిగారు. ఐదు సంవత్సరముల వయసులో వేసిన భక్తప్రహ్లాదను 50 సంవత్సరముల వయసులో తిరిగి రక్తి కట్టించగలగడం గురువుల అనుగ్రహమూ మరియూ భగవంతుని దయ.
భగవంతుని కథలు చెప్పుకుంటూ, వృత్తి ప్రవృత్తి జీవనోపాధిగా భావించే భగవద్భక్తుల భాగవతులకు దేనికి కొరత ఉండదు. ఐహిక వస్తువులపై భ్రాంతి లేని మాకు భగవత్సాక్షాత్కారం ఆ వేదికపైనే జరుగుతుంది అనేది ఎందరికో అనుభవం. నిరంతర సాధన ఏ రంగంలోనైనా రాణిస్తుంది.
ఆ నాటకం అందరు ప్రేక్షకుల ప్రశంసలు, పెద్దల ఆశీస్సులు అందుకున్నది. ఆ రోజు నుంచి లేమి అనే పదం వీరి నుండి దూరం అయింది. అనేక బహుమతులు ధనరూపేణా, వస్తురూపేణా పొందగా, అనేక బిరుదులు, సత్కీర్తి అన్నీ దొరికాయి. వాటి కోసం మరల ఆలోచించవలసిన అవసరమే లేకపోయింది.
సుదీర్ఘమైన మీ కూచిపూడి నాట్యప్రయాణంలో మీరు ఏ ఏ పాత్రలు ధరించారు?
భక్తప్రహ్లాదలో ప్రహ్లాదునిగా, ఉషా పరిణయంలో చిత్రలేఖగా, పార్వతీ కల్యాణంలో పార్వతిగా, శ్రీకృష్ణపారిజాతంలో నారదునిగా, శ్రీకృష్ణునిగా, సత్యభామగా అనేక పాత్రలలో లీనమై నటించడం, ఆ పాత్రల గురించి ప్రేక్షకుల ద్వారా ప్రశంసలు అందుకోడం మా భాగవతులకు సర్వసామాన్యం.


డా. రాధేశ్యామ్ గారు ధరించిన స్త్రీ పాత్రలు
కూచిపూడి నాట్యంలో పాత్రధారులు ఎంత ముఖ్యమో ‘సూత్రధారి’ పాత్ర కూడా నాటకానికి ప్రాణం పోస్తుంది. పాత్రధారులు అందరినీ ఒక సూత్రంతో పట్టుకొని సమన్వయపరిచే అతడిని సూత్రధారి అనీ, భరతుడు అనీ, హంగుదారుడు అనీ అంటారు. సూత్రధారికి అన్ని పాత్రలూ తెలియడమే కాక ఏ పాత్రను ఎప్పుడు ప్రవేశపెట్టాలో తెలిసే నేర్పు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఏ పాత్రనైనా ధరించగల నైపుణ్యం ఉండాలి. అందువలన ప్రహ్లాదుడైనా, హిరణ్యకశిపుడైనా, కృష్ణుడైనా, సత్యభామ అయినా, నారదుడైనా, సూత్రధారి అయినా అన్ని పాత్రలనూ తనలో లయింప చేసుకుని, అవసరాన్ని బట్టి వాటిని ప్రదర్శిస్తున్నది నటరాజ స్వరూపమే!


సూత్రధారిగా రాధేశ్యాంగారు పరిశోధనలు చేసి థీసిస్
[ఏ పురస్కారమైనా వారిని చేరి సంతోషించవలసినదే! వారు మాత్రం పసిప్రాయంలోని చిన్నారులకు నాట్యంలోని మెలకువలు నేర్పుతూ ఆనందిస్తూ ఉంటారు – రచయిత్రి.]
సాధారణంగా ఈ రంగంలో ఉండే సాధకబాధకాలు తెలియజేస్తారా?
తాత్వికచింతనతో చెప్పాలి అంటే ప్రతి మనిషిలో కూడా అరిషడ్వర్గాలు అంతర్గతంగా ఉంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో గుణం ప్రకోపించడం మానవ సహజం. ఎల్లవేళలా అణచి ఉంచడం సాధ్యం కాదు. మనకు భగవంతునిపై గల అచంచల భక్తి విశ్వాసాలు, మన వృత్తి పట్ల గల దైవీభావన, ఈ భగవత్ తత్త్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి మనలను పరికరంగా ఎంపిక చేసుకున్నందుకు మనసా, వాచా, కర్మణా అతనికి అంకితం అయిపోవడం మనలను సన్మార్గంలో నడిపిస్తుంది అన్నది మౌలిక సూత్రం.
వృత్తిపరంగా చెప్పాలి అంటే పాత్రలను ఎంపిక చేసుకున్నప్పుడు కళాకారులకు అవగాహన లేక ప్రముఖ పాత్రలే కోరుకోవడం చిన్నపాత్రలకు, ప్రతినాయక పాత్రలకు, వ్యక్తులు దొరకకపోవడం సమస్య.
నాటకాలు పౌరాణిక సంబంధమైనవి కావడం వలన వేదిక అలంకరణ, పాత్రలకు మేకప్, వాద్య పరికరాలు, వాద్యకారులు వీరందరి యొక్క సమన్వయం కష్టతరమవుతుంది. అలాగే దూరప్రాంతాలలో వేయడం అనేది కూడా కష్టంగా ఉండవచ్చును.
మరొకటి ప్రతి భాగవత నాటకమూ వేరువేరు అంశాలతో కూడి ఉంటుంది. ఒకటి అనుకున్న తర్వాత నిర్వాహకులు కోరిన మేరకు వేరొకటి ప్రదర్శించవలసి రావచ్చు. అటువంటి సమయంలో గురువు యొక్క స్థితప్రజ్ఞత, యుక్తి, క్లిష్టమైన పరిస్థితులను నిర్వహించడం, సమయ నిర్వహణ చాలా ముఖ్యపాత్ర వహిస్తాయి. ఏ పాత్రలను ఎంతవరకు కొనసాగించాలో, ఎంత మేరకు తగ్గించాలో మొదలైన విషయాలను చాకచక్యంగా నిర్వహించిన తీరు చాలా ముఖ్యపాత్ర వహిస్తాయి. వీటిద్వారానే శిష్యులు గురువు ద్వారా ఎన్నో విషయాలను ప్రత్యక్ష పరోక్ష రూపంలో నేర్చుకుంటారు.
[దీనికి ఒక మంచి ఉదాహరణ ఒకసారి హైదరాబాదులోని రవీంద్రభారతిలో ‘భక్తప్రహ్లాద’ నాటకం వేసినప్పుడు హిరణ్యకశిపుడి పాత్రధారి రాకపోవడం, లీలావతి పాత్రధారిని రాకుండా చేయడం జరిగింది. సందర్భోచితంగా ఉన్న వ్యక్తులతోనే పాత్రలను సర్దుబాటు చేయగా హిరణ్యకశిపుడి పాత్ర వీరికి దక్కింది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బక్కపలచగా, పొట్టిగా, పీలగా ఉన్న నేను హిరణ్యకశిపుడు.. అంటూ చిరునవ్వులొలికించారు. అవును. పాత్ర ఏదైనా రసాన్ని పండించడం ముఖ్యం. డాక్టర్ వేదాంతం డా. రాధేశ్యామ్ నాట్యక్షేత్రమైన కూచిపూడి అగ్రహారంలోని తన ఇంటి వద్ద ‘కూచిపూడి నాట్య శిల్పారామమ్’ ను నెలకొల్పారు. ఆయన శిష్య ప్రశిష్యులు ఈ నాట్యకళకు శాశ్వతత్వాన్ని చేకూర్చే విధంగా అనేక నాట్యాంశాలు ప్రదర్శిస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా తెలుగు విశ్వవిద్యాలయం సిద్ధేంద్ర కళాక్షేత్రంలో కూచిపూడి నృత్యకళా ప్రాబల్యాన్ని పెంచేందుకు 70 ఏళ్ల ప్రాయంలోనూ డా. రాధేశ్యామ్ గారు కృషి చేయడం హర్షించదగిన విషయమని తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ గారు అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్యశాఖ దక్షిణ ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రం తంజావూరు సంయుక్త ఆధ్వర్యంలో ‘కూచిపూడి నృత్యంలో సూత్రధారుని పాత్ర’ అనే అంశంపై ప్రముఖ కూచిపూడి నృత్య గురువు డా. రాధేశ్యామ్ ప్రదర్శనాత్మక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా డా. రాధేశ్యామ్ బృందం రస రమ్యంగా నృత్య ప్రదర్శనను కొనసాగించి సత్కారాలు పొందారు – రచయిత్రి].




సూత్రధారి పాత్ర అనే విషయంపై సమగ్ర పత్ర సమర్పణ చేసిన వేదాంతం రాధేశ్యామ్ గారిని సత్కరిస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీ భట్టు రమేష్ గారు ఇతర పెద్దలు ప్రముఖులు
నాట్యకళను మిగిలిన కళలతో సమన్వయం ఎలా చేస్తారు?
“గీతం, వాద్యం, నృత్యం త్రయం సంగీత ముచ్యతే!”అని పెద్దలు అంటారు. ఇందులో సాహిత్యం అంటే రాయగలిగే సమర్థత సుమారుగా తెలుగు భాషపై పట్టు ఉన్నవారు రాయగలుగుతారు. నేను గోదావరి, కృష్ణా పుష్కరాల మీద నాటకాలు రాశాను.
అదే విధంగా ప్రసిద్ధ నృత్యకారుల యొక్క అనుభవాలను రాశాను. “సంప్రదాయ కూచిపూడి భాగవతుల చరిత్ర పుటలు” అనే పుస్తకాన్ని సంకలనంగా వెలువరించాను. ఇందులో కూచిపూడి భాగవతుల జీవిత విశేషాలు ఉంటాయి.
దీని కొనసాగింపుగా వారి యొక్క శిష్య ప్రశిష్యులను కూడా అందులో కలుపుతూ మరియొక సంకలనాన్ని తేవాలని ప్రయత్నం చేస్తున్నాను.


వేదాంతం రాధేశ్యామ్ గారు రచించిన “సంప్రదాయ కూచిపూడి భాగవతుల చరిత్ర పుటలు” అనే గ్రంథం
సంగీతం పెద్దలు చూపిన బాటలో అవగతం చేసుకున్నది. నృత్యానికే అనుగుణంగా నవరసాలకు అనుగుణమైన రాగాలను తీసుకొని ఆయా పాత్రలచే పలికించడం, వాద్యకారులు, గాత్రసాధకులు ఇచ్చిన సూచనలను అనుసరించడం అనేది అవసరం. నాటకాన్ని రక్తి కట్టించడం అనే అభిలాషతో పనిచేసే అనేకమంది వ్యక్తులు యొక్క సమిష్టికృషి ఫలితమే ఈ నృత్యము. “శ్రద్ధావాన్ లభతే విద్యా” అని ఆర్యోక్తి. శ్రద్ధ ఉన్నచోట విద్య లభిస్తుంది. అంకిత భావం ఉన్నచోట కృషి ఫలిస్తుంది. సమర్థత కలిగిఉండడం అందరినీ కలుపుకుంటూ పోవడం అనేవి ఇందులో అంతర్లీనమై ఉంటాయి.
కూచిపూడి నాట్యం యొక్క భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉండడానికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
ఆధునికత ఇచ్చిన అదృష్టం ఏమిటంటే దైవ సంబంధమైన ఈ కళలు నేర్చుకుందికి వయోపరిమితి లేదు అన్నది గ్రహించుకుని 5 సం.లు వయసు నుండి 65 సంవత్సరాల వయసువారు కూడా ఇందులో చేరి, నాట్యం నేర్చుకుందికి ఉత్సాహపడడం, అదేవిధంగా ఎక్కువమంది యువత కూడా నేర్చుకుందికి ముందుకు రావడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే నాట్యశాస్త్రం మాత్రమే కాదు ఏ కళలైనా నిలబడాలి అంటే ముందుగా మనం చారిత్రక విషయాలను తెలుసుకోవడం వాటిని కాపాడుకోవడం అవసరం. కూచిపూడి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నాట్యానికి సంబంధించిన ఒక మంచి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని నా ఆశయం.


హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుండి ఏ టాప్ కళాకారునిగా ఎంపిక కాబడిన కూచిపూడి నాట్యాచార్యులు డా. రాధేశ్యామ్
కూచిపూడి నాట్యంలో ప్రముఖ పాత్ర అయిన సూత్రధారుల మీద చేస్తున్న నా పరిశోధన యొక్క థీసెస్ పూర్తి కావచ్చింది. దానిని పుస్తక రూపంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలి అన్నది మరియొక ఆశయం.
***
బిరుదులు- పురస్కారాలు- నిర్వహించిన పదవులు:
- భారతదేశంలో దక్షిణప్రాంత సాంస్కృతిక సంస్థ; తంజావూరు వారిచే ప్రతిష్టాత్మకమైన ఠాగూర్ ఫెలోషిప్ అవార్డు.
- మాన్యశ్రీ కీ.శే. కొణిజేటి రోశయ్యగారి చేతులమీదుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ అధ్యాపక పురస్కారం మరియు విశేష పురస్కారం
- కేంద్ర సంగీత, నృత్య, నాటక అకాడమీ న్యూఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి అయిన శ్రీ ప్రణబ్ ముఖర్జీగారిచే రాష్ట్రపతి అవార్డు
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకుంటూ డా.వేదాంతం రాధేశ్యామ్
- 2013లో ఉభయ తెలుగురాష్ట్రాల ద్వారా ‘నాట్యహంస’ పురస్కారం
- తమిళనాడు ప్రభుత్వం ద్వారా గౌరవ డాక్టరేట్ పురస్కారం
- కర్ణాటక ప్రభుత్వ కూచిపూడి నాట్య సిలబస్ చైర్మన్
- హోసూర్ లో గ్లోబల్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్
- ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా ‘కళానీరాజన’ పురస్కార గ్రహీత
- మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి కీ.శే. నటరత్న శ్రీ నందమూరి తారకరామారావుగారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతికశాఖ రవీంద్ర భారతిలో చైర్మన్ చాంబరులో సబ్ కమిటీ మెంబరు
- ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్థానిక సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూరదర్శన్ వాళ్ళు నిర్వహించే అనేక సాంస్కృతిక పోటీలకు న్యాయనిర్ణేత
- తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి నాట్య ప్రొఫెసర్
- అనేక సాంప్రదాయ జానపద నృత్య బాలేలను కంపోజ్ చేశారు.
- అనేకమంది శిష్యులు ‘బిస్మిల్లా ఖాన్’ జాతీయ యువ పురస్కారాలను అనేకమంది అందుకున్నారు.
- కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రానికి 1985 నుండి 2013 వరకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారుడుగా కూచిపూడి నాట్యం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో నమోదు కావడంలో ముఖ్య పాత్ర పోషించారు.
- 1990-93 హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అతిథి లెక్చరర్ గా పనిచేశారు. ఎం.ఎ.నాట్యం వారికి మూడు సంవత్సరములు శిక్షణ ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయంలో కూచిపూడి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడమనేది భగవంతుని కృప. వారికి 3 సం.ల పాటు సేవలందించి, తిరిగి కూచిపూడి వచ్చారు.
- వీరి శిష్యురాలు అనురాధగారు ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ డీన్‌గా ఉన్నారు.
- అదే విధంగా కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రానికి వీరి ఆఖరి తమ్ముడు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఇందులో అధ్యాపకులు కూడా వీరి శిష్యులే!
- ప్రస్తుతం విశ్రాంత ఆచార్యుడుగా ఉంటూ కూచిపూడిలో ‘వేదాంతం రాధేశ్యామ్ కూచిపూడి నాట్యశిల్పారామా’న్ని నిర్వహిస్తూ అనేకమంది శిష్యులకు నాట్యవిద్యను నేర్పుతూ దేశ విదేశాల్లో అనేక సంస్థల వారి ఆహ్వానం మేరకు నృత్య ప్రదర్శనలు ఇస్తూ, కళాకారుల చేత ప్రదర్శింప చేయుచూ గురు పరంపరని కొనసాగిస్తున్నారు.
మలి వయసులోకూడా సత్యభామ, సూత్రధారి మొదలైన పాత్రలను ప్రదర్శించడానికి అనేకమంది శిష్యులకు సూచనలు ఇస్తున్నారు.
ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో అనేకమైన సెమినార్లను నిర్వహించడం ఉపన్యాసాలు ఇవ్వడం చేస్తున్నారు.
దూరదర్శన్ వాళ్ళు తయారు చేసే అనేకమైన టెలీఫిల్మ్ లకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
తన సొంత ఇంటిని వేదాంతం వారి గురుకులంగా కూచిపూడి గ్రామంలో తీర్చిదిద్దారు.
***
ఇంతటి మహనీయుని ఇంటర్వ్యూ చేసేందుకు ఏ అర్హత లేకపోయినా వారితో నా పరిచయం ఒక మధురస్మృతిగా మీతో పంచుకుంటున్నాను. ఆ నటరాజు పరమశివుని నిలయమైన శ్రీ కాళహస్తిలో నాట్యవేదిక దగ్గర వారిని కలిసి నేను సంపాదకత్వం వహించిన ‘ఆది నుండి అనంతం దాకా..’ సంకలనం వారికి అందించడం, అదే వేదికపై వారి నాట్యం చూడగలగడం, ఆ నటరాజమూర్తిచే సన్మానింపబడడం దీనికి కారణం భగవంతుని అపారకృపయే!


రచయిత్రిగా వారికి పుస్తకం అందిస్తూ


వేదికపై వారి చేతుల మీదుగా సన్మానం అందుకుంటూ
అలుపెరుగని ఈ నాట్యాచార్యులు డా. డా. రాధేశ్యామ్ దగ్గర ప్రపంచంలో నలుమూలల నుండి ఎందరో విద్యార్థులు ఇక్కడకు వచ్చి, కూచిపూడి నాట్యం నేర్చుకుని, విశ్వవ్యాప్తంగా అంబరవీధిలో కూచిపూడి విజయపతాకను నిలిపారు.
చిరునామా:
పేరు: డా. శ్రీ వేదాంతం రాధేశ్యామ్ గారు
“సిద్ధేంద్ర కళాక్షేత్ర ప్రాంగణం”
మువ్వాదళం, కూచిపూడి
కృష్ణా జిల్లా. 521136
ఆంధ్రప్రదేశ్. ఇండియా
ఫోన్: 91-0867162246
***
(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచిట అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం వెలువరించారు.