[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల జానపద కళాకారులు డా. బద్రి కూర్మారావుగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]
జానపద కళలకు పునర్వైభవం
ఒక ఉన్నతస్థానాన్ని చేరుకుని తాను నడచిన మార్గాన్ని గుర్తుంచుకుని ఆ మార్గంలో దారిదీపంలాగా నిలచి తరువాతి తరానికి వెలుగు చూపడమే లక్ష్యంగా బ్రతికే గురువులెందరో. వారందరూ వందనీయులు. తాము చిన్ననాటి నుండి పెరిగిన తన బాల్యంలో తనకు ఆనందాన్ని అందించిన జానపద, గిరిజన కళలు ఏవైతే ఉంటాయో వాటికి శాశ్వతత్వాన్ని చేకూర్చాలనే, నిలబెట్టాలనే లక్ష్యంగా తన జీవితాన్ని, జీతాన్నీ, సమయాన్ని ఖర్చు చేసేవారుంటారా? ఉంటారు. నూటికో, కోటికో ఒక్కరు ఆ ఒక్కరి గురించే మనం ఈ రోజు తెలుసుకుంటాము మన వందే గురు పరంపరామ్లో. వారే, వృత్తిని, ప్రవృత్తినీ రెండు కళ్ళుగా భావిస్తూ, వృత్తి ప్రైవేట్ మాస్టారుగా, కళాశాల అధ్యాపకులుగా, ప్రవృత్తి కనుమరుగు అవుతున్న జానపదకళలను తను నెలకొల్పిన సంస్థ ‘గిడుగు రామమూర్తి తెలుగుభాష మరియు జానపద కళాపీఠం’ ద్వారా నిలపాలనే చిన్న ప్రయత్నం చేస్తున్న డా. బద్రి కూర్మారావుగారు.
ముందుగా మనం జానపదం గురించి కొంచెం తెలుసుకుందాము.
జానపదం అంటే గ్రామీణ ప్రజలు తమ సంస్కృతిలో భాగమైన కథలు, పాటలు, సామెతలు, పొడుపుకథలు, ఆచారాలు, సాంప్రదాయాలు మరియు నమ్మకాలను నోటిమాట ద్వారా ఇతరులతో పంచుకోవడం. ఇది అలిఖితము. తరతరాలుగా మౌఖికంగానే ఇతరులకు అందించబడుతున్న జ్ఞానము. మౌఖికమైనది. జానపద సాహిత్యం. ఇది జాను తెలుగు దేశీ కవితా రీతులలో ఆదికవి నన్నయకు ముందు నుంచి శాసనాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా నన్నె చోడుడు, పాల్కురికి సోమనాథుని వంటి ప్రాచీనుల కావ్యాల్లో జానపద గేయాల ప్రస్తావన ఉంది.
ప్రప్రథమంగా జానపద సాహిత్య సేకరణకు విశ్లేషణకు శ్రీకారం చుట్టిన వారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. వ్యవహారిక భాషలో ఉండే జానపద కథాగేయాలంటే అతనికి అభిమానం అందువలన సేకరించారు. జంగమ వ్యక్తులను తన దగ్గర ఉంచుకొని వారి చేత ఆయా జానపద కథలను, చారిత్రక కథలను, పౌరాణిక కథలను పాడించి వాటిని యధాతధంగా రాయించాడు. ఈ కథా గేయాలు ‘బాలే’ అనే ఒక ప్రత్యేక కవితాశాఖకు చెందుతాయని నిర్ధారించాడు. ఆ చరిత్ర ప్రతులను క్షుణ్ణంగా శాస్త్రీయంగా పరిశీలించి ఆయా సంఘటనలు జరిగిన కాలాన్ని కూడా నిర్దేశించాడు. ఆనాటి మత పరిస్థితులను గురించి చెప్పాడు.
బ్రౌన్ తెలుగులోని జానపద కథా గేయాలను కథలను సామెతలను సేకరించి విశ్లేషించి తొలి తెలుగు జానపద వాఙ్మయోద్ధారకుడు అయ్యాడు.
ఆంగ్లేయుల తర్వాత తెలుగువారు తమదైన జానపద సాహిత్య సేకరణ, ప్రచురణ, విమర్శన వీటిపై దృష్టి ప్రసరించారు. 1900 సం. నుండి వీటికి సంబంధించిన పుస్తకాలు వెలువడ్డాయి. స్త్రీల పాటలు, ఆంధ్ర పదములు, పాటలు అని సంకలనాలు ముద్రించారు.
హరి ఆదిశేషువు రచించిన ‘జానపద గేయ వాఙ్మయ పరిచయం’ జానపద సాహిత్యం పైన వచ్చిన మొదటి విమర్శ గ్రంథం. జానపద సాహిత్య సేకరణకి జీవితాన్ని అంకితం చేసిన నేదునూరి గంగాధరమ్ గారు 6000 జానపద గీతాలు సేకరించారు. నుడికారాలు, సామెతలు, జాతీయాలు మొదలైన వాటిని కూడా సేకరించి వివిధ పత్రికల్లో ప్రచురించారు. జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి అనే వ్యాస సంకలనం ముద్రించారు వీరికి ‘జానపద వాఙ్మయోద్ధారక’ అనే బిరుదును అయ్యదేవర కాళేశ్వరరావుగారు ప్రదానం చేశారు. 1956 తర్వాత అనేకమంది పరిశోధకులు జానపద సాహిత్యంలో ఏదైనా ఒక విషయంపై పరిశోధన చేసి, సిద్ధాంత వ్యాసగ్రంథాన్ని రచించి, విశ్వవిద్యాలయానికి సమర్పించి, ఎం.ఫి.లు మరియు పి.హెచ్.డి. పట్టాలను పొందారు. పొందుతున్నారు. జానపద సాహిత్య అనుశీలనము పరిశోధనకు భూమికగా ఉపకరించింది.
- ఈ విధంగా విశ్వవిద్యాలయంలో జానపద సాహిత్య పరిశోధనకు అంకురార్పణ కావించిన వారు బిరుదురామరాజుగారు వారి పరిశోధనా గ్రంథం తెలుగు జానపద గేయ సాహిత్యం 1956 నాటిది. ఈ పరిశోధనా గ్రంథంలోని ప్రతి అధ్యాయము అనేక పరిశోధనా గ్రంథాలకు వ్యాసాలకు ఆధారమైంది .
- ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1957లో ఎస్వీ.జోగారావుగారు ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర సిద్ధాంత వ్యాసగ్రంథ రచనకు పి.హెచ్.డి. పట్టాను పొందారు. ఇందులో యక్షగానకృతుల గురించి, ఉత్పత్తి వికాసాల గురించి, ప్రదర్శన పద్ధతులు గురించి భాషా, ఛందో, సంగీత, సంస్కృతి వికాసాల గురించి తెలియజేశారు.
- తంగిరాల వెంకటసుబ్బారావుగారు తెలుగు వీరగాథా కవిత్వం అనే 1500 పుటలు గల సిద్ధాంత వ్యాసం గ్రంధానికి 1968లో పి.హెచ్.డి. పట్టాను స్వీకరించారు. ఈ అపూర్వ గ్రంథం తెలుగు వీర గాథలకు విజ్ఞాన సర్వస్వం వంటిది. అనేక ప్రకరణాలతో తెలుగు వీరగాథల విమర్శగ్రంథాలలో తంగిరాల సిద్ధాంత గ్రంథం గణనీయమైంది
- ఆచార్య నాయని కృష్ణకుమారిగారు జానపద గేయగాథలు సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. జానపద సాహిత్యాన్ని ఒక మానవశాస్త్రంగా అధ్యయనం చేసే విధానానికి తొలిసారిగా జానపద గేయగాథలు గ్రంథంలో అంకురార్పణ జరిగింది.ఈ సిద్ధాంత గ్రంథంలోని విశిష్టగుణాలు ఆనాటి ఆచార సంప్రదాయాలలోని ప్రాచీన మానవ మనస్తత్వాన్ని విశ్లేషించారు.
- జానపద గేయ సాహిత్య పరిశోధనా క్షేత్రంలో తొలి తులనాత్మక గ్రంథం డాక్టర్ ఆర్. వి.ఎస్.సుందరంగారు వెలువరించిన తెలుగు కన్నడ జానపద గేయాలు తెలుగు, కన్నడ గేయాలను తులనాత్మకంగా అనుశీలించడానికి సుందరంగారు నూతనమైన శాస్త్రీయపద్ధతిని ఆవిష్కరించారు. ఈ శాస్త్రీయ పద్ధతి ప్రకారం వివిధ విభాగాలకు చెందిన జానపదగేయాలు ఒకే మూల సంస్కృతి నుంచి వికాసం పొందాయని ఆయన తన తులనాత్మక పరిశీలనలో నిరూపించారు.
ఈ విధంగా జానపద గేయ సాహిత్య పరిశోధనలో బిరుదు రామరాజుగారు, ఎస్వీ.జోగారావుగారు, తంగిరాల వారు, నాయని వారు, ఆర్వీ.ఎస్. సుందరంగారు నూతన మార్గాలను ఆవిష్కరించారు. వీరి బాటలో అనేకమంది ప్రయాణించి జానపద సాహిత్యపు మూలాలలోనికి వెళ్లి ఆ రత్నాలను వెలికి తీసే ప్రయత్నాలను చేసిన అనేకమంది పరిశోధకులు విశ్వవిద్యాలయాలలో వెలుగులు విరజిమ్ముతూ ఉన్నారు. వారిలో ఒకరు ఈనాటి మన వందే గురుపరంపరామ్ లోని డాక్టర్ బద్రి కూర్మారావుగారు. వారు చేసిన ‘ఉత్తరాంధ్రలోని జానపద కళలు– ఒక పరిశీలన’ అనే పరిశోధనా గ్రంథం. గ్రంథంతో పాటుగా మనము ఈరోజు వారి యొక్క జీవిత విశేషాలను ఉత్తరాంధ్ర పల్లెలలోని ఆ మారుమూల గ్రామాలలో ఆయన దర్శించిన జానపద కళారూపాల విశేషాలను గురించి తెలుసుకుందాం.
1. జననం: తల్లిదండ్రులు:
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి (మామిడి మెట్టు) గ్రామం. మా తల్లిదండ్రులు బద్రి లక్ష్మమ్మ, బద్రి అప్పన్న, తండ్రి తల్లిదండ్రులు అనగా అయ్యమ్మ, తాత అదే ఊరికి చెందినవారు. అమ్మ తరపున మందస మండలం బహడపల్లి మా తాతగారి ఊరు. మా తల్లి తండ్రి, తాతలు అందరూ వ్యవసాయ కూలీలు. పొలం పనులు కూలినాలి చేసుకునేవారు.
డా. కూర్మారావు గారి తల్లిదండ్రులు శ్రీ బద్రి అప్పన్న, శ్రీమతి లక్ష్మమ్మ
మా అయ్య బద్రి అప్పన్న చిన్నతనములో పక్కనే ఉన్న ‘మకర జోల’ అనే గ్రామంలో కర్రి పంతులు అనే గురువు వద్ద రాత్రి బడిలో కొంత అక్షరజ్ఞానం నేర్చుకొన్నారు. ఆ కాలంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నందువలన బయట రాష్ట్రాల్లో వలసపోయిన వారికి ఉత్తరాలు రాయడం, వాళ్ళ నుండి వచ్చిన ఉత్తరాలు చదవడం ఇష్టంగా చేసేవాళ్ళు. అమ్మ ఇంటి పనులు చేసుకుంటూ పొలం పనులు, ఉడుపులు, వరి కోతలకు వెళ్తూ మిగతా కూలి పనులు చేసేది.
2.బాల్యం–స్నేహితులు–ఆటలు:
ఐదుగురు అన్నదమ్ములలో నేను ఆఖరువాడిని. మా బాల్యమంతా పశువులను కాసుకుంటూ ఆటపాటలతో గడిచింది. ఊరిలో పిల్లలందరూ పశువులను మేపుకుంటూ, పశువులకు గడ్డి చూసుకుంటూ, పొలాల్లో ఆడుకుంటూ, ఊర్లో కూడా ఆటలాడుకునేవాళ్ళం. స్నేహితులతో రాత్రిపూట ఊరి రామమందిరం దగ్గర వెన్నెల రాత్రులలో ఆడపిల్లలు, మగపిల్లలు తేడా లేకుండా కబడ్డీ, సయ్యాట, దాగుడుమూతలు, కళ్ళకు గంతలు కట్టుకునే ఆట, పెంకాట, బచ్చలాట, ఒంటి కాళ్లతో గెంతాట, పులి-మేక మొదలు ఆటలు ఆడుకునేవాళ్ళం. పగటిపూట బంతాట, బొంగరాలాట, బిల్లా తెడ్డు, గోళీలాట (లక్కాయ పిక్కలు), దాడి ఆటలు, చెరువుల్లో ఈత కొట్టడం మొదలైన శారీరక దృఢత్వాన్ని పెంచే ఆటలు ఆడుకునేవారం. కాలం తెలిసేది కాదు.
గ్రామ నేపథ్యము:
జానపదం ప్రతి పనిలోనూ పాటే! రంగోయి గ్రామం
శ్రీకాకుళం జిల్లా ఒకప్పటి సోంపేట తాలూకా ప్రస్తుతం పలాస మండలంలోని ఉద్దాన ప్రాంతంలోని రంగోయి అనే గ్రామంలో బద్రి అప్పన్న లక్ష్మమ్మల ఐదవ సంతానంగా 20-07-1962లో జన్మించినట్లు నా పాఠశాల రికార్డు. మా తండ్రికి కొద్దిగా అక్షరజ్ఞానం ఉందేమో గాని మా తల్లి పూర్తిగా నిరక్షరాస్యురాలు. వాళ్లు కాయకష్టం చేసి బ్రతికారు. నేను పెద్ద చదువులు చదువుతానని, ఉపాధ్యాయుని అవుతానని కలలో కూడా ఊహించలేదు. బహుశా మా తల్లిదండ్రులు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఈ ఉద్దానంప్రాంత పల్లెలన్నీ చదువులేని పల్లెలే. కటిక పేదరికం వెనుకబాటుతనముతో వెనుకబడిన కులాలతో ఉన్న ప్రాంతం. ఒకప్పుడు బర్మా, ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులు, కలకత్తా, అస్సాం, సూరత్ వంటి ప్రాంతాలకు వలసపోయిన వారే. చదువుకున్నవారు గాని, ఉద్యోగస్తులు గాని లేని గ్రామం. ఊర్లో అందరివి పూరిళ్ళే.
3.విద్య:
1982 వరకు ఈ గ్రామానికి సరైన రోడ్డు గాని, విద్యుత్ గాని లేదు. మా కుటుంబం కూడా అందుకు మినహాయింపు కాదు. నేను ఐదో సంతానం అవ్వటం వలన నాకు అప్పటి మా ఊరులో ఉన్న బడిలో వేశారు. మిగతా నాకంటే పెద్దవారిని అండమాన్ నికోబార్ దీవులకు చిన్నతనములోనే పని కోసం పంపించారు. నేను ఊరు అరుగుల మీద, రామ మందిరంలో చదివినట్టు గుర్తు.
ప్రాథమికవిద్య పునాదివేసిన గురువులు. వీరికి తండ్రి ప్రథమ గురువు, తరువాత 4,5,6,7 తరగతులలో చదువుల తేజోమూర్తిగారు, విశ్వనాథం పాణిగ్రాహిగారు, షేక్ హుస్సేన్ సాహెబ్ గారు, ఆర్.పురుషోత్తం మొదలగువారు పునాది వేశారు.
ప్రాథమికోన్నత విద్య ఆరు, ఏడు తరగతులు వచ్చేటప్పటికి మా ఊరులో ప్రాథమికోన్నత పాఠశాల వచ్చింది, ఏడవ తరగతి పూర్తయిన తర్వాత నన్ను, తెప్పల జోగారావును ఆర్. పురుషోత్తం అనే టీచర్ మమ్మల్ని కాశీబుగ్గ ఉన్నత పాఠశాలలో పలాస బి.సి. హాస్టల్ లో చేర్పించారు.
హైస్కూలు విద్య కాశీబుగ్గ హైస్కూల్లో కతంబాల డిల్లేశ్వరరావుగారు లెక్కలకు, ఇంగ్లీష్ కు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన డి.మన్మథరావుగారు, జీవశాస్త్రంలో బి.నరసింగరావుగారు, తెలుగు ఉపాధ్యాయులు కొంత పునాది వేశారు. అక్కడ పదో తరగతి వరకు చదివి పదో తరగతిలో 1978లో ద్వితీయశ్రేణిలో పాసైన తొలివ్యక్తిగా మా ఊర్లో గుర్తించబడ్డాను. మా ఊర్లో విశ్వనాథ పాణిగ్రాహి అనే టీచర్ మాకు మార్గదర్శకులుగా ఉండేవారు. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు అగుటచేత మేము పొలంపనులు చేసుకుంటూ, పశువులను కాసుకుంటూ చదువుకున్నాం.
జూనియర్ కాలేజీ సోంపేట కాలేజీ విద్య. కాలేజీ విద్య మా ఊరుకి కొత్త. మా ఆర్థిక పరిస్థితులు కూడా పేదరికం. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకునేవాళ్లే. సరైన మార్గదర్శకం లేక నేను టెక్కలి, శ్రీకాకుళం కాలేజీల్లో చేరి సకాలంలో హాస్టల్ సీట్ల రాక మధ్యలో విరమిస్తుండేవాడిని. అలా నా చదువుకు మూడు సంవత్సరాలు ఆటంకం ఏర్పడింది. ఈ ఖాళీ సమయంలో చిన్న తరగతులకు ఊర్లో ట్యూషన్లు మొదలుపెట్టాను. మిగతా సమయంలో వ్యవసాయపనులు, రోడ్డు పనులు, చెరువు పనులకు వెళుతుండేవాడిని. కిరోసిన్ దీపపు బుడ్డీలవెలుగులో మా అరుగుల మీద సుమారు 20 మంది పిల్లలతో ట్యూషన్ ప్రారంభమైంది. అప్పుడు మొదటగా నేను ‘మాస్టర్’ గా పిలవబడ్డాను. ప్రైవేట్లు చెప్పుకుంటూ కాలేజీ చదవడానికి ట్యూషన్ విద్యార్థులు ఇచ్చిన కొద్దిపాటి డబ్బులు నాకు బస్సు చార్జీలకు అయ్యేవి. తరువాత 1981లో గుంట సన్యాసిరావుగారు మా ఊరు వి.ఎల్.డబ్ల్యు. గా పనిచేసేవారు. వాళ్ళ పిల్లలకు ట్యూషన్ చెప్పడం, వాళ్ళ సహకారంతో నాటి సోంపేట ఎకనామిక్స్ లెక్చరర్ డి.శ్రీరామమూర్తిగారి సహకారంతో మరల సోంపేట జూనియర్ కళాశాలలో 1981లో ఇంటర్మీడియట్ చేరాను. నాకు అప్పటినుండి శ్రీరామ్మూర్తిగారితో పాటు కామర్స్ లెక్చరర్ మెండ సుదర్శనరావుగారు, ఇంగ్లీష్ సుకుమార్, ఎన్. భాస్కరరావు, రమణాచారి మొదలగువారు పునాది వేశారు. వారి సహకారంతో ఇంటర్మీడియట్ కొనసాగించి 1983లో హై సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను.
డిగ్రీ కళాశాల గేదెల బలరాంగారి సహకారంతో టెక్కలి డిగ్రీ కళాశాలలో చేరాను. కళాశాలలో తెలుగులో కవిటి మాధవయ్య; రాజనీతి శాస్త్రంలో వై సీతారాం; ఆర్థికశాస్త్రంలో ఆచార్యుల మాస్టారు; చరిత్రలో జి.బలరాంగార్లు పునాదివేశారు. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఎకనామిక్స్ లో 1986లో మొట్టమొదట అడుగుపెట్టాను. ఇది నా జీవితంలో మరువలేని మధురానుభూతిని మిగిల్చింది. ఎందుకంటే అంతవరకు మా ప్రాంతానికి పోస్ట్ గ్రాడ్యుకేషన్ విద్య కొత్త. ఎం.ఏ. ఆర్థిక శాస్త్రంలో చదివినప్పుడు అనుభవజ్ఞులైన ఆచార్యులు ఉండేవారు సి.రత్నం, రాణి మేడం, ఆచార్య కె.ఎస్.చలం, డాక్టర్ సుదర్శనరావు, ఆచార్య కె.సి.రెడ్డి, ప్రసాదరావు, మొదలగువారు ఆర్థికశాస్త్రంలో బాగా నిష్ణాతులు.
అయితే యూనివర్సిటీలో పి.హెచ్.డి. చేసి సివిల్ సర్వీస్ రాయాలన్న నా కోరిక తీరలేదు. దానికి మా ఆర్థిక పరిస్థితులే కారణం. డిగ్రీ అయిన తర్వాత ఆరు నెలలు మా ఊరు జడ్పీహెచ్.ఎస్.లో పార్ట్ టైం టీచర్ గా పని చేశాను. నేను ట్యూషన్ టీచర్ గా మరియు రంగోయిలో పార్ట్ టైం టీచరుగా పనిచేసిన రోజులు మరువలేనివి. ఎందుకంటే వీధి దీపాలు అరుగుల మీద చదువుకున్న విద్యార్థులు అందరూ చాలామంది నాలాగే మొదటి తరం ఉపాధ్యాయులయ్యారు. మరి కొంతమంది ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. ఇది నా గొప్పతనం కాదు గాని నన్ను మరికొందరిని ఆదర్శంగా తీసుకుని ఉంటారు.
అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. ట్రైబల్ డెవలప్ మెంట్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ గైడుగా డాక్టర్. ఎస్ సూర్యనారాయణ (పీజీ సెంటర్; విజయనగరం) గారు,
సాంకేతిక విద్య: ప్రకాశం జిల్లాలో అతి కష్టం మీద బి.ఈడి. ట్రైనింగు పూర్తి చేశాను. ట్రైనింగ్ కు మా కుటుంబ సభ్యులు సహకారంతో పాటు మరి కొంత మంది సహకారం మరువలేనిది.
పి.హెచ్.డి. పరిశోధనాంశము శ్రీకాకుళం జిల్లా గిరిజనుల ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక సమస్యలపై పరిశోధన గైడ్ గా హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో (cess) షేక్ గాలిబ్ గారు ఉన్నారు.
నా బి.ఇడి.శిక్షణ తర్వాత మా అయ్య నన్ను ఉద్యోగిగా చూడాలనుకున్నారు. ఎందుకంటే నేను రైతు కూలి పనులు చేయడానికి పనికి రానని ఎండలో పనిచేయాలని అనేవారు. అయితే నాకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రాకముందే మా తండ్రి మరణించారు. బి.ఇడి. శిక్షణ తర్వాత కొంతకాలం మరల మా ఊరు ఉన్నత పాఠశాలలో మరియు కంచిలి గురుకులంలో పార్ట్ టైం సోషల్ స్టడీస్ టీచర్ గాచేశాను . కొద్ది రోజులు కేంద్రీయ విద్యాలయంలో కూడా పార్ట్ టైం టీచర్‌గా చేశాను. ఆ రోజులు కూడా మరువలేనివి.
ఉపాధ్యాయునిగా నా అనుభవాలు.
ఉపాధ్యాయుడిగా.. నేను మా ఊర్లో మొదలు పెట్టినప్పుడు పిల్లలకు తెలుగు ఇంగ్లీషు చదివించడంతో పాటు ఎక్కంలో అప్పగించుకుంటా గుణింతాలు చిన్నపాటి లెక్కలు చేయించేవాడిని. ఎందుకంటే మాకు గణితంలో పెద్ద పరిజ్ఞానం లేదు. పైగా లెక్కలు అంటే భయం కూడా. పెద్ద పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడిని. ఆ విధంగా పిల్లల్ని భయపెట్టి, దండించి, వాళ్లను చదవడం రాయడం వచ్చేటట్లు చేయించగలిగాను. వారిలో సుమారు ఏడుగురు మా గ్రామం నుండి ఉపాధ్యాయులయ్యారు. తర్వాత గేదెల రామారావు అనే విద్యార్థి ఉపాధ్యాయుడైన తర్వాత కూడా గ్రూప్ 1 ఆఫీసర్‌గా ఎంపిక కాబడ్డాడు. అలాగే మా పరిసర గ్రామాల విద్యార్థులు కూడా ఈరోజుకు కూడా నన్ను ఎంతో గౌరవిస్తుంటారు. నేను నా సర్వీస్ లో ఎక్కడ పని చేసినా పిల్లలతో మమేకం అయ్యేవాడిని, పిల్లలందరికీ పేర్లు పెట్టి పిలిచేవాడిని, మేము ఎలా కష్టపడి చదివి పైకి వచ్చామో చెప్పే వారిమి. ప్రతి తరగతిలో చదువుకున్న విద్యార్థులు మాత్రం తక్కువగా ఉండేవారు. ఇక చదువు అంటే పెద్దగా శ్రద్ధలేని విద్యార్థులు, అల్లరి చేసే విద్యార్థులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్లని భయపెడుతూ దండిస్తూ దారికి తెచ్చేవారిమి. అందుచేత విద్యార్థుల్లో భయంతో పాటు, నా మీద అభిమానం కూడా ఉండేది.
ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితము:
కొత్తగా దళిత విద్యార్థుల కోసం ఎన్.టి.రామారావు పెట్టిన గురుకుల పాఠశాలలో టీచర్ పోస్టులు పడ్డాయి. మా స్నేహితుడు మాధవరావు సహకారంతో నేను కూడా అప్లై చేశాను. ఉద్యోగం వస్తుందా? రాదా? అని ఎదురుచూసే మాకు అదృష్టవశాత్తు 1991లో శ్రీకాకుళం జిల్లా దుప్పలవలస గురుకులంలో టి.జి.టి.ఎస్.ఎస్.గా ఉద్యోగం వచ్చింది. మా ఊరులో మొదటి టీచరుగా గుర్తించబడ్డాను. నాతోపాటు మా ఊరి పూజారిగారి అబ్బాయి రాజేశ్వర ప్రసాద్ పాణిగ్రాహి కూడా ఈ గ్రామం నుండి ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడుగా ఎంపిక కాబడ్డాడు.
దుప్పలవలసలో రెండు సంవత్సరాలు, తరువాత విజయనగరం జిల్లా బాడంగి గురుకులమునకు పి.జి.టి.గా వెళ్లాను. అక్కడ మూడు సంవత్సరాలు పనిచేసి, నెల్లిమర్ల బాలికల పాఠశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా మూడు సంవత్సరాలు చేశాను.
5.వివాహము:
విజయనగరం నివాసులైన గజ్జి రామమూర్తి, వసంత కుమార్ల అమ్మాయి లక్ష్మీఫణిశ్రీ తో 1996లో వివాహం జరిగింది. అత్తమామలకు శ్రీనివాసరావు, ఫణిశ్రీలు ఇద్దరు సంతానం.
6. సంతానము:
మాకు వెంకట తరుణి, సాయి దీపక్ సంతానం. వీరిద్దరూ బి.టెక్. చదివారు. అమ్మాయికి వివాహం జరిగింది. సాయి దీపక్ చెన్నైలో టి.సి.ఎస్.లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు.
ఉద్యోగ జీవితము: తరువాత విశాఖ జిల్లా చోడవరం దగ్గర కోనాం బాలికల గురుకులానికి బదిలీ అయింది. ఆ పాఠశాల కొత్తగా ప్రారంభించడంతో అక్కడ నాలుగేళ్లు అనేక కష్టాలతో పని చేసాం. తరువాత విజయనగరం జిల్లా కొప్పెర్ల గురుకులానికి బదిలీ అయ్యాను. తర్వాత విశాఖ జిల్లా సబ్బవరంలో 8 ఏళ్లపాటు సోషల్ పి.జి.టి.గా చేస్తూ, శ్రీకాకుళం జిల్లా నందిగాంలో ఏడేళ్లు ఎకనామిక్స్ జూనియర్ లెక్చరర్ గా చేస్తూ మరల సబ్బవరంకు బదిలీ అయి అక్కడ ఉద్యోగ విరమణ చేశాను.
విద్యార్థుల ప్రేమాభిమానాలు:
నేను దుప్పలవలసలో రెండు సంవత్సరాలు పని చేసినప్పుడు బూరి విశ్వేశ్వరరావు అనే విద్యార్థి చనువుగా ఉండేవాడు. నేను బదిలీ వెళ్లిపోయిన తర్వాత కూడా నన్ను మార్గదర్శకంగా తీసుకుని, తర్వాత ఇంజనీరింగ్ చదివి, ఈరోజు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా నన్ను ఇప్పటికీ గౌరవిస్తూ విశ్వేశ్వరరావుని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అని ప్రోత్సహించారు. ఈ విద్యార్థి చేసే మేలు నేను మరువలేను. ఎందుకంటే నేను ఆ విద్యార్థికి ఏ సహాయం చేయలేదు కానీ ఆ విద్యార్థి మా పిల్లలు చదువు కావలసిన కంప్యూటర్లను కానుకగా పంపిస్తూ నా రచనలకు, నేను స్థాపించిన కళా పీఠానికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి మా కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. నేను ఎక్కడికి బదిలీ అయినా కొంతమంది పిల్లలు అభిమానంతో నేను వెళ్లే పాఠశాలకు ఉత్తరాలు రాస్తుండేవారు. నెల్లిమర్ల బాలికల జూనియర్ కళాశాలలో పనిచేసినప్పుడు ఆ పిల్లలు కూడా నన్ను అభిమానించేవారు. నేను బదిలీ అయినప్పుడు చాలా బాధపడుతూ నా బదిలీని ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా నేను బదిలీ అయిన ప్రదేశానికి వెళ్లక తప్పలేదు. తరువాత కాలంలో వీరందరూ కూడా విజయనగరం పి.జి. కాలేజీలో ఎం.ఏ ఎకనామిక్స్ ఎం.కాం. చదవడం విని చాలా ఆనందించాను. వాళ్లలో కొంతమంది ఉపాధ్యాయులుగా కూడా ఎంపిక కాబడి నాతో పాటు ఎలక్షన్ డ్యూటీలకు రావడం మరువలేనిది.
సబ్బవరంలో కూడా విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచడంలో తోటి ఉపాధ్యాయులతో పాటు నేను కూడా పాలు పంచుకున్నాను. బోధించుటలో తృప్తి చెందాను. వార్డెన్ గా చేసినప్పుడు, హౌస్ టీచర్‌గా చేసినప్పుడు కొన్నిసార్లు టెన్షన్లకు గురి అయ్యే వాళ్ళం కానీ తర్వాత మరల మా విధిలో నిమగ్నం అయ్యే వాళ్ళం. కొన్నిసార్లు విద్యార్థులను దండించినప్పుడు ఇంటికి వచ్చి బాధపడుతూ ఉండేవాడిని. తరువాత వారిని చేరదీయడం వాళ్లు మనపై కోపాన్ని తగ్గించుకునేవారు. విద్యార్థులతో కలిసిపోవడంతో ఆనందంతోనే వృత్తిని చేయగలిగాను. అంతేకాకుండా ఇవి గురుకుల పాఠశాలలు కాబట్టి ఎక్కువ కాలం పాఠశాలలోనే గడపవలసి వచ్చేది. అందుచేత వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ మంచి చెడ్డల్ని తెలుసుకొని కొంతవరకు పిల్లలకు బాగా చదువుకోమని చెప్పడంతో కొంతమంది విద్యార్థులు మారేవారు. నందిగాం బాలికల పాఠశాలలో కూడా మిగతా ఉపాధ్యాయులు సహకారంతో పిల్లలను క్రమశిక్షణలో ఉంచాం.
ఇక నేను కోనాంలో పనిచేసేటప్పుడు అక్కడ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడంతో వాళ్లు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు అందరూ కూడా వ్యవసాయ కుటుంబాలు నుండి వచ్చిన మొదటి తరానికి చెందిన దళిత పిల్లలు. పైగా ఆడపిల్లలు. తర్వాత కాలంలో వాళ్లంతా పై చదువులు చదివి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మమ్మల్ని అందరినీ సన్మానించారు.
7.ప్రవృత్తి:
సాహిత్యం-కళలు పట్ల మక్కువ ఎక్కువ. సాహిత్య ప్రస్థానానికి గురువులు మా ఊరు, మా తండ్రి అని గర్వంగా చెపుతారు. మా తండ్రి బద్రి అప్పన్న రాత్రిపూట పాడుకునే పాటలు, శతక పద్యాలు, మాకు చెప్పే కథలు ప్రేరణగా చెప్పవచ్చును. అలాగే మా ఊర్లో రాత్రిపూట జరిగే భజనలు, గ్రామానికి వచ్చే తోలుబొమ్మలాటలు, గంగిరెడ్డి ఆటలు, బుడగజంగాలు మొదలగు వాళ్ళు ఆడే పాటలతో పాటు గైరమ్మ – నందన్న సంబరాలు.
(వీరి గ్రామం కళాకారులకు ప్రసిద్ధి. కూర్మారావుగారు కోయడాన్సులో ఒక కళాకారుడుగా ఉన్నారు. అలాగే కొండలరాములు మాస్టారు దర్శకత్వంలో ఊర్లో పూలరంగడు, ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ నాటకాల్లో కూడా నటించడం, అమ్మోరు సంబరాల్లో ఆడే పగటి వేషాలు, రాత్రిపూట బుర్రకథలు, బోనేల పాటలు (జముకుల పాట) మాలదాసరుల పాటలు, దేవుడు పాటలు ఇవన్నీ గాఢమైన ముద్ర వేశాయి. – రచయిత్రి)
ఆ ఊరిలో జరిగే గైరమ్మ, నందన్న పండుగలలో పాటలు, పగటి వేషాలు కూడా కూడ ప్రభావాన్ని చూపాయి. అలాగే మా ఉద్దానం ప్రాంతం వామపక్ష ఉద్యమాలతో సుబ్బారావు పాణిగ్రహ పాటలతో వంగపండు ప్రసాదరావు భూమి బాగోతం పాటలతో నిత్యము ఎక్కడో ఒక కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఇవన్నీ చిన్నప్పటి నుండీ పరిశీలించడమే తప్ప గురువులంటూ ప్రత్యేకంగా లేరు.
అభిరుచులు అట్టడుగు వర్గాల వారి గురించి తెలుసుకునుట జానపద విజ్ఞానాన్ని వారి జీవిత విధానాలను పరిశీలన పరిశోధన గ్రంథస్తం చేయటం భారతీయ సంస్కృతిని ప్రేమించడం స్వచ్ఛంద సేవ.
రచయితగా నా ప్రస్థానం:
ఆ పాఠశాలలో పనిచేసినప్పుడే ఒక రచయితగా ఆ ప్రాంత జానపద కళలను సేకరణతో పాటు రచనలు కూడా మొదలుపెట్టాను. కొప్పెర్ల గురుకులంలో ఐదేళ్లు పని చేసినప్పుడు అక్కడి విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుని వారిలో చాలామంది మొదటి తరానికి చెందిన ఉద్యోగస్తులయ్యారు. నేను ఈ పాఠశాలలో ఉన్నప్పుడే ఉత్తరాంధ్ర జానపద కళలు ( 2005) అనే పుస్తకాన్ని రాశాను. ఇది నాకు చాలా గుర్తింపు ఇచ్చింది. అలాగే ఇక్కడ పిల్లలు కొంతమంది చేత వాళ్ళ నాన్నమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పిన పల్లె కథలు రాయించి 2023లో పుస్తకంగా తీసుకొచ్చాను.
8.ఉత్తరాంధ్ర కళలకు చరిత్రలో శాశ్వత స్థానాన్ని నిలిపే దిశగా అడుగులు:
అంతరించిపోతున్న జానపద కళల పరిరక్షణకు 2004 లో మా గ్రామంలో గిడుగు రామమూర్తి తెలుగు భాష , జానపద కళా పీఠాన్ని స్థాపించాను.
పాఠశాలలో పనిచేసేటప్పుడు డి. మహేష్ అనే విద్యార్థి వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్లి వాళ్ళ గ్రామంలో మహిళలు పాడే జానపద పాటలన్నీ రికార్డింగ్ చేయించి ఆ రోజంతా ఆ గ్రామంలో ఆనందంగా గడిపాము. అవి తర్వాత రోజుల్లో ‘కళింగాంధ్ర జానపద గేయాలు’ అనే పుస్తకంకు ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా ఆ విద్యార్థి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ గ్రామంలో తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చాడు. మరల 10 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి వెళ్లి పాటలు పాడిన ఆ మహిళా గాయకులందరకు సన్మానం చేయడం మరిచిపోలేనటువంటిది.
మేము ప్రారంభించిన జానపద కళా పీఠము, నేను రాసిన జానపద కళలు పుస్తకము మరల చిన్ననాటి మా హాస్టల్ సహచరులు ఎం.బాబురావు రంగోయి లో నా దగ్గర కొద్ది రోజులు పాటు చదువుకున్న విద్యార్థి డాక్టర్ కె.చిరంజీవి మొదలగువారు భిలాయిలో ప్రవాస ఆంధ్రులుగా ఉంటూ తెలుగు భాషకు కళలకు చేస్తున్న కృషిని గుర్తించి ప్రవాసాంద్ర తెలుగు సభలకు భిలాయి ఆహ్వానించి, సమావేశాలులో మమ్మల్ని సన్మానం చేయడం మరువ లేనిది. అలాగే ఈ రోజుకు కూడా మా కళా పీఠానికి వాళ్ళు సహాయ సహకారాలు అందుతున్నాయి.
కృతజ్ఞతలు:
అనుకోకుండా మా చదువు, నా ఉపాధ్యాయ ఉద్యోగం ఎన్నో తీపి గుర్తులు మిగిల్చింది. అంతేకాకుండా మొదటి తరానికి చెందిన చదువరిగా, ఉద్యోగిగా, నా కుటుంబానికి కూడా ఎంతో మేలు చేసింది. ఈ వృత్తిని నేను బాగా ప్రేమించాను. ఎక్కడ కలిసిన పిల్లలు గుర్తుపట్టి గౌరవిస్తారు. అయితే ప్రస్తుతం విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అంతరాలు పెరగడం ప్రస్తుతం ఉపాధ్యాయవృత్తి కూడా ఒక సవాలుగా మారింది. అయినా సరే పిల్లల సంక్షేమాన్ని పిల్లల అభివృద్ధిని కోరుకున్న ఉపాధ్యాయులకు ఎప్పుడు గౌరవం ఉంటుంది.
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గ్రామానికి, సమాజానికి మాకు మార్గదర్శకమైన ఉపాధ్యాయులందరికీ మరొకసారి తలచుకుంటూ… ముఖ్యంగా మా అమ్మ నా చదువుకునే రోజుల్లో కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ అందరూ తల్లుల్లాగే ఆమె కూడా అయ్యతో పాటు వ్యవసాయపనులు చేసుకుంటూ మమ్మల్ని పోషించింది. పేదరికం దాచుకుంటూ తిండికి లోటు రానివ్వకుండా ఏది ఉంటే అది వండి పెట్టింది. ఉపాధ్యాయ వృత్తి నన్ను క్రమశిక్షణలో ఉంచడమే కాకుండా నా కుటుంబసభ్యులకు కూడా క్రమశిక్షణతో పెంచడానికి వారు ఒక ప్రయోజకులుగా తయారవ్వడానికి తోడ్పడింది.. ధన్యవాదాలు..
జానపద కళల పరిరక్షణకు నా ప్రయత్నం సేతువు నిర్మాణంలో ఉడత సాయం వంటిది
9. జానపదకళల పరిస్థితి:
నాకు 1991లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది మూడు జిల్లాలో పనిచే సాను. 2000 సంవత్సరం నాటికి నాలో ఒక రకమైన సామాజిక స్పృహ కలిగింది. సమాజానికి ఏమైనా చేయాలని ఆలోచన కలిగింది. దానికి కారణం నేను అనుభవించిన కష్టాలు, పేదరికం. విజయనగరంలో తరచుగా జరిగే సాహిత్య, ఆధ్యాత్మిక సభలకు హాజరవుతుండేవాడిని. అయితే నా చిన్ననాడు నేను చూసిన, విన్న జానపద కళాకారులకు ఆదరణ లేకపోవడం, వాళ్లు గ్రామాలు రాకపోవడం తగ్గిపోయింది. మనం కళాకారులు అంటున్నాము కానీ వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ కథలు చెబుతుండేవారు. అయితే దీనికి సినిమాలు ప్రభావంతో పాటు టీవీలు రావడం వారి జీవనోపాధికి దెబ్బ కొట్టింది. దీని కారణాలు తెలుసుకోవడం మొదలు పెట్టాను. మా గ్రామానికి వచ్చి రాత్రిపూట కథలు చెప్పే జముకుల పాట కళాకారుడు తేప్ప రాములు చిరునామా కనుగొని శిష్యుడు,స్నేహితుడైన నల్ల ధనుంజయ రావుని వెంటపెట్టుకొని పర్లాకిమిడి దగ్గరి జంగాలపాడు వెళ్లి ఆయన మొత్తం జీవిత విశేషాలు, ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నాను. అప్పటికి ఆయన అవసానదశలో ఉన్నారు. నాకు తోచింది నెల నెలా పంపిస్తానని చెప్పి, ఆయన మరణించిన వరకు ఆర్థికసహాయం అందించాను. తరువాత ఆయన భార్యకు కూడా మరణించేవరకు ప్రతి నెలా కొంత పంపించాను. చోడవరం దరి కోనాం లో పనిచేస్తున్నప్పుడు చోడవరంలో ఉండేవాడిని. ఒకరోజు రాత్రి రామమందిరం దగ్గర తప్పెటగుళ్ళు కొడుతూ పాడుతున్న వెంకటరమణమూర్తి పాట విని అక్కడికి వెళ్లాను. వాళ్ళ వివరాలు తెలుసుకుని, అర్జాపురం గ్రామం వెళ్లి వారి కళ, ప్రస్తుత పరిస్థితి విశేషాలు అడిగి తెలుసుకున్నాను.
గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళా పీఠం ఆలోచన–సహాయకులు
2002 నుండి విజయనగరంలో కొన్ని సంవత్సరాలు విజయనగర ఉత్సవాలు జరిగాయి. మూడు రోజులు పాటు జానపద కళల ప్రదర్శన కోట ఎదురుగా పెట్టేవాళ్ళు. నేను చిన్నతనంలో చూసినటువంటి కళలన్నీ ఇక్కడ చూడ్డం నాకు ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో మా సొంత గ్రామంలో నేను కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి కళాకారులందరినీ ఏకం చేసి ప్రదర్శన ఇప్పిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో
డా. బద్రి కూర్మారావుగారు స్థాపించిన సంస్థలు
2004లో గిడుగు రామమూర్తి తెలుగు భాష, జానపద కళాపీఠం ప్రారంభం: బద్రి అప్పన్న స్మారక కళా పీఠం: వివేకానంద చైతన్య సంఘము: వివేకానందుని జయంతి రోజున గంగిరెద్దుల వాళ్లు, బుడగజంగాలు, మా గ్రామ కళాకారులకు సన్మానం చేస్తూ వారిని కూడా వేదిక లెక్కించాము. గురజాడ అప్పారావుగారి పేరున సంస్థలు ఉన్నాయి. కానీ గిడుగు రామమూర్తిగారి పేరున పెద్దగా సంస్థలులేవు. అందుచేత గిడుగు పేరుతో సంస్థ పెట్టాను .జానపద కళలతో పాటు తెలుగుభాష కూడా అప్పటికే నిరాదరణకు గురవుతోంది. అందుచేత ఆ రెండు వచ్చినట్లు కళా పీఠాన్ని పెట్టాను. నాకు ఇందులో సహకరించినవారు నల్ల ధనంజయ్ రావు. అనేక ఆటుపోట్లు ఎదురైన, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కళా పీఠం కార్యక్రమాలు రోజురోజుకు వందల మంది కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించి 20 ఏళ్లలో కళాకారులు రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితికి అభివృద్ధి చేశాం. మా తండ్రి బద్రి అప్పన్న స్మారక కళా పీఠం పేరుతో ఎక్కువ శాతం నా వేతనం నుండి డబ్బులుపెట్టగా, మరి కొంతమంది మిత్రులు కూడా సహకరించారు. వీరిలో గొర్ల కామరాజు, గుంట కేశవరావు, కె.చిరంజీవి, గండు తులసి నారాయణ, కుమార్ నాయక్, రాపాక సోమేశ్వరరావు మొదలగు వారితో పాటు మా కుటుంబ సభ్యులు సహకారం కూడా దీనిలో ఉంది. నేను ఊహించనంత కళల అభివృద్ధికి కొంతవరకు తోడ్పడ్డాం.
గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళా పీఠం ఆధ్వర్యంలో జానపద కళాజాతరలు జానపదం ఝల్లుమన్నదీ.. అనే పేరుతో 21 సంవత్సరాలుగా గ్రామంలో సంక్రాంతి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి జానపద కళాకారులు పెద్ద ఎత్తున చేరుకొని తమ హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి మాత్రమే కాకుండా, గోదావరి జిల్లాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా సంప్రదాయ జానపద కళాకారులు పాల్గొని తమ కళా ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తున్నారు.
తప్పెటగుళ్ల ప్రదర్శన పీత గంగయ్య బృందం చేయగా, ఆటపాట బృందం సాలిన జోగారావు బృందం చేయగా, అదేవిధంగా దేవరగట్టు ప్రదర్శన అనే జానపద కార్యక్రమం ఇంతకుముందు ప్రజలకు తెలియదు. ఆ ప్రదర్శన కథానాయకుడు రాజకుమార్ గారు చేశారు. అలాగే నారాయణపురంకి చెందిన గంగిరెద్దులవారు, వంగర మండలంవారు జముకుల కథ, బోనెల అసిరయ్య జముకు పాటలు, సాలిన జోగారావు బృందం రెల్లిదోని చిన్నది నృత్యరూపకం తగరపువలస చిన్న రెడ్డి బృందం, చీపురుపల్లి సుశీల మోహనరావులు సామాజిక పాటలు, తోట సిమ్మయ్య తుడుము మేళం, దున్న శకుంతల జానపదం, దాసరి తాతారావు, అమ్మ రామకృష్ణ, మద్దిల ఆదినారాయణ, బోకర గ్రీష్మ, తోట రమణమ్మ, గేదెల రామారావు, సన్నశెట్టి రాజశేఖర్, తెప్పల కృష్ణమూర్తి అనేకమంది పాల్గొని తమ ఆటపాటలతో సభను రంజింప చేశారు.
ప్రతి సం. కళాకారుల ప్రదర్శన ఏర్పాటు చేయడమే కాకుండా, ఆయా కళాకారులను సన్మానించి, నగదు బహుమతితో సత్కరిస్తారు కూడా. ఇదే నిజమైన విజయము. కళాకారులు కోరుకునేది గుర్తింపు. తమ కళకు శాశ్వతత్వం.
10. జానపద కళల అభివృద్ధితో పాటు లక్ష్యాలు ఏమిటి?
నా లక్ష్యం కనుమరుగవుతున్న కళారూపాలు కు జీవం పోయాలని, భావితరాలకు మన సంస్కృతిని అందించాలని, అవి బ్రతకాలని ఒక్కటే నా లక్ష్యం. అదే లక్ష్యంతో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి రాసిన తెలుగు వారి జానపద కళారూపాలు పుస్తకం చదివి ప్రభావితుడనయాను.
డా. బద్రికూర్మారావుగారి రచనలు:
ప్రచురించినవి:
ఉత్తరాంధ్ర జానపద కళలు (2005) అనే పుస్తకాన్ని,
కళింగాంధ్ర జానపద గేయాలు (2015)
జానపద కథలు (2023) రాసి ముద్రించాను. అవి నాకు ఎంతో గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
ఆముద్రితములు:
ఉపాధ్యాయునిగా ఎయిడ్స్ వ్యాధిపై ప్రచారం; లీడ్ ఇండియా కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా; ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల నివారణకు ప్రచారం; భారతీయ సంస్కృతి కళలు, సంప్రదాయాలను పాఠశాలల్లోనూ సమాజంలోనూ ప్రచారం చేయడంలోనూ ముందున్నారు.
వివిధ పత్రికలలో వ్యాసాలు:
ఉత్తరాంధ్ర, గోకుల ప్రభ, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రభూమి దినపత్రికలలోనూ; వాజమాయి; భక్తి టుడే; మన్నెం; సప్తగిరి; మన భూమి; మొదలగు మాస పత్రికలలో వ్యాసాలు ప్రచురింపబడ్డాయి.
రాష్ట్ర స్ఠాయి బహుమతులు: ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలోను 2008; ఆకివీడు పశ్చిమగోదావరి జిల్లా వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలోను; కళాదీపిక తిరుపతి వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలోను బహుమతులు పొందారు.
పాఠ్యాంశాలుగా డా. బద్రికూర్మారావుగారి రచనలు:
గిడుగు రామమూర్తి తెలుగు భాష మరియు జానపద కళపీఠం తరఫున ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించారు. తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణలో తెలుగు మాధ్యమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేటట్లు కృషి చేయగలరని విన్నవిస్తూ ప్రభుత్వ ప్రైవేటు బడులలో తెలుగు మాధ్యమాన్ని *కొనసాగించాలని* పరిపాలన వ్యవహారాలు తెలుగు భాషలోనే జరగాలని తెలుగేతర ప్రాంతాలలో తెలుగు బడులు నిర్వహణకు కృషి చేయాలని కోరారు.
11. ఏ ఏ ఊర్లు తిరిగారు? ఎన్నికళా రూపాలు తెలుసుకున్నారు?
నేను శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో జాడుపూడి, మందస మండలం రంగనాథపురం అల్లిమేరక, బైరి సారంగపురం, బహడపల్లి, సోంపేట మండలం పాలవలస, గిరిజన గ్రామాలు, పలాస నియోజకవర్గంలో రంగోయి, బొడ్డపాడు, పల్లి సారథి మొదలగు గ్రామాలను సందర్శించి అక్కడ కళాకారులతో సంభాషించి వివరాలు సేకరించాను. తరువాత నందిగాం, టెక్కలి, శ్రీకాకుళం దరి అంపోలు, ఒప్పంగి, కొత్తూరు మండలంలో కొన్ని గ్రామాలు తిరిగి కొంత సమాచారం సేకరించాను.
విజయనగరం జిల్లా – విజయనగరం లోని కళాకారులు, రామవరం, ఎస్.కోట దరి ధర్మవరం, గజపతినగరం దరి మెంటాడ, మరుపల్లి, డెంకాడ, భోగాపురం మొదలైన గ్రామాలు; ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, రావికమతం, చోడవరం, సబ్బవరం మొదలగు మండలాల్లో కొన్ని గ్రామాలు, పాడేరు, తగరపువలస మొదలు గ్రామాలు తిరిగి తోలుబొమ్మలాట, తప్పెటగుళ్ళు , జముకులపాట బుడగజంగాలు, గంగిరెద్దులు, దాసరులు, ఎరుకుల వంటి వృత్తి కళాకారులతో పాటు, రుంజ, చెక్కభజన, కోలాటం, బుర్రకథ, హరికథ, ఈటివిద్యలు మొదలగు 60 కళారూపాలను పరిశీలించి దాని సమాచారం సేకరించి, ‘ఉత్తరాంధ్ర జానపదకళ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించాను.
అదేవిధంగా ఆయా గ్రామాల్లో స్త్రీలు అనేక సందర్భాల్లో పాడుకునే జానపద గేయాలను, గైరమ్మ పాటలు సేకరించి ‘కళింగాంధ్ర జానపద గేయాలు’ పేరుతో మరో పుస్తకాన్ని వేశాను.
12. కళారూపాలకు ఎటువంటి అవసరాలు ఉంటాయి?
కళలు బ్రతకాలంటే ముఖ్యంగా జానపదులకు వాళ్లకి ప్రదర్శన అవకాశాలతో పాటు ఆదరణ ఉండాలి. ఆధునిక కాలంలో ఇది చాలా కష్టంతో కూడుకొన్న పని. అలాగే చదువుకున్న ప్రస్తుత తరం తల్లిదండ్రుల వృత్తిని వారసత్వంగా స్వీకరించడం లేదు.. చాలా కళలు కనుమరుగైపోతుండగా మరికొన్ని త్వరలో కనుమరుగైపోతాయి. కళను బ్రతికించాలంటే కళాకారులకు ఉపాధితో పాటు ప్రదర్శనను కల్పించి, వారి జీవనానికి కావలసిన ఉపాధిని అందించాలి. అదే విధంగా దేవాలయాలు వద్ద, పండుగల లోనూ ఈ సాంప్రదాయం కొనసాగినట్లు దేవాదాయ ధర్మాదాయశాఖ, సాంస్కృతిశాఖ తప్పనిసరిగా చూడాలి. దీంతోపాటు మన తెలుగుభాషను కూడా పరిరక్షించి ఈ సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నించితే మిగతా రాష్ట్రాలు కూడా ఆయా కళారూపాలను బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కొన్ని కళారూపాలు:
ఉత్తరాంధ్రుల పెద్ద ముత్తైదువు గైరమ్మ తల్లి పండుగ:
తెలంగాణలో బతుకమ్మ పండుగ ఏ విధంగా నవరాత్రులు చేస్తారో అదే విధంగా ఉత్తరాంధ్రలో పెద్ద ముత్తైదువు గైరమ్మ పండుగ, నందన్న ఉత్సవాలు ఆ విధంగా చేస్తారు. దీనికి సంబంధించి ప్రచారంలో గల ఎన్నో పాటలను మరుగున పడిన సాహిత్యాన్ని వెలికి తీసి యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందజేయడంలో ముందున్నారు. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యాన్ని కాపాడుకునే బాధ్యతను బాధ్యత గల పౌరునిగా తన భుజాల పైకెత్తుకున్నారు.
గైరమ్మ తల్లి నవరాత్రుల పాట
ఎంత చక్కని తల్లివే గౌరమ్మ
ఎంత చల్లని తల్లివే ఓ గౌరమ్మ
ఒక్కొక్క పోకందునా గౌరమ్మ
ఒక్కొక్క ఆకందునా గౌరమ్మ
కస్తూరి చలమందునా గౌరమ్మ
రాచబాటలందునా గౌరమ్మ
ఎంత చక్కని తల్లివే గౌరమ్మ
నిను చూసి మా యన్నలూ గౌరమ్మ
ఏడు మేడలెక్కిరి గౌరమ్మ
ఏడు మేడల మీదికి గౌరమ్మ
ఏడాదికొక దీపమూ గౌరమ్మ
తబుకుతో తబుకుడు గౌరమ్మ
ముత్యాలు తీసుకుని గౌరమ్మ
ఇమ్మడి కుచ్చులతో గౌరమ్మ
సొమ్ములతో వచ్చిరీ గౌరమ్మ
సొమ్ముల పెట్టుకుని గౌరమ్మ
ఇమ్ముగనూ వచ్చిరీ గౌరమ్మ
గుమ్మడి పూలన్నీ గౌరమ్మ
గుత్తుల కట్టుకనొచ్చే గౌరమ్మ
ఎంత చక్కని తల్లివే గౌరమ్మ
ఈడనే పెండ్లాడావే గౌరమ్మ
ఈడనే పసుపు పాడవే గౌరమ్మ
వాడవాడలాజనమూగౌరమ్మ వాలలాడింతురమ్మా గౌరమ్మ
ఎంత చక్కని తల్లివే గౌరమ్మ
స్త్రీలు కూడా ఎన్నో పాటలను గైరమ్మ తల్లి పండుగ వేళల్లో పాడుతూ ఉంటారు.
గుక్క తిప్పుకోకుండా వారు పాడే ఆ పాటలోని సాహిత్యాన్ని అందుకోవడం ఎంతో కష్టం ఎందుకంటే అది మౌఖికంగా వారు నేర్చుకొని తరతరాలుగా సాగుతున్న ఒక సంప్రదాయం.
జానపదులు వరి దుబ్బులు దేవతా మూర్తిగా కొలిచి మేళ తాళాలతో నృత్య గీతాలతో ఆనంద డోలికల్లో తేలియాడుతారు. ఈ కార్యక్రమాలను కన్నుల పండుగగా ఆస్వాదించి అక్షరబద్ధం చేయడానికి, కనులముందు ఆ కళారూపాలను ఉంచడానికి తపన పడుతూంటారు జానపద కళల పట్లా, సాహిత్యం పట్లా నిబద్ధత గలిగిన గురువుగా డా. కూర్మారావు మాస్టారు.
ఇవి మాత్రమే కాకుండా జాజవలు పాటలు, నందన్న జోల, భోగం పాటలు వీటిని కూడా సేకరించి భావితరాలకు అందించడానికి కృషి చేస్తున్నారు.
ఎన్నో పాటలు ఉన్న ఉత్తరాంధ్రలో పాడుకోవడం సాధారణం. అయితే బతుకుతెరువు కోసం ఉత్తరాంధ్ర నుండి వలస పోయినటువంటి శ్రీకాకుళం జిల్లా పలాస, సోంపేట, ఉద్దానవాసులు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ సంస్కృతిని కాపాడుకొస్తున్నారు కూడా. అక్కడ మనకి ఈ పండుగ పాటలు పాడే కళాకారులు ఉన్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే పధ్ధతిలో వారు పాడడం మనం విని, ఆస్వాదించవచ్చు.
దానిమీద ఒక చిన్న వీడియో బద్రి కూర్మారావుగారు తీశారు. వీరమ్మ అనగా గౌరీదేవి సాక్షాత్తు రైతుల పండించినటువంటి పంటలనే రైతులు గౌరీదేవిగా పూజిస్తారు ముఖ్యంగా వరి పండుతున్నటువంటి రోజుల్లో ఈ పండగ జరగడం ఎంతో ఆనందదాయకం. పండుగ పెట్టి, మేళ తాళాలతో తీసుకొచ్చి, గ్రామ ముఖ్య తాలూకా ఇంట్లో పెట్టి పూజిస్తారు. దాన్నే గౌరీదేవి, గౌరమ్మ, గైరమ్మగా భావిస్తారు నందన్నను కూడా తీసుకొస్తారు. మనకి ఆ నంది విగ్రహం దర్శనమిస్తుంది. కూడా దేవతలుగా భావించి పెడతారు పెట్టి పూజిస్తూ ఈ తొమ్మిది రోజులు రాత్రిపూట పాడుతుంటారు. అయితే ఈ గౌరమ్మను తెచ్చిన రోజు మొదటి రోజుగా ముఖ్యంగా జాతకులు లేదా జాజాలను పోస్తారు అనగా నవధాన్యాలు బొబ్బర్లు, అలాగే చోడి, గంటి, బుట్టలో మట్టి వేసి ఆ జాజాలను పోస్తారు. అనగా వరి పంటతో పాటు ఈ జాజాలనుగా చిరుధాన్యాలు కూడా పండాలి. పంట బాగా పండాలి. వర్షాలు బాగా కురవాలని భావించినటువంటి ఆశీర్వదించండి అని దేవతలను కోరుతారు. గైరామమను, ఈశ్వరుని నందన్నపై ఊరేగిస్తారు.
సికోలు చరిత్ర పాటల రూపంలో జానపదంలో వెల్లివిరిసింది. చరిత్ర మసకబారి పోకుండా దానిని కాపాడుకునే బాధ్యత ప్రజల పైన ఉన్నది. వీర గున్నమ్మ చరిత్ర వారు పాడుతుంటే వినే వారి ఒళ్ళు పులకరిస్తుంది. కూర్పు నేర్పు ఆ పదాలు అమరిక, గాన చాతుర్యం, భావయుక్తంగా, చారిత్రక సామాజిక వంశాల వర్ణన అద్భుతంగా చేశారు.
సపరభాషలో పెళ్లి పాటలను పాడే శాంతమ్మ గారి ఇంటికి వెళ్లి రికార్డు చేశారు. వాటికి శాశ్వతత్వాన్ని కల్పించారు. గారాబంగా పెంచిన కూతురిని పెళ్లి అయిన తర్వాత అత్తవారింటికి పంపేటప్పుడు ఎంత బాధగా అంపకం పెడతారు అన్నది ఆమె కంఠంలో చక్కగా ప్రతిఫలించింది. ఆమె చాలా చిన్నప్పటినుండి ఈ పాటలన్నీ నేర్చుకుంటూ పెరిగింది.
విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం జాతరలో ప్రదర్శించిన జానపద కళలను ఒకే చోట మనం చూసేందుకు వీలుగా యూట్యూబ్‌లో పెట్టారు. ఇందులో తూర్పు భాగవతం, పులి వేషాలు, బుర్రకథ, తప్పేటగుళ్ళు, గరగలు, బిందెల డాన్స్, కోలాటం, తీన్మార్, కేరళ చెండా వాయిద్యాలు, సింహాద్రి అప్పన్న సేవ, గరిడి, థింసా మొదలగు కళారూపాల ప్రదర్శనలు చూడవచ్చును యూట్యూబ్‌లో.
కళారూపాల ద్వారా సామాజిక చైతన్యం
గత రెండు వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి కళ అంజాత పాటలు. భాషా ప్రపంచంలో చాలామందికి దీని గురించి తెలియదు. ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాలోని కొణిసి గ్రామంలో నిరక్షరాస్యులు అయిన మారుమూల పల్లెలో ఆ యువకులు పాడే అంజాట పాటలు. దీనిని వెలుగులోకి తీసుకొని రావటానికి కుర్మారావుగారు తన సంస్థద్వారా వారికి ఆ కళారూపాన్ని కళాకారులు పాడుతుండగా వీడియోలు తీయించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ కళాకారులు రామాయణ భారత భాగవత కథలను ఈ అంజాట కళారూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు.కంచిలి కవిటి ఇచ్చాపురం మొదలైన మండలాలలో ఉంది. గ్రామదేవతల పండుగలోనూ జాతరలలోనూ వివాహాది ఉత్సవాల సమయాలలోనూ ఈ కళారూపం ప్రదర్శించబడుతోంది.
ఆధునికత వేళ్లూనుకుంటున్న ఇటువంటి సమయంలో ఈ కళకూడా మరుగున పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వీడియోలు సినిమాలు మొదలైన సాంకేతికతతో కూడిన కళారూపాలు ఆధునిక కళారూపాలు రావడం వలన వీటికి ప్రాముఖ్యత తగ్గుతుంది. మామిడి జగ్గారావు గారు వీరందరినీ ఏకీకృతం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా మెంటాడ లో 2008లో జానపద పాటలపోటీలు మహిళల పాడిన పాటలు రికార్డ్ చేయడం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘అరకు చలి‘ అనే కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిపినప్పుడు విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలకు మాత్రమే ప్రత్యేకమైన ఈ చెక్కభజన గురువైన చిన్నరెడ్డి; తవిటినాయుడు; రైతు బిడ్డలు నిరక్షరాస్యులు అయినా సుమారు 20 మంది పైగా కళాకారులను తీర్చిదిద్ది కార్యక్రమమును డాక్టర్ శంకర్రావు గారు, డాక్టర్ బద్రి కుర్మా రావు గారి ఆధ్వర్యంలో ఆ వేదిక పైన ప్రదర్శించడం జరిగినది.
డా. కూర్మారావుగారి కృషికి ఫలితం:
ఉత్తరాంధ్రకు చెందిన వివిధ కళలకు చెందిన కళాకారుల వివరాలు వారి వయస్సులు చిరునామాలు సేకరణ చేశారు. అందులో కొందరివి సరళ చిన్నరెడ్డి సీనియర్ కళాకారుల టీం లీడర్ వయసు 70 తాటితూరు గ్రామం భీమిలి మండలం విశాఖ జిల్లా ఎనగాడ ప్రకాశం సీనియర్ జముకుల కళాకారులు వయసు 60 బంగారు వలస గ్రామం వంగర మండలం విజయనగరం జిల్లా మిరియాల జగన్ సీనియర్ జముకుల కళాకారులు వయసు 55 బంగారు వలస గ్రామం వంగర మండలం విజయనగరం జిల్లా సీనియర్ జముకుల కళాకారులు వయసు 43 బంగారు వలస గ్రామం వంగర మండలం విజయనగరం జిల్లా చొప్పల్లి పద్మావతి సీనియర్ గాయని మనీ వయసు 50 శ్రీనివాస నగర్ సింహాచలం విశాఖ జిల్లా మొదలైనవి
వివరాలు ఫోన్ నెంబర్‌తో పాటు తన దగ్గర ఉండడం వలన వారి అత్యవసర పరిస్థితికి స్పందించగలుగుతారు. రెండూ ఎక్కడ ఏ రకమైన ప్రదర్శన కావాలన్నా ఆయా వ్యక్తులను అవసరమైన చోటికి పంపించగలుగుతారు.
ఉదాహరణకు ఇటీవల హైదరాబాదులో నవంబరు 21 నుంచి 24 వరకు హైదరాబాదులో నిర్వహిస్తున్న భారత లార్జెస్ట్ కల్చరల్ ఫెస్టివల్ 2024 కార్యక్రమంలో కోమటిపల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి శంకరరావు బృందం తూర్పు భాగవత ప్రదర్శనకు, మిరియాల జగన్ బృందం జముకుల పాటకు అవకాశం దక్కింది.
హైదరాబాదులో శిల్పారామంలో జరిగిన ‘లోకమంచ్’ కార్యక్రమంలో సంస్కార భారతి తరఫున ఉత్తరాంధ్ర జానపద కళాకారుల ప్రదర్శన ఇప్పించారు. హైదరాబాదు నుండి అరకు ఉత్సవాలలో కూడా జముకుల పాట, చెక్కభజన, కళాకారుల ప్రదర్శనకు అవకాశం రావడంతో రెండు రోజులు ఆ బృందాలతో అరకులో ప్రదర్శన ఇప్పించారు. అరకు నుండి మధ్యప్రదేశ్ భూపాలులో జరిగిన ‘ఇందిరాగాంధీ మానవ సంగ్రహాలయ’ వార్షికోత్సవానికి విజయనగరం జిల్లా నుండి చెక్కభజన కళాకారులను తీసుకొని వెళ్లారు. భూపాల్ నుండి ఈ బృందమే మలేషియాలో తెలుగు వారి కోసం చెక్కభజన కార్యక్రమం నేర్పేందుకు వెళ్ళారు. వారు నెల రోజులు అక్కడ ఉండి వాళ్లకు శిక్షణ ఇచ్చి వస్తారు. వీరి యొక్క శిక్షణ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో గల తెలుగువారిని ఆకర్షించి ఉత్తరాంధ్ర కళా కారుల యొక్క గొప్పదనాన్ని చాటింది. ఉత్తరాంధ్రుల కళారూపం ఎల్లలు దాటి వెళ్ళడం కళను సజీవంగా నిలిపే అవకాశాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన తన కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతర్జాతీయ స్థాయిలో విజయపతాకాన్ని ఎగురవేసిన ఉత్తరాంధ్ర జానపద గురువులకు ఆత్మీయ సత్కారం గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం ఆధ్వర్యంలో శ్రీ గురజాడ అప్పారావు గారి స్వగృహంలో అద్భుతంగా జరిగింది.
వివిధ దేశాలలో జానపద కళారూపాలకు ప్రాచుర్యాన్ని కల్పించిన జానపద కళాకారులను ఘనంగా సత్కరించుకున్నారు.
శ్రీ మత్స తవిటి నాయుడు గారు మలేషియాలో చెక్కభజన శిక్షణా గురువుగా వెళ్లారు.
శ్రీ బర్మా నాయుడు గారు బర్మాలో తెలుగు భాషా బోధన గావించారు.
శ్రీ నీలబోని సత్యం గారు జపాన్ సాంస్కృతిక వేదికపై తప్పెటగుళ్ల ప్రదర్శన చేశారు.
శ్రీ డి.వి.వి. జగన్నాథం పంతులుగారు కన్నడ జానపద సాహిత్య పరిషత్ అవార్డు గ్రహీతగా బెంగళూరులో తూర్పు భాగవతం ప్రదర్శన చేశారు.
శ్రీ బొంతల కోటి శంకరరావు గారు జాతీయ స్థాయిలో తూర్పు భాగవతం ప్రదర్శన మరియు సన్మాన గ్రహీత
శ్రీమతి కొచ్చర్ల అంజలి భాగవతార్ మరియు శ్రీమతి కొచ్చర్ల లక్ష్మీ భాగవతార్ జాతీయ స్థాయిలో తూర్పు భాగవత ప్రదర్శన మరియు సన్మాన గ్రహీత
శ్రీ కంది సాయి కుమార్ గారు మలేషియాలో కోలాటం ప్రదర్శన నేర్పిన గురువు
మలేషియాలో తెలుగు వారికి చెక్కభజన నేర్పడానికి వెళ్ళిన గురువులు
ముగింపు కాదు కూర్మారావుగారి అభ్యర్ధన::
గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులైన డా. బద్రి కుర్మారావు గారు జానపద కళల పరిరక్షణకు చేస్తున్న కృషికి ప్రభుత్వ సహకారము కూడా ఉండినట్లయితే ఈ కళల పట్ల యువత ఆకర్షించబడి, దీని యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతి సంప్రదాయం, భారతీయ వైద్యము, జానపదకళల ద్వారా తెలుసుకోగలరని అందుకు ప్రభుత్వ సహాయ సహకారములు కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గల ముఖ్యమైన ఆలయాలలో ఒక్కొక్క ఆలయము ఒక్కొక్క జానపద కళను, ఆ కళాకారులను దత్తత తీసుకొని వారి జీవనోపాధికి చూసుకోనవసరం లేకుండా కళ కోసమే బ్రతికేటట్లుగా ప్రోత్సాహం అందించినట్లయితే కళాకారులు ఈ కళలను ముందు తరాలకు పదిలంగా అందజేయగలుగుతారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచి’ అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం, ‘లేతమనసులు’ కథాసంపుటి వెలువరించారు.
