[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల డా. పొన్నపల్లి విశ్వనారాయణకృష్ణగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]
“జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం – నాటకానికి ప్రతిస్పందించేది జీవితం”
ప్రార్థనా గీతం:
‘పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ – – శ్రీ చందాల కేశవదాసుగారు
చాలాకాలం తరువాత చారిత్రక నాటకరంగానికి వెలుగుదారులు చూపుతూ జనాలను నాటకం చూసేందుకు రంగస్థలం వైపు ఆకర్షిస్తున్న ‘జయహో ఛత్రపతి శివాజీ!’ తెలుగు రాష్ట్రాలలోనే కాక జాతీయస్థాయిలో ఉత్తమంగా నిలిచింది. దీని విజయం వెనుక ఒక వ్యక్తి నిర్విరామకృషితో పాటు 500 మంది కళాకారులు, కుటుంబము, ప్రజలు, ముఖ్యంగా యువత అతని వెన్నంటి ఉన్నారు. అతడే ఈనాటి మన వందే గురుపరంపరామ్ గురువుగా పరిచయమవుతున్న డా. పొన్నపల్లి విశ్వనారాయణకృష్ణగారు. వారి గురించి వివరంగా తెలుసుకుందాము.
డా. పొన్నపల్లి విశ్వనారాయణకృష్ణ
డాక్టర్ పి.వి.ఎన్.కృష్ణ థియేటర్ ఆర్టిస్ట్. రచయిత. దర్శకులు. నటులు. పద్య రచయిత. సంగీత దర్శకులు. నిర్మాత. సామాజిక సోషల్ యాక్టివిస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే పద్య నాటక విభాగంలో రచయితగా, దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నుండి 14 నంది అవార్డులను అందుకున్నారు. నిఘా విభాగంలో (ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్) పనిచేసి, కేంద్రప్రభుత్వం నుంచి మెరిటోరియస్ సర్వీసుకు ఇచ్చే అత్యున్నత పతకం ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (IPM) కూడా స్వీకరించారు. మానవత్వము, సేవాభావం, యువతను ప్రోత్సహించడం కలగలిపిన మూర్తి శ్రీ పొన్నపల్లి విశ్వనారాయణకృష్ణగారు.
కృష్ణ గారు ప్రకృతి అందాలకు, ప్రఖ్యాత పండితులకు నిలయమైన కోనసీమలో విలసవిల్లి గ్రామంలో కీర్తిశేషులు పొన్నపల్లి విశ్వనాథం శ్రీమతి నారాయణమ్మ దంపతుల ఆరుగురి సంతానంలో కనిష్ట పుత్రునిగా 11వ తేది నవంబరు నెల 1962లో జన్మించారు.
డా. పి.వి.ఎన్.కృష్ణగారి తల్లిదండ్రులు
తండ్రి శ్రీ విశ్వనాధంగారు పండితులు. పురాణవేత్త. చిన్ననాటి నుండి ఆయన దగ్గర కూర్చుని భాగవతం, భారతం మొదలైన గ్రంథాలు వింటూ, చదువుతూ ఉండడం వలన పద్యం పట్ల, తెలుగు భాష పట్ల మక్కువ ఏర్పడింది.
ప్రాథమిక విద్య విలసవిల్లి గ్రామం. ఎలిమెంటరీ స్కూలులో నాలుగవ తరగతిలోనే తండ్రిగారి గురుత్వంలో ‘భక్త ప్రహ్లాద’ హరికథ చెప్పి ప్రథమ బహుమతి గ్రహించడం జరిగింది. 1970వ సం. అంటే 8 సంవత్సరముల వయసు నుండి నాటకరంగం లోనికి ప్రవేశించారు. రచయితగా, దర్శకునిగా 42 సంవత్సరాల అనుభవం సంపాదించారు.
ఎస్.ఎస్.ఆర్.జిల్లాపరిషత్ హైస్కూల్ భీమనపల్లిలో చదువుతుండగా కీర్తిశేషులు శ్రీ కూచిభట్ల సత్యనారాయణగారు అనే డ్రాయింగ్ మాస్టారు మొట్టమొదటిసారిగా ‘అశ్వత్థామ’ ఏకపాత్రను అభినయించడం నేర్పారు.
అది తూర్పుగోదావరి జిల్లాపరిషత్తు నిర్వహించిన ‘సాంగ్ అండ్ డ్రామా’ కాంపిటేషన్ లో ప్రథమస్థానం సంపాదించి పెట్టింది. అశ్వత్థామ ఏకపాత్రతో రాష్ట్రస్థాయి బహుమతులను అందుకోవడం ద్వారా పువ్వు పుట్టినతోడనే పరిమళించును అనే నానుడికి సార్థకత ఏర్పడింది. నాటి నుండి నేటి వరకు కళారంగంలో ఆయనే కృష్ణగారికి గురువు. కళాకారునిగా రూపుదిద్దుకొని అన్నగారైన ప్రసాద్ గారితో కలిసి చిన్నచిన్న నాటికలు, ఏకపాత్రలు వేయడం జరిగింది.
తర్వాత 20వ సం.లోనే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉద్యోగం సంపాదించుకుని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. కృష్ణగారికి తెలుగుభాషపట్ల గల మక్కువతో ఆంధ్ర యూనివర్సిటీ నుండి తెలుగులో ఎం.ఏ. చేయడం జరిగింది. ఉద్యోగం చేస్తూనే తన విద్యార్హతలు పెంచుకున్నారు. డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
గౌరవ డాక్టరేట్
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ సంస్థ వారు కళారంగం ద్వారా పొన్నపల్లి విశ్వ నారాయణకృష్ణగారు చేస్తున్న సమాజ చైతన్యానికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ – డాక్టరేట్ ఇన్ ఇండైజినెస్ ఆర్ట్స్ – ప్రదానం చేశారు. అదే సమయంలో ఈ పురస్కారాన్ని జూన్ 28న 2014 లో బెంగళూరులో విశ్రాంత పోలీస్ కమిషనర్ పాండ్లీయాన అందజేశారు.
తొలి రోజులలో..
విజయవాడలో ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతాల్లో అజిత్‌సింగ్ నగర్ ఒకటి. 2006లో స్థానిక రైలుకట్ట ప్రాంతంలో ఓ యువకుడు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వృత్తిరీత్యా పోలీసు కానిస్టేబుల్ ఇంటి చుట్టుపక్కలవారిని మంచిమార్గంలోకి తీసుకువచ్చే పని ప్రారంభించారు. పిల్లలు చేస్తున్న పనులు తప్పని వారించే వాళ్ళు లేరు అనే విషయాన్ని గ్రహించారు. మార్చాల్సింది వృక్షాన్ని కాదు లేత మొక్కల్ని అని నిర్ణయించుకున్నారు. తన ఇంటిని ఈ ఉద్యమానికి కేంద్రంగా మార్చారు. పేద కుటుంబాల పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పడం ప్రారంభించారు. ఆరుగురితో మొదలుపెట్టి ఇప్పుడు ఏటా 150 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్తున్నారు. రెండు అంతస్తుల ఇల్లు ఇప్పుడు విద్యాలయంగా మారింది.
వ్యక్తిగతంగా అడిగిన వివరాలు ఇలా చెప్పారు.
“మా మేనమామ బ్రహ్మశ్రీ ఆకొండి వెంకటశాస్త్రిగారు అత్తయ్య శ్రీమతి పాంచాల వెంకటరమణమ్మగారు. కాకినాడ వాస్తవ్యులు. వారి అమ్మాయి శేషసాయి. చిన్నతనం నుండి బంధువులందరూ మేమిద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టుగానే భావించేవారు. అదే విధంగా మేనమామగారి అమ్మాయినే వివాహం చేసుకున్నాను. ఆమె సహకారం నా జీవితంలో మరువలేనిది. అన్నిటికీ మించి నా తల్లిదండ్రులకు ఆమె చేసిన సేవ నిరూపమానమైనది. ఇద్దరూ ఆమె చేతిలోనే పరమపదించారు.” అని చెప్పారు.
ప్రవృత్తి:
కృష్ణగారి జీవితంలో ముందుగా అభినయం, నాటక రంగం ప్రవేశించాయి. అది అన్ని కళలలాంటిది కాదు. నాటక రంగం అనేక కళల సమాహారము. ఇందులో నటులు నిరంతరకృషితో, చక్కగా రిహార్సలు చేసి, నటిస్తే సరిపోదు. రచన, సంభాషణలు, దర్శకుని ప్రతిభ, మేకప్, రంగస్థల అలంకరణ, సహ నటీనటులు, వాద్యబృందం ముఖ్యంగా చూసేందుకు రస హృదయం గల ప్రేక్షకులు ఇవన్ని అవసరము. నాటకాలే శ్వాసగా పెరిగిన కృష్ణగారిలో పాఠశాల స్థాయి నుంచి నాటకాలు అంటే ఇష్టం పెద్దయ్యాక రంగస్థలం మీద మరింత మమకారం పెరిగింది. ఉద్యోగం చేస్తూనే విజయవాడ కేంద్రంగా పనిచేసే సాయిబాబా నాట్యమండలిలో చేరి నాటకాలు వేయడం ప్రారంభించారు. రచన, దర్శకత్వం పైన నైపుణ్యం సాధించారు.
వృత్తి విషయానికి వస్తే పోలీస్ ఉద్యోగం, అందులో ఇంటెలిజెన్స్ నిఘా విభాగం అంటే కత్తిమీద సాము చేయడం వంటిదే!
వృత్తి ప్రవృత్తుల మధ్య సమన్వయం రెండూ కూడా ఎంతో కష్టమైనవి అయినప్పటికీ ఉద్యోగరంగం, నాటక రంగం రెండు కళ్ళు లాగా భావించారు. పెద్దలు అంటారు ‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అని. తాను వేసే చారిత్రక నాటకాల్లో రాజుల చెంత జుల్ఫికర్ లాంటి కత్తులు వారికి పరిచయమే!
ఒకపక్క ఇంటెలిజెన్స్ ఆఫీసరుగా చాలా బాధ్యతతో కూడిన ఉద్యోగం చేసుకుంటూ, మరియొకపక్క కళారంగాన్ని కొనసాగించడం ఇబ్బంది అయినా కష్టపడి పని చెయ్యడాన్ని ఇష్టంగా భావిస్తే అది పెద్ద విషయం కాదనిపించింది. డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ పద్య నాటకాలు ఇప్పటివరకు రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయస్థాయిలో కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. బహుమతులు సత్కారాలతో పాటు రాష్ట్రప్రభుత్వం నుంచి అప్పటికి 12 నంది అవార్డులు అందుకున్నారు.
వారికి పద్య నాటకం ఎంత ఇష్టమో, నిఘా విభాగంలో (ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్) పనిచేయడం కూడా అంతే ఇష్టం. ఇందులో ఏ విధంగా రాణించారో ఉద్యోగంలో కూడా అదే విధంగా రాణించారు.
వృత్తిపరమైన విజయాలు
వృత్తిలోనూ ప్రతిభను ప్రదర్శించి ఇప్పటికీ 60 సార్లు నగదు పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ సేవాపతకం అందుకున్నారు. సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, మహోన్నత సేవాపతకం రాష్ట్రప్రభుత్వం నుండి తీసుకోవడమే కాక గత ఏడాది గణతంత్రదినోత్సవ సందర్భంగా కేంద్రప్రభుత్వం నుంచి మెరిటోరియస్ సర్వీసుకు ఇచ్చే అత్యున్నత పతకం ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) కూడా స్వీకరించడం జరిగింది.
పోలీసు శాఖలో ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా సేవలు అందించి 30 నవంబరు 2024న పదవీ విరమణ చేశారు.
డా.పి.వి.ఎన్.కృష్ణ “ఈ ఘనత నా ఒక్కడిదే కాదు నా భార్య శేషసాయి; మిత్రుడు గిరీంద్రనాథ్ అందిస్తున్న సహకారం వలన ఇన్ని పనులు చేయగలుగుతున్నాను. విజయాలన్నిటిలో వారందరి పాత్ర ఎంతో ఉంది. సంఘం నుంచి తీసుకోవడం మాత్రమే కాదు తిరిగి సంఘానికి ఇవ్వాలి అనేదే నా నినాదం” అంటారు.
ముఖ్యంగా మన భారతదేశంలోనూ తెలుగునాట ఎందరో మహనీయులు, చారిత్రక పురుషులు ఉన్నప్పటికీ వాళ్ళకి రావలసినంత ప్రాచుర్యం రాలేదు. ఆ లోటు పూరించడానికి చేసే ప్రయత్నంగా శ్రీ ఖడ్గతిక్కన, పృథ్వీరాజు రాసో, శ్రీ మాధవవర్మ, జయహో! శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, ఆంధ్ర మహావిష్ణు మొదలైన చారిత్రాత్మక పద్యనాటకాలను రచించి, దర్శకత్వం వహించి, ప్రదర్శించడం జరిగింది.
ఎక్కువమందితో నాటకాలు చేసేటప్పుడు నాటకానికి నాటకానికి మధ్యలో కొంతమంది వారికుండే వ్యక్తిగత కారణాలవల్ల మానేయడం జరుగుతుంది. ఆ పాత్రలను ఎప్పటికప్పుడు మళ్ళా వేరే వాళ్ళ చేత భర్తీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్నపని. అందుచేతనే చాలామంది నలుగురైదుగురితో నాటకాన్ని పూర్తిచేసి ‘మమ’ అనిపిస్తున్నారు. అయితే ఇక్కడ వీరి ఉద్దేశం ఎక్కువమందికి నాటకకళను పరిచయం చేయడం, ఎక్కువమంది యువతను పద్యనాటకం వైపు మరలించి ఈ కళను అంతరించిపోకుండా వ్యాప్తి చేయడం. కాబట్టి ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఎక్కువమంది యువతకు పద్య నాటకం నేర్పించడం జరుగుతున్నది.
డా.పి.వి.ఎన్.కృష్ణగారి రచనలు-పద్య నాటకములు
సరస్వతీదేవి అనుగ్రహంతో మొదటి పద్యనాటకం ఉషా పరిణయం 1995లో శ్రీకారం చుట్టగా శ్రీ ఖడ్గతిక్కన 2005 ప్రథమ స్వాతంత్ర్య మహాసంగ్రామం -1857- 2007 విధి వ్రాత-2010 శ్రీ మాధవవర్మ-2011 ‘మాతృశ్రీ’ తరిగొండ వెంగమాంబ-2012 అసలీ జిహాద్-2012 పృథ్వీరాజ్ రాసో-2013 ఇది కొత్త కథ-2013 కృష్ణవేణీయం -2016 ఆంధ్ర మహావిష్ణు- 2017 విజ్ఞాన భారతం-2019 స్వాతంత్ర సంగ్రామం పార్ట్ వన్-2022 స్వాతంత్ర సంగ్రామం పార్ట్ టు-2022 మంచి గుణపాఠం-2022 జయహో! శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్-2023 ఈ 15 నాటకాలు ఇవి కాకుండా ‘జీవనసత్యాలు’ అనే శతకం ‘ఆత్మ నివేదన’ అనే ఖండకావ్యం వ్రాసారు. వ్రాస్తూనే ఉంటారు. అక్షర స్వరూపమైన అమ్మవారి అనుగ్రహం పొందినవారు.
ఏ రచయిత అయినా ఏ కళాకారుడు అయినా కోరుకునేది తన రచనల, తన ప్రదర్శనల విశ్లేషణ అది కోరుకున్నవారు తప్పక ఉన్నత స్థాయిని పొందుతారు.
నాటకానికి కొత్త ఊపిరి నాటకాల విశ్లేషణ
ఉషా పరిణయం
ఉషా పరిణయం 1995లో రాసి ప్రదర్శించారు. 2010 కర్నూలు జిల్లా నంద్యాలలో టౌన్ హాల్‌లో జరిగిన నంది నాటకోత్సవ పోటీలలో ఉషా పరిణయం పద్య నాటకం రచన దర్శకత్వంకి డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణగారికి తామ్ర నంది లభించింది. అదే విధంగా తృతీయ ఉత్తమ ప్రదర్శన విభాగంలో కూడా నంది బహుమతి లభించింది. ముఖ్యమంత్రి నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ‘నంది’ బహుమతి అందుకున్నారు. ఈరోజు నవ యువత చేతులలో కొత్తగా రూపుదిద్దుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నది.
శ్రీ ఖడ్గతిక్కన నాటకం 2006 సం.లో వ్రాసి, రాజమండ్రిలో నంది నాటకోత్సవంలో ప్రదర్శించినప్పుడు ఆ నాటకానికి బహుమతి రాలేదు. ప్రజలందరూ ముక్తకంఠంతో ఆ నాటకానికి ప్రథమ బహుమతి రావాలి అని గట్టిగా నినాదాలు చేసినప్పుడు, అక్కడ జడ్జిలలో ఒకరైన శ్రీ గుమ్మడి గోపాలకృష్ణగారు ప్రజాభీష్టాన్ని మన్నించి అప్పటికప్పుడు “పి.వి.ఎన్ కృష్ణగారులాంటి గొప్పనటుడికి నంది ఇవ్వలేకపోవడం బాధాకరమే కాబట్టి ఆయనకు వ్యక్తిగతంగా ఐదువేల రూపాయలు ఇస్తున్నాను” అని ప్రకటించడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు “రచన, దర్శకత్వం, నటన మొదలైన ప్రతి విషయంలోనూ మీరు పోటీలో ఉన్నారు కానీ మీకంటే కొంచెం ఎక్కువగా వేరే వ్యక్తులు చేయడం వల్ల వాళ్లకి ఇవ్వడం జరిగింది.” అని చెప్పారు.
దానితో ఎవరికీ అందనంత ఎత్తులో నాటకాన్ని చేయాలి అని నిర్ణయించుకున్నారు.
తరువాత 2009 భక్త రామదాసు కళాక్షేత్రం ఖమ్మంలో జరిగిన నంది నాటకోత్సవ పోటీలలో ఖడ్గతిక్కన ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకుగాను మరియు ప్రథమ ఉత్తమ పద్య నాటక రచయితగా రచన, దర్శకత్వం శ్రీ పివిఎన్ కృష్ణగారికి నంది బహుమతి లభించింది. ముఖ్యమంత్రి రోశయ్యగారి చేతుల మీదుగా అందుకున్నారు.
26-07-2025 అభినయ ఆర్ట్స్ – హనుమ అవార్డ్స్ – తిరుపతి 2025
అభినయ ఆర్ట్స్ నిర్వహించిన 25 వ జాతీయస్థాయి పద్యనాటకములు, సాంఘీకనాటికలు, కూచిపూడి, భరత నాట్య మరియు జానపద సోలో నృత్య పోటీలలో విభాగాలలో 25-07-2025 మహతి ఆడిటోరియం తిరుపతిలో ప్రదర్శించిన “శ్రీ ఖడ్గతిక్కన” పద్య నాటకానికి ద్వితీయ ఉత్తమ ప్రదర్శన; ఉత్తమ దర్శకత్వం: డా.పి.వి.ఎన్.కృష్ణ ; ఉత్తమ రంగాలంకరణ; శ్రీ ఎస్. వెంకటరామరాజు, శ్రీ సతీష్ ; ఉత్తమ హాస్యనటుడు: శ్రీ ఎస్. వెంకటేశ్వరరావు గారు (భట్టు పాత్ర దారి); జూరీ బహుమతి నటి: కుమారి జి.ఎన్.డి. కుసుమసాయి (కుందమ దేవి పాత్ర ) మొత్తం 5 అవార్డ్స్ రావటం జరిగింది.
25-07-2025 న మహతి స్టేడియం తిరుపతిలో జాతీయ పద్య నాటకాల పోటీలో పివిఎన్ కృష్ణ గారి ఖడ్గతిక్కన పద్యనాటకం ఐదు బహుమతులు గెలుచుకున్నది
నాటకపోటీలను అత్యద్భుతంగా నిర్వహించిన శ్రీ బి.యన్.రెడ్డిగారి నేతృత్వంలోని అభినయ ఆర్ట్స్ కార్యకర్తలకు; డా. పి.వి.ఎన్.కృష్ణ గారి దర్శకత్వంలో ప్రదర్శించిన టీం సభ్యులందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.
‘ప్రథమ స్వాతంత్ర్య మహాసంగ్రామం 1857’ – శ్రీ సాయిబాబా నాట్యమండలి ద్వారా 2008వ సం.లో ఈ నాటకాన్ని 60 మంది కళాకారులతో పద్య నాటకంగా తయారుచేసి, ప్రదర్శించగా అద్భుతమైన విజయం లభించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి చేతులు మీదుగా బంగారునందితో పాటు ఆరు ‘నంది’ అవార్డులను అందుకున్నారు. మొట్టమొదటిసారి ప్రథమ బహుమతి, బంగారునంది వచ్చినప్పుడు అందరూ పొందిన ఆనందం మరువలేనిది. ఇంతవరకు పద్య నాటక రంగంలో ఒక నాటకానికి వచ్చిన అత్యధిక నందులు ఇవే!. నాటకరంగంలో అతి ఎక్కువ మందితో పద్య నాటకాలు చేసిన అనుభవం ఉన్నవాళ్లు చాలా తక్కువ.
దీని నేపథ్యం ఇలా ఉంది.
ప్రథమ స్వాతంత్ర్య మహాసంగ్రామం నాటకం కృష్ణగారు రాసిన నాటకాలన్నీ ఇష్టంతోనే రాశారు. కానీ ప్రథమ స్వాతంత్ర్య మహాసంగ్రామం 1857 నాటకం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాయడం జరిగింది. సంస్కారభారతిని కృష్ణ గారికి పరిచయం చేసిన మిత్రుడు శ్రీ అల్లు రాంబాబుగారు మరియు శ్రీ దుర్భ శ్రీనివాస్ గారు వచ్చి ‘సిపాయిల తిరుగుబాటు జరిగి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా 2007వ సంవత్సరంలో ఆ చరిత్రకు సంబంధించి నాటకం వ్రాయమ’ని అడగడం జరిగింది. అప్పటివరకు మోడరన్ హిస్టరీ మీద పద్య నాటకాలు అంతగా లేవు. దానిని రాయగలనా? అని కృష్ణగారు సందేహిస్తే రాంబాబుగారు ఆ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలు తెచ్చి ముఖ్యంగా వీర సావర్కర్ రాసిన పుస్తకం ఇచ్చి మీరే రాయగలరు అని వెంటపడి ప్రోత్సహించి, ఆ నాటకం రాయించడం జరిగింది. అందువలన ఇప్పటికీ ఆ నాటకం కృష్ణగారికి అత్యంత ప్రత్యేకమైనది. తాను స్వయంగా ఎంతో ఇష్టంగా రాసినది.
‘విధివ్రాత’ నాటకము 2010లో వ్రాసారు. ఆంధ్రప్రదేశ్ భాష సాంస్కృతికశాఖవారు గత జనవరిలో ప్రతిష్ఠాత్మకంగా జాతీయ అంతర్జాతీయస్థాయిలో నాటక పోటీలు నిర్వహించారు. దేశ విదేశాల్లోని అనేక తెలుగు రచయితలు పాల్గొన్నారు. మొత్తం 150 నాటకాలు పోటీ పడగా, వాటిలో నారాయణకృష్ణ రచించిన పద్య నాటకం విధివ్రాతకు ప్రథమ బహుమతి లభించింది. లక్ష రూపాయల నగదు బహుమతిని అందుకున్నది.
శ్రీ మాధవవర్మ నాటకము 2011లో బెజవాడ కనకదుర్గ అమ్మవారి చరిత్ర. దేవీభాగవతంలో గాని, లలితా సహస్రంలో గాని అమ్మవారు కేవలం దుర్గాదేవిగానే సంబోధించబడ్డారు. కానీ ఒక్క బెజవాడదుర్గ మాత్రమే కనకదుర్గ. అమ్మవారికి ఈ కనకదుర్గ అనే పేరు రావడానికి కారణం విష్ణుకుండినరాజు శ్రీ మాధవవర్మ. అమ్మవారి దయతో ఆ నాటకాన్ని రాయడం జరిగింది.
ధర్మం గురించి చెప్పిన శ్రీ మాధవవర్మ నాటకం గురించి ఇలా రాశారు “విష్ణుకుండిన సామ్రాజ్యాన్ని విజయవాడ రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న మహారాజు రెండవ మాధవవర్మ పరిపాలించిన రోజుల్లో అతని కుమారుడు విక్రమేంద్రవర్మకు చెందిన గుర్రం కిందపడి ఓ బాలుడు మరణించడం, దీనిపై బాలుని తల్లి రాజుకు ఫిర్యాదు చేయడం, ధర్మం కోసం మహారాజు తన కుమారునికి మరణశిక్ష వేయడం, కుమారుని కోరిక మేరకు అమ్మవారి ముందు శిరచ్ఛేదన చేయగా, అతని సత్యపాలనకు, నిజాయితీకి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమవడం, రాజకుమారుడుని తిరిగి బ్రతికించి, తద్వారా నగరంలో బంగారు కాసుల వర్షం కురిపించగా, దుర్గమ్మకు కనకదుర్గ పేరు స్థిరపడింది.
గీ.
శాలివాహన సుశక వర్షముల సంఖ్య
యరయ నే నూట పదనాలుగైన నాడు
ధర్మ నియతికి మాధవవర్మ మెచ్చి
కనకవర్షంబుఁ గురియించెఁ గనకదుర్గ//
ఈ పద్యం విజయవాడ నగర ప్రవేశద్వారంపై ఉంటుంది.
జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని విజయవాడ శ్రీ సాయిబాబా నాట్యమండలి పి.వి.ఎన్.కృష్ణ రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన శ్రీ మాధవవర్మ పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఘట్టాలన్నీ బిగువుగా ప్రతి భావం ప్రతిభావంతంగా రంగస్థలం మీద చూపించారు. సన్నివేశానికి అనుగుణమైన సంగీతాన్ని శ్రీ వి.గంగాధరరావు బృందం అందించారు. మాధవవర్మగా పి.వి.ఎం.కృష్ణ; విక్రమేంద్రవర్మగా ఎం.లక్ష్మణ్; కనకదుర్గ అండ్ పద్మశ్రీలతో పాటు మిగతా నటీనటులు పాత్రోచితంగా నటించారు.
ఒంగోలు భారతీయం వారు జాతీయస్థాయిలో నిర్వహించిన నాటక పోటీలలో శ్రీ మాధవవర్మ ప్రథమ బహుమతితో పాటు, ఒక లక్ష రూపాయల నగదు బహుమానం కూడా అందుకున్నది. ఇతర విభాగములలో కూడా ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం విభాగాలలో కూడా బహుమానాలు అందుకున్నది.
శ్రీమాధవవర్మ నాటకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వారిచే నంది నాటకోత్సవములలో ప్రదర్శింపబడి ప్రధమ బహుమతిగా బంగారునందితో పాటుగా 80 వేల రూపాయల నగదు బహుమానము అందుకున్నది. మాధవవర్మ పద్య నాటకం కి స్పెషల్ జ్యూరీ అవార్డు గ్రహీతగా పి.వి.ఎం. కృష్ణ గారు స్వర్ణనందిని అందుకున్నారు. ప్రదర్శించిన ప్రతిచోటా బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది. పద్య నాటకరంగంలో రచయితగా, దర్శకునిగా, నటునిగా రాణిస్తూ రాష్ట్ర చరిత్రలోనే ఒకే పద్య నాటకానికి బంగారునందితో పాటు ఆరు నంది పురస్కారాలు పొందిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. మాధవవర్మ నాటికను ఢిల్లీ, ముంబై, వారణాసి వంటి పలు నగరాల్లో ప్రదర్శించారు.
అన్ని వృత్తులలాగే ఇందులోనూ ఈర్ష్య అసూయలు ఉండే మాట వాస్తవం. కానీ వాటిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేము. విజేతలు ఎప్పుడూ సానుకూలంగా మంచి నాటక ప్రదర్శన గురించే ఆలోచిస్తారు కానీ వచ్చే ఫలితం మీద పెద్దగా ఆలోచన ఉండదు. కానీ ఒక్కొక్కసారి తెలిసిపోతూ ఉంటుంది కావాలని చేస్తున్నారని అప్పుడు కొంచెం బాధ అనిపించే మాట వాస్తవం. ఉదాహరణకు కృష్ణగారు రాసిన శ్రీమాధవవర్మ పద్యనాటకం రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది ప్రథమ బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే తిరుపతి అభినయ వారి జాతీయస్థాయి నాటక పోటీలలో కూడా ప్రథమ బహుమతిని, అలాగే తెలంగాణ మిర్యాలగూడ వారు నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందింది. అయినప్పటికీ ఆ నాటకాన్ని ‘తెనాలి కళల కాణాచి’ పరిషత్తుకు వచ్చిన జడ్జిలు ఆ నాటకాన్ని ప్రదర్శనయోగ్యం కాదని ప్రారంభదశలోనే తీసివేశారు. దానికి ఎంతోమంది వాళ్లను విమర్శించినప్పటికి వాళ్ళ అజ్ఞానమే బయటపడిందని భావించి వదిలేసారు.
శ్రీమాధవవర్మ నాటకానికి 22వ నంది నాటకపోటీలలో పాల్గొని రచన, దర్శకత్వం వహించినందుకు బంగారు నంది బహుమతిగా డాక్టర్ పి.వి.ఎన్.కృష్ణ గారు ఉత్తమ ప్రదర్శనకు గాను ప్రథమ బహుమతి బంగారునందిని మరియు పద్యనాటకమునకు ఉత్తమదర్శకునిగా తామ్రనందిని శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరం గుంటూరులో అందుకున్నారు.
‘మాతృశ్రీ’ తరిగొండ వెంగమాంబ-2012 ఆధ్యాత్మికతతో కూడిన తరిగొండ వెంగమాంబ పద్య నాటకం ప్రేక్షకులను అలరింప చేసింది.
అసలీ జిహాద్-2012 కళాశాల పాఠశాల విద్యార్థులతో వేయించిన ఈ నాటకము ప్రదర్శించిన ప్రతి ఊరిలో కూడా ప్రజలను వీక్షకులను ఆలోచింపజేసింది.
పృథ్వీరాజ్ రాసో-2013 చారిత్రక నాటకం 11వ శతాబ్దంలో ఢిల్లీ రాజధానిగా భారత దేశాన్ని పరిపాలించిన చివరి హైందవ చక్రవర్తి పృథ్వీరాజ్ రాసో తాను 11 సార్లు క్షమాభిక్ష ప్రసాదించిన మహమ్మద్ ఘోరి తెలుగురాజు జయచంద్రులతో కలిసి దండెత్తి పృథ్వీరాజ్‌ని బందీ చేస్తారు. సేనాపతి చేసిన ద్రోహంతోనే అది సాధ్యపడుతుంది. బందీ అయిన పృథ్వీరాజు కళ్ళను పొడిపిస్తాడు ఘోరీ. రక్షణగా వచ్చిన మాజీమంత్రి సాయంతో తనకు నైపుణ్యంగల శబ్దవేధి విద్యతో సంహరిస్తాడు. పృథ్వీరాజ్ శత్రువులకు పట్టు పడకుండా మంత్రి, తాను పరస్పరం పొడుచుకుని చనిపోతారు. దేశద్రోహులు దుర్మార్గులకు పదేపదే ప్రాణభిక్ష పెడితే అది మనకే అనర్థమని చాటింది ఈ నాటకం. జయచంద్రుడి కుమార్తె రాణి సంయుక్తతో ప్రేమ సన్నివేశాలు, స్వయంవరంలో యుక్తితో ఆమెను వరించి తీసుకువెళ్లడం వంటి సన్నివేశాలతో ప్రేక్షక జనరంజకంగా సాగింది. ఈ నాటకం డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ రచించారు. దర్శకత్వం కూడా వహించిన ఈ నాటకంలో మంత్రి చాంద్ బర్దాయిగా ఆయనే నటించారు. కృష్ణగారి కుమారులు శ్రీ పి.సాయిశివశంకర్ పృథ్వీరాజుగా; రాణి సంయుక్త పాత్రలో కుసుమసాయి పాత్రోచితంగా నటించారు. 2013 & 2014 నంది నాటకోత్సవాలకు గాను పృథ్వీరాజ్ పద్యనాటకానికి ద్వితీయ ఉత్తమ రచనగా డాక్టర్ పి.వి.ఎన్.కృష్ణగారు ‘రజిత నందిని’ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం రాజమండ్రిలో అందుకున్నారు.
‘ఇది కొత్త కథ’ -2013
రచన దర్శకత్వం పి.వి.ఎన్. కృష్ణ చేసిన ఇది కొత్త కథ 2015 మరియు 2016 లలో వరుసగా నంది నాటకోత్సవాలలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారు ప్రదర్శించిన నాటిక నిజంగానే కొత్తగా ఉందని అందరూ ప్రశంసించారు.
ఈ పద్య నాటకమునకు ఉత్తమ పద్య నాటక రచయితగా ప్రథమ బహుమతిని శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరం గుంటూరులో మరియు ఉత్తమదర్శకుడు బహుమతిని మహతి ఆడిటోరియంలో అందుకున్నారు.
సమాజంలో హానికరమైన ప్లాస్టిక్ వినియోగంపై పౌరాణికపాత్రలతో పర్యావరణస్పృహను కలుగజేసింది. ఈ నాటిక. మనిషి దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఏ విధంగా పెరిగిపోయిందో తద్వారా ఎదురయ్యే పెనుప్రమాదాలు వాటిని నియంత్రించుకునే అవకాశాలను వినియోగించుకోవాలి అనే సందేశాన్ని చాటింది. పౌరాణికనాటిక తరహాలో నారద మహర్షి భూమండల సంచారానికి వచ్చిన క్రమంలో పర్యావరణ కాలుష్యం, నదులు, సముద్రాలు ప్లాస్టిక్ వలన కలుషితమవుతున్న తీరును గ్రహించి భూమాత ఆవేదనను శ్రీమహావిష్ణువుకు విన్నవించే క్రమంలో చోటు చేసుకున్న పలు పరిణామాలను ప్రేక్షకుల్లో ఆనందాన్ని పంచింది. భారత, చైనా, అమెరికా వంటి దేశాలు పెంచుకున్న సాంకేతిక పరిజ్ఞానం మేధస్సు ద్వారా ఉత్పన్నమైన ప్లాస్టిక్ తనకు తెలియకుండానే ప్రకృతికి శత్రువుగా మారినట్లు ప్లాస్టికాసురుడు పాత్రధారి ఆవేదన చెందే తీరు ఆటబొమ్మ దగ్గర నుంచి అంతరిక్షంలో ఎగిరే విమానం వరకు ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నతీరు ప్లాస్టిక్ ఏ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకోకుండా ఉత్పత్తులను నివారించకుండా వినియోగదారులపై ప్రభుత్వాలు అనుసరించే విపరీత పోకడలను కళ్ళకు కట్టినట్లు చూపారు. నారద పాత్రధారి, ప్లాస్టికాసురుడు పాత్రధారి హాస్యాన్ని పండించారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, పెరిగిన ప్లాస్టిక్ వినియోగం ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదని రీసైక్లింగ్ ద్వారా ప్లాస్టిక్‌ను భూమిలో కలవకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పాటిస్తూ భూమండలం కాలుష్యరహితం చేసే దిశగా ప్లాస్టిక్ వినియోగం ఉండాలని చాటారు. అందరినీ ఆలోచింప చేసిన నాటిక.
కళాశాల మరియు విశ్వవిద్యాలయం విద్యార్థులచే నాటిక ప్రదర్శనకు గాను 2017 లో ‘ఇది కొత్తకథ’ కు మూడవసారి నంది బహుమతి ఏలూరులో ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు గాను ‘రజతనందిని’ అందజేశారు.
ఆంధ్ర మహావిష్ణు- 2017
విజ్ఞాన భారతం-2019 సుప్రీం వరల్డ్ ఇంటలెక్చువల్ కాంటెస్ట్ అంశముగా విజ్ఞాన భారతం సాంఘిక నాటకం.
స్వాతంత్ర్యసంగ్రామం పార్ట్ వన్-2022 & స్వాతంత్ర్యసంగ్రామం పార్ట్ టు-2022
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అమృత మహోత్సవాలను నిర్వహించిన సమయంలో సంస్కారభారతి ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యసంగ్రామం పద్య నాటకాన్ని నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లుచేశారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు దీన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ పద్య నాటకంలో మొత్తం 75 మంది నటీనటులు పాల్గొన్నారు. వివిధ వయసులవారున్నారు. ఈ నాటకాన్ని డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి సాయిబాబా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు పి.వి.ఎం.కృష్ణగారు నాటకానికి దర్శకత్వం వహించారు. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 ఆగస్టు 15 వరకు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలోని ముఖ్య ఘట్టాలను ప్రదర్శించారు. నాటి గ్రామీణ వాతావరణానికి అనుగుణంగా ప్రాంగణాన్ని అలంకరించారు. నాటి బ్రిటిష్ వారి వస్త్రధారణ డిజైన్లు చేసి
మొదటి భాగంలో 1857 సిపాయిల తిరుగుబాటు, నానాసాహెబ్, తాంతియాతోపే, మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి పోరాటయోధుల ప్రధాన ఇతివృత్తాలను నిలిపారు.
రెండో భాగంలో ‘లాలా’లజపతిరాయ్, బాలగంగాధరతిలక్, ‘మహాత్మా’గాంధీ, నెహ్రూ, ‘సర్దార్’ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్రప్రసాద్, మహమ్మదాలీజిన్నా, అంబేద్కర్. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖదేవ్, మన రాష్ట్రానికి చెందిన అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశంపంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, పింగళి వెంకయ్య వంటి వారు నిర్వహించిన అనేక ముఖ్యమైన ఘట్టాలు ఇందులో ఉన్నాయి. స్వాతంత్ర సంగ్రామంలోని ముఖ్యఘట్టాలు, అలనాటి పాటలు, పద్యాలు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటివి నేటి బాలలు, యువతకు తెలియజేయడమే తమ లక్ష్యమని రచయిత పి.వి.ఎన్. కృష్ణ; సంస్కారభారతి రాష్ట్ర కార్యదర్శి దుర్భా శ్రీనివాస్ గారు అన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించడం, దేశభక్తి కలిగి ఉండడం, సామాజిక బాధ్యతను గుర్తించాలన్న ప్రధాన ఆశయంతో ఈ నాటకాన్ని రూపొందించారు.
యువతే లక్ష్యంగా సంస్కారభారతి సారథ్యంలో వివిధ కళాశాలలలో ఇప్పటివరకు 12 ప్రదర్శనలు చేసి విద్యార్థులకు దేశభక్తితో పాటు మనదైన పద్యనాటకాన్ని ప్రబోధించిన నాటక కళావతంసులు. ఇటువంటి చారిత్రాత్మక నాటకంలో నటించడం తమ అదృష్టంగా భావిస్తూ నేటి తరం వారు చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా అవసరమని అందులోని నటీనటులు పేర్కొన్నారు.
మంచి గుణపాఠం-2022
రచయితగా ‘మంచిగుణపాఠం’ నాటకం రాసిన కృష్ణగారి ఆశయం నంది నాటకోత్సవాలలో బాలల నాటికలకు కూడా ప్రాధాన్యం ఉండాలని అది నెరవేరుస్తూ గుంటూరులో శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మంచి గుణపాఠం నాటికను ప్రదర్శించగా ఉత్తమ బాలనటుడు ఏ.పి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోసాని కృష్ణమురళీ చేతులమీదుగా 12,500/ నగదు మరియు నంది అవార్డు అందుకున్నారు.
పాఠశాలకు 25వేల నగదు ప్రిన్సిపల్ సురేష్ కుమార్ కి నాటికలో పాల్గొన్న 26 మంది విద్యార్థులను, రచయితను, దర్శకులను అందరూ అభినందించారు. కలలు నెరవేరుతున్న క్షణాలు ఇవే!
కృష్ణవేణీయం నాటకం:
జాతీయస్థాయిలో జరిగిన నదీ సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా కృష్ణానది గురించిన ప్రత్యేక కార్యక్రమం కృష్ణవేణీయం ప్రదర్శించారు. నదుల వల్లే దేశం సస్యశ్యామలమవుతుందని, నదులు కలుషితం కావడంవల్ల పరివాహక ప్రాంతానికి ముప్పు వాటిల్లుతుందని చెబుతూ సందేశాత్మకంగా సాగిన కృష్ణవేణి నాటకం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ నిర్వహించిన నది-పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాలు మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం ప్రారంభమై తొలిరోజు కార్యక్రమం నదుల అనుసంధానం కృష్ణవేణి పడమటి కనుమలలో పుట్టడం, వివిధ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ, ప్రవహించడం పవిత్ర సంగమం వద్ద గోదావరితో కలవడం, ప్రధాన నేపథ్యం. స్కాంద పురాణంలోని కథను మూలంగా తీసుకొని పి.వి.యన్.కృష్ణ రచించి, దర్శకత్వం వహించిన ఈ నాటకం ఆద్యంతం ఆహుతులను రంజింపజేసింది. బ్రహ్మ, విష్ణు, శివుడు, యముడు పాత్రధారులు అద్భుతంగా నటించారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ అధిపతి మాట్లాడుతూ ‘స్వామి వివేకానందుడు చూపిన మార్గాలలో యువత నడవాలని’ సూచించారు.
‘జయహో! శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్’2023
ఛత్రపతి శివాజీ 350వ రాజ్యాభిషేక సందర్భంగా వ్రాసి, దర్శకత్వపరిచిన నాటకము ‘జయహో! శ్రీ ఛత్రపతి శివాజీమహారాజ్’ 60 మంది నటీనటులతో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ఎల్.ఈ.డి. స్క్రీన్ ఉపయోగించి ప్రదర్శించిన ఈ నాటిక ఒక విప్లవాత్మకమైన మార్పుని ప్రజలలో తీసుకొని వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్స్ చరిత్రలో ఈ నాటకము ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని అందరూ భావిస్తున్నారు.
ప్రదర్శనాకళ ఏదైనా ప్రార్థనా గీతముతో ప్రారంభమవుతుంది. పద్య నాటకానికి అందరూ సాధారణంగా శ్రీ చందాల కేశవదాసుగారు రచించిన ‘పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే గీతాన్ని ప్రార్థన గీతంగా పాడడం జరుగుతుంది. కానీ ‘జయహో! శ్రీ ఛత్రపతి శివాజీమహారాజ్’ నాటకం సంస్కారభారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కాబట్టి సంస్కారభారతి ధ్యేయగీతాన్ని ప్రార్ధనాగీతంగా ఆలపించడం జరుగుతున్నది.
/సాధయతి సంస్కార భారతి భారతే నవ జీవనం/ అంటూ సాగే ఈ గీతం యువతలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపుతున్నది.
తృప్తినిచ్చిన సన్నివేశం
కృష్ణగారు రాసిన, నటించిన, దర్శకత్వము వహించిన, ప్రదర్శించిన అనేక నాటకాలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో పురస్కారాలు పొందినప్పటికీ ‘ఛత్రపతి శివాజీ’ నాటకం రాజమండ్రిలో ఆడుతున్నప్పుడు ఇద్దరు విద్యార్థినిలు నాటకం అంతా చూసి చివరిలో వేదికపైకి వచ్చి “సార్! ఇది మా పాకెట్ మనీ, మా తల్లిదండ్రులు ఇచ్చినది మీకు ఇస్తున్నాము. దయచేసి యాస్సెప్ట్ చేయండి.” అని వేదిక మీద 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్ని పురస్కారాలు కంటే విద్యార్థులలో కలిగిన ఆ స్పందన మంచి తృప్తిని ఇచ్చింది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకంపై
“ప్రేక్షకులకు కనువిందు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నాటకం. అకుంఠిత దేశభక్తుడు. రాజనీతిజ్ఞుడు. మాతృవాక్య పరిపాలకుడు. గురు శిష్య పరంపరకి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చిన శివాజీ మహారాజ్ జీవితచరిత్ర ఈ తరానికి ముఖ్యంగా యువతకు తెలియజేయాలని ఉద్దేశంతో సంస్కారభారతి శివాజీ జీవితచరిత్రను కళారూపమైన నాటకం ద్వారా ప్రదర్శిస్తోందని” విశాఖపట్నం వాస్తవ్యులు అన్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి 355 సంవత్సరములు అయిన సందర్భంగా ఆ మహారాజుని, వీరుని, జీవితచరిత్రను నాటకరూపంలో ప్రదర్శించిన సందర్భంగా శివాజీ జీవితంలోని ప్రేరణదాయకమైన ఘట్టాలను, విజయాలను, అనేక కోటల నిర్మాణాలను, పరిపాలన చాతుర్యమును, దైత్య విధానాలను, దేశభక్తి ప్రపూరితమైనటువంటి శివాజీ అనుచరులను వారి జీవితాలను ఆవిష్కరించే విధంగా నేటి యువతరానికి అందించి జాతిని జాగ్రుతం చేయడానికి జయహో! శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పేరుతో 60 మంది నటీనటులతో ఎల్.ఈ.డి. తెర మొదలైన ఆధునిక సాంకేతికతతో, పాటలతో, భారీ సెట్టింగులుతో, నయనానందకరమైన నృత్యాలతో రెండున్నర గంటల నాటకంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓపెన్ థియేటర్లో ప్రదర్శించారు. అనేక సంవత్సరాల తర్వాత కొత్తగా పునరుద్ధరించిన ధియేటర్లో ఈ నాటకాన్ని పెద్ద ఎత్తున ప్రేక్షకులు విచ్చేసి తిలకించారు. ఆధునిక హంగులతో కళ్ళకు కట్టినట్లు నాటకాన్ని మలచి ప్రదర్శించిన సంస్కారభారతిని నాటకాభిలాషులు, దేశాభిమానులు ప్రశంసించారు. ముఖ్యంగా యువతరంతో ఈ నాటకాన్ని ప్రదర్శించడం నాటకరంగం పట్ల యువత ముందుకు రావడం శుభ పరిణామం అని ప్రేక్షకులు సంతోషం వ్యక్తంచేశారు. సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షులు; 25 పైగా ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్న డాక్టర్ పి.వి.ఎన్.కృష్ణ రచన, దర్శకత్వంలో సాగిన ఈ నాటకం ఆసాంతం ప్రేక్షకులకు కనువిందు చేసింది.
ఈ నాటకాన్ని వీక్షించడానికి అతిరథ మహారధులైన రచయితలు; నటులు; సంఘసంస్కర్తలు; దర్శకులు; ఆ బాలగోపాలము విచ్చేసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
కుటుంబ సహకారం ఒకపక్క ఉద్యోగం, మరియొకపక్క నాటక రంగం, మరొకపక్క సేవా రంగంలో 150 మందికి ప్రతిరోజు సాయంకాలం ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్యాబోధనతో నిరంతరం పనిచేస్తున్నా ఎక్కడా విసుగు లేకుండా నిరంతరం సహకరిస్తున్న కుటుంబ సహకారం మరువలేనిది.
శ్రీమతి పి.వి.ఎల్.శేషసాయి, శ్రీ కృష్ణ దంపతులు
ముఖ్యంగా కృష్ణగారి భార్య శ్రీమతి వెంకటలక్ష్మిశేషసాయి నిరంతరం వారిని ప్రోత్సహిస్తూ, భర్తతో పాటే ఆమె కూడా సేవలు అందించడం అరుదైన విషయం. అందువల్లనే ఇన్ని కార్యక్రమాలు నిరంతరాయంగా చేయగలుగుతున్నారు. అలాగే వారి పిల్లలు చిరంజీవి విశ్వకాంత్ మరియు చిరంజీవి సాయి శంకర్ కూడా నిరంతరం చేదోడు వాదోడుగా ఉంటూ సహకరించడం వల్లే ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాను అంటారాయన మృదువుగా నవ్వుతూ. అలాగే కృష్ణగారి దగ్గర నాటకం నేర్చుకున్న శిష్యులు గాని, విద్య నేర్చుకున్న శిష్యులుగాని ఎక్కువమంది నిరంతరం వారితోనే ఉంటూ అన్నివిధాలుగా సహకరించడంవల్లనే ఇంత మందితో ఇన్ని నాటకాలు ప్రదర్శించడం సాధ్యమైంది.
‘కళ కళ కోసమే’ అని పెద్దలు అంటారు. కొందరు కళ అన్నది ‘ఆత్మతృప్తి కోసం’ అంటారు. కళ ‘భుక్తి కోసం’ అని కొందరు భావిస్తారు. కానీ కళకు ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది అని భావించిన శ్రీ పి.వి.ఎన్.కృష్ణగారు గత 42 సంవత్సరాలుగా జానపద, చారిత్రక, సాంఘికనాటకాలను రచయితగా, దర్శకునిగా, నటునిగా, నిర్మాతగా, థియేటర్స్ స్థాపకునిగా 500 మంది పైగా కళాకారులను తీర్చిదిద్దారు. అతని నాటకములన్నీ కూడా అనేక రాష్ట్రాలలో మరియు జాతీయస్థాయిలో ప్రసిద్ధి పొందిన పరిషత్తు నాటకాలుగా పోటీలలో గుర్తింపును పొందడమే కాకుండా అనేక పురస్కారాలను బెస్ట్ ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్ అండ్ రైటింగ్ విభాగాలలో పొందినది.
సంస్కారభారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅధ్యక్షులుగా మరియు డాక్టర్ రామన్ ఫౌండేషన్‌కు శ్రీ సాయిబాబా నాట్యమండలి, విజయవాడ వారికి జనరల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి ప్రజ్ఞ అవార్డ్స్‌ని అందజేస్తున్నారు.
వివిధ పద్య నాటకాలలో ధరించిన పాత్రలు
రచయిత, దర్శకుడు, నిర్మాత, పాటలు/ సంభాషణలు విభాగాలు మాత్రమే కాకుండా వివిధ నాటకాలలో ఆయా పాత్రలు ధరించడానికి తగిన ఆంగిక, వాచిక, అభినయాలు వారి సొంతం. పాత్రకు తగిన ఆహార్యాన్ని ధరించగానే గంభీరమైన కంఠం ఎత్తి పాట పద్యం ఆలపించగానే ప్రేక్షకులంతా మంత్రముగ్ధులవుతారు. అందువలన అన్ని పాత్రలలోనూ ఇమిడిపోగలరు.
దుర్యోధనుడు/ జనరల్ హుగ్రోస్/ ఖడ్గతిక్కన/ మాధవవర్మ /చంద్ బర్దాయి /విశ్వామిత్ర /బాణాసుర/ మహామంత్రి తిమ్మరుసు/టంగుటూరి ప్రకాశం/ చత్రపతి శివాజీ/మహారధి కర్ణ/ప్లాస్టికాసుర/ సిద్ధిరాజు/వీరాస్వామి/ లక్ష్మీపతి మొదలైనవి.
పొందిన పురస్కారాలు బిరుదులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వము నుండి 14 నందిఅవార్డులు రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా, నటునిగా అందుకున్నారు.
14 నంది పురస్కారాలతో నటరాజు కి అర్చన
2008; ఉత్తమ రచయిత ప్రథమ స్వాతంత్రం మహాసంగ్రామం 1857 2009; ఖడ్గతిక్కన ప్రథమ ఉత్తమ పద్య నాటక రచయిత & దర్శకత్వం, 2010; ద్వితీయ ఉత్తమ ప్రదర్శన ఖడ్గ తిక్కన, 2010; తృతీయ ఉత్తమ ప్రదర్శన ఉషా పరిణయం రచన, దర్శకత్వం, 2012; శ్రీ మాధవవర్మ పద్య నాటకానికి స్పెషల్ జ్యూరీ అవార్డు గ్రహీత ఆనందగజపతి కళాక్షేత్రం; విజయనగరం 2013 & 2014; ద్వితీయ ఉత్తమ రచన పృథ్వీరాజ్ రాసారో పద్య నాటకం 2015; 2015; ప్రథమ బహుమతి ఉత్తమ పద్య నాటక రచయిత గా బంగారునంది & ఉత్తమ దర్శకుడుగా బంగారునంది 2016; ఇది కొత్త కథ ఉత్తమ రచయితగా 2017; (ద్వితీయ ఉత్తమ ప్రదర్శన ఇది కొత్త కథ) బాలల నాటికలకు నంది అవార్డులు 2022/2023; మాధవవర్మ పద్య నాటకం (ఉత్తమ రచన & ఉత్తమదర్శకుడుమరియు ఉత్తమ నాటక రచయిత & ప్రథమ ఉత్తమ ప్రదర్శన).
ఇతర పురస్కారములు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే 2016లో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారము; ఆంధ్రప్రదేశ్ నాటక కళా సమితి వారిచే శ్రీ కర్నాటి లక్ష్మీ నరసయ్య జీవన సాఫల్యపురస్కారం; శ్రీ నందమూరి తారక రామారావుగారి శతవార్షిక పురస్కారము యువ కళావాహిని హైదరాబాదు వారిచే గుంటూరులో అందుకున్నారు. ‘విశ్వనటచక్రవర్తి’ శ్రీ ఎస్వీ.రంగారావు కళాపీఠంవారిచే శ్రీ ఎస్వీ రంగారావు జీవితసాఫల్య పురస్కారము అందుకున్నారు. సుమధుర కళానికేతనం విజయవాడ వారిచే శ్రీ శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారము రాఘవ మెమోరియల్ అసోసియేషన్ బళ్ళారివారిచే బళ్ళారి రాఘవ పురస్కారము 2023 రాజబాబు మెమోరియల్ కమిటీ ఫిల్మ్ నగర్ హైదరాబాద్ వారిచే సినీ నటుడు రాజబాబు పురస్కారం ఏ.ఎన్.ఆర్. కళాపరిషత్ వారిచే అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం కౌతా పూర్ణానందం ట్రస్టు విజయవాడ వారిచే కౌతాపూర్ణానందం అవార్డు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి పురస్కారం నాగార్జున కళా పరిషత్ వారిచే సినీ దర్శకులు టి. కృష్ణ పురస్కారం యువ కళావాహిని వారి ఈలపాట రఘురామయ్య పురస్కారం న్యూ శెట్టి రామమోహనరావు కళా పురస్కారం అల్లూరి సీతారామరాజు అవార్డు.
ఆకొండి సింహాచలం ట్రస్ట్ అమలాపురం వారి పరశురామ పురస్కారం.
2023లో గండపెండేర ఘన సత్కారము సమతా సేవా సమితి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ మాజీ డిప్యూటీ స్పీకర్ మరియు శ్రీ మల్లాది విష్ణువర్ధన్ ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా అందుకున్నారు.
డా. పి.వి.ఎన్.కృష్ణ గారికి గండపెండేరం అలంకరిస్తున్న శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు
వీటితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక కళాసంస్థలు డా.పి.వి.ఎన్.కృష్ణగారిని గౌరవించడం ద్వారా తమను తాము గౌరవించుకున్నాయి.
బిరుదులు
భాషా ప్రవీణ; రంగస్థలం కృషీవల; నటదర్శక విరాట్ మొదలైనవి
నిర్వహించిన బాధ్యతలు
అక్టోబరు 20018లో అడ్వైజరీ పానల్ మెంబర్ సభ్యునిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ హైదరాబాద్ వారు నియమించారు.
కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల నుండి పురస్కారాలు:
ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడుగారి ద్వారా మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ద్వారా అనేక బహుమతులు అందుకున్నారు.
22వ నంది నాటక బహుమతులు 29- డిసెంబరు 2023లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక అభివృద్ధి సంస్థ; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ఉత్తమ ప్రదర్శనకు గాను శ్రీ మాధవవర్మ పద్య నాటకమునకు రచన, దర్శకత్వము చేసినందుకు డా.పి.వి.ఎన్.కృష్ణగారికి ‘బంగారునంది’ బహుమతిని అందించారు.
గండపెండేర బహూకరణ – సమతా సేవా సమితి 12వ వార్షికోత్సవం సందర్భంగా
02-07-2023 ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల; దుర్గాపురం; విజయవాడలో రచయిత, దర్శకుడు, నటుడు, ప్రయోక్త, సంఘసేవకుడు, భాషాప్రవీణ డాక్టర్ పొన్నపల్లి విశ్వనారాయణ కృష్ణగారికి ‘రంగసింహ’ స్వర్గీయ చింతా కృష్ణమూర్తి గారి జ్ఞాపక ‘గండపెండేర’ బహూకరణ ఘనసత్కారము జరిగింది.
ఈ సందర్భంగా “బహుముఖ ప్రజ్ఞాశాలి! అటువృత్తిలోనూ ఇటు ప్రవృత్తిలోనూ కూడా అనితరసాధ్యంగా రాణించి విద్యావంతునిగా, రచయితగా, నటునిగా, దర్శకునిగా, ప్రయోక్తగా, నిజాయితీపరుడైన పోలీస్ అధికారిగా, సంఘసేవకునిగా వివిధరంగాల్లో రాణిస్తూ భారతీయ సంస్కృతిని కాపాడడానికి సంఘంలో మానవత్వ విలువలు నెలకొల్పడానికి మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ మా సమత సేవాసమితి పక్షాన అందిస్తున్న ఈ ‘గండపెండేర బహుకరణ ఘన సత్కారం’ సింహసదృశ మానసులై స్వీకరించండి.” అని వినయంగా సమర్పించుకున్నారు.
గండపెండేర సన్మాన పత్రము
సంఘసంస్కరణ దేశభక్తి ప్రధాన ఇతివృత్తాలుగా పద్య నాటక రచనలు చేసి ఆ నాటకాలను గరుడ/ అభినయ/నటరాజ/ఎన్టీఆర్ మొదలైన అనేక పరిషత్తులలో ప్రదర్శించి ప్రథమ బహుమతులు పొందడమే కాక సంస్థకు 28 నంది అవార్డులు సాధించి వ్యక్తిగతంగా 14 నంది అవార్డులు పొంది పద్య నాటక రంగానికి గర్వకారణంగా నిలిచారు.
కృష్ణగారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం పాఠశాల ఉపాధ్యాయులు టి.ఎల్. నరసింహారావు కృష్ణ లోని ప్రతిభను గుర్తించి అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాఠాలు బోధించేవారు. ఆయన పిల్లలు రామన్ మరియు గిరీంద్ర కృష్ణకు మంచి స్నేహితులు. క్రమంగా రామన్ వైద్యుడిగా, గిరింద్రనాథ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. కృష్ణ పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా జీవితం ప్రారంభించి, విజయవాడలో ఉంటున్నారు. సింగ్‌నగర్లో కృష్ణ ప్రారంభించిన విద్యా ఉద్యమానికి గిరింద్రనాథ్ జత కలిసారు. చిన్న వయసులో మరణించిన తన సోదరుడు రామన్ పేరు మీద డాక్టర్ రామన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థను 20-07-2017లో ప్రారంభించారు. సింగ్‌నగర్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలందరికీ బోధించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన బోధన చేయడం ఈ సంస్థ ప్రధాన ఆశయం. ఇందుకోసం సువిద్యా పేరుతో ప్రత్యేక విద్యా ప్రణాళిక రూపొందించారు. కృష్ణ రోజు సాయంత్రం 6:30 నుండి 9 వరకు తరగతులు నిర్వహించేవారు. చదువుతోపాటు ఆటపాటలు, చిత్రలేఖనం, కళాసాంస్కృతిక కార్యక్రమాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు ఉపాధ్యాయులు 150 మంది విద్యార్థులతో ఈ కేంద్రం నడుస్తోంది. ఫౌండేషన్‌కు అవసరమైన ఆర్థిక వసతులు గిరేంద్రనాథ్ సమకూరుస్తారు. కృష్ణ తన వంతుగా తన ఇంటి మీద మరో రెండు అంతస్తులు నిర్మించి ఫౌండేషన్‌కు ఉచితంగా ఇచ్చారు. అక్కడ చదివిన విద్యార్థులు ఇప్పుడు ఐ.ఐ.టి. వంటి ప్రసిద్ధసంస్థల్లో ఉన్నతవిద్య చదువుతున్నారు. మరికొందరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారి మాస్టారు చేస్తున్న సేవా యజ్ఞంలో తాము భాగం పంచుకుంటున్నారు.
తెలుగు పద్యనాటకరంగంలో యువత విజయప్రస్థానం: శ్రీ సాయిబాబా నాట్యమండలి పాత్ర :
కనుమరుగవుతున్న కళను బ్రతికించేందుకే విద్యార్థులు ముందుకు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీ సాయిబాబా నాట్యమండలి జీవనోపాధి ఉండదనే తలంపుతోనే యువత రంగస్థలం నాటకరంగంపై వ్యతిరేక భావంతో ఉంటుంది. నిజానికి నాటకానికి పునర్వైభవం రావాలంటే రంగస్థలంలోకి యువతను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో నాటక పరిషత్తులు నిర్వహించే సంస్థలు ఎన్నో ఉన్నా యువతను నాటకరంగం వైపునకు మరల్చే ప్రయత్నం చేస్తున్నవి ఒకటో రెండో.
శ్రీ సాయిబాబా నాట్యమండలి యువతను రంగస్థలం పద్య నాటకం వైపుకు మళ్ళించింది. ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు నాటకం పట్ల ఆసక్తిని పెంచి, పద్యనాటకాలు నేర్పిస్తూ, ప్రదర్శనలు వేయించి, నంది నాటక ఉత్సవాలలో రచయిత నందిని గెలుచుకునే స్థాయికి తీసుకువెళ్లింది. రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఈ నాట్యమండలి.
జిల్లాలో అధిక నందులు గెలిచిన ఏకైక సంస్థ ఇది.
పాత్రధారులు హాజరు సమస్యను ఎదుర్కొనేందుకు యువతను నాటక రంగంలోకి తేవాలి అనే ఆలోచన మిగిలింది. అనుకున్నదే తడవుగా బీ.టెక్. చదువుతున్న తన కుమారుడు సాయిశంకరును నాటకరంగంలోకి ఆహ్వానించారు. అనంతరం సాయి శంకర్ స్నేహితులను పలువురు విద్యార్థులను కలిసి నాటకరంగం పట్ల వారిలో ఆసక్తిని రేపింది. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందాన్ని ఎంపిక చేసి యువకళాకారులను సిద్ధం చేసింది. 25 మంది రోజు సాయంత్రం సాయిబాబా నాట్యమండలి శిక్షణ కేంద్రానికి వచ్చి మూడు గంటల పాటు తెలుగు పద్యాలు కంఠస్థం చేస్తున్నారు. ఉషాపరిణయం, పృథ్వీరాజ్ చౌహాన్, మాధవవర్మ, శ్రీకృష్ణ రాయబారం, స్వాతంత్ర పోరాట మహాసంగ్రామం, నాటకాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
‘ఇది కొత్త కథ’ సాంఘిక నాటకం
ఈ సాంఘిక నాటకాన్ని నంది నాటకోత్సవాలలో ప్రదర్శించి నందిని గెలుచుకున్న ఈ 25 మంది యువ కళాకారులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
శ్రీకృష్ణరాయబారము నాటకము భావితరాలకు పద్య నాటకాన్ని సుసంపన్నం చేసి అందించాలని సత్సంకల్పంతో పూర్తిగా యువతీ యువకులతో కృష్ణ రాయబారం నాటకాన్ని తయారుచేసి ఒక సం. లోనే 25 ప్రదర్శనలు చేయించారు.
పద్యనాటకముల పట్ల యువతకు స్ఫూర్తిదాయకంగా దర్శకునిగా నిర్మాతగా శ్రీకృష్ణరాయబారమును కళాశాల విద్యార్థులచే వేయించారు. ఈ నాటకము అనేకమార్లు వివిధ పోటీలలోను పండుగలలోనూ ప్రదర్శింపబడి ప్రథమ బహుమతిని అందుకున్నది.
వాటిలో ముఖ్యమైనవి ఎస్.కే.బి.ఆర్ కాలేజ్ అమలాపురం; సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ; విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం; ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులలో ప్రదర్శింపబడటమే కాకుండా పద్య నాటక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
75 సం.ల అమృతోత్సవ్ సందర్భంగా 75 మంది కళాకారులతో స్వాతంత్ర సంగ్రామం పద్య నాటక ప్రదర్శన
స్వాతంత్ర సంగ్రామం నాటకం భారత అమృత మహోత్సవం సందర్భంగా 75 మంది కళాకారులతో స్వాతంత్ర సంగ్రామం అనే నాటకాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు భాగాలుగా నిర్మాణం చేసిన కృష్ణగారి కృషిని గుర్తించిన విద్యార్థులు ప్రతి దినము తప్పక తమ తరగతులకు హాజరవుతూ పద్యాలు కంఠోపాఠం పెడుతూ నాటక ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు.
ఈ పద్య నాటకాన్ని ఇటీవల సత్యనారాయణపురం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ నాటకాన్ని చూసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ 25 మందిని విద్యార్థుల బృందాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
పద్య నాటక రంగానికి తిరిగి ప్రాణం పోస్తున్న డా.పి.వి.ఎన్.కృష్ణగారు దేశభక్తితో గర్వించాల్సిన శుభ ఘడియలు ఇవి. ఈ బృందానికి సెంట్రల్ ఎక్సైజ్ మాజీ సూపర్డెంట్ ఏ. పీ. ప్రసాద్ శిక్షణ ఇస్తున్నారు.
“పద్య నాటకానికి పూర్వవైభవం జీవనోపాధి లేదనే తలంపుతో యువత రంగస్థలం నాటక రంగంపై విముఖంగా ఉంటున్నారు అనేది వాస్తవం. నాటకం వృత్తిగా కాకుండా ఉద్యోగం చేస్తూ లేదా చదువుకుంటూ ప్రవృత్తిగా స్వీకరిస్తే ఈ ఇబ్బందులు తలెత్తవు. దానికి ప్రభుత్వం కొద్ది సహకారం అందిస్తే చాలు పద్య నాటకం తిరిగి వికసిస్తుంది. నాటక రంగం పూర్వ వైభవం సంతరించుకుంటుందని కొత్తతరం రాకతో ఆశాభావం కలుగుతుంది. తాను రాసిన నాటకాలన్నింటివి విద్యార్థుల బృందానికి నేర్పిస్తే వాటన్నింటినీ నేర్చుకుని, ప్రదర్శించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరికి ప్రభుత్వం సహకారం కావాలి.” అంటారు కృష్ణ గారు. తెలుగువారి ఆదరాభిమానాలు పొందిన ప్రతి నాటకాన్ని అభివృద్ధి చేయడం జాతీయ సమైక్యత; దేశభక్తి భావాలను పెంపొందించే నాటకాలను రూపొందించడం తన ఆశయమని తెలిపారు. ప్రభుత్వం రంగస్థలం నాటకరంగానికి ప్రోత్సాహం కల్పించి పేద కళాకారులను ఆదుకోవాలని నంది పురస్కారాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు.
(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచిట అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం వెలువరించారు.