Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే గురు పరంపరామ్-11

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల పద్మశ్రీ డా. కొలకలూరి ఇనాక్ గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]


మా వేళ్ళకు నోళ్లకు అందక జారిపోయిన
అ ఆ ల గింజల్ని

ఏరించి మొలిపించి తినిపించిన
మా కొత్త తల్లివి నువ్వే కదా!

నువ్వు అక్షరాలు దిద్దించిన గురువు.

పలకపై /అక్షరాలు/ ఏరుకు /తినే /పిట్టలు పిల్లాడివేళ్ళు /

పసివాడి/ పలకా/ బలపాల/ సంచి/
కలల/ ప్రదర్శనశాల

పేద దళిత వర్గాలలో అన్నం కోసం ఎంత వెతుకులాటో!

అక్షరాల కోసం కూడా అంత వెతుకులాటే!

ఆకలి తీర్చే అన్నం దొరికినప్పుడు కలిగే ఆనందం వంటిదే

జ్ఞాన దాహాన్ని తీర్చే అక్షరం దొరికినప్పుడు కలిగే సంభ్రమం

(ఆ ఆ ల స్వర్గం & అ ఆ లు అనే కవితలు నుండి)
జీవితాన్ని వెలిగించే అక్షరం పట్ల శ్రీ కొలకలూరి ఇనాక్ గారికి గల అనంతమైన విశ్వాసం.

రైలుకట్టపై ఒక పేదతల్లికి జన్మించి, అవమానాలను ఎదుర్కుంటూ, అవకాశాలను అందిపుచ్చుకుని, అత్యున్నత స్థానాన్ని చేరుకుని, తన వర్గం అణచివేతపై ఆయుధంగా కలం బలాన్ని ప్రదర్శించి, ప్రశ్నించే గొంతుకగా సఫలీకృతులైనారు. తమ సిరా చుక్కలతో ఎన్నో ప్రక్రియల్ని నేటికీ సృజిస్తున్న సాహితీ స్రష్ట. విశ్వవిద్యాలయం ఉప కులపతిగా సేవలందించిన ఈ అక్షర పథగామిని వరించిన అవార్డులెన్నో! వీరి సాహితీ మకుటంలో పద్మశ్రీ ఓ కలికితురాయి.

ఈనాటి వందే గురు పరంపరామ్ 11వ భాగంలో ఆచార్య డాక్టర్ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి 88 సం.ల జీవన గమనాన్ని సింధువుని బిందువులో చూపించే ప్రయత్నం నాది.

పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు

వంశము పుట్టుక తల్లిదండ్రులు

ఇనాక్ అనేది బైబిల్ లోని ఒక పాత్ర. మాది వీరుల వంశం అని గర్వంగా చెప్పుకుంటారు ఆయన. 18వ శతాబ్దంలో ధరణికోట రాజధానిగా రాజ్యపాలన చేసిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దగ్గర సైన్యాధికారిగా భుజంగరాయుడు అనే దళితుడు ఉండేవాడు. ఆయన గొప్ప వీరుడు. అంతేకాక మహా పండితుడు.

కొలకలూరి వారిది గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామం. ఎల్లమందకు రామయ్య కృష్ణయ్య అని ఇద్దరు కుమారులు. వీరిలో రామయ్య వీరమ్మ దంపతులు క్రైస్తవం స్వీకరించి శాంసన్ విశ్రాంతమ్మ అని పేరు మార్చుకున్నారు. ఈ దంపతులకు ఇనాక్, మార్తమ్మ, నాగభూషణం అని ముగ్గురు సంతానం.

తండ్రి కొలకలూరి రామయ్యగారు, తల్లి విశ్రాంతమ్మగారు

జననానికి సంబంధించిన పుట్టినరోజులు జరుపుకునేందుకు అవసరమైన నెల తారీకు తెలియదు. ఈ విషయంలో అన్ని కులాలు సమానమే. ఎందుకంటే పాఠశాల రికార్డులు తిరగవేస్తే కొన్ని వేల మంది లక్షలమంది జూలై 1వ తేదీన పుడతారు.

కానీ ఇనాక్ గారి పుట్టుకలో ఒక విశేషమున్నది.

రైలుకట్టపైన జననము: అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన విశ్రాంతమ్మకు విశ్రాంతిలేక పనికి వెళ్ళి తిరిగివస్తూ మండుటెండలో రైలుకట్టవెంట వస్తూ పురిటినొప్పులు ప్రారంభమై ఆ గులకరాళ్ళ పైనే కప్పుకున్న దుప్పటి మరుగుగా అభిజిత్ ముహూర్తములో పండంటి బిడ్డను ప్రసవించినదామె. ఆమెకు తెలియదు. అంటే అది చాలా అద్భుతమైన సమయము.పుట్టిన బిడ్డ చాలా గొప్పవాడు అవుతాడు అన్నదానికి నిదర్శనమని సౌరశాస్త్రం ప్రకారము చెప్తారు. అతడు అజాత శతృవని. విశ్వమంత కీర్తి తన బిడ్డ గడిస్తాడని.ఆమె తన కొడుకు మంచి పండితుడు గొప్ప వీరుడు కావాలని కోరుకుంది. అందుకే ఎవరికీ లేని పేరు తన బిడ్డకు పెట్టుకోవాలని ఆశించినది ఆ తల్లి.

కొలకలూరివారి వంశమూలపురుషుడైన ఆ మహనీయుడు ఏడో తరంలో విశ్రాంతమ్మగారి కడుపున 1 వ తేదీ జులై, 1939 తొలి సంతానంగా పుట్టారు. అపురూపమైన ఆ బిడ్డకు పేరు ‘బైబిలులో ఇనాక్ దేవునితో సశరీరంగా నడిచి వెళ్ళాడు’ అని రాసి ఉంది. కనుక ఈ పేరును కొలకలూరి తల్లిదండ్రులు తమ పెద్ద కుమారునికి పెట్టుకున్నారు.

ఆరు నెలల వయసులో మొదటి బహుమతి: తల్లిపాలతో బొద్దుగా ఆరోగ్యంగా పెరిగిన ఆ శిశువు ఆరోగ్యకేంద్రంలో పరీక్షించిన వైద్యులు ఆరోగ్యకరమైన శిశువుకి ఇచ్చే బహుమతిని ఆ తల్లికి అందచేసారు.

విద్య: బాల్యము ఇనాక్ గారు 1944-48 మధ్యకాలంలో గుంటూరు జిల్లాలోని వేజెండ్లలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. మూడవ తరగతి వరకు మాత్రమే చదివారు. తర్వాత వారి తండ్రిగారు గొర్రెలను మేపుకునేందుకే పంపించేవారు.

పల్లె ప్రభావం: తండ్రి కొలకలూరి శాంసన్ (రామయ్యగారు) రైతు కూలీ. వేజెండ్లలో మాదిగపల్లిలో జీతగాడుగా పొద్దున్న వెళ్లి రాత్రికి వచ్చేవారు. అందువలన పిల్లలకు తల్లి విశ్రాంతమ్మ (వీరమ్మ) దగ్గర చేరిక ఎక్కువగా ఉండేది.

మూడవ తరగతితో చదువు మానేసి ఏడాది పాటు కూలి పనులు చేసిన ఇనాక్ గారు తల్లి యొక్క ప్రోద్బలంతో చదువుకుంటే జీతగాడిగా పనిలో చేరక్కరలేదు. అని ఒక భావనతో అతను కష్టపడి చదివారు. ఆరవ తరగతి ఎంట్రన్స్ పరీక్ష రాయటానికి గుంటూరు వెళ్ళడానికి స్టేషనుకి వెళ్లారు. కానీ అప్పటికే రైలు వెళ్లిపోయింది. అందువలన పరీక్ష పది గంటలకు కదా ఇంకా సమయము ఉందని వేజెండ్ల నుండి గుంటూరు 7.5 మైళ్ళు రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ గుంటూరు చేరారు. పరీక్ష సమయానికి అందారు. పరీక్ష రాశారు. ఉపాధ్యాయులు అతని పరిస్థితికి కనులనీరు నింపుకున్నారు. ఏదైనా సాధించాలం టే పట్టుదల ఉండాలి పనిఅవ్వడం ముఖ్యం అనే భావన ఆయనకు అప్పుడే అలవడినట్లుంది. కాకుంటే ఇన్ని రచనలు చేయడం,ఇంత ఉన్నతిని చేరడం ఎవరికీ సాధ్యం కాదు.

ఏడాది విరామం తర్వాత గుంటూరు యు.ఎల్. సి.ఎం. హైస్కూల్లో 6 వ తరగతిలో చేరారు.

రోజు ఉదయం 6:30కు రైల్లో వేజెండ్ల నుండి గుంటూరు వెళ్లేవారు. రైలు తప్పిపోయినప్పుడు పట్టాలు పట్టుకుని నడిచి వెళ్లేవారు.చదువుకి వెళ్లకపోతే పనిలో పెడతారని భయం ఉండేది. నెలకు రూపాయి పావలా స్కూల్ ఫీజు ఉండేది. 186 రోజులు స్కూలు ఉండేది. మిగతా రోజులలో పనులు చేసి తన స్కూలు ఫీజు కట్టడానికి సొమ్ము అతనే సంపాదించుకుని ఆ పైకం అమ్మ దగ్గర దాచుకునేవారు..

స్కూలుకి వెళ్లడం, ఫీజు కట్టడం, ఏ పని చేసినా స్కూలే లక్ష్యం. పరీక్ష తప్పితే జీతానికి కూలికి పెడతాను అని తండ్రి భయపెట్టడం వలన పరీక్షలు పాస్ అయ్యేందుకు చదివేవారు. కానీ అప్పటిలో స్కూల్ గానీ, కాలేజీలో గాని, యూనివర్సిటీకి గాని, ఫీజులు కట్టవలసి వచ్చేది. ఎటువంటి స్కాలర్షిప్పులు లేవు. ఉద్యోగ అవకాశాలు మాత్రం బాగానే ఉండేవి.

తొమ్మిదవ తరగతికి వచ్చేసరికి తండ్రి మరణించారు. అందువల్ల తల్లితోనే ఎక్కువ సమయం గడిపేవారు.ఇనాక్ తల్లి పిల్లలను తల్లి తండ్రి తానై పెంచింది. అన్ని పనులూ చేస్తూ తల్లికి సహాయకులుగా ఉండేవారు. కోళ్లు, బర్రెలు, పాలు, గుడ్లు, అమ్మడం వాటి మధ్యనే గడపడం ఆ అనుభవం మీద రాయడం వల్ల కథలకు సహజత్వం ఉండేది.

రచనలు చేయడానికి ప్రేరణ ఇచ్చినవారు సాహిత్యంతో ఇనాక్ కు పరిచయం చేసినవారు పూర్ణయ్యగారు. స్కూలు పక్కన అమ్మే రాశుల కొద్ది పుస్తకాలు చదవడం వలన రచనల పట్ల అభిరుచి ఏర్పడింది. ముఖ్యంగా సాంగత్యం కంటే, వ్యక్తుల కంటే, పుస్తకాలు కంటే, పత్రికలు ఎక్కువగా ప్రభావితం చేసేవి.

ఆ సందర్భంలోనే దాసుగారు పరిచయమయ్యారు.స్టేషన్ దగ్గర ప్లాట్ ఫారం మీద బట్ట పరిచి పుస్తకాలు పేర్చి, పుస్తకం 2 అణాలు చొప్పున అమ్మేవారు. పాటలూ, పద్యాలూ పాడుకునేవారు. వేజెండ్ల నుండి గుంటూరు మధ్య హైస్కూల్ చదువు సమయంలో అవి వినగా వినగా సాహిత్యం మీద ఇష్టం కలిగింది.

ఆరవ తరగతిలో ఉండగా పద్యం చెప్పలేకపోతే మాస్టారు కులం పేరుతో తిట్టారు. అప్పుడు చాలా కోపం వచ్చింది. మూడు రోజుల తర్వాత తెలుగే కదా! ఎందుకు రాదు అని పట్టుదలతో నేర్చుకొని మాస్టారికి ఆ పద్యం అప్పచెప్పడం జరిగింది.అప్పటి నుండి తెలుగంటే అభిమానం. తెలుగు మాస్టారుని అవ్వాలి అనుకున్నారు..

తర్వాత హైస్కూల్ కి వచ్చాక మున్సిపల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలని చదివేవారు.

4 నుండి 12 సం.ల బాల్యంలోని జీవిత నేపథ్యంలోనే 16 కథలు వ్రాశారు. ‘ఆంధ్రప్రదేశ్’ పత్రిక వారు వీటిని ప్రచురించారు. “బాల్యంలో తాను చూసిన గ్రామంలోని సంఘటనలే తన కథలు అంటారాయన. జీవిత చరిత్ర రాసుకోలేనేమో అని బాల్యంలోని విశేషాలను కథలుగా వ్రాసుకున్నాను.” అంటారు.

హైస్కూల్ పాఠశాల సమయము 10 గంటలకు కనుక ఇతను ముందుగా పాఠశాలకు వెళ్లి అక్కడ పూర్ణయ్య గారు అమ్మే పుస్తకాలు షాపు దగ్గర నిల్చుని పుస్తకాలు చూసి చదివేవారు. పాపాయి, బాల, బాలమిత్ర మొదలైన పుస్తకాలు చదివేవారు, ఖాళీ సమయం పుస్తకాలు షాపు దగ్గరే గడిపేవారు. తర్వాత కొన్నాళ్ళకు ఆంధ్రప్రభ, పత్రిక, వారపత్రికలు అక్కడ గుట్టలుగా ఉండేవి. పూర్ణయ్యగారు ఇచ్చిన ప్రోత్సాహంతో కూర్చుని చదువుకునేవారు.

8 వ తరగతి వేసవికాలంలో పాపాయి పుస్తకం కోసం చిన్న చిన్న కవితలు రాశారు.

“బడికి గంట/ బండికి గంట/ గుడికి గంట/ ఉండాలోయి ఉండాలి!”

అలా చిన్న చిన్న కవితలు రాసి పంపితే ఆ పత్రికలో ప్రచురించారు. అదేవిధంగా కథలు కూడా సొంతంగా రాసి పంపితే వేసుకునేవారు. ‘ఇద్దరుమిత్రులు’ అనే కథ రాసి పంపడం జరిగింది. తర్వాత తొమ్మిదవ తరగతిలో ఛందస్సు కొంచెం తెలిసిన తర్వాత క్రమబద్ధంగా అక్షరాలు పేర్చుకొని నచ్చిన విధానంలో రాసి పంపేవారు. ఇది 14 నుండి 16 సంవత్సరాల వయసులో ఎస్.ఎస్.ఎల్.సి. కి వచ్చాక ఇంకొంచెం ఎక్కువగా రాసి పంపేవారు.

స్ఫూర్తిదాయక వ్యక్తులలో కందుకూరి, గురజాడ, జాషువా భావాలు ఇనాక్ గారిపై ఉంటాయని అందరూ అంటారు. కానీ దాని నుండి విడిపడుతూ తిక్కన తనకు చాలా ఇష్టం ఎందుకంటే “అతను తెలుగు పదాలు చక్కగా రాస్తారు. ఏక వాక్యాలు రాస్తారు. అతని తెలుగు భాష, అతని బాణి చాలా ఇష్టం” అని చెప్పారు.

1954-56 లో ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ఎ.సి. కాలేజీలో ఏడాదికి నాలుగు మ్యాగజైన్సు ఉండేవి. ఒక దానిలో కథ, ఒకదానిలో కవిత, ఒకదానిలో పద్యం రాశారు. వారికి నాటకం గురించి పరిచయం ఎలా ఏర్పడిందంటే ప్రకాశం పంతులు అనే అతను తమ ఊరిలో నాటకాలు వేస్తూ పద్యాలు పాడేవారు. తెలుగుతల్లి నాటకంలో పద్యాలు వినే అలవాటు చాలా ఉండేది. అలాగే మేనమామ వరుసైన రత్తకవి పాటలూ, పద్యాలూ వినిపించేవారు. అప్పుడే జాషువా పేరు విన్నారు. ఊరిలో ప్రజలందరూ జాషువాగారు బాగా రాస్తారు అని చెప్పేవారు. అంటే తను కూడా బాగా రాసి జాషువాగారిలాగా మంచి పేరు తెచ్చుకోవాలి అనే కోరిక ఉండేది.

కళాశాలలో చదువుతున్నప్పుడు అధ్యాపకులుగా జాషువాగారు, కరుణశ్రీగా పిలువబడే జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు. ఇంటర్లో తెలికిచెర్ల వెంకటరత్నంగారు తెలుగు శాఖాధిపతిగా ఉండేవారు. వీరికి ఇనాక్ గారు తను రాసిన రచనలు చూపిస్తే జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు ప్రోత్సహించేవారు. “బాగా రాస్తున్నావు మన పాఠశాల మ్యాగజైన్లో వేద్దాము.” అనేవారు. అదేవిధంగా తెలికిచెర్ల వెంకటరత్నంగారు రాసుకోమని ప్రోత్సహించేవారు. వీరు కాకుండా వి.వి.ఎల్. నరసింహారావుగారు; స్ఫూర్తిశ్రీ భాస్కర్రావుగారు; అక్కిరాజు వెంకటేశ్వరరావుగారు కూడా చాలా ప్రోత్సహించేవారు.ఇంటర్మీడియట్ ఇనాక్ గారి జీవితంలో ముఖ్యఘట్టం.

1956-59లో విశాఖపట్నంలో బి.ఏ.ఆనర్స్ చేశారు. స్పెషల్ తెలుగు; హిస్టరీ; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్; అంతవరకు మార్కులు పట్ల లేని తపన ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలని శ్రధ్ధ మొదలైంది. ఆ ఎక్కువ మార్కులే బి.ఏ.ఆనర్స్ లో సీటు వచ్చేటట్లు చేశాయి. ఆ సమయంలో సమాజంలోని కొన్ని అసమానతలను ఎదుర్కోవలసి వచ్చింది. అమ్మ చెప్పిన మాటలు పాటించేవారు. ‘ముళ్ళ పొద మీద వేసిన బట్ట చిరక్కుండా తీసుకున్నట్లుగా ఉండాలి.’ అనేవారు.

కాలేజీకి వచ్చినప్పుడు మొట్టమొదటి కథ ‘ఉత్తరం’ అని రాశారు. తర్వాత ‘లోకం పోకడ’ ‘గాలి’ అనే కథలు రాసారు. ఆనర్స్ లో ‘తెలుగు విద్యార్థి’ మ్యాగజైన్లో ‘ఎడారి కవిత్వం’ ప్రచురించగా ‘ఆంధ్ర పత్రిక’లో కథలు అడిగి మరీ వేసేవారు.

చదువుకొని ఉన్నతస్థాయిని పొందాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి చదువుకుని మంచి మార్కులతో బి.ఏ. ఆనర్స్ పాసైన వెంటనే 20 సం. వయసులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగపరంగా గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి అనేక ప్రాంతాల్లో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి అందుకున్నారు.

ప్రేమ- వివాహం -సంతానము:

అనంతపురం కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేటప్పుడు హాస్టల్లో ఉండేవారు. భాగీరథి గారు ఆ సమయంలో ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసులో పనిచేసేవారు.ఇనాక్ గారిని తెలుగు చెప్పమని ఆమె అడిగారు. సాయంత్రం 5 గంటల నుండి 6 వరకు ఒక గంట చెప్పేవారు. తరువాత ఆమె ఇంటికే వెళ్లి పాఠం చెప్పేవారు. ఆమె తల్లి రోజూ టీ ఇచ్చేవారు.స్నేహం పెరిగి వివాహం దాకా వచ్చాక తెలిసింది. ఆమె కంటే తాను చదువు, వయసు, ధనము, కులము అన్నీ తక్కువే అని. వివాహ ప్రస్తావనకు ఆమె తండ్రి అంగీకరించలేదు. ఇనాక్ గారి తల్లి అంగీకరించారు. కానీ ఊరి పెద్దలకు భయపడ్డారు. చాలా సాధారణంగా వివాహం జరిగింది.

వివాహమైన ఆరు సం.ల తర్వాత ఇనాక్ గారి మామగారు వీరి వివాహాన్ని అంగీకరించారు. ఈలోగా సంతానం కలిగారు. రెండువైపుల వారూ రాకపోయినా, వాళ్ళు సరిగ్గా చూడకపోయినా ఇనాక్ గారు తన భార్యను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉండేవారని ఆమెకు హెల్పర్లు ఉండేవారు. వీరికి నలుగురు సంతానం.

పిల్లల పేర్లు క్రిస్మస్ రోజు వచ్చే లైట్ ఆధారంగా అలాంటి పేర్లు పెట్టడం జరిగింది. ఇనాకంటే ఇనుడు అంటే సూర్యుడు అని అర్థం. అందుకే పిల్లల పేర్లు కూడా ఆశాజ్యోతి; మధు జ్యోతి; శ్రీ కిరణ్; సుమ కిరణ్ అని పెట్టారు.

ఆశాజ్యోతి బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులు శ్రీకిరణ్ హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వఉద్యోగి. మధుజ్యోతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులు సుమ కిరణ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల అధ్యాపకులు. వీరందరికీ మంచి చదువులు చెప్పించారు. వివాహాలు జరిగి సత్సంతానంతో ఉన్నారు.

తండ్రి వారసత్వంగా కొలకలూరి వారి ఇద్దరు అమ్మాయిలు, చిన్న కుమారుడు మంచి విమర్శకులు, రచయితలు, అనువాదకులు అయ్యారు.

ఇనాక్ గారిని డిప్యూటీ కలెక్టర్‌గా చూడాలని వారి అమ్మ కోరుకునేది. అందువలన ఆమె మరణ సమయంలో పంపించిన టెలిగ్రామ్ ఉపాధ్యాయులు ఇనాక్ కు అందించకపోవడం వలన స్నేహితుడు కూడా “అమ్మకి ఏం కాదు పరీక్ష రాసి పాస్ అవ్వడం అమ్మ కోరిక” అని చెప్పడం వలన ఇనాక్ పరీక్ష రాసి వెళ్ళారు. అప్పటికే తల్లి మరణించారు. అది ఇనాక్ గారికి చాలా బాధగా అనిపించింది. ఇనాక్ గారి తల్లి 1991లో మరణించారు.

ఇనాక్ గారు అనేక ప్రక్రియలలో రాసిన అనంతమైన సాహిత్యం ఆయనను తెలుగు సాహిత్యంలో ఉన్నత శిఖరాలపై కూర్చుండ పెట్టింది.

250 కథలు, 180 కవితలు, 9 నవలలు, 20నాటికలు, ఆరు నాటకములు, పరిశోధన, విమర్శ, అనువాదం అను ఏడు ప్రక్రియలు. ఇనాక్ అంటే సూర్యుడుగా ప్రక్రియలు ఏడు గుర్రాలుగా సాగే రథం అతని జీవితం అని పోల్చారు భాగీరథి గారు.

ఇనాక్ గారు భాగీరథిగారితో ప్రేమ, వివాహము, నలుగురు పిల్లలు వారంతా కూడా వారిని బాగా చదివించుకోవడం. వాళ్ళు మంచి జీవితంలో సెటిల్ అవ్వడం అనేది ఇనాక్ గారి జీవితంలో అతి గొప్ప విజయం. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఇనాక్ గారిని చాలా ప్రోత్సహించేవారు. “మీరు ఒక గొప్ప కార్యం చేయడానికి పుట్టారు. కనుక అది ఏమిటో తెలుసుకోగలిగి ఆ పని చేయండి.” అంటూ ఉండేవారు.

నాకు తెలిసిన పని కథలు రాయడమే! అందువల్ల రాయడం అనేది నిరంతరం సాగించడం వలన సాగిస్తున్నప్పుడు “కష్టాలు ఎదుర్కోవాలి ఇబ్బందులు దాటాలి ఎప్పటికైనా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మనం బలికాకుండా బ్రతకాలి.” అని చెప్పిన అమ్మ మాటలు, భార్య చెప్పిన మాటలు చాలా ముందుకు తీసుకువెళ్లాయి.

ఆమె ఇనాక్ గారితో 70 సం. వయసు వరకూ జీవితాన్ని పంచుకుంది. 26 ఫిబ్రవరి ఆమె జననం అదే రోజు ఆమె మరణం కూడా. ఇటువంటి వారిని కారణజన్ములు అంటారు పెద్దలు. భాగీరథిగారు 2007లో మరణించారు.

తల్లి, తండ్రి, భార్య పేరున ప్రతిసం. సాహితీ ప్రక్రియలలో అత్యుత్తమ రచనలకు పురస్కారాలు అందజేస్తున్నారు. నందమూరి తారకరామారావు కళామందిరం; పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాద్ లో కొలకలూరి పురస్కారాలు 2025 సం.ప్రదానోత్సవాలు జరిగాయి.

జన్మదిన వేడుకలు పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం అంటే సాహిత్యానికి పెద్ద పీట వేయడం అని భావించడం గత 6 సం. లుగా కొలకలూరి సాహిత్య సప్తాహములు జరుపుతున్నారు. కొలకలూరి ఇనాక్ సాహిత్యం -సమాజం పేరుతో కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కొలకలూరి ఇనాక్ జాతీయ సాహిత్య పురస్కారాలను కవిత్వం; విమర్శ; కథ; నవల; నాటకం; అనువాదం మొదలైన రంగాలలో కృషిచేసిన వారికి అందించి ప్రముఖులను సన్మానించుకుంటున్నారు.

‘ఇనాక్ గారి ఉద్యానవనం’ ఇనాక్ గారి కథలలో అణచివేతను నమోదు చేయడమే కాకుండా అణచివేతకు గురి అయిన వారి ఆంతరంగిక మథనాన్ని, అస్థిత్వవేదనను, ఆత్మగౌరవ పోరాటాన్ని, విశ్వజనీనమైన కోణంలో ఆవిష్కరించడం, ఆయన రచనా ప్రస్థానంలోని విశిష్టత. వాటిని విశ్వవ్యాప్తం చేయాలని గత ఐదు సం.లుగా అమెరికా నుండి బి+ కథాకళ అనే ఒక ప్రక్రియను అంతర్జాల వేదికపై నిర్వహిస్తున్న ప్రముఖులు నిర్ణయించుకున్నారు.

87వ పుట్టినరోజు సందర్భంగా డా. కొలకలూరి ఇనాక్ గారు వ్రాసిన అనేక కథలు నుండి 3 మంచికథలను ఎంపిక చేసారు. భాస్కర్ గారు పశ్యాద్భూమి; వెంకట్ గారు తలలేనోడు; అయ్యగారి వసంతలక్ష్మిగారు క్షమాభిక్ష కథలను యథాతథంగా మంచి హావభావాలతో చదివారు. చదివిన ఆ ముగ్గురు కథకులూ ఈ శతాబ్దపు అత్యుత్తమ కథకులుగా ఇనాక్ గారిని ప్రస్తుతిస్తూ ఇలా అన్నారు.

“ఇనాక్ గారి కథలలోని వర్ణనల తోరణం, ఉపమానాలు వెల్లువ, అనంతమైన పద సంపద, శైలి, పాత్రలను బట్టి ప్రాంతీయయాస, కథలోని మలుపులు, వర్ణనలో సహజత్వం, అత్యంత సూక్ష్మ స్థూల వివరణ, వృత్తి విద్యలను ఆధారంగా చేసుకుని వ్రాసిన అనేకమైన కథలు సునిశిత, లోతైన పరిశీలన, పాత్రల చిత్రణ, పరిస్థితుల ప్రభావం, మానవ సంబంధాలలోని వైవిధ్యము, సంఘర్షణ, నైతిక విలువల కోసం వ్యక్తీకరించే విధానము అద్భుతం అని ముగించారు.

కొసమెరుపుగా నిర్వాహకులు పర్యావరణ పరిరక్షణ కోసం 50,000 మొక్కలు నాటాలి అనే సంకల్పంతో ప్రారంభించిన కార్యక్రమంలో 1,000 మొక్కలను శ్రీ కొలకలూరి ఇనాక్ గారి పేరిట నాటి ‘ఇనాక్ గారి ఉద్యానవనం’ అని పేరు పెట్టాలని నిర్ణయించడం హర్షణీయం.

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి వ్యక్తిత్వ వికాసం- ఒక కొత్త సిలబస్

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘పత్రత్రయి’ అంటే మూడు పత్రాలు. పత్రం అంటే పరిశోధనా పత్రం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1974 – 83 మధ్య నిర్వహించిన మూడు విశిష్ట సదస్సుల కోసం ఆచార్య కొలకలూరి రాసి సమర్పించిన మూడు పరిశోధనాపత్రాల సంపుటి పత్రత్రయి.

  1. నూరేళ్ల తెలుగు వ్యాసం 1974లో అకాడమీ నిర్వహించిన సదస్సులో కొలకలూరి తెలుగు వ్యాస పరిణామం (1947-72) అనే పత్రం సమర్పించారు.
  2. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ రజతోత్సవాల సందర్భంగా 1977లో జరిగిన సదస్సులో కొలకలూరి తెలుగు సాహిత్య విమర్శనం (1966-76) అనే పత్రం సమర్పించారు .
  3. 1983లో జరిగిన పరిశోధనా సదస్సులో కొలకలూరి తెలుగు జానపద సాహిత్య పరిశోధన (1942-1982) అనే పత్రం సమర్పించారు.

ఈ మూడు పత్రాలు కూడా ఒక నిర్దిష్ట సాహిత్యం మీద సమగ్రమైన పరిశోధన చేసి సాధికారికంగా రాసిన వ్యాసాలు.

ఇనాక్ గారి 86వ పుట్టినరోజున ప్రముఖ రచయిత శ్రీ విహారిగారు వారిని గురించి ఇలా అంటారు.

“ఇనాక్ గారి ప్రతిభా వ్యుత్పత్తులలోని సద్యస్ఫూర్తి, సర్వమూ ఆకళించుకోగల సామర్థ్యం – వారు ఇతర రంగాలలో కూడా మేటిగా నిలవటానికి చోదక శక్తులయ్యాయి. పరిశోధనా పర్యవేక్షకులుగా, ఉపకులపతిగా, కల్నల్ గా తనదైన విధానాలతో సరివారల ప్రశంసలే కాక బేసరివారల మెప్పుని పొందినవారు. ఇనాక్ గారు పాఠానికి గ్రామర్ గూర్చి, అధ్యాపకత్వానికి ఒక గ్లామర్ తెచ్చిన ఉపన్యాసకులువారు. ఎన్ని గంటలైనా పొట్టి పదాల కూర్పుతో ఆ కూర్పుని చిక్కపడనీయకుండా చిక్కగా ప్రసంగించగల ఏకైక తెలుగు వక్త” అంటూ సృజన క్రాంతి పత్రికలలో రాశారు.

అరుదైన పరిశోధన ఆనర్స్ చదవడం వలన 20 సంవత్సరములకే ఉద్యోగం వచ్చింది. 62 సం.ల వరకు పనిచేశారు. ఉద్యోగం వచ్చిందే గానీ అతనికి పి.హెచ్.డి. చేయటానికి 9 సం.లు అవకాశం దొరకలేదు. ఆంధ్రా విశ్వవిద్యాలయం; ఉస్మానియా విశ్వవిద్యాలయం; శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా మొండిచేయి చూపించాయి. పి.హెచ్.డి.కి అనుమతి లభించక పోవడానికి కారణం తన సామాజికవర్గం అని ధైర్యంగా చెప్తారు. అయినా అనేక ప్రయత్నాలు చేసారేగాని అసంతృప్తితో అశాంతిని కొని తెచ్చుకోలేదు. అన్ని సంవత్సరాలు ఓర్పు వహించారు. అది ఆయన గొప్పతనం. ఇనాక్ గారి వ్యక్తిత్వంలోని ఒక గొప్ప విషయం. అందరిలోనూ మంచిని చూడడం.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు బి.యన్ రెడ్డి గారు కోరాడ మహాదేవ శాస్త్రి గారు చాలా ప్రోత్సహించి పి.హెచ్.డి. కోసం అప్లికేషన్ తెప్పించి వారిద్దరూ సంతకం పెట్టి అంశం ఇనాక్ నే ఎంపిక చేసుకోమన్నారు.

అందరూ చేసినట్టుగా కాకుండా ఇనాక్ ఏదైనా ఒక కొత్త అంశం మీద చేయాలనుకుని “వ్యాసం పై చేస్తాను” అన్నపుడు “అది నిస్సారమైన సబ్జెక్టు కదా!”అని వాళ్ళు అన్నారు. కానీ ఇనాక్ ఎంతో శ్రధ్ధతో ప్రణాళికను వ్రాసి చూపించిన తరువాత అంగీకరించారు. ఇనాక్ ప్రణాళికలో సుమారు ఒక వంద సం.ల పరిధిలో, వివిధ భాషలలో వెలువడిన అనేకమైన వ్యాసాలను చదవడం జరిగింది. అప్పుడు ‘వ్యాసం సృజన, విమర్శ అను రెండు లక్షణాలను కలిగిఉంది’ అని ప్రతిపాదించారు. ‘తెలుగులో వ్యాస పరిణామం’ ఒక గొప్ప పరిశోధనాత్మక విమర్శనా గ్రంథం ఇందులో 1862 నుంచి 1972 దాకా వచ్చిన వేలకొలది ఆంధ్ర,ఆంగ్లవ్యాసాలను లోతుగా పరిశీలించి వ్రాయబడిన గొప్ప సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించిన ఇనాక్ కాలాన్ని ఒక యుగంగా నిలిపి మన ముందు ఉంచారు. తన పరిశోధననూ ‘తెలుగు వ్యాస పరిణామం’ అనే పుస్తకం కింద దీన్ని తయారు చేశాక, ఎందరికో అది నిఘంటువు లాగా ఉపయోగపడింది. పి.హెచ్.డి.కి అనుమతి లభించడానికి 9 సం.లు పట్టింది. కానీ అందరికీ నాలుగు సం.లు పట్టే పరిశోధన ఇనాక్ మూడు సం.లలో పూర్తి చేశారు. పరిశోధన అన్ని విధాల అత్యున్నత ప్రమాణాలతో కూడి ఉన్నది.

ఒక వీరుడిగా ఎన్.సి.సి. ఆఫీసరుగా కల్నల్ అయ్యారు.

లెఫ్టినెంట్ కల్నల్ పత్రము అందుకుంటూ

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా అణగారిన జాతుల నుండి పి.హెచ్.డి.ని పొందిన ప్రప్రథమ వ్యక్తి డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారు. ప్రజాశక్తి; విశాలాంధ్ర వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అమెరికాలో కాలిఫోర్నియాలో కాత్యాయనీ విద్మహేగారు “తెలుగు వ్యాసపరిణామం ఒక వేదం” అన్నారు. అది చాలా మందిని కదిలించినటువంటి మాట.

ఎందుకంటే అందులో మహిళల కోసం అనేక వ్యాసాలు ఉన్నాయి. దాని ఆధారంగా స్త్రీవాద సదస్సులు నిర్వహించుకున్నప్పుడు మహిళలు ఏమన్నా మాట్లాడాలంటే ఆ పుస్తకం చూసి మాట్లాడేవారు.

తల్లి ప్రభావం: స్త్రీల పట్ల ఇనాక్ గారి అభిప్రాయాలు

స్త్రీలు అంటే అత్యంత గౌరవానికి కారణం. తన చిన్నతనంలో, వాళ్ళ సామాజిక వర్గములో స్త్రీలు ఇంట్లోపని, బయటపని కూడా చేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు తన తల్లిని, ఆమె అక్కచెల్లెళ్ళని స్వతంత్ర జీవనంగా బ్రతుకుతూ ఉండడం చూస్తూ పెరిగారు. ఎందుకంటే అప్పట్లో కూడా అమ్మానాన్న ఇద్దరు పనిలోకి వెళితే నాన్న ఇంటికి వచ్చిన తర్వాత కూర్చుంటే అమ్మ చక్కగా వంటింట్లోకి వెళ్లి వంట చేసి అందరికీ వడ్డించి పెట్టడం ఎంతో ఇష్టంగా చేయడం అనేది స్త్రీలు శక్తిశాలురు అన్నది వారి మనసులో నాటుకుంది.

మా అమ్మకు మంచి అభిరుచులు ఉండేవి. ఆమె మాటలు జీవిత సత్యాలుగా బాగా ప్రభావితం చేసేవి. అమ్మఅన్నా, ఆమె మాటలన్నా నాకు చాలా ఇష్టం. అమ్మనీ, ఊరినీ నేను వదిలి వెళ్ళను అనే వాడిని. అప్పుడు అమ్మ నాతో చెప్పేది. “రేపటి విషయం అనవసరం. ఈరోజు నువ్వు ఏమి చేయగలవు చూసుకో. దేశంలోని అందరి స్త్రీలను తల్లులుగా భావించితే అందరూ అమ్మలే! అనేది. నువ్వు చదువుకుని గొప్పవాడివి కావాలని ఆమె అనేవారు. ఎందుకంటే తండ్రి చనిపోయేనాటికి ఇనాక్ కు 12 ఏళ్లు తమ్ముడికి ఎనిమిదేళ్లు చెల్లికి నాలుగేళ్లు. అమ్మ కష్టం మీద అందరినీ పెంచేది. అన్నం పెడుతున్నప్పుడు ఏవో కొన్ని జీవిత సత్యాలను చెప్పేది.

“ఎవరిని కొట్టవద్దు పొట్టమీద అసలే కొట్టొద్దు” అనేది.

“ఇతరులపై కోపాన్ని తెచ్చుకొని హింసనీ, ద్వేషాన్ని ప్రదర్శిస్తే నష్టపోయేది ఇరువురు. అదే ఒకరు సహనం వహిస్తే రెండో వారు తమ తప్పు తెలుసుకుంటారు.

తన తల్లిని దృష్టిలో పెట్టుకొని ‘భారతదేశంలో స్త్రీలంతా మా అమ్మ లాగా ఉంటే ఈ దేశంలో ఎటువంటి సమస్యలు ఎదురవవు కదా!’ అని అనుకునేవారు. స్త్రీ తన శక్తిని తాను నమ్మడం, బ్రతికేందుకు విశ్వ ప్రయత్నం చేయడం, ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం అనేది ఇనాక్ గారి రచనల యొక్క లక్ష్యం.

ఉద్యోగ విజయాలు: అనేక ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ఆధ్యాపకులుగా పనిచేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ, శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలోనూ రీడరుగా, ఆచార్యునిగా పనిచేశారు. అనంతపురం ఎస్.కె. విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా, పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులుగా అయ్యారు. యు.జి.సి.లోను, ఇతర సాహిత్య అకాడమీలలోను కీలక బాధ్యతలు నిర్వహించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ కూడా ఆయన సేవలను వినియోగించుకుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేశారు. ఆక్కడే ఉపాధ్యక్షులుగా పని చేశారు. ఇతని రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన తరువాత ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అధ్యక్షునిగా నియమించింది. అలాగే వైస్ ఛాన్సలర్ కావడానికి మరొక 9 సంవత్సరాలు పట్టింది. 42 సం.లు విద్యాబోధనతో పాటుగా పరిశోధన కూడా చేశారు.2001 లో పదవీ విరమణ చేశారు.

విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే, విజయాలను సాధిస్తూనే, సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను స్పృశించారు. తనదైన శైలిలో ఆ రచనలు శాశ్వతత్వాన్ని పొందే విధంగా రాశారు. ఇనాక్ రచనలు ఇంగ్లీష్, కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలోకి అనువదించబడ్డాయి. సాహిత్య మరియు విద్యా ప్రయోజనాల కోసం అతని రచనలు విమర్శనాత్మక అధ్యయనాలకు లోనయ్యాయి.

నాటకాలు సంప్రదాయ నాటకాలు పద్యాలులో ఉన్నాయి. రచనలలో బాగా పేరు తెచ్చినవి ‘మునివాహనుడు’ నాటకం ఆరు లక్షల ప్రతులు అమ్ముడుపోయింది. ఇంటర్మీడియట్‌కి టెక్స్ట్ బుక్‌గా ఉండేది. మునివాహనుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటుగా 24 భాషలలోకి అనువాదం చేయబడింది. 1988లో “మునివాహనుడు” కథాసంపుటికి మరోసారి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ రకంగా రెండు సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న అరుదైన రచయితగా ప్రసిద్ధిచెందినారు.

“మునివాహనుడు ప్రభావంతో ఆధునికకాలంలో చాలా చోట్ల దళితులను భుజాలపైన ఎక్కించుకుని ఆలయాలలోకి తీసుకు వెళుతూ ఉండడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.” అన్నారు. ఉదాహరణ చిలుకూరి బాలాజీ ఆలయంలోకి రంగరాజన్ గారు తీసుకువెళ్లడం. తాను ఏదైతే ఆశించి ఆ పుస్తకము రాశారో అది వాస్తవంగా జరుగుతూ ఉండడం ఆ మార్పు నేను బ్రతికి ఉండగానే చూడగలగడం ఆనందదాయకం.” అంటారు.

“తాను రచనలు చేసేటప్పుడు చూసినది, తెలిసినది, అనుభవించినది, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలిసినదాన్ని వీటిని మాత్రమే తీసుకొని రాస్తాను. కనుక తన కథలన్నీ జరిగిన కథలే! అందుకే వాటికి ఆదరణ ఎక్కువ.” అంటారు.

మంచు శిఖరం: భారతి పత్రికవారు పుస్తకాలు చదివి, సమీక్షలు రాయమని అడగగా సుమారు 300 పుస్తకాలకు సమీక్షలు వ్రాశారు. బాల సాహిత్యం, స్త్రీల సాహిత్యం అలా అనేక నవలలకు కథలకు ప్రోత్సాహం ఉండేది. సృజన నిర్మాణం సృజన శిల్పం ఇనాక్ గారిలో ఉండడం వలన చిన్న వయసులోనే కథలకు, నాటకాలకు, కవితలకు బహుమతులు వచ్చేవి. నవలల పోటీలో కూడా ఆంధ్రప్రభ 16 వారాల సీరియల్ గా వచ్చింది.

‘భారతి’ లో ప్రచురింపబడిన ‘మంచు శిఖరం’ కథ చూస్తే ఫస్ట్ లేయర్లో అబ్బాయి అమ్మాయి ప్రేమ కథ లాగా కనిపిస్తుంది. రెండవ లేయర్లో 18 సం.ల వయసుకు వారి జీవితం నేను ఎలా రాసానా? అన్నది ఆశ్చర్యంగా ఉంటుంది. మూడవ లేయర్లోకి వచ్చేసరికి ఒక జీవిత సత్యాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా చేయడానికి చేయడమనేది వారి లక్ష్యం కథలో నెగిటివిటీ ఉండకూడదు అనేది ముఖ్యం. ఒకవేళ నెగిటివ్ గా రాయవలసి వచ్చినప్పుడు ముగింపు పాఠకులకే వదిలేస్తారు.

అనంతజీవనం: ఇనాక్ గారు 1964లో అనంతపురంకి వచ్చి వైస్ ఛాన్సలర్ పదవి పూర్తయ్యేదాకా కూడా రాయలసీమలోనే ఎక్కువ కాలం గడిపారు. గుంటూరు వదిలిపెట్టి రాయలసీమలో 42సం.లు ఉద్యోగం చేయడంవలన అతని సాహిత్యంలో అక్కడి మాండలికం, అక్కడి ప్రజలు, ఆ పరిసరాలు నిండి ఉంటాయి. అక్కడి సాహితీవేత్తలు, మిత్రులు, శిష్యులు, ఆ ప్రదేశంలోని మాండలిక పదాలు, వీటితో నేను మమేకమైపోయాను అంటారాయన. దాని ఆధారంగానే ‘అనంతజీవనం’ అనే నవల రాయడం జరిగింది. ఇది అతివృష్టి మీద రాసిన నవల ఎందుకంటే రాయలసీమ అనావృష్టికి పెట్టింది పేరు. కానీ ఒకసారి 36 గంటలు వర్షం పడినప్పుడు నీరు పోయే మార్గం లేక ప్రజలు పడిన ఇబ్బందులను చూసిన అనుభవమే ఈ నవల. ఇందులో తాత్వికత ఇమిడి ఉంది. ఏమంటే చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు “వర్షంలో గడ్డిపరక తలవంచి వర్షం తగ్గాక తిరిగి నిలబడుతుంది. కానీ అదే మర్రిచెట్టు కూలిపోతే మరి లేవడం జరగదు.” అనే తాత్వికత ఆధారంగా ఈ నవల రాయడం జరిగింది. 2015లో ‘అనంత జీవనం’ నవలకు భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం లభించింది. తెలుగులో ఆ పురస్కారం అందుకున్న ఏకైక వ్యక్తి.

పి.హెచ్.డి. పరిశోధన గ్రంథం తెలుగు వ్యాస పరిణామం జ్ఞానపీఠ్ మూర్తి- దేవి పురస్కారం అందుకున్న సాహిత్యం.

అనంతపురంలోని ‘దొర సమాధి’ చాలా ముఖ్యమైనది. ఒకసారి కలరా వచ్చినప్పుడు మనుషులు, గుర్రాలు, కుక్కలు చనిపోతే అందర్నీ ఒకే చోట సమాధి చేశారు బ్రిటిష్ వారు.

రంధి’: ఇనాక్ గారి అన్ని రచనలు మనసును కదిలిస్తాయి కానీ ‘రంధి’ గురించి ఎంతోమంది వాటి మీద సమీక్షలు రాశారు. సదస్సులలో చర్చించుకున్నారు. బాగా పేరు పొందిన నవల హిందీలో కూడా అనువాదం చేయబడింది. ఇంగ్లీషులో కూడా వస్తే మంచి పేరు వస్తుంది. దీని నేపథ్యము తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామ నేపథ్యంలో చిత్రించబడ్డది.

“రంధి అంటే పేచీ అని ఘర్షణ అని కూడా అర్థం. ఎవరి మధ్య పేచి? మనకు తెలిసినదే! గ్రామంలో అత్యంత శక్తివంతమైన భూస్వామ్య కుటుంబానికి వారి మోచేతి నీళ్లు తాగుతూ బ్రతికే మాదిగ కుటుంబానికి మధ్య జరిగినది రంధి నవల. ఇది రెండు కుటుంబాలకు సంబంధించినది అయినప్పటికీ కూడా ఆ భావాలు కులం, మతం, వర్ణం, వర్గం, స్త్రీ, పురుషభేదాలు అన్నిటి మధ్య ఈనాటికీ కూడా రంధి కొనసాగుతూనే ఉంది. అన్నది నవల చదివితే మనకు అర్థమవుతుంది. మాదిగ కులంలో 56 రకాల వారు ఉన్నారు. ఇందులో 12 మంది ఉప్పర వాళ్ళు ఉన్నారు. ముండోడు బండోడు అనే రెండు కులాల వారు మిగిలిన కులాల వారికి అన్నం పెట్టాలి మాదిగల దగ్గర యాచన చేసుకొని బతుకుతారు. ఇదెక్కడి సామాజిక న్యాయం?” అని ప్రశ్నిస్తారు.

ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి శత్రువు కారు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండవలసినదే.

ఇనాక్ గారు తన గురించి తను చెప్పుకుంటూ ఇలా అంటారు. “దళితులు పీడితులు అణిచివేతకు గురి అయిన వారు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్నే నేను ఉంటాను. నా కలం వారి గురించే రాస్తుంది. అయితే నేను అలజడులు ఆందోళనలు చేయను. కానీ జరిగిన దాన్ని యధాతధంగా ప్రపంచం ముందు ఆవిష్కరణ చేస్తాను.” అంటారు.

ఇలాంటి నవలలు కథలు రాసినప్పుడు ఆయన మనలను ప్రశ్నిస్తూ ఉంటారు.

“వాడు గెలిచినా కూడా ఎందుకు వాడికి అర్థమే కాదు. గెలుపు వాడికి ఒక ఊహించరాని చర్య కావచ్చు. అందుకే గెలిచినా కూడా ఆ భూస్వామి కాలు పట్టుకొని వదలడని, క్షమించమని అడుగుతాడని చాలా చోట్ల చెబుతూ ఉంటారు. వాడి గెలుపు వాడికి తెలియజేయడమే వాడి ద్వారా ఆ వర్గానికి అందరికీ కూడా తెలియజేయడమే ఇనాక్ గారి ముఖ్య ఉద్దేశం

మార్గదర్శి: ఆయనకు తెలుగు పట్ల, చదువుపట్ల ఉన్న నమ్మకం, అభిమానం ఆయనను తనున్న స్థితిలో నుంచి బయటపడేయడమే కాకుండా పదిమందికి దిక్సూచి చూపేటట్లు, ఒక దీపంలా ఆ చీకటి బ్రతుకులకు వెలుగు చూపినట్లు, ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించి తన వారికి చేయి అందించేందుకు ఉపయోగపడింది అని అనిపిస్తుంది. నవల కనుక అనేక మార్పులు తిరుగుతూ, అనేకమైన సంఘటనల ద్వారా హింసకు గురి చేసే వారి దురాగతాలను గురించిన తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు మాదిగ కుల పెద్ద ‘ముళ్ళ కంచెపై పడిన బట్ట చిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.’ అని చెప్పిన మాటలు ఇనాక్ గారికి వారి తల్లి చిన్నప్పటినుంచి చెప్పిన నిత్యసత్యాలు, జీవన సూక్తులు గుర్తుకు వస్తాయి. వాటిని ఆయన తన మదిలో నిక్షిప్తం చేసుకోవడమే కాకుండా తన కథలలో, నవలలో, కవిత్వంలో ఎక్కడో ఒక దగ్గర అవసరమైనప్పుడు వాటిని ఒక పాత్ర ద్వారా చెప్పించుతూ ఉండడం అనేది సహజంగానే అలవడింది.

వారి రచనలు ఒకటి రెండు చదివేసి ఇనాక్ గారిని అంచనా వేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఆయన యొక్క ప్రతి కథా, నవలా, కవితా, వ్యాసం, నాటకం అన్నీ చదవాలి. వినాలి. తొందర తొందరగా కాదు. మనం ఆ పాత్రలో మమేకమయ్యేంత విధంగా వర్ణనలు ఆయన చేస్తారు. అవి మనకు కొన్నిచోట్ల జుగుప్స కలిగించినప్పటికీ కూడా అది వారి నిత్యజీవితమైనప్పుడు మనం చదవడానికి కానీ, వినడానికి గాని ఇష్టపడకపోతే వారి జీవితం మనకు ఎలా తెలుస్తుంది?? అందువలన ఆయన ప్రతి రచనలను ఎం.ఫిల్ చేయడానికి గాని, పిహెచ్.డి. చేయడానికి గాని అంశంగా తీసుకొని చేస్తున్న ఆ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి డిగ్రీ రావడం ముఖ్యం కాదు. ఎన్ని కోణాలలో వాళ్ళుదాన్ని ఆవిష్కరించగలుగుతారు అన్నది ఆ పరిశోధనలో మనకు తెలుస్తుంది.

ఊరబావి’ కథానిక సంపుటానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.

1969 లో రాసిన ‘ఊరబావి’ కథ ఫ్రెంచి, జర్మన్, స్పానిష్ లోకి అనువదింపబడడం వలన ఎంతో మంచి పేరు వచ్చింది. కథలో ముగింపు వైవిధ్యంగా ఉంటుంది. ఎందుకంటే హ్యాపీ ఎండింగ్ లాగా కనిపిస్తుంది కానీ అందులో బాధ అంతర్లీనంగా ఉంటుంది. అందులో ఇలా అంటారు.

“ప్రేమ ప్రాతిపదిక మీద బతికే సమాజం వ్యవస్థ ఏ రోజు పుడతాయి?” అని ప్రశ్నిస్తారు.

అకారణంగా ద్వేషిస్తారు. అకారణంగా ప్రేమిస్తారు. ప్రేమ ఫరవాలేదు గాని ద్వేషము ఉత్తమమైనది కాదు. విశ్వ మానవప్రేమ మతానికి అతీతమైనది. దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండవలసినటువంటి గుణం ప్రేమే జీవితం. ఇనాక్ గారిది ప్రేమపునాది మీద నిర్మించబడిన ప్రజాస్వామ్యక మానవీయ నాగరిక ప్రపంచం. అలాంటి సమాజం కోసం చేసే ప్రయత్నమే ఆయన రచనలు అవి మనలను ఆలోచింపచేస్తాయి. ఆ పరిస్థితులలో మనం ఉండేవిధంగా దృశ్యకావ్యాలుగా నిలబడతాయి. మనలను ప్రశ్నిస్తాయి. అతను ముగింపులు కూడా పాఠకులకే వదిలేస్తారు. కానీ కథలో ఎక్కడో ఒకదగ్గర ఒక చిన్నవాక్యం అద్భుతంగా రాస్తారు. దానినిబట్టి మనం ముగింపు ఊహించుకోవచ్చును.హింసాత్మకమైన ముగింపులు దుఃఖాంతాలు ఆయనకు ఇష్టం ఉండవు. దానివలన సాధించేది ఏమీ ఉండదు.

నువ్వే కదా అన్నది 4 భాగాలుగా రాశారు. ఒక్కోభాగం తల్లి గురించి, భార్య గురించి, తండ్రి గురించి, గురువుల గురించి రాశారు..

సాహిత్య ప్రయాణం: ఆయన కలం పట్టగానే సాహిత్య ప్రక్రియలన్నీ ఆయనను వలచి వచ్చాయి. కవిత్వం, కథానిక, నవల, నాటకం, విమర్శ, పరిశోధన, అనువాదం, వ్యాసం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు అన్నది సామాన్యమైన మాట విలువైన రచనలు చేశారు అన్నది సరైన మాట.

“కన్నీళ్లు లేని సమాజం కోసం కలం పట్టాను.

నా అనుభవాలే నా కథలు./ నా కన్నీళ్లే నా సాహిత్యం.”అంటారు.

1954లో ‘ఉత్తరం’ కథతో అతని సాహిత్యజీవనం మొదలై అనంతంగా సాగుతోంది. అగ్రవర్ణాలలో అనేకమంది ప్రముఖ రచయితలు, రచయిత్రులు కొనసాగుతున్నవేళ ఇనాక్ గారి రచనలు నశ్వరమైన తాటియాకులపై వ్రాతలు కావు. అనేక ఒత్తిడిలకు గురి అయిన కాలమనే పుస్తకంలో జాతి,మత,కుల,వర్ణ,వర్గాలలో అన్నింటా వివక్షకు గురి అయి బంగారానికి పుటం పెట్టినట్టు ఆ సువర్ణద్రవములో తన కలాన్ని ముంచి రాసారు. ఆయన వస్తువు, శైలి, శిల్పం కథ, కథనం అనేకమంది సాహితీవేత్తలకు మార్గదర్శకమైందే తప్ప వారు ఎవరిని అనుకరించలేదు. ఎందుకంటే రాసినవన్నీ తన కంటి ముందు జరిగినవి చూసినవి అనుభవించినవి. చీకటిలో అలమటిస్తున్న తన వాళ్లకు తానొక చైతన్య దీపిక అయినాడు.

కొలకలూరి ఇనాక్ గారు 1950 నుండి 2025 వరకు తెలుగుభాషలోని అన్ని ప్రక్రియలను స్పృశించారు. పద్య కావ్యం, నవల, నాటకం, వ్యాసం, చిన్న కథల రచనలోని శైలి విశిష్టత రచనా చమత్కృతి.ప్రజలలోకి ఎంత ఎక్కువగా చొచ్చుకు పోయాయి అంటే పరీక్ష పత్రాలలో కొలకలూరి ఇనాక్ గారి రచనలపైన, బిరుదులపైన ప్రశ్నలు అడుగుతున్నారు. అతను రాసిన కథలు మానవ సంబంధాలలోని వైవిధ్యాన్ని, సంఘర్షణను వ్యక్తీకరించే కథలు.

కొలకలూరి విముక్తవాద రచయిత మానవ విముక్తి ఆయన సాహిత్యం లక్ష్యం.

అసమానతల నుండి విముక్తి.ఆర్థిక సాంఘిక విముక్తి కోర్ ఇనాక్ విముక్తవాద రచయితని అందరూ అంటారు. ఎందుకంటే సంయమనంతో సమస్యను పరిష్కరించడం అనే తత్వం కలవారు. జీవితంలో పగలు, ప్రతీకారాలు, హింస, ద్వేషం ఇలాంటివి ఉండకూడదని భావిస్తారు. సంపన్నుల నుండి పేదవారికి; అగ్ర కులాల నుండి పీడత కులాలకు; పురుషుల నుండి స్త్రీలకు; అధిక సంఖ్యాకుల నుండి అల్పసంఖ్యాకులకు; విముక్తిని కోరడమే వీరి లక్ష్యం.వారి సాహిత్యాన్ని కొన్ని ప్రామాణికాలను తీసుకొని విభజించినట్లయితే అన్ని ప్రామాణికాలను ఉన్నతమైనటువంటి రచనలు చేసినవారిగా కొలకలూరివారి రచనలే నిలుస్తాయి. సమాజంలో మార్పుని కోరుకునే వారికి ఇనాక్ రచనలు చేయూత నిచ్చి త్రోవ చూపిస్తాయి.

స్వతంత్ర ప్రేమికుడు అంటే స్వతంత్రం అనేది ఒకరు ఇచ్చేది కాదు ప్రజలు సర్వ స్వతంత్రులు కావాలి. ఆ రోజు కోసం మనం ఎదురు చూడడం కాదు. ప్రయత్నించాలి.

‘మనిషి నా ఊపిరి మనిషి నా చైతన్యం’ అంటారు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2016 సంవత్సరంలో వెలువరించిన తెలుగు ‘సాహిత్య విమర్శ దర్శనం’ గ్రంథంలో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి గురించి వారి విశ్లేషణాత్మకమైన వారి రచనల గురించి అనేక వ్యాసాలు వ్రాయబడి ఉన్నాయి.

ఇనాక్ గొప్ప మానవతావాది. ఆ ఒక్క పదంలోనే ప్రేమ, దయ, కరుణ, దేశభక్తి, మానవత్వం మిళితమై ఉంటాయి.రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం సమయంలో పుట్టిన ఆయన అణువణువులో ప్రతి రక్తపు బొట్టులో దేశభక్తి వెల్లువెత్తి ప్రవహిస్తూ ఉంటుంది.

ఒక గొప్ప దార్శనికుడు ప్రేమికుడు (కొలకలూరి మధుజ్యోతి- 386 పే.)

1997 లో వీరు రచించిన ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం – ఆధునిక సాహిత్య అవగాహన, అధ్యయనం, బోధన ఎలా ఉండాలో తెలియని ఒకానొక అయోమయస్థితిలో ఉన్న సాహిత్య అభిమానులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు ఈ విమర్శనం కరదీపిక వంటిది. ఆధునిక సాహిత్యం ప్రాథమికంగా వస్తు ప్రధానంగా ఉంది. కనుక విమర్శ రూపపరిధిని దాటి వస్తు ప్రముఖంగా సాగాలని విశ్వసించి. చారిత్రక వాస్తవ సామాజిక సాంస్కృతిక వస్తు పరిశీలనతో సాహిత్య విమర్శ ఉండాలని నిర్ణయించి ఆ పరిశీలన త్రిగుణాత్మకంగా ఉండటాన్ని ఈ గ్రంథంలో స్థిరీకరించారు. నిబద్ధత, నిమగ్నత, నిబిడత గుణాలతో ఆధునిక అత్యాధునిక సాహిత్యాలు ఏక గుణ ప్రధానంగా, ద్విగుణంగా, త్రిగుణాత్మకంగా ఉండటాన్ని నిరూపించారు. మార్క్సిజము దృష్టితో సాహిత్య అనుశీలనం చేసే సందర్భాలలో వాడే నిబద్ధత నిమగ్నత ముందు నుంచే ఉన్నాయి. వాటిని విమర్శకు అన్వయించడానికి స్పష్టపరిచింది గ్రంథం ఈ రెండింటి కంటే విశిష్టమైనది నిబీడత (inclusiveness) ఇదే కొలకలూరి ప్రపంచ సాహిత్యవిమర్శకు ప్రసాదించినసూత్రం (లక్ష్మణ చక్రవర్తి గారు-351పే.)

తెలుగు సాహిత్యంలో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ విలువైన రచనలు చేసిన విమర్శ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. తెలుగు వ్యాసపరిణామం 1980; ఆధునిక సాహిత్యవిమర్శసూత్రం1996; శూద్రకవి శుభమూర్తి వసు చరిత్ర వైశిష్ట్యం 1996; ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం; 1996 జానపద సాహిత్య విమర్శ 2010; తెలుగులో తొలి నవల 2010; తెలుగు నవలా 2013 తెలుగు కథానిక 2013 అంటే ఎన్నో విమర్శనా గ్రంథాలు వెలువరించారు. వీటిలో ఆయా సందర్భాల్లో దళిత సాహిత్యం పై విమర్శ ఉన్నప్పటికీ ప్రధానంగా ఆయన సాహిత్య విమర్శ సూత్ర గ్రంథంలో దళిత దృక్పథం కనిపిస్తుంది. సాహిత్య విమర్శసూత్రం గ్రంథంలో ఈయన ఆధునిక సాహిత్యంలో రూపం కంటే వస్తువుకు ప్రాధాన్యత ఇచ్చి, సాహిత్యాన్ని సంస్కరణ పునరుజ్జీవన కల్పనగా, అభ్యుదయ, దిగంబర, విప్లవ, స్త్రీవాద, దళిత సాహిత్యం అంశాలుగా వివరించారు. ఈ విశ్లేషణలో ఆయన నిబద్ధత, నిమగ్నత, నిబడత ఆధునిక సాహిత్య గుణాలు గుర్తించి ఈ నేపథ్యంలో విమర్శ కొనసాగాలని దళిత సాహిత్య మధ్యంలో దళిత సాహిత్యం క్రమ పరిణామాన్ని వికాసాన్ని జరిగిన కృషిని జరగవలసిన కృషి సమీక్షించారు.

కొలకలూరి ఇనాక్ – విమర్శకునిగా అతని భావాలు

కొలకలూరి ఇనాక్ దళిత దృక్పథంతో తెలుగు సాహిత్యాన్ని విమర్శించిన వ్యక్తి. రామరాజ భూషణుడిగా సాహిత్యంలో అందరికీ తెలిసిన శుభమూర్తిగా కొందరికే తెలిసిన అతడి చరిత్రను వివేచించాడు ఇనాక్. ఈ కవిపై సమగ్ర పరిశోధన చేసిన విమర్శకుడు ఇనాక్. శూద్రుడైన ఈ కవి గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యంలో ఇనాక్ భట్రాజు కులానికి చెందినవాడు కావటం వలన శుభమూర్తిని బ్రాహ్మణ కవులు భట్టుమూర్తిగా పిలిచారు. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసిన దళిత సాహిత్య విమర్శకులుగా ఆయన తన అభిప్రాయాలను ఇలా చెప్పారు

“ఆధునిక కాలంలో వచ్చిన అభ్యుదయ విప్లవ సాహిత్య ఉద్యమాలు కూడా దళిత సమస్యకు పరిష్కారాన్ని చూపలేకపోయాయి.” అన్నారు.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రాసిన ‘సాగర సంగమం’లో మాల మాదిగల మధ్య వివాహం చిత్రించడం చాలా గొప్ప రచనలుగా ఇనాక్ చెప్పారు. పై కులాలు మారాలని చెప్పేముందు క్రింది కులాలు కూడా మారాలని సహజ న్యాయం ఎవరు కాదనలేనిది. ఒక సంప్రదాయ రచయిత నుంచి ఆ కాలంలో ఇలాంటి రచన రావడం అభినందించదగినది. సాహిత్యానికి దర్పణం లాంటి సమాజంలో నుంచి దళిత సాహిత్యాన్ని అర్థం చేసుకొని విశ్లేషించిన కొలకలూరి ఇనాక్ దళిత సాహిత్య విమర్శకు ప్రారంభకులు. ఇనాక్ స్వయంగా కవి రచయిత కావడం కూడా ఆయన విమర్శకు మరింత పదును చేకూర్చింది.

విమర్శ గ్రంథాలే 11 ఉన్నాయి.

ఇనాక్ గారు సాహిత్యంలో విమర్శకునిగా ఒక ఉన్నత స్థానాన్ని అందుకున్నారు.

సాహిత్య విమర్శ గ్రంథం విమర్శినికి 2018లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి తెలుగు వెలుగులు రెండు తెలుగు నవల మూడు తెలుగు కథానిక

అనుభూతిప్రధానమైనది కవిత్వం

ఆలోచనా ప్రధానమైనది కథానిక

జీవితానుభవ ప్రధానమైనది నవల.

తెలుగుభాష కోసం పాటుపడే వారికోసం ఆయన మాండలికాలను ఆరు విధాలుగా విభజించారు. 1.తెలంగాణ మాండలికం 2.రాయలసీమ పూర్వాంద్ర మాండలికం 3.గోదావరి మాండలికం 4.సర్కారు మాండలికం 5.నెల్లూరు మాండలికం 6.చిత్తూరు కొంత ఒంగోలు మాండలికం

ఈ పుస్తకం ద్వారా ఇనాక్ గారు సాహిత్య విమర్శకులకు ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక నిబద్ధత ఒక తాత్విక నేపథ్యం ఉండడం ఎంత అవసరమో ఎందుకు అవసరమో తెలియజేశారు.

వందేళ్ళ కథకు వందనాలు అనీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రాసిన కథలలోంచి ‘పిండీకృతశాటీ’ అనే కథను ఎంపిక చేశారు..

డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారికి లభించిన బిరుదులు-పురస్కారాలు

గుర్రం జాషువా సాహిత్య పురస్కారం రజత కిరీటం

అందుకున్న కొన్ని విద్యా పురస్కారాలు:

అసాధారణ సాహితీమూర్తి పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1959లో అదే యూనివర్సిటీ నుంచి బి.ఎ. ఆనర్స్ పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ప్రస్థానం ప్రారంభించిన ఇనాక్ తన 85వ ఏట అదే విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి జీవన సాఫల్య పురస్కారం స్వర్ణకంకణంతో

దళిత భూమి లోంచి చొచ్చుకు వచ్చి ఎన్నో కష్టాలు వివక్షలు ఎదుర్కొని ఎదురీది సాహితీ విద్యా వట వృక్షం గా మారిన ఇనాక్ గొప్ప ఆదర్శప్రదాత. అలుపెరుగని సాహితీ సేద్యం చేస్తున్న గొప్ప రచయిత. సాహిత్య రంగంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన సాహితీవేత్త. పి.హెచ్.డి. చేసిన శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికే వైస్ ఛాన్స్-లర్ అయిన మహా మేధావి, అంతకు మించిన గొప్ప మానవతామూర్తి ఇనాక్.

అత్యున్నత స్థాయికి చేరినా మూలాలను మరచిపోని స్ఫూర్తి శిఖరం ఆయన. ఆయన తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి. తెలుగు పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి.

వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. పరిశోధనారంగము: భారతదేశానికి మకుటాయమానమైన కోహినూరువజ్రాన్ని బ్రిటిషువారు తరలించుకుపోయారు. కానీ కొలకలూరి ఇనాక్ అనే కోహినూరు మన దగ్గర మనతోనే ఉన్నది.

విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టడానికే నిరాకరింపబడిన ఇనాక్ రాసిన సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి, పరిశోధించడానికి తానే ఒక పరిశోధనాంశమైనాడు. అనేకమంది ఆయన దగ్గర వివిధ అంశాలపై పి.హెచ్.డి. పట్టాలు పొందారు. ఆయన రాసిన ప్రతి రచన ఏ ప్రక్రియలో రాసినా అది ఒక పరిశోధనాంశంగా తీసుకోవలసిన వస్తు వైవిధ్యం గలది.

ఒక వ్యక్తి ఎదిగితే మరొక వ్యక్తికి అసూయ. నచ్చదు. కానీ దళితునిగా, విద్యాపరంగా, సాహిత్య పరంగా, సమాజపరంగా, అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న ఇనాక్ ని చూసి దళిత సమాజం గర్వపడుతుంది. మావాడు అని గొప్పగా చెప్పుకుంటుంది. ప్రేమగా పలకరిస్తుంది. ప్రీతిగా అక్కున చేర్చుకుంటుంది. ఎందుకంటే అతడొక గొప్ప దార్శనికుడు.

ఒక గొప్ప విశేషం ఏంటంటే ఆయన రచనల మీద, ఆయన మీదా కూడా పి.హెచ్.డి.లు చేసిన విద్యార్థులు కొల్లలుగా ఉన్నారు. 57 మంది ఇనాక్ గారిపై పరిశోధన చేస్తే, 24మంది వేరే అంశాలపై ఇతని దగ్గర పరిశోధన చేశారు. ఇది తెలుగు సాహిత్యంలో ఒక రికార్డు.

అందుకే తన దగ్గర పరిశోధనలు చేసే వారికి ఆయన ఇచ్చే అంశాలు హరిజనాభ్యుదయం ఆధునిక తెలుగు నవల, తెలుగు కథానిక, తెలుగు కవిత్వం, తెలుగు నాటకం అనే అంశాలపై పరిశోధనలు చేయించారు. వీరంతా కొలకలూరిగారి భావజాలం, ప్రాపంచిక దృక్పథం అర్థం చేసుకుని స్వయంగా వచ్చిన వారు.

ఎలాంటి భేషజాలు వుండవు. ఎంతో ఒదిగి ఉంటారు. ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలకరిస్తారు. ఎప్పుడైనా ఏ కార్యక్రమానికి పిలిచినా “వస్తున్న” అని వెంటనే చెప్పడమే కాకుండా, కార్యక్రమం రోజున ఖచ్చితంగా సమయానికి వచ్చేస్తారు. సందర్భోచితంగా చక్కగా ప్రసంగిస్తారు. చక్కటి పంచెకట్టులో, చెదరని చిరునవ్వుతో ఉట్టిపడే ప్రేమ కళ్ళతో నిలువెత్తు తెలుగు సంతకంలా కనిపిస్తారు.

17-12-2023, హైదరాబాదులో జరిగిన- అంతర్జాతీయ ఆటాసాహిత్యసదస్సులో శ్రీ కొలకలూరి ఇనాక్ గారు ఇలా అన్నారు. “ఆయారంగాల్లో నిష్ణాతులైన సాహిత్యకారులందరిని ఒకేచోటచేర్చి, పలు ఆసక్తికరమైన అంశాలను మాత్రమే సృజిస్తూ చేసిన ప్రసంగాలు ద్వారా రెండేళ్లు కష్టపడి చదివిన డిగ్రీలో నేర్చుకునేంత సాహిత్యాన్ని ఒకే రోజులో నేర్చుకోవడానికి దోహదం చేసింది ఈ సాహిత్య సదస్సు” అన్నారు.ఇంతటి అద్భుత కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం వేదిక కావడం, చాలా సంతోషమని” ఆటా సాహిత్యసేవలని కొనియాడారు. ఇంత ఎత్తుకు ఎదిగినా తానే గొప్పవాడినని భావించని నిగర్వి.

2014 లో పద్మశ్రీ పురస్కారం రాష్ట్రపతి ద్వారా అందుకుంటూ ఆచార్య ఇనాక్ గారు

గౌరవ డాక్టరేట్ చదివిన యూనివర్సిటీలో, చదువు చెప్పిన యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక గౌరవం పొందడం అంటే హిమాలయాల అంచులను తాకిన సంబరమే. ఒకరిద్దరికి మాత్రమే లభించే అరుదైన మహా గౌరవం ఇది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 90వ స్నాతకోత్సవం సందర్బంగా విశాఖ యూనివర్సిటీ ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

కొన్ని ముఖ్యమైన రచనలు:

కవితలు ఆశా జ్యోతి; షారా మముల; కులం ధనం; నన్ను కలగననివ్వండి; కలల కార్ఖానా; త్రిద్రవ పతకం; చెప్పులు; ఆది-ఆంధ్రుడు; మెరుపుల ఆకాశం; కన్నీటిగొంతు; నిశ్శబ్ద స్వరం

నాటకాలు కీ; జై హింద్; మనలాంటి మనిషి; మునివాహనుడు; సాక్షి; ఇడుగో ఏసుక్రీస్తు; నీడ; వోట్లాటా; ఐదవ ఎస్టేట్

వన్ యాక్ట్ నాటకాలు దృష్టి (ప్లేలెట్ల సేకరణ); జ్యోతి (ప్లేలెట్ల సేకరణ); అభ్యుదయం (ప్లేలెట్ల సేకరణ) రేడియో నాటికలు (ప్లేలెట్ల సేకరణ) టీవీ నాటికలు (ప్లేలెట్ల సేకరణ) అమ్మ (ప్లేలెట్స్ సేకరణ) కెఇ నాటక సాహిత్యం (ప్లేలెట్ల సేకరణ)

సాహిత్య విమర్శ

సాహిత్య పరామర్శ; ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం; జానపదుల సాహిత్య విమర్శ; శూద్రకవి శంభుమూర్తి వసు చరిత్ర వైశిష్ట్యం; సాహిత్యదర్శిని; తెలుగు వ్యాస పరిణామము; తెలుగు భాషా చరిత్ర; తెలుగు తొలి నవల; తెలుగు వ్యాసం; తెలుగు విమర్శనం; తెలుగు వచనతత్వం; మిత్రసమాసమే; పునరుక్తిగుణమే; తెలుగు సాహిత్యంలో హరిజనులు; ఆధునికాంధ్ర సాహిత్యంలో ముస్లింలు;తెలుగు వ్యాసాలు; సాహిత్య సంభాషణం; సమీక్షం; సమీక్ష సాహిత్యం; పిథిక సాహిత్యం; తెలుగు కథానికా పరిణామం; చిన్ని కాయితాల వెన్నెల; తెలుగు నవల వికాసం; సాహిత్య ప్రయోజనం; మొదలైన విమర్శనా గ్రంథాలను ప్రచురించారు.

నవలలు సమత; అనాథ; సౌందర్యవతి; సౌభాగ్యవతి; ఎరులలో వీరులు; ఎక్కడుంది ప్రశాంతి?; రెండు కళ్ళు-ముడు కళ్ళు; సర్కారు గడ్డి; అనంతజీవనం; మజిమానిషి; కాలమేఘలు; స్త్రీదర్శనం (నవలల సంపుటి); దళిత నివేదనం (నవలల సంపుటి); సమాజ సందర్శనం (నవలల సేకరణ)

చిన్న కథల సంకలనాలు గులాబీ నవ్వింది; భవానీ; ఎడారి జీవితం?; ఊరబావి; సూర్యుడు తలెత్తాడు; కట్టడి; కొలుపులు; అస్పృశ్యగంగ; కాకి; దళిత కథానికలు; పెద్దమ్మగుడి

అనువాదాలు కొత్త నిబంధన – కొత్త ఒడంబడిక; క్షమాభిక్ష – ఇతర కథలు – క్షమాభిక్ష & ఇతర కథలు; వోట్లాటా – ఓట్ల ఆట; అనంతజీవనం – అంతులేని తుఫాను; కన్నీటి గొంతు – శూర్పణఖ ఇంకా ఏడుస్తూనే ఉంది.

బాలల సాహిత్యం అమ్మ – నృత్యం & సంగీత నాటకాలు

ఇనాక్ గారికి సంబంధించి కొన్ని ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసే పదాలు

ఇనాక్ మానవతావాది. ఇనాక్ గారి దృష్టిలో స్త్రీలు శక్తిశాలురు.

మానవీయతా పతాకమే ఆచార్య కొలకులూరి ఇనాక్. సామాజిక తత్వవేత్త

ఆత్మగౌరవ పోరాటం చేసే వ్యక్తి కొత్త ఒరవడిని సృజించాలి అనుకునే సృష్టికర్త. విముక్తవాది

విశ్వజనీన జీవన సత్యాలను వెలువరించగల విస్తృతమైన సృజన శక్తి కలవాడు.

మౌనానికి భాష్యం చెప్పిన మహా రచయిత రచనా చమత్కృతి కలవాడు.

తెలుగు సాహిత్యంలో దళిత చైతన్య తాత్విక భూమికను అందించిన వాడు.

అదేవిధంగా నిద్రలో లేపి అడిగినా తన కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం ఏ దేని గురించి అడిగినా దాని యొక్క నేపథ్యం ఏమిటో ఆ ముగింపు ఏమిటో ఎందుకు ఆ ముగింపు ఇచ్చారు కొన్ని ఎందుకు పాఠకులకు వదిలివేసారు అన్నవి చక్కగా చెప్పగలరు. మనం కూడా అతని రచనలను పూర్తిస్థాయిలో చదివి అర్థం చేసుకున్నపుడే సామాజిక న్యాయం జరిగే అవకాశం ఏర్పడుతుంది.

ప్రేమమూర్తిగా ఆయన ఈ శతాబ్దపు దళితునిగా పుట్టి తన నేపథ్యాన్ని తన పరిసరాలను చిత్రిక పట్టి ప్రజలకు అనేక సాహితీ ప్రక్రియల ద్వారా చీకటిలో ఉన్న తన వారిని తన రచనలనే చైతన్య దీపికలతో ప్రపంచానికి చూపించిన మహా మనీషి. మహా పండితునిగా వారసత్వంతో, పరిశోధకుడు, విమర్శకుడు, తెలుగు అధ్యాపకుడు అయ్యారు. నోబెల్ బహుమతికి ధీటు రాగల రచనలను చేసి తను ఏంటో ప్రపంచానికి చూపించారు.

చిన్నప్పుడు నుంచి 87 సంవత్సరాల వయసు వచ్చిన వరకు రాసిన ఈరోజు వరకు కూడా ఆపకుండా రాస్తున్న ఆ మహావ్యక్తి ‘పద్మశ్రీ’ గ్రహీత తన రచనలన్నీ ఆంగ్లంలోకి అనువాదం చేయబడితే ప్రపంచవ్యాప్తంగా అందరూ చదువుతారు కదా! అనుకుంటారు. జీవితచరిత్ర ఎవరైనా రాస్తే తన గురించి మొత్తం ప్రపంచానికి తెలియాలి అన్నది అతని కోరిక. ఆ దిశలో మనం కూడా ప్రయత్నిద్దాము.

(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)

Exit mobile version