Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వంచన

[శ్రీమతి అక్షర రాసిన ‘వంచన’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

డోరు బెల్ విని తలుపు తీశాను. ఎదురుగా నిలచిన దీపని చూసి ఆనందంతో వెలిగిపోయిన నా ముఖం పక్కనే ఉన్న వ్యక్తిని చూసి అంత కంటే ఎక్కువగా మాడిపోయింది. మారుతున్న నా ముఖ కవళికలను గమనించిన దీప, “మమ్మల్ని లోపల్కి రమ్మంటావా?” అని అడిగింది. చేసేది లేక ముభావంగా పక్కకి తొలగి వారిద్దరికి దారి ఇచ్చాను. ఇద్దర్నీ కూర్చోమని చెప్పి నేను నా మనస్సును సర్దుకుందామని లోపలికి వచ్చేసాను.

నా భుజం పై పడిన దీప చేతిని పక్కకి తొలగించి వెనుతిరిగిన నేను కోపం ఆపుకోలేక – “ఏమనుకుని అతన్ని తీసుకుని నా ఇంటికి వచ్చావు” అని అడిగాను గట్టిగా, అతను నా మాటలు వింటాడని తెలిసినా.

“సారీ సత్యా, నీన్ను ఇంత బాధ పెట్టినందుకు..” అని, క్షణం ఆగి మళ్ళీ తానే అంది – “అతను నీకు తెలిసిన మనోజ్ కాదు సత్యా, పూర్తిగా మారిపోయాడన్న నమ్మకం కుదిరాకనే అతన్ని వివాహం చేసుకున్నాను.”

అప్పుడే గమనించాను దీప నుదుటి పైన ఉన్న సిందూరం. మనస్సు ఇంకా బాధపడింది. దీప చెపుతున్నది వినక తప్పలేదు.

“ప్రస్తుతం మేమీద్దరం కాశీ విశ్వవిద్యాలయం లోనే ఒకే డిపార్ట్‌మెంట్ లోనే లెక్చరర్స్‌గా ఉన్నాము. రెండు నెల్ల క్రితమే తను ధైర్యం చేసి తనని క్షమించి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డాడు. నేను వెంటనే ఒప్పుకోలేదు సత్యా. కావాలంటే మీ అమ్మా నాన్నల్ని కలసి అడుగుతానని అన్నాడు. ‘మా అమ్మా వాళ్ళకి నువు చేసిన వెధవ పని ఏం తెలుసు, వారిని అడగటానికి’ అన్నాను. ‘అయితే నీకు నా పై నమ్మకం కుదరటానికి ఏం చేయాలో చెప్పు చేస్తాను’ అని అన్నాడు. ఒక రోజు మనోజ్ పేరెంట్స్‌ని కలవటానికి వెళ్ళాను. మనోజ్ చేసిందానికి వాడి తండ్రి మన ‘హెచ్.ఓ.డి’ కాళ్ళపై పడి తమ కొడుకు వేపునుంచి క్షమాపణ అడిగినప్పుడే ఆయన అంటే నాకు గౌరవ భావం కలిగింది. నన్ను చూడంగానే గుర్తుపట్టి ఆయన కొడుకు చేసిన పనికి సిగ్గు పడుతున్నట్టుగా కనిపించి, లోపలికి రమ్మని పిలిచి నన్ను కూర్చోమన్నారు. మనోజ్‌కి తెలీదు నేను వాళ్ళ ఇంటికి వస్తునట్లు. తను లేడు అప్పుడు ఇంట్లో. వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళి మనోజ్ తల్లిని పిలుచుకు వచ్చారు. ఆవిడ వచ్చి కూర్చున్నాక అడిగాను – వాళ్ళ అబ్బాయి నన్ను పెళ్లి కోసం అడిగాడని వారికి తెలుసా అని. ‘అవును మాకు చెప్పాడు’ అన్నారు. ‘ఆ అమ్మాయిని జీవితంలో ఇంకెప్పుడూ ఏ రకంగాను బాధ పెట్టన’ని మాట ఇచ్చి, నేను తనని క్షమించ కలిగితే ఈ పెళ్ళికి వారికేమీ అభ్యంతరం లేదన్నారు.

ఆ తరవాత మొదటిసారి నేను అమ్మా నాన్నకి ఆ రోజుల్లో జరిగిన సంగతి వివరించి, ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు అని చెప్పాను. అమ్మా నాన్న వెంటనే వచ్చి మనోజ్ ఇంట్లో వారిని కలిసి ‘కుటుంబంలో పెద్దవారు సంస్కారువంతుల గానే కనిపించారు దీపా. వారి అబ్బాయి చేసినదానికి సిగ్గు పడుతున్నట్లు కనిపించారు. నీ మనస్సుకి నచ్చి నువ్వు ఆ అబ్బాయిని నమ్మగలిగితే మాకు కూడా సమ్మతమే’ అని ఆఖరి నిర్ణయం నా పైనే వదిలేశారు. సత్యా. ఆలోచించగా నాకు మనోజ్ నిజంగానే పశ్చాత్తాప పడుతున్నాడనే నమ్మకం కలిగిన మీదటే పెళ్లికి ఒప్పుకున్నాను. అసలు నా జీవితంలో ఆ దుస్సంఘటన జరిగేంత వరకు నాకు అతనంటే ఇష్టం మొదలయింది ఆ రోజుల్లోనే. ఈసారి నేను మళ్ళీ వంచింపబడకూడదని దేముడి పైనే భారం వదిలేశాను సత్యా.”

దీప చెప్పింది విని చేసేది లేక, పెళ్లి చేసుకుని మొదటిసారి ఇంటికి వచ్చిన వారిని అమర్యాద పర్చలేక ఇరువురికీ భోజనం పెట్టి బట్టలు పెట్టి సాగనంపాను.

వారిద్దరు వెళ్తుంటే వెనకనుంచి వారినే చూస్తూ, నేను మనోజ్‌ని క్షమించలేకపోయినా మా దీప నమ్మకం ఈసారి వమ్ము కాకుండా చూడమని దేముడికి మనస్సు లోనే దణ్ణం పెట్టుకుని వెనుతిరిగాను.

***

ఇన్ని ఏళ్ళ తరవాత దీపని చూసిన నేను ఒక్కసారిగా నా మనసు గత స్మృతులతో, తీయని-చేదు భావాలతో నిండిపోయింది.

నేను కాశీ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. మొదటి సంవత్సరంలో చేరిన రోజులు. అంతా కొత్త పరిసరాలు. హాస్టల్‌లో నా తోటి విద్యార్థులు, సీనియర్స్ అందరూ కొత్తే. ఆ రోజు సాయంత్రం మా సీనియర్స్ మమ్మల్ని కామన్ హాల్ లోకి పిలిచారు. నేనూ నా రూమ్‌మేట్ దీప బెదురుతూ హాల్ లోకి ప్రవేశించాము. కానీ మేము భయపడినంతగా మాకు రాగింగ్ ఏమి జరగలేదు. మాకు సీనియర్స్‌తో పరిచయం ఆయ్యాక అందరితో బాగానే స్నేహం కుదిరింది. ముఖ్యంగా నాకూ దీపాకి మధ్య మంచి స్నేహం కుదిరింది. దీప బెంగాల్ నుంచి వచ్చింది. మా ఇద్దరి అలవాట్లు మధ్య బాగా వ్యత్యాసం ఉండింది. అయినా మా ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు లేనంత స్నేహం పెరిగింది. దీప వెస్టర్న్ ఫిలాసఫీలో ఎం.ఏ. చేస్తోంది. మంచి తెలివైన పిల్ల అని తెలుసుకోవటానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. మొదటి సంవత్సర పరీక్షల్లో టాప్ చేసింది. నేను దీప తోనే కాకుండా హాస్టల్లో అందరితో కలిసే దాన్ని. కానీ తను మాత్రం ఒక్క నాతోనే సన్నిహితంగా ఉండేది. మిగతా వారితో కొంచెం ముభావంగా ఉండేది. అందువల్ల అందరూ తనకి అహం ఎక్కువ అనుకునేవారు. తానూ తన చదువు తప్పితే మరో ధ్యాస ఉండేది కాదు.

సాయంత్రం ఐదు గంటలు అయితే చాలు మా విమెన్స్ హాస్టల్ గెట్ దగ్గర విజిటర్స్ వరదలా తయారయ్యేది. నాకూ దీపకు మా ఊరి నుంచి ఎవరైనా వస్తే తప్ప ఎవరూ విసిటర్స్ ఉండేవారు కాదు. అందుచేత నేను నా మిగతా స్నేహితులతో కలిసి ఏ అమ్మాయిని కలవటానికి ఏ అబ్బాయి వస్తున్నాడో చూద్దామన్న సహజమైన కుతూహలంతో గేట్ ఎదురుగా ఉన్న ఫౌంటెన్ గట్టుపై కూర్చుని అంతా గమనిస్తూ ఉండేవారం. దీప అప్పుడప్పుడు మాతో కలిసేది.

ఎం.ఏ. సెకెండ్ ఇయర్లోకి ప్రవేశించాము. రోజులు గడుస్తున్నాయి. ఒక సాయంత్రం వాచ్‌మన్ తన క్లాస్‌మేట్ పేరుతో చీటి తెచ్చి దీపకి ఇచ్చాడు. ఎవరి కోసం అయినా విజిటర్స్ వస్తే వారికోసం వచ్చిన వారి పేరుతో చీటి తెచ్చి ఇస్తాడు వాచ్‌మన్. నేను దీప వైపు ఆశ్చర్యంగా చూశాను. “వెళ్తావా?” అని అడిగాను. ఎక్కువ ఆలోచించకుండా తయారై గేట్ దగ్గరకు వెళ్లింది దీప. నేను కూడా నా బృందంతో కలిసి గేట్ దాకా వెళ్ళి చూశాను. దీప అంత సన్నిహితంగా ఎవరితో కలుస్తున్నదా అన్న కుతూహలం చంపుకోలేక. అక్కడే ఒక గట్టుపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరూ. హాస్టల్‍లో అంత ముభావంగా మెలిగే దీప అతనితో గంట సేపు ఏం కబుర్లు చెప్పుకుంటున్నదా అని విస్తుపోయాను. దీప తిరిగి రూమ్‌కి వచ్చే దాకా అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ తను తిరిగి రాంగానే అతని వివరాలు అడిగాను. ‘తన క్లాస్‌మేట్ మనోజ్, సెకెండ్ టాపర్’ అని చెప్పింది. వారిద్దరు లైబ్రరీలో కలుసుకొని తమ సబ్జెక్ట్ చర్చించుకుంటూ ఉంటారని, ఆ రోజు మొదటిసారిగా “హాస్టల్‌కి వచ్చి కలవవచ్చా అని అడిగితే సరే అన్నాను” అంది. నాతో స్నేహం కుదిరినట్టుగానే మనోజ్‌తో కూడా స్నేహం ఏర్పడింది అనుకుని శాంతించాను. ఆ తరువాత వారానికి ఒకసారైనా మనోజ్ కలవటానికి రావటం, అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళి వస్తూండేవారు. దీపని గమనిస్తున్న నాకు తనకి మనోజ్ అంటే ఇష్టం కలుగుతున్నదేమో అని అనిపించి, ఆ విషయమే దీపని అడిగాను. ఏమో అంత స్పష్టంగా ఏ అనుభూతి లేదని కానీ తనతో ఉన్నంత సేపూ బాగానే ఉంటోందని చెప్పింది. ఆ తరువాత నేను దీపని ప్రశ్నలతో వేధించటం మానేశాను.

“ఉట్టి స్నేహమే అయితే పరవాలేదు, అంతకు మించినది అయేతే మాత్రం జాగ్రత్త” అని ఒక సలహా విసిరాను.

“అలాగేనే. మనోజ్‌తో నాకు అటువంటి అనుబంధం ఏర్పడుతున్నది అని అనిపించినప్పుడు ముందు నీకే చేపుతాను” అంది.

మా ఎం.ఏ. రెండో సంవత్సరం కూడా పూర్తి కావచ్చింది. పరీక్షలు దగ్గర పడున్నాయి. గత కొన్ని రోజులగా దీపలో మార్పు గమనించాను. మనోజ్ హాస్టల్‌కి వచ్చి కలవటం కూడా మానేశాడు. వారిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో.. దీప తెలివైన పిల్ల. తన స్వ విషయాలు తవ్వి తవ్వి అడగటం ఇష్టం లేక, వారి సమస్య వారే సమాధాన పడతారులే అని ఊరుకున్నాను. పరీక్షలకి ఇంక వారం రోజులున్నాయి. దీప నాతో కూడా మాట్లాడటం తగ్గించేసింది. తనని ఏమన్నా అడగటానికి నేను జంకుతున్నాను. తిండి తిప్పలు మానేసి ఏదో లోకంలో ఉంటోంది. పోనీ చదువుకుంటున్నదా పరీక్షలకి అని అంటే అదీ కనిపించటంలా. ఒక సాయంత్రం నాకు పక్క బజారులో ఏదో పని ఉండి దీపని కూడా వస్తావా కొంచెం మార్పుగా ఉంటుంది అని అంటే రానంది. సరే అని నేనే వెళ్ళి నా పని చేసుకుని ఓ గంటలో తిరిగి వచ్చాను. రూమ్ తలుపు వేసి ఉంటే తట్టాను. అలా ఎన్ని సార్లు తలుపు ఎంత గట్టిగా కొట్టినా దీప తలుపు తెరవక పోయేసరికి నాకు భయం వేసి వార్డెన్ దగ్గరకు వెళ్ళి చెప్పాను. ఆవిడ వెంటనే వచ్చి ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయింది. ఇక లాభం లేదని వార్డెన్ అనుమతితో కొంతమంది అమ్మాయిలు అందరం కలిసి బలం పెట్టి తోస్తే తలుపు తేర్చుకుంది. లోపల దీప గాడ నిద్రలో ఉన్నటనిపించి, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస తీసుకుంటోంది అని గ్రహించి తెరిపిన పడ్డాము. దీపని అలా చూడంగానే నాకు దుఃఖం భయంతో ఏడుపు వచ్చేసింది. తన మనస్థితి తెలిసి కూడా ఒక్కర్తిని రూమ్‍లో వదిలి వెళ్లినందుకు నన్ను నేనే చాలా విసుక్కున్నాను. ముఖం మీద నీళు జల్లి కుదిపి కుదిపి లేపితే ఎలాగో కళ్ళు తెరిచింది కానీ పూర్తిగా స్పృహ లోకి రాలేదు. మా వార్డెన్ దీప బాగా తెరుకున్నాక తన రూమ్‌కి తీసుకురమ్మని నాకు చెప్పి వెళ్ళిపోయారు. సరే అని దీపని లేపి కూర్చోపెట్టి గ్లాసుడు ఉప్పు నీళ్ళు తాగించాము ఎలాగో. ఏమైనా నిద్రమాత్రలు ఓవర్ డోసైతే బయటకు తెప్పించాలని. వెంటనే వాష్ రూమ్‌కి వెళ్ళి వచ్చి కొంచెం తెరుకుంది. కాసేపటికి బాగా తెరుకున్నాక వార్డెన్ రూమ్‍కి తీసుకు వెళ్ళాను. మేము వెళ్ళేసరికి వార్డెన్‌తో పాటు మరో ఆమె కూర్చుని ఉన్నారు. మమ్మల్ని చూసి ఆమెని కౌన్సిలర్‌గా పరిచయం చేశారు వార్డెన్.

“నీ మనస్సులో ఉన్నదంతా ఈవిడతో పంచుకో దీపా. మనస్సు తేలికగా ఉంటుంది” అన్నారు. “ నన్ను నీ రూమ్‌మేట్‌ని బయటకు వెల్లమంటే వెళ్తాము” అని ఆవిడ అంటుంటే నేను లేవబోయాను. దీప నా చేయి గట్టిగా పట్టుకుని ఆపి వలవలా ఏడవటం మొదలు పెట్టింది. అప్రయత్నంగా దీప తలని దగ్గరకు తీసుకున్నా ఓదార్పుగా. దీపని అలా చూస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు. కొంత సేపటికి తేలికపడి “ఎంతో కష్టపడి రాసుకున్న నా నోట్స్ అంతా మంట కలిపేశాడు” అంటూ మళ్ళీ భోరుమని ఏడ్చింది దీప. ఇంత సేపు మారుమాట్లాడకుండా కూర్చున్న కౌన్సిలర్ మాధవి – “ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా, అప్పుడే కదా మేము ఏమైనా సాయం చేయగలం” అన్నారు.

“ఎవరూ ఏమీ చేయలేరు. నేను బుద్ధిలేక మనోజ్‌ని నమ్మి, సాయం చేయమంటే నా నోట్స్ అంతా ఇచ్చినందుకు నన్ను ఫూల్‌ని చేశాడు” దీప కొంచెం కోలుకుని చెప్పింది.

దీపతో పరిచయం అయ్యాక తను అంత మొద్దు నిద్ర పోవటం ఎప్పుడూ ఎరగను. నిద్ర మాత్రలు వేసుకున్నవా అని అడిగితే అవునని కాదని చెప్పకుండా స్తబ్దుగా ఉండిపోయింది. మాధవి దీపని ఇంకేమీ ప్రశ్నించకుండా నిమిషం సేపు పరీక్షగా గమనించి, ఒక టాబ్లెట్ పేరు రాసి పక్కన ఉన్న మెడికల్స్ నుంచి తీసుకురమ్మని ఆ చీటి నాకు ఇచ్చారు. “తన నరాల ఉద్రిక్తతను శాంతపర్చటానికి ఒకే మెడిసిన్ రాశాను, కానీ ఒక నెల వరకు రోజుకి ఒకటి తప్పకుండా వేసుకోవాలి” అని చెప్పారు. “మాడమ్, దీప పేరెంట్స్‌కి తెలియ చేస్తే మంచిదంటారా” అని అడిగాను. నా మాట పూర్తి కాక మునుపే దీప నా చేయి గట్టిగా పట్టుకుని “వద్దు” అని వారిస్తూ “వద్దు అమ్మ హార్ట్ పేషెంట్. తనకు తెలిస్తే గాబరా పడుతుంది, ప్లీజ్” అంది. “అంతా తెలిసిన దానివి మరి ఇటువంటి పని ఎందుకు చేశావు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. నీ బాధ నీ రూమ్‌మేట్‌తో కానీ మాతో కానీ పంచుకుంటే పరిష్కారం ఆలోచిస్తాము కదా! మళ్ళీ ఇటువంటి మూర్ఖపు పని చేయనని మాకు ప్రమాణం చేసి చెప్పు” అని వార్డెన్ గట్టిగా చెప్తే సరే అని మాట ఇచ్చింది దీప. తనని ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దని నాతో గట్టిగా చెప్పి మమ్మల్ని పంపించారు ఆవిడ. నేను మందు కొనుక్కుని తిరిగి వచ్చి దీపని తీసుకుని రూమ్‌కి వచ్చాము.

రాత్రి డిన్నర్ వేళ అయింది. డైనిగ్ హాల్‌కి వెళ్దామా అని అడిగితే ఏమీ తినాలని లేదు, రానంది. “సరే అయితే నేను వెళ్ళి నా ప్లేట్‍లో అన్నీ సర్వ్ చేసుకుని తెస్తాను. నాతో కొంచెం షేర్ చేసుకుని తిను” అని చెప్పి నేను తిరిగి వచ్చే దాకా దీపని చూసుకోమని పక్క రూమ్ అమ్మాయికి చెప్పి వెళ్ళి డిన్నర్ తెచ్చాను. దీప ఎలాగో కొంచెం తినింది. నేను కూడా బలవంత పెట్టలేదు. తన చేత కౌన్సిలర్ ఇచ్చిన మందు మింగించి పడుకోమన్నాను.

“ఎలా పడుకుంటాను సత్యా? నాలుగు రోజుల్లో పరీక్షలు. నా దగ్గర ప్రిపేర్ అవటానికి మెటీరియల్ ఏమీ లేదు. ఎలాగా!!!” అంది. నిజమే కదా. అంత పెద్ద సమస్య పెట్టుకుని నిద్ర పొమ్మంటే ఎలా అని ఒక నిర్ణయానికి వచ్చి దీపతో – “అవును ఇంత జరిగితే నాతో అయినా నీ బాధ పంచుకోకుండా ఎందుకు అలా కుమిలి పోయావు? ఆ మాత్రం కష్టసుఖాలు పంచుకోలేకపోతే ఎందుకు ఈ స్నేహం? ముందే నాతో చెప్పి ఉంటే ఏదో దారి వెతుకుదుము కదా!!! పోనీలే ఇప్పటికీ మించి పోయింది ఏం లేదు” అని అన్నాను.

“నాకు నా నోట్సు పోయిన దానికంటే అంత ఫూలిష్‌గా ఆ మనిషిని ఎలా నమ్మానా అని నా పై నాకే సిగ్గు అనిపించిది సత్యా. ప్రతి టర్మ్ పరీక్షల్లో నేను టాప్ చేస్తున్నాని ఓర్వలేక చేసిన పని అది. వాడు తన మాటల్తో నన్ను ఎంత మోసం చేశాడంటే వాడి మనసులో ఉన్న కుత్సిత భావాన్ని గ్రహించ లేకపోయాను సత్యా. అంతలా నన్ను మోసం చేశాడు. పరీక్షలు వారం ఉందనగా నా నోట్స్ ఇవ్వమని అడిగితే పొరపాటున నిప్పు అంటుకుందని చల్లగా చెప్పాడు. నేను వాడి వేపు అలా చూస్తూ ఉండిపోయాను. మనస్సు ఒకసారిగా మొద్దుబారిపోయి వీడు నాకు తెలిసిన మనోజేనా అని అనుకున్నా. వాడు మాత్రం నన్ను అలా వదిలేసి వెళ్లిపోయాడు. తల్చుకుంటే ఇటువంటి వాడితోనా నేను అంత స్నేహం చేసింది అనిపించి, నాపై నాకే ఏహ్యా భావం కలిగింది” అని తన్ని తాను నిందించుంటున్న దీపతో “అంతలా నిన్ను నువు నిందించుకోకు దీపా. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. మనసులో అంత ద్రోహం పెట్టుకుని నిన్ను అంతలా నమ్మించిన వాడిని మాత్రం వదలకూడదు” అన్నాను.

“మరైతే ఏం చేద్దామంటావు?” అంది.

“వాడు నీ నోల్స్ కాజేశాడు కానీ నీ మెదడ్ని కాజేయలేడు కదా. ఇన్నాళ్ళు కష్టపడి లైబ్రెరీ నుంచి అన్నీ పుస్తకాలు రిఫర్ చేసి తయారు చేసిన నోట్స్‌ నీ మెదడులో కూడా తప్పకుండా రిజిస్టర్ అయి ఉంటుంది కొంత అయినా. రేపు మనిద్దరం మీ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళి మీ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌కి జరిగిందంతా చెపుదాము. లైబ్రరీ నుంచి తమ పేరు మీద నీకు కావల్సిన బుక్స్ ఇష్యూ చేయించి ఇవ్వమని రిక్వెస్ట్ చేద్దాము. ఈపాటికి నీ పై మీ లెక్చరర్స్ అందరికీ మంచి అభిప్రాయం కలిగే ఉంటుంది. వారు తప్పకుండా సాయం చేస్తారు. బుక్స్ తెచ్చుకుని ఇంక నోట్స్ రాసుకోకుండా డైరెక్ట్‌గా బుక్స్ నుంచే చదువుకుని పరీక్షలు రాయి. ఆ పై దేముడు ఉన్నాడు. నువు మళ్ళీ టాప్ చేస్తావు. సరేనా. ఇంక నిద్ర పో” అని తనకి సర్ది చెప్పాను. దీపకి నేను చెప్పింది నచ్చి, పడుకోవటానికి ప్రయత్నించింది. నేను కూడా తన వైపు చూస్తూ నిద్ర లోకి జారుకున్నాను.

మర్నాడు అనుకున్న ప్రకారమే నా కాలేజీకి సెలవ పెట్టి దీప డిపార్ట్‌మెంట్‌కి వెళ్లాము. దీప పై గురి ఉన్న ఒకరిద్దరి లెక్చరర్స్, ఇంకా వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌ని కలిసి జరిగిన విషయం చెప్పాము. హెచ్.ఓ.డి మనోజ్ పై మండిపడి, “వాడికి తెలీదా ఇటువంటి నీచమైన పనులు చేసి పట్టుపడితే నేను తనని ఎగ్జామ్స్ రాయకుండా డిబార్ చేయగలనని. ఎండ్ డేట్స్ వాట్ ఐ ఏం గోయింగ్ టు డు నవ్”. ఆయన శాంత పడ్డాక నేను దీప ఆయనను రిక్వెస్ట్ చేశాము, లైబ్రరీ నుంచి తనకి కావల్సిన కొన్ని బుక్స్ ఇష్యూ చేయించి పరీక్షలు అయ్యేదాకా తనకి ఇవ్వగలరా అని. ఆయన వెంటనే ఒక పేపర్ పై పెర్మిషన్ రాసి ఇచ్చారు. కావల్సిన బుక్స్ తీసుకోమన్నారు. ఇద్దరం లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకున్నాము. అప్పటికి దీప మొహం కొంచెం తెరుకుంది. “సత్యా థాంక్యు సో మచ్, నువ్వు లేకపోతే నేను ఏమై ఉందునో” అంటూ ఎమోషనల్ అయిపోతుంటే నాకు భయం వేసి “నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. మళ్ళీ ఏ వెధవ పని చేయకుండా సరేనా. ఇక బుక్స్ చదువుకోటం ప్రారభించు. వాడికి బుద్ధి వచ్చేలా మళ్ళీ నువు టాప్ చేయాలి కదా.” అంటూ మాట మార్చాను. ఆ తరువాత క్షణం కూడా తనని ఒంటరిగా వదిలి ఎటూ వెళ్ళే దాన్ని కాదు, నేను.

పరీక్షలు మొదలయినాయి. ఒకొక్క పేపర్ రాసి వచ్చాక దీపలో మునపటి ఉత్సాహం కనిపించింది. అన్నట్లు మాకు తరవాత తెలిసింది – మనోజ్ వాళ్ళ నాన్న వచ్చి కాళ్లా వెళ్లాపడితే వారి హెచ్.ఓ.డి. డిబార్ చేయకుండా మనోజ్‌ని పరీక్షలో కూర్చోవటానికి అనుమతించారని. కానీ తను చేసినదానికి శిక్షగా తను రాసిన ప్రతి ఆన్సర్ పేపర్ నుంచి పది మార్కులు డిడక్ట్ చేస్తామని అన్నారుట.

“చూసావా దీపా, ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. జరిగింది ముందే నాతో చెప్పి ఉంటే ఇంత డిప్రెషన్‌కి లోనవకుండా పరిష్కారం దొరికేది కదా?” అన్నాను.

“నిజమే సత్యా కానీ నా నోట్స్ కాలిపోయిందని వాడు చెప్పినప్పుడు నాకు నోట్స్ పోయిందన్న బాధ కంటే ‘ఇలాంటి వాడినా నేను అంత నమ్మి స్నేహం చేశాను.’ అని నాపై నాకే చాలా అసహ్యం వేసి నాలో నేనే కుమిలి పోయాను” అంది.

“అంత తెలివైన దానివి, ఇంత డిప్రెషన్‌కి లోనవకుండా నీ మనసులో బాధని స్నేహితులతో పంచుకోకపోతే ఇంక దేనికి పనికి వస్తుంది స్నేహం? సరే ఇకనైనా భవిష్యత్తులో ఎటువంటి కష్టం వచ్చినా ఎవరోకరితో పంచుకో సరేనా” అన్నాను.

“ఒక రకంగా మంచే అయింది కదా. ఆ మనోజ్ ఎటువంటి వాడో నీకు ముందే తెలిసి పోయింది, ఇంక వాడి వలలో పడిపోకుండా. ఇందుకేనేమో అంటారు దేముడు ఏం చేసినా మన మంచికే అని” అన్నాను.

ఇంక కొన్నాళకి హాస్టల్ వదిలి ఎవరి ఇళ్ల కి వారు వెళ్లిపోతాము. మళ్ళీ జీవితంలో కలుస్తామో లేదు తెలీదనుకుంటే చాలా బాధగా అనిపించింది.

“ఎం.ఫిల్ చేసి డాక్టరేట్ చేస్తావా దీపా?” అని అడిగాను.

“చేయాలనే ఉంది. చేసినా ఇక్కడ నుంచి మాత్రం చేయను. మళ్ళీ వాడి మొహం చూడలేను” అంది.

ఆఖరి పరీక్ష కూడా అయిపోయింది. ఒక్కొకళ్ళూ తమ తమ ఇళ్ళకి వెళి పోతున్నారు. నేనూ దీపా కూడా విడిపోయే రోజు వచ్చింది. ఆ క్రిందటి సాయంత్రం చాలా రోజులకి మేమిద్దరం కిందకు వచ్చి ఫౌంటెన్ గట్టుపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము.

ఇంతలో ఒక తెలిసిన ముఖం గేట్ దగ్గర కనిపిస్తే నేనూ దీపా లేచి వెనుతిరిగాము. మా వాచ్‌మన్ వచ్చి ఒక లెటర్ ఇంకా ఒక పాకెట్ చేతిలో పెడుతుంటే “ఇవి ఇచ్చిన అతన్నే ఉంచుకోమని చెప్పు” అని తిరిగి వాచ్‌మన్‌కే ఇస్తే “అతను వెళిపోయాడమ్మా” అన్నాడు. ఇక అవి అందుకోక తప్పలేదు మాకు. దాని వేపు చూడటం కూడా ఇష్టం లేని దీప వాటిని ఒక పక్కన పడేసింది, డైనింగ్ హాల్‌కి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాము. మర్నాడు విడిపోతామని మనసంతా భారంగా ఉండి ఇద్దరం మంచం మీద వాలిపోయాము. కాసేపు అలా ఉన్నాక నేనే ఆ ప్యాకెట్టు విప్పి చూసి ఆశ్చర్య పోయాను. అందులో పెద్ద నోట్స్ బండల్‌తో పాటు ఒక లెటర్ ఉంది. ‘ఎదురుపడి క్షమాపణ చెప్పుకునే ధైర్యం లేక వాచ్‌మన్‌కి ఇచ్చి వెళ్తున్నాను. మీ నోట్స్ కాల్చలేదు. మీ నోట్స్ మీ దగ్గర లేకుండా చేస్తే మీ స్థానంలో నేను టాపర్‌ని అవుదామన్న దురాశతో చెప్పిన అబద్ధం అది’ అని ఉంది అందులో. ఆ కాయితం పక్కన పెట్టి, “ఈ నోట్స్ కట్టని ఏం చేయమంటావు?” అని అడిగాను దీపని. క్షణం ఆలోచించి “వార్డెన్‍కి ఇచ్చి మన జూనియర్స్‌కి ఇవ్వమని చెపుతా” అంది. మర్నాడు మేమిద్దరం విడిపోయే ముందు దీప నా మెడ చుట్టూ చేతులు వేసి “ఆ రోజు నుంచి నాకు ఎప్పుడూ తోడుగా నిలిచి నాకు ధైర్యం చెపుతూ నాకు సరైన దారి చూపించి ఉండకపోతే నేను ఎలా ఉందునో సత్యా. థాంక్స్ అనే పదం చాలా చిన్నది. అందుకే ఒకొక్కసారి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా చాలదనిపిస్తుంది” అని చెప్పి ఏడుస్తుంటే నాకు కూడా దుఃఖం ఆగలేదు. అలా విడిపోయిన వాళ్ళం నెలకు కనీసం రెండు ఉత్తరాలైన రాసుకుని మా విషయాలు చెప్పుకునేవారం.

అటువంటిది ఇన్నాళ నుంచి మనోజ్ తన జీవితం లోకి మళ్ళీ ప్రవేశించాడన్న విషయం నాకు ముందే చెప్పకుండా అకస్మాత్తుగా ఇద్దరు ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చి నన్ను కలిశారంటే ఒక పక్క బాధ, తనని అంతలా నమ్మక ద్రోహం చేసిన మనిషిని ఎలా క్షమించ కలిగిందన్నఆశ్చర్యం, దీపపై ఒక రకమైన కోపం అన్నీ కలసి నా మనసంతా చాలా ఆస్తిమితంగా అయింది. దీప ఆ మనిషిని ఎలా క్షమించిందో కానీ నేను మాత్రం మనోజ్‌ని క్షమించలేక పోతున్నా, బహుశా నా స్వభావం తెలిసే దీప ముందే ఆ విషయం నాకు చెప్పి ఉండదు అనుకున్నా. నా మాట ఎలా ఉన్నా మళ్ళీ జీవితంలో అలా మోసపోకుండా దీపని కాపాడుతూ ఉండమని దేముడ్ని ప్రార్థించా.

Exit mobile version