Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వనంలో ఘాతుకం, విషాదం!

[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘వనంలో ఘాతుకం, విషాదం!’’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

I

క ఘాతుకానికి చెందిన వివిధ సత్యాలను దానితో రెండు విధాలా [బాధితులుగా, దానికి కారణభూతులుగా] సంబంధం వున్న వ్యక్తులు దాచి వాళ్లకు తోచినవి, అనుకూలమయినవి చెప్పిన వాటితో జపాను ప్రముఖ కథకుడు రైయూనొసుకే అకుటగవా [Ryunosuke Akutagawa] ‘వనంలో’ [Yabu no naka – In a Grove] అనే కథగా అద్భుతంగా నిర్మించాడు.

దానిని మార్పులతో, చేర్పులతో ‘రషోమోన్’ గా [Rashomon] పేరు మార్చి ప్రపంచ ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు అకిరా కురొసవా [Akira Kurosawa] 1950 లో వెండి తెరకెక్కించి ఘనవిజయం సాధించి ఆ చిత్రానికి చలనచిత్ర చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఏర్పరిచాడు. రచయిత అప్పటికి బతికుంటే కథను దాని పేరుతో సహా సినిమా ఆయన చేసిన మార్పులను తప్పుపట్టి ఉండేవాడేమో!

ఆ కథలో సంపూర్ణమైనట్టి, అబద్ధంతో కల్తీకానట్టి సత్యం చివరకు వెలుగు చూడదు. చీకటిలో వెతుక్కొని కనుగొనాలి. ఏడు పాత్రల స్వరాలేగాని తన గొంతు వినబడకుండా తన మౌనంతో మాత్రం తానూ చెప్పదలచుకున్నది వ్యక్తం చేశాడు; చేతనయితే ఇందులో సత్యాన్ని వెదికి పట్టుకోమని రచయిత పాఠకులకు ఒక సవాలుగా ఈ కథ మలిచాడు. ఘాతుకం అసలు అనుభవానికి వాళ్ళు పాత్రధారులు, సాక్షులు అయినపుడు, ఇంద్రియ లోపం వాళ్లలో లేనపుడు సత్యం ఉన్నదున్నట్టు వెలువడటానికి వాళ్లలో ఏ భావనలు అడ్డుపడుతున్నాయి – అంటే అర్థసత్యాలకు వాళ్ళు ఎందుకు పాల్పడినట్టు?

ఆ కథలో చెప్పని అసలు సత్యాన్ని, కథలోని విషయాలవెనుక రచయిత మనోగతాన్ని విశ్లేషిస్తూ కనుగొనే ప్రయత్నమూ ఈ వ్యాసంలో జరిగింది.

రైయూనొసుకే అకుటగవాను [1892-1927] జాపనీస్ కథానికకు జనకుడిగా భావిస్తారు. అతను కన్ను తెరచిన ఎనిమిది నెలల కాలానికతని తల్లి మానసిక వ్యాధితో కన్నుమూస్తూ ఆ వ్యాధిని కొడుక్కు వారసత్వంగా ఇచ్చింది.

కథ ఎలా చెప్పావా [కథా నిర్మాణం] అన్నది కథా వస్తువుకన్నా ప్రధానమైనది అని అతను గట్టిగా నమ్మి ఒక ప్రసిద్ధ రచయితతో వాదానికి దిగాడు. 1927 లో ఉన్మాదం కారణంగా ఆత్మహత్య చేసుకుని బతికి బట్టకట్టాడు. జీవితం కొనసాగించడం ఇష్టం లేనట్టు కొలది కాలానికే నిద్రమాత్రలు మోతాదుకు మించి మింగి లోకాన్ని ఖాళీచేసి వెళ్ళిపోయాడు రచనలు మిగిల్చి.

అతని 150 కథానికలలోవే ‘రాషోమోన్’, ‘వనంలో’ అన్నవి. ఆ రెండింటిని మాత్రమే పేర్కొనడానికి రాషోమోన్ అన్న కథాపేరుతో వనంలో అన్నకథను సినిమాగా అకిరా కురొసావా తీయడం. రాషోమోన్ కథ కూడా ఎన్నో ప్రశ్నలను మనిషి నైతిక దిగజారుడును సమస్యగా తీసుకుని పాఠకుడి మేధపై చెరగని ముద్ర వేసింది. శవం నెత్తిమీది జుట్టును దొంగిలించే ఒక పేదరాలిని సాటి పేదవాడు చూస్తూ నైతికత, అనైతికత మధ్య ఊగిసలాట ముగించి ఆమే మార్గదర్శకురాలన్నట్లుగా ఆమె దుస్తులే దొంగిలిస్తాడు.

ఎనిమిది నుంచీ పన్నెండు శతాబ్దాలకు చెందిన జపాన్, చైనా, ఇండియా దేశాల వెయ్యి పైచిలుకు జానపద/సంప్రదాయా కథల సంకలనం ‘కొంజాకు మోనోగటరి’ [Konjaku Monogatari – a collection of tales] లోని ఒక జపాన్ కథను నమూనాగా తీసుకుని అకుటగవా ‘రాషోమోన్’ రాశాడు. రాషోమోన్ అంటే ఒకనాటి జపాను రాజధాని క్యోటో [Kyoto] నగరంలో రాజసౌధానికి వెళ్లే ప్రవేశద్వారపు గోడ గేటు. అది కాలక్రమంలో శిధిలమయి అసాంఘిక శక్తులకు నెలవయ్యింది.

ఆ సంకలనం లోని కథ ఆధారంగానే మరో కథ ‘వనంలో’ [In a Grove] 1915లో రాశాడు. దానిని ఆంగ్లంలోకి తకాషి కోజిమ [Takashi Kojima] చేసిన అనువాదాన్నిఇపుడు సమీక్షిస్తున్నాం. తాను సినిమాకు వాడిన కథ ‘వనంలో’ కు చిత్ర దర్శకుడు రాషోమోన్ అన్న పేరు తగిలించుకున్నాడు దాన్ని నాగరికత దుస్థితికి ప్రతీకగా చేసుకుని.

సంక్లిష్టత, అస్పష్టత, ఎంతోకొంత లేక చాలా వున్న రచనలు; రచయితకన్నా వాటిపట్ల పూర్తి అవగాహనుందా అనిపించే రచనలు ఎక్కువ చర్చనీయాలవుతాయి, మెచ్చుకోలుకో, విమర్శకో నోచుకుంటాయి.

‘వనంలో’ కానీ, అమెరికన్ రచయిత అంబ్రోస్ బియర్స్ [Ambrose Bierce] రాసిన ‘ది మూన్ లిట్ రోడ్’ [The Moonlit Road] కానీ తీసుకుంటే వాటి ముగింపు ఏ విశ్లేషకుడూ గుండెమీద లేక తల మీద చేయేసుకుని ‘ఇదీ’ అని చెప్పలేనివి. పోనీ, ముగింపు ఏమిటో చెప్పడం రచయితకు కూడా సాధ్యపడనివి అందాము. బేతాళప్రశ్నలకు త్రివిక్రమసేనుడు మాత్రమే సమాధానం చెప్పగలడు. ఆ రాజు కూడా చెప్పలేకపోయిన కథా ‘కథాసరిత్సాగరం’లోని బేతాళ వింశతిలో వుంది. అదే – తండ్రీకొడుకులు వివాహం చేసుకున్న తల్లీ కూతుళ్ళ పిల్లలు ఒకరిని మరొకరు ఏ వరుసతో పిలుచుకోవాలని బేతాళుడు ప్రశ్నించిన కథ. ‘మూన్లైట్ లిట్ రోడ్’ 1908లో వెలువడింది. కథా సంవిధానానికి దాన్ని నమూనాగా తీసుకుని ‘వనంలో’ 1922లో వెలువడింది. ఇద్దరు రచయితలు మానసికంగా అస్వస్థులు. రెండింట్లో హత్య వుంది. రెండింటిలోనూ కథనం పాత్రలు పలికేదానితో జరుగుతుంది. రెండింటిలోనూ ‘దయ్యం’ మాట్లాడుతుంది. బియర్స్ తన భార్యను ఆమె మీద అనుమానంతో హత్యచేశాడు. దాన్నే కథా వస్తువుగా తీసుకున్నాడు. జపాన్ రచయిత ఆత్మహత్య చేసుకోగా, అమెరికా రచయిత మాయమయ్యాడు.

ఆ రెండింటికీ రెండు ఒకే మాతృకలున్నాయి. రాబర్ట్ బ్రౌనింగ్ [Robert Browning] రాసిన దీర్ఘ కవితా కథ ‘ది రింగ్ అండ్ ది బుక్’ [The Ring and the Book] ఒకటి. ఆయన దాన్ని ‘ఓల్డ్ ఎల్లో బుక్’ [Old Yellow Book’ లోని ఒక రోమన్ హంతకుడి న్యాయ వ్యాజ్యాన్ని సాక్షుల వాఙ్మూలాల రూపంలో తీసుకుని దీర్ఘ కవితగా అల్లాడు. నిందితుడు తన భార్యతో మతాధికారికి [cleric] లైంగిక సంబంధం ఉందని గ్రహించి ఆమెను ఆమె తల్లితండ్రులను హత్యచేశాడు అన్నది అభియోగం. కేసు జనవరి, ఫిబ్రవరి 1698లో జరిగింది. హంతకుడిని ఉరి తీశారు. ఆ వ్యక్తి ప్రియురాలి వయసు 13 ఏళ్ళు. ఆ రెండు పుస్తకాలలోలాగే ముందు బియర్స్, కొన్నేళ్ళకు రైయూనోసుకే అటగవా తమ తమ రచనలు చేశారు. రచయిత కేవలం 17 ఏళ్ళ వయసులో రాసిన 13 పుటల ఆధునిక కథ ‘వనంలో’ ఒక జపాను విశ్వవిద్యాలయం సంచిక ‘షించొ’ [Shincho] ప్రచురించింది. ది టెలిగ్రాఫ్ [బ్రిటిష్ వార్తా దినపత్రిక] 22 ఏప్రిల్ 2014 న ఆసియ పది అత్యుత్తమ ‘నవలలో’ దీన్ని ఒకటిగా ప్రకటించింది.

II

టూకీగా కథ: సమురాయ్ తకేహిరో [జపాను యోధుడు – Takehiro] అతని భార్య మసాగో [Masago] అడవిగుండా వెళుతుంటే ఒక గజదొంగ [Tajomaru] అతన్ని మోసపు మాటలతో లోపలికి తీసుకెళ్లి చెట్టుకుకట్టి అతనిముందే భార్యను చెరుస్తాడు. తరువాత యోధుడు మరణించి పడుంటాడు. విచారణలో ఐదుగురు వాఙ్మూలం ఇస్తారు. హతుడు, భార్య వేరే విధంగా మాట్లాడతారు. దొంగ తనూ, భార్య తనూ ఎవరికి వారు హత్య చేశామనగా, హతుడు తాను ఆత్మహత్య చేసుకున్నానంటాడు. అత్యాచారం గురించీ మాత్రం భిన్నాభిప్రాయం లేదు.

కథా నిర్మాణం లేక శిల్పం ఇతివృత్తం కన్నా ప్రధానమైందని రచయిత నమ్మినా, ఈ కథ నిర్మాణం, దాని వస్తువు వాటి ప్రాధాన్యత అవి కలిగివున్నాయి ఒకదానికి మరొకటి తీసిపోకుండా. ‘వనంలో’ కథ అంశాలను పోలీసు అధికారుల ముందు ఐదు పాత్రలు ఇచ్చిన వాఙ్మూలాలుగా, హతుడు మరణానంతరం చెప్పినట్లుగా, ఏడో పాత్ర బౌద్ధాలయంలో అన్నట్లుగా తెలియజేశాడు రచయిత. ఈ కథ మాతృక పురాతన కథా సంకలనం ‘కొనజాకా మోనోగటారి’ లోని దొంగ కథ మాత్రం ఆ రచయిత చెప్పినట్టుగానే ఉంటుంది. స్వల్పంగా వీలున్న చోట సంక్షిప్తీకరించగా ఆ పాత్రలు పలికినవి ఈ క్రిందివిధంగా ఉంటాయి.

చెట్లుకొట్టేవాడు: ఆ ఉదయం దేవదారు చెట్లు కొట్టడానికి రోజూలాగే వెళ్ళినపుడు ఛాతీకి తగిలిన ఒకే కత్తిదెబ్బకు అతను మరణించి వెల్లెలికలా పడివుండటం చూశా. అక్కడ రాలిన వెదురుబొంగు కొమ్మలు, దేవదారు ఆకులపై ఎండిన రక్తపు మరకలున్నాయి. ఒక పసుమక్షిక విడివడలేనంతగా వాలుంది. కత్తి లేదు కానీ చెట్టు మొదట్లో తాడుంది. ఒక దువ్వెనపడుంది. గడ్డి, రాలిన వెదురు బొంగు చెట్ల ఆకులు పాదాలతో నేలలోకి తొక్కివేయబడి చిందరవందరగా ఉండటం వలన చనిపోబోయే ముందు అతను గట్టిపోరు సలిపినట్లనిపించింది.

బౌద్ధ పురోహితుడు: ఒక స్త్రీని హతుడు గుర్రం మీద కూర్చోబెట్టి పక్కనే నడవడం చూశాను. ఆమెను ఒక బౌద్ధుడిగా తేరిపారా చూడలేదుగాని ఆమె తెల్లగా వుంది. ఆమె ముఖాన్ని నెత్తిమీదినుంచి వేసుకున్న ఒక మేలిముసుగు [scarf] అడ్డుతోంది. కత్తి, విల్లు, బాణాలతో ఆ యోధుడు [సమురాయ్] సాయుధుడయి వున్నాడు. పొదిలో ఇరవై చిల్లర అంబులుండుంటాయి. మానవజీవితం క్షణికమయినది – మంచంత, మెరుపంత.

రక్షకభటుడు: అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరుమోసిన గజదొంగ. అదుపులోకి తీసుకోబోతుండగా గుర్రం మీదినుంచి కిందపడ్డాడు. అలా దైవవశాత్తూ జరగకపోతే అతన్ని పట్టుకోడం జరిగేది కాదు. ముదురు నీలం కామోను తొడుక్కుని కత్తితో, విల్లుతో వున్నాడు. పొదిలో పదిహేడు బాణాలు వున్నాయి. విల్లు, బాణాలు బహుశా హతుడి నుంచీ లాక్కుని ఉంటాడు. క్యోటో నగర ప్రాంతంలో సంచరించే అందరు బందిపోట్లకన్నా వీడు ఎక్కువ దుర్మార్గుడు. ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల కంటకుడు. ఆ మధ్య గుడికి వచ్చిన ఒక స్త్రీని, ఆమె కూతురిని బహుశా వీడే చంపివుంటాడు.

హతుడి అత్త: అల్లుడు ఎవరికీ హాని తలపెట్టని, రెచ్చగొట్టనివాడు; సాత్వికుడు. వయసు ఇరవై ఆరు సంవత్సరాలు. నా పందొమ్మిదేళ్ళ కూతురు ఉత్సాహంగా, సరదాగా ఉంటుంది. ఆమె ఏమయిందో తెలియకపోవడం నన్ను బాధిస్తోంది.

హంతకుడు: అతనిని చంపాను; ఆమెను కాదు. ఆమె ఎక్కడికి వెళ్లిపోయిందో నాకు తెలియనే తెలియదు. ఎలానన్ను హింసించినా నేను చేయని పనిని చేసినట్టు ఒప్పుకోను. పరిస్థితులు ఇంత తీవ్రమయిన ముగింపుకు వచ్చిన తదుపరి నేను ఏ విషయమూ దాచే ప్రసక్తి లేదు. గాలికి గుర్రం మీదున్న ఆమె మేలి ముసుగుతొలగి బోధిససత్త్వుడి మొహం లాంటి ఆమె మొహం నాకు కనిపించగానే భర్తను చంపయినా ఆమెను దక్కించుకోవాలనుకున్నాను. చంపడం నాకు పెద్దపనేమీ కాదు. స్త్రీ దక్కిన తరువాత ఆమె పురుషుడిని ఎలాగూ చంపాలి. నేను ఒక్కడినేనా మనుషులను చంపేది? రక్షకభటులుగా, న్యాయనిర్ణేతలుగా మీ అధికారంతో, డబ్బుతో ఆయుధాలు లేకుండా మేలు చేస్తున్నట్టు కనిపిస్తూ మీరు ప్రజలను చంపరా? కాకపొతే మీరు చేసే నేరానికి వాళ్ళ రక్తం కారదు. నేనా, మీరా ఎక్కువ పాపిష్టి అన్నది తేల్చిచెప్పడం కష్టం. నిజానికి పురుషుడిని చంపకుండా స్త్రీని దక్కించుకోడం మెరుగయిన పని. ఆమెను దక్కించుకుని అతన్ని వొదిలెద్దాం అనుకున్నా. ఆ రెండు పనులు బహిరంగంగా, రహదారిలో చేయడం సాధ్యపడదు. అందుకని వాళ్ళిద్దరికీ మాయమాటలు చెప్పి పర్వతాలలోకి తీసుకెళ్లా. అక్కడ కత్తులు, అద్దాలు పాతిపెట్టున్నాయని ఆశపెట్టా. దురాశ భయానకమైనది కదూ? అరగంటలో తోపుకు వెళ్ళాం. గుర్రం మీదే తాను ఉంటానంది చిక్కగా వుండీ మనుషులు దూరడానికి ఇరుకుగా వున్నచోటు చేరగానే. పురుషుడితో ముందు వెళ్లడమే నాకు కావలసింది. వెదురు, దేవదారు చెట్ల గుబురులోకి ఇరువురం జొరబడ్డం. కత్తిసాము నేర్చిన, బలవంతుడైన సమురై కనుక వెనుకనుంచీ ఒడిసి పట్టుకున్నాను. అది అదాటున జరిగిన సంఘటన కనుక లొంగదీసుకోగలిగాను. దేవదారు చెట్టు వేరుకు కట్టేశాను. దొంగను గనుక గోడలు ఎక్కడానికి నాతో ఒక తాడు ఎప్పుడూ ఉంటుంది. అరవకుండా రాలిన దేవదారు, వెదురు ఆకులను అతని నోట్లు కుక్కాను. ఆమె దగ్గరకు వెళ్లి అతనికి ఏదో జబ్బుచేసింది వచ్చి చూడమన్నా. వచ్చి అతనున్న పరిస్థితిని గమనించి చివాలున బాకు తీసి నా మీదికి దాడిచేసింది. నేను అప్రమత్తంగా ఉండకపోతే చంపేసి ఉండేది. కానీ నా పేరు తాజామారు [Tajomaru]. నా కత్తికి పని చెప్పకుండానే ఆమె బాకును లాగేశాను. పరాక్రమవంతురాలైన స్త్రీ అయినా ఆయుధం లేకపోతే రక్షణ లేనిదవుతుంది. భర్తను చంపకుండానే భార్యను అనుభవించాను. ఆ పనయిన పిదప అతన్ని చంపాలనుకోలేదు. ఆమె కన్నీరు కారుస్తుంటే వాళ్ళు చూస్తుండగా వాళ్ళిద్దరినీ వదిలేసి వనం నుంచీ పోబోతుంటే ఆమె నా చేతికి వెర్రిగా అతుక్కుపోయింది. నేను గాని తన భర్తగానీ చావాలని అనింది. తన మానం కోల్పోవడాన్ని ఇద్దరు పురుషులు చూడటం తన చావుకన్నా తీవ్రంగా భరించలేని విషయమనింది. మేమిద్దరం పోరాడుకుని ఎవరు బతికుంటే అతనిని తన భర్తగా భావిస్తానంది. అపుడు అతన్ని చంపుదామన్న తీవ్రమయిన కోర్కె నన్ను లోపరచుకుంది. అలా అంటున్నందుకు నేను మీకన్నా క్రూరమైనవాడిగా తోస్తాను. కానీ ఆమె ముఖం ఆ సమయంలో చూసుంటే అలా మీకు అనిపించదు; ఆ సమయంలో ఆమె కళ్ళు మండుతున్నాయి. నాకంటితో ఆమె కంటిని చూస్తుంటే నేను పిడుగుపాటుతో చచ్చినా ఆమెను నా భార్యగా చేసుకుతీరాలి అనిపించింది. మీరనుకుంటున్నట్లు అది కామం కారణంగా. కామం కాక మరో కారణం అయ్యుంటే ఆమెను కిందికి తోసి పరిగెత్తుకుపోయేవాడిని. అతని రక్తంతో నా ఖడ్గానికి మరకను చేసేవాడిని కాదు. అతన్ని చంపడానికి అన్యాయమార్గాన్ని తొక్కాలనుకోలేదు. అతని బంధనం విప్పి నాతో కత్తులు కలపమన్నా. అక్కడ దొరికిన తాడు ఆ విధంగా నేను ఒదిలేసినదే. కోపోద్రేకంతో తన మందమైన కత్తిని తీశాడు. ఆలోచనంత వేగంగా ఉద్వేగంతో నాపై దుమికాడు. మాటలు లేని ఆ పోరాటం ఎలా సాగిందో చెప్పక్కరలేదు. ఇరవై మూడో ఖడ్గ ఘాతంల వరకు పోరు సాగింది. ఇప్పటికీ అతని ఆ పరాక్రమం నన్ను ముగ్ధుడిని చేస్తోంది. సూర్యకాంతిలో ఇంతవరకు ఒక్కడూ ఇరవై కత్తి తాకిడుల దాకా నాతో పోరాడలేదు. అతను నేలకు ఒరగగానే రక్తసిక్తమైన నా కత్తిని దించుతూ ఆమె వైపు తిరిగా. ఆశ్చర్యకరంగా ఆమె అక్కడ లేదు. ఎక్కడికో పారిపోయింది. దేవదారు కొమ్మలలో వెదికా. చెవులు రిక్కరించా. కానీ మరణిస్తున్న మనిషి కంఠము నుండివస్తున్న మూలుగు మాత్రమే నాకు వినబడుతోంది. మేము కత్తులు కలపగానే తన సహాయార్థం వనం నుంచీ పరిగెత్తి ఉంటుంది. ఆమె అలా వెళ్లడం నా చావు బతుకుల సమస్యగా [చట్టరీత్యా] మారబోతోంది అని గ్రహించా. అతని కత్తి, విల్లు, అంబులను దోచుకుని రహదారి దగ్గరకు పరిగెత్తాను. అక్కడ ఆమె గుర్రం ఇంకా మేస్తోంది. నాకు తెలుసు నా తల గొలుసుకు వేలాడబోతోందని. నాకు అన్నిటికన్నా పెద్ద శిక్షను వేసుకోండి [దేన్నీ ఖాతరు చెయ్యని వైఖరితో అన్నాడు].

షిమిజు దేవాలయానికి వచ్చిన స్త్రీ ఉద్ఘాటనం: నీలం పట్టుకిమోనోలోని వ్యక్తి నన్ను లొంగదీసుకున్న తరువాత బందీగావున్న నా భర్తవైపు వెటకారంగా చూశాడు. తనను కట్టిపడేసిన తాడును ఎంతో బాధతో విడిపించుకోవాలన్నా అతనికి వీలవలేదు. నా భర్త వైపు నేను వెళ్ళబోతే ఆ పురుషుడు నన్ను తోసేశాడు. నా భర్త కళ్ళలో నేను వర్ణించలేని మెరుపును చూశా. ఆ కళ్ళు ఇప్పటికీ నన్ను వణికిస్తున్నాయి. మాటలు లేని అతని చూపు అతని మనసులోని భావనను బహిర్గతం చేసింది. ఆ మెరుపు ఆగ్రహం కాదు, వేదనా కాదు.. శీతలమైన మెరుపు, నిరసనను వ్యక్తంచేసే మెరుపు. దొంగ కొట్టిన దెబ్బకన్నా నా భర్త నేత్ర ఘాతానికి గట్టిగా అరిచి స్పృహతప్పాను. తేరుకునే సరికి నీలం చొక్కా మనిషి ఐపు లేదు. నా భర్త చూపు మునపటిలానే తోచింది. అతని శీతల నిరసన వెనుక సిగ్గు, విచారం, కోపం ఊన్నాయి. “తాకేజిరో, ఇంత జరిగిన పిదప నీతో కలిసి జీవించలేను. చావడానికి నిశ్చయించుకున్నాను. నీవూ నాతో చావాలి. నా అవమానకరమైన అనుభవానికి నీవు సాక్షివి గనుక నిన్ను ఇలా ఒదిలెయ్యలేను,” అంటూ అతని కత్తి గురించీ చూస్తే అదీ, అతని విల్లు, అంబులు కూడా లేవు. నా చిన్న కత్తి నా పాదాల దగ్గిర పడుంది. దాన్ని నా తల పైదాకా ఎత్తి “నీ ప్రాణం ఇవ్వు,” అన్నాను. విని, నోట్లో ఆకులు అలములు ఉండటంవలన పెదవులు మాత్రం కష్టం మీద కదిపాడు. ఆ పదాలు నాకు అర్థం అయ్యాయి. నన్ను ద్వేషిస్తూ, చంపు అన్నాడు కంటితో. అతని లిల్లీపూతెలుపు కమినో ద్వారా అతని వక్షంలోకి బాకును దించాను. అప్పుడు కూడా నేను స్పృహ తప్పాను. నేను కన్ను తెరిచేసరికి కట్టుతోనే ఆఖరిశ్వాస ఒదిలి వున్నాడు. బంధవిముక్తుడిని చేశాను. ఆ తరువాత ఏమి జరిగిందో చెప్పగల శక్తి నాకు ఇప్పుడు లేదు. అపుడు చనిపోదామన్న బలమైన శక్తి మాత్రం లేదు. అయినా బాకుతో గొంతులోకి పొడుచుకున్నా. పర్వతాల వద్దనున్న నీటికొలను చేరి అందులో దుమికా. అనేకవిధాల చద్దామని చూశా. చావలేక నా గౌరవ రాహిత్యంతోనే జీవిస్తూ వున్నా. దయామయుడైన దేవుడు కూడా నన్ను ఒదిలేసినట్లుంది.

హతుడి అశరీరవాణి చెప్పినది: నా భార్యను చెరిచిన తరువాత ఆ దోపిడీదారు అక్కడే కూర్చుని ఆమెతో ఓదార్పు మాటలు మాట్లాడటం మొదలుపెట్టేడు. ఆమెనుద్దేశించి నా కళ్ళు ఆర్పాను వాడు చెప్పేదాన్ని నమ్మకు అంటున్నట్లు. కానీ దానిని శ్రద్ధగా వింటున్నట్లు అనిపించింది. చివరకు ఇలా అన్నాడు: “నీ మానం పోయిన తరువాత నీ భర్తతో యథావిధిగా కలిసి ఉండలేవు. నాకు భార్యవవుతావా? నీపై నాకున్న ప్రేమే నీ పట్ల నన్ను హింసకు ప్రేరేపించింది.” “అలా అయితే నీతో నన్ను తీసుకు వెళ్ళు నీవు ఎక్కడికి వెళితే అక్కడికి,” అనింది. అలా అనడమే కాదు ఆమె చేసిన పాపకార్యం. దొంగ చేతిలో తన చేయి ఉంచి వెళుతూ ఉన్నట్టుండి పాలిపోయి “అతన్ని చంపు! అతను బతికున్నంతవరకు నిన్ను పెళ్ళాడలేను.” అనేకసార్లు “చంపు, చంపు” అని అన్నది, పిచ్చిపట్టినట్లు. ఆ మాటలు ఇప్పటికీ నన్ను ఆపాదమస్తకం చీకటి పాతాళంలోకి పేల్చి వేసినట్లు గుర్తున్నాయి. మనిషి నోటి నుంచీ అంత ద్వేషపూరిత పలుకులు ఎప్పుడన్నా పలికారా? అలాంటి మాటలు మానవ వీనులకు శోకాయా? గజదొంగే ఆ మాటలకు వివర్ణుడయ్యాడు. చేతులు కట్టుకుని “ఆమెను చంపమంటావా ఒదిలేయమంటావా?” అని నన్ను అడిగాడు. తల ఊపు చాలు అన్నాడు. ఆ మాటలు వాడు చేసిన నేరాలకు నేను అతన్ని క్షమించడానికి చాలు. నేను సందిగ్ధంగా ఉండగా కేకవేసి అడవిలోకి పారిపోయింది. వాడు ఆమెను పట్టుకోవాలని చూసినా ఆమె వస్త్రం అతని చేతిలోనుంచీ జారిపోయింది. నా కత్తీ విల్లంబులు హరించి ఒక్క కత్తిదెబ్బతో నన్ను కట్టిన తాడును తెంపేశాడు. “నా కర్మ ఏమిటో ఆమె పరారీ తేల్చబోతోంది,” అని గొణిగాడు. మిగిలిన బంధనాన్ని వదిలించుకుంటూ ఒకటి శ్రద్ధగా విన్నాను – అది నా ఏడుపు. నా ముందు పడున్న నా భార్య బాకుతో నా ఛాతీలో పొడుచుకున్నా. చస్తుండగా నా ఛాతీ లోనుంచీ ఆ కత్తిని ఎవరో లాగేశారు.

III

విలక్షణమైన ఈ కథానిక ఏదో ఒక విషయానికి పరిమితం కాదు. తత్త్వ, మనోవైజ్ఞాన, వ్యావహార, వ్యక్తిగత, నైతిక లేక అనైతిక సంబంధమైన అంశాలను చప్పుడు లేకుండా లేవనెత్తి పాఠకుడి మేధకు మేతలా వేస్తుంది, పనిచెబుతుంది. దానినిండా విషయ సంబంధిత పేరడాక్సులతో [పరస్పర వైరుధ్య విషయాలు] నిండివుంటుంది. ఉదాహరణకు ఒక paradox: పిచ్చికుదిరితేగాని పెళ్లికాదు, పెళ్లి అయితే గాని పిచ్చి కుదరదు.

అసలు పై పరిస్థితులకు ధార్మికమూలం రచయిత దృష్టిలో వుంది. సత్యం వద ధర్మం చర అన్నా, కోర్కె దుఃఖభాజనం అన్నా ఆ సూత్రాలు కేవలం బౌద్ధానికి మాత్రమే చెందవు. అవి ఏ మతానికో చెందినవిగా కాక మానవ మనుగడకు, సంఘర్షణారహిత జీవనానికి అవసమైన లౌకిక సూత్రాలుగా భావించాలి. రచయితా ఆ విధంగా భావించివుండాలి దైవం అన్నా మతం అన్నా అభ్యంతరం ఉంటే. మత లేక మతాతీతమైన ధర్మాన్ని అనుసరించకుండా, నిజాన్ని చెప్పకుండా మనిషిని ఏమిటి నిరోధిస్తోంది? అహంతో కూడిన మానవ నైజం! సత్యం పలకమనడం నిజానికి ధర్మంలో అంతర్భాగమే. ఈ కథలోని మూడు పాత్రల పతనానికి ఆ ధార్మిక సూత్రాలను పెడచెవినపెట్టటం అసలు కారణం. ఒక వింత ఏమిటంటే, మానవనైజంతో ప్రకృతి, మానవాతీత శక్తి చేయికలపడం. మరో గమనించవలసిన రచయిత ఎత్తిపొడుపు తనకు దేనితో సంబంధంలేనట్టు దైవం మిన్నకుండటం. అంటే తనకు నమ్మకంలేని దేవుడివైపూ రచయిత వేలు చూపించాడు.

“తన భార్యను ‘తాంబా’ ప్రావిన్స్‌కు తీసుకెళ్లిన మనిషి ‘పోయేయమా’ దగ్గిర కాళ్ళూచేతులు కట్టివేయబడటం” అన్నశీర్షిక గల జపాను జానపద కథ లోని దురాశ, అత్యాచారం, దొంగతనం సంఘటనలను సాగదీసి, రూపు మార్చి ‘వనంలో’గా రాశాడు. చెప్పే విధానాన్ని మరో మూడు మాతృకల నుంచీ తీసుకున్నాడు. జపానీయా జానపద కథ దొంగ ఒక ఖడ్గాన్ని ఆశ చూపగా దారిన భార్యతో పోతున్న వ్యక్తి ప్రలోభపడి తన విల్లంబులు, సొంత భార్య మానాన్నీ కూడా అప్పగించవలసి వచ్చింది. ఆ కథ ఆఖరులో ఆ కథకుడు చమత్కారంగా “దొంగలో కాస్త సిగ్గు మిగిలి ఉండటంవలన ఆమె గుడ్డలు దోచుకుపోలేదు,” అంటాడు. ‘వనంలో’ కథలో సమురాయ్‌ని దొంగ ఆశపెట్టి అడవి అంతర్భాగంలోకి గొనిపోయి వెనక నుంచి బంధించి అతని భార్యను అతను చూస్తుండగా అనుభవిస్తాడు. చివరకు ఆ యోధుడు ప్రాణాన్నీ వదులుకోవలసి వస్తుంది. హతుడిని వనంలోకి తీసుకెళ్లానని చెబుతూ “దురాశ భయానకమైనది కదూ?” అని దొంగ అనడం ఒక పారడాక్స్. కాబట్టి పాత కథ, కొత్త కథ లోని సంఘటనలకు ఆది మూలం దురాశ, భర్తల తెలివితక్కువదనం.

రచయిత వెల్లడిచేసిన ఆ ఉద్ఘాటనలలో హతుడిది, కనిపించకుండా పోయిన స్త్రీది, నేరస్థుడిది ముఖ్యమైనవి. ఒక్క నేరస్థుడిదే న్యాయస్థానం లేక పోలీసు దర్యాప్తు అధికారి ముందు చెప్పినది. మరి హతుడు ఎవరిని ఉద్దేశించి చెప్పినట్టు? అది చదివేవాడిని, లేక వినేవాడిని ఉద్దేశించి! స్త్రీ గుడిలో దేవుడినీ వుద్దేశించి చెప్పింది. భార్యాభర్తలు [బాధితులు] పరస్పర అబద్ధాలకు పాల్పడ్డారు; అంటే తమను తాము, ఒకరినొకరు మోసంచేసుకునే ప్రయత్నం చేశారు. అసలు, ఆమెను పారిపోయేట్టు చేసి ఆమె అధికారుల ముందు సాక్ష్యం ఇవ్వకుండా చేశాడు రచయిత. ఆమె సాక్ష్యం ఇచ్చి ఉంటే అది తాను భర్తను చంపాను అనింది కాబట్టి నేరస్థురాలుగా భావించి అధికారులు శిక్షవేసుండేవారు; దొంగ మీద అత్యాచారం, దొంగతనం వ్యాజ్యం మాత్రమే నిలిచేది. నిజానికి హతుడిని నేను చంపానని దొంగ, నేను చంపానని భార్య అంటే ఏది నిజం అని తేల్చే తలనొప్పి న్యాయనిర్ణేతలకు ఉండేది. అక్కడ ఒకవేళ దొంగ తన భర్తను హత్యచేశాడని చెబితే అది భర్త గౌరవానికి మచ్చ తెచ్చినట్లవుతుందని ఆమె భావించి ఉండవచ్చు.

భర్త సమురాయ్ వృత్తి రీత్యా తనను తాను రక్షించుకోటమేగాక ఇతరులను రక్షించగలగాలి. ఆ రెండు పనులలో విఫలుడయ్యాడు ఆయుధాలు ఒంటిమీద వున్నా, సుశిక్షితుడయినా. అలా రక్షించడం దేవుడెరుగు తన భార్య మానాన్నే కాపాడలేకపోయాడు. ఒక విధంగా మానం భార్యది మరొకవిధంగా అతనిది పోయాయి. అదీ ఘాతుకమే కాదు విషాదం కూడా. ముందే చెప్పినట్టు అతడి దురాశ అతన్ని నిర్వీర్యుడ్ని చేసింది. దురాశకు తెలివితక్కువతనం తోడయింది – ఈ కథకు మాతృకయినా జపాను జానపథకథలోని నాయకుడి విషయంలోలా. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి అనృతాలను ఆశ్రయించవలసి వచ్చింది. తరిఫీదు పొందిన, సాయుధుడయిన యోధుడు, తరిఫీదు లేని దొంగకు చిక్కి కాళ్ళు చేతులు నోరు కట్టబడి భార్య మానాన్ని కంటిముందే వాడు దోచుకుంటుంటే కళ్ళు మాత్రం తెరుచుకునుండి చూడటంకన్నా చేయని నేరానికి శిక్ష ఏమన్నా ఉంటుందా?

భార్య దొంగతో చెప్పినట్టు వాడు తనతో పోరాడి చంపివుంటే వాడి చేతులో ఆ విధంగా చావడమూ నామోషీయే. జరిగినవి చాలవన్నట్టు ఆ విధంగా ఒక యోధుడిగా దొంగ చేతులో చనిపోయానని ఏ వీరుడూ ఒప్పుకోలేని సత్యం. పైగా సొంత భార్య తన శత్రువుతో తనను చంపెయ్యమని అనడం భరించలేని విషయమే ఒకవేళ ఆమె అనుంటే. ఆత్మాభిమానం అధికపాళ్ళలో వుండే సమురాయ్‌కి బతుకుకన్నా చావే మేలు. దొంగ అతని కట్లు తెంపి కాలి నడకన పోతున్నప్పుడు వెంటపడే ప్రయత్నం చెయ్యకుండా భార్య కత్తితో పొడుచుకుని చావడం ఒక వీరుడు చెయ్యకూడని, చెయ్యని పని. అందువల్ల భర్త నా భార్య కత్తితో పొడుచుకుని చచ్చా అంటే నమ్మదగిన విషయంగా అనిపించదు. ఇంతకూ అతను అన్నట్టు పొడుచుకుని ఉంటే ఆ కత్తి ఎవరు అతని ఛాతీ నుంచీ లాక్కున్నట్టు? భర్త ఆ కత్తి లాక్కున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేకపోవడం నమ్మదగినది కాదేమో. సాక్షి చెట్లుకొట్టేవాడు అన్నట్లు అది ఆ స్థలంలో దొరకలేదు. భార్య అన్నట్టు ఆమె భర్తను పొడిచి కత్తిని తీసుకు పోయి ఎక్కడో పొడుచుకుందని అనుకోవాలి. ఆమె నీటిలో దూకి వివిధ రకాలుగాను చద్దామనుకున్నా అన్నమాటలు నమ్మశక్యంగా లేవు. ఆమె అక్కడి నుంచీ పారిపోయిందని భర్త, దొంగ అన్నారు. అక్కడ ఇంకా కీడు ఏదో జరుగుతుందని భయం వలన పారిపోయిన ఆమె దొంగ తనను వెదుక్కుంటూ వస్తాడనే అనుకోవాలి. అలాంటప్పుడు ఆమె తిరిగి ఆ స్థలానికి రావడం భర్తను హతమార్చడం అంతగా జరగని పని. కత్తి ఎవరో ఛాతీలో నుంచీ తీసుకున్నారు అనడం భర్త చెప్పిన అబద్ధంలా వుంది అది అక్కడ ఉండటానికి అవకాశంలేదు గనుక. దాన్ని ఆమె అక్కడ ఒదిలేసి పోయింది అనడానికి ఎవరి మాటా ఆధారంగా లేదు.

ఆ ఘాతుక సంఘటనలో భార్యాభర్తలు ఇరువురూ సమంగా జాలికి అర్హులే. అనుకోని సంఘటనలో ఒక ముగ్ధ, కులీన మహిళ దొంగ చేతిలో భర్త ముందే మానం కోల్పోవడం మతిపోగోట్టే విషయం. మాటలకందని కలతకు గురిచేసే విషయం. వెంటనే తేరుకోడంసాధ్యపడని విషయం. ఆలోచించవలసినట్లు ఆలోచించలేదు.

దొంగను కత్తితో పొడవాలని చూడటం, భర్త తన కట్లు విప్పుకోడానికి నానా యాతనపడుతున్నపుడు అవి విప్పడానికి తాను అతనివైపు దూసుకు వెళ్లడం అతనిపై ఆమెకుగల అచంచలమైన ప్రేమకు తార్కాణాలే. అతనివైపు వెక్కిరిస్తున్నట్టు దొంగ చూడటం ఆమెను తప్పక బాధించి వుంటుంది. అంతలా భర్తపై సానుభూతి, ప్రేమా కలిగివున్నా, తనంతట తాను ఏ తప్పు చేయకపోయినా తన వైపు భర్త అవమానకరంగా చూసిన చూపు ఆమెకు బాకుతో పొడిచినట్టనిపించడం సహజం. దొంగకు భార్యగా ఉండటం ఇష్టమయుంటే పారిపోయేది కాదు. పోరాటంలో భర్త [ఒక యోధుడు] ఓడి మరణించాడు అనిపించుకోడం కన్నా అతన్ని తాను చంపాననడం అతనికి ఎంతోకొంత గౌరవాన్నిస్తుందని ఆమె నమ్మినట్లుంది; అందుకే అతన్ని తాను చంపానని నెపం తన మీద పెట్టుకుంది. భర్త వక్షంలో కత్తిని దింపి అతని కట్లు విప్పాను అని అనింది. చంపిన తరువాత కట్లు ఉంటేనేమి, లేకపోతేనేమి? ఇరువురి పురుషుల మధ్య పోరాటం జరిగేవుంటుంది అనడానికి చెట్లు కొట్టేవాడి సాక్ష్యం బలపరుస్తుంది.

ఒక యోధుడైన తన భర్త అన్ని అవమానాల పాలయిన తరువాత బతికి ఉండాలని అతనూ భావించడు. అందుకే అతన్ని చంపెయ్యమని దొంగకు చెప్పుంటుంది. తన చేత్తో తాను ఎలాగూ చంపలేదు.

బోధిసత్త్వుడి మొహం లాంటి నిర్వికార, సుందరమైన మొహం భావోద్రేకాల అద్దం కావడం, మనసు సుడిగుండమవడం మాటలకందని విషాదం. చివరకు వైరాగ్యంతో ఆలయం చేరుకుంది.

ఒక్కటి మినహా మానవాతీత సంఘటనలు చెడుకు దోహదం చెయ్యడం ఈ కథలో ఒక విశేషం. ఆ ఒక్క మంచీ హంతకుడు గుర్రం మీది నుంచి జారిపడటం. దాని వలన రక్షకభటుడు దొంగను పట్టుకోగలిగాడు. భార్యాభర్తలు దొంగకు అడవిలో తారసపడటం కాకతాళీయం. బౌద్ధ పురోహితుడు ఆమెను చూసినపుడు తొలగని ముసుగు దొంగ చూసినపుడు గాలికి తొలిగి వాడి మనసులో వికారంపుట్టి ఆమెను ఏలాగానైనా అనుభవించాలన్న నిశ్చయానికి వచ్చాడు. ముసుగు తొలగకపోతే కథ వేరుగా ఉండేది. భర్తను చంపెయ్యమని దొంగను ప్రేరేపిస్తున్నపుడు ఆమె కళ్ళలోని వెలుగు దొంగకు ఆమెను భార్యగా చేసుకోవాలన్న కోర్కెను రగిలించింది. ఆ కోర్కె ఆమె భర్తతో పోరుకు దింపి అతన్ని చంపేట్లు చేసింది. గంటలోనే ఘడియలోనో అత్యాచారం చేయబడి, భర్తను కోల్పోబోతున్న స్త్రీ మొహం బోధిసత్త్వుడి మొహాన్ని తలపింపచేయడం దైవంపట్ల రచయితకుగల చులకన భావానికి తార్కాణం. నిర్యాణం చెందవలసిన బోధిసత్త్వుడు అపకీర్తిపాలవడంలాంటిది. చావాలన్న ఆమె ప్రయత్నాలు విఫలమయి అన్ని అవమానాల తరువాత ఎప్పటికీతగ్గే అవకాశంలేని మానసిక క్షోభతో జీవించడం శాపమే. అందుకే రచయిత ఆమె చేత “నా గౌరవ రాహిత్యంతో ఇంకా జీవిస్తున్నా. దయామయుడైన దేవుడు [నన్ను పట్టించుకోకుండా] ఒదిలేసినట్టుంది” అన్న ఎత్తిపొడుపు మాటలు పలికించాడు. బౌద్ధ పురోహితుడి చేత మానవ జీవితం మెరుపులాంటిది వగైరా పలికించడంలో హేళన దాగుంది. మానవ జీవితం క్షణికమయితే ఏ విలువకూ, నడవడి సూత్రానికి, మంచికీ చెడుకూ దాంట్లో ప్రాధాన్యత ఉండదు. అక్కడ జరిగిన ఘాతుకాలను పట్టించుకోనక్కరలేదు అని చెప్పినట్టవుతుంది.

చెట్లు కొట్టేవాడు ఘటనాస్థలంలో ఒక దువ్వెనపడుంది అన్నాడు. దాన్ని కేవలం ఒక వక్రోక్తి గా [irony] కాక, ఒక భయంకర, దయనీయ భావనకు సూచికంగా కూడా తీసుకోవాలి. మన పెళ్లితాంబూలం తంతులో కానుకలలాగే జపాను సంప్రదాయంలో ఒకప్పుడు పురుషుడు స్త్రీకి పెళ్లి చేసుకుంటా అని సూచించి దువ్వెన ఇచ్చేవాడు. దాన్ని స్త్రీ తన జుట్టులో ఒక అలంకరణ వస్తువులా ధరించడం ఆరంభించేది. వనంలో స్త్రీ తన మానాన్ని దాని ప్రతీక అన్నట్టు భర్త ఇచ్చిన పెళ్ళిసంబంధ కానుకనూ కోల్పోయింది. ఇది రచయిత అద్భుతమైన భావన. హతుడు హంతకుడిని మెచ్చుకోడమూ అలాంటి వక్రోక్తి. ఆమె తన భర్తను ‘చంపెయ్యి చంపెయ్యి’ అని దొంగతో అన్నపుడు, వాడే ఆ మాటలకు వివర్ణుడయి చేతులు కట్టుకుని భర్తతో “ఆమెను చంపెయ్యమంటావా, వదిలెయ్యమంటావా?” అని అడిగినపుడు భర్త ఇలా అనుకుంటాడు: “ఆ పలుకులు వాడు చేసిన నేరాలకు వాణ్ని క్షమించి ఒదిలెయ్యడానికి చాలు” అనుకుంటాడు.

దుర్మార్గానికి పరాకాష్ట దొంగ భర్తముందే భార్యను చెరచడం.

దురాశకు వడ్డీలా తెలివిమాలినతనం కూడితే దుంపనాశనానికి అది దగ్గిరదారి అవుతుందని ఈ కథ తెలియజేస్తుంది. పాత దొంగ కథలో ‘నాయకుడి’ బతుకులాగే కొత్త కథలోని ‘నాయకుడి’ బతుకూ ఒకే కారణాలవల్ల కొల్లేరయింది. అదే, తెలివితక్కువతో కూడిన దురాశ. ఆ కథలో స్త్రీ భర్త కట్లు విప్పుతూ “దరిద్రుడా, పనికిమాలిన పిరికివాడా! ఇక జీవితంలో నిన్ను నమ్మను,” అంటుంది. ఆ విధంగా మనసులో ఈమె ఏమి అనుకుందో తెలియదుగాని పైకి ఒక్క మాటా నిందిస్తూ అనలేదు. తన అసమర్థతను కప్పి పుచ్చుకుని నిందాత్మకంగా భర్త తప్పు చేయని [మరొకడు ఆమె పట్ల చేశాడు] తన వైపు చూస్తున్నపుడు అలాంటి ఆలోచన, “చంపెయ్యి చంపెయ్యి” అని దొంగతో అన్నపుడు ఆమె మనసులో ఉందేమో. ఇరువురు స్త్రీలు భర్తలు దురాశకు లొంగిపోతున్నపుడు నివారించే ప్రయత్నం చేసుంటే కథ వేరుగా ఉండేది. ఒక ఘాతుకానికి ఎన్ని స్వయంకృతాపరాధాలున్నా, దానిని మానవీయ కోణం నుంచే చూడక తప్పదు.

సత్యం అందరికీ ఒకేలా కనిపిస్తుందని అనుకోలేము. సత్యం మాట అటుంచి పాత్రల దుస్తుల రంగులు ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడ్డాయి, లేదా వాళ్లకు చుసిన గుర్తు. రచయిత అలా చెప్పించడంలో చిన్న విషయాలలోనూ మనిషిది అబద్ధమాడే తత్త్వం అని వ్యక్తం చేయడం కావచ్చు. సత్యం ఇలాంటి భౌతిక వస్తువులకన్నా భిన్నమయినది. కనీసం తమకు అనిపించిన లేక కనిపించిన సత్యం మాత్రమే పలకాలన్న నిజాయతీ మనుషులలో ఉండాలి, సంఘటనతో సంబంధంలేని లోకానికి వెల్లడి కావాలంటే. ఒక ఘాతుకం లేక సంఘటనతో ముడిపడున్న వ్యక్తులు సత్యం వెల్లడిచేయ్యడానికి మానవ సహజ గుణాలయిన ఆత్మాభిమానం లేక ఆత్మగౌరవం – వాటిని అహంభావం అని మొరటుగా పిలవచ్చు – అడ్డుపడతాయి.

తనకు మరణశిక్ష పడుతుందని ఆమె ఆ స్థలం నుంచీ పారిపోయినపుడే తెలిసి ఆ విషయం దొంగ ప్రస్థావిస్తాడు. వాఙ్మూలంలో సమురాయ్‌ని తానే చంపానని తనను శిక్షించుకోమని కుండబద్దలు కొట్టి చెప్పాడు. ఉరిశిక్ష తప్పదని గ్రహించి చావబోతున్న వ్యక్తి, సమాజంలో ఎలాంటి గౌరవం తనకు లేదని నమ్మిన వ్యక్తి, తెగించినవాడు, జరిగిన సంఘటనలలో ఎలాంటి అహం సమస్యలేనివాడు దేనిగురించీ అబద్ధం ఆడాలి? సంఘంలో ఇంతవరకు ఏ విధంగానూ పరువుపోని గౌరవనీయులైన భార్యాభర్తల వలే కాక ఒక పేరుమోసిన గజదొంగ, హంతకుడు మిగతా సత్యాలతోపాటు తానే హత్య చేశానన్న సత్యం కూడా వెల్లడించాడు.

జుగుప్సతో కూడిన నైరాశ్యం ఈ కథ ఊపిరి.

Exit mobile version