[‘వంశీమోహనుని వనసంచారం’ పేరిట కృష్ణ కథని అందిస్తున్నారు మరింగంటి సత్యభామ.]
వసుదేవసుతం దేవం కంస చాణూర మర్ధనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
జగద్గురువైన ఆనందనందనుడు ఆలమందలు మేపుతూ ఆటపాటల లీనమైన గోపాలురనూ బలరామునీ చూసి ఆడుతూ నెమ్మదిగా మెల్లగా చిన్నఅడుగులు వేస్తూ ఆ వనం నుండి ఆడుకుంటూ నడిచి యమున ఒడ్డుకు చేరాడు.
కృష్ణపరమాత్మ నడిచే ఆ సమయంలో పచ్చని పచ్చిక ఆ పాదస్పర్శకు పరవశంతో తలలు వాల్చి మరింత మెత్తగా మారాయి. చిన్నకన్నయ్య చుట్టూ వున్న వృక్షసమూహాలు చల్లని పవనాలు వీచసాగాయి. చిన్న అడుగులతో మొల మువ్వల సడితో కాలిఅందెలు ఘల్లుఘల్లుమనే సవ్వడితో నడుస్తూ యమున ఒడ్డున ఆగాడు.
నల్లని యమునా జలం నల్లనయ్యను చూసి పరవశించి ఆనందతరంగిణి అయి నెమ్మదిగా ప్రవహిస్తూ వచ్చి కృష్ణ పాదాలు తాకి నమస్కరించి వినయంగా భక్తి భావన ముప్పిరిగొనగా చల్లని నీటి తుంపరలుతో అభిషేకించి గలగల శబ్దంతో వెనక్కి వెళ్ళి ఆనందాంతరంగిణి అయి చిన్న చిన్నఅలలతో ప్రవహించసాగింది. ఆ నీటిజారు నాట్యభంగిమతో నర్తిస్తున్నట్లు సుడులు తిరుగుతూ ప్రవహించసాగింది.
ఆకాశాన నీలి నీలి మబ్బులు నల్లమబ్బుగా చిరుజల్లులుగా వెన్నుని అమృతబిందువులతో ఆహ్లాదకరమైన అర్చన చేసిన ఆ యమునాతటి వద్దనే కదా రాధ కృష్ణుని కోసం ఎదురుచూసింది.
‘యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధ
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో’
పాపం రాధ.
కొంచెం సేపు యమున ఒడ్డున నడిచి ఆడుకుని నడుస్తూ ఆ పక్కన వున్న వనాలకేసి నడుస్తుంటే రకరకాల రంగుల పువ్వులతో పచ్చని పూలచెట్లు పరిమళభరితమైన సమీరాలను వ్యాపింపజేస్తూ మందార పొగడమల్లె అడవిమల్లె దిరిసిన రేల సంపంగి జాజి విరజాజుల వర్ణరంజిత కాంతుల శోభాయమానంగా పుష్పాభిషేక పూలవాన కురిపించీ ఆ విశ్వంభరుని పూజించి జన్మ ధన్యమయిందని ఆరాధిస్తు ఆ మార్గమంతా సుగంధభరిత మెత్తని మార్గం ఏర్పరచాయి.
తరువులు తన్మయంతో తలలూపుతూ నందనందనునికి పుష్ప నీరాజనాలు సమర్పిస్తూ చిరు పవనాలతో వీవన సేవ చేస్తున్నవి. విశాలమైన పత్రాలు ఛత్రమై నీడనందిస్తున్నవి. వన వృక్షాలు చల్లని నీడల పవన కైవారాలతో తరిస్తున్నవి.
పక్షి గణాలు ఆ వృక్షాలపై నుండీ పైకెగిరి తమ పక్షాలతో కైమోడ్పులు సమర్పిస్తూ ఆనందంతో కిలకిలారావాలు చేస్తూ వాసుదేవునికి స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నవి. పరమహంసను దర్శించి హంసలు కొలనులో ఈదుతూ కృష్ణశబ్ద స్మరణతో పులకించిపోతున్నవి. కోకిలలు కుహుకుహుమని మధుర రాగాలాపనలతో స్వాగత గీతికలు ఆలపిస్తున్నాయి. శుకములు రామరామ కృష్ణకృష్ణ స్మరణ చేసి తరిస్తున్నవి.
పక్షీంద్రుడు నిత్యం సేవించుకునే నారాయణుని వేదమంత్రాలతో స్తుతిస్తూ అనుసరిస్తున్నాడు. ఆ వనమంతా పక్షిగణ సంకీర్తనలతో ఆనందధామంగా మారిపోయింది. సహస్రఫణుల శేషశాయి అన్న బలరాముడై అనుసరిస్తుండగా వనలక్ష్మి శ్రీహరిని సాష్టాంగ ప్రణామాలతో కరుణించ కోరుతూ చందనార్చన చేసి సుగంధమాలిక సమర్పించి నమస్కరించింది.
ప్రకృతిమాత ఆ వనంలో విరిసిన విరిమాల కూర్చి పరమాత్మకి అలంకార సేవ చేసింది. బృందావనం శ్రీకృష్ణ దర్శనానందంతో తులసీదళమాలికను గోవిందునికి సమర్పించి అర్ధనిమీలిత నేత్రాలతో సాష్టాంగ నమస్కారం చేసింది.
‘మనసే అందాల బృందావనం
వేణుమాధవుని సేవే మధురామృతం’
కొంటె కృష్ణుడు అడుగులో అడుగు వేసుకుంటూ వనపుష్పవాటికలో నెమ్మదిగా నడుస్తు అల్లంత దూరాన వున్న మయూరాల సమీపానికి వెళ్తుండగా నెమళ్ళు క్రేంకారాలతో చెట్ల కొమ్మల నుండి దిగి మయూరనృత్యం చేయసాగాయి. పులకరింతలతో పింఛాలను జలజల శబ్దాలు చేస్తూ జలదరింపులతో ఆడుతూ స్వాగత నృత్యంతో కేకిసమూహం ఆనందాశ్రువులు కురిపిస్తూ ఆనందతరంగాలతో తేలియాడుతూ పింఛాలతో వందన సమర్పణ చేసి కనులారా కృష్ణపరమాత్మని దర్శిస్తున్నవి.
అల్లంత దూరం నుండి సుందరమయూరం మందగమనంతో నృత్యం చేస్తూ పురులు విప్పుతూ ముడుస్తూ భూజనమందారుని సమీపించి ముక్కును పట్టిన సుందరపింఛాలు నల్లని స్వామి సిగనలంకరించి అరమోడ్పు కనులతో
‘నీలమోహనా రారా నిన్నుచూడ
నెమలి నెరజాణ నీలమోహనా రారా
రారా నీలమోహనా రారా’ అన్నది.
నందకుమారుడు శిఖిశిఖను ప్రేమ మీర నిమిరి “శ్రీకృష్ణావతార సమయమంతా నీ భక్తి తత్పరత గుర్తుగా శిఖిపింఛాలు శిఖకిరీటం వద్ద అలంకారంగా ధరించి శిఖిపింఛమౌళీనౌతాను” అని అనురాగంతో చెప్పాడు.
సారంగము తలెత్తి భక్తిపూర్వకంగా పరమాత్మ దివ్యసుందరస్వరూపం కనులార దర్శించి ధన్యత చెందింది.
‘మానస సంచరరే బ్రహ్మణి
మానస సంచరరే
మదశిఖిపింఛాలంకృత చికురే
మహనీయ కపోలవిజిత ముకురే
మానససంచరరే’
అక్కడ నుండి నెమ్మదిగా వెనక్కు ముందుకు చూస్తూ అడుగులు వేస్తు వెళ్తుండగా ఆ కానలో ఇరుపక్కలా దట్టంగా స్వర్ణవర్ణంతో మెరుస్తూ పొడవుగా తలలూపుతూ వంగుతున్న వెదురు పొదలు ఒక్కసారిగా ఆకులు కిందకి వంచి రివ్వు రివ్వుమనే చిరుసవ్వడితో అభివాద సుమధుర మురళీరవం సమర్పించాయి. ఆ ధ్వని మధుర మురళీ గానంలా రాగరంజితంగా ధ్వనిస్తోంది. శ్రీకృష్ణపరమాత్మ ఆ పొదలకేసి ప్రసన్నంగా ప్రేమగా వీక్షించాడు. ఆ వంశీపొదల నుండి స్వర్ణకాంతుల మనోజ్ఞ వేణువు యశోదానందనుని హస్తాన్ని అలంకరించింది.
వేణుమాధవుడు ఆ పిల్లనగ్రోవిని పట్టి ప్రశాంత సుందరవదనుడు పొగడచెట్టు కింద నిలబడి మనోహరభంగిమతో వేణుగానం చేయసాగాడు.
ఆ వన పరిసరాలు మురళీ గానలహరికి ప్రవేశించిన వనహరిణాలు గోగణమృగపక్షి సమూహాలు పరుగుపరుగున వచ్చి స్వామిని చేరి పరమాత్మను తన్మయంగా చూస్తు ఆలకించ సాగాయి. నెమళ్ళు పురి విప్పి ఆనంద నృత్యం చేయసాగాయి. దశావతారుని దర్శనభాగ్యం వలన క్రూరమృగాలు సాధుత్వం సంతరించుకుని యదునందనుని భక్తిగా అరమోడ్పు కనులతో వీక్షిస్తూ మైమరచాయి. కర్ణానంద భావనతో లీలామానుషుని వంశీగానం అలల్లా అల్లనల్లన సాగి ఆబాలగోపాలము గోవులు క్రేపులు లేగలు కోడెలు వల్లభాలు గొల్లభామలు రేపల్లె కదలి మురళీనాద రవళికి పరుగుపరుగున వచ్చి చేరి విప్పారిన కనులతో మైమరచి
‘రేపల్లియ ఎద ఝల్లన పొంగిన మురళీ
నవరస మురళీ ఆనందన మురళీ
ఇదేనా ఆ మురళి
వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళీ ఆనందన మురళీ
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి మోహన మురళీ
యాదవకుల మురళీ’
మురారి వద్దకు గోపాలబాలవృధ్ధకిశోరప్రాయులు శరణాగత స్ధితిలో అచేతనావస్థలో వుండగా ఒక్కసారి నల్లని స్వామి మాయా లీల విడిచి “అమ్మా అన్నా మనం ఎక్కడవున్నాం? ఎక్కడికి వచ్చాం? అమ్మా ఆకలి వేస్తోంది. పాలు, నవనీతం ఇయ్యమ్మా” అని బిక్క ముఖంతో కళ్ళు నులుపుతూ తల్లిని పిలుస్తూ మాయ నుండి విడిపించి వాస్తవంలోకి తెచ్చాడు.
మాయామానుషవేషధారి లీలాకృష్ణుడు లీలలు చూపుతూంటే గోపాల బాలుని లీలలు దివిజులు అధికాశ్చర్యంతో వీక్షిస్తూ ఆనందపరవశులై స్తుతించారు గగనతలం నుండి.
‘ఓ పరంధామా పరమాత్మా లక్ష్మీవల్లభ నీరజాక్షా
నీలమేఘశ్యామా కరుణా సముద్రా రక్షమాం
రక్షమాం పాహి పాహి పాహిమాం పాహి’
అంటూ హర్షపులకిత హృదయంతో స్తుతి స్తోత్ర వందన సుమవర్షం కురిపించారు.
‘కస్తూరీ తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయన్
కంఠేచ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణీ
విజయతే, గోపాల చూడామణీ’
(సమాప్తం)