(ఉర్దూ కవి బషీర్ రచించిన ‘లోగ్ టూట్ జాతే హై!’ అన్న కవితని అనువదించి అందిస్తున్నారు గీతాంజలి.)
చిన్న ఇల్లు కట్టుకోటానికి వాళ్ళొక పక్క శ్రమించి.. శ్రమించి అలసటతో కుప్ప కూలిపోతుంటారు.
మరో పక్క ఈ పేదల బస్తీలు కాల్చేస్తూ ఉంటావు.
నీలో ఇసుమంత జాలి కూడా లేదేందుకు??
వాళ్ళ హృదయం ముక్కలైపోయి ఉండదా?
***
ఋతువులు వచ్చి-పోవడానికి మరిన్ని మధుపాత్రలు విరగాల్సి ఉంది ఈ మధు శాలలో.
***
ఒట్టిగా స్పందించే రాయిని ఈ అమాయకమైన మనుషులు హృదయం అనుకుంటున్నారు
వీళ్ళకేం తెలుసు.. జీవితం గడిచిపోతుంది హృదయాన్ని.. హృదయంగా మార్చడానికి??
***
ఆ పిచ్చి పావురం.. తన గూటిలో విష నాగు ఉందని కూడా చెప్పలేని మూగ జీవి.
ఇంకేం చెప్పడానికి మాత్రం నోరు విప్పుతుందని?
***
సరేలే.. మరో ప్రియురాలు జీవితంలోకి వచ్చేస్తుంది.
ఇక ఊరుకో.. దుఃఖించకు. ఎంత కాలం పడుతుందని ఆమెని మరిచిపోవడానికి చెప్పు?
కానీ.. ఊరకనే ప్రేమ నటించడానికి మళ్లా ఒక్కటంటే ఒక్క స్నేహం కూడా దొరకలేదు.. ఏం చేయను?
చాలా వెతికాను ఒక మనిషి కూడా దొరకలేదు.
***
సమస్త బంధాలనూ ఇంట్లో వదిలేసి వచ్చాను
అయినా నాకు కనీసం ఒక అపరిచితుడు కూడా దొరకలేదు..
***
ఈ దగ్గరితనాల్లో ఉండే దూరం కూడా భలే విచిత్రమైంది.
అతను నాతోనే ఉన్నాడు కానీ.. నాకెన్నడూ దొరకనే లేదు.
***
ఆ ఖుదా సృష్టించిన ఇంత విశాలమైన లోకంలో..
బస్.. అతనొక్కడినే కోరుకున్నా..
నా దురదృష్టం చూడండి అతనే నాకు దొరకలేదు.
మూల కవి: బషీర్ బధర్
అనువాదం: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964