[సుస్మిత గారి ‘వలస’ అనే నవల సమీక్షని అందిస్తున్నాము.]
రచయిత్రి సుస్మిత రచించిన ‘వలస’ నవల చదువుతూంటే, వూడీ అల్లన్ అనే హాలీవుడ్ దర్శకుడి సినిమా చూస్తున్నట్టనిపిస్తుంది. వూడీ అల్లన్ సినిమాలో ఉద్విగ్నతలు ఉండవు. ఉపన్యాసాలు ఉండవు. మామూలు మనుషుల జీవితాలుంటాయి. మనుషుల మనస్సుల్లో సందిగ్ధాలు ఉంటాయి. ఆందోళనలు ఉంటాయి. మానవ సంబంధాలలోని వైరుధ్యాలు ఉంటాయి. మనుషుల అంతరంగ సంఘర్షణలు ఉంటాయి. మనుషులు ఒకరితో ఒకరు కలుస్తూ మాట్లాడుకోవటం ద్వారా విషయాలు తెలుస్తాయి. వూడీ అల్లన్ సినిమాలకూ ఈ నవలకు భాషతో పాటూ, అనేక పాత్రలుండటమే తేడా! వూడీ అల్లన్ సినిమాల్లో పాత్రలు పరిమితంగా వుంటాయి.
‘వలస’ నవల రచనలో రచయిత్రి నాటకీయతను, అతిశయోక్తులను పరిహరించారు. పాత్రల మానసిక సంఘర్షణలను, కష్టాలను కూడా సర్వసాధారణంగా ‘as a matter of fact’ లా ప్రదర్శించారు. దాంతో పాఠకుడికి పాత్రల కష్టాలు, సంఘర్షణలు అర్థమవుతూంటాయి కానీ, పాత్రలతో మమేకం కాడు. అయితే, నవల పఠనం ఆరంభిస్తే, పూర్తి చేయకుండా వుండలేడు. అది రచయిత్రి ఎంచుకున్న ప్రదర్శనాంశంలో వున్న బలం. ఇటీవలి కాలంలో వచ్చిన అర్ధవంతమయిన, విభిన్నమైన, ఆసక్తికరమైన నవల ‘వలస’. నవల ముఖచిత్రం అందంగా ఆకర్షణీయంగా రూపొందించారు. నవలలో అక్షరాలు కూడా శుభ్రంగా అందంగా వున్నాయి. చక్కని పుస్తకం రచించి రూపొందించిన వారందరికీ అభినందనలు.
నిజానికి నవల కథ ఏమిటి అంటే ‘ఇదీ’ అని చెప్పటం కష్టం. ఎందుకంటే, రచయిత్రి పాత్రల ఆధారంగా అమెరికాకు వలస వెళ్ళిన వారి జీవితాలను ఉన్నది ఉన్నట్టు ఎలాంటి మసిపూసి మారేడుకాయ చేయకుండా, అంటే, ‘భారత్ పనికిరాదని, అమెరికానే గొప్ప’ అన్న దృక్కోణం కానీ, ‘అమెరికా గొప్ప ఏమీ లేదు, మన దేశమే బెస్ట్’ అనే ఏకపక్ష దృక్కోణాన్ని కానీ ప్రదర్శించకుండా, పలు కారణాలవల్ల అమెరికా వెళ్ళి, అక్కడ జీవితానికి అలవాటు పడి, ఇక్కడి జీవితాన్ని బంధనాలను వదలుకోలేక, అక్కడ వుండలేక, అటూ ఇటూ కాక, ఎక్కడా సంతోషంగా వుండలేక అసంతృప్తితో కొట్టుమిట్టాడే జీవితాలను ఒక డాక్యుమెంటరీలాగా ప్రదర్శించారు.
అందుకే, ఏ పాత్రతోనూ మమేకం కాకపోయినా, పుస్తకం పూర్తిగా చదవకుండా ఉండలేము. ఒకవేళ మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చి పక్కన పెట్టినా, మనసులోనే మెదులుతూండటంతో పూర్తిగా చదవకుండా ఉండలేము.
నవల ఆరంభంలో ఓ అబ్బాయి, ఇంటికి వచ్చిన అమెరికా డాక్టర్ను చూసి తానూ అమెరికా వెళ్ళాలని అనుకుంటాడు. బహుశా నవల కథ – అమెరికా వెళ్ళటం కోసం ఆ అబ్బాయి పడే కష్టాలో, అమెరికా వెళ్ళిన తరువాత అమెరికా నచ్చక భారత్ బెస్ట్ అనుకుని తిరిగి రావటమో – అన్న ఆలోచన కలుగుతుంది.
కానీ, తరువాత కథ తిన్నగా, కలవెరాస్ ఫ్యూనెరల్ అండ్ క్రిమేషన్, పార్కింగ్ లాట్ కు తీసుకువెళ్తుంది. బాబ్జీ అనే వ్యక్తి కళ్యాణి అనే అమ్మాయిని అక్కడ దింపుతాడు. అక్కడ స్వామి అనే ఆయన మరణించాడనీ, అతని భార్య గోమతి అంతకుముందే మరణించిందని, వాళ్ళ కూతురు తురీయ అనీ తెలుస్తుంది.
ఈ సందర్భంలో వినిపిస్తుంది ఈ నవలకు కీలకమైన వాక్యం, ‘ఈనగాచి నక్కలపాలు చేయకూడదు’ అన్నది. ఈ వాక్యం పూర్తి అర్థం తెలియాలన్నా, ఈ వాక్యానికి నవలకి, పాత్రలకూ, మనకూ సంబంధం ఏమిటో తెలియాలన్నా నవల మొత్తం చదవాల్సిందే. ఎందుకంటే, ఈ నవల కేవలం అమెరికాకు వలస వెళ్ళినవాళ్ళకే కాదు, భారత్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రాసంగిత ఉన్న నవల. ఎందుకంటే, మనకు తెలియకుండా మనము అమెరికాను మనలో నింపుకుంటున్నాము. ఈ నవలలో ప్రదర్శించిన సమస్యలను మనమూ అనుభవిస్తున్నాము, చూస్తున్నాము. అందుకే, నవల పూర్తయిన తరువాత కూడా, ‘ఈనగాచి నక్కలపాలు చేయకూడద’న్న వాక్యం వెంటాడుతుంది. వెంటాడుతూనే వుంటుంది.
నవల కథ ఆరంభంలో దృష్టి కళ్యాణి పాత్రపై వుంటుంది. ఇంతలో శ్యామ్ పాత్ర పరిచయమవుతుంది. కాస్త ఆ పాత్ర గురించి తెలుస్తుంది. కానీ, కళ్యాణికీ, శ్యామ్ పాత్రకూ సంబంధం ఏమిటో తెలియదు. కథ కాస్సేపు శ్యామ్ వైపునుంచి నడుస్తుంది. అతనికి యాక్సిడెంట్ వల్ల అనోజ్మియా (వాసన, రుచి తెలియనితనం) వచ్చిందని తెలుస్తుంది. కథ కళ్యాణి, శ్యామ్ల వైపునుంచి చెప్పటం వల్ల, వీరిద్దరూ ప్రధాన పాత్రలేమో, కళ్యాణి జీవితం, అతని జీవితంతో కలుస్తుందేమో అనుకుంటాం. కానీ, అలాంటిదేమీ జరగదు. ఇంతలో రుక్మిణి పాత్ర పరిచయం అవుతుంది. అక్కడ ఆమె డాక్టర్ని కలుస్తుంది. ఆ డాక్టర్ పేరు స్వామి. ఇలా ఒక పాత్ర పరిచయమై, ఆ పాత్ర కథ నడుస్తూ, మరో పాత్ర పరిచయమవగానే, ఆ పాత్ర కథ చెప్తూ, ఇంతలో ఇంకో పాత్రవైపు వెళ్ళి, మళ్ళీ మొదటి పాత్ర దగ్గరకు వచ్చి, మళ్ళీ ఇంకో పాత్రను పరిచయం చేసి..ఆ పాత్ర జీవితం చెప్తూ..ఇలా సాగుతుంది నవల. చాలా సంక్లిష్టమైన రచనా పద్ధతి ఇది. ఎక్కడ దారం ముడి సరిగా వేయకపోయినా మొత్తం మాల తెగిపోతుంది. కానీ, ఈ సంక్లిష్టమైన పద్ధతిని సమర్ధవంతంగా నిర్వహించింది రచయిత్రి. ప్రతి పాత్రకూ ఎక్కడో ఓ చోట సంబంధం కల్పించి ఎక్కడా ‘లూస్ ఎండ్స్ ‘ వదలకుండా, ఒక ఆలోచనాత్మకమైన ముగింపుతో నవలను పూర్తి చేసింది. ఇలాంటి ఓపెన్ ఏండెడ్ నవలలు గుర్తుండటమే కాదు, చక్కని చర్చలకు దారితీస్తాయి.
ఒకవైపు కళ్యాణి కథ సాగుతూంటుంది. ఆమెకి పిల్ల పుట్టటం, పిల్ల తిండి సమస్య, ఉద్యోగం కోసం ప్రయత్నాలు, అందుకు సహాయం చేసే మంచివారు. మరో వైపు శ్యామ్ కథ, అతని యాక్సిడెంట్, తల్లి తండ్రులతో సంబంధం వంటి విషయాలు తెలుస్తూంటాయి. కథను ఆసక్తిగా చదువుతూంటాము. రచయిత్రి పాత్రల మనస్తత్వాలను, పరిస్థితులను పరిచయం చేస్తూంటే, కళ్ళ ముందు అమెరికాలో మనవారు, మనకి తెలిసినవారు కదులుతూంటారు. అయితే, ఇంతకీ ఈ నవల గమ్యం ఏమిటి? ప్రధాన పాత్ర ఎవరూ? అర్థం కాదు.
ఈ నవలను మనకలవాటయిన మామూలు నవలల్లా చదవకూడదు. మనకి ప్రధాన పాత్ర వుండాలి. నవలంతా ప్రధాన పాత్ర చుట్టూ తిరగాలి. ప్రధాన పాత్ర లక్ష్యం సాధించటం నవల ముగింపు కావాలి. నవల మొత్తం, నడుమ ఎన్ని పాయలు కలిసినా గమ్యం వైపు పరుగులిడాలి. కానీ, ఈ నవలను అలాంటి ఆలోచనలతో, అలా ఊహించి చదవకూడదు. ఈ నవలలో ప్రధాన పాత్ర అమెరికా. లక్ష్యం అమెరికా జీవన విధానాన్ని పరిచయం చేయటం, అంతే, అయితే, నవలలో పాత్రలన్నిటి మధ్యా, ఒక చిన్న సంఘటన ద్వారానో, ఏదో రకంగా పరిచయం ఒక్కసారైనా జరుగుతుంది. ఆ పరిచయం ఎటో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన జీవితాల్లోలాగే.
ఒక వ్యక్తి పరిచయమవుతాడు. తరువాత అతడిని కలవము. అతడేమవుతాడో తెలియదు. అలా, జీవితాన్ని ఉన్నదున్నట్టు, కాస్త కల్పన జోడించి ప్రదర్శిస్తుందీ నవల.
ఈ నవల అధిక భాగం డాక్టర్ స్వామి, అతడి కుటుంబ గాథను ప్రదర్శిస్తుంది. కానీ, అతడు కూడా ఈ నవలకు హీరో కాడు. నిజానికి ఈ నవలలో ఏ పాత్రకి ఆ పాత్ర హీరో. ఆ పాత్ర ప్రధాన పాత్ర. ఒక పరిస్థితిని, ఒక మనస్తత్వాన్ని ప్రదర్శించే సాధనం.
ఈ నవలలోని వ్యక్తుల కుటుంబ కథలను చెప్పటం ద్వారా, అమెరికాలో వుంటున్నవారు ఇటు కుటుంబపరంగా, అటు ఉద్యోగపరంగా, ఇటు వ్యక్తిగతంగా, తమ సంతానం పరంగా ఎదుర్కుంటున్న సమస్యలను అతి సున్నితంగా ప్రదర్శిస్తారు రచయిత్రి. హేట్ క్రైమ్స్ కూడా ద్వేషం లేకుండా ప్రదర్శిస్తారు. ముఖ్యంగా, ముందు పరిచయం అయిన ఫ్యూనెరల్ సర్వీస్ సంఘటన ఏమిటో, ఎందుకో చివరి దాకా తెలియకుండా, కానీ, అన్ని చిక్కుముళ్ళను సందర్భం వచ్చినప్పుడు విప్పుకుంటూ రచించిన విధానం చక్కగా అనిపిస్తుంది.
మొదటి అధ్యాయంలో హత్య జరిగి చివరి అధ్యాయంలో హంతకుడెవరో తెలిసేటటువంటి నవల కాదిది. నిజానికి పాఠకుడు కూడా, ఆ సంఘటనకి నవలలో వస్తున్న సంఘటనలకూ సంబంధం ఏమిటని ఆలోచించడు. నవల చదువుతూ పోతాడు. ప్రేమలు, ప్రతీకారాలు, ఆవేశాలు, ఉద్యమాలు, అసందర్భ ప్రేలాపనలే నవల రచనగా ప్రచారం అవుతున్న సమయంలో ఇలా సీధాసాదా జీవితాన్ని, సీదాసాదా రచన రూపంలో అందించటం ప్రశంసనీయం.
ఎలాగయితే, సినిమా ఆరంభంలో తుపాకీ కనిపిస్తే, చివరలో తుపాకీ పేలాలంటారో, అలాగ, నవలలో ప్రతి పాత్రకీ ఒక అర్థం, పరమార్థం వుండాలి. ప్రతి సంఘటనకూ ఇతర సంఘటనలకూ సంబంధం వుండాలి. కథకు ఒక గమ్యం, ఒక లక్ష్యం వుండాలి అని అంటారు. కానీ, అన్ని నియమాలనూ త్రోసిరాజని, నిజ జీవితాన్ని ఒక డాక్యుమెంటరీలా ప్రదర్శిస్తూ తాననుకున్న లక్ష్య సాధనపైనే దృష్టి నిలిపి, అనుకున్నది అనుకున్నట్టు రచించిన రచయిత్రిని అభినందించక తప్పదు. భవిష్యత్తులో రచయిత్రి ఇలాగే విభిన్నమయిన రచనలు చేస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తుందని సంచిక ఆశిస్తున్నది.
‘ఈనగాచి నక్కల పాలు చేయటం’ అన్న వాక్యం ప్రాధాన్యం అర్ధం కావాలంటే, ఎవరికి వారు నవల చదివి తెలుసుకోవాల్సిందే. ఎవరెవరి అనుభవాలనుబట్టి, ఆలోచనలనుబట్టి, ఆ వాక్యం అర్ధమవుతుంది.
ఈ నవలపై భిన్నమైన అభిప్రాయాలు సహజంగా వ్యక్తమవుతాయి. భారత్ లో వుండి అమెరికా ఒక దూర దేశంలా వున్న వారికి ఒక రకంగా అర్ధమవుతుంది. భారత్ నుంచి అమెరికా వలస వెళ్ళి అక్కడ స్థిరపడినవారికి ఇంకో రకంగా అర్ధమవుతుంది. అమెరికాలో కొన్నాళ్ళుండి భారత్ తిరిగివచ్చినవారికి మరో రకంగా అర్ధమవుతుంది. భారత్ తిరిగి రావాలనుకుని రాలేని వారికి ఇంకో రకంగా అర్ధమవుతుంది.
తెలుగులో సరయిన నవలలు, భిన్నమైన నవలలు, ఇంటెలిజెంట్ నవలలు రావటం లేదనే వారందరికీ సమాధానం ఈ నవల. తెలుగు సాహిత్యాభిమానులందరూ తప్పనిసరిగా చదివి, చర్చించి, ఆలోచించవలసిన నవల ఇది.
***
రచన: సుస్మిత
ప్రచురణ: అక్షమాల బుక్స్,
పేజీలు: 246
వెల: ₹ 225/-
ప్రతులకు:
పల్లవి పబ్లికేషన్స్,
విజయవాడ. ఫోన్ 9866115655
ఆన్లైన్లో:
https://logilitelugubooks.com/book/valasa-susmita
~
సుస్మిత గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-susmitha/
