Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వలస బాధలు వదులుకోండి

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘వలస బాధలు వదులుకోండి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

క్షులు వలస పోతాయి
జంతువులూ వలసలు పోతాయి
మనిషికి జీవనం కోసం వలస తప్పదు
అయిన వారిని బంధువులను
బాంధవ్యాలను దూరం చేసుకుని
తనది కాని చోటికి
ధనం మీద ఆశ పెంచుకొని
కాని దేశాలకు తరలిపోతున్నారు
ఆకాశంలో ఎగిరే పక్షి స్వేచ్ఛాజీవి
మనిషికే కట్టుబాట్లన్నీ
ధనం ఒకటే చాలదు ప్రయాణానికి
నువ్వు నువ్వే నన్న ఋజువు కావాలి
ఏ దారిలో నడిచినా గమ్యం శూన్యం
రాళ్లు రప్పలు ముళ్ళ కంపలు
మార్గం తెలియని అడవి ప్రయాణం
గాలి పీల్చుకునే వేళకు
నిన్ను పసిగట్టితే నీకు అరదండాలే
ప్రయాణంలో భరించలేని తిప్పలు
అయినా ఆశకు చావులేదు
నీవు కానరాని దూరాలకేగునప్పుడు
నీ వారి కళ్ళల్లో చూపు నిలిపి చూడు
ఆ కళ్ళలోని ఆర్తిని గమనించు
అయిన వారితో గంజి తాగినా ఆనందమే
కానీ చోట కాసులెన్నిఉన్నా కాచేవారు
మెచ్చుకునే వారు ఎవరున్నారు
స్థానబలిమి కాని తన బలిమి కాదయా అన్నారు ఆనాడు పెద్దలు
నీవు ఉన్నచోటే పువ్వుల బాట
నీకు కాని చోటెప్పుడూ
నిప్పుల మీద నడకే
వలస మార్గం సుగమమయితే
స్వర్గం ఎదురవుతుంది
అది కెనడా అయినా మెక్సికో అయినా
అందరూ కలలుకనే
అగ్రరాజ్యం అమెరికా అయినా
నీ కలలు చెదిరి కరిగిపోయిన
నాడే నీకు కష్టమెదురవుతుంది
అందుకే
నీవు నిలబడిన చోటే విజేతవుకా
జీవికకు జ్ఞానమే నీ ఆయుధంగా
పిడికిలి బిగించి పోరాడు
దేశమాత తలెత్తుకునేలాగా బ్రతుకు
నీ నైపుణ్యాలతో చైతన్యాన్ని కలిగించి
అందరికి ఆదర్శంగా నిలబడి
నీ తోటివారికి ధైర్యాన్నిచ్చి
నీ జాతి గౌరవాన్ని కాపాడు.

Exit mobile version