Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వైకుంఠపాళి-12

“నాకు నువ్వు ఏడ్వటం చూస్తుంటే నవ్వొస్తోంది. ఏడిపించటమే తప్ప ఏడవటం కూడా నీకు వచ్చా?” విరక్తిగా అడిగాడు.

“మీరు… మీరు నన్ను నమ్మరని నాకు తెలుసు. అయినా ఓ ప్రయత్నం చేద్దామని వచ్చాను. వచ్చే నెల మీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాను. ఈ మాళవిక ఈ రోజు ఓ ప్రముఖ రచయిత్రిగా వెలుగొందడానికి మీరే కారణం అని లోకానికి తెలియజెప్పి నిండు సభలో మీ పాదాల ముందు మోకరిల్లాలనుకుంటున్నాను. నన్ను అసహ్యించుకున్నా… అందుకు మాత్రం అడ్డు చెప్పకండి. ముప్ఫై వేల రూపాయల పర్సు ప్రెజెంట్ చేసి నా కృతజ్జతలు చూపించుకోవాలనుకుంటున్నాను… కాదనకండి” అతని భుజం పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటూ అంది.

వాసుదేవరావు తన మాసిన గెడ్డాన్ని నిమురుకుంటూ ఆలోచనగా వుండిపోయాడు.

ఆమె నెమ్మదిగా ముందుకు వంగి అతని గరకు చెంప మీద ముద్దు పెట్టి “కాదనరని నాకు తెలుసు!” అంది.

***

మాళవిక రాజశేఖరంతో…

“ఈ సాహిత్య పరిషత్తు ఎవార్డుతో నేను పూర్తిగా విజయ శిఖరం ఎక్కేసినట్లే!” గిరగిరా తిరుగుతూ అంది.

“ఇంకా ఎక్కలేదు… ముందు కిందకి చూడు” ఆమెని మంచం మీదకి లాగుతూ అన్నాడు రాజశేఖరం.

“ఇదంతా మీ వల్లే. మీ మేలు జన్మలో మరువలేను” కళ్ళల్లో కృతజ్ఞతలు గుమ్మరిస్తూ అంది మాళవిక.

“నాకు కావల్సింది ఒట్టొట్టి మాటలు కాదు… చేతలు” రాజశేఖరం ఆమె నైటీ జిప్ కోసం వెదుక్కుంటూ అన్నాడు.

ఇంతలో డోర్ బెల్ మ్రోగింది.

“ఈ సమయంలో ఎవరు?” రాజశేఖరం విసుగ్గా అడిగాడు.

“చూసొస్తా” నైటీ సరి చేసుకుని లేస్తూ అంది మాళవిక.

“త్వరగా వచ్చేయ్యి” చిరాగ్గా అంటూ సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు రాజశేఖరం.

“ఆ. వన్ మినిట్” ఆమె బైటికి నడిచింది.

తలుపు తీయగానే ఆమెకి ఎదురుగా సతీష్ చంద్ర కనిపించాడు.

ఒక్కసారిగా నెత్తి మీద పిడుగు పడినదానిలా “మీరా?” ఆంది.

“ఏం… ఊటీ నుండి వచ్చినట్టుగా నాకు ఫోన్ చెయ్యకపోయినా ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా?” అడిగాడు.

“ఆ… కొంచెం బిజీగా వున్నాను. అందుకే చెయ్యలేకపోయాను” అంది.

“ఫరవాలేదులే.. పెద్ద రచయిత్రివి కదా” అతను లోపలికి వస్తూ అన్నాడు.

ఆమె కంగారుగా “మీరు ఉదయం రాకూడదూ… నాకు ఒంట్లో బాలేదు” అంది.

అతను ఆమె దగ్గరగా వచ్చి, “అరే… ఏమైంది? జ్వరమా… తలనెప్పా? నేను సేవలు చేస్తాలే” అన్నాడు.

“అవేం కాదు. మనసు బాగాలేదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి” అంది.

“నిజంగా ఒంటరిగానే వున్నావా?” అతని కంఠంలో వ్యంగ్యం తొణికిసలాడింది.

ఆమె కళ్ళెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది.

సతీష్ చంద్ర దవడ కండరం బిగుసుకొని, కోపంగా కనిపించాడు. “సెల్లార్‍లో ఆ సినీ నిర్మాత కారు నాకు కనిపించింది. ఇంకేం బుకాయించకు. నువ్వు ఊటీ కూడా వాడి తోటే వెళావు. ఇంకా నా దగ్గర దాచాలనీ, నాటకాలాడాలనీ చూడకు!” అని అరిచాడు.

మాళవిక నైటీ తాడు కట్టుకుంటూ “అన్నీ తెలిసాకా, ఇంకా ఎందుకు రాద్ధాంతం? వెళ్ళండి” అంది.

సతీష్ చంద్ర – వూహించని ఆ మాటలకి నిశ్చేష్టుడయ్యాడు. అంతలోనే తేరుకుని, “అంటే… అంటే నీ ఉద్దేశం… అతనే నాకన్నా ఎక్కువనా? ఎంత నీచురాలివీ?” అన్నాడు.

మాళవిక కూడా కోపంగా, “ఏం? నేను చేసిందే రేపు నువ్వు చేస్తావు. నా కన్నా అందమైనదీ… వయసులో వున్నదీ కనిపించి నిన్ను పొగుడుతూ నీ చుట్టూ తిరిగితే నన్ను వదిలేసి ఆ పిల్లతో సరసాలాడ్తావు. పెళ్ళైన కొత్తల్లో నీ భార్యతో ఇంతే సరదాగా వుండేవాడివిగా. ఇప్పుడు నా కోసం పరిగెట్టుకొస్తున్నావు. రేపు ఇంకొకత్తె దొరికితే దాని కోసం…” అంది.

“ఛీ! నేను నీ లాగా కాదు!” ఛీత్కారంగా అన్నాడు.

“కానీ నేను ఇలాగే ఆలోచిస్తాను. వ్యాపారంలో నీతో నచ్చక నీ పార్ట్‌నర్ విడిపోవాలనుకుంటే ఏం చేస్తావు? ఇదీ అంతే!” అంది.

“ఇదీ వ్యాపారమూ ఒకటేనా? ఆ రోజున మనది నిజమైన ప్రేమన్నావూ!”

“ప్రేమ కూడా ఓ బిజినెస్సే… నిజంగా ప్రేమిస్తే అలా ప్రేమిస్తూనే వుండు. ఇలా అర్ధరాత్రి నా ఇంటికొచ్చి అరవటం, గొడవ చెయ్యడం ఎందుకూ? లోపల నా గెస్ట్ వున్నాడు. బావుండదు. వెళ్ళిపో… నువ్వు గొడవ చెయ్యడానికి నీ దగ్గరున్న హక్కులు చాలవు. నేనేం నీ పెళ్ళాన్ని కాదు” నిర్లక్ష్యంగా తలుపు వైపు చూపిస్తూ అంది.

“యూ… బిచ్…” అతను పళ్ళు పటపటా కొరికాడు.

“మాటలు తిన్నగా రానీ…” ఆమె వేలు చూపిస్తూ హెచ్చరించింది. “మార్కెట్ లోకి మనం వాడే దాని కన్నా బెటర్ ప్రోడక్ట్ వస్తే కొనకుండా ఇంకా పాతదే పట్టుకుని వెళ్ళాడతామా… బిజినెస్‌మాన్‌విగా ఆ మాత్రం ఆలోచించలేవా? నువ్వు నన్ను తిడ్తే నేను నిన్ను తిట్టాల్సొస్తుంది. గెట్ లాస్ట్” అంది.

సతీష్ చంద్ర ఒక్కసారిగా ఆమె నిలబడిన చోటు నుంచి మొత్తం గదిని పరీక్షగా చూసాడు. అక్కడున్న ప్రతీ వస్తువూ అతను కొనిచ్చినదే! ఎంత అమాయకంగా నమ్మాడూ. అతనికి బైటికి నడుస్తుంటే భార్య మాటలు గుర్తొచ్చాయి – “వాసుదేవరావుకి పట్టిన గతే మీకూ పడ్తుంది” అని.

ఆ రోజు నేను అతన్ని వెళ్ళగొట్టడానికి కారణం అయితే, ఈ రోజు రాజశేఖరం నా ఉద్వాసనకి కారణం అయ్యాడు. రాజశేఖరం బైటికి వెళ్ళడానికి ఎవరు కారణం అవుతారో అనుకున్నాడు.

అతనికి జీవితంలో అది అతి పెద్ద ఓటమిగా అనిపించింది. అతను బయట అడుగు పెట్టగానే పెద్ద శబ్దంతో ఆమె తలుపు వేసేసింది. మూసి వున్న ఆ తలుపు వెనకాల రాజశేఖరం, ఆమే తనని చూసి, తన గురించి చెప్పుకునీ పకపకా నవ్వుకుంటారని అనిపించగానే హృదయం బరువెక్కింది. కళ్ళల్లోకి నీళ్ళు వుబికి వచ్చాయి. టై నోట్లో కుక్కుకుని కారు వైపు నడిచాడు.

వాచ్‌మన్ వినయంగా సెల్యూట్ చేసాడు. అతనికి ఇన్నాళ్ళూ తను భారీగా ఇనామ్ లిచ్చేవాడు అని గుర్తొచ్చి, జేబు లోంచి ఓ వంద రూపాయల నోటు తీసి ఇచ్చాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version