సరిగ్గా ఆరు నెలల క్రితం లోకల్ ట్రయిన్‌లో మేధాకు వారితో పరిచయం ఏర్పడింది. మగవాడో, ఆడదో ఎలా చెప్పాలో తెలీదు. రైళ్లల్లో, సిగ్నల్స్ వద్ద రెండు అరచేతల్ని ఒకదానిపై ఒకటి వుంచుకొని, ఒక రకమైన లయబద్ధమైన చప్పట్లు చరుస్తూ, వచ్చీపోయే వారి నుంచి డబ్బుల్ని గుంజే వ్యక్తుల్ని తాను ఇంతకు ముందు చూస్తూ, అసహ్యంచుకునేది. అంతేకాక వికారం కలిగించే వారి అంగ విన్యాసాలనూ తాను చూసి ఈసడించుకునేది. ఏదో అస్పష్టమైన భయం కూడా కలిగేది వారిని చూచినప్పుడల్లా. వాళ్ల రాకని దూరం నుంచి గమనించగానే ఎదలో ఏదో గుబులురేగేది. గుండె దడ హెచ్చేది.
అయితే ఉస్మాన్‌తో పరిచయమేర్పడిన నాటి నుండి ఆ గుండె దడ తక్కువవుతూ వచ్చింది. ఎందుకంటే ఆ ఉస్మానే తన ప్రాణాలను కాపాడింది.
ఇప్పటికి సరిగ్గా ఆరు నెలల క్రితం ఎప్పటివలె ఆ రోజు కూడా భర్త నిశాంత్‌కు క్యారియర్ సిద్ధం చేసి, మిగిలిన అన్ని పన్లనీ ముగించి, ఇంటి నుంచి బ్యాంక్‌కి బయలుదేరింది మేధా. నిజం చెప్పాలంటే – ఆ రోజు, బ్యాంక్‌కే కాదు ఎక్కడికి వెళ్లటానికీ మనస్కరించలేదు. పడుకునే ఉండాలని అనిపించింది. కారణం తాను మూడు నెలల గర్భిణి. పొట్టలో అదో రకమైన అసౌకర్యం. ఆయాసం – వీటి చేత నలుగుతూ ఉంది. తన అమ్మా నాన్నలకి, అత్తా మామలకి ఈ శుభవార్తను తెలియ జేశాడు నిశాంత్. ఎవర్నయినా సహాయానికి రమ్మని పిలవనా అంటే “ఇప్పట్నుంచే ఎందుకండీ. అవసరమైనపుడు పిలువక తప్పదు కదా” అని మేధా అన్నప్పుడు, సరే అని ఊరుకుండి పోయాడు నిశాంత్. తానింకా ప్రొబేషనరీ పీరియడ్ లోనే వుంది. అంచేత సెలవలు దొరకటే కష్టం. తన అవస్థను చూడలేకనేమో, మేధాకి ఓ నాలుగు రోజులు సెలవు సాంక్షన్ చేశాడు మేనేజర్. ఆ సెలవూ పూర్తి అయిపోయింది. అందువల్ల బ్యాంక్‌కి వెళ్లటం తప్పనిసరి అయ్యింది. బస్ దిగి స్టేషన్‌కి చేరింది. అప్పటికప్పుడే 8-20 లోకల్ ట్రయిన్ ఫ్లాట్‌ఫాంని వదలబోతూ వుంది. దాన్ని అందుకోవాలి. అది తప్పితే బ్యాంక్‌కి లేట్ అవుతుంది. మెల్లగా కదలబోతూన్న ట్రయిన్ బోగీ హాండిల్‌ని పట్టుకుని, ఒక కాలు ఫుట్‌బోర్డ్ పైన, ఇంకో కాలుని పుట్‌బోర్డు పైన ఉంచడానికి బ్యాలెన్ దొరకక, హాండిల్‌కి వ్రేలాడబడింది. ‘ఒక వేళ పట్టు తప్పితే, పరుగెత్తుతున్న రైలు చక్రాల క్రింద పడి నుజ్జు అవడం ఖాయం, తనతో పాటు తన కడుపులో వున్న బిడ్డతో సహా,’ అనే ఆలోచన తోటి వణుకు పుట్టుకొచ్చింది. అంతలోనే ఒ చెయ్యి తన చెయ్యిని దొరకబుచ్చుకొని లోనికి లాగేసింది. ఆపద తప్పంది. ఒకింత కుదుటబడింది మనసు. తన ప్రాణాలని కాపాడిన వారెవరా అని వెనుదిరిగి చూసింది. తను బ్యాలెన్స్ తప్పిపోకుండా కుదురుగా నిల్చోటం కోసమని వాడు తనని పట్టుకునే నిల్చున్నాడు. సురమాను లేపించుకున్న ఆ చిన్న కళ్లు, ఎఱుపు వర్ణాన్ని రంగరించుకున్న పెదవులు, నల్లటి రంగు, జిగేల్ మంటున్న జరీ చీర, రెడ్ బ్లౌజ్, మెడలో, చెవుల్లో వేలాడుతున్న నకిలీ ఆభరణాలు… ఇల్లాంటి వారిని దూరం నుండే గమనిస్తూ వుండేది మేధా. ఇప్పుడు, ఈక్షణంలో, తనకు అతి చేరువలో నిల్చుని వున్న వాడి ముఖంలోని ప్రతి రేఖ మేధాకు స్పష్టంగా గోచరించటంలో వాడెవరనేది తెల్సిపోయింది. వారి పట్ల తనకున్న తిరస్కార భావం, వాణ్ణి మరింత చేరువలో చూడటం వల్ల – ఆ భావం ఇంకా ఎక్కువయింది. వాడి పట్టు సడలింది. మేధా ముఖంలో ఏర్పడ్డ తిరస్కారభావాన్ని గమనించి వాడు కొద్దిగా అవమానం ఫీల్ అయ్యాడు. కొంచం కోపం కూడా వచ్చినట్టుంది. అయినా నిర్వికారంగా “అమ్మా, నీవిప్పుడు నెమ్మదిగా వున్నావు కదా” అని ఎంతో అక్కర తోటి, ఆదరం తోటి మాట్లాడాడు. ‘ఛీ ఇదేంటి నా ప్రవర్తన! వాడు నన్ను నా బిడ్డనూ కాపాడాడు. అల్లాంటి వాడికి తను తన కృతజ్ఞతలను తెలియపరచాలి కదా…’ అని తన్ని తాను నిందించుకుని ‘థాంక్స్, మీరే లేకున్నట్లయితే…’ అని మనసులోనే ధన్యవాదాలు అర్పించుకుంది. వాడు ఏమి మాట్లాడలేదు. గత కొన్ని నెలలుగా మేధా లోకల్ ట్రయిన్‌లో ప్రయాణం చేస్తూనే వుంది. ఈ ప్రయాణంలో కొన్ని ముఖాలు తనకు పరిచయమైనవే. అయితే వాణ్ణి మాత్రం తొలిసారిగా ఈ రోజే చూడటం జరిగింది. ఎంత రద్దీగా వున్న సమయంలోనైనా ఇలాంటి వారిని తాకడానికి కూడా వెనకాడుతారు. రద్దీలో ఒక్కొక్కప్పుడు తప్పనిసరి అయినప్పుడు ప్రక్కవారి ముఖంలో అసహ్యం గోచరిస్తుంది స్పష్టంగా. అయితే వాళ్లు మాత్రం నిర్వికారంగా ఉండిపోతారు. అది వాళ్ల అలవాటయిపోయిన నిత్య చర్య.
తొమ్మిదిన్నరకు మేధా సి.యస్.టికి చేరింది. అక్కణ్ణుచి బ్యాంక్‌కి చేరటం కాలి నడకన పది నిమషాలు. నడుస్తూ వుంది. అప్పుడప్పుడే జరిగిన ఆ సంఘటన నుంచి తానింకా కోలుకోలేకపోతూవుంది. ఆ వ్యక్తి స్పర్శకి గురైన తన దేహపు ఆ భాగం కాల్చిన సలాకను తాకినంతగా ఇంకా మండుతూనే వుంది.
“ఏమైంది మేధా. నీ ముఖం ఇలా వాడిందెందుకు? కులాగానే వున్నావు కదా” భీతికి లోనైన తన ముఖకవళికలను గమనించిన, తన ప్రక్క కౌంటర్‌లో వున్న దామరాబాయి అడిగింది.
“ఏం లేదు… కులాసాగే వున్నా!” అంది మేధా, జరిగిన దాన్ని మరలా ఇంకోసారి గుర్తుకు తెచ్చుకోవటం ఇష్టం లేక. జరిగిన విషయం చెబితే, అదో చర్చనీయాంశంగా మారుతుందని తనకి తెల్సు…
***
రోజూ చేస్తున్న ఈ ప్రయాణం చేత మేధా ఎక్కువగానే శ్రమకు గురి అయ్యింది. నిశాంత్ ఆఫీస్ ఇంటికి చేరువలోనే వుండటం చేత తన టూవీలర్‌లో ఆఫీస్‌కి వెళతాడు. సాయంత్రం మేధా కంటే ముందుగానే ఇల్లు చేరుతాడు. ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. మేధా, నిశాంత్‌ల పెళ్లయి ఇంకా ఏడాది కూడా గడవలేదు. మేధా పుట్టిల్లు ఇండోర్. పెళ్లయిన తర్వాతే ముంబై వచ్చింది. తీగ పైన నడక ఇక్కడి జీవన శైలి. లోకల్ ట్రయిన్‌లో సావకాశంగా కూర్చొని ప్రయాణం చేయటం అలవాటైపోయింది. అన్నీ సానుకూలంగానే జరిగిపోతూన్న తరుణంలోనే, తాను తల్లి కాబోతూందనే సూచన తెలియవచ్చింది. ఇంత త్వరగా తాను తల్లి కావటం మేధాకి ఇష్టం లేకపోయింది.
***
“మేధా… ఏమయ్యింది? ఎందుకు మౌనంగా వున్నావు… ఏదైనా జరిగిందా ఏమిటి?” బ్యాంక్ నుండి వచ్చనప్పటి నుండీ, మేధా ఏదో చింతిస్తున్నట్టుగా వుందని గమనించాడు నిశాంత్. సాధారణంగా పిచ్చుకలా ఎడతెఱిపి లేకుండా ఏదో విషయాన్నివివరిస్తూ చెబుతూ వుండేది. ఏదో విషయాన్నే ఆలోచిస్తూ వున్నట్టుంది. ముఖం కూడా వాడి పోయినట్లుంది.
మేధా నుంచి సమాధానం రాకపోయేటప్పటికి మళ్లీ అతగాడు ప్రేమతో హత్తుకొనగా, ఆ స్పర్శతోటి ఆమె సహనపు చెలియలి కట్ట తెగింది. వెక్కి వెక్కి ఏడ్వటం మొదలు పెట్టింది. తాను శాంతించిన తర్వాత మరలా అడిగాడు నిశాంత్. తాను ట్రయిన్ ఎక్కడానికి చేసిన ప్రయత్నం… అటు తరువాత జరిగిన అన్నింటినీ వివరించింది మేధా. మేధా కాలు పుట్‌బోర్డ్ నుంచి జారి హాండిల్ పట్టుతప్పి వుంటే… ఏమయ్యుండేదో… తల్చుకున్నప్పుడు నిశాంత్ ఒళ్లు జలదరించింది.
“నీ వెందుకంత ఆదరాబాదరాగా రైలెక్కటం… అది కాకపోతే… వెంటనే ఇంకో లోకల్ని పట్టుకోవచ్చుగా” కోపగించుకున్నాడు నిశాంత్,
తర్వాత వచ్చే లోకల్లో వెళితే లేట్ అవుతుందని, లేట్‌గా వెళితే ఓ రోజు లీవ్ కట్ అవుతుందని, తనింకా ప్రొబేషనరీ పీరియడ్ లోనే వున్నాననే విషయాన్ని గుర్తుచేసింది మేధా.
“అంటే ప్రాణం కంటే ఉద్యోగమే ఎక్కువా నీకు. ఇక ముందు ఇల్లాంటి సాహసం చేయడానికి పూనుకోవద్దు. ఆయనెవరో నీ ప్రాణాలు రక్షించాడు. కనుక క్షేమంగా ఇంటికి రాగలిగావు, ఈ గజిబిజి వ్యవహారంలో, నీ కడుపులోని బిడ్డ కేమయ్యుంటుందో ఏమో? రేపే మనం డాక్టర్ కులకర్ణి దగ్గరకు వెళ్లి వద్దాం. సరేనా” అన్నాడు. “సరే నండి. వెళ్లివద్దాం” అంది మేధా.
***
ఆ రోజు సమయానికి కొంచం ముందుగానే స్టేషన్ చేరింది మేధా. అందరితో పాటు తానూ ఆ రద్దీలో ఎక్కింది. దారి చేసుకుంటూ లోపలకెళ్లి తాను మామూలుగా కూర్చునే చోట… వాడు దాన్ని ఆక్రమించి వున్నాడు. మేధాను చూడగానే “రామ్మా! కూచో!” అంటూ తనకు ఖాళీ చేసిన సీటును చూపించాడు. మారు మాటాడకుండా కూర్చొంది. ఇది దిన చర్య అయిపోయింది. తాను రావటం, తన సీటును వదలి మేధాను కూర్చోబెట్టటం, తన కోసమే సీటును రిజర్వ చేసి వుంచినట్లు.
***
“వాడు… రోజూ నా కోసమని సీటును రిజర్వ్ చేసి ఉంచుతున్నాడండీ?”
“వాడంటే… ఎవడు?”
“వాడే… ఆ రోజు నన్ను రక్షించాడే…. వాడు.”
“వాడు… వాడు అంటావేంటి… వాణ్ణి హిజారా అనవచ్చుగా… నీవే అన్నావుగా వాడు ఆడా మగా కాని వాడని. ”
“ఔను, వాడు అలానే వున్నాడు. అయితే వాడి ముఖంలో వేరే హిజరాలలాగా అసహ్యమనిపించే చేష్టలు కనిపించవు. అదేంటో గాని వాడి ముఖంలో సౌమ్యతా భావనే నాకగుపిస్తుంది.”
“నీ కంటికి అందరూ మంచివారు లాగానే కన్పిస్తారు. నీవు ఊహించినట్లుగా ఈ లోకం అంత మంచిది కాదు సుమా. వాడు నీ ప్రాణాలు కాపాడాడు. వాడికి నీవు కృతజ్ఞతలు తెలియజేశావు…. అంతే… దట్సాల్. అంతటితో ముగిసింది.” అని ఆ విషయాన్ని పుల్ల విరిచినట్లుగా విరిచేశాడు. అయితే ఆ భయానికి ముగింపు రాలేదు అంత త్వరగా. ప్రతిరోజూ తన కోసం సీటు రిజర్వ్ చేసి ఉంచటం, రద్దీలో తన కేదీ తొందర కలుగకుండా జాగ్రత్త వహించటం.. వాడి నిత్యకృత్యమైపోయింది. ‘నన్ను మాట మాటికీ అమ్మాయ్ అని పిలవవద్దు. నా తోటి మాట్లాడటానికి ప్రయత్నించవద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పాలనిపించి, పెదవి చివరిదాకా వచ్చి మాటలు ఆగిపోయేవి. ఒక వేళ వాడు తన మాటలని పరిగణించక అసహ్యంగా మాట్లాడితే నలుగురిలో తన పరువేం కాను! అదీ కాక వాడు, తననూ తన బిడ్డనూ రక్షించిన వాడు కదా. ఆ విషయాన్ని తాను మరువ లేకుండా వుంది. ఈ విషయాలని నిశాంత్‌తో ఓసారి పంచుకుంది. తేలికగా తీసి పారేసి, “నీకు వాడేమీ తొందర కలిగించలేదంటున్నావు. వాడి గురించి ఆలోచన దేనికని?” అన్నాడు నిశాంత్. “ఈ ముంబైలో జీవనం చేయాలంటే నీవు ధైర్యవంతురాలై యుండాలి, లేకుంటే కష్టం” అని అనడంతో, ఆ ప్రస్తావనని నిశాంత్ తోటి పంచుకోకపోవటమే మంచిదనిపించింది.
***
మేధాకి ఇప్పుడు ఐదో నెల. తన వెన్నంటే వచ్చినట్టు, వాడు ప్రతిరోజూ తనని పరామర్శించేవాడు. “ఎలా వున్నావ్ అమ్మాయ్” అని మమతానురాగాలతో పలకరించేవాడు. వాడి నీడ కూడా తన బిడ్డ పైన పడటానికి వీల్లేదని తీవ్ర మనోభావన కలుగుతూంది ఇప్పుడిప్పుడే మేధాకు. మేధా గర్భిణి అని తెల్సిన నాటి నుంచి వాడు ఇంకా ఎక్కువ కేర్‌ని చూపించ ప్రారంభించాడు. ట్రయిన్ లోకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, రద్దీ నుంచి తొందర కలుగకుండా జనాలకు తన చేతిని అడ్డం పెట్టేవాడు. ఓసారి మేధా కోసం పళ్లను కొని తెచ్చి “ఈ సమయంలో పళ్లు తినాలమ్మా. బిడ్డకి మంచిది” అని వాటిని చేతికివ్వబోతూంటే, మేధా వాటిని స్పష్టంగా నిరాకరించింది, “నా కక్కరలేదు” అంటూ. వాడి ముఖం చిన్నబోయింది. వాణ్ణి తప్పించటం కోసం కంపార్ట్‌మెంటుని మార్చింది. అయినా వాడు వెదుక్కుంటూ అక్కడికీ వచ్చేవాడు. ఇలా కాదని తాను టాక్సీలో బ్యాంక్‌కి పోవటం ప్రారంభించింది.
***
వాడి, ఆ ఉస్మాన్ కళ్లు ఆ రద్దీలోనూ మేధానే వెదుకుతుండేవి. నెలలు గడిచాయి. మేధా కన్పించకపోయేసరికి వాడికి తాపత్రయం ఎక్కవయ్యింది. ఏమయ్యిందో ఏమిటో, అమ్మాయి ఆరోగ్యంగా ఉందో లేదో… కడుపులోని బిడ్డతో ఈ రద్దీలో ఎలా ప్రయాణం చేస్తూవుందో ఏమో! ఆమె విశాలమైన కన్నులు, ముగ్ధమోహన రూపం అంతా షమ్మీ మాదిరిగానే! ఆమె పేరేంటీ ఎక్కడ వుంటుందీ ఇవన్నీ ఉస్మాన్‌కి తెలియలేదాయె. అయితే ఆమె తన హృదయంలో చోటు చేసుకుంది. గత జన్మలో తనకీ ఆమెకీ ఏదో సంబంధం వుండే వుంటుంది. ఎప్పుడో ఓసారి మేధాను తప్పక చూచి తీరుతాననే ఆశతో వాడు, ఆమె స్టేషన్ చేరే సమయంలోనూ, వాపస్ వచ్చే సమయంలోనూ స్టేషన్‌లో బెంచీ మీద కూర్చుని ఉండేవాడు. ఆమె దిగాల్సిన ట్రైయిన్ వెళ్లిపోయింది. అందుండే ఉస్మాన్ స్నేహితుల గుంపు దిగింది. ఉస్మాన్‌ని చేరి “హాయ్ ఉస్మాన్. నీ పిల్ల చిక్కలేదేమిరా” అని వాడి చుట్టూ చేరి తలో మాట అన్నారు. “ఆ ఆమ్మాయి పట్ల అగౌరవంగా మాట్లడారో…” ఉస్మాన్ కన్నులనుండి నిప్పుల రావటం చూచి “రే కోపగించుకోకురా ఉస్మాన్. మేము చెడు ఉద్దేశంతో అనలేదు. ఆ అమ్మాయిని నీవు కూతురులాగా చూచుకుంటున్నవని మాకు తెల్సు. నీవే చెప్పావు కదరా” అన్నారు వారు.
ఆమెరికా నుండి వచ్చిన ఓ అమ్మాయి పెళ్లిలో పాల్గోటానికి బయలుదేరుతున్నారు వాళ్లు. ఉస్మాన్‌నీ రమ్మని పిలిచారు, కాని నిరాకరించాడు ఉస్మాన్. “ఆ అమ్మాయి కనబడలేదనేగా నీ చింత. దానికంత బుర్ర పాడు చేసుకోవటం దేనికి! ఇప్పటికప్పుడే ఆ అమ్మాయికి ప్రసవం అయిపోయివుంటుంది… పద ఆ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచించమాక. రా… వెళదాం…” అని షబ్బూ, మాలిని, వాణ్ణి బలవంతం చేశారు. అయినా ఉన్న చోటు నుంచి కదలలేదు ఉస్మాన్. విసిగిపోయి వాళ్లు వెళ్లిపోయారు ఉస్మాన్‌ని ఒంటరిగా వదిలేసి.
***
కాన్పుకని బిడ్డను పుట్టింటికి పిలుచుకుపోవటానికని మేధా తల్లిదండ్రులు రాబోతున్నారు. ఐదారు నెలలపాటు మేధా తనను వదిలి పుట్టింట్లో వుండపోతుంది కదా అని నిశాంత్‌లో అసహనం. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇద్దరూ కల్సి ఏవేవో కొనుగోలు చేసి, అక్కడక్కడా తిరిగి, ఐనాస్క్‌లో సినిమా కెళ్ళి – ఇలా ఒకరి సహవాసంలో ఇంకొకరు ఆనందం పంచుకున్నారు.
ఓసారి సినిమా ముగించుకొని, పార్కింగ్ ప్లేస్ నుంచి కార్‌ని తీసుకురావటానికని వెళ్లాడు నిశాంత్. అక్కడే నుంచుని భర్త రాక కోసం వేచి వుంది మేధా. అంతలోనే, చప్పట్లు చరుస్తూ, వారిదే అయిన రీతిలో మాట్లాడుకుంటూ గుంపొకటి తన చేరువకు వచ్చి నిలచింది. అందులో, వాడు కూడా ఉండటాన్ని గమమనించింది మేధా. మేధాను చూచిన వెంటనే వాడి కన్నులు విప్పారినయ్. దగ్గరికొచ్చాడు. ఆ గుంపు వచ్చింది. భయం ఆవరించింది మేధాకు. వాళ్లకి వెన్ను చూపి పార్కింగ్ వైపు నడిచింది మేధా.
“అమ్మాయి నిలు, ఇంత రాత్రి వేళ, ఇక్కడెందుకున్నావమ్మా!” అందరూ మేధా చుట్టూ చేరారు. తన రెండు చేతులనీ తన పొట్టపైన వుంచుకొని నిల్చుంది మేధా.
“ఓహో.. ఈమేనా… నీ… కూతురు” అంటూ వాళ్లల్లో ఒకర్తె మేధా చేరువకి వచ్చింది. అదే సమయానికి నిశాంత్ కార్ తన వైపుకి తీసుకొస్తున్నాడు. తనకిప్పుడు కాస్త ధైర్యం. “నేనూ నీ కూతుర్ని కాదు!…” అని కొంచం బిగ్గరగానే అనేసింది మేధా. చాలా రోజులనుంచి తనలో అణచి పెట్టుకున్న అయిష్టత బయటకి వచ్చేసింది. నిశాంత్‌కి పరిస్థితి అర్థమయ్యింది. వీళ్లతో వాదం పెంచుకోవటం అనవసరమనిపించి, “ఎక్కు వెళదాం” అన్నాడు. “ఉండండి ఈ రోజు దీనికో ముగింపు ఇవ్వాలి నేను. వాడి పట్ల వాడి వలే ప్రవర్తించే వారి పట్ల నా తిరస్కార భావాన్ని వ్యక్తీకరించాలి… ఇది వాడికి తెలియాలి…” వాడి వైపు చూస్తూ అంది కోపంగా.
“కరెక్ట్‌గా చెప్పవమ్మా నీవు. ఇల్లాంటి తిరస్కారాలకి లాయక్ అయినవాళ్లను మేము. మా భాగ్యమే ఇలాగుంది. మేము తండ్రులం కావటానికి సాధ్యం కాదు. సంసారాన్నీ సాగించటానికీ సాద్యం కాదు. అయితే మాకూ జన్మనిచ్చిన తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్లు, అక్క, చెల్లెళ్లు ఉంటారు. ఉన్నారు కూడా. నా చెల్లెలు నీలాగే ఉండేది. రెండేళ్ల క్రితం అది నన్ను మార్కెట్‌లో చూసింది. దాని ఏడేళ్ల వయస్సప్పుడే నేను ఇల్లు వదిలి వచ్చేశా. నిన్ను మొట్టమొదటి సారిగా చూసినప్పుడు నా చెల్లెలు షమ్మీయే ఎదురొచ్చి నిల్చినట్టయ్యింది…”
“ఔను. ఉస్మాన్ నీ గూర్చి మాకు చెబుతూనే వుంటాడు. మాకీ దేహ స్థితి నిమ్మని మేము ఆ దేముణ్ణి కోరుకున్నామా! మమ్మల్ని చూసి జనం లేవడి చేస్తారు. కొందరు మమ్మల్ని ‘ఛక్కా’ అంటే, ఇంకొందరు ‘పౌనే ఆర్’ అని మరికొందరు ‘హిజ్జా’ అని, ‘కొజ్జా’ అని అంటారు. మా వంశమే శిఖండి వంశం…”
“మాకూ సంబంధాలు కావాలి. కుటుంబాలు కావాలి అని అన్పిస్తుంది. కాని ఆ పుణ్యం ఈ జన్మలో దొరకదు అనే సత్యం తెల్సినా – ఈ కోరికలు అప్పడప్పుడు ఉబికి వస్తాయి. మేము పోగొట్టుకొన్నవారిని, ఆ సంబంధాలనీ చుట్టు ముట్టూ కనిపించే ముఖాల్లో వెదకటానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు ఉస్మాన్ నీలో తన చెల్లెల్ని చూసినట్లు. మా రక్త సంబంధాలు తెగిపోయినా వాటి తాలూకు కొలికి మాత్రం తగులుకొనే వుంటుంది మా మనస్లుల్లో. అవి ఇంకా జీవించే ఉంటాయి. ఆ ఆశతోనే వెదుకుతూ వుంటాము. నేను కూడా ఓ సాంప్రదాయమైన ఓ కుటుంబంలోనే పుట్టాను. అయితే అల్లాంటి సమాజంలో మాలాంటివారికి స్థానమెక్కడ? మర్యాద ఎక్కడ? సమాజానికి వెఱచి మా కుటుంబం నన్ను వెలివేసింది….” ఉస్మాన్ ప్రక్కనే నిల్చున్న ముప్ఫై ఏళ్ల చాంద్ తన వ్యథను వెళ్లగక్కింది. “ఉస్మాన్ కూడా అందర్లాగే వుండి వున్నట్లయితే, వాడికీ ఈ పాటికి పెళ్లయి నీ వయసున్న కూతురుండేది…” వారించినా తన మనసులోని మాటను వెళ్లబుచ్చింది చాంద్. ఉస్మాన్ వైపు చూసింది మేదా. వాడి కన్నుల్లో మమత. ‘భగవాన్, వాణ్ణి తిరస్కరించే హక్కు నాకెక్కడిది! వాడు నాకెన్నడు తొందర కలిగించలేనే లేదు… అయినా నాకెందుకు వాడి పైన అనవసరమైన కోపం’ తప్పనిపించింది. ఏం మాట్లాడలేక మనసులోనే వ్యథ చెందింది.
***
పండంటి మగబిడ్డని ప్రసవించింది మేధా. బొద్దుగా ముద్దుగా ఉన్నాడ్. ‘అంశ’ అని నామకరణం కూడా జరిగింది. మూడు నెలల మెటర్నిటీ లీవ్ కూడా ముగిసింది. పిల్లవాణ్ని చూచుకోటానికని నిశాంత్ తల్లి, తండ్రీ వచ్చారు. లీవ్ ముగిసిన తర్వాత మొదటసారిగా మేధా ఆఫీస్‌కి వెళ్లడానికి సిద్ధమయ్యింది. మునుపటిలాగే ట్రయిన్ కోసం వెయిట్ చేస్తూ వుండగా, ఉస్మాన్ కనిపించాడు. వాడి ముఖం వికసించింది. వాడి కోసమనే అటూ ఇటూ చూసింది. “అమ్మాయి… ఎలా వున్నావమ్మా… కొడుకా… కూతురా….” ఆత్రంగా అడిగాడు. “కొడుకు, నీవిక్కడ తప్పక దొరకగలవని నాకు తెల్సు. రేపు సాయంత్రం మా ఇంటికి రావాలి. అంతే కాదు నీతో పాటు ఉన్నారు కదా వాళ్లని పిల్చుకురావాలి. ఫంక్షన్ పెట్టుకున్నాం…” అని అంటూ వాడి కోసమనే తాను వ్రాసిపెట్టుకొని వున్న తన ఇంటి అడ్రస్ చీటినీ తన పర్స్ నుంచి తీసి వాడి చేతిలో పెట్టింది. ఆ చీటిని తన చేతిలోకి తీసుకున్నప్పుడు వాడి చేతులు కొద్దిగా వణికాయి. కనుకొనల్లో నీళ్లు – లోకల్ ట్రయిన్ వచ్చి నిలబడగానే, మేధా ఎక్కి వెళ్లిపోయింది, ఉస్మాన్ ఇంకా తేరకోకమునుపే.
***
ఇంద్రనీల సొసైటీ బ్లాక్ హాల్, ఉస్మాన్ తన స్నేహితులతోటి కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు అవాచ్య శబ్దాలతో వాగుతూ, తమ అసహ్యకరపు అంగ విన్యాసాలని ప్రదర్సిస్తూ వుండేవారు, ఇప్పుడు రెక్కలు తెగిన పక్షుల్లా మౌనంగా కూర్చొని వున్నారు. నిశాంత్ బంధువులు వీళ్లనే తదేకంగా చూస్తూవున్నారు.
నిశాంత్, మేధాల ఆహ్వనం తోటే ఉస్మాన్ వాళ్లు ఇక్కడికి వచ్చారనే విషయం తెల్సి నిశాంత్ అమ్మా నాన్నలు, “ఏంట్రా, ఏంటిది? ఇల్లాంటి వాళ్లని మనలాంటి మర్యాదస్థుల ఇళ్లకి ఆహ్వానంచడమా” అన్నారు కోపంతో.
“మా ఇండోర్‌లో వీళ్లు, పెళ్లిళ్లకి, బిడ్డలు పుట్టినప్పుడు ఇళ్లకూ వస్తారు. వీళ్ల ఆశీర్వాదం కోసం అదే పనిగా వీళ్లని పిలుస్తారు” అంది మేధా మేనత్తగారు.
“ఇట్లాంటి వాటిపైన మా ఇద్దరికి నమ్మకం లేదు. అయినా మేధా ప్రాణాలను కాపాడాడు. అంతే కాదు మేధా పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచేవాడు. అందుకనే వాణ్ణీ, వాని స్నేహితులనీ పిలిచాం” అన్నాడు నిశాంత్.
“మీరే వీళ్లని రమ్మన్నామని అంటున్నారు గనుక మేం ఇంకేమి మాట్లాడగలం?” ఆ విషయాన్ని అక్కడికి కట్ చేశారు నిశాంత్ తండ్రిగారు.
నిశాంత్ ఎదుటనే కూర్చున్న వాళ్ల తోటి ఏం మాట్లాడాలో నిశాంత్‌కి తెలియలేదు. జిగేల్ జిగేల్ మంటున్న చమ్కీల నంటి వున్న ఉడుపుల తోటి, నకీలీ పూసల దండల తోటి అందరూ ముస్తాబై వచ్చారు. వీళ్లల్లో, భుజానికి వ్యానిటీ బ్యాగ్‌ని తగిలించుకున్న వాడే ఉస్మాన్ అయివుంటాడనుకొన్నాడు నిశాంత్. తానిదవరకు వాణ్ణి ఎన్నడూ చూడలేదు.
“ఇల్లు తెల్సుకోటానికి ఇబ్బంది పడ్డారా” అడిగాడు నిశాంత్.
“లేదండి… అమ్మాయి… అడ్రెస్ ఇచ్చి ఉణ్ణింది కదా. అందువల్ల… ఇబ్బందేమి కలగలేదు.” అన్నాడు ఉస్మాన్. అందరూ లేచి నమస్తే అన్నారు ఉస్మాన్ తోటి.
అప్పుడే వచ్చింది మేధా బిడ్డనెత్తుకొని వాళ్ల దగ్గరికి. వాళ్ల దృష్టి అంతా ఆ బిడ్డడి పైనే. ఉస్మాన్ చేరువకి వచ్చింది మేధా. బిడ్డను ఎత్తుకొను ఉస్మాన్ చేతులు ముందుకొచ్చాయి. వాడి చేతిలో బిడ్డనుంచింది మేధా. ఆ బిడ్డది కోమల స్పర్శ, ముగ్ధమనోహరమైన వాడి నవ్వు, ఉస్మాన్‌లో ధన్యతా భావాన్ని రేకెత్తించింది. ఎవరో, బిడ్డది కోమలమైన చుబుకాన్ని స్పృశించారు. ఇంకొకరు వాడి గులాబీ రంగు నున్నటి పాదాలను స్పృశించారు. తల్లి గర్భంలో నుండి వచ్చిన ఎంతోమంది బిడ్డల్ని తామిదివరకు ఎత్తుకొని ఆశీర్వదించారు కూడా. వారి చేతికిచ్చినట్టే ఇచ్చి గబ్బుక్కున లాక్కునేవారు తల్లులు. వీళ్లు ఎపుడెపుడు వెళ్లిపోతారా అని వారు వెళ్లిపోవటానికి కాచుకుని ఉండేవారు. ఇప్పుడే మొదటి సారిగా వీళ్లకి ఇల్లాంటి గౌరవమర్యాదలు దక్కాయి. వాళ్ల తోటి బిడ్డడు నవ్వుతూ ఆడుతున్నాడు. “అమ్మాయి నీ బిడ్డ ఆ చంద్రుడేనమ్మా. పాపిష్టి కళ్లు మీద పడకుండా ఆ దేవుడు వీణ్ణి చల్లగా కాపాడాలమ్మా” అంటూ రజ్జూ, నిమ్మీ, షమ్మీ, పారు, అందరూ పిల్లాడి చుట్టూ గుమిగూడారు. ఉస్మాన్ చెవి పోగుల్ని బట్టి లాగుతున్నాడు బిడ్డడు.
“అరె భడవా! ఇప్పట్నించే చెవి లాగడం నేర్చుకుంటున్నవా!” చెవి నొప్పి పెడుతున్నా నవ్వుతూనే ఉన్నాడు ఉస్మాన్. చిన్నగా పట్టును విడిపించుకుంటూ ఉస్మాన్ తన పర్స్ లోంచి ఓ ఎరుపు రంగు డబ్బి నుంచి – మెరుస్తున్న ఓ చిన్న బంగారపు ఉంగరాన్ని బిడ్డడి గులాబీ మొగ్గలాంటి వ్రేలికి తొడిగాడు. దంపతులిద్దరు ఆశ్చర్యపోయారు.
“ఉస్మాన్… ఇదెందుకు?”
“అమ్మాయ్ వీరిద్దరూ మాలాంటి వాళ్లకి సంతోషాన్ని పంచిపెట్టారు.” అన్నప్పుడు వాడి కన్నుల్లో నీళ్లు నిలిచాయి… తన్ను ఎత్తుకోమన్నట్టుగా బిడ్డడు ఉస్మాన్ వైపు చేతులు చాచాడు. ఎత్తుకొన్నాడు ఉస్మాన్. ఉస్మాన్ ముఖాన్ని తన చేతులతో తడుముతూ హాయిగా నవ్వాడు బిడ్డడు. ఆ బిడ్డడి స్పర్స, నవ్వు, ఉస్మాన్‌లో ఓ కోమలాత్మకమైన సంబంధాన్ని కలుగజేసింది. వాడి కన్నుల్లో వేనవేల ఆనందకమలాలు విరిశాయి. ఆ ఆనందం వారి శరీరాన్ని పులకాంకితం చేసింది. పెదవులపై చిరునవ్వు తాండవించింది. నిశాంత్, మేధాలు ఉస్మాన్ తోటి ఆ ఆనందాన్ని పంచుకున్నారు.
మరాఠీ మూలం – జ్యోతి పుజారి
తెలుగు – కల్లూరు జానకిరామరావు.
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084