[మహాదేవి వర్మ గారు రచించిన ‘ఆగయే తుమ్?’ కవితని అనే అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Mahadevi Verma’s poem ‘Aa Gaye Tum’ by Mrs. Geetanjali.]
~
వచ్చేసావా నువ్వు?
తలుపులు తెరిచే ఉన్నాయి!
ఇంకేం.. లోపలికి వచ్చేయి!
ఆగాగు.. ఒక క్షణం ఆగు!
గుమ్మం బయటున్న కాళ్ళ పట్ట మీద
నీ అహాన్ని దులిపేసుకుని రా!
వాకిట్లో సువాసనల మధుమాలతి అల్లుకొని ఉంది చూడు..
నీ అలకలన్నీ దాని పక్కనున్న పిట్ట గోడ అవతలే పారబోసి రా!
ఇక అక్కడే ఉన్న పవిత్రమైన తులసి మొక్కకి
నీ మొక్కులన్నీ నివేదించుకుని మరీ లోపలికి రా!
ఊపిరాడనివ్వని నీ రోజూ వారి పనులన్నీ
పెరట్లో గోడ కొక్కాలకి తగిలించేసి లోపలికి రా!
చెప్పులతో సహా చెడు ఆలోచనలేమన్నా ఉంటే విడిచి మరీ లోనకి రా.
బయట కిలకిల లాడుతున్న పిల్లలనుంచి
కొంచెం అమాయకత్వమో.. మంచితనమో అడుక్కొని మరీ రా!
గుమ్మం ముందరి ఆ పూల తొట్లలో గులాబీలకు పూచిన
చిరునవ్వుని కొంచెం తెంపి ముఖానికి పులుముకొని రా!
రా.. రావోయి.. నీ బాధలన్నీ నాకు ఇచ్చేయి!
నీ అలసటని నా లాలనతో
విసనకర్రలా చల్లగా విసిరి పోగొడతాను.
చూడు.. నీ కోసం ఈ సాయంత్రాన్ని ఎలా పరిచానో..
పసివాడిలా ఎర్రని సూర్యుడు అస్తమించడానికి బయలుదేరాడు!
ఇటు చూడు.. ప్రేమ.. విశ్వాసాలనే నిప్పులతో కలిపిన
చాయ్ కుంపటి మీద కాగుతున్నది.. మెల్లిగా గుటకలు వేస్తూ తాగు మరి..
ఇలా వినయం.. వినమ్రతా అనే అమృతాన్ని
నిత్యం తాగుతూ ఉన్నావనుకో..
ఇక.. జీవించడం కష్టమేమీ కాదు..
రా.. లోపలికి
తలుపులు తెరుచుకునే ఉన్నాయి.
కానీ.. అన్నిటినీ వదిలించుకుని రావాలి మరి..!
~
మూలం: మహాదేవి వర్మ
అనుసృజన: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964