[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘వాస్తవానికి దగ్గరగా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పుట్టుక
తాత్కాలిక పరుగుల గంతుల విన్యాసం!
చిర నివాసికాదు గానీ అదో అస్థిర
తాపత్రయం అంతే!
ముళ్ళెన్ని రక్కినా
మంట బాధ అన్నీ బలాదూర్!!
నావ సముద్రంలో
పోటెత్తే రక్త పరుగు కథ
తన పర బేధం లేదుగానీ
తీరోక్క తీపిబాధల సొద!
కొన్ని దశాబ్దాలు, అన్నీ కుదిరితే శతకం
ఎన్నో చూసి కలిసిన
స్నేహ సాంగత్యం గ్రోలిన జీవధార
అష్టదిగ్గజ కొలువులో కవిత్వమే!
ఎన్నాళ్ళున్నా అనివార్యం
శాశ్వత బదిలీ
పుట్టి బతికిన ఆటకు ఆఖరి మజిలీ
అంతా ఉన్నా, నమ్మకం
చుట్టూత నీళ్ళే!
పడవ పగిలి ఆగిందా
ప్రవాహ చలనచిత్రం ముగిసిన కథే!
వాస్తవానికి దగ్గరగా బతుకుడే
చరిత్రలో శ్వాసించే కళ!
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.