[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘వాన వస్తే..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వానజల్లు కురిస్తే
పుడమితల్లి పులకరించి పోయింది
పచ్చరంగు చీర చుట్టుకుని
ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ
అందాల ప్రకృతిని
పేరంటానికి పిలిచింది
దాహంతో అలమటించిన
నేలలో ఎప్పుడో నాటిన
విత్తులకు ప్రాణంపోసింది
మొలకెత్తిన చిగుళ్లు కళ్ళు
విచ్చుకుని నలుదిశలా కలయచూసాయి
కొత్తలోకానికి స్వాగతం చెప్పేయి
మొగ్గతొడిగిన యవ్వనం మిడిసిపడింది
ఒంటి మీదకు వయసొచ్చిన
కుసుమబాల మదిలో మధువులూరగా
మత్తెక్కిన దొరవయసుతో
రేకులువిప్పి ఒళ్ళు విరుచుకుంది
విరబూసిన తోటలోకి
తుమ్మెదలు విహారానికి వచ్చి వల వేశాయి
చెలికాని జత కోరిన సొగసరి విరులు
ఎద పానుపు పరిచాయి
ఒక తేటికి ఎన్నో పూలసరాగం
విరిబాల హృదయంలో ఒక్కరికే చోటు
భ్రమరానికి ఒక న్యాయం
పూలకు మిగిలింది త్యాగం
ఊపిరి వున్నంతవరకు
తుమ్మెద పూలవేట సాగిస్తుంది
నిన్న విరిసి నేడు మురిపించిన కుసుమం
రేపు క్రుంగి కృశించిపోతుంది
మరో తరానికి జన్మ నివ్వడం
మగువకు కర్తవ్యం అంటారు
అంతటి గొప్ప పనిచేసే
ఆమెకు ఎలాంటి గౌరవము దక్కదు
అందరూ చేసేది నువ్వు చేసావు
అని చులకనగా చూస్తారు
కానీ ఆ కర్తవ్య నిర్వహణ
ఎంతటి కష్టమో ఆమెకు మాత్రమే తెలుసు.
వాన కురిస్తే ఏమవుతుంది?
ఎన్నో జీవితాలకు అంకురార్పణ జరుగుతుంది.
మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఇది!
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.