Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాన.. ఒక్కటే!

తెల్లవారు జాము నుంచీ వాన జోరుగా కురుస్తోంది. తెల్లవారిందో లేదో కూడా తెలియనంత చీకటిగా ఉంది. టైం చూస్తే ఆరు గంటలు. మేడల మీద, డాబాల మీద, పూరిళ్ల లోపలికి, పెంకుటిళ్ల లోపలికి, రోడ్ల మీద, సందుల్లోను, అంతటా తానే అయి, భేదభావం లేకుండా సమానంగా కురుస్తోంది వాన. రోడ్లు జలమయాలవుతున్నాయి. ఎక్కడ గోతులున్నాయో తెలీని పరిస్థితి!.

ఎదురింటి విశ్రాంత ప్రొఫెసర్ బాల్కనీలో కుర్చీలో కూర్చుని, పొగలు కక్కుతున్న వేడి వేడి కాఫీ తాగుతూ, జోరువానలో తడిసి ముద్దవుతున్న ప్రకృతి కాంత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, పరవశు లవుతున్నారు.

వాళ్ళ కింద ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఇంత వానలో స్కూల్ కెళ్ళక్కరలేదని ఆనందంతో గెంతులేస్తున్నారు. పక్కింట్లో, డిగ్రీ చదువుతున్న భాస్కర్ ఎనిమిదింటికే కాలేజీకి తయారయి పోతుంటే, వాళ్ళమ్మ ఇంత వానలో వెళ్లకపోతే ఏం, అంటూ కేకలేస్తోంది, ఎప్పుడూ శ్రద్ధగా కాలేజీకి వెళ్ళని, ఆ రోజే వెళుతున్న కొడుకుని ఆశ్చర్యం గా చూస్తూ.

“వెళ్లాలమ్మా, క్లాసులు పోతాయి” అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతున్నాడు. క్లాసులు పోతాయా, ఇంత మంచి వానలో అందమైన క్లాస్‌మేట్ అర్పితను కలుసుకునే అవకాశం పోతుందనా!

పాతికేళ్ల పెళ్లికాని ప్రైవేట్ స్కూల్ టీచర్ రోజా, తెరిస్తే ముడుచుకోని, ముడుచుకుంటే తొందరగా తెరచుకోని పాత గొడుగు వంక దిగులుగా చూస్తోంది. ఎలా వెళ్ళాలి స్కూలుకి? ఎలాగోలా తలకు గొడుగు అడ్డం పెట్టుకుని, వెళదామన్నా రోడ్డు మీద నడవటం ఎలా? కాలు కింద పెట్టటానికి లేదు. స్కూల్ కెళ్ళటానికి ఎన్ని దారులున్నాయో అన్ని దారుల్లోను సముద్రాలున్నాయి. స్కూల్ గేటు ముందు ఉధృతంగా ప్రవహించే వైతరణి దాటాలంటే ఆటో ఎక్కాల్సిందే! నెల జీతంలో ఇంటి ఖర్చులకు తల్లి కివ్వగా పోను, జాగ్రత్తగా దాచుకున్న డబ్బులను, వాన ఆటోల రూపంలో హరించేస్తుందని రోజాకు స్కూలున్న రోజులలో వచ్చే వానంటే కోపం. వానంటే ఇష్ట పడని వారెవరు? వానను ప్రేమించని వారుంటారా? వాన ఆదివారం వస్తే రోజాకు ఇష్టం. వానక్కూడా డబ్బున్న, హోదా ఉన్న వాళ్లంటేనే ఇష్టం. వానలో కూడా సెలవీయకుండా స్కూల్ నడిపారనే మంచి పేరు వాళ్ళకిస్తుంది. ఏమిటీ పిచ్చి ఆలోచనలు! నవ్వుకుంది రోజా తనలో తానే!.

వాన చాలా తమాషాలు చేస్తుంది. రాత్రి నుంచో, పొద్దుటి నుంచో ఎడతెగకుండా కురిసే వానని చూస్తూ స్కూల్‌కి సెలవిస్తారు అనుకుంటే పొరపాటే. సరిగ్గా, స్కూలుకి బైలు దేరే టైంకి జోరు తగ్గి సన్న జల్లుగా మారిపోతుంది. వెళ్లక తప్పదు. సముద్రాలు మాత్రం సాయంత్రం దాకా ఇంకవు అనుకుంటూ,

రోజా, తల్లికి చెప్పి, గొడుగు వేసుకుని గేటు దాటింది. తమ కాలనీ దాటి రోడ్డు మీదకి వచ్చేసరికి, నీళ్లలో నడిచే నావల్లా ఆటోలు ముఖం మీద నీళ్లు చిమ్ముతు ఆగకుండా సాగిపోతున్నాయి. ఆగుతున్న ఆటోలు అడుగుతున్న చార్జీలు వింటుంటే, రోజూ తను నడిచి వెళ్లే స్కూల్ కేనా అడుగుతున్నది అని రోజా బోల్డంత ఆశ్చర్య పోయింది.

ఎదురుగా, రోడ్డుకవతల చెరువులా ఉన్న ప్రదేశాన్ని చూస్తే, రోజాకు సరితాంటీ గుర్తు వచ్చింది. పాపం, వెనక వీధిలో ఉండే సరితాంటీ వాళ్ళు ఇవాళ ఇడ్లీ బండి పెట్టటానికి కుదరదుగా! పిండ్లన్నీ రేపటికి పులిసిపోతాయి. ఎంత శ్రమ పడి సిద్ధం చేస్తుంది ఆంటీ! వాన వల్ల అంతా నష్టమే! వాన పదింటికి రావచ్చుగా. వాళ్ళు బండి పెట్టుకునే వారు. తను స్కూలుకు వెళ్ళి పోయేది చక్కగా! వాన మన ఇష్టప్రకారం వస్తుందా, దానిష్టం వచ్చినప్పుడు వస్తుంది కాని, ఇంకా ఆలోచనలు ఎలా సాగేవో కాని బేరం కుదిరి రోజా ఆటో ఎక్కింది.

ఆటోలో కూర్చున్న ఆమెకు రోడ్డు మీద ప్రవహిస్తున్న నీళ్లను చూస్తుంటే, పల్లెటూళ్ళో నానమ్మ, తాతయ్య గుర్తొచ్చారు. ఎలా వున్నారో ఈ వానల్లో, వరదల్లో! ఆ మూడు గదుల పెంకుటింటి పై కప్పుకు ఎన్ని రంధ్రాలో! వానొచ్చినప్పుడల్లా నానమ్మ అక్కడక్కడా గిన్నెలు పెడుతుండటం తనకి గుర్తు. బాత్రూం ఎక్కడో మైలు దూరంలో ఉంటుంది. ఎంత జాగ్రత్తగా వెళుతున్నా కాలు జారితేనో! తమ కేదైనా అయితే చూసేవారేవరనే భయంతో వాళ్ళెప్పుడు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తారు. తనలాగే నానమ్మకూ వానంటే కొంచెం కోపం. కొంచెం ఇష్టం. రాత్రంతా కురిసి పొద్దున్నే తగ్గిపోతే పనులు చేసుకోవటానికి వీలుగా ఉంటుంది, అంటుంది. ఎప్పటిదో ఆ పాత ఇల్లు! బాగు చేయించుకునే పరిస్థితి లేదు. తాతయ్యకు ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ రెండున్నర వేలు, ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్న డబ్బు మీద వచ్చే వడ్డీలే వారి జీవనాధారం. ఇద్దరికీ బి.పి., షుగర్‌లు లేవు కాబట్టి మందుల ఖర్చు లేదు. ఏదైనా అనారోగ్యం చేసినా ఇంటి చిట్కాల తోనే గడిపేస్తారు. ఇంట్లో కాసే కూరగాయలతోనే వాళ్ళకి గడిచిపోతుంది. ఇంకా చుట్టు పక్కల వాళ్ళకి ఇస్తూ వుంటారు కూడా! ఇరుగు పొరుగులతో కలివిడిగా ఉంటూ, అవసరమైన వారికి చేతనైన సహాయం చేస్తూ ఒక విధమైన ప్రశాంత జీవితం గడిపేస్తున్నారు. ఒక పధ్ధతిలో నడుస్తున్న జీవితంలో వానొచ్చిందంటే అంతా అస్తవ్యస్తమే! బైటే కాదు ఇంట్లోను పడిపోకుండా జాగ్రత్తగా నడవాలి. ఎవరింటికి వెళ్ళటానికుండదు. వాళ్లు రావటానికి ఉండదు. ముఖ్యంగా,అకాల వర్షాల వల్ల రైతుల కెంత కష్టం!

నానమ్మ వాళ్ళు ఎప్పుడూ ఇక్కడికి రారు. అమ్మ వాళ్ళు పిలవరు. ఏ పండగ కైనా వచ్చినా ఇబ్బందిగా, ఎప్పుడు వెళ్లిపోదామా అన్నట్లుంటారు. ముడుచుకు పోతారు. స్వేచ్ఛగా ఎగిరే పక్షులను పంజరంలో బంధించినట్లు ఉంటుంది వారికి. అమ్మ, నాన్న కూడా ఆప్యాయంగా మాట్లాడరు. పిలిచినప్పుడు రాకపోతే, రాలేదని నిష్ఠురంగా అందరితో చెప్పుకుంటారని భయంతో వస్తారు. వాళ్ళు వస్తే మా ఇల్లు ఇరుకైపోతుంది. మనసు కూడా!. కాని, వానా కాలంలో మాత్రం తాతయ్య, నానమ్మ ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది రోజాకు. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్ళను తనతో తీసుకువెళతానంటుంది. “అప్పుడు నీకు పెళ్ళవుతుంది. మీ అత్తమామలుంటారు. ఇంక మమ్మల్నేలా అట్టిపెట్టుకుంటావు” అంటుంది నానమ్మ నవ్వేస్తూ. నిజమే మరి!

అమ్మకి, నాన్న సంపాదించేది తక్కువ, చేసే ఖర్చులెక్కువ అని నాన్నంటే కోపం. ఆ కోపాన్ని నానమ్మ వాళ్ళమీద చూపిస్తుంది, తను ఆటో ఎక్కలేక వాన మీద కోపం చూపించినట్లు.

వానొస్తే వాళ్ళకి కరెంటు ఉండదు. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ అందదు. ఆటోలో కూర్చునే నానమ్మ వాళ్ళ పక్కింట్లో ఉండే వాసుకి ‘వాళ్ళు ఎలా వున్నారని, వాన కురుస్తోందా’ అని మెసేజ్ పెట్టింది రోజా. వాసు వెంటనే ‘చాలా బాగా కురుస్తోంది, ఎవరూ బైటకి రావటానికి లేదు, ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయ’ని మెసేజ్ పెట్టాడు.

అమ్మో!నానమ్మ వాళ్ళింట్లోకి కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. రోజా గుండె ఝల్లు మంది. ఒక్కసారిగా టి.వి.లో ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి, జనం చలికి వణికి పోతూ బిక్కు బిక్కు మంటూ ఉన్నట్లు చూపించే దృశ్యాలు కనిపించాయి. వాన కురుస్తూనే ఉంది రోజాలో చెలరేగే ఎడతెగని ఆలోచనలలా! వాన తగ్గాక నానమ్మ, తాతయ్య లని చూసి రావాలి అనుకుంది

స్కూల్ సందు తిరిగింది ఆటో. కొంచెం ముందు సునంద టీచర్ కారులో దిగుతూ కనిపించింది. వెనక రజని టీచర్ స్కూటర్ మీద తల నుంచి కాళ్ళ దాకా రెయిన్ కోటు వేసుకుని వెళుతోంది. పిల్లలను తల్లితండ్రులు కార్లలో జాగ్రత్తగా గేటు ముందు దించుతున్నారు. వరసగా వాహనాలు!. వాళ్ళందరూ రోజూ అలాగే దిగుతారు. రోజూ కాలినడకన వెళ్లే రోజాకు వాన తెచ్చినవాహన యోగం ఆ రోజు ఆటో!

వాన పాపం అన్ని చోట్లా ఒకే రకంగా కురుస్తోంది. ఎదురింటి ప్రొఫెసర్ గారికి వాన ఆనందాన్నిస్తుంది. వెనక వీధిలో బ్యాంకు ఆఫీసర్ కనకవల్లి ఎంత వానలో నైన కారు అద్దాల్లోంచి వానను చూస్తూ ఆనందంగా బ్యాంకుకు వెళ్లిపోతుంది.

పిల్లల కోసం పట్నంలో కాపురముంటూ, పల్లెటూళ్ళో గవర్నమెంట్ టీచర్‌గా పని చేస్తున్న రాజారాం అన్నయ్య ఈ వానలో రెయిన్ కోటు వేసుకుని బండి మీద వెళుతూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో! తొమ్మిదింటికల్లా స్కూల్లో ఉండి, పిల్లల అటెండన్స్ ఆన్లైన్లో తీసుకోవాలని చెప్పాడు. పిల్లలు లేటుగా వచ్చినా ఫరవాలేదుట. అన్నయ్యకి వాన ఆనందం ఇవ్వదుగా మరి! వానకి తేడాలేదు. మనుషులకే ఈ భేదాలన్నీ! ఇవన్నీ ఆర్థికానికి చెందినవే! భూమి గుండ్రంగా ఉందన్నట్లు రోజా ఆలోచనలు ఎప్పటిలాగే డబ్బు దగ్గర ఆగేటప్పటికి స్టాఫ్ రూమ్‌లో ప్రవేశించింది.

Exit mobile version