Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాళ్ళు దేవుళ్ళు కాదు

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన దేవి తనయ గారి ‘వాళ్ళు దేవుళ్ళు కాదు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలయ్యింది.

“అమ్మా, టిఫిన్ త్వరగా పెట్టు. బయటికి వెళ్లాలి” అని హడావుడిగా బాత్రూంలో నుండి వస్తూ అరిచాడు రోహిత్.

తల్లి సంధ్య ఆరోజు ఎందుకనో గదిలోనుండి ఇంకా బయటకు రాలేదు.

రోహిత్ గబగబా తన బెడ్ రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడు.

డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ లేకపోయేసరికి “అమ్మా, ఇంకా టిఫిన్ పెట్టలేదా?” అని మళ్ళీ గట్టిగా అరిచాడు.

తల్లి నుండి సమాధానం రాకపోయేసరికి వాళ్ళ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.

సంధ్య నీరసంగా పడుకుని ఉంది.

ఆమె దగ్గరగా వెళ్ళి “ఏమైంది? ఎందుకలా ఉన్నావమ్మా?” అని కంగారుగా అడిగాడు రోహిత్.

“రాత్రి నుండి జ్వరంగా ఉంది, కన్నా” నెమ్మదిగా అంది సంధ్య.

జ్వర తీవ్రత వలన ఆమె కొద్దిగా వణుకుతుంది.

“అయ్యో!..” అని ఆమె నుదుటిపై చెయ్యి వేసి “టాబ్లెట్స్ ఉన్నాయా?” అని అడిగాడు.

తల్లి సమాధానం చెప్పేలోగా అతని ఫోన్ మోగింది.

అవతల వాళ్ళ మాటలు వింటూ “ఆల్రెడీ వచ్చేసారా? నాకోసం వెయిట్ చేస్తున్నారా? సరే, ఇప్పుడే వచ్చేస్తున్నా.” అని కాల్ కట్ చేసాడు రోహిత్.

ఆపై తల్లి వైపు తిరిగి

“మాత్రలు వేసుకొని రెస్ట్ తీసుకో, అమ్మా” అని అంటూ “బయట చాలా ఇంపార్టెంట్ పని ఉంది.” అని హడావిడిగా వెళ్ళిపోబోతున్నాడు రోహిత్.

అక్కడే హాల్లో కూర్చున్న ప్రభాకర్ “పొద్దున్నే టిప్ టాప్‌గా తయారయ్యి ఎక్కడికెళ్తున్నావు. కాలేజ్‌కి వెళ్లవా ఈరోజు?” అని ప్రశ్నించాడు.

“ఆ!! వెళ్తాను.” అని నసుగుతున్న రోహిత్‌తో “పరీక్షలు కూడా మొదలవుతున్నాయి కదా” అన్నాడు ప్రభాకర్.

“చదువుతున్నాను, బాగా రాస్తానులేండి” అని గబగబా బయటికి వెళ్ళిపోయాడు రోహిత్.

ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు రోహిత్. ఒక్కగానొక్క కొడుకు కావడంతో కాస్త గారాబంగానే పెంచారు తల్లితండ్రులు.

కొడుకు కాలేజ్ మానేసి మరీ హడావుడిగా బయలుదేరడం అందునా తల్లికి బాగోలేకపోయినా అంత అర్జెంట్ గా వెళ్లాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు ప్రభాకర్‌కి.

గట్టిగా నిట్టూర్చి భార్యను చూసుకోవడానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు అతను.

సంధ్యకు జ్వరం చెక్ చేసి, వంటగదిలోకి వెళ్లి ఉప్మా చేసి ఆమెకు తినిపించి, మాత్రలు వేసి పడుకోబెట్టాడు.

కాసేపయ్యాక టీవీలో వచ్చిన ఓ దృశ్యం చూసి ఉలిక్కిపడ్డాడు ప్రభాకర్.

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తన అభిమాన హీరో పాట పాడుకుంటూ, గెంతుకుంటూ చాలా ఉత్సాహంగా ఇంట్లోకి వచ్చాడు రోహిత్.

అతన్ని చూస్తూ “ఏంటంత హుషారుగా ఉన్నావ్, రోహిత్?” అని అడిగాడు ప్రభాకర్.

“నాన్నా, మీకో సంగతి తెలుసా? ఈరోజు మా అభిమాన హీరో పుట్టినరోజు. అందుకని అతని కటౌట్ కి ఐదువందల లీటర్ల పాలతో క్షీరాభిషేకం చేశాం” అని కాలర్ ఎగరేస్తూ చెప్పాడు రోహిత్.

“మనిషి బొమ్మకి అభిషేకం చేసి, విలువైన అన్ని పాలను వృథా చేసారా?” అని ఆశ్చర్యపోయాడు ప్రభాకర్.

“ఎందుకు చెయ్యకూడదు?, నాన్నా! మా హీరో ఒక సెన్సేషన్, ఆ పేరు వింటేనే వైబ్రేషన్. థియేటర్ లోనే కాదు ఎక్కడ చూసినా, ఆఖరికి ఫోటో చూసినా చాలు మా అందరికీ పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఆ డాన్సులు చూడటానికి రెండు కళ్ళు చాలవనుకోండి. అతని డైలాగ్స్ వింటే మీరు కూడా విజిల్స్ వేస్తారు” ఉత్సాహంగా అన్నాడు రోహిత్.

ఆపై కొనసాగిస్తూ “ఐనా ఈసారి ఐదు వందలు లీటర్లతోనే చేశాం. అంత శాటిస్ఫెక్షన్ అనిపించలేదు. వచ్చేసారి వెయ్యి లీటర్లతో చేస్తాం” అన్నాడు.

“అక్కడ గొడవ జరిగినట్లుంది. నిన్ను టీవీలో చూశాను. ఎవరినో తోసేస్తున్నావు.” అని కోపంగా అరిచాడు ప్రభాకర్.

“మరి తోసెయ్యక.. మేమేదో పాలాభిషేకం చేసుకుంటుంటే వేరే హీరో అభిమానులు వచ్చి మా హీరోకి అంత సీన్ లేదన్నారు. మాకు బాగా కోపం వచ్చింది. మా ప్రాణానికి ప్రాణమైన హీరోని వాళ్లెవరో తిడుతుంటే ఎందుకు ఊరుకోవాలి?” అని ఉక్రోషంగా అన్నాడు రోహిత్.

“సినిమా వాళ్లపై అంత పిచ్చి ప్రేమ ఉండకూడదు. మీరిలా డబ్బులు ఖర్చు పెట్టి శ్రమపడి అభిషేకాలు చేస్తున్నారని మీ హీరో మీకేమైనా డబ్బులు ఇస్తున్నాడా? లేదంటే పిలిచి శాలువాలు కప్పుతున్నాడా?” అని ప్రశ్నించాడు ప్రభాకర్.

“అసలు గౌరవించి, అభినందించాల్సింది ఎవరినో తెలుసా? పగలనక, రాత్రనక పొలాల్లో పనిచేస్తూ మనందరి కడుపులు నింపుతున్న రైతన్నలకు, అలాగే కుటుంబాలకు దూరంగా ఉంటూ అతి వేడిలో, చలిలో ఆరుబయట ఉంటూ శత్రుమూకల నుండి దేశాన్ని అనుక్షణం కాపలా కాస్తున్న సైనికులకు, ఇక టెక్నాలజీ అంటూ రకరకాల ఆవిష్కరణలు చేస్తున్న శాస్త్రవేత్తలకు.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడరు, మెచ్చుకోరు” అని కించిత్తు బాధగా అన్నాడు ప్రభాకర్.

తండ్రి మాటలను మౌనంగా వినసాగాడు రోహిత్.

“ఐనా శివరాత్రి నాడు శివలింగాలకి అభిషేకాలు చేస్తే ‘పాలను వృథా చేసే బదులు ఆ పాలతో పేదవాళ్ళ కడుపులు నింపవచ్చు కదా’ అని గగ్గోలు పెడుతుంటారు కొందరు మహానుభావులు. మరి ఇప్పుడు మీరు చేసింది వృథా కాదా?” అని సూటిగా ప్రశ్నించాడు ప్రభాకర్.

ఆ మాటల్లో నిజముండటంతో తల దించుకున్నాడు రోహిత్.

“సినిమా అంటే ఇరవై నాలుగు కళల సమాహారం. ఒక సినిమా తయారవ్వాలంటే ఎన్నో వందల మంది కష్టం వెనుక ఉంటుంది కానీ కేవలం హీరో హీరోయిన్లను మాత్రమే ఆకాశంలో నుండి ఊడిపడిన దేవుళ్లలా భావిస్తున్నారు మీ లాంటివాళ్లు” అని అన్నాడు ప్రభాకర్.

తండ్రి మాటల్ని వినేసి తనగదిలోకి కదలబోతున్న రోహిత్‌తో

“ఉదయం మీ అమ్మకి జ్వరంగా ఉందని చెప్పినా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయావు. ఆ విషయం కనీసం గుర్తుందా? తల్లితండ్రులకంటే బయటవాళ్లు ఎక్కువైపోయారా?” అని కాస్త కోపంగా అడిగాడు ప్రభాకర్.

ఆ మాట వినగానే గబుక్కున నాలుక్కరుచుకుని తల్లి పడుకున్న గదిలోకి గబగబా వెళ్ళి “తగ్గిందా, అమ్మా?” అని ఆమె చెయ్యి పట్టుకుని అడిగాడు రోహిత్.

“మందులు వేసుకున్నాను పర్వాలేదు, కన్నా” అంది సంధ్య.

“రెస్ట్ తీసుకో, రాత్రికి టిఫిన్ చేయటానికి ప్రయత్నిస్తానులే” అని అన్నాడు రోహిత్.

“నువ్వా? నాన్నగారు చూసుకుంటారులే. నువ్వు చదువుకో, కన్నా” అంది సంధ్య.

సరేనని తన గదిలోకి వెళ్ళిపోయాడు రోహిత్.

***

రెండు రోజుల తర్వాత సాయంత్రం ఆఫీసు నుండి వస్తూనే “రోహిత్, నువ్వు చేసిన పని ఏంటి?” అని కోపంగా అరిచాడు ప్రభాకర్.

“ఏం చేసాను, నాన్నా?” అని మామూలుగా అడిగాడు రోహిత్.

“వేరే హీరోల గురించి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టావు. మా కొలిగ్ చెపితే చూశాను” అని కోపంగా అన్నాడు ప్రభాకర్.

“వాళ్ళ ఫ్యాన్స్ మా అందరి గురించి బేడ్‌గా రాస్తే తప్పులేదా. మేం ఎందుకూరుకోవాలి? అందుకే నేను కూడా పెట్టాను” ఉక్రోషంగా అన్నాడు రోహిత్.

“చెప్పే మాటల్లో, చేసే పనుల్లో కొంచెం విచక్షణ ఉండాలి. వాళ్లేదో అన్నారని నీ స్థాయి దిగజార్చుకుని మాట్లాడుతావా? ఈమధ్య ఉద్యోగం ఇవ్వబోయేముందు చాలా కంపెనీలు అభ్యర్ధుల సోషల్ మీడియా ఎకౌంట్స్ కూడా పరిశీలిస్తున్నారు. నువ్వు ఇలాంటి రాతలు రాశావని చూస్తే నీకు ఉద్యోగం ఇస్తారా?” అని ప్రశ్నించాడు ప్రభాకర్.

ఆ మాటలకు తండ్రిని మౌనంగా చూడసాగాడు రోహిత్.

“సినిమాని సినిమాలాగే చూడాలి. అంతకుమించి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి వ్యక్తిగత దూషణ పనికిరాదు. అది మీకు వ్యక్తిగతంగా చెడు చేయడమే కాకుండా, సమాజంలో ప్రశాంతత లేకుండా చేస్తుంది. పైగా ఎవరైనా పరువునష్టం కేసులు పెడితే కోర్టులు వెనక తిరగాలి. ఈమధ్యన కొందరు కేసులు పెడుతున్నారు.” అని వివరించాడు ప్రభాకర్.

కోర్ట్ అనగానే కౌశిక్ కి ఒక్కసారిగా భయం కలిగింది.

ఐనా బింకంగా “ఎవరు పెట్టారని వాళ్ళకెలా తెలుస్తుంది” అన్నాడు.

“ఎందుకు తెలియదు. ఏ ఐపి అడ్రసు నుండి వచ్చిందో పోలీసులు కనిపెట్టగలరు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ పట్టుకుంటారు.” అన్నాడు ప్రభాకర్.

అక్కడే ఉన్న సంధ్య “మనకెందుకు కన్నా ఇవన్నీ. చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకోక” అని బాధగా అంది.

ఆపై “నువ్వు ఉన్నత స్థితిలో ఉంటే ఎంత ఆనందిస్తామో, అలాగే ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే అంతగా తల్లడిల్లిపోతాము” అని రోహిత్ దగ్గరకి వచ్చి తలపై చెయ్యి వేసి కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటూ అంది.

దాంతో గబుక్కున గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని ఆలోచించసాగాడు రోహిత్.

తాను ఇలా చేస్తుంటే తమ కుటుంబం పరువు పోవడమే కాకుండా తనకు ఉద్యోగం కూడా వస్తుందో, లేదో అని ఆందోళనపడ్డాడు.

కాసేపయ్యాక తల్లితండ్రుల దగ్గరికి వచ్చి

“తప్పయిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటివి చేయను, నాన్నా.” అని సిగ్గుతో తల దించుకుని అన్నాడు రోహిత్.

“దట్స్ మై బాయ్. ముందు నీ అకౌంట్స్ లోని బేడ్ కామెంట్స్‌ని తొలగించు. అలాగే ఇకపై ఇలాంటివాటికి పూర్తి దూరంగా ఉండు. చదువుపై శ్రద్ధ పెట్టి, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించు. నువ్వనుకుంటున్నవాళ్ళెవరూ దేవుళ్ళు కాదు, వాళ్ళకోసం మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోనవసరం లేదు.” అని కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు ప్రభాకర్.

సరేనంటున్న కొడుకుని మురిపెంగా చూడసాగింది సంధ్య.

Exit mobile version