Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాక్కులు-2

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు

~

31
ఊళ్లు కాలుతున్నాయి.
“కులం”

32
తప్పుడుతనం తాండవిస్తోంది.
“చదువు”

33
ఆవేదనకు అనువాదం వచ్చింది.
“కన్నీరు”

34
తపన తపస్సుకు సాక్షాత్కారం లభించింది.
“అభివ్యక్తి”

35
జననం అన్న గాయం అయింది ఆపై దాన్ని మరణం నయం చేసింది.
“జీవితం”

36
నదిలో జ్వాలలు రేగుతున్నాయి.
“నాగరికత”

37
దేశాలు దగ్ధమైపోయాయి.
“ఉగ్రవాదం”

38
కాల్చేసి, పేల్చేసి మతం అన్నారు.
“ఉన్మాదం”

38
బతకడానికి కులం కావాలట.
“భ్రష్టత్వం”

40
పక్కవాడికి ఉరి పడుతోంది.
“ఊహలు”

41
మనుగడకు అర్థం చెదిఱిపోయింది.
“బీదరికం”

42
గాయం సలుపుతూనే ఉంది.
“ద్రోహం”

43
ధరిత్రిపై ఎప్పుడూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
“మనిషి”

44
ఎప్పటికీ దాహం తీఱదు.
“ఆకలి”

45
ఎప్పటకీ ఆకలి చావదు.
“దాహం”

46
ఎంతో మంది స్నేహితులు చేరారు.
“డబ్బు, డబ్బు, డబ్బు”

47
పలకరింపులు రెచ్చిపోతున్నాయి.
“అవసరం”

48
అయిన గాయం నుంచి చీము కాఱుతోంది.
“శత్రుత్వం”

49
కండకావరం లేని ఒకే ఒక్కడు విలసిల్లుతున్నాడు.
“పిల్లాడు”

50
పూచిన చోట మళ్లీ మళ్లీ పువ్వు పూస్తూనే ఉంది.
“మందహాసం”

51
చెట్టు లేకుండాపోయినా ఫలం సఫలమైంది.
“సత్కృతి”

52
బుద్ధి సిద్ధించింది.
“సుగుణం”

53
భగవంతుడు తన దీవెనను అందఱికీ ఇచ్చాడు.
“అమ్మ”

54
శబ్దం సంస్కరించబడింది.
“సంగీతం”

55
హితం కోసం మంచి వ్రతం ఒకటుంది.
“సత్సాహిత్యం”

56
అందఱికి వినబడాల్సిన పాట ఎవ్వరికీ సరిగ్గా అందడం లేదు.
“ఆనందం”

57
మనసులో ముళ్లు, పువ్వుల గుచ్చం రూపొందింది.
“ప్రేమ”

58
ప్రతి ఇంట్లోనూ దేవత వెలిసింది.
“అమ్మ”

59
ఏ ఆకృతి లేనిది అన్ని కృతులకూ మూలమైంది.
“మనసు”

60
చరిత్రకందని కాలం నుంచీ రాద్ధాంతం జరుగుతూనే ఉంది.
“సిద్ధాంతం”

(మళ్ళీ కలుద్దాం)

 

Exit mobile version