Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాక్కులు-11

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్థాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు

~

301
వికారం, విరోధం, విచ్ఛిత్తి , విద్రోహం‌, విభజన, విరసం కలిసి వెలిశాయి.
“మనిషి”

302
మరణించిన మనిషి మాటను అందఱూ వింటున్నారు.
“మంచితనం”

303
గాలి కలుషితం అయిపోయింది.
“నిశ్వాసం”

304
తలనిండా తనను నింపుకుని ఎదుటివాణ్ణి‌ బాధిస్తున్నాడు మనిషి.
“వ్యక్తిత్వం”

305
ఏ యోగి హృదయమో మానవులందఱినీ దీవిస్తోంది.
“చల్లగాలి”

306
అందఱికీ లోపలుండే మనసు జాబిలికి మాత్రం‌ బయటకు కనిపిస్తుంది.
“వెన్నెల”

307
ఆమె చిఱునవ్వును అతడు‌ భద్రపఱుచుకున్నాడు.
“వలపు”

308
మనిషికి దెబ్బతగులుతూనే ఉంది‌.
“మనుగడ”

309
భవిష్యత్తును గెలవాలని‌ వర్తమానానికి అతీతమయ్యాడు కవి.
“కవిత్వం”

310
చీకటి గగనంలో పేరులేని రంగులోని ఒంటరి తార మెఱిసింది.
“కవిత”

311
ఉదయమూ, వెలుగూ శబ్దం చెయ్యకుండా వచ్చాయి.
“ఉపదేశం”

312
పాఱే నీరులో వడగాలులు పుడుతున్నాయి.
“ప్రవర్తన”

313
ఆఱుబయట ఒలకబోసి ఉన్నాయి, ఎవరికీ పట్టలేదు.
“వాస్తవాలు, సత్యాలు”

314
ఎండమావి మెఱుస్తూనే ఉంది.
“కచ్చితత్వం”

315
సరిగ్గా వివరించబడని కవిత ఉంది.
“కృత్యాద్యవస్థ”

316
నేర్చుకోవాల్సిన సంగీతం ఉంది.
“సవరణ”

317
తనివి తీఱ్చాల్సిన తెమ్మెర చాల కాలంగా వీచడం లేదు.
“మేలు”

318
నీడ మీద నిజం పడింది.
“కవితోదయం”

319
ప్రకృతికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది.
“సూర్యోదయం”

320
నిద్ర చెదిఱిపోయింది.
“సత్యోదయం”

321
స్తబ్ధత నిన్నటిదయింది.
“దినోదయం”

322
బాధ్యత కళ్లు తెఱుచుకుంది‌.
“జ్వలనోదయం”

323
ఎన్నో పోతున్నాయి, వయసు మాత్రం వచ్చేస్తోంది.
“జీవితం”

324
ఆందుకుందామని ఆశపడుతూంటే పోగొట్టుకోవడం ఫలితమౌతోంది.
“జీవనం”

325
అలమటించినందుకు ఆనవాళ్లు ఉన్నాయి.
“జీవితం, జీవనం”

326
అందుకోలేనంత ఎత్తులో‌ ఒక‌ ఆఘ్రాణించలేని పువ్వు ఉంది.
“ఆకాశం”

327
తలపు, కృషి సమష్టిగా పరిణతి చెందాయి.
“విజయం”

328
అధ్యాపకులు, కవులు, రచయితలు‌, వక్తలు భాషను పేల్చేశారు.
“తెలుగు”

329
మానసిక వికలాంగులు కవి, విమర్శకుడు అన్న మారుపేర్లతో తచ్చాడుతున్నారు.
“తెలుగు”

330
మనుషులు లేరు; మతస్థులు, కులస్థులు తెగ తచ్చాడుతున్నారు.
“సమాజం”

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version