[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘వాడికి వంద ధన్యవాదాలు..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
లలిత, ఏదో పెళ్లికి హైదరాబాద్ వెళ్లి వచ్చింది. అయితే ఆమె వచ్చినప్పటి నుండీ కొంత డీలా పడిపోయినట్టు కనిపించింది. అయితే, అంత దూరం నుండీ రైలు ప్రయాణం అదీ చేయడం వలన కలిగిన బడలిక కారణంగా అదోలా ఉందనుకుని సరిపెట్టుకున్నాడు మధు.
కానీ, ఒక గంట గడిచిన తర్వాత కూడా, ఆమె నోటి వెంట ఒక మాట, మంతీ లేదు. ఆమె వాలకం చూసి లోలోనే చాలా ఆశ్చర్యపోయాడు.
ఎప్పుడూ డబ్బాలో రాళ్ళేసినట్టు లబలబమంటూ వాగుతుంది. లొడలొడ ఏవేవో పనికిమాలిన ప్రశ్నలు వేసి విసిగించేది. ఇపుడేంటి, వింతగా ఇంత కామ్‌గా ఉంది. ఏమిటి ఈ అనుకోని మార్పు అంటూ తనలో తానే తన్నుకు చచ్చాడు. కానీ ఎందుకో, ఆమెని వివరం అడగడానికి సాహసించలేదు. ఇంకొంత సమయం గడిస్తే, తనంతట తనే వివరంగా విషయం చెప్తుందిలే అని సరిపెట్టుకున్నాడు. కానీ రెండు గంటలైనా అదే పరిస్థితి కొనసాగింది.ఇక ఉగ్గబట్టుకు ఉండలేక, ఆమె బుగ్గ గిల్లి “లలితా” అని నెమ్మదిగా పిలిచి, ఓ చిన్న పిచ్చి నవ్వు నవ్వాడు.
ఆమె మధు వంక వికారంగా చూసి, ఏవిటి అన్నట్టు ఓ సైగ చేసింది.
మధు అదే పిచ్చి నవ్వుని కంటిన్యూ చేస్తూ, “ఏం లేదు లలితా, నువ్వు వచ్చినప్పటినుండీ మౌన వ్రతం చేస్తున్న మనిషిలా కియ్, కయ్ అనడం లేదు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. రైలు జర్నీ చేసి వచ్చిన తర్వాత నుంచీ చూస్తున్నాను, అదే తెల్ల మొహంతో, ఒక మాట కూడా మాట్లాడటం లేదు. ఏమిటి సంగతి? ఆ పెళ్లిలో ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా?” అడిగాడు.
“ఎవరు అంటారు?అంత ధైర్యం ఎవరికి ఉందని!” అంది కోపంగా చూస్తూ
“సరే, సరే. మరి ఏవిటిదీ, వచ్చిన కొద్ది సేపు తర్వాత టిఫిన్ చేసావు, వడ్డించావు. ఇద్దరం కలిసి మెక్కాం. టీ పెట్టావు, తీసుకు వచ్చి ఇచ్చావు. ఇద్దరం జుర్రేసాం. తర్వాత టీవీ పెట్టావు, కలిసి చూస్తున్నాం. కానీ నీ మొహంలో మాత్రం ఏదో నిరాశ, నిస్పృహ మాత్రం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నీకు అభ్యంతరం లేకపోతే ఏం జరిగిందో నాకు చెప్పకూడడూ. నీ ప్రవర్తన అంతా అయోమయంగా అనిపిస్తోంది” అన్నాడు భయంగా గుటకలు మింగుతూ.
“ఏం జరుగుతుంది? ఏవీ జరగలేదు. రైల్లో ఒక ఆవిడ పరిచయం అయింది. ఎంత బాగా మాట్లాడిందని! సొంత చెల్లెలు అనిపించింది నాకు. అలా మాట్లాడి, మాట్లాడి, కొద్ది సమయంలోనే ఇద్దరం ఎంతో దగ్గరై పోయాం. సమయం కూడా తెలియలేదు. ఎంతో అభిమానంగా ఆవిడ తెచ్చుకున్న సున్నుండలు, పూతరేకులు నాకు తినమని పెట్టింది. నేను కూడా, కొనుక్కున్న జంతికలు, మావిడ తాండ్ర ఆవిడకు పెట్టాననుకోండి. పూత రేకుల్లో ఇంకొంచెం నెయ్యి వేసుంటే బావుండేది. కానీ ఎలాగోలా తినేశాననుకో. ఆవిడ కూడా నేనిచ్చిన మావిడ తాండ్ర బావుందని మెచ్చుకుంది. అలా మేవు మంచి స్నేహితులం అయిపోయాం . నన్ను చూస్తే ఆవిడకి ఓ అక్కలా అనిపించానని ఓ తెగ మురిసిముద్దయిపోయింది. పైగా, ఆవిడకి బ్యూటీ పార్లర్ కూడా ఉందట ఇదే ఊర్లో. ఆ మాటలు నా చెవుల్లో బెల్లం పాకం పోసినట్టు తియ్యగా వినిపించేసరికి, నేను ఎంతో మురిసిపోయాను, ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వారానికి రెండు మూడు సార్లు బ్యూటీ పార్లర్‌కి వెళ్తానని మీకు తెలుసు కదా. అందుకనే, ఆవిడ దిగిపోయేప్పుడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చింది. అయితే ఎవడో దొంగ వెధవ, మన విశాఖలో నా దగ్గర ఆ నా హ్యాండ్ బ్యాగ్ కొట్టేసాడు. నా హ్యాండ్ బ్యాగ్ పోయిందనే బాధ కంటే, అందులో ఉన్న విజిటింగ్ కార్డు పోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. ఆ బాధతోనే నాకు వచ్చినప్పటి నుండీ నోట మాట రాలేదు. అంతకు మించి ఇంకేమీ లేదు” చెప్పింది అసహనంగా.
“పోనీ నెట్లో వెతుకుదాం, దొరుకుతుందేమో” అన్నాడు
“అసలు, ఆ బ్యూటీ పార్లర్ పేరు నేను చూస్తేగా. ఆవిడిచ్చింది, నేను టక్ అని బ్యాగ్౬లో పెట్టేసాను. తర్వాత ఆటో ఎక్కేసాను, చూసుకుంటే ఆ బ్యాగ్ పోయింది. అంతే.”
“పోన్లే, కొన్ని, కొన్ని సార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి. మన టైం బాలేదనుకోవాలి అంతే. ఆ దొంగ వెధవ బాగుపడడు, వాడు దుంప నాశనం అయిపోతాడు” అని మధు కూడా ఆమెకు వత్తాసు పలికాడు.
దాంతో ఆమె కోపం కొంత చల్లారి, ఆమె బాధ కొంత తగ్గినట్టు అనిపించింది. దాంతో మధుకి కొంత ఉపశమనం అనిపించింది. తర్వాత కొంత సమయం వరకూ ఇద్దరూ మాట్లాడుకున్నారు .
ఓ వారం తర్వాత, మధులలితలిద్దరూ సోఫాలో కూర్చుని టీ తాగుతూ న్యూస్ చూస్తుండగా, ఇదివరకు రైల్లో లలితకి పరిచయమైన అమ్మాయిని టీ.వీ.లో చూపిస్తుండడంతో, ఒకసారి ముందుకు జరిగి,
“మధూ, కొంచెం టి,వీ . సౌండ్ పెట్టు. ఈమే, నేను చెప్పిన ఆ రైల్లో కలిసిన అమ్మాయి” చెప్పడంతో సరే అంటూ సౌండ్ పెంచాడు.
‘ఈమె పేరు నళిని, బ్యూటీ పార్లర్ పేరు చెప్పి అమాయకమైన మహిళలను మాయ మాటలతో ట్రాప్ చేసి టార్గెట్ చేస్తుంది. తర్వాత వాళ్ళు బ్యూటీ పార్లర్‌కి వచ్చాక, డ్రగ్స్ కలిపిన జ్యుస్ ఇచ్చి మత్తు వచ్చేలా చేస్తుంది. తర్వాత వాళ్లు ముందు డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టి, ఫోటోలు తీస్తుంది. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా, వాళ్ళు వినియోగిస్తున్నట్టుగా చిత్రీకరించిన ఫోటోలు వాళ్లకి చూపించి, అవి బయటకు రాకుండా ఉండాలంటే, కొంత డబ్బు ఆమె ఫోన్‌కి ట్రాన్స్ఫర్ చేయమని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈవిడ వల్లో పడిన కొందరు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఈమెని పోలీసులు అరెస్ట్ చేశారు’ అని చెప్పడంతో ఆ వార్త ముగిసింది.
ఆ వార్త చూసిన మధు, లలితలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు భయంగా చూసుకున్నారు.
తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన దొంగకి, మనసులోనే వంద థాంక్స్ చెప్పుకుంది లలిత.