Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాడెప్పుడూ ఫస్టే!

[తెలికిచెర్ల విజయలక్ష్మి గారి ‘వాడెప్పుడూ ఫస్టే!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఎంత బాగా చదివినా ఇంకా చదవాలని అంటుంది అమ్మ!” అన్నాడు బుంగమూతి పెట్టుకున్న విక్కి.

“నీ చదువు సంగతి నాకు తెలియదా. పుస్తకం చేతిలోనే వుంటుంది. కళ్ళు మాత్రం గేటువైపు చూస్తూ వుంటాయి!”

“అందరూ నన్నే అంటారు. చెల్లిని ఎవ్వరూ ఏమీ అనరు!” అన్నాడు కినుకగా.

“చెల్లి చిన్నపిల్ల కదరా. మరికొంచం పెద్దది అయితే అప్పుడు చదువు బాధ్యత తెలుస్తుంది!”

“తాతయ్యా, చిన్నప్పుడు నువ్వు బాగా చదువుకునేవాడివా. మంచి మార్కులు వచ్చేవా!”

“బాగానే చదువుకునేవాడినిరా. అప్పుడప్పుడూ మంచి మార్కులు వచ్చేవి. క్లాసుకి ఫస్ట్ మాత్రం ఎప్పుడూ రాలేదురా!”

“ఎందుకూ? నువ్వు చదువులో వీక్‌గా ఉండేవాడివా!”

“నేను మంచి స్టూడెంట్‌నే. నాకన్నా బాగా చదివేవాడు మరొకడు ఉండేవాడు. వాడే ఎప్పుడూ క్లాసుకు ఫస్ట్!”

“నీ ఫ్రెండ్ క్లాస్‌కి ఫస్ట్ వస్తే నువ్వే ఫస్ట్ వచ్చినంత ఆనందంగా చెప్తున్నావు. నువ్వు ఎప్పుడూ జెలసీ ఫీల్ అవలేదా!”

“ఎందుకు జెలసీ? మేమిద్దరం మంచి స్నేహితులం. మా ఇద్దరిదీ ఒకేమాట. ఇద్దరం ఒకే సైకిల్ మీద స్కూల్‌కి వెళ్లేవాళ్ళము. ఒక్క సెట్ బుక్స్ కొనుక్కుని ఇద్దరం చదువుకునేవాళ్ళము. మా ఇద్దరి నడుమ ఈర్ష్య అసూయలకు తావులేదు. మా ఇద్దరిదీ అంతమంచి స్నేహం!”

“ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీ ఫ్రెండ్?”

“వాడికి అన్నిటికీ తొందర ఎక్కువ. తొందరగా వెళ్ళిపోయాడు!” అంటూ కళ్ళద్దాలు తుడుచుకుంటూ పేపర్ చదవడంలో నిమగ్నమయ్యాడు దామోదర్. తాతయ్య ఒకసారి పేపర్ చదవడంలో నిమగ్నమైతే ఎవరితోనూ మాట్లాడడనే భయంతో.. పేపర్‌కి చెయ్యి అడ్డం పెడుతూ..

“తాతయ్యా, మా టీమ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్‌లో ఫైనల్‌కి చేరుకుంది!” అన్నాడు విక్కీ.

తన మాటలతో సంబంధం లేకుండా గంభీరంగా పేపరుపై దృష్టి పెడుతున్న తాతయ్యపై అలుగుతూ..

“అందరి గ్రాండ్‌పేరెంట్స్ నన్ను ఎంతో అభినందిస్తారు. భవిష్యత్‌లో మంచి ఆటగాడివి అవుతావు అంటారు. టీచర్స్‌కి నా ఆట అంటే ఎంతో ఇష్టం. నువ్వు మాత్రం అస్సలు పట్టించుకోవు!” అంటున్న మనవడి తలపై చెయ్యివేసి, చిరునవ్వుతో..

“నీ మీదా నీ ఆట మీదా నాకు అపారమైన ప్రేమ వుందిరా! నాకు ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే చాలా ఇష్టం. నీలా పద్ధతిగా ఆడటం అయితే నాకు రాదు. నేనూ నా ఫ్రెండ్ సరదాగా ఆడుకునేవాళ్ళం. అయితే ఫుట్‌బాల్ మ్యాచ్ అనగానే నాకొక బాధాకరమైన సంఘటన గుర్తు వస్తుంది. నాకు నిశ్శబ్దంగా ఆ బాధను భరించాలని అనిపిస్తుంది!” అన్నాడు రిటైర్డ్ కల్నల్ దామోదర్.

“మ్యాచ్ సమయంలో ఏమైనా దుర్ఘటన జరిగిందా తాతయ్యా?”

“మ్యాచ్ లెవెల్ ఆటగాళ్ళం కాదు మేము. యుద్ధసమయంలో జరిగిన సంఘటన అది!”

“యుద్ధంలో జరిగిన అన్ని కథలూ చెప్తూ వుంటావు. నిన్ను బాధపెట్టే ఆ సంఘటన ఎందుకు చెప్పవు?” అంటున్న మనవడిని చూస్తూ..

“నీకు విని తట్టుకునే ధైర్యం లేదని అనుకుంటున్నాను. నువ్వు ఇంకా చిన్న పిల్లడివి కొద్దిరోజులు పోనీరా!” అంటూ మనవడిని దగ్గరకు తీసుకున్నారు ఆయన.

“నేను ఘోస్ట్, హారర్ స్టోరీస్ చదువుతూ ఎప్పుడూ భయపడలేదు. యుద్ధంలో జరిగే సంఘటనలు నాకు ఎంతో ఇష్టం. మరి ఇప్పుడు ఎందుకు భయపడతాను. నీ బాధను, నీ ఫీలింగ్స్‌ని నాతో షేర్ చేసుకోవాలని అనుకోవడంలేదు అంతే!” అంటున్న మనవడి మాటలతో.. ‘ఈసారి చెప్పక తప్పదు. లేకుంటే వాడి ఆటంటే నాకు ఇష్టంలేదు అనే అపోహ వీడి మనసులో ఉండిపోతుంది!’ అనుకుని, మనవడిని పక్కన కూర్చోపెట్టుకుని చెప్పడానికి సిద్ధపడ్డాడు ఆయన.

***

“నేను, నా ఫ్రెండ్ దశరథ్ లడఖ్ బోర్డర్‌లో పనిచేస్తున్న రోజులవి. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఇద్దరం ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఒక్కటే ప్రాణంగా ఉండేవాళ్ళం. గూఢచారుల ద్వారా శత్రు మూకలు మా శిబిరాల మీద దాడి జరిపే ఉద్దేశంలో ఉన్నారని తెలిసింది. భూభాగం ఆక్రమించే దురుద్దేశంతో వున్నారని వార్త అందింది ఒకరోజు. యూనిట్ అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని దిక్కులా కాపలాగా సైనికులు వున్నారు. రాయబారి ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు కాల్పులు జరపకూడదు. మారణాయుధాలు వాడకూడదు. అయినా శత్రుదేశం నిబంధనలు పాటిస్తుందనే నమ్మకం మన ఇండియన్ ఆర్మీకి లేదు. ఎటునించి ఎటాక్ జరుగుతుందో అని అందరం అప్రమత్తంగా ఉన్నాము. నేనూ, నా స్నేహితుడు గుబురుగా ఉండే పొదల వెనక ఎవరి కంటా పడకుండా దాక్కున్నాము.

ఒక్కసారిగా ఎన్నో బూట్ల శబ్దం. మాలో విచిత్రమైన భయం ఆవహించింది. జరగబోయే కీడుకి సంకేతంలా వాతావరణం గంభీరంగా ఉంది. ఒంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. సైనికుల కోసం వెతుకుతూ భీకరంగా అరుస్తున్నారు. కనిపించిన సైనికుల మీదకు ముళ్ళ కంచెలు చుట్టిన రాడ్‌లు విసురుతున్నారు. మన వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెనుకకు జరుగుతున్నారు. కోపం పట్టలేని దశరథ్..

“ఒరేయ్, కుక్కల్లారా ఒప్పందం మరిచారా?” అంటూ అరుస్తూ ముందుకు వెళ్ళాడు.

“వాళ్ళ భాషలో ఏదో అంటూ దశరథ్ మీద మీదకు వస్తూ దశరథ్ మెడ మీదకు పదునైన ఆయుధాన్ని విసిరారు. రెప్పపాటు కాలంలో దశరథ్ పీక తెగి పడింది. తెగి పడిన నా ప్రాణ స్నేహితుడి శరీరానికి దగ్గరగా చేరుకోవాలని మనసు తపిస్తోంది. తనివితీరా ఏడవాలని అనిపిస్తోంది. వాళ్ళు వికటాట్టహాసం చేస్తున్నారు. తెగి పడి రక్తం కారుతున్న దశరథ్ తలతో కాలితో తన్నుతూ అరుస్తూ ఆడుతున్నారు. కోపంతో ఒళ్ళు రగిలి పోతోంది. అడుగులు ముందుకు వేస్తే నా గతి కూడా అంతే అని అర్థమైంది. జరుగుతున్నది చూస్తూ చేతకాని వాడిలా ఉండిపోయాను. ఎప్పటికీ ఆ దృశ్యం మర్చిపోలేను. అందుకే ఫుట్‌బాల్ అనగానే నా మనసు బాధకు గురౌతుంది. అన్నింటిలో నాకన్నా ముందు ఉండే నా స్నేహితుడు దశరథ్‌కి, మరణం కూడా చాలా ముందే వచ్చింది!” అంటూ మనవడిని చూస్తూ..

“అరే, ఇప్పుడే చెప్పావు కదరా. నాకేమీ భయం వెయ్యదు. నేను చాలా ధైర్యం కలవాడిని అని! మరి ఎందుకు అలా ఏడుస్తావు?” అంటూ మనవడిని నవ్వించడానికి ప్రయత్నించారు కల్నల్ దామోదర్. కళ్ళు తుడుచుకుని తాతయ్య ఒళ్ళో తల పెట్టుకుని చాలాసేపు నిశ్శబ్దంగా వుండిపోయాడు విక్కీ. మనవడి మనసు మార్చే ఉద్దేశ్యంతో..

“నీ ఆట అంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్లో ఇంటర్నేషనల్ ఆటగాడివి అవుతావు!” అంటూ మనవడిని అభినందించారు ఆయన.

“తాతయ్య, నేను భయంతో ఏడవలేదు. బాధగా అనిపించింది. భరతమాత ముద్దుబిడ్డను ఇలా తెగనరికిన దుష్టులపై అసహ్యం కలుగుతోంది. రక్తం మరుగుతోంది. మీ స్నేహితుడైన ఆ అమర వీరుడికి సెల్యూట్ చేస్తున్నాను అంటూ అటెన్షన్ గా నిలబడి, ‘జైహింద్..!’ అన్నాడు విక్కీ.

(సమాప్తం)

Exit mobile version