[శ్రీ కర్లపాలెం హనుమంతరావు రచించిన ‘ఉత్తరం దిద్దిన కాపురం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ధనుర్మాసం రోజులు. తెల్లారుఝాము చలిలో వాకిట్లో ముగ్గేస్తున్నాం అమ్మలక్కలం.
“వెంకట్రాయుడు గారిల్లేదేనామ్మా?” ..కొత్త గొంతు!
తలెత్తి చూశాను. ఎవరో పెద్దాయన. డెబ్బై య్యేళ్ళుంటాయేమో! తలకు మఫ్లరు ఉండటం వల్ల ఆ మసక వెల్తుర్లో మనిషిని గుర్తుపట్టటం కష్టమయింది.
ఆయన అడిగిన వెంకట్రాయుడు మావారే. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్! పి.యం. వైజాగ్ టూర్ సందర్భంగా అక్కడ డ్యూటీలో ఉన్నారిప్పుడు.
విషయం విని ఉసూరుమన్నాడాయన. తటాపటాయిస్తూ నిలబడితే నేనే అడిగాను “వారితో పనేమన్నా ఉందా?”
చెప్పటానికి ఇబ్బంది పడుతున్నాడు. బహుశా నా పక్కన వేరే వాళ్ళు ఉన్నందు వల్ల కావచ్చు.
మావారు లేరని తెలిసినా వెళ్ళటం లేదంటే ఏదో ముఖ్యమైన పనే అయివుండాలి.
చేసే పని పక్కన పెట్టి ఇంట్లో కొచ్చాను. తనూ వచ్చి వరండాలో కుర్చీలో కూర్చున్నాడు.
మనిషిని చూస్తే రాత్రి ప్రయాణంలో బాగా నలిగినట్లు కనిపిస్తుంది. మంచినీళ్ళు ఇస్తే తాగి ఆనక చెప్పుకొచ్చాడు తను వచ్చిన పని.
“చెరువుపల్లి తల్లీ మాది! టోబాకో బోర్డుంది అక్కడ. సీజన్లో టిఫిన్ సెంటర్ నడుపుతుంటాం. సార్‌కు బోర్డులో డ్యూటీ పడ్డప్పుడు నేనే కాఫీ టిఫిన్లు సప్లై చేసేవాణ్ణి. అప్పట్లో సార్ సబిన్‌స్పెక్టరు. మాల్యాద్రి అంటే సారుకు గుర్తుండక పోవచ్చు. వారితో చిన్న పనుండి వచ్చానమ్మా! ఫోన్లో అయేది కాదు. స్టేషన్లో కలుద్దామన్నా.. కుదరటంలేదు. అందుకే ఇంటి దాకా వచ్చింది. ఇక్కడా వారిని కలవలేకపోయా! ఏమీ అనుకోకమ్మా, కాస్త ఈ కవర్ ఇన్‌స్పెక్టర్ గారికి అందేలా చూడండి తల్లీ! వివరాలన్నీ ఇందులో ఉన్నాయి” అంటూ గవరు రంగు పెద్ద కవరు ఒకటి అక్కడి బెంచీ ముందుంచి లేచాడు.
ఎవరో ఏమిటో ఈ మనిషి? ‘ఎన్క్వయిరీ చెయ్యకుండా ఎవర్నీ ఎంటర్‌టైన్ చెయ్యద్దు’ అని మావారు చాలా సార్లు హెచ్చరించారు.
“కాఫీ పంపిస్తా.. కూర్చోండి” అంటూ లోపలి కొచ్చి వారికి ఫోన్ చేశా. రెండు సార్లు ట్రై చేసిం తరవాత గాని లిఫ్ట్ చేయలేదాయన. ఏదో గత్తర్లో ఉన్నట్లున్నారు. చెప్పింది సరిగ్గా విన్నారో లేదో “తర్వాత చూద్దాంలే. డ్యూటీలో ఉన్నా. వీలును బట్టి నేనే కాల్ చేస్తా!” అంటూ ఫోన్ కట్ చేశారు.
నేను బైటికొచ్చి చూస్తే కుర్చీలో మనిషిలేడు. కవర్ అట్లాగే ఉంది బెంచీ మీద!
***
డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చి రిలాక్స్ అయిన తరువాత శ్రీవారికి కవరు చూపించా.
చిర్రుబుర్రులాడుతూ ఓపెన్ చేశారు.. పెద్ద లెటరే ఉంది శుద్ధ మళయాళంలో!
మళయాళం మావారికి రాదు, బిక్కమొగమేశారు అంత పెద్ద పోలీసాఫీసరూ! నవ్వొచ్చింది కానీ.. హస్యాలాడే సమయమా ఇది!
ముక్కూ మొగం తెలీని పెద్దవయసు మనిషి పరగడుపునే చలిలో ఎక్కడి నుంచో ఊడిపడి అర్థం కాని భాషలో రాసున్న చేంతాడంత ఉత్తరం పోలీస్ స్టేషన్లో కాకుండా స్టేషనాఫీసరు ఇంటికొచ్చి ఆయన భార్యకు ఇచ్చిపోవడం.. క్రైమ్ థిల్లర్ ప్లాటుకు మించి ఉత్కంఠ కలిగించింది నాకు. కానీ, శ్రీవారు మాత్రం దీన్నేమంత సీరియస్‌గా తీసుకోలేదు.
“ఇట్లాంటి తింగరి వేషాలు చాలా చూసాలే” అంటూ కవర్ని ఓ పక్కన పారేశారు! అక్కడితో ఆ విషయం ముగిసిపోయింది.
వచ్చే ఫాల్గుణ మాసంలో తన పెళ్ళి.. ఈ నెలాఖర్లో నిశ్చితార్థం.. రావాలంటూ పిలుపులకు వచ్చాడా మర్నాడు సాయంత్రం మిష్టర్ కేశవ్ మీనన్. మీనన్ మావారి పోలీస్ స్టేషన్లోనే సబిన్స్పెక్టర్.
మాటల మధ్యలో హఠాత్తుగా ఆ ఉత్తరం సంగతి గుర్తుకొచ్చింది నాకు. మావారి చెవిలో ఊదితే చిరాగ్గా మొహం పెట్టారు ‘అదింకా ఇక్కడే ఉందా?’ అన్నట్లు.
కానీ ఏ కళ నున్నారో కవర్ అడిగి తీసుకొన్నారు. “మీ మళయాళంలో ఉంది! కాస్త చదివి పెట్టు మీనన్.. మా మహారాణిగారు వేపుకుతింటోంది..” అంటూ మీనన్ కి ఇచ్చారా కవర్ .
ఆయన అందులో నుంచి తీసిన ఉత్తరం ఆసాంతం చదివి చప్పరించాడు అదోలా. “సార్! ఎప్పుడూ ఉండే గోలే! కొడుకు ఆస్తి రాసివ్వమని వేధిస్తున్నాట్ట, ఇవ్వకపోతే నరికేస్తానంటూ బెదిరిస్తున్నాడని గోడు పెడుతున్నాడెవడో ముసిలాడు. అయినా ఇది నెల్లూరు జ్యూరిస్డిక్షన్‌ది సార్.. ఇక్కడి దాకా ఎందుకొచ్చాడో?! .. స్టేషన్లో కాకుండా ఇంట్లో ఇచ్చి పోవటమేంటో.. అంతా పిచ్చోడి వ్యవహారం లాగుంది!” అన్నాడు మీనన్.
“ఆ సంగతి మీ మేడమ్ గారికి చెప్పవయ్యా!” అంటూ కాగితం నా మొహాన పారేసారు శ్రీవారు.
***
నెలాఖర్లో జరగాల్సిన మీనన్ నిశ్చితార్థం ఆగిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయా.
“అదేంటీ! ప్రమోషనొచ్చిందని ఆర్భాటంగా చేసుకుంటున్నాడుగా పెళ్ళి?!” అన్నా ఉండబట్టలేక.
“ఆయన పెళ్ళీ.. ఆయన గోల! మధ్యలో నీ రంధేంటీ?” అని విసుక్కున్నారు కూడా. గమ్మునుండిపోయా నేను.
***
కాస్త నలతగా ఉండి ఇంట్లోనే ఉన్నారా రోజు మావారు.
టీవీలో ఏదో సినిమా వస్తుంటే చూస్తూ కూర్చునున్నాం. వాకిట్లో అలికిడయింది.
వాచ్‌మన్ సాంబయ్యొచ్చి “ఆ ముసలాయన మళ్ళీ వచ్చాడమ్మా! సార్ని కలవాలంట!” అన్నాడు.
రమ్మంటే లోపలి కొచ్చాడా పెద్దాయన. వెంట ఓ పాప కూడా ఉంది. పదేళ్ళుంటాయేమో పిల్లకు. చూడ ముచ్చటగా ఉంది.
మౌనంగా నిలబడ్డ పెద్దాయన్ను కూర్చోమన్నా. ఆయన కూర్చోలేదు. “లేదు తల్లీ! నే పోతాను. పెద్దవారు.. మీ సమయం వృథా చేస్తున్నా! ఏమనుకోవద్దు! ఉత్తరం రాస్తే సరిపోతుంది కాని.. ఒక్కసారి సారును కలిసి మా చిన్ని చేత మొక్కిద్దామని వచ్చా!” అన్నాడు పాప కేసి చూసి.
ముందే చెప్పిపెట్టాడేమో.. పాప ముచ్చటగా ముందు కొచ్చి మావారి రెండు పాదాలను కళ్ళకు అద్దుకుంది. పిల్ల కుడిచేయి మడమ కింద కాలిన గాయాల గుర్తులు!
నివ్వెరపోయా ఆ మచ్చలూ అవీ చూసి. పిల్ల నా కాళ్ళకూ నమస్కరించబోతుంటే ఆపి తల మీద చెయ్యి వేశా దీవించినట్లు.
“ఏమిటిదంతా?” అన్నారు మావారు రవ్వంత కోపం తెచ్చుకొని.
ముసలాయనేమీ మాట్లాడక పోవటంతో నేనే కలగజేసుకొన్నా “నెల్లూరు జిల్లాలో అదేదో ఉర్లో పని చేసేటప్పుడు మీకు కాఫీ టిఫిన్లు సప్లై చేసాట్టగా ఈయన! మర్చిపోయారా? మొన్నా ఉత్తరం ఇచ్చి పోయింది ఈయనే.”
ఆయనగారు కాస్సేపు అయోమయంగా చూసి ఆనక గద్దించారు పోలీసు దర్జాతో “ఆ సంగత్తరువాత గానీ, ముందీ విషయం చెప్పు! నీ ఇంటి గొడవలకు ఇక్కడి దాకా ఎందుకొచ్చావ్? అందులోనూ ఇన్నబద్ధాలా? టోబోకో బోర్డులోనే క్యాంటినుండేది. కాఫీ టిఫెన్లు నువ్వెట్లా సప్లై చేసావ్?”
నా కిదంతా కొత్తగా ఉంది. అయితే ఈ పెద్దాయన చెప్పినవన్నీ అబద్ధాలేనా?! ఇంటి దాకా వచ్చింది ఏ పన్నాగంతో?!
మావారి మాటలకో ఏమో కొయ్యబారిపోయాడా ముసలాయన. ఇంకాస్సేపు అక్కడే ఉంటే ఏమైపోతాడో! నా సైగతో ముసలాయన్ను చల్లగా బైటికి తీసుకెళ్ళిపోయాడు వాచ్‌మన్ సాంబయ్య.
తరువాత వారం రోజులకో ఉత్తరం వచ్చింది కొరియర్లో. అదే గవరు రంగు కవరు.. అదే తరహా చిరునామాతో! సమయానికి ఆయనింట్లో లేరు. నేనే తీసుకున్నా కవరు.
కవర్లోని ఉత్తరం చేంతాడంతుంది! కాకపోతే ఈసారి తెలుగులో! అందులోని వివరాలు క్లుప్తంగా చెబుతా. అసలు కథేంటో అర్థమవుతుంది.
అప్పట్లో మాల్యాద్రి ఊరి పోలీస్ స్టేషన్లో సాధారణ కానిస్టేబుల్ మీనన్. లక్ష కట్నమిచ్చి అతగాడికి కూతుర్నిచ్చాడీ మాల్యాది. మొదట్లో పెళ్ళాంతో బాగానే ఉండేవాట్ట గానీ ఆడపిల్ల పుట్టిం దగ్గర్నుంచి ఆవిడకు అగచాట్లు మొదలయ్యాయిట. మళ్ళీ ఆడబండను మెడకు తగిలిస్తే రోడ్డు మీద పారేస్తానంటూ అస్తమానం బెదిరించేవాట్ట! ఆమె తల రాత బాగోలేదు.. రెండోసారీ కడుపులో ఆడనలుసే పడ్డది. హెడ్- కానిస్టేబుల్‌గా ప్రమోషనొచ్చింది మీనన్‌కి. మరో పెళ్ళి మీదకు మనసు మళ్ళింది అతగాడికి. ఝంఝాటం వదిలించుకొనే దుర్బుద్ధితో గాఢనిద్రలో ఉన్నప్పుడు తల్లీబిడ్డల మీద గ్యాసు నూనె పోసి నిప్పంటించాట్ట! గ్రహచారం బాగుండి ఇద్దరూ కొద్ది గాయాలతో బైటపడ్డారు. కూతుర్నీ మనవరాలినీ ఇంటికి తెచ్చేసుకున్నాడీ మాల్యాద్రి. అల్లుడు మరో పెళ్ళికి తయారవుతున్నాడని తెలిసి రుద్రుడయాడు. తనూ పోతే బిడ్డలు అనాథలవుతారని ముసిలాయన బెంగ. పెళ్ళి ప్రయత్నాలు ఆపడానికి మాల్యాద్రి చేయని ప్రయత్నం లేదు. మీనన్‌ది పోలీస్ డిపార్ట్‌మెంట్ అవటంతో ముసిలాయన మొర ఆలకించిన నాథుడు లేకపోయాడు. మీనన్ ప్రస్తుతం విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడని తెలిసింది ముసలాయనకు. ఈ ఐడియా ఎవరిచ్చారో గానీ.. నేరుగా మావారి దృష్టిలో పడాలని వివరంగా రాసిన ఈ అచ్చ మళయాళ ఉత్తరాన్ని ఇంటికొచ్చి నా చేతిలో పడేలా చూసుకొన్నాడు.
ఆ తరువాత జరిగిన కథ తెలిసిందేగా! పై బాస్ చదవమని ఇచ్చిన ఉత్తరం చదవక తప్పలేదు మీనన్‌కి. ఉత్తరంలోని అసలు విషయం బైట పడితే తనకు మూడడం ఖాయం. అందుకే అతితెలివికి పోయి నోటికొచ్చిన అబద్ధాలు మావారికి చెప్పాడు. ఉత్తరం బాసు దగ్గరే ఉండిపోవటంతో ఎప్పటికైనా ప్రమాదమేనని భయపడ్డాడు. అందుకే రెండో పెళ్ళి కేన్సిల్ చేసుకొని వెళ్ళి మామగారి కాళ్ళు పట్టుకొన్నాడు.
కూతురు కాపురం కుదుటపడ్డ సంతోషంతో తన నాటకానికి క్షమాపణ కోరేందుకే మనవరాలుని వెంటేసుకొని మళ్ళీ మా ఇంటి కొచ్చింది మాల్యాద్రి .
విషయం విన్న మావారు మీనన్‌ని ఇంటికి పిలిపించుకొన్నారు. “నేరగాళ్ళ పనిపట్టాల్సిన వృత్తిలో ఉండీ నువ్వే నేరానికి వడిగడతావా? ఆ చిన్నారిని చూసి ఈసారికి వదిలేస్తున్నా. ముసలాయనతో ఎప్పుడూ టచ్‌లో ఉంటా! మళ్ళీ కంప్లయింట్ గాని వచ్చిందంటే.. తెల్సుగా.. ‘ఫోక్సో’ కింద బుక్కయిపోతావు! ఆ పెద్దాయన రాసిన లెటర్ మాదగ్గరే ఉంది గుర్తుంచుకో! మనుషుల్లా ప్రవర్తించటం ముందు నేర్చుకో!” అని గడ్డి పెట్టేసారు మావారు తలొంచుకొని నిలబడ్డ కేశవ్ మీనన్‌కి.