[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]
మేఘనాదుని జననం:
దశగ్రీవుడు పట్టమహిషి మండోదరితో జలక్రీడ, వనవిహారాది శృంగార రాగప్రోత్థితమైన విన్యాస విన్నాణాలతో ఆనందవార్థిలో తేలియాడుతున్నాడు.
ప్రకృతి ప్రేమపూరితంగా ఆహ్లాదాన్నిస్తోంది.
మండోదరి గర్భవతి అయింది.
లంకానగరం ఉత్సవ శోభతో కళకళలాడసాగింది. రావణుని మనసు పౌరుషవీర్య శౌర్యదర్పాలతో ఉత్తేజితంగా, ఉల్లసితంగా వున్నది.
మండోదరికి నెలలు నిండినై. ప్రసవమైంది. పుత్రుడు జన్మించాడు. పుట్టీపుట్టగానే వాడు మేఘధ్వని వంటి రావంతో ఏడ్వసాగాడు. ఆహ్లాదమయంగా వున్న ప్రకృతి అతలాకుతలమైంది. బాలుని నాదంతో లోకం అట్టిట్టయింది. దశగ్రీవుని హుంకృతితో హెచ్చరికతో శాంతించింది. రావణుడు కుమారునకు మేఘనాదుడు అని నామకరణం చేశాడు! అంతఃపురస్త్రీల సంరక్షణలో, తల్లిదండ్రుల వాత్సల్యంతో మేఘనాదుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు.
తనకు ప్రత్యేకంగా నిర్మింపబడిన మందిరంలో నిద్రకు ఉపక్రమించాడు కుంభకర్ణుడు.
రావణుని త్రిలోక జయేచ్ఛ:
రావణునిలో అసురగుణాలు విజృంభించాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ప్రమత్తతని తాటి ప్రమాణం చేస్తాయి. దానితో వివేక భ్రష్టత్వం కలుగుతుంది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి దురాగతాలు చేయసాగేడు. తోటల్ని చూస్తే ఝంఝా మారుతంలా వృక్షాల్ని కూల్చేశాడు. సరస్సుల్ని, ఏరుల్నీ మదపుటేనుగులా కలచివేశాడు. కొండల్ని పిండిచేశాడు. నందనోద్యానాన్నీ, దాని సౌందర్యాన్నీ రూపుమాపాడు. దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష సమూహాల్ని యాతనలకు గురి చేశాడు. స్త్రీలను చెఱబట్టి, సాధువుల్ని హింసించాడు.
ఈ దుష్టచేష్టల్ని గ్రహించాడు, కొన్నిటిని చూశాడు – కుబేరుడు. తమ వంశ ప్రతిష్ఠను నాశనం చేస్తున్న తమ్ముడిని మందలించే వుద్దేశ్యంతో దూతను పంపాడు. అతను వెళ్ళి కుబేరుని మాటల్ని రావణునికి యథాతథంగా విన్నవించాడు. ఆ కుబేరుని మాటలు ఇలా ఉన్నాయి –
‘తమ్ముడూ! మన వంశ చరిత్రను భ్రష్టు పట్టిస్తున్నావు. నేను నీవు నాశము చేసిన నందనవనాన్ని చూసి చాలా ఖేదపడినాను. ఋషులను చంపినట్లు, స్త్రీలను చెఱపట్టినట్లు విన్నాను. దేవతలు తమకు జరుగుతున్న హానికి నీ మీద పగబట్టి, నిన్ను సంహరించాలని చూస్తున్నట్లు నాకు తెలిసింది. కేవలము దృష్టిదోషము వల్లనే ఎంతటి విపరిణామం ఎదురవుతుందో నాకు తెలుసు. నా స్వానుభవం చెబుతాను విను..
‘రుద్రుని అనుగ్రహాన్ని కోరి వ్రతదీక్షతో, నియమనిష్ఠలతో ధర్మాన్ని ఉపాసించటానికి నేను హిమవత్ పర్వతానికి వెళ్ళాను. ఈ సందర్భంలో పార్వతితో కూడివున్న పరమేశ్వరుని చూశాను. దైవవశాన నా ఎడమకంటి చూపు పార్వతీదేవిపై ప్రసరించింది. ఆమె అసాధారణ సౌందర్యరూపంతో దివ్యతేజంతో వున్నది. ఆమె నా దృష్టిని పసిగట్టి, తన ప్రభావాన్ని చూపింది. కేవలము, ఏ దుశ్చింతా లేకుండా చూసిన నా చూపు వలన ఆమె నా ఎడమకన్నును దగ్ధం చేసింది. దాని ప్రకాశమంతా బూడిద చల్లినట్లు పింగలత్వాన్ని పొందింది. నా పాపపరిహారం కోసం ఆ పర్వతం మీదనే నేను ఎనిమిది వందల సంవత్సరాలు మౌనవ్రతం చేసి శివుని మెప్పించాను. (ఈ వ్రతాన్ని కేదారగౌరీవ్రతమని చెబుతారు.) ఆ దేవదేవుడు కరుణించి తన స్నేహహస్తాన్ని ప్రసాదించాడు. ‘ఏకాక్షి పింగలి’ అనే పేరుని స్థిరం చేశాడు. దేవీదేవుల కినుక భరింప శక్యము కాదు. నీ దుశ్చర్యలు మానమని కోరుతున్నాను’
దూత మాటలు విని రావణుడు ఉగ్రుడైపోయాడు. కుబేరుని హితవచనాలకు వక్రభాష్యం చెప్పుకున్నాడు. “ఈ మూఢుడు, తన ఘనతనూ, తాను పరమేశ్వరుని మైత్రిని సంపాదించుకున్నాననే గర్వాన్నీ నాకు తెలుపుతున్నాడు” వంటి ఆలోచనల్ని మనసున పొంగించుకుని హుంకరించాడు. ‘ఆ లోకపాలకుల్ని సంహారించాల్సిందే’ అంటూ ‘ముందు ఈ వార్తాహరుని అంతం చేసి అందరినీ హెచ్చరించాలి’ అనుకుంటూ దూతని ఠక్కున సంహరించేశాడు. విభీషణాదులు నిర్విణ్ణులై నిలిచారు.
రావణుడు ముల్లోకాల్ని జయించి చూపుతానని ఉద్రేకంతో ఊగిపోతూ బయల్దేరి వెళ్ళిపోయాడు. అతని తొలి గమ్యం కుబేరుడి అలకాపురమే! అయితే ఈ రావణాయనానికి ముందు..
రావణుని జైత్రయాత్రలు:
రాత్రి – ప్రకృతి, మనోజ్ఞమైన దృశ్యాల్ని వెలారుస్తున్నది. శాసనకర్తకు విధేయతతో భోగభాగ్య సౌందర్య సంతోషాలు లంకేశ్వరుని ఆహ్లాదపరుస్తున్నాయి.
అంతఃపుర భవన సమూహంలో రావణ శయనమందిరం. పట్టమహిషి మండోదరి. అందాలకు అందాలు కూర్చే రాగరసరాశి. సరససల్లాపాల్లో తను, మాన, మానసప్రాణాలు ఏకమయ్యే వున్నాయి. శృంగారాధిదేవత ఒకింత పక్కకి జరిగింది. ఓరకంట నాథుని చూసి, గోముగా అడిగింది; ‘మీ దండయాత్ర ప్రయత్నం గురించి తెలిసింది స్వామీ. ఒక్క సందేహం’. ‘ఏమది?’ అన్నట్టు కన్ను గీటేడు. ‘కయ్యానికి సమత్వం కావాలంటారు కదా! వారితో ఈ వైరం అవసరమా’ అని, నసిగింది. ఠక్కున లేచి నిలబడినాడు లంకానాథుడు. కనుగవలో సెగ రగిలింది. తీవ్రాక్షుడైనాడు. ‘రసరమ్య సన్నివేశంలో అప్రస్తుత ప్రమేయం అని హుంకరించి, రాచకార్యంలో తమ చొరబాటు తగనిది ఈసారికి..’ అని తల విదిలించి, ‘సరే’ అంటూ పదఘట్టనతో విసురుగా వెళ్ళిపోయాడు.
మర్నాడు –
స్వస్త్యయనాదుల్ని జరిపించుకున్నాడు. మహోదర – ప్రహస్త- మారీచ- శుక, సారణ – ధూమ్రాక్షులతో కలిసి జైత్రయాత్రకు కదిలేడు. వారంతా సచివులు- ధూమ్రాక్షుడు అరివీరభయంకరుడైన యుద్ధవీరుడు.
వారంతా కుబేరునిపై దండెత్తి రణరంగంలో ఉత్సాహంతో వీరంగం చేయసాగారు. యక్షుల అధిపతి కుబేరుడు. మహావీరుడైన సంయోధ కంటకుల వంటి యక్షవిక్రములు అందరూ – ‘పోయిన వారలెల్ల చనిపోయినవార’ని వార్తలు రాసాగేయి. కడకు మణిభద్రుడు, శుక్రుడు, ప్రౌష్ఠపదుడు వంటి మహామంత్రులతోనూ, పద్మము, శంఖము వంటి నిధుల అధిష్ఠాన దేవతలతోనూ కలిసి వచ్చి తానే రాక్షస సేనను, రావణుని ఎదుర్కొన్నాడు కుబేరుడు.
రావణ ప్రతాప ఝంఝా విజృంభణకు, ఈ మహామహాయోధులంతా దెబ్బతిని రణవిముఖులై వెళ్ళి పోయారు,. సూర్యాస్తమయం అయింది. ఆనాటి పోరుకు విరామం.
రాక్షస సేన తాగి తూలటంలో, తిని త్రేన్చటంలో కోలాహలం చేస్తున్నారు.
చూశాడు కుబేరుడు. రావణుడు మదిరాపానం చేస్తూ కమ్మతెమ్మెరల్ని ఆహ్లాదిస్తున్నాడు.
దగ్గరగా వచ్చి నిలిచాడు. అయిష్టంగానే, తాను చెప్పదలచుకున్నది- హితవుని- చెప్పసాగేడు.
“రావణా! నేను నివారిస్తున్నా, దుర్బుద్ధితో ఈ యుద్ధానికి తలబడివచ్చావు. దీని ఫలితం కాలవశం వలన తర్వాత తెలుసుకుంటావు. మూర్ఖుడు, మందబుద్ధుడు విషం తాగి, జీర్ణించుకోలేని ప్రాణాంత దుస్థితిలోనే దాని ఫలితాన్ని తెలుసుకుంటాడు. కానీ, అప్పటికి సమయం మించిపోతుంది. ధర్మసమ్మతమైన పనులు చేస్తే పితృదేవతలూ, దేవతలూ సంతృప్తి చెందుతారు. నీవు సాగిస్తున్నవన్నీ దుశ్చర్యలు. చేసిన దుష్కర్మఫలం మొత్తక తప్పదు. నా మాట విని వెళ్ళిపో. కోరి, వినాశనాన్ని తెచ్చుకోకు”
ఇది విని, రావణుడు వికటాట్టహాసం చేశాడు. ‘కనలిన కోప వేగంతో’ కన్నుల నిప్పులు రాలుస్తూ, గదనెత్తి కుబేరుని కొట్టాడు. కుబేరుడు తనను తాను నిలవరించుకొని లంకేశునిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దశగ్రీవుడు తన వారుణాస్త్రంతో దాన్ని నిరోధించుకున్నాడు. అప్రయత్నంగా మొదలైన, పోరు భీకరమూ, భయంకరమూ అయింది.
కుబేరుని విజృంభణను తట్టుకోవటానికి తన ఇచ్ఛారూపధారణ శక్తివలన రావణుడు – వ్యాఘ్రంగా, మేఘంగా, పర్వతంగా, వృక్షంగా, యక్ష, దైత్య వీరునిగా – రూపాల్ని పొంది, ధనాధిపతి ధైర్యస్థైరాల్ని కకావికలు చేశాడు. చివరికి గదాయుద్ధంలో కుబేరుని శిరస్సుపై తీవ్రఘాతాన్నిచ్చాడు.
కుబేరుడై ఆ గదాహతికి రక్తసిక్త దేహంతో కుప్పకూలాడు. వెంటనే పద్మాది నిధ్యధిష్ఠాన దేవతలు ఆతని చుట్టూ చేరి, భద్ర వలయంతో నందనవనానికి తీసుకువెళ్ళారు.
యుద్ధం ముగిసింది.
రావణుడు విజయోత్సాహంతో ధనపతి దివ్యవిమానాన్నీ, పుష్పకాన్ని సంగ్రహించాడు.
పుష్పకాన్ని చేరువగా వెళ్ళి చూశాడు. ఆశ్చర్యానందాలతో రెప్పవేయక పరిశీలిస్తూ నిలిచాడు.
పుష్పకం విస్తృతమైన వైశాల్యం కలిగివుంది. సర్వసౌభాగ్యాల నిధానంగా వుంది. అసామాన్య సృష్టి ఘనంగా కనిపిస్తున్నది. విశ్వకర్మ దీన్ని అపురూపంగా నిర్మించాడు. పద్మినీ జాతిస్త్రీ మూర్తులు మూలమూలల స్తంభాలై నిలిచివున్నాయి. రావణుడి యెదకు చలిమంటగా తోచాయి. మేటి రాయంచలు ఆ విమానానికి రెక్కలాన్చి ఎత్తి నిలిపాయి. భూమీ, ఆకాశం రెండూ వాటి వాటి వర్ణమిశ్రమాన్ని దీనికి అలదినట్లున్నది. ఉద్యానవనాలు, సరస కల్హార కాసార కరదమెందుకూ, బంగారుగనికి బంగారాన్ని పంపటమెందుకూ – అన్నట్లు స్వర్ణమణిమయ కాంతుల్ని ప్రసరిస్తున్నది. విహంగాలు, జంతుజాలాలు, విచిత్ర రూప చిత్ర సమూహం, శిల్పాకృతులు దిగ్భ్రమ గొలుపుతున్నాయి. విశ్వంలోని భోగభాగ్య విభవాలన్నీ తెచ్చి రాశి పోసినట్లున్నాయి. అనేకానేక ఆలేఖ్యాల మధ్య మంగళ గజలక్ష్మి కూడా అమరి వున్నది. వాతానుకూలంగా, సమశీతోష్ణస్థితితో పరమాహ్లాదాన్ని పంచుతున్నది. గమనాగమన నియంత్రణకు సారథికి అనుకూలంగా వున్నది. ఈ మహద్దర్శనానికి, తన ప్రతిష్ఠార్జితానికి ముగ్ధుడై దానిలోకి ప్రవేశించి బయల్దేరాడు.
..పుష్పకం పయనిస్తున్నది. భూనభోంతరాలు సుందరతర ప్రకృతిని నయన మనోహరంగా దృశ్యమానం చేస్తున్నాయి.
మహాసేనుడి జన్మ స్థలమైన శరవణ వైపు వెళుతున్నది పుష్పకం. పర్వత శిఖరాల నుండి కిందికి చూస్తే దేదీప్యమానంగా, స్వర్ణకాంతిని ప్రసరిస్తూ ఒక ఉద్యానవనం కనిపించింది. పుష్పకం గమనం ఠక్కున ఆగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ‘సారధి ఇచ్ఛానుసారం గమనాగమన నియంత్రణ కలిగిన ఈ విమానం ఎందుకు నిలిచింది’ అని క్రోధంతో హుంకరించాడు రావణుడు.
మారీచుడు ఏదో వివరణని ఇవ్వబోయేంతలో,
కైలాస పర్వత ప్రకంపనం: రుద్రవీణ:
“రావణా! వెనుకకు మరలిపొమ్ము. ఇది కైలాసపర్వతము. శంకరుడు పార్వతీసమేతుడై క్రీడిస్తున్నాడు. ఈ సయయంలో – పక్షులు, నాగులు, దేవ గంధర్వులు, రాక్షసులతో సహా ఏ ప్రాణులూ ఈ పర్వతం మీదికి రాకూడదు. ఇది శివునాజ్ఞ. శాసనం. పాటించని వారు నశిస్తారు” అని దృఢంగా ఎవరో పలికేరు.
క్రోధతామ్రాక్షుడైనాడు దశగ్రీవుడు. ఠక్కున విమానం దిగి “ఎవడురా శంకరుడు, నీవెవడవురా?” అంటూ అతని ఎదుట నిలిచి గద్దించాడు. అతన్ని పరిశీలనగా చూశాడు. ముఖం వానరరూపం. ధూసరవర్ణదేహం, పొట్టి. ముండిత శిరస్కుడు. వికృతంగా, భయంకరంగా వున్నాడు. అతడే అపర శివావతారం – నందీశ్వరుడు.
నందిని చూసి, ప్రత్యేకించి అతని ముఖాన్ని చూసి రావణుడు వికటంగా నవ్వేడు. ఆ నవ్వు మేఘగర్జనలా వున్నది. నందీశ్వరుడు న్యూనతా భావనతో, కోపంతో – రావణుని శపించాడు ఇలా: “నా వానర రూపాన్ని చూసి పిడుగుపాటు నవ్వుతో, హేళనగా నన్ను అవమానించావు. నారూపము, నా పరాక్రమము కలిగిన వానరులే నిన్నూ, నీ రాక్షసకులాన్నీ నశింపచేయటానికి వస్తారు. వారంతా అసహాయశూరులు. దృఢకాయులు. వజ్రసదృశ నఖ దంష్ట్రాయుధాలు కలిగి శత్రుంజయులుగా విజృంభించగల వారు. వారంతా నిన్నూ నీ పరివారం, సకలాన్నీ తుది ముట్టిస్తారు. జాగ్రత్త” అని, “నిజానికి నిన్ను నేనే ఇక్కడికిక్కడ ఇప్పుడే సంహరింపగలను. కానీ, నీ పాపకర్మల చేత, దుష్కార్యాల చేత లోకనిందచేత, నీవు చచ్చే వున్నావు. చచ్చిన వానిని చంపుట నీచకార్యము. అందుకే వదిలేస్తున్నాను. పో” అని తృణీకరించి ‘ఛీ’ కొట్టేడు.
దశాననుడు అతి రౌద్రాకృతితో నందిని హెచ్చరించాడు, “నా గమనాన్ని నిరోధించిన ఈ పర్వతాన్ని పెకలించివేస్తాను. నీవూ, నీ ప్రభువూ చేసిన అవమానానికి ఫలాన్ని అనుభవిస్తారు. ఈశ్వరుని జయించకుండా, మిమ్మల్ని చంపకుండా ఈ దశగ్రీవుడు ఇక్కడినుండి వెడలడు” అని ఆ మహాపర్వతం మూలాన్ని పట్టుకుని, భుజాల్ని పట్టి ఎత్తసాగేడు!
పర్వతం కంపించింది. ప్రమథగణాలు వణికేయి. పార్వతి చలించింది. భయంతో ఈశ్వరుని కౌగిలించుకొంది. జరుగుతున్నదేమో త్రినేత్రుడికి తృటిలో అర్థమైంది. పార్వతిని అనునయ పూర్వకంగా చూసి, కాలిబొటనవ్రేలితో పర్వతాన్ని కిందికి నొక్కేడు!
ఇరువది చేతులవాడు భుజాలు నలిగి ఉక్కిరి బిక్కిరికాగా తీవ్రమైన రావంతో బిట్టరవసాగేడు. దశదిశలూ ఆ ఏడుపుతో ప్రతిధ్వనించాయి. ఇంద్రాదులు ఉలిక్కిపడి నిర్విణ్ణులైనారు. సముద్రాలు పొంగినై. పర్వతాలు కదిలినై. యక్షకిన్నర సిద్ధసాధ్య గణాలు నివ్వెఱపోయారు.
రాక్షసవీరుని రావం వేయిసంవత్సరాలు సాగింది.
అప్పుడు, ఆ పరమేశ్వరుడు కరుణించి ప్రత్యక్షమైనాడు. రాక్షసుని భుజాల్ని సడలింపజేసి, “భయంకరమైన, అసాధారణరావంతో ఇన్నేండ్లు నన్ను స్మరించావు. కనుక, లోకాలు ఇక నిన్ను రావణుడుగా గుర్తించి, ఆ పేరున పిలుస్తాయి. ఆ పేరుతోనే నీవు ప్రసిద్ధుడవవుతావు” అని ప్రకటించాడు.
రావణుడు పరమేశుని వరమిమ్మని ప్రార్థించాడు. సరే కోరుకొమ్మన్నాడు శివుడు. ‘నాకు ఆయుర్దాయశేషాన్నీ, మహిమాన్వితమైన ఒక శస్త్రాన్నీ మాత్రం ఇమ్మ’ని కోరేడు. శంకరుడు చంద్రహాసమనే శస్త్రాన్ని ప్రసాదించి, “దీనిని నీవు అవమానించకూడదు. అవమానిస్తే అది నిన్ను వీడి నా వద్దకు వచ్చేస్తుంది” అని హెచ్చరించి, అకాలమృత్యువు రాకుండా వరాన్నీ అనుగ్రహించాడు.
రావణుడు పుష్పకాన్ని ఎక్కి లంకకు వచ్చేశాడు.
పరమేశ్వర వరస్వీకారంతో మళ్ళీ పాపకృత్యాలు చేయటంలో రెచ్చిపోయాడు రావణుడు.
కాలం గడుస్తున్నది.
***
రావణుడిప్పుడు స్వేచ్ఛాసంచారియైనాడు. భూలోకమంతా తన లోకంగా తిరుగుతున్నాడు. స్థావరజంగమ ప్రకృతిపదార్థ సంచయమంతా తన సొత్తే అన్న దీమసం వున్నది కదా! అది పలువన్నెలు పోతున్నది. సుందరము, అనుభవైకవేద్యము అన్నదంతా గ్రహించి అనుభవిస్తున్నాడు. కన్యల్ని చెరపట్టి అంతఃపురానికి చేర్చి మోహపారవశ్యంతో వారి మానహరణం చేస్తున్నాడు. సాధుజనుల్ని రాపాడించి ఆ దురాగతాలకు అట్టహాసం సలుపుతున్నాడు.
పుష్పకం అతని సంచారానికి అనువైన వాహనమైంది. అదొక దర్పహేతువు!
(సశేషం)
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. ఫోన్: 9848025600
