Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తర రామచరిత-1

[‘ఉత్తర రామచరిత’ను వచన రూపంలో సరళ సుందరంగా అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో అందిస్తున్నారు శ్రీ విహారి గారు.]

నాంది:

శ్రీ రామాయణంలో పూర్వభాగం ముగిసింది. దుష్టశిక్షణ శిష్టరక్షణ జరిగింది. పౌలస్త్యవధ, సీత మహద్వంతమైన చరిత గడ్డకెక్కాయి. శ్రీ సీతారామ పట్టాభిషేకం త్రిజగన్మోహనంగా అందరికీ ఆనందాన్ని కలిగించింది.   శ్రీరామరాజ్యం సుప్రతిష్ఠితమైంది.

***

శ్రీమన్నారాయణ సంసేవనం జరుగుతోంది. ఆ నాదం సరయూ నదీ తరంగాలపై కదలి, గాలి అలలపై తేలి, ప్రకృతిలో సాగి వచ్చి వాతావరణాన్ని ఆహ్లాదమయం చేస్తున్నది.

అప్పుడే రాచకార్యాల నిర్ణయాలు పూర్తిచేసి ఆంతరంగిక మందిరానికి వెళ్ళే ప్రయత్నంలో వున్నాడు శ్రీరామచంద్రమూర్తి.

ద్వారపాలకుడు వార్త తెచ్చాడు. ముని సమూహం ప్రభువుని చూడటానికి వచ్చారు. శ్రీరాముడు లేచి, ఎదురేగి వారిని సాదరంగా లోనికి తోడ్కొని వచ్చాడు. అందరూ కూర్చున్నారు. కుశల ప్రసక్తి అయింది. అగస్త్యుడు పరిచయాల్ని మొదలెట్టాడు.

కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, కణ్వుడు, మేధాతిథి పుత్రుడు – గాలవుడు తూర్పు దిక్కు నుండి వచ్చారు. స్వస్తికరుడైన ఆత్రేయుడు, ప్రముచి, నముచి, సుముఖుడు, అత్రి, విముఖుడు, (తాను) మహర్షి అగస్త్యుడు – దక్షిణ దిక్కువారు. కవషుడు, ధౌమ్యుడు, రౌద్రేయుడు, దృషదుముని – పడమటి దెస నుండి వచ్చారు. కశ్యపుడు, వశిష్ఠుడు, జమదగ్ని, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, భరద్వాజుడు – సప్తర్షులు కదిలివచ్చారు. వశిష్ఠుడు అయోధ్యలోనే వున్నాడు! అయినా సప్తర్షులలో ఆరాధనీయుడు. అందుకూ ప్రత్యేకమైన ఉటంకింపు. ఈ సమూహంలో చేరాడు. వీరంతా ఉత్తరదిశ వారు. మునులందరూ అగ్నితేజులు, మహాత్ములు, మహనీయులు!

ప్రస్తావన:

మునులందరికీ నాయకునివలె అగస్త్యుడు శ్రీరామ ప్రశంసను అందుకున్నాడు. రావణవధ వృత్తాంతాన్ని పునఃవచిస్తూ – పుత్రమిత్రబాంధవ సహితంగా రాక్షస సంహారం చేసిన శ్రీరామప్రతాపవిక్రమ పరాక్రమాల్ని ప్రస్తుతించాడు.

అవన్నీ ఒక యెత్తుకాగా -ప్రళయకాలయముడు మోసకారి, పరమక్రూరుడు, సురవిజేత – ఇంద్రజిత్తుని సంహరించటం ఒక్కటీ ఒక యెత్తు- అని ప్రత్యేకంగా ప్రస్తావన చేశాడు!

అలాంటి క్రూరరాక్షసుల్ని నిర్జించి, సుఖప్రదంగా, శాంతిప్రదంగా ప్రజాపాలన చేస్తున్న శ్రీరాముని ఘనతను అభినందించటానికే ఇలా వచ్చామని చెప్పాడు. తక్కిన వారంతా అదే మాట కలిపారు.

శ్రీరామునికి ఆశ్చర్యం కలిగింది. “రావణుడు సరేసరి! మత్తుడు, దేవాంతకుడు, ఉన్మత్తుడు, మహోదరుడు, వికటుడు, మకరాక్షుడు – ఎవరికి, వారు వారంతా యుద్ధంలో మృత్యుదేవతను మించిన శక్తిమంతులు. వారందఱినీ ప్రక్కన బెట్టి మేఘనాదుని అధికుని చేసి పొగడుతున్నారు. చిత్రంగా వుంది. తండ్రి కంటే, వీరందరికంటే వాడు శౌర్య ధైర్యాల్లో మిన్నయైన వాడా? అయితే, ఎట్లా అయ్యాడు? నాకు చెప్పటానికి అభ్యంతరం లేకపోతే చెప్పండి” అని వినయంగా వేడుకున్నాడు.

అగస్త్యుడు చిరునవ్వు నవ్వేడు. “ఎందుకూ? నీకు తెలీదా స్వామీ, నా నోట విందామని కాకపోతే!” అని, “సరే. అసలు రావణాది రాక్షసుల జన్మవిశేషాలు చెబుతాను. వాటిలో భాగంగానూ, ప్రత్యేకంగానూ కూడా ఇంద్రజిత్తు ఘనతని తెలుపుతాను” అని ఆ చరిత్రను చెప్పటం ప్రారంభించాడు.

పులస్యుడు బ్రహ్మమానసపుత్రుడు. బ్రహ్మర్షి, ప్రజాపతి. మేరు పర్వతం పార్శ్వంలో వున్న తృణబిందు ఆశ్రమంలో ఆయన నివాసం. అక్కడికి తరచుగా నాగకన్యలు, అప్సరసలు, ఋషికన్యలు రాకపోకలు చేస్తూ వుండేవారు. ఈయన తపస్సుకు విఘ్నం కలుగుతూ వుండేది. ఒకసారి కోపంతో – ‘నా కంటబడిన స్త్రీ గర్భవతి అవుతుంది’ అన్నాడు. ఒకరోజు తృణబిందు మహర్షి కూతురే ఆయన కంటబడింది. గర్భం ధరించింది. తండ్రి పులస్త్యుని వేడుకున్నాడు – తన పుత్రికను భార్యగా స్వీకరించమని. పులస్త్యుడు అంగీకరించాడు. ఆమెకు ‘పౌలస్త్యుడు’ జన్మించాడు. వేదాధ్యయనం చేస్తుండగా విని జన్మించటం వలన తండ్రి అతనికి ‘విశ్రవుడు’ అని పేరు పెట్టాడు. విశ్రవుడు – ‘శ్రుతిమాన్‌, సమదర్శీ చ వ్రతాచార రతస్తథా/పితేవ తపసాయుక్తోహ్యభవిత్‌’ (వేదవిదుడు, సమదర్శి, వ్రతాచారరతుడు, తండ్రి వలె తపఃశాలి)!!

విశ్రవసుకు వైశ్రవణుడు జన్మించాడు. ఇతడే కుబేరుడు. ధర్మాచరణ పరాయణుడుగా ప్రసిద్ధి పొందాడు. మహాతపశ్శాలి. ఆయన తపోదీక్షకుమెచ్చి బ్రహ్మవరాల్ని పొందాడు. అవి- ఒకటి యక్షుల నాయకత్వం, రెండు – ధనాధిపత్యం. అలా ఆయన – ఇంద్ర వరుణ, యములకు తర్వాతి వాడుగా – ధనపతి, నిధిపతి ఐనాడు. ఈయనకు లోకసంచారానికి పుష్పకవిమానాన్నీ ఇచ్చాడు. వైశ్రవణుడు తండ్రి విశ్వవసుతో తనకు నివాసస్థానం ఏర్పాటు చేయమని కోరేడు. విశ్వకర్మ చేత స్వర్ణలంకను నిర్మింపజేసి కుమారునకు బహూకరించాడు తండ్రి. అలా స్వర్ణలంక కుబేరుని రాజధాని అయింది.

రాక్షస వంశోత్పత్తి:

హేతి, ప్రహేతి సోదరులు. రాక్షసనాయకులు. బ్రహ్మశాపం కారణంగా పుట్టినవారు. వీరిలో ప్రహేతి పరమ ధార్మికుడు. తపోదీక్షకై వెళ్ళిపోయాడు. హేతి యముని సోదరి ‘భయ’ అనే ఆమెను వివాహమాడాడు. వీరికి  విద్యుత్కేశుడు పుట్టాడు. ఇతని భార్య సంధ్యాపుత్రిక. ఈమెకు ‘సాలకటంకట’ అని మరో పేరు. వీరికి సుకేశుడు జన్మించాడు. వారు వీణ్ణి మందర మీద పారేసి వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు యదృచ్ఛా విహారులై వెళుతూ వీణ్ణి చూసి, సద్యోయౌవనుని చేసి వరాలిచ్చి వెళ్ళారు.

సుకేశుని భార్య దేవవతి. వీరికి మాల్యవంతుడు – సుమాలి- మాలి అని ముగ్గురు కుమారులు. ఇదీ రాక్షస స్వభావుల మొదలు!! ఈ ముగ్గురూ కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మవరాల్ని పొందారు. శత్రునాశకులుగా, అజేయులుగా, చిరకాలం జీవించే వారుగా వారికి వరబలం సిద్ధించింది. ఆ బలగర్వంతో సురల్ని బాధించటం మొదలెట్టారు. లంకాపురి గురించి విన్నారు. దాన్ని తమ నివాసంగా చేసుకున్నారు. నర్మద అనే రాక్షస స్త్రీ పుత్రికలైన హ్రీదేవి, శ్రీదేవి, కీర్తిదేవి- అనేవారిని వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని వివాహమాడి క్రీడించసాగారు.

మాల్యవంతుడికి – సుందరి మరొక భార్య. వీరి సంతానం- కుమారులు వజ్రముష్టి, విరూపాక్షుడు, దుర్ముఖుడు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మత్తోన్మత్తుడు, కుమార్తె అనల.

సుమాలికి కేతుమతి అని మరో భార్య. వీరి సంతానం పుత్రులు – ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలికాముఖుడు, ధూమ్రాక్షుడు, దండుడు, సుపార్శ్వుడు, సంహద్రి, ప్రఘసుడు, భాసకర్ణుడు, కుమార్తెలు – పుష్పోత్కట, కైకసి, కుంభీనసి.

మాలికి వసుద అనే గంధర్వకాంత భార్య. వీరి సంతానం కుమారులు – అనలుడు. అనిలుడు, హరుడు, సంపాతి, విభీషణుడు.

ఈ రాక్షసజాతి అందరూ కలిసి దేవతల్ని పీడించసాగేరు. దేవతల సహనానికీ, ప్రతిఘటనకూ పరీక్ష మొదలైంది. వెళ్ళి శివునికి మొరపెట్టుకున్నారు. ఆయన విష్ణువును ఆశ్రయించమన్నాడు. విష్ణుమూర్తి వారి కోర్కెను మన్నించి కదిలేడు. దేవదానవయుద్ధం అతిభీకరంగా జరిగింది. యుద్ధంలో మాలి హతుడైనాడు. మాల్యవంతుడు విష్ణుమూర్తిని కవ్వించి, శక్తి ప్రయోగంతో రెచ్చిపోయాడు. విష్ణువు తీక్షణుడై విజృంభించాడు. గరుత్మంతుడు తన రెక్కల ధాటితో మాల్యవంతుని ఎగరగొట్టాడు. దానితో వాడూ సుమాలి – మిగిలిన అనుచరులతో రసాతలానికి పారిపోయారు.

కొంతకాలం గడిచింది. మాల్యవంతుడు, సుమాలి – రాక్షసాదులు రసాతలం నుండి వచ్చి భూలోకంలో స్వేచ్ఛగా తిరుగసాగారు. సుమాలి కుమార్తె కైకసి. అవివాహిత. ఆమెతో సంచరిస్తూ ఈ సుమాలి కుబేరుని చూశాడు. అతని వైభవం చూసి ఈర్ష్య కలిగింది. వీడు విశ్వవసుడి పుత్రుడిగా పుట్టటం వలన కదా ఇంతటి వైభోగం అనిపించింది. కుమార్తెకు విశ్రవసుని చూపి అతన్ని వరించమని సూచించాడు.

కైకసి విశ్రవసు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంది. మిగిలిన వివరాల్ని ‘నీ తపః ప్రభావంతో నీవే తెలుసుకోగలవు’ అన్నది గడుసుగ, విశ్రవసు ఆమె వాంఛితాన్ని గ్రహించాడు. ‘నీ వాంఛితం నెరవేరుతుంది కానీ, కాలవిశేషం చేత నీకు భయంకరులైన క్రూరరాక్షసులు జన్మిస్తారు’ అని చెప్పాడు. కైకసికి భయం కలిగింది. అంజలి ఘటించి వలదని వేడుకుంది. విశ్రవసుడు కరుణించి ‘పెద్దవారిద్దరూ అలా జన్మించినా, మూడవవాడు ధర్మమూర్తిగా, వంశోద్ధారకుడుగా జన్మిస్తాడు’ అని ఊరడించాడు.

ఇదీ నేపథ్యం,

కైకసికి ‘దశగ్రీవుడు’ ‘కుంభకర్ణుడు’ ‘శూర్పణఖ’ ‘విభీషణుడు’ జన్మించారు. రావణ కుంభకర్ణులు రజస్తమోగుణాలు మూర్తీభవించిన వారు, విభీషణుడు సత్త్వమూర్తి అయ్యారు.

కాలం గడుస్తున్నది. ఒకసారి కుబేరుడు తండ్రిని చూడటానికి పుష్పకం మీద వచ్చాడు. కైకసీ అక్కడ వున్నది. ఆమె కుబేరుని దివ్యతేజస్సుని చూసి ఆశ్చర్యపోయింది. అతని భార్య శుభాంగినీ చూసింది. ‘నీవూ అతనంతటివాడివి కావాలి’ అని రావణునికి తన కోరికను వెల్లడిరచింది. తల్లికి రావణుడు ‘అలాగే’ అని మాట ఇచ్చాడు.

ఈమె దుర్బోధకు తోడు, మాల్యవంతుడు, సుమాలి విష్ణువు వలన రాక్షసులకు కలిగిన అపజయం గురించీ స్థాన చలనం గురించీ చెప్పి విద్వేషాన్ని పెంచారు. రావణుడు – తమ్ములతో కలిసి గోకర్ణంలో తపోదీక్ష వహించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు కోరుకొమ్మన్నాడు.

రావణుడు ‘నన్ను పక్షులు, నాగులు, యక్షరాక్షస దైత్య దానవ దేవత లెవ్వరూ చంపకుండా వరమి’మ్మని కోరుకున్నాడు. బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత కోరికకు – అగ్నివ్రేల్చిన శిరస్సుల్నీ పునర్జీవింపజేశాడు బ్రహ్మ. విభీషణుని ‘వరం’ కోరుకొమ్మన్నాడు బ్రహ్మ. విభీషణుడు ధర్మపరుడు కనుక తన బుద్ధి ధర్మంలోనే స్థిరంగా వుండేటట్టు చేయమని ప్రార్థించాడు. ఆయనకు ఆ వరం లభించింది. కుంభకర్ణుని కూడా వరవాంఛితం చెప్పమన్నాడు బ్రహ్మ. దేవాది దేవులంతా అడలిపోయి హఠాత్తుగా రంగం మీదకు వచ్చారు. కుంభకర్ణుని దుర్మతిని చెబుతూ, ‘ఇతడు నందనవనంలో ఏడుగురు అప్సరస్త్రీలను, ప్రతిఘటించిన మహేంద్రుని అనుచరుల్ని, ఋషుల్ని, మనుష్యుల్ని కూడా భక్షించేశాడు. వీనికి వరాలిచ్చి లోకాలకు చేటు తేవద్దని వేడుకున్నారు. ‘వరం అనే మిషతో వీనికి మోహం కల్పించ’మన్నారు. బ్రహ్మ సరస్వతిని కుంభకర్ణుని వాణివి కమ్మని కోరేడు. వాణి అంగీకరించింది. ఆ ప్రభావంతో కుంభకర్ణుడు తనకు అనేకానేక వర్షాలు నిద్రించే వరాన్ని ప్రసాదించమని కోరేడు. ‘అట్లే అగుగాక!’ అని అంతర్థానమైనాడు బ్రహ్మ. దేవతలంతా ఊపిరిపీల్చుకున్నారు. కుంభకర్ణుడికి స్పృహ కలిగింది. మాట జారినందుకు, తన పొరపాటుని గ్రహించాడు. అదే గ్రహపాటయింది. తామస ప్రవృత్తి ఆవహించింది.

సోదరులు ముగ్గురూ శ్లేషాత్మక వనానికి వెళ్ళి సుఖనివాసులైనారు.

కుబేరునిపై రావణ విజయం:

రావణుడూ, సోదరులూ వరస్వీకర్తలైనారని తెలిసి సుమాలి తన మంత్రులైన మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు వంటి అనుచరులతో రసాతలం నుండి పైకి వచ్చాడు.

సుమాలి రావణుని అభినందిస్తూ ‘మహావిష్ణు భయంతో పారిపోయి మేమంతా రసాతలంలో ప్రవేశించి నివసించాము. నీ వలన మాకు స్వేచ్ఛ లభించింది. లంకానగరం మన రాక్షసులది. దాన్ని కుబేరుడు ఆక్రమించి పాలిస్తున్నాడు. రాక్షస వంశాన్ని ఉద్ధరించిన నీవే ఈ లంకనీ మనకు పునరుద్ధరించి పాలించ’మని బోధ చేశాడు.

రావణుడు తటపటాయించాడు. సోదరునిపై యుద్ధమా – అని సందేహించాడు. ప్రహస్తుడు అతని వీరశూరత్వాన్ని ప్రేరేపించాడు.

అరిషడ్వార్గాల్లోని మదం, అహం- ఇలాంటి ప్రేరణలతోనే విజృంభిస్తుంది. రావణునిలోని అహంకారం – కొద్దోగొప్పో మిగిలివున్న భ్రాతృమమకారాన్ని మింగేసింది. హుంకరించాడు. ప్రహస్తునే రాయబారానికి పంపాడు. ఆ దౌత్యం విఫలం కాకుండా – కుబేరుని తండ్రి విశ్రవసుడు కుమారునికి హితబోధ చేశాడు- రావణునితో విభేదం, కయ్యం మంచిది కాదని. తండ్రి మాట మన్నించి, కుబేరుడు లంకా నగరాన్ని విడిచి, స్వర్గంలో అమరావతికి దీటైన అలకాపురి నగరాన్ని నిర్మించుకుని తనవారందరితో సుఖనివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రావణుడు బంధుమిత్రమంత్రి సపరివారంగా వచ్చి లంకను ఆక్రమించుకొని, దానిని రాజధానిని చేసుకుని పాలించసాగాడు. బలమూ, చలమూ కూడా పెరిగేయి. మదమత్తతతో మళ్ళీ దేవవిరోధిగా, దుష్కార్య దురంధరుడుగా తయారయినాడు. భోగవైభవాలతో, భౌతిక విషయ వ్యామోహాలతో, పరాక్రమంతో, అరివీర భయంకరుడైనాడు.

శూర్పణఖ వివాహం:

ఋతువులు వచ్చి, వెడలిపోతున్నాయి. కాలం అన్నివిధాలా రావణానుకూలంగా వుంది. లంకంతా రాక్షస కోలాహలంతో శోభావహంగా వుంది. రావణ పేరోలగంలో ప్రభుస్తుతులూ, నుతులూ సాగిపోతున్నాయి. అంతఃపురం కాంతామయంగా వుంది.

ఆ వేళ –

రావణుడు వనవిహారం చేసి తిరిగి వస్తున్నాడు. శూర్పణఖ ఎదురైంది. చెల్లెలు వైపు పరీక్షగా చూశాడు. కందర్పదర్పహారిణిగా సౌందర్యరాశిగా మనోహర రూపంతో యౌవనశోభతో త్రుళ్ళుతున్నది. ఈమె వివాహానికి యుక్తవయస్క అయింది అనుకున్నాడు. ఎవరి దారిన వారు నడిచారు.

తమ్ముల్ని సంప్రతించాడు రావణుడు. ఒక నిర్ణయం జరిగింది. కాలకేయ వంశంలో జన్మించిన అతిబలశాలి, సుందరాంగుడు అయిన విద్వజ్జిహ్వుని వరుడుగా ఎంపిక చేశాడు రావణుడు. దానవశ్రేష్ఠుడైన కాలకుడు ఈ విద్వజ్జిహ్వుని తండ్రి. అతనికి కబురు పంపి వివాహతీర్మానం పంపేడు. శూర్పణఖ – విద్వజ్జిహ్వుల వివాహం పరమ రమణీయంగా జరిగింది.

రావణ వివాహం:

గృహయజమానిగా, అన్నగా తన బాధ్యతను నెరవేర్చిన సంతోషంతో – దశగ్రీవుడు – ఒకనాడు, వేటకు వెళ్ళాడు. వనంలో మయుడు, ఒక భువనైక సుందరియైన కన్యకతో ఎదరయినాడు.. పరిచయ పరామర్శలు జరిగాయి.

మయుడు తన గురించి చెప్పుకున్నాడు. ఆయన దితి కుమారుడు. హేమ భార్య. ఆమె ఒక అప్సరస్త్రీ. వీరికి జన్మించిన సుపుత్రికయే – ఆ కన్యక. పేరు మండోదరి. మయుడు తన తపశ్శక్తితో ఒక స్వర్ణమయ నగరాన్ని నిర్మించుకున్నాడు. పుత్రికకు వరాన్వేషణలో వున్నాడు. హేమ దేవకార్య నిర్వహణకై ప్రస్తుతం వీరి వద్దలేదు. మయుడికి మాయావి, దుందుభి అని ఇద్దరు కుమారులూ ఉన్నారు. మయుడు రావణుని వివరాలు అడిగేడు. తన గురించి స్వాతిశయంతో వివరాలు తెలిపాడు దశకంఠుడు. వీనికి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేయటానికి ఉత్సహించాడు మయుడు. విశ్రవసుడు రావణునకు ‘ఇతడు దారుణ స్వభావుడు అవుతాడు’ అని శాపమిచ్చిన సంగతి మయునకు తెలియదు.

మండోదరీ రావణుల వివాహం జరిగింది. మయుడు తన వివిధ విభవాలతో పాటు, తాను తపశ్శక్తితో సాధించుకొన్న ‘శక్తి’ ఆయుధాన్ని కూడా అల్లునికి బహూకరించాడు. (రావణుడు యుద్ధంలో లక్ష్మణుని మీద ప్రయోగించినది ఆ ‘శక్తి’నే) –

ఆ తర్వాత, అనతికాలంలోనే, వైరోచనుని దౌహిత్రి అయిన వజ్రజ్వాలతో కుంభకర్ణుని వివాహం జరిగింది. గంధర్వరాజైన శైలూషుని పుత్రిక సరమతో విభీషణుడి వివాహమూ జరిగింది.

(సరస మానససరోవర తీరంలో జన్మించింది. వర్షాకాల ప్రభావంతో మానస సరోవరం ఉధృతంగా పెరుగుతుంటే ఈ కన్య ఆ సరస్సును ‘ఆగు! పెరగకు!’ అని హెచ్చరించింది. ఆ కారణంతో ఆమెకు సరమ అనే పేరు స్థిరమైంది.)

సోదరులు ముగ్గురూ ఎవరి భార్యలతో వారు భోగభాగ్యాలతో, సుఖసంతోషాల్లో కాలం గడపసాగేరు.

(సశేషం)

Exit mobile version