Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తమ వైద్యుడు

[బాలబాలికల కోసం ‘ఉత్తమ వైద్యుడు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

శంబర అడవిలో ఓ చెట్టుపై కపిక అనే కోతి తన పిల్లతో ఉంటూ అక్కడ చెట్లకు కాచే పండ్లతో కపిక దాని పిల్ల కడుపు నింపుకుంటూ హాయిగా ఉన్నాయి. కోతి పిల్లకు వయస్సు వచ్చే కొద్దీ కపికను వదలి అడవిలో ఎక్కడెక్కడికో వెళ్ళి రకరకాల పండ్లు, ఆకులు తిని వస్తోంది. అందువలన అది ఒక రోజు వాంతి చేసుకుంది!

“ఏవంటే అవి తినకు, నీకు కడుపు నొప్పి వస్తుంది” అని కపిక హెచ్చరించింది. అయినా పిల్ల కోతికి కపిక మాటలు నచ్చేవి కావు. మరికొన్ని నెలల తరువాత పిల్లకోతి మెల్లగా ఆడవి పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళింది. అక్కడి వారు పారేసిన ఆహార పదార్థాలు, ఏవో గుర్తు తెలియని పండ్లు తినసాగింది. ఈసారి దానికి తీవ్ర కడుపు నొప్పి వచ్చింది, వాంతులు ప్రారంభమయ్యాయి. ఆ అనారోగ్యంతో అది భయపడిపోయి పరుగున అడవికి వెళ్ళి నీరసంగా కపిక ఒడిలో వాలిపోయింది!

“అమ్మా నన్నూ వైద్యుడి వద్దకు తీసుకు వెళ్ళవే, కడుపు నొప్పి. వాంతి కూడా అయింది” ఏడుస్తూ చెప్పింది.

“నీకు తిండిని గురించి ఎన్ని మార్లు చెప్పినా బుద్ధి రావటం లేదు. నీ అనారోగ్య కష్టాలకు నీవే కారణం. పెద్దలు చెప్పే మాటలు పెడచెవిన పెడితే ఈ విధంగానే జరుగుతుంది. పద, మన అడవిలోని ఎలుగుబంటి వైద్యుడి వద్దకు. ఆయన మంచి పసరు మందు ఇస్తాడు” అని చెప్పి పిల్లను తీసుకు వెళ్ళింది కపిక.

ఎలుగుబంటి వైద్యుడు పిల్లకోతికి రకరకాల పరీక్షలు చేసి, “మరేం లేదు మీ పిల్ల తినకూడనవన్నీ తింటోంది. అందుకే దీని కడుపు చెడింది. ఏవంటే అవి తినడం మానకపోతే కడుపు నొప్పి, వాంతులే కాదు విరోచనాలు ఇంకా వేరే జబ్బులు రావొచ్చు!” అని చెప్పి ఒక పసరుమందు ఇచ్చి ఈ విధంగా పిల్లతో చెప్పింది.

“చూడమ్మా, ఈ వయస్సులో ఏవేవో తినాలని ఉంటుంది. అలా తింటుంటే జబ్బుపడి చెట్టు కొమ్మ మీద ఉండి పోవాల్సి వస్తుంది. నీ స్నేహితులతో ఆడుకోలేవు. నీవు పెద్దదానివి అవుతున్నావు. ఆరోగ్యానికి ఏ తిండి మంచిదో కాదో నీవు తెలుసుకోవాలి. నీకు తెలియకపోతే మీ అమ్మను అడగాలి. ఒకవేళ నీకు ఏదైనా ఆహారం దొరికితే అమ్మకు చూపించి తినాలి. తినకూడనిది ఏదైనా తిని కడుపు నొప్పి వస్తే చేదు పసరు మందు ఇస్తాను” చెప్పింది ఎలుగుబంటి వైద్యుడు.

ఎలుగుబంటి మాటలు విన్న పిల్లకోతి భయపడి, “ఇక మీదట ఏవంటే అవి తినను” అని దీనంగా చెప్పింది.

పిల్లకోతిని తీసుకుని చెట్టు మీదకు వెళ్ళిన తల్లికోతి ఈ విధంగా చెప్పింది.

“చూడు మన చెడు అలవాట్లే మన జబ్బులకు కారణం. వయస్సు వచ్చే కొద్దీ ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ఆ అలవాటును వదులుకోవాలి. ఇంకొక ముఖ్యవిషయం, జబ్బులు వచ్చాక వైద్యుడి వద్దకు వెళితే వైద్యుడు ఎక్కువ డబ్బులు అడగవచ్చు. మన ఎలుగుబంటి వైద్యుడు మంచివాడు, పరిచయం ఉన్నవాడు కాబట్టి మనల్ని ఏమీ అడగలేదు. అర్థమయిందా? అందుకే ప్రపంచంలో ఉత్తమ వైద్యుడు ఎవరంటే ఎవరికి వారే ఉత్తమ వైద్యుడు. మనుషుల్ని చూడు, వారి చెడు అలవాట్ల వలన రోగాల బారిన పడుతున్నారు. అందుకే పట్టణ వైద్యశాలలు రోగులతో నిండిపోతున్నాయి!” అని పిల్లకోతి వీపు నిమురుతూ చెప్పింది కపిక.

“అమ్మా నీ మాటలు తప్పకుండా పాటిస్తాను నాలో వచ్చే మార్పులు నీవే చూస్తావుగా” అంటూ చెప్పింది.

దాని మాటలకు సంతోషించిన కపిక దానికి ఓ ముద్దు పెట్టింది.

Exit mobile version