Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తమ సాధకులు

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఉత్తమ సాధకులు’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత 12వ అధ్యాయం 2వ శ్లోకం:

శ్రీ భగవానువాచ:

మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే।

శ్రద్ధయా పరాయోపేతాస్తే మే యుక్తతమా మతాః॥

ఓ అర్జునా, నాపై మనస్సును స్థిరంగా ఉంచి, నిరంతరం నా పూజలో నిమగ్నమై ఉన్నవారు, అత్యున్నత విశ్వాసంతో ఉన్నవారు, నా అభిప్రాయం ప్రకారం యోగంలో ఉన్నతులు అని భగవానుడు అర్జునుడికి తనకు ఎవరు ఇష్టులో, ఎవరు తనకు అత్యంత ఆప్తులో నర్మగర్భంగా తెలియజేసాడు.

భక్తియోగంలోనే కాక మొత్తం భగవద్గీతలో ఈ శ్లోకం అత్యుత్తమమైనదిగా ఆద్యాత్మికవేత్తలు భావిస్తారు. మానవులలో వుండే అరిషడ్వర్గాల మూలంగా ఎవరికి వారే తమను గొప్పవారిగా భావించుకోవడం, తామే ఆధ్యాత్మికమార్గంలో ఉన్నత స్థితికి చేరినట్లు, తామంటేనే భగవంతునికి ఎంతో ఇష్టమని భావిస్తూ, ఇతరులను చులకన చేస్తూ వుంటారు. అయితే అసలు భగవంతునికి ఎటువంటి భక్తులు అంతే ఇష్టమో ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకుంటే తెలుస్తుంది.

ఈ ప్రపంచం అనే మాయలో పడకుండా, మనస్సును పవిత్రంగా, అన్ని కల్మషాలకు దూరంగా వుంచుకుంటూ, తమకు ఇష్తమైన ఒక భగవంతుని రూపాన్ని హృదయాలలో స్థిరంగా వుంచుకుంటూ, నిరంతరం ఆయనయందే మనస్సును లగ్నం చేసి (ఇక్కడ పూజ అంటే భౌతికమైన పూజ కాదు,  ఆందోళనలు, అశాంతికి నిలయమైన ఈ జీవనయానంలో 24 గంటలు భగవంతుని అర్చన చేయడం దాదాపుగా అసాధ్యం, కాబట్టి పూజ అంటే మానసిక అర్చన అని అర్థం), భగవంతుని పట్ల ఎటువంటి సంశయాలు లేకుండా, అన్నీ నీవే, అంతా నీవే, సర్వం నీవే అని భావిస్తూ సంశయాత్మక ధోరణి లేకుండా స్థిరమైన విశ్వాసం వుండేవారే భగవంతునికి అత్యంత ఆప్తులు.

ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని, భగవానుడికి చేరువ కావాలంటే మన ప్రవర్తన ఎలా వుండాలి, మన జీవన విధానం, ఆలోచనా ధోరణి ఎలా వుండాలో మనం నిర్ణయించుకొని, ఆ ప్రకారంగా నడుచుకోవాలి.

‘నా యందు మనస్సుని నిలిపి తదేకనిష్ఠతో తదేకచింతాపరులై మిక్కిలి శ్రద్ధ కలవారు ఉత్తములు’ అని ఈ శ్లోకంలో చెప్పనట్లుగానే విశ్వరూప సందర్శన యోగములో ఆఖరి మాట కూడా ఇదే. ‘మద్భక్తః.. స మామేతి’ (11.55) అంటూ ‘నన్నే పరమగతి అని తలచి నా భక్తుడైనవాడు నన్నే పొందుతాడు’ అని చెపుతాడు. నిశ్చల భక్తి అంతే ఏమిటో శ్రవణం చేద్దాం. భగవంతుని యందు నిశ్చల భక్తి, ధ్యానం కలిగి ఉండడం చేత సాధకుడు  కలలో నైన తనని కాని, లోకాన్ని కాని చూడడు. అతడు బయటకి చూసినా భగవంతుని  స్వరూపమే, మహా విస్పష్టంగా  దృక్కులలో చూస్తాడు. అట్లాగే, అంతరంగంలో భగవంతుడు కొలువై వున్నట్లు భావిస్తే అక్కడ భగవంతుని  స్వరూపమే గొప్పగా అభివ్యక్తం కావడాన్ని భావన చేత  గ్రహిస్తాడు. సూక్ష్మంగా భగవంతుని పట్ల  భక్తి కలిగిన  సాధకుడు  కలలో కాని ధ్యానంలో కాని , అంతరంగంలో కాని ఆయననే స్మరిస్తాడు. సర్వం నీవే అని భావన చేస్తాడు. అహర్నిశలు తన మనస్సును, ఆలోచనలను భగవంతుని పాదాల యందే స్థిరం చేస్తాడు.

ఉన్నతమైన యోగం యొక్క మూడు లక్షణాలు ఇక్కడ భగవానుడిచే తెలుపబడ్డాయి. మొదటిది, భక్తులుగా మనం పవిత్రమైన మనస్సుతో భగవంతునిపై మన మనస్సును స్థిరంగా లగ్నం చేయగలగాలి. ధ్యానం యొక్క ప్రారంభ దశలలో, పది నిమిషాలు కూడా మన మనస్సును భగవంతునిపై  ఉంచడం చాలా గొప్ప విజయం. రెండవది, మనం పతంజలి యోగ సూత్రాలలో తెలియజేసిన విధంగా నిత్య యుక్తగా ఉండాలి, మనస్సును ఇతర పనుల వైపు మళ్లించకుండా నిరంతరం ఆరాధనలో నిమగ్నమై ఉండగల సామర్థ్యం పెంచుకోవాలి. మూడవదిగా, మనం అత్యున్నతమైన మరియు అచంచలమైన విశ్వాసంతో జీవితం సాగించాలి.

పైన తెలియజేయబడిన మూడు గుణాలు ఎవరిలో ఉన్నాయో వారే యోగులలో ఉత్తములు. సాధకులు సగుణులైనా, నిర్గుణ ఆరాధకులైనా, సన్యాసులైనా, గృహస్థులైనా – ఈ వ్యత్యాసాలకు ఎటువంటి ప్రాముఖ్యత లేదు అని గీత స్పష్టం చేస్తోంది. సాధకుడు నిర్గుణోపాసకుడు అయినా సగుణోపాసకుడు అయినా ఈ మూడూ కావలసిన సాధనములే అని తెలుసుకోవాలి.

Exit mobile version