Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉష్ ష్ ఉగాది!

ఉగాదీ –

నువ్వెప్పుడూ కరెంటుకోతను భుజాన వేసుకుని వస్తావేమిటి!

నూతులు గొంతులు ఎండి దాహం దాహం అంటాయి!

రైతుల గొంతుకలు కోస్తాయి!

మరోపక్క కోకిలలు గానం మరిచి దోమల సంగీతం ఆస్వాదిస్తాయి!

మామిడి పిందెలు ఉడికెత్తిపోతాయి!

వేపపువ్వు ముఖం వెల వెల బోతుంది!

ఫంకాలకు రాత్రీ పగలు బుర్ర తిరిగిపోతుంది !

గొడుగులు బూజు దులుపుకొని మల మల మాడిపోతాయి!

మనుషుల ఒళ్ళు పేలాల్లా పేలిపోతుంది!

నేల నోరు వెళ్ళబెట్టుకొని చూస్తుంది!

ఇక పిల్లలకేమో పరీక్షలను మోసుకొస్తావు!

అల్లరికీ ఆటలకీ ఆటంకమవుతావు!

ఉగాదీ –

మరి నువ్వొస్తే ఆనందం ఎక్కడిది?

 

సాదనాల వేంకట స్వామి నాయుడు

Exit mobile version