[శ్రీమతి గీతాంజలి రచించిన ‘ఉండనీ అలా!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ సాయంత్రం లోకి..
ఎఱ్ఱని.. నల్లని బూడిద రంగులాంటి.. దిగులు..
దిగులైన సాయంత్రం లోకి..
దుఃఖం ఇలా విప్పారుతుందేందుకు.
పొరలు పొరలుగా
తెరలు తెరలుగా పక్కకి తొలుగుతూ..
మునిగిపోతున్న సూర్యుడికి..
తగ్గిపోతున్న కాంతికి..
రాబోతున్న రాత్రికి తోడుగా
ఎందుకు దుఃఖం ఊరుతుంది?
నా రాత్రి..
కలల్ని వెతుక్కోవాలనుకుంటుంది..
కానీ వెన్నెల లేని.. చంద్రుడు రాని
నల్లని రాత్రిలో దుఖం నిధురపోనీదు.. నల్లని దుఃఖం..
నల్లనిదా దుఃఖం?
దుఃఖానికి రంగేమిటి?
మధువులా ఉన్మత్తపరిచే నీ నవ్వు
అధ్దిన దుఃఖం కూడా నల్ల నల్లగా.. చల్లగా.
దుఃఖం ఇలా.. పువ్వును వదిలే పరిమళంలా..
నన్ను కమ్ముకుంటుందెందుకు?
దుఃఖానికి ఈ సుగంధం ఎక్కడిది.. నీ జ్ఞాపకానిదా?
దుఃఖాన్ని సముద్రంలో వదిలేస్తానా..
ముత్యపు చిప్‌పై నా పాదాల వైపు
తెల్లని పాల నరుగులో నృత్యం చేస్తూ
వచ్చి చేరిపోతుంది..
దుఃఖం కూడా నాట్యమాడుతుందా!
దుఃఖపు రంగప్పుడు తెలుపు.
దుఃఖం మళ్ళీ అలలు అలలుగా వచ్చి
నన్నే అందుకుంటుంది.
నన్ను నిలువునా ముంచేస్తుంది.
దుఃఖానికి నేనే తీరం!
నీ కోసం మోరెత్తి ఆకాశాన్ని చూస్తానా..
అప్పటికే దుఃఖభారంతో నిండిన
నీలి మేఘాలు నా కళ్ళల్లోకి నిండిపోతాయి.
అప్పుడు నా దుఃఖానిది నీలి రంగు.
ఎందుకులే.. నా దుఃఖాన్ని రాత్రికి.. పగలుకి
పువ్వులకి.. వెన్నెలకి
సముద్రానికి, ఆకాశానికి అంటించడం..
దుఃఖానికి రంగులధ్ధడం?
ఉండనీ దుఃఖాన్ని అలాగే..
గడ్డ కట్టనీ.. దుఃఖం శిల కానీ .
హృదయం నుంచి ఊరకుండా..
దూరాన్నెక్కడో నన్ను కలగంటున్న
నీకు అంటుకోకుండా..
ఉండి పోనీ దుఃఖాన్ని నాతోనే అలా..
గడ్డ కట్టనీ దుఃఖాన్నలా!
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్‌పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964