Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెడ ధోరణులని చర్చకి పెట్టిన విశ్లేషణాత్మక కథాసంపుటి ‘ఉలిపికట్టెలు’

[శ్రీమతి పి. జ్యోతి గారి ‘ఉలిపికట్టెలు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

సమాజంలో తమకి భిన్నంగా ఉండేవారిని జనాలు ప్రశాంతంగా ఉండనీయరన్నది తెలిసినదే. ‘తేడా’ అనో లేదా ‘మనలా కాదు’ అనో ముద్రవేసి దూరం పెడతారు. తమకు విరుద్ధమైన అభిప్రాయాలను కలిగి ఉండడం లేదా వెల్లడించడం జరిగితే, హఠాత్తుగా ఓ బృందం నుంచి మనం బయటకు తోసివేయబడతాం! శరీరాకృతులని బట్టి హేళనలు చేస్తున్నట్టే, అభిప్రాయలను బట్టి కూడా గేలి చేస్తారు. పలు రూపాలలో కించపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఏది అభ్యున్నతి? ఏది పురోగతి? ఏది ప్రగతిశీలం? వీటికి సమాధానాలు – వ్యక్తుల ఆలోచనా రీతులను బట్టి మారిపోతాయి. తాము నమ్మిన భావాలను అనుసరించే లేదా తమ ఇజాలను పాటించే వ్యక్తులతో రాసుకుపూసుకు తిరగడం, తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నారనుకున్నవారి మీద దుర్వ్యాఖ్యలు చేయడం కొన్ని సమూహాలలో కనబడుతోంది. అయితే, ఇజాలకు దూరంగా, సమస్యని సమస్యగా ఎదుర్కుని, బాధితుల వేదనని లోతుగా అర్థం చేసుకుని వారికి భరోసా అందించే ‘తేడా మనుషులు’ అక్కడక్కడా ఇంకా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్న వ్యక్తులు, వారికి భరోసా ఇచ్చే ఈ ‘తేడా మనుషుల’ కథలే పి. జ్యోతి గారు రాసిన ‘ఉలిపికట్టెలు’.

ఈ పుస్తకంలోని 15 కథలూ నిజ జీవిత గాథలనీ, అందులోని ప్రధాన పాత్రలు తన జీవితంలో తాను చూసినవారేనని రచయిత్రి తెలిపారు. కథలన్నీ వాస్తవ గాథలే అనీ, అయితే, తాను కథలలో ఏ పక్షమూ తీసుకునే ప్రయత్నం చేయలేదని, జరిగిన వాటిని యథాతథంగా పాఠకుల ముందుంచానని అన్నారు. ఆ పాత్రల గొంతుకను వినిపించానని తెలిపారు. చాలా కథల్లోని పాత్రలు అసలైన వ్యక్తులేలనీ, వారితో జరిపిన సంభాషణలే ఈ కథలకు మూలం కాబట్టి కథన శైలి కూడా సంభాషణా మాధ్యమంలోనే నడిచిందని రచయిత్రి తెలిపారు.

~

వీలైనంత వరకూ కథల్లోని సంభాషణలని ఉపయోగించుకుంటూ పుస్తకంపై సమీక్షని అందించాలని ప్రయత్నిస్తాను.

~

‘ప్రశ్నార్థకం’ కథ:

“ఎవరండీ వాళ్ళు?” అనడిగా.

నా ఆరాలకు ఏమనుకుందో, “లోకం.. ఒంటరిగా బ్రతికే స్త్రీని ప్రతి నిమిషం గమనించడం దాని హక్కు” అంది.

నెరేటర్ ప్రశ్నకి యశోదమ్మ జవాబు. పరాయి స్త్రీ పురుషుల మధ్య శారీరిక సంబంధం తప్ప మరే బంధం ఊహించలేని మామూలు మనుషుల మధ్య యశోదమ్మ ఒక ఉలిపికట్టె.

‘శిక్ష’ కథ:

ఒక ఖరీదైన హోటల్. బాగా ధనవంతులైన కుటుంబపు వారసుడి 18వ పుట్టిన రోజు. ఆ పిల్లాడి అమ్మ తరపు వాళ్ళు, నాన్న తరపు వాళ్ళూ ఎంత సంపన్నులో కథ మొదటి రెండు పేజీల్లో అర్థమవుతుంది. ఆర్థికంగా ఎంతో ఎదిగిపోయినా, సుధ మాధవి స్నేహాన్ని వదలదు. కొడుకు పుట్టిన రోజున వచ్చిన తల్లిని అవమానిస్తుంది సుధ. సుధకీ, ఆమె భర్త జగన్‍కీ గ్యాప్ ఉందని మాధవి గ్రహిస్తుంది. తల్లిదండ్రుల పట్ల సుధ ఎందుకంత కటువుగా ఉంటుదో కథ చదివాకా, పాఠకులకి అర్థమవుతుంది. తనని మనసున్న మనిషిగా కాకుండా, డబ్బున్న ఇంటి అమ్మాయిగా చూసి, తన జీవితంలో మాధుర్యం మిగల్చని ఇంటి పెద్దలకి సుధ వేసిన శిక్ష పాఠకులు ఊహించనది. మాధవికి మనసు విప్పి చెప్పుకోకపోయి ఉంటే, సుధ ప్రవర్తనని పాఠకులు మరో రకంగా అర్థం చేసుకుంటారు. ఈ కథలో ఉలిపికట్టె సుధే కదా!

‘నేను సైతం’ కథ:

“ఏంటి సుమైయా? ఏం చెప్పాలనుకుంటూన్నావో చెప్పు. నేను నీ పెళ్ళికి కారణం అవడం ఏమిటీ” అడిగాను కంగారుగా.

సుమైయా కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. “మీరు అమ్మీ అబ్బుకి చెప్పకుండా ఉండవలసింది” అంది ఏడుస్తూ.

ఇక్కడ్నించి కథ ఊపందుకుంటుంది. తన స్టూడెంట్‌ సుమైయాని వేధింపుల నుంచి తప్పించాలని ప్రయత్నించిన లెక్చరర్ చేసిన పని వల్ల సుమైయా జీవచ్ఛవంగా మారిపోతుంది. సుమైయా వేసిన ప్రశ్నలకి ఆ లెక్చరరే కాదు, మనసున్న వారెవరూ సమాధానాలు చెప్పలేదు. మిగతా విద్యార్థులు, ఇతర లెక్చరర్లు, సుమైయా తల్లిదండ్రులు, నరేష్ – సమాజంలోని సాధారణ మనుషులకి ప్రతిరూపాలు. సుమైయా మాత్రం ఉలిపికట్టె. కానీ తన ప్రత్యేకత నిలుపుకునే క్రమంలో, పోరాటంలో, ఆమె తీసుకున్న ఓ సాయం – ఆమెను మరింత క్రిందకి దిగజార్చింది. వ్యక్తిగత సామాజిక దురవస్థపై వ్యాఖ్యానం ఈ కథ.

‘ఆమె స్థానంలో’ కథ:

కొడుకుని చంపిన తల్లి పక్షాన ఆలోచించమని రమ అంటే, ఎన్నడూ లేనిది జోసెఫ్ ఆమె మీద విరుచుకుపడతాడు. దుర్భాషలాడతాడు. ఆప్తమిత్రుడిగా భావించిన జోసెఫ్ తనతో అలా మాట్లాడడం జీర్ణించుకోలేకపోతుంది రమ. మిత్రబృందం అందరినీ దూరం పెడుతుంది. మిత్రులందరూ బ్రతిమాలగా, భర్త నవీన్ ఒప్పించగా – జోసెఫ్ వెర్షన్ వింటుంది రమ. అంతా పూర్తయ్యాకా, తాను మునుపటి స్త్రీవాదిని కాదు అనుకుంటుంది రమ.

‘గులాబీ రంగు చీర’ కథ:

రజని, భారతి ముఖంలో ఆందోళన గమనించి ఆమె చూస్తున్న వైపుకు చూసింది. వెంటనే “ఛీ. అలాంటి ఆడవాళ్లని చూస్తున్నావేంటే” అంటూ అసహ్యంతో మొహం తిప్పుకుంది. ఆమెకు అక్కడ ఓ ఆడదే తప్ప ఆమెను తీసుకు వెళుతున్న మగవాళ్ళు కనిపించలేదు ఎందుకో.

ఈ వాక్యాలు చాలు భారతి ఉలిపికట్టె అని చెప్పడానికి! ముగింపు వాక్యాలు చదివితే, నిర్ధారణ అయిపోతుంది.

‘ఎందుకో ఈ రోజు రజని భారతికి అందంగా కనిపించట్లేదు. గులాబీ రంగు చీర కట్టుకున్న ఆ అమ్మాయే పదే పదే గుర్తుకు వస్తుంది.’

‘తాలుగింజలు’ కథ:

బంజారాకథల సంకలనం కోసం వ్రాసిన ఈ కథలో సోమ్లా నాయక్ – తన సమూహాన్ని విడిచి విశాల ప్రపంచంలోకి వస్తే అతనికి దక్కినది ఒంటరితనమే. కానీ అతను పోగొట్టుకున్నవి? అంతిమ క్షణాలలో తన జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటూ, ఉన్నతి పేరిట, అభివృద్ధి పేరుతో పిల్లలని ఖండాలు దాటించి, పై దేశాలకు అప్పగించి తాను కోల్పోయిందేమిటో గ్రహిస్తాడు. కానీ మిగిలింది అనంతమైన నిశ్శబ్దం మాత్రమే. కథ పూర్తి చేశాక, కొద్ది క్షణాలు మనసు మొద్దుబారిపోతుంది.

‘అందమైన జీవితాలు’ కథ:

పుస్తకాలు బాగా చదివే అలవాటున్న లీలకు సుమతి ఆంటీ కూడా విపరీతంగా చదువుతారని తెలిసిన తరువాత ఆమె పట్ల ఓ ఆత్మీయ భావం కలిగింది. ఆ వయసున్న ఇతర స్త్రీల కన్నా ఈమె భిన్నం అని ఆమెకు అనిపిస్తూ ఉండేది.

పై వాక్యాలతో సుమతీ ఆంటీ ఈ కథలో ఉలిపికట్టె అని అర్థమైపోతుంది కదా. కానీ సుమతీ ఆంటీ ఎందుకు స్పెషలో, కుటుంబ సభ్యులు ఆమెను ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో, లీల మాత్రమే ఎలా అర్థం చేసుకోగలిగిందో తెలియాలంటే కథ చదవాలి.

“వాస్తవం అంతే లీలా, అందమైన అబద్ధాల చుట్టూ కనిపించేవే అందమైన జీవితాలు” అని సుమతీ ఆంటీ అన్న మాటలను అవగతం చేసుకుంటే, మనం మనకి బాగా అర్థమవుతాం.

‘గమ్యం’ కథ:

ఒంటరి తల్లి, లాంగ్వేజ్ టీచర్ అయిన నెరేటర్ – తన సింగిల్ స్టేటస్‍ని తమకి అనుకూలంగా మార్చుకోవాలనే వారిని అదుపు చేస్తుంది. తన స్వరం గట్టిగా వినిపిస్తూనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంటుంది. ఉలిపికట్టె!

‘అనన్య’ కథ:

వైఫ్ స్వాపింగ్ నేపథ్యం అల్లిన ఈ కథ సమాజంలో ప్రబలిన/ప్రబలుతున్న ఒక పెడ ధోరణిపై వ్యాఖ్యానం.

“లైఫ్ అంటే మన ప్రయారిటీస్‌ని నిర్ణయించుకుని కొన్ని కాంప్రమైజ్‌లు చేసుకుంటూ కొన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడమే కదా ఆంటీ” చాలా సీరియస్‌గా చెప్పింది శృతి.

“అంటే అలా బ్రతకాలని నువ్వు నిర్ణయించుకున్నావు. కాని నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే బ్రతకాలని నువ్వు నిర్ణయించడం తప్పు కాదా” అడిగాను.

తాము చేసింది కరెక్టే అని సమర్థించుకునే శృతి, సురేష్, అవినాష్ లాంటి వాళ్ళ మధ్య అనన్య ఓ ఉలిపికట్టె. తనకి మద్దతుగా ఉండాలనుకున్న నెరేటర్ మరో ఉలిపికట్టె.

‘సోఫీస్ ఛాయిస్’ కథ.

కథకి ఈ పేరు పెట్టడంలోని ఔచిత్యం చివరి పేరాలలో అర్థమవుతుంది.

<>

“అది కాదు సుధాకర్. మన కళ్ళ ముందే తాను విక్టింగా మారుతుంటే చూస్తూ ఎలా???” ఆవేశంతో ఇంక మాటలు రావట్లేదు.

“మొన్న నువ్వు తనతో మాట్లాడడం విన్నాను. నువ్వు కొంచెం ఎక్కువగా ఆమె జీవితంలోని వెళుతున్నావనిపించింది. అయినా మనం ఆమె కుటుంబీకులం కాదు, వారితో తలపడి ఆమెకు మరో కుటుంబంలా నిలబడలేం. మన పరిధి మరిచి జోక్యం చేసుకోకూడదు శాంతి” సుధాకర్ కళ్ళలో స్నేహం చూసి ఊరుకున్నాను కాని మరొకరు ఇదే సలహా ఇవ్వబోతే పెద్ద గొడవ జరిగేదే.

<>

సుజాతను చూస్తూ “అసలు ఏం జరుగుతుందో నీకు అర్ధం అవుతుందా సుజాతా” అడిగా.

“తెలుసు మేడం. నేను ఉద్యోగం చేస్తా కాని జీతం రాదు. జీతం రాదు కాబట్టి నాకు పెళ్లి కాదు. నాకు జీవితంలో పెళ్లి ఉండదని నాకు అర్ధం అయింది మేడం” అంది కన్నీళ్లతో.

స్వంత కుటుంబ సభ్యులే డబ్బు కోసం వేధిస్తుంటే బంధాలకి బందీ అయిపోయిన సుజాత తరఫున పోరాడలనుకున్న శాంతి ఈ కథలో ఉలిపికట్టె.

‘కథ వెనుక కథ’ కథ:

“సరే ఇంటికి వచ్చేయ్. కాని నీ గొంతేంటి అలా ఉంది” అడిగింది పూజ.

“నాకేమీ అర్థం కావట్లేదు పూజ. నేను మనుషులను అంచనా వేయలేకపోతున్నాను. చాలా మంచిగా అమాయకంగా కనిపించే వాళ్లలో మరో మనిషి కనిపించినప్పుడు తట్టుకోలేకపోతున్నాను” అంది అరుణ అదే గొంతుతో.

పై వాక్యాల్లో ఆ మరో మనిషి భవాని. భవాని ఎవరు? అరుణకి ఆమెకి ఏమిటి సంబంధం? భవాని ఏం చేసింది? తెలియాలంటే కథ చదవాలి. సమర్థనీయమా కాదా అనేది వారి వారి విచక్షణపైన ఆధారపడుతుంది.

‘ఇదీ తల్లి ప్రేమే’ కథ:

రఘు ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. “ఈ హత్యకు మోటివ్ ఏమిటి రణధీర్”

“తల్లి ప్రేమ” ఠక్కున జవాబిచ్చాడు రణధీర్

అంతా వింటున్న నాకు ఈ ఆఖరి మాట అర్ధం కాలేదు.

ఓ పసిబిడ్డ హత్యకి తల్లి కాబోయే ఓ స్త్రీ కారణమైందంటే కారణాలు ఏమయ్ ఉంటాయి?

<>

“కొన్ని సందర్భాలలో ఈ అంతులేని మాతృ ప్రేమ ఇటువంటి ఉన్మాద స్థితికి దారి తీస్తుంది. నిజానికి ఆ అంతులేని ప్రేమ చుట్టూ తల్లుల అభద్రతాభావం ఉంటుంది. మాతృత్వం మాటున ఈ అభద్రతా భావాన్ని కప్పు పుచ్చుకుంటూ క్రూరంగా ప్రవర్తిస్తారు తల్లులు. మీలోని ఆ అభద్రత వలనే బిడ్డలే మీకు కేంద్ర బిందువులు అవుతారు. ఆ బిడ్డలను మీకు కట్టి పడేసుకోవడానికి ఇతరులకు ఎంత కష్టాన్నిఅయినా కలిగించే స్థితికి మీ తల్లులు చేరతారు. ఆ గుడ్డి ప్రేమ మీలోని మనిషిని మెల్లిమెల్లిగా ఎలా తినేస్తుందో మీరు గమనించరు. కొందరు కొంచెం కొంచెంగా దీన్ని బయటపెట్టుకుంటారు. కాస్త ఎక్కువ దూకుడు ప్రదర్శించే స్త్రీలు ఈ మాధవి లాంటి ఉన్మాద స్థితికి చేరుకుంటారు.”

ఈ మాటలన్న రఘు ఈ కథలో ఉలిపికట్టె.

‘ప్రేరణ’ కథ:

శారదకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. కాని కవిత ముఖాన్ని చూస్తుంటే ఓ చిన్న అనుమానం మొలకెత్తింది. ఇతనితో కవితకు.. ఒక్క క్షణం ఏదో భయం కలిగింది. ఏం వినాల్సి వస్తుందో అని..

<>

నా కోసం ఒకరున్నారు అన్న ఫీలింగ్ మనిషిలో ఎంతో శక్తిని నింపుతుంది. అ శక్తే మనిషి చేత ఊహించని మహోన్నత కార్యాలు చేయిస్తుంది. ఆ అనుభూతిని అందుకోవాలన్న కోరికతో కొందరు ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటారు. మన అనుకున్న వ్యక్తులు ఈ అనుభూతిని కలిగించే విధంగా మసులుకుంటే మానవ సంబంధాలు ఎంత ఆరోగ్యకరంగా ఉంటాయో కదా. కాని ఎందుకో నిజ జీవితంలో అలా జరగదు.

<>

తన నేస్తం కవితకు తోడుగా తానుండి ఆమెను రక్షించుకోవాలనుకున్న శారద ఈ కథలో తేడా మనిషి, అదే ఉలిపికట్టె కదూ!

‘స్ట్రాంగ్ ఉమన్’ కథ:

“ఇందాక అన్నావే ఎమోషనల్ డిపెన్డెన్సీ అని. అది మానుప్లేట్ చేసే వారి చేతికి నువ్విచ్చే అయుధం. అందుకే సామర్థ్యం ఉండీ వారి దగ్గర బలహీనపడి పోతున్నావు. ఆ ఆయుధాన్ని వెనక్కు తీసుకో. నిన్ను నువ్వు కాపాడుకో. బాధ్యత పేరుతో వారి బాధ్యతా రాహిత్యాన్ని సహించవలసిన అవసరం లేదని అర్థం చేసుకో. నీ జీవితానికో దారి తప్పకుండా దొరుకుతుంది. నా భార్య చేసిన తప్పు నువ్వూ చేయకు.”

“జీవితానికి అర్థం ఏంటి అండి? పెళ్ళి వ్యాపారం, కుటుంబం మరో వ్యాపారం, ఈ ప్రపంచం ఓ పెద్ద వ్యాపారం.”

“ఇన్ని వ్యాపారాల మధ్య నిన్ను నువ్వు గౌరవించుకోగలగడమే నీ జీవితానికి అర్థం వెతుక్కోవడం. నీకు నువ్వు ముఖ్యం అవ్వాలి. ఇతరులకు చేయవలసింది చేయి కాని వారికి లొంగిపోయి కాదు.”

ఈ కథలో పిల్లలను హద్దుల్లో ఉంచలేకపోతున్న ఆమె, తన సంతానానికి ఓ దారి చూపాకా, వారిని వారి పరిధుల్లో ఉంచిన ఆ వృద్ధుడు! చెప్పాల్సింది చెప్పాడు, అర్థం చేసుకున్నంత అర్థం చేసుకుందామె.

‘ఓ లవ్ మేరేజ్ కథ’

కన్వీనియెన్స్ పేరుతో ప్రదర్శించే పడగలెత్తిన స్వార్థం ఎలా ఉంటుందో ఈ కథ చెబుతుంది. ఎవరికి వారు చదువుకోవాల్సిన కథ.

~

అన్ని కథలలోనూ, ఆ యా సన్నివేశాలలో ప్రస్తావించన ఘటనలు, వ్యక్తులు, వారి హావభావాలు, సంభాషణలు, మనోభావాలు, అన్నీ సవివరంగా చెప్పుకొచ్చారు రచయిత్రి. అందువల్ల కథ నిడివి ఎక్కువైనట్టు తోచినా, పాఠకులకు కథ పట్ల, అందులోని పాత్రల పట్ల, ఘటనల పట్ల, సంభాషణల పట్ల – పూర్తి అవగాహన కలిగి – రచయిత్రి ఉద్దేశాలు సరిగ్గా అవగతమవుతాయి. వాదాల పేరుతో చలామణీలో ఉన్న ఎన్నో పెడ ధోరణులను ఈ కథల్లో చర్చించారు రచయిత్రి.

***

ఉలిపికట్టెలు (కథలు)
రచన: పి. జ్యోతి
ప్రచురణ: ఎన్నెలపిట్ట, హైదరాబాద్.
పేజీలు: 237
వెల: ₹ 250/-
ప్రతులకు:
పుస్తకమ్.ఇన్,
ఫోన్: 7989546568
~
https://pusthakam.in/product/ulipikattelu/

 

 

~
పి. జ్యోతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-p-jyothi-ukb/

Exit mobile version