Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉగాది ఉషస్సులు..

[ప్రియాజీ పల్లెపోగు గారు రచించిన ‘ఉగాది ఉషస్సులు..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

బ్రహ్మ సృష్టికి సాగిలపడిన
వసంత వెన్నెల ఋతువు
ప్రకృతి పరదాలై.. కోకిలల
ప్రేమ ఏకాంత వాసములైనవి!
పొడివారీ మోడుబారినా..
తరువుల అదరములపై..
చిరుమందహాస చిగురులు
పరిహాస పలుకులు పలికిస్తున్నవి!
చిగురులు తాకిన కూనలమ్మలు
విశ్వావసు చైత్రశుద్ధ పాడ్యమిలకు
కూనిరాగాలతో స్వాగతం పలికెను!!
‘ఉగాది ఉషస్సులు’ జగమంతా..
ఊసుల పల్లకిలో మోతాయెను!
తెలుగు మనస్సుల మామిడి
తోరణాలు.. ముంగిళ్లలో మగువల
ముగ్గుల దివ్యహారతులు.. అభ్యంగన
ఆరాధనా పుణ్యస్నానాల పూజలు..
అయ్యోరుల పంచాంగ శ్రవణాల పటిమలు..
గ్రహ నక్షత్రాల తిథీ గమనాల దీవెనలు..
పాడిపంటలు వృద్ధి ఆరోగ్య శుద్ధీ..
యువత ఉరుకుల పరుగుల ఊహలు..
మహిళల మహిమాన్విత మహత్తులు..
పురుషోత్తముల విజ్ఞాన సర్వస్వ ఉదాత్తాలు..
రాజ్యపాలన నిర్వాహణా మరమ్మత్తులు..
అవే కదా! భవిష్యత్ ప్రగతి తీర్థ తీరమార్గాలు..
అవే కదా! దేశజనుల సిరినవ్వుల పువ్వులు!!

Exit mobile version