[సౌనిధి గారు రచించిన ‘ఉగాది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
ఆమని గాత్రంలో చిత్రమైన చైత్ర గానం
తీయని పిలుపులతో పలకరించింది
పులుపుల బిగువులతో నిలిచింది
మమకారపు మాధుర్యాన్ని పంచింది
లవణపు అలంకరణతో అలరించింది
వగరైన పొగరును అణిచింది
చేదు నిజాలను దూరం చేసింది.
షడ్రుచుల సమ్మేళనమై
నూతన ఆశల చిగురుల తొడుగై
సరికొత్త కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికింది
తెలుగింట ఉగాది అడుగిడింది
పసిడి పంటల పునాది వేసింది
శుభాశుభ ఫలములు అందించింది
జీవితాన్ని శోభాయమానం చేసింది