[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘ఉగాది పండుగ’ అనే కవితని అందిస్తున్నాము.]
విశ్వానసుతో
కలుపుకొని ఎనభై ఒక ఉగాది
పచ్చళ్ళు తిన్న ఘన చరిత్ర నాది
మూడు తరాల ముచ్చట్లు
ముద్దుగా చెప్పుదామనీ
ముచ్చట పడిపోతున్న
ఇల్లు శుభ్రం చేయడం
పండుగులకు
ఆనవాయితీ
రైతు కుటుంబంలో
మామిడి తోరణాలు
పూల దండలు
చూడ ముచ్చటగా
వుండేవి
పండుగ కళ వెల్లివిరిసేది
ఏదో తెలియని కిక్
ఆ కిక్కే వేరబ్బా
కుట్టిచ్చిన బట్టలకు
పసుపు పూయడం
దేవుడి దగ్గర పెట్టి
దీవెనలు తీసుకోవడం
తప్పనిసరి
తినడం, తొడగడం
దేవునికి సమర్పించిన
తర్వాతే..
అమ్మ జమానలో
అంతా వాడి దయ
అనేది అమ్మ
ఇలవేలుపుకు
దండం పెడుతూ
ఉగాది పచ్చడి
తీపి, పులుపు, చేదు
రుచుల కలయిక
పిండి వంటలు పెట్టేది కాదు
ఉగాది పచ్చడి తాగందే
తప్పించుకు తిరిగే వాన్ని
అమ్మ వదిలేది కాదు
మొక్కుబడిగా
తాగి తాగనట్టు
చేసే వాన్ని
లెక్చర్ ఇచ్చేది అమ్మ..
జీవితం తీపి, చేదు, పులుపు
కలగలుపు
ఇదీ పచ్చడి అర్థం
అప్పుడు అర్థం కాలేదు
అర్థం చేసుకుంటున్న వయసులో
అమ్మ లేదు
మహా పట్టణంలో
పెట్టాము కాపురం
మామిడి తోపులు
ఫ్లాట్స్ కాలేదు ఇంకా
మామిడి ఆకులకు, పువ్వుకు
అప్పుడే వస్తున్న లేత పిందెలకు
కరువు లేదు
పూలు ఇంటింటికీ తిరిగి
అమ్మే వాళ్ళు మామిడాకులతో సహా
సర్వీస్ ఎట్ హోమ్ అన్న మాట
అమ్మ పద్ధతులు పాటించింది
మా ఇంటి మహాలక్ష్మి
సాధ్యమైనంత వరకు
ఆన్‍లైన్‌లో
ఆర్డర్ పెడితే
కొండ మీది కోతి
కూడా ఇంటి ముందు
హాజరవుతుంది
మూడవ తరంలో
అలంకరణలు
మొక్కులు
పూజలు
షరా మామూలే
ఉగాది పచ్చడి
ఇంట్లోనే తయారు
అరిసెలు, పూర్ణాలు
కూడా..
ఉగాది ప్రాశస్త్యం
టివీలో ప్రసారం
అవుతుంది
పంచాంగ శ్రవణం
గృహంలోనే
అందుబాటులో వుంది
టీవీలలో భేషుగ్గా
వినిపిస్తున్నారు
పోటీపడి
సర్వీస్ ఎట్ హోం
ఆన్‌లైన్ బతుకు అయ్యింది
ఆ జోష్. ఖుషీ
గత వైభవం
ఏ మాటకు ఆ మాట
చెప్పుకోవాలి
పాత చింతకాయ
పచ్చడి రుచి ఎక్కువబ్బా..
ప్రొ. పంజాల నరసయ్య డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పదవీవిరమణ చేశారు.