“నీ మెతకతనం వల్లే నీకు అన్నీ సమస్యలుగా కనిపిస్తున్నాయిరా ఉదయ్! నీ పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. నువ్వు ఎవర్నో ప్రేమించానని మీ వాళ్ళకు అబద్ధం చెప్పానన్నావు. నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నీలో ఎంతో కొంత మార్పు వచ్చింది” అన్నాడు మెచ్చుకోలుగా.
“లేదు శ్రీరామ్! అలా ఎందుకు చెప్పానా అని తరువాత బాధపడ్డాను. కానీ ఏం చెయ్యను? అదేదో విపత్కర పరిస్థితిగా అనిపించి ఆపద్ధర్మం అంటారు చూశావా అలా చెప్పేశాను. ఎప్పుడో ఒకసారి నేను చిన్న చిన్న అబధ్ధాలు చెప్పడం జరుగుతుంటుంది. కాని వాటివల్ల ఎవరికీ ఏమీ హానీ జరగదని మాత్రం చెప్పగలను” అన్నాడు ఉదయ్.
“మీ మామయ్య కూతురంటే నీకు ఏమాత్రం ఇష్టం లేనప్పుడు, ఆ సంగతి మీ వాళ్ళకు చెప్పినా వినిపించుకోనప్పుడు నువ్వే ఒకమ్మాయిని సెలక్ట్ చేసి పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళు. ఆ అబద్ధాన్ని నిజం చెయ్యి. సరిపోతుంది. అన్ని సమస్యలూ తీరిపోతాయి”
“ప్రేమలూ అవీ నా వల్ల కాదురా శ్రీరామ్! అసలు నాకు ఇప్పుడు పెళ్ళి గురించి ఆసక్తి కూడా లేదు. హఠాత్తుగా తెచ్చి పెట్టారు ఈ గొడవ. ముందు నేను నాకు తృప్తినిచ్చే పద్ధతిలో స్థిరపడాలి. శ్రీరామ్! నీతో మాట్లాడుతుంటే సమయం చాలదు. నా విషయాలన్నీ చెప్పాగా! నేను రేపు ఒంగోలు వెళ్ళాలి. ఎల్లుండి ఆదివారం ఉదయానికొచ్చేస్తాను. ఏం చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించు. ఒక మంచి పరిష్కారం చెప్పాలి నువ్వు”
“సరే వెళ్ళిరా. కానీ ఆదివారం మొత్తం మా ఇంట్లో ఉండేట్లు రావాలి మరి” అన్నాడు శ్రీరామ్.
“సరే, వెళ్ళోస్తాను” అంటూ బయటకొచ్చి తన బైక్ స్టార్ట్ చేశాడు ఉదయ్.
***
మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు చేరుకున్న ఉదయ్ హోటల్లో గది తీసుకొని తయారయ్యి టాక్సీలో చీమకర్తి వెళ్ళి తన దగ్గరున్న అడ్రసు ప్రకారం ‘తిరుపతి గ్రానైట్స్’ కి చేరుకున్నాడు. ఆఫీసులో యజమాని తిరుపతి స్వామి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వెళ్ళిందాకా బయట వేచి ఉండి తరువాత లోపలికెళ్ళాడు. ఆయనతో పరిచయం చేసుకున్నాడు.
తిరుపతి స్వామి ఆరడుగుల ఎత్తు, మిలటరీవానిలా బలిష్టమైన శరీరం. తెల్లటి పొడుగు చేతుల చొక్కా, అడ్డపంచె, చూపులో చురుకుదనం. గొంతులో గాంభీర్యం ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయుడు సినిమాలో తండ్రి కమలహాసన్‌లా ఉన్నాడు.
“ఇక్కడి విషయాలు అన్నీ నీకు చూపిస్తూ క్లుప్తంగా చెబుతాను పద” అంటూ బయటకు దారితీశాడు తిరుపతి స్వామి. ఉదయ్ ఆయన్ని అనుసరించాడు.
“చూశావుగా! ఇది శ్లాబ్స్ అండ్ టైల్స్ కటింగ్ ఫ్యాక్టరీ. మన గ్రానైట్ క్వారీ ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్లాక్ గెలాక్సీ రాయి మన దేశంలో ఒక్క ఈ చీమకుర్తి క్వారీల్లోనే దొరుకుతుంది. ఇవి మన క్వారీ నుంచి తీసుకొచ్చిన పెద్ద బండలు. వీటిని రా బ్లాక్స్ అంటారు. ఇవి ఎంత నాణ్యతగలవైతే అంత ఆదాయం. క్వారీలో ఎక్కడ రాయి తియ్యాలో బాగా పరీక్షించి చెప్పగలగటం ఒక స్కిల్. అలా చెప్పే వ్యక్తిని మార్కర్ అంటారు.
పైనుంచే చూసి వాటిలోపల ఏమాత్రం చిన్న పగుళ్ళుగానీ మచ్చలుగానీ లేకుండా నికార్సయిన బండను ఎంపిక చెయ్యడం చాలా ముఖ్యమైన పని. ఈ వ్యాపారానికి ఆయుపట్టు అదే. ఎందుకంటే వాటిల్లో లోపాలుంటే అవి శ్లాబ్స్ గా కట్ చేసిన తరువాత గానీ బయటపడవు. అప్పుడు ఆ బౌల్డర్స్ తియ్యటానికి పెట్టిన ఖర్చంతా వృధా అయిపోతుంది.
మార్కర్స్ ఈ వ్యాపారంలో చాలా ముఖ్యులు. ఆ నైపుణ్యం అనుభవం మీద వస్తుంది. అందులో కూడా కొందరు మాత్రమె నైపుణ్యం సాధించగలరు. ఎంత పాడినా అందరూ గాయకులు కాలేరుగా, అలా అనమాట.
ఎంత పెద్ద షీట్ వస్తే అంత ఎక్కువ ధర పలుకుతుంది. రా బ్లాక్స్‌ని, శ్లాబ్స్‌ని చైనా, యూరప్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటాము. కొన్ని బ్లాక్స్‌ని ఇక్కడ ఈ గ్యాంగ్ సా మిషన్ మీద శ్లాబ్స్‌గా కట్ చేసి లోకల్ మార్కెట్‌లో అమ్ముతాము.
టైల్స్ లేదా శ్లాబ్స్ కటింగ్ వరకూ వర్కర్స్ షిఫ్ట్స్ ప్రకారం చేస్తారు.
ఇంకా చాలా విషయాలు పనిలో దిగాక నీలాంటి కుర్రాళ్ళకి ఒక నెలలోపు అన్నీ తెలిసిపోతాయి. ఇక నీ విషయానికొస్తే యం.కాం చదువుకున్నావు కాబట్టి నీకు తగ్గ పనులు ఇక్కడ ఎకౌంట్స్, సూపర్వైజర్, మార్కెటింగ్, బ్యాంకు, ఇంకా కొన్ని ఆఫీసులకి వెళ్ళే పనులు ఉంటాయి. కొన్ని రోజులు అన్నీ దగ్గరుండి చూడు. నీవు బాగా రాణించగలను అని నువ్వు అనుకున్న చోట నిన్ను నియమిస్తాను.
ఈ గ్రానైట్ వ్యాపారంలో సూపర్వైజర్లుగా చేరి అనుభవం సంపాయించి సొంత ఫ్యాక్టరీలు, అదే! గ్యాంగ్ సా లు, పెట్టుకున్నవారున్నారు. సొంత ఫ్యాక్టరీలు అమ్ముకొని వేరే చోట పనిచేస్తున్న వాళ్ళూ ఉన్నారు. బొటాబొటిగా రోజులు వెళ్ళబుచ్చే వ్యాపారస్తులూ ఉన్నారు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా కమిషన్ బిజినెస్ చేసే వాళ్లూ ఉన్నారు.
మీ కుర్రాళ్ళ భాషలో చెప్పాలంటే ఇదొక సినిమా ఇండస్ట్రీలాంటిదని కూడా చెప్పొచ్చు. అదృష్టం ఇక్కడ అందరికీ ఎంతో కొంత ఉండి తీరాలి. ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ గడిపేవాడికి పెద్ద రిస్క్ ఉండదు. మహా అయితే ఉద్యోగం పోతుంది. మరోచోట వెతుక్కోవచ్చు. నువ్వు చేరుతున్నది ఉద్యోగంలోనే కాబట్టి ముందే భయపడాల్సిన పని లేదు. ఒక్క సంవత్సరం ఈ ఫీల్డ్ లో నిలకడగా పనిచేస్తేగానీ పూర్తి అవగాహన రాదు.
విజయవాడ నుండి నా మిత్రుడు దుర్గాప్రసాద్ ఫోన్ చేసి వాళ్ళబ్బాయికి నువ్వు మంచి స్నేహితుడవని నీ విషయంలో తనది భరోసా అని చెప్పాడు. కాబట్టి నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ చేరిపోవచ్చు. నీ దారి నువ్వే ఏర్పరుచుకోవచ్చు” అని చెప్పడం ముగించాడు.
“చాలా థ్యాంక్స్ అండీ! మీరే స్వయంగా వచ్చి అన్నీ వివరించి చెప్పారు. నాకు క్వారీల గురించి తెలియదు. కానీ స్టోన్స్, టైల్స్ గురించి కాస్త తెలుసు. నాకు ఇక్కడ అంతా బాగుంది. ముఖ్యంగా మీరు నాకు బాగా నచ్చారు. అలా నేరుగా చెబుతున్నానని వేరేలా అనుకోకండి. మీరన్నట్లు ఒక సంవత్సరం లోపల పని మాని వెళ్ళను. నేనొక వారం రోజుల్లో ఫోన్ చేసి వచ్చేస్తాను. దయచేసి మీవాళ్ళ చేత నాకు అద్దెకు ఒక గది వెతికిస్తే” అంటూ నీళ్ళు నమిలాడు.
“వేరే గది ఎందుకు బాబూ! ఒంగోలు టౌన్‌లో మనకొక గెస్ట్ హౌస్ ఉంది అందులో ఒక గదిలో నువ్వు ఉండొచ్చు. టౌన్ కదా అన్ని సౌకర్యాలూ ఉంటాయి” అన్నాడు.
“నాకు టౌన్ లోనే ఉండాలని లేదండీ! ఇక్కడ ఫ్యాక్టరీకి దగ్గరగా, అంటే ఈ చీమకుర్తిలో అయితే బావుంటుంది. నాకు సమయం కలిసొస్తుంది” అన్నాడు.
తిరుపతి స్వామి ఉదయ్ వైపు కొద్ది క్షణాలు నిశితంగా చూశాడు. “సరే అలాగేలే మా వాళ్ళకు చెబుతాను” అన్నాడు.
“నమస్తే అండీ! వెళ్ళొస్తాను” అంటూ బయటకు నడిచాడు ఉదయ్.
ఒంగోలు చేరాక హోటల్ రూములో తిరుగు ప్రయాణానికి తయారై వెళ్ళేముందు దుర్గాప్రసాద్ కి ఫోన్ చేశాడు ఉదయ్.
“అంకుల్! తిరుపతి స్వామిగార్ని కలిశాను. ఫాక్టరీ చూశాను. నాకు అంతా బాగనే ఉంది. ఒక వారంలో చేరిపోతానని చెప్పాను. అయితే అంకుల్! మా కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తిరుపతి స్వామిగారితో నేనేమీ చెప్పలేదు. మీరూ దయచేసి చెప్పకండి. ‘మీ నాన్న వ్యాపారం వదిలి ఇక్కడికెందుకొచ్చావు’ అనే ప్రశ్నకు నేను సరిగా సమాధానం ప్రస్తుతం చెప్పలేను. నేనంటూ ఇక్కడ ఉద్యోగంలో స్థిరపడితే అప్పుడు నేనే వీలు చూసుకొని చెప్తాను. కానీ మీకు నావల్ల ఏ విషయంలోనూ మాట రాదు అని మాత్రం హామీ ఇస్తున్నాను” అన్నాడు.
“అయ్యో అదేంటి ఉదయ్! నువ్వ మా అబ్బాయిలాంటి వాడివి. నిన్ను ఎవరూ ఏమీ అడగరు. వాళ్ళకు కావలసింది నీవు చేసే పని నచ్చడం. హాయిగా నీ పని నువ్వు చేసుకో. నువ్వు స్థిరపడితే ముందు సంతోషించేది నేనే. ఏమంటావ్?”
“థ్యాంక్యు అంకుల్! కాసేపట్లో హైద్రాబాద్ బయలుదేరుతున్నాను” అని ఫోన్ పెట్టేశాడు.
***
మరుసటి రోజు ఉదయం రైలు హైద్రాబాద్ చేరటం కాస్త ఆలస్యమైంది. ఉదయ్ ఇంటికెళ్ళే సరికి తొమ్మిది కావస్తోంది. కాసేపటికి తయారయ్యి “అమ్మా! నేను శ్రీరామ్ వాళ్ళింటికెళుతున్నాను. రాత్రికి వస్తాను. లేకపోతే రేపు ఉదయాన్నే వస్తాను” అన్నాడు.
“మొన్న రాత్రే కదరా వెళ్లొచ్చావు?”
“వాణ్ణి కలిసి చాలా కాలమైంది కదా? చాలా కబుర్లు చెప్పుకోవాలి. అన్నట్లు నాన్నేడి?”
“ఎవర్నో కలవాలని వెళ్ళాడు”
“నా గురించి అడిగాడా?”
“ఆ! ఉద్యోగ ప్రయత్నం మీద ఏదో ఊరెళ్ళాడని చెప్పాను”.
“ఏమన్నాడు?”
“‘ప్రైవేటు ఉద్యోగాలేగా ఎప్పుడైనా మానుకోవచ్చు. అందాకా వాడి సరదా ఎందుకు కాదనాలి’ అంటూ వెళ్ళాడు”. .
“సరే వెళ్ళొస్తా” అని బయలుదేరాడు ఉదయ్.
ఉదయ్ శ్రీరామ్ ఇంటికి చేరేసరికి అతన గదిలో ల్యాప్‌టాప్‌లో ఏదో పని చేసుకుంటున్నాడు.
“హాయ్ శ్రీరామ్” అంటూ ప్రక్కన కూర్చున్నాడు ఉదయ్
“రా ఉదయ్! వెళ్ళిన పనేమైంది?”
“ఒక వారం రోజుల్లో వచ్చి చేరమన్నారు. గ్రానైట్ కంపెనీ, బాగనే ఉంది”
“శాలరీ వగైరా మాట్లాడుకున్నావా?”
“అసలు అక్కడ నేనేం పని చేస్తానో తెలియదు. ఒక నెల తరువాత అన్నీ తెలుస్తాయి.”
“నాకు ఆశ్చర్యంగా ఉందిరా ఉదయ్! మీ నాన్న బాగా సంపాదిస్తున్నారు. నువ్వేమో పాత సినిమాలో హీరోలాగా ఎక్కడికో పోయి చిన్న ఉద్యొగం చేసుకుని బతుకుతానంటావు”
“నాకు మొదట్లో ఏ ఆలోచనా లేదురా. కానీ మా నాన్న బిజినెస్‌లో నేను ఇప్పటివరకూ సొంతంగా చేసిన పని ఏదీ లేదు. అసలు ఆ అవకాశం నాకు ఉండదు. అన్నిటికీ ఎవరో ఒకరు ఉంటారు. నేను ఊరికే చూస్తుండాలి. నాకు అది నచ్చదు. నామీద భరోసా లేదేమో! కొన్ని లావాదేవీల వ్యవహారాలు కూడా నాకు నచ్చవు. పాత సినిమా హీరోలాగ ఆలోచించడం తప్పంటావా?”
“నోనో అలా కాదురా. ఈరోజుల్లో నీలా ఎవరుంటారు? మీసాలొచ్చేసరికే అన్ని అలవాట్లు, అనుభవాలూ అయిపోయే రోజులివి. నువ్వు చెయ్యకూడని పని ఏదీ చెయ్యవు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడవు. ఎవరు బాధపడినా చూడలేవు. నువ్వు ముత్యంలాంటి వాడివిరా. అంటే మంచితనం పాళ్ళు మరీ ఎక్కువ అనమాట. నిన్ను కాస్త అమాయకుడిగా కొందరు చూడ్డంలో ఆశ్చర్యం లేదు. నీకు బిజినెస్ వ్యవహారాలు అప్పగిస్తే మోసపోతావేమో అని, లేదా కాస్త మతలబు చెయ్యాల్సిన చోట చెయ్యలేవేమోనని మీ వాళ్ళ ఉద్దేశం కావచ్చు. హైస్కూలు నుండి నీతో తిరిగిన వాణ్ణి కాబట్టి నాకు నీ గురించి బాగా తెలుసు. నీకోసం ఏమి చెయ్యాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను.”
“అందుకోసమేరా నాయనా నీ గురించి ఎదురు చూస్తున్నాను”
“సరే విషయానికొద్దాం. ఉద్యోగం సంగతి ఏదో చూసుకున్నానన్నావు. ఇక నువ్వు ప్రేమించావని చెప్పిన బెంగుళూరు అమ్మాయిని ఇప్పుడు మనం తయారు చెయ్యాలి. ఒకటి, మనతో చదివిన అమ్మాయిలు నీకు తెలిసిన నువ్వు వాళ్ళకు గుర్తున్న వాళ్ళెవరైనా ఇంకా పెళ్ళికాకుండా ఉంటే కనుక్కొని ఒక ప్రపోజల్ వదులుదాం. లేదా నీ పేరుతో ఒక మ్యాట్రిమోని లో ప్రొఫైల్ పెట్టి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మాట్లాడుదాం”
“మ్యాట్రిమోనీ లో వద్దులే శ్రీరామ్. ముక్కూ ముఖం తెలియని వాళ్ళు. కొంతైనా పరిచయం ఉంటే బాగుంటుంది కదా!”
“సరే నీ పని మీద నేనుంటాగానీ ఈలోగా నువ్వు ఉద్యోగంలో చేరి నెలకు ఎంత సంపాదిస్తావు లాంటి విషయాలు తేల్చి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకి కనీసం లక్షకు పైన జీతం ఉంటే ఆలోచిస్తాం అనేట్లున్నారు మరి”
“వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదేమో. ఇప్పుడు నేను ఏ ఉద్యోగంలో చేరినా అంత జీతం ఎట్టిపరిస్థితిలో నాకివ్వరు. నిజానికి నేను ఎప్పుడు పెళ్ళి చేసుకున్నా నాకు పెద్దగా చదువుకున్న అమ్మాయి అవసరం లేదు. ఇంటరో డిగ్రీనో చదివినా చాలు. పేద కుటుంబం అయితే మరీ మంచిది. అసలు నేను ఏదైనా ఉద్యోగంలో స్థిరపడ్డాకే పెళ్ళి గురించి ఆలోచించాలి. అప్పటిదాకా మావాళ్ళను అడ్డుకునేలా ఎలాగో కాలయాపన చెయ్యాలి. అదే ఇప్పుడు జరగాల్సిన పని”
ఇంతలో ఉదయ్ మొబైల్ మోగింది. శకుంతల మాట్లాడుతున్నది.
“ఉదయ్! మీ నాన్న ఇప్పుడే మా అన్నయ్య ఇంటి నుండి ఫోన్ చేశాడు. వచ్చేవారం మామయ్య కుటుంబం మన కుటుంబం కలిసి జైపూర్ టూర్ ప్లాన్ చేశారుట. వస్తూ ఢిల్లీ, ఆగ్రా, చూసుకొని రావడం. మొత్తం ఒక వారం టూర్. నీతో చెప్పమన్నాడు”
“లేదమ్మా! నాకు కుదరదు. వచ్చే వారం నేనొక ఉద్యోగంలో చేరతాను. ఇందాకే చెప్పావుగా, ‘వాడి సరదా ఎందుకు కాదనాలి అని అన్నాడని?’ మళ్ళీ ఇప్పుడు ఈ టూరేంటి?”
“నీకు ఒక మాట చెప్పి ఉంచమన్నాడు. నువ్వొచ్చాక అన్ని విషయాలు నీతో మాట్లాడతానన్నాడు”
“సరేగాని, ఏర్పాట్లు ఏవీ చెయ్యొద్దని చెప్పు”
“సరే చెప్తాలే. ఇంతకీ రాత్రికొస్తున్నావా?”
“లేదు రేపు ఉదయాన్నే వస్తాను”
“సరే” అని ఫోన్ పెట్టేసింది శకుంతల.
ఉదయ్ శ్రీరామ్‌లు ఒకరి ముఖం ఒకరు కాసేపు చూసుకున్నారు.
“మీ మామ కూతురుతో నీకు స్నేహం పెరగడానికే ఈ టూర్ ప్లాను అనిపిస్తున్నది రా ఉదయ్!”
“నిజమే! కానీ ఎట్టిపరిస్థితిలో వెళ్ళను. ఎలాగైనా వీలైతే రెండుమూడు రోజుల్లోనే ఒంగోలు వెళ్ళిపోతాను”
“పరిస్థితిని బట్టి చూస్తే నువ్వు ప్రస్తుతం వాళ్ళ టూర్ వద్దని ఒంగోలు వెళుతున్నానని చెప్పినా మీ నాన్నకేమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ రేపు నీతో పెళ్ళి గురించి మాట్లాడి ఖచ్చితంగా నిర్ణయం చేసే అవకాశం కనిపిస్తున్నది. అసలు నువ్వు ‘ఎట్టి పరిస్థితిలో ఇష్టం లేదు. ఈ ప్రయత్నాలు ఆపండి. నా నిర్ణయాలకు నన్ను వదిలెయ్యండి’ అని మీ నాన్నకు ఖచ్చితంగా తెగేసి ఒక్కసారి చెప్పలేవా?”
“అలా చెప్పిన తరువాత రోజు నుండి నేను మా అమ్మానాన్నలను, వాళ్ళు నన్ను చూసే దృష్టి మారిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. అదీగాక మానాన్న ఇప్పటికీ ఎంతోకొంత మా మామయ్య మీద ఆధారపడి ఉన్నాడు. వాళ్ళ రిలేషన్‌ను చెడగొట్టడం కూడా నాకు ఇష్టం లేదు”
శ్రీరామ్ ఉదయ్ భుజం తట్టి “నువ్వు మారలేదు సరిగదా రాముడు మంచి బాలుడు దగ్గర నుండి మహా మంచి బాలుడు దాకా ఎదిగావురా” అన్నాడు.
ఉదయ్ కాసేపు మౌనం తరువాత “అసలు పెళ్ళి గురించి మామయ్య వాళ్ళు మరీ ఇంత తొందరెందుకు పడుతున్నారో అర్ధం కావడం లేదు” అన్నాడు.
“నువ్వెవర్నో ప్రేమిస్తున్నానని చెప్పావు కదరా! అదొక కారణం కావచ్చు”
“నేనేదో చిన్ని అబద్ధం చెబుతే అటూఇటూ తిరిగి అది నా మెడకే చుట్టుకుంది”
శ్రీరామ్ కొంచెం సేపు ఆలోచించి “నువ్వు కోరుకున్నట్లు సాదాసీదా అమ్మాయి దొరికితే పెళ్ళి చేసుకుంటావా? ఓ పనైపోతుంది!”
“నువ్వు కూడా మా నాన్నకు తగ్గట్లున్నావురా. ప్రస్తుతం నా ఆలోచన ఇంతవరకే. రేపు మా నాన్నతో మాట్లాడి ఒంగోలు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉంటాను. ఆ తరువాత పరిస్థితిని బట్టి, నాకు తగ్గవాళ్ళు తారసపడితే పెళ్ళి గురించి ఆలోచిస్తాను. కానీ మా వాళ్ళకు తెలియకుండా పెళ్ళిచేసుకోవడం లాంటివి నేను చెయ్యను. అసలు అప్పుటి విషయం అప్పుడు ఆలోచిద్దాంలే”
“అవునూ! ఎవరో మెడికల్ స్టూడెంట్స్ ఆమ్మాయిలు పరిచయమయ్యారన్నావుగా! వాళ్ళిద్దరిలో నువ్వు ఎవర్నీ ఇష్టపడట్లేదా? అంటే నా ఉద్దేశం మరీ కొత్తవాళ్ళు కాకుండా కాస్త పరిచయమైన వాళ్ళు కదా అని అడుగుతున్నాను”
“నోనో లేదు శ్రీరామ్. వాళ్ళ అనుకోకుండా నాకు పరిచయం అయ్యారు. డాక్టర్లు డాక్టర్లనే పెళ్ళిచేసుకుంటే బావుంటుదని నేనే సలహా కూడా ఇచ్చాను”.
“అయితే నేను తెలిసిన వాళ్ళలో తీవ్రంగా ప్రయత్నిస్తాను. నువ్వు గట్టిగా నిలబడాల్సొస్తుంది మరి”
“నేను చాలా గట్టిగా ఉన్నాననిపిస్తున్నది శ్రీరామ్”
“ఏమోరా నాయనా! నిన్ను చూస్తే నమ్మకంగానే కనపడతావు. కానీ రేపు మీ మామయ్య దీనంగా ముఖం పెట్టి కన్నీళ్ళు పెట్టుకుని బ్రతిమాలాడంటే మెత్తబడిపోయి ఆయన కూతుర్నే చేసేసుకుంటావేమో అని కూడా డౌట్‌గా ఉంది”
ఉదయ్ ముఖం కాస్త గంభీరంగా పెట్టి “శ్రీరాం ఒకమాట అడుగుతాను నిజం చెప్పు! నేను మరీ అంత మెతక వాడినా? ఎవరైనా నన్ను మేనేజ్ చెయ్యగలరా? ఎంతో కొంత అసమర్థుణ్ణి కూడానా?ఉద్యోగం వ్యాపారాల్లో రాణించలేనా? ఇష్టం లేని అమ్మాయిని చేసుకొని, మా నాన్న వ్యాపారంలో ఏ పని చేయకుండా బొమ్మలా ఉంటూ జీవితం గడపాలా?” అడిగాడు.
“ఒరేయ్ ఒరేయ్! అదేంటిరా ఉన్నట్లుండి అంత భారీ డైలాగులు వదిలేశావు? రిలాక్స్! మెతకగా ఉండేవాళ్ళు ఉద్యోగాలు చెయ్యట్లేదనా నీ అభిప్రాయం? రోజులు గడిచే కొద్దీ వాళ్ళే గట్టి పడతారు. ఇక వ్యాపారం అంటావా, సాధారణంగా వ్యాపారం అంటే మోసం, అవినీతి ఉంటుందంది చాలా మంది నమ్మకం. అలాగని అందరూ అలాంటి వాళ్ళే అని చెప్పొచ్చునా? ఏదైనా దిగితే కదా లోతు తెలిసేది? ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఎలా వ్యవహరిస్తావో ఇప్పుడే ఎలా తెలుస్తుంది? ముందే అన్ని అవరోధాలు, అనుమానాలు గురించీ చర్చించుకుని దిగాలు పడితే చిన్నచిన్న పనులు కూడా చెయ్యలేం. భయపడే వాడికి తడిగా ఉన్న మెట్లమీద నడవటానికి కూడా సంశయం కలుగుతుంది అంటారు కదా!.
నా మటుకు నాకు ఇంజనిరింగ్ ఫైనల్‌లో క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ రాలేదు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉద్యోగాల్లో చేరిపొయ్యారు. అవసరమైన కోర్సులు చేశాను. తీవ్ర ప్రయత్నం చేశాను. జాబ్ సంపాదించుకున్నాను. ఇప్పుడు అందరితో పాటు కంఫర్టబుల్‌గా ఉన్నాను. అలా రాకపొతే కూడా మరేదో చేసే వాడిని. అంతేగానీ చేతులు ముడుచుకుని కూచుంటామా?
నువ్వైనా అంతే! నువ్వు తెలివి తక్కువ వాడివి కానే కాదు. అలా అయుంటే ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నలు వెయ్యవు. నీ వాలకమే మరో విధంగా ఉండేది. మా నాన్న చెబుతుండేవారు తను డిగ్రీ చదివే రోజుల్లో పీజీలు చేసిన వాళ్ళు పేపర్ బాయిస్‌గా సినిమా హాల్లో బుకింగ్ క్లర్క్‌లుగా కూడా పని చేసే వాళ్ళుట. అలాంటి పరిస్థితి ఇప్పుడుందా? ఇప్పుడు అవకాశాలు ఎక్కువ. నిబ్బరంగా నిలబడి ఆలొచిస్తే మార్గాలు దొరుకుతాయి. ఈ అనుమానం మాటలు ఇకపై మాట్లాడకు. పద! అమ్మ పిలుస్తోంది. భోజనం చేసి వద్దాం” అని లేచాడు శ్రీరామ్.
భోజనాల సమయంలో శ్రీరామ్ తల్లిదండ్రులతో కూడా కాసేపు కబుర్లు చెప్పాడు ఉదయ్.
ఇద్దరూ టెరేస్ మీదకి వెళ్ళారు. చల్లగాలి వీస్తోంది. దూరంగా బిర్లామందిర్ దీపకాంతుల వలయఒలో వైభవంగా కనబడుతున్నది. ఇద్దరూ కాసేపు అలానే కూర్చుండిపోయారు.
“ఇంతకూ అసలు నీ పెళ్ళి ప్రయత్నాల గురించి ఏమీ చెప్పలేదు. కొంపదీసి సింగపూర్లోనే ఎవర్నైనా సెలెక్ట్ చేసుకున్నావా?” అడిగాడు ఉదయ్.
“అనుకున్నాన్రా ఈ ప్రశ్న అడుగుతావని. మీ మామయ్యలాగా మా నాన్నకు కూడా కిషన్ రావు గారని ఒక ఆప్త మిత్రుడున్నాడు. వాళ్ళమ్మాయి ప్రస్తుతం యు.యస్.లో ఉంది. టి.సి.యస్ లో పనిచేస్తున్నది. వీడియో కాల్స్‌లో ఆ అమ్మాయితో మాట్లాడాను. ఓకే చెప్పేశాను. వచ్చే సంవత్సరం ఇండియాకొచ్చేస్తుంది. బహుశా అప్పుడు పెళ్ళి గురించి నిర్ణయిస్తారనుకుంటాను”
“ఓ ఫెంటాస్టిక్! మరి ఇంత గుడ్ న్యూస్ చెప్పకుండా ఇప్పటిదాకా నా బోర్ స్టోరీ వింటూ కూర్చున్నావా?”
“బోర్ స్టోరీ ఏంట్రా? ఇంకా మన స్టోరీలు సరిగ్గా మొదలే కాలేదు. అయినా నీకన్నీ మంచిగానే జరుతాయని నాకు నమ్మకముంది”
“ఎనీవే మై హార్టీ కంగ్రాట్యులేషన్స్ శ్రీరామ్”
“థ్యాంక్యూ”
“ఇవాళ్టికి ఇక నా టాపిక్ వద్దురా శ్రీరామ్. పద ఏదైనా సినిమాకి వెళ్లొద్దాం. ఈ గుడ్ న్యూస్ విన్న సందర్భంగా”.
నవ్వుతూ ఉదయ్ భుజం తట్టాడు శ్రీరామ్.
ఇద్దరూ కాసేపటికి బైక్ మీద బయలుదేరారు.
***
ఉదయ్ ప్రొద్దుటే నిద్రలేచి ఇంటికి చేరే సరికి ఏడు గంటలయ్యింది. శంభుప్రసాద్ వరండాలోనే అటూఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక్కోసారి అతను బయటకెళ్ళకుండా వాకింగ్ అలా కూడా చేస్తుంటాడు.
బైక్ ప్రక్కన పార్క్ చేసి వాళ్ళ నాన్నను చూస్తూ లోపలికెళ్ళాడు ఉదయ్. ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. ఆగి చూస్తూ నిలబడ్డాడు. దాదాపూ ఓ గంట తరువాత స్నానాదులు కానిచ్చి వాళ్ళమ్మ పిలువగా వచ్చి టిఫిన్ చెయ్యటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఉదయ్. కాసేపటికి పేపర్ చదువుతూ వచ్చి తనూ ఎదురుగా కూర్చున్నాడు శంభుప్రసాద్. ఎప్పుడోగాని తండ్రీకొడుకులు కలిసి టిఫిన్ గానీ భోజనం గానీ చెయ్యటం తటస్థపడదు. వాళ్ళిద్దరితో పాటు శకుంతల కూడా కూర్చుంది.
“ఏ ఊర్లోరా నీ ఉద్యోగ ప్రయత్నం? దొరికిందా ఇంతకీ?” మెల్లగా టాపిక్ మొదలు పెట్టాడు శంభుప్రసాద్.
కొద్దిసేపు ఆలోచించాడు ఉదయ్ “ఒంగోలు నాన్నా! గ్రానైట్ కంపెనీ”
“గ్రానైట్ కంపేనీనా? అంతా బండలు, దుమ్ము కదరా? అదీగాక ఒంగోలు బాగా వేడి ప్రదేశం. మన హైద్రాబాద్ లాగా కాదు”
ఉదయ్ ఏమీ మాట్లాడలేదు
“ఇంతకీ ఏంటక్కడ నీ పని, అకౌంట్సా?”
“తెలీదు నాన్నా! అన్ని పనులూ పరిశీలించి నిర్ణయించుకుంటాను”
“ఎవరి ద్వారా వెళ్ళావు అక్కడికి?”
“ఒక ఫ్రెండ్ ద్వారా”
“రికమండేషన్ నీకు నచ్చదేమో?”
“ఇది పరిచయమే. పైగా గవర్నమెంటు ఉద్యోగం కాదు. నా పని నచ్చకపోతే వెంటనే తీసేస్తారు”
“అయితే త్వరగానే వచ్చేస్తావన్నమాట. సరదాకి అన్నాలేరా. ఎందుకంటే సుకుమారంగా పెరిగినవాడివి. అక్కడ ఉండగలగాలి. వ్యవహారాలు నీకు తెలియవు. నీ మనస్తత్వమే వేరు. కొత్తవాళ్ళలో నువ్వు ఇమడటం అంత సులభం కాదు”
“ఫరవాలేదు నాన్నా ప్రయత్నిస్తాను. నువ్వూ సరే అన్నావుగా?”
(సశేషం)
భీమరాజు వెంకట రమణ చక్కని కథా రచయిత. సున్నితమైన హాస్యకథలకు ప్రసిద్ధి చెందిన వెంకట రమణ ‘కుడిఎడమైతే…’, ‘మనసు పలికె’, ‘కథకు కథ’, ‘కథలు-హాస్యకథలు’ అనే పుస్తకాలు వెలువరించారు.