[బాలబాలికల కోసం ‘ఉచితం అనర్థమే’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.]
అడవిలోని జంతువులు అన్ని ప్రకృతి సిధ్ధమైన జీవితం గడుపుతూ వారిజీవన సరళిలో ఎటుటువంటి మార్పులు లేకుండా జీవించసాగాయి.
అదే అడవిలోని కొన్ని కోతులు సిరిపురం గ్రామ సమీపంలోని పురాతన ఆలయానికి వచ్చేవారు ఇచ్చే పలురకాల పండ్లు ఆహరంగా తీసుకుంటూ తమ జన్మస్ధానమైన అడవిని దానితోపాటు తమ సహజమైన జీవన సరళిని మర్చిపోయి ఉచిత ఆహారానికి, సోమరితనానికి అలవాటుపడ్డాయి. ఇలా చాలా ఏళ్ళు అలా గడచిపోయాయి. అడవి గురించి తెలిసిన పాతతరం కోతులన్ని క్రమేపి మరణించాయి. కొత్త తరం కోతులు ఆలయం వద్దే పుట్టి పెరిగాయి కనుక వాటికి అడవి గురించి, అడవిలో తమ సహజ జీవనం గురించి తెలియదు.
కొంతకాలం అనతరం ఆలయం శిధిలావస్ధకు చేరడంతో కొత్త ఆలయం నిర్మాణం చేపట్టి పాత ఆలయం మూసివేసారు. భక్తులు ఎవరు ఆలయానికి రాకపోవడంతో, ఉచితంగా తమకు ఉన్నవద్దకే లభించే పండ్లు, ఫలాలు, కొబ్బరి చిప్పలు లభించక పోవడంతో ఆకలిబాధ తట్టుకోలేని కోతులగుంపు సిరిపురం గ్రామాన్ని చేరి దొంగతనంగా ఇళ్ళలోనికి చేరి అందిన ప్రతి ఆహరం తినసాగాయి. బెదిరించిన వారిపైన దాడి చేయసాగాయి. మూగప్రాణులు కదా అని కోతులపై జాలి చూపించి ఆహరం అందించడంతో అవి సహజంగా బ్రతకవలసిన అడవిని వదలి ఇలా గ్రామాలు, నగరాలలో జీవించసాగాయి. అడవులు తరిగిపోవడం కూడా కారణం అని గ్రహించారు.
సహజంగా ఎవరి ఆహరం కొరకు వారు శ్రమించాలి. అసందర్బంగా ఉచితంగా ఏది లభించినా అది అనర్థమే అని సిరిపురం గ్రామవాసులు తెలుసుకున్నారు.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.