Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉభయ సంకటం

[కన్నడంలో యతిరాజ వీరాంబుధి గారు రచించిన కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

కొడుకు షూలేస్ కడుతున్న నందిని, మామగారి స్వరం విని తల పైకెత్తి నవ్వింది.

“నాగూ, ఏయ్ నాగూ త్వరగా రావోయ్ ఇక్కడికి” అన్న మామగారి పిలుపును “ఏమండీ?” అనే అత్తగారి గొంతు అనుసరించింది. “ఆ పిట్ట చూడు ఎంత బాగుందో కదూ? మన ఊళ్ళో దీన్నెప్పుడూ చూళ్ళేదు” మామగారు రాజారావు గొంతు, తన ఐదేళ్ల కొడుకు నితిన్ తల దువ్వుతున్న నందినికి వినిపించింది.

“అవునండీ, మీ కళ్లు చాలా చురుకు. ఈ వయసులోనూ కళ్లద్దాలు లేకుండా అంత చక్కగా చూస్తున్నారు కదూ” అన్నారు అత్తగారు నాగలక్ష్మమ్మ.

నందిని లెక్క వేసింది. ‘ఈరోజు ఉదయం నుంచి మామగారు పిలవడం, అత్తగారు పరుగెత్తడం ఇది ఐదోసారి. నిన్నటి నుంచీ తానూ చూస్తూనే ఉంది. ఆ పిలుపులోని ఆప్యాయత వల్లనేమో, అత్తగారు ఈ యాభై ఏళ్ల వయసులోనూ జింకపిల్లలా పరుగెత్తుతారు.’

మనసు ఆలోచిస్తున్నా ఆమె చేతులు యాంత్రికంగా కొడుకు అల్పాహారం ప్లేట్ సిద్ధం చేసి టేబుల్‌పై పెట్టాయి. నితిన్‌ను స్కూల్లో వదిలి వచ్చి, తర్వాత అరగంటలో మూడేళ్ల కూతురు నిత్యను ప్లే హోంకు తీసుకువెళ్లాలి. అదృష్టవశాత్తూ స్కూళ్లు దూరంగా లేవు. ఇద్దరు పిల్లల స్కూళ్లు మొదలయ్యే సమయాల్లో ఒక గంట తేడా ఉండటం ఆమెకు కొంత వెసులుబాటు!

ఇద్దరినీ స్కూల్‌కి పంపించి, తాను వంట పూర్తిచేసి, దగ్గరలోని కూరగాయల షాప్ నుండి కూరగాయలు తెచ్చే సమయానికి నిత్య స్కూల్ వదిలే సమయం అవుతుంది. దాని భోజనం, నిద్ర అయిన తర్వాత, తాను, తన అత్తమామల భోజనం. ఉదయం ఆరు గంటలకు వెళ్ళిన భర్త నరేష్ రాత్రి తొమ్మిదింటికి తిరిగి వచ్చేవాడు. నందిని తన దినచర్యను గుర్తుచేసుకుంది.

మామగారు, అత్తగారు నిన్ననే హైదరాబాదుకు వచ్చారు. మామగారికి నెల్లూరులో ఉద్యోగం. ఇంకొక మూడు నెలల్లో రిటైర్మెంట్ ఉంది. ఎర్న్డ్ లీవ్ పెట్టి కొడుకు ఇంటికి వచ్చారు. నందిని కూరగాయలు తరగడానికి కూర్చుంది. “లేవమ్మా, నేను తరుగుతాను. వంకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి, పచ్చిమిర్చి కారం వేస్తే పులుసు ఎలా ఉంటుందో తెలుసా? నేను వంట చేస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో” అన్నారు అత్తగారు నాగలక్ష్మమ్మ. సంకోచంతో కత్తిపీటను వదిలి లేస్తూ, “అయ్యో ఫరవాలేదులెండి అత్తయ్యా. రాకరాక వచ్చారు మీరు. మీకెందుకు శ్రమ?” అంది నందిని.

“అరుదేంటమ్మా? ఉన్నది ఒక్కగానొక్క కొడుకు మాకు. ఈయన ఎవరికీ భారం కాకూడదు అని చెబుతుండటం, నెల్లూరులో క్వార్టర్స్‌లో ఉండటంతో సరిపోయింది. ఇక రిటైర్ అవుతారు కదూ? ఆ తర్వాత ఇక్కడే కదా మా మకాం” అన్నారు నవ్వుతూ నాగలక్ష్మమ్మ. ఆమె చేతులు వంకాయలను చకచకా తరుగుతున్నాయి.

“నాగూ.. నాగూ త్వరగా రా ఇక్కడికి” అని అరిచారు రాజారావు. “వస్తున్నానండీ.. హ్మ్!” అని గట్టిగా అన్నారు. ఆత్రంగా లేవబోయి వేలికి చిన్న గాయం చేసుకున్న నాగలక్ష్మమ్మ, కొంగు చివరను వేలికి చుట్టుకొని పరుగెత్తింది. “ఇది చూడు. ఈ స్టార్ టీవీలో వంట చూపిస్తున్నాడు. ఈరోజు అరుదుగా వెజిటేరియన్. నువ్వూ దీన్ని నాకు చేసి పెట్టు నాగూ” అన్నారు రాజారావు. “తప్పకుండా చేసి పెడతాను. మీరు ఎలా చేయాలో గుర్తుంచుకోండి. నెల్లూరులో చేసి పెడతాను” అని నవ్వారు నాగలక్ష్మమ్మ.

కానీ నెల్లూరు తిరిగి వెళ్లిన తర్వాత నాగలక్ష్మమ్మ ఆ వంట చేసి పెట్టలేదు. హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించారు. నరేష్, నందిని పిల్లలతో కలిసి నెల్లూరు పరుగుతీశారు. రాజారావు హఠాత్తుగా వయసు మీద పడిన వారిలా కనిపించారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించి, రిటైరైన తండ్రిని ఇంటికి తీసుకువచ్చాడు నరేష్.

నిరాశ, నిస్పృహలతో ఉదాసీనంగా కూర్చునే రాజారావుకు నిత్య, నితిన్‌లే ఉల్లాసం కలిగించేవారు. క్రమంగా కోలుకోవడం ప్రారంభించారు రాజారావు.

“నందూ, నీకో మాట చెబుతాను. అమ్మా, నాన్నా చాలా అన్యోన్యంగా ఉండేవారు. మనం ఇప్పుడు నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే ఉదయం ఆరు గంటలకు వెళితే రాత్రి తొమ్మిదింటికి వచ్చేవాడిని. నువ్వు నాన్నకు అమ్మ జీవించిలేదనే స్పృహ కలగకుండా ప్రేమతో చూసుకోవాలి, అవుతుంది కదూ?” ఆత్రంగా అడిగాడు నరేష్ నందినిని, ఒక రాత్రి రూమ్లో.

“అదేం మాటండీ. నాకూ చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ అంటేనే తెలియదు. దేవుడిలాంటి మామగారిని ఎలా చూసుకుంటానో మీరే చూస్తారు” అని భర్త చేతిని తన చేతిలో తీసుకుని అంది నందిని.

కానీ దాని కోసం ఆమె పడ్డ కష్టం! అదే తర్వాతి కథ.

***

ఎప్పటిలాగే ఆ రోజు కూడా తెల్లవారింది.

కాఫీ కోసం డికాషన్ పాత్రలో పోసి, పొయ్యిపై పెట్టి, పక్క పొయ్యిపై పాలు ‘హై’లో ఉంచి, పాలు పొంగగానే కలపాలి అనేంతలో “నాగూ.. ఛా! నందినీ, అమ్మా నందినీ ఇక్కడికి త్వరగా రావమ్మా” అని అరిచారు రాజారావు.

“వస్తున్నాను మామా” అని గట్టిగా చెప్పి, పాల పాత్రను పటకారుతో పట్టుకునేంతలో “త్వరగా రావమ్మా” మామగారి గొంతులోని ఆత్రం, భర్త మాటల జ్ఞాపకం, ఆమెను హాల్లోకి పరుగెత్తించాయి.

రాజారావు పేపర్ చదువుతున్నవారు, “చూడమ్మా, రేపు నీరు రాదట” అన్నారు తల ఎత్తి.

“ఓ” అని చెప్పి లోపలికి పరుగెత్తిన నందినికి వంటగది అరుగుపై వొలికిపోయిన పాలు స్వాగతం పలికింది. దాన్ని గుడ్డతో తుడిచి, సింక్లో పిండి శుభ్రం చేసి ఊపిరి తీసుకునే సమయానికి, “నందినీ.. నందినీ.. త్వరగా రా” అన్నారు రాజారావు.

“వస్తున్నాను” మళ్ళీ పరుగెత్తింది. “ఇక్కడ చూడమ్మా, ఎంత అన్యాయం. ఎవరో చిన్నపిల్లను దుర్మార్గులు ఎత్తుకుపోయారట. నువ్వు పిల్లల గురించి జాగ్రత్తగా ఉండమ్మా” అన్నారు రాజారావు విచారంగా ముఖం పెట్టి. “సరే మావయ్యా” అని ఆమె తిరిగి వంటగదికి వెళ్లినప్పుడు ఉట్టిగా మండుతున్న గ్యాస్ స్టవ్ కనిపించింది. పాలు దించి, శుభ్రం చేసే తొందరలో మామగారు పిలవడంతో గ్యాస్ స్టవ్ ఆఫ్ చెయ్యడం మర్చిపోయింది. అసలే రెండో సిలిండర్ కూడా లేదు. దాని కోసం తానే గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లాలి. ఎందుకంటే నరేష్‌కు తీరిక దొరకదు.

“అమ్మా” అని పిలిచారు పిల్లలు తమ చిన్న గొంతుకతో.

“ఓ లేచారా నా బుజ్జి పాపలూ. రండి.. బాత్రూంకి. నితిన్, నీకు పళ్లు తోముకోవడం వచ్చు కదరా, నిత్యకూ చూపించు ఎలా తోముకోవాలి అని” అని పిల్లలను సముదాయిస్తూ, తానే వాళ్ళ పళ్లు తోమి, ముఖం కడిగింది.

“అమ్మా స్కూల్‌కు టైం అయింది. నా ఫ్రెండ్ అనిల్ అప్పుడే వాళ్ళ మమ్మీతో వెళుతున్నాడు” అని గోల చేస్తూ తన సాక్స్ వంకరటింకరగా వేసుకుంటున్నాడు నితిన్.

వినిపించుకోవడానికి నందిని అక్కడ లేదు. ఎందుకంటే రాజారావు, మిజోరాం ప్రజల వస్త్రధారణను టీవీలో చూపించడానికి కోడలిని పిలిచారు.

“ఒక్క నిమిషం మావయ్యా” అని కొడుకు వైపు పరుగెత్తింది నందిని. రాత్రి నరేష్‌కు వడ్డించి, తానూ ప్లేట్ అన్నం పెట్టుకోబోయేంతలో మామగారి పిలుపు వచ్చింది. నరేష్ కూడా, “చూడు, నాన్నకు ఏమైనా కావాలేమో, పిలుస్తున్నారు” అన్నాడు.

అతనికి నందిని ఈ మూడు రోజులుగా ఎన్నిసార్లు చేస్తున్న పనిని వదిలి పరుగెత్తి మామగారి ముందు నిలబడుతోందో తెలియదు.

“ఏదో వార్తను ఉదయం పేపర్లో చూసి, నాకు చెప్పడం మర్చిపోయారట అందుకే పిలిచారు మామ” అంది నందిని, మామగారితో మాట్లాడి తిరిగి వచ్చి.

“ఓస్ అంతేనా?” అని నవ్వాడు నరేష్.

కానీ తర్వాత మూడు రోజుల్లో అత్తగారి ఓర్పు, సహనాల పట్ల అంతులేని గౌరవం కలిగింది నందినికి. మామగారు దేవుడి లాంటివారు. భోజనం, టిఫిన్ విషయాల్లో ఏ వంకా పెట్టేవారు కారు. ఏమి చేసిపెట్టినా మారుమాట్లాడకుండా తినేవారు. కానీ నందినికి మింగుడు పడని విషయం గత ఆరు, ఏడు రోజులుగా మామగారి అర్జెంటు పిలుపులు. ఈమె రావాలి ఆయన పిలవగానే. ఆయన పేపర్లో ఏదో వార్తనో, టీవీలో చిత్రాన్నో చూపించాలి. నందిని ఈ కాలం యువతి. నాగలక్ష్మమ్మగారంత సహనం, ఓర్పు ఎక్కడి నుండి రావాలి? ఇక తట్టుకోలేక ఒక రాత్రి గుసగుసగా భర్తకు చెప్పింది.

“ఏమండీ మామగారు..” అని ప్రారంభించగానే, “ఏం చేశావు నాన్నకు?” అన్నాడు హఠాత్తుగా నరేష్.

“నేనేం చేయలేదండీ. నేను చెప్పేది పూర్తిగా వింటారా లేదా..” అని మామగారి పిలుపుల గురించి వాపోయింది.

“నాకు తీరికే ఉండదండీ. టిఫిన్, కాఫీ చేయాలి. నితిన్, నిత్యలను రెడీ చేసి, స్కూల్లో వదలాలి. షాప్కి వెళ్లాలి. రేషన్ షాప్కి కూడా.. ఓహ్! ప్రతి పని చేయడానికి నేను రెడీ. కానీ మామగారి ఈ పిలుపులకు అటెండ్ అవడం నావల్ల కావట్లేదు. వారికి వారు పిలవగానే నేను వెంటనే అక్కడికి వెళ్లాలి. లేకపోతే బాధపడుతున్నారు. దయచేసి ఏదైనా సహాయం చేయండి. మీరైతే బిజినెస్ అని ఉదయం వెళితే సాయంత్రం వస్తారు” నరేష్ ఆలోచించాడు. భార్య చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఆమె ఒక్కతే అన్నీ చేయాలి. చేయను అని ఏమీ చెప్పడం లేదు ఆమె అయినా.. నాన్న..

“చూడు నందూ. నాన్న ఇన్నేళ్లు ఉద్యోగం అని బిజీగా ఉండిపోయారు. పైగా అమ్మ ఆయనకు తోడుగా, ముప్పై ఏళ్లకు పైగా ఉన్నవారు సడన్‌గా పోయారు. మహా స్వాభిమాని నాన్న. గట్టిగా ఏమీ చెప్పే వీలులేదు. ఇల్లు వదిలి వెళ్లినా వెళ్లొచ్చు” అన్నాడు. చాలా ఆలోచించి, చిన్నబుచ్చుకున్న నందినికి, “చూద్దాం. సమయం చూసి నాన్నకు నేనే నచ్చచెబుతాను” అన్నాడు నరేష్, ఆమెను ఓదారుస్తూ.

***

ఒక వారం గడిచింది. నందినికి మామగారి పిలుపుల బెడద నిరంతరంగా సాగుతూనే ఉంది.

“నందూ” అని పిలుస్తూనే లోపలికి ప్రవేశించాడు నరేష్. ఆ రోజు మామూలు కంటే అతను త్వరగా వచ్చాడు.

“ఏంటండీ?” అంది నందిని, నిత్యకు వేరే బట్టలు మారుస్తూ.

“నా ఫ్రెండ్ ప్రభాకర్ బాంబే టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు కదా? వాడు నీకు తెలుసు కదా?” అన్నాడు ఆమె జ్ఞాపకాన్ని తడుముతూ. అక్కడే టీవీ చూస్తూ కూర్చున్న రాజారావు కూడా కొడుకు వైపు తిరిగారు.

“ప్రభాకర్‌ను ఆరు నెలలు మెక్సికో సిటీకి డెప్యూట్ చేశారట. నీకు తెలుసు కదా వాడితో వాళ్ళ తండ్రి మాత్రమే ఉండే విషయం. వాడికి ఇప్పుడొక సమస్య వచ్చింది. తండ్రిని ‘హోం ఫర్ ది ఏజ్డ్’లో వదలడానికి మనసొప్పడం లేదట. ఒక్కరినే బాంబేలో వదలడానికి భయమట. నువ్వు జస్ట్ ఆరు నెలలు చూసుకుంటావా అని నా ఆఫీస్ అడ్రస్‌కి ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం చూస్తే నన్నే నమ్ముకున్నట్టు ఉన్నాడు వాడు” అన్నాడు స్నేహితుడి ఉత్తరాన్ని చూపిస్తూ.

“అయ్యో, దానికేం భాగ్యం. వారిని ఇక్కడికి రానివ్వండి. ఇంకొకరికి వంట చేయడానికి నాకేం కష్టం కాబోదు” అంది నందిని వెంటనే. భార్యపై ప్రేమ పొంగింది నరేష్‌కు.

“వారి వయస్సు ఎంత?” అడిగారు రాజారావు.

“అరవై ఉండవచ్చు” అన్నాడు నరేష్.

“అలాగైతే నాకూ తోడు అవుతుంది” అని చెప్పారు రాజారావు.

***

పది రోజుల తర్వాత కుర్లా ఎక్స్‌ప్ర వచ్చి దిగారు నరహరి శాస్త్రి. చిన్న ఆకారం, లక్షణమైన ముఖవర్చస్సు. అరవై ఏళ్ల వయస్సు అయినా హుషారుగా ఉన్నారు.

“రండి రండి శాస్త్రిగారూ” ఆహ్వానించారు రాజారావు. క్షేమ సమాచారాల తర్వాత భోజనం అయింది. రాత్రి కావడంతో త్వరగానే పడుకున్నారు నరహరి శాస్త్రి.

మరుసటి రోజు ఉదయం లేచిన రాజారావు ముఖం కడిగి, పేపర్ కోసం ప్రతిరోజు కోడలు ఉంచే చోట వెతికి నిరాశ చెందారు.

“అమ్మా, నందినీ..” అని అరిచారు.

నందిని కాదు వారికి సమాధానం ఇచ్చింది, నరహరి శాస్త్రి. బాల్కనీలో రెండు కుర్చీలు వేయించి ఒక దానిపై ఆసీనులై ఉన్నారు శాస్త్రి. స్నానాన్ని అప్పుడే ముగించినట్లుగా వారి నుదుటిపై ఉన్న కుంకుమ చెబుతోంది.

“రండి రావుగారూ, నాకు తెలుగు పేపర్ దొరకడమే కష్టం అక్కడ. అయినా ఇంగ్లీషో, తెలుగో మొత్తానికి మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదవకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. మీరేమంటారు?” అన్నారు చేతిలోని వార్తాపత్రిక పేజీ తిరగేస్తూ. ‘అలాగైతే నాకు ఇప్పుడే పేపర్ దొరకదు’ అనుకున్నారు రాజారావు. ఎందుకంటే శాస్త్రిగారు ఇంకా ఏడో పేజీ నుండి ముందుకు చదవాలి. అయినా మర్యాద కోసం, “నేనూ అంతే రిటైర్ అయ్యే వరకు..” రాజారావు మాట ముగిసిందో లేదో శాస్త్రి మొదలెట్టారు. “రిటైర్మెంట్ అనగానే జ్ఞాపకం వచ్చింది చూడండి. సంవత్సరం క్రితం నేను రిటైర్ అయినప్పుడు..” నిరర్ఘలంగా దూకింది వారి నోటినుండి మాటల జలపాతం.

రాజారావుకు పేపర్ దొరకలేదు. దాంతో పాటు శాస్త్రి ఉపన్యాసం కూడా ముగియలేదు. ఊరికే తల ఆడించవలసిన చోట ఆడించి, నవ్వవలసిన చోట నవ్వి, బాధ చూపించవలసిన క్షణంలో ‘ఛీ, ఛీ’ అంటూ ఎదురు కుర్చీలో కూర్చొనే ఉన్నారు.

శాస్త్రిలో ఒక విలక్షణమైన గుణం ఉంది. మాట్లాడుతూనే పేపర్ చదవగలరు. చివరకు పేపర్ రాజారావుకిచ్చి ఒళ్లు విరుచుకున్నారు.

వెంటనే పేపర్ చేతిలోకి తీసుకొని దానిలో తలదూర్చారు రాజారావు. ‘అబ్బా! ఇప్పుడు వార్తలు చదువవచ్చు’ అని అనుకుంటుండగా ఒక వార్త కనిపించింది.

“అమ్మా నందినీ..” అని అరిచారు.

“ఏంటి రావుగారూ?” అడిగారు ఎదురుగా ఉన్న శాస్త్రి.

ఇప్పుడు సమాధానం ఇవ్వక తప్పలేదు రాజారావుకు.

మామగారి పిలుపుకు పరిగెత్తుకు వచ్చిన నందినికి, వారి దృష్టి తన వైపు లేకపోవడం చూసి తిరిగి లోపలికి వెళ్ళింది వంటగదిలో పోపు మాడుతున్న వాసన రావడంతో.

“అదిగో ఈ పేపర్లో నలభై ఏళ్ల మహిళకు ముగ్గురు పిల్లలు ఒకేసారి అని..” రాజారావు మాట పూర్తి కాలేదు. వెంటనే శాస్త్రి అడ్డగించారు.

“అయ్యో, మా ఊళ్లో, అదే బుచ్చిరెడ్డిపాలెంలో.. ఏం అయింది అనుకుంటున్నారు? మా పటేల్ గారి ఇంటి పనిమనిషికి ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు! ఊరి వాళ్లందరూ ఆ రోజు జాతర ఆమె ఇంటి ముందు ఆ పిల్లలను చూడడానికి..” సుమారు పది నిమిషాలు నడిచింది వారి ఉపన్యాసం. రాజారావు మళ్ళీ నోరు తెరిచే సాహసం చేయలేదు.

లోపలికి వచ్చి, టిఫిన్ తింటూ టీవీ ఆన్ చేశారు రాజారావు. వారికి ఇష్టమైన టెన్నిస్ ఆట మళ్లీ ప్రసారం అవుతోంది.

“నందినీ..” అని అరిచారు రాజారావు.

“ఏం కావాలి రావుగారూ? మీకు తెలుసా? పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా ఊళ్లో నేనే ఛాంపియన్..” శాస్త్రికి సకల విద్యలూ తెలిసినట్లు అనిపించింది రాజారావుకు, మరో పది నిమిషాల ప్రసంగం ముగిసినప్పుడు.

తరువాత ఒక వారంలో శాస్త్రికి సినిమా, క్రీడలు, కళలు, నాటకం, సాహిత్యం, సంగీతం మొదలైన అన్ని విషయాలూ కొట్టినపిండి అని తెలిసొచ్చింది.. రాజారావు కోడలిని పిలవడానికే భయపడుతున్నారు ఇప్పుడు. కోడలిని పిలిచి ఏదైనా చూపించాలంటే ఈ మహానుభావుడు తన చరిత్ర ప్రారంభించేవారు.

నందిని కూడా ఈ మార్పును గమనించింది. సమవయస్కులు కలిసినప్పుడు కబుర్లు, కథలు ఉంటాయి కదా, అనుకుంది.

రాజారావుకు నెమ్మదిగా ఒక విషయం అర్థమైంది. ‘ఈ మహానుభావుడి చర్య వలన, నేను ఇతరులను ఎంత బాధ పెడుతున్నానో అనే ఎరుక కలిగింది. పాపం! నా కోడలు బంగారం లాంటి అమ్మాయి. అన్నిటినీ సహించింది. ఇతని పీడ తప్పించుకోవాలంటే కోడలినే శరణు వేడాలి’ అని మనసులో నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం నందిని నితిన్ను స్కూల్‌కి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాజారావు ఆమె దగ్గరికి వచ్చారు. శాస్త్రి ఎక్కడా కనిపించలేదు.

“అమ్మా నందినీ. నేను నీతో వస్తాను. నితిన్ స్కూల్ చూపించు, ఈరోజు. రేపటి నుండి నేనే వాడిని తీసుకువెళ్తాను, తీసుకువస్తాను, నీకు కొంచెమైనా చేతికి విరామం దొరుకుతుంది” అన్నారు అభ్యర్థించే ధ్వనిలో.

సంకోచంతోనే నందిని అంగీకరించింది.

‘అబ్బా! కొద్దిసేపైనా ఆ మనిషి బాధ తప్పింది. ఆ ప్రభాకర్ ఎలా సహిస్తాడో’ అని కూడా అనిపించడం మొదలైంది రాజారావుకు.

మరుసటి రోజు నిత్యను కూడా తానే తీసుకువెళ్లారు రాజారావు. “నాకే ఒంటికి ఎక్సర్‌సైజ్ కదమ్మా” అన్నారు సంజాయిషీ ఇస్తున్నట్లు.

మరో నాలుగైదు రోజుల్లో కూరగాయలు, కిరాణా, రేషన్ షాపుల పని కూడా తానే చేయసాగారు.

“చూడమ్మా, నాకూ ఇంట్లోనే ఉండి ఉండి విసుగొచ్చింది. అది కాకుండా మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటే. హ్మ్! బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వు. దాన్నీ నేనే చూసుకుంటాను” అని ఆజ్ఞాపించారు రాజారావు.

నందినికి ఇది కలేమో అనిపించింది. ఇకపై తాను పిల్లలు పుట్టకముందు చేస్తున్న ఎంబ్రాయిడరీ, బొమ్మల తయారీ మళ్లీ మొదలు పెట్టవచ్చు అనే సంతోషం కూడా కలిగింది.

రాజారావు అదృష్టానికి శాస్త్రికి సినిమా పిచ్చి ఉండడంతో కేబుల్ టీవీలో రోజుకు రెండు మూడు సినిమాలు చూస్తుండేవారు. వీరి వెనుక వస్తానని అనేవారు కాదు. కానీ చేతికి దొరికినప్పుడల్లా వీరు భరించలేనంత నస పెట్టేవారు.

ఇలాగే ఒక నెల గడిచింది. రాజారావుకు ఇష్టమైన టీవీ చూడడం, పేపర్ చదవడం, కోడలిని మాటిమాటికీ పిలవడం అన్నీ తగ్గిపోయాయి.

ఒక సాయంత్రం కరెంట్ లేదు. శాస్త్రి, “ఎవరో పరిచయస్థులు పిలుస్తున్నారు. ఈరోజు సినిమా లేదు. వారి ఇంటికి వెళ్లి వస్తాను” అని బయటకు వెళ్లారు. నరేష్ వచ్చినా శాస్త్రి రాలేదు. భోజనం చేసి రావచ్చు అనుకుంది నందిని. కొడుకు నరేష్‌ను ఏకాంతంలో పిలిచి, “నాయనా నరేషూ, నీ నుండి ఒక సహాయం కావాలి” అని కొడుకు దృష్టిని ఆకర్షించి మాట కొనసాగించారు.

“నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నాగూ జ్ఞాపకం ఉంది. కానీ బాధ లేదు. నందినికి నా నుండి కొంచెం విరామం దొరికినందుకే నాకు సంతోషం పాపం! ఆ అమ్మాయి నా సోది ఎలా సహిస్తుండేదో ఏమో?.. కానీ..” మాట ఆపేశారు.

తండ్రి మనసుకు ఏదో బాధ కలిగిందని గ్రహించిన నరేష్, వెంటనే “ఏమయింది నాన్నా?” అన్నాడు.

“ఏమీ లేదు, ఈ శాస్త్రి..” అని ముఖం చిట్లించుకుంటుండగానే, “రావుగారూ.. రావుగారూ.. ఈ చీకట్లో ఎక్కడున్నారు? మీకు ఒక పసందైన వార్త చెప్పాలి” అంటూ శాస్త్రి రానే వచ్చారు.

కొడుకుతో చెప్పాలనుకున్న మాటను గొంతులోనే దిగమింగి శాస్త్రిగారి సుత్తిని వినడం ప్రారంభించారు.

***

“ఏమండీ మీకు ఉత్తరం వచ్చింది” అంటూ రాత్రి ఇంటికి వచ్చిన నరేష్‌కు ఉత్తరం అందించింది నందిని.

అక్కడే శాస్త్రి, రాజారావూ ఉన్నారు. పిల్లలు పడుకున్నారు. ఉత్తరం విప్పి చదివిన నరేష్ శాస్త్రిని ఉద్దేశించి

“శాస్త్రిగారూ, మీ నుండి ఒక ఉపకారం కావాలి. మీరు కాదంటే నా ఫ్రెండ్‌కు నిరాశ కలుగుతుంది” అని ఉపోద్ఘాతంగా అన్నాడు.

“ఏమిటి విషయం చెప్పు బాబూ” అన్నారు శాస్త్రి.

“మీ ప్రభాకర్, నేను, గంగాధర్ ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ అని మీకు తెలిసిన విషయమే కదా. ప్రభాకర్ వాడికి మీరిక్కడ ఉన్న విషయం తెలిపాడట. ఇప్పుడు గంగాధర్ ఉత్తరం రాశాడు. వాడు సీ.ఈ.ఓగా ఉన్న విషయం మీకూ తెలుసు. వాడికి షిల్లాంగ్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. వాడికి అక్కడ ఒక్కడే ఉండడానికి బోర్ అట. ఇక్కడ ఉండే బదులు ప్రభాకర్ వచ్చేవరకు నాతో ఉండనీ. కాలక్షేపంగా ఉంటుంది అని రాస్తున్నాడు. ఏమంటారు?” అడిగాడు నరేష్.

రాజారావు గుండె వేగంగా కొట్టుకోసాగింది. ‘ఈ మనిషి అంగీకరిస్తే చాలు. నా మానాన ఈయన బాధ లేకుండా మనవళ్లు, ఇంటిపనులు చూసుకుని హాయిగా ఉండొచ్చు’ అని దేవుడిని ప్రార్థించారు రాజారావు.

నందినికి ఆశ్చర్యం! శాస్త్రి అంత పాపులర్ అని ఆమెకు తెలియదు.

దేవుడు రాజారావుకు మోసం చేయలేదు. శాస్త్రి, “నాకేం అబ్బాయ్, ఏదో ఒక చోటు. కొడుకు వచ్చేవరకు ఎక్కడైనా ఒక చోట ప్రశాంతంగా సమయం గడిపితే చాలు” అన్నారు.

మరుసటి రోజే నరేష్ స్కూటర్‌పై శాస్త్రిని కూర్చోబెట్టుకున్నాడు. “స్టేషన్‌లో వదిలి వస్తాను” అన్నాడు నందినితో.

“రావుగారూ మళ్ళీ కలుసుకుందాం” అని బెదిరించి, అందరికీ టాటా చెప్పి బయలుదేరారు శాస్త్రి. కానీ వారు చేరుకున్నది స్టేషన్‌కు కాదు. అదే నగరంలోని ప్రఖ్యాత నాటక కంపెనీ రంగకళాసమితి భవనానికి.

“శాస్త్రిగారి పాత్రను చాలా చక్కగా అభినయించారు, ఎప్పుడైనా అవసరమైతే మళ్లీ రమ్మని చెబుతాను. వస్తారు కదూ?” అడిగాడు నరేష్, వారి చేతికి నోట్ల కట్టను అందజేస్తూ.

“దానికేం భాగ్యం స్వామీ? తప్పకుండా వస్తాను. పొట్టకూటికి స్టేజిపై కాక మీ ఇంటిలో నటించాను. అంతే. నిశ్చింతగా వెళ్ళి రండి” అని చెప్పి, స్కూటర్ స్టార్ట్ చేసిన నరేష్‌కు, దండం పెట్టారు.

కన్నడ మూలం: యతిరాజ వీరాంబుధి

తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్

Exit mobile version