Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తువ్వాలు

[డా. కట్టమూరి చంద్రశేఖరమ్ గారు రచించిన ‘తువ్వాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. ‘అభినందన’ సంస్థ (విజయనగరం) ఫిబ్రవరి-మార్చ్ 2025లో నిర్వహించిన హాస్య కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ.]

ప్పుడే ఊరునుండి వచ్చి, కాళ్లు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాను. గబగబా సూట్‌కేస్ తెరచి, అందులోంచి తువ్వాలు తీసి గట్టిగా దులిపాను (ఆ శబ్దం మా ఆవిడకు వినపడేలాగా). మా ఆవిడ దగ్గరకు వెళ్లి “ఇదిగో తువ్వాలు మరచిపోకుండా తెచ్చాను, చూడు” అంటూ కాలర్ ఎగరేశాను.

“అఘోరించారు లెండి. దాన్ని పెరట్లో దండెం మీద ఆరవెయ్యండి” అంది ఆవిడ.

ఎప్పుడు క్యాంపుకి వెళ్ళినా నేను తువ్వాలు పారేసుకొని వస్తానని ఆవిడ నమ్మకం. అయితే ఇందులో రవ్వంత నిజం కూడా లేకపోలేదు. అదేం ఖర్మమో, తువ్వాలు తడిపి పెరట్లో దండెం మీదనో తలుపుల మీదనో వేస్తాను. మరలా ప్రయణం తొందర్లో దాన్ని మరచిపోయి, ఎంచక్కా దాన్ని అక్కడ వదిలేసి వస్తాను.

ఈసారి మాత్రం మరచిపోకుండా తెచ్చానని కాస్త గర్వం కూడా. అందుకే ఇంట్లోకి రాగానే తువ్వాలు తీసి ఆవిడకు చూపించాను. తువ్వాలు పెరట్లో దండెం మీద ఆరేసి లోపలకు వచ్చి కుర్చీలో కూలబడ్డాను.

మా ఆవిడ వేడి కాపీ తెచ్చి ఇచ్చింది.

“పట్టికెళ్లిన వస్తువులన్నీ తెచ్చారా? మళ్లీ ఏదైనా మరచిపోయారా? అసలే మతిమరపు మనుషులు కదా!” అంది.

“చూసుకో పెట్టి తెరచి, ఈసారి ఏం మరచిపోలేదులే” అన్నాను.

 తెచ్చిన సామాన్లన్నీ ఎక్కడివక్కడ సద్దేసింది.

“ఇప్పుడు టైం ఎంతయింది?” అంది.

“వాచీ చూసుకోవచ్చుగా?” నా సమాధానం.

“బడాయి చాలు కానీ, చేతి వాచీ చూసి చెప్పండి.”

“నా చేతికి వాచీ లేదు. అది టేబుల్ మీద ఉందేమో చూస్కో.”

“అక్కడ లేదు కాబట్టే, మిమ్మల్ని అఘోరించడం, చేతి వాచీ ఎక్కడ పెట్టారు?”

ఆవిడ అరుపుతో నాలో ఆందోళన ప్రారంభమయింది. చేతి వాచీ అంటే చేతికుండాలి, లేకపోతే, రోజూ పెట్టే టేబుల్ మీద ఉండాలి.

వెంటనే లేచాను. టేబుల్ మీద వాచీ లేదు.

‘ఏమైందబ్బా?’ అనుకున్నాను.

అల్మారాలో వెతికాను. అక్కడా లేదు.

“నేను క్యాంపు వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారా?”

“ఆ! మనవడు, అరుణ్ ఫ్రెండ్సు వచ్చారు.”

“అయితే వాళ్లలో ఎవరో దాన్ని కొట్టేసారు” అన్నాను అసహనంగా.

“క్యాంపుకి వెళ్లినప్పుడు మీరే పట్టుకెళ్లారు.”

“లేదు, నేను తీసుకొని వెళ్ళలేదు” – గట్టిగా దబాయించాను.

“తీసుకొని వెళ్ళకపోవడమేంటి, ఆటోలో కూర్చుని అమ్మాయిని పిల్చి వాచీ తెప్పించుకొని మరీ వెళ్లారు” అంటూ ఆవిడ రెట్టించింది.

‘చచ్చిందిరా గొర్రె’ – అనుకుంటూ ఆలోచనలో పడ్డాను.

నేనే తీసుకొని వెళ్తే, ఏమైనట్టూ? ఎంత ఆలోచించినా ఈ మట్టి బుర్రలోకి ఆలోచన వచ్చి చావడం లేదు.

“ఎక్కడ పారేసారు నిక్షేపం లాంటి వాచీ?” అంది ప్రతిపక్షం.

అసలే వాచీ ఏమైపోయిందోనని నేను బాధపడుతుంటే ఆవిడ సూటిపోటి మాటలు – అట్టులో కారం ఎక్కువైనట్టు వికారంగా తోచాయి.

ఆలోచించగా, ఆలోచించగా చివరికి జ్ఞాపకం వచ్చింది.

రైల్లోంచి దిగడానికి ముందు వాష్ రూమ్‌కి వెళ్లి ముఖం కడుక్కొని, తువ్వాలుతో తుడుచుకున్నాను. అప్పుడు వాచీ తీసి అక్కడ బల్ల మీద పెట్టాను. ఎలాగైనా తువ్వాలు మరచిపోకూడదనే కంగారులో తువ్వాలు జాగ్రత్తగా తెచ్చాను.

కానీ..

“ఇప్పటికైనా జ్ఞాపకం వచ్చిందా?” అంది మా ఆవిడ

“అదే! ఆలోచిస్తున్నాను” అన్నాను మాట మారుద్దామని.

తువ్వాలు హడావిడిలో పడి రైల్లో మరచిపోయిన వాచీ గుర్తుకువచ్చింది.

మామగారు పెళ్లినాడిచ్చిన వాచీ, 50 సంవత్సరాలు బట్టి, ఆయన గుర్తుగా దాచుకొంటూ వచ్చాను. కానీ, ఈరోజు..  అది తలుచుకోగానే, రెండు కన్నీటి బిందువులు నా కళ్ల నుండి జారాయి.

Exit mobile version