Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-40

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ముగింపుతో మొదలు!!:

అదో పెంకుటిల్లు.

వరండాలోని చెక్కతో చేసిన వాలు కుర్చీ నిదానంగా పైకీ క్రిందకి ఊగుతోంది, కుర్చీలో కూర్చున్న తాత మనసులాగానే..

చలికాలం కావడంతో తొందరగానే చీకటి పడింది.

అది మారుమూల పల్లెలోని ఓ ఇల్లు. ఊర్లో కరెంట్ కూడా లేని రోజులవి. జీతగాడు దీపం బుడ్లను తుడిచి చమురు పోసి వెలిగిస్తున్నాడు.

ముందు గదిలో ఓ మూలన జొన్నలు, కందుల బస్తాలు దొంతరులుగా పడి ఉన్నాయి. అంతలో వరండాలో కూర్చున్న తాత చెవులకు – ‘కిచ్ కిచ్’ అన్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటో, ఎప్పుడు అలా వస్తుందో తాతకు తెలుసు. అందుకే వరండాలోనే ఉన్న జీతగాడితో –

‘ఓరేయ్, ఎలుకల గోల ఎక్కువైందిరా, జొన్నలు కందులు తిని తినీ బలిసిపోయాయిరా. రేపో మాపో బోను పెట్టరా. తిక్క కుదురుతుంది’

అంతలో ‘కిచ్ కిచ్..’ అన్న శబ్దానికి తోడు ఇంట్లోని వెనుక గదిలో నుంచి మరో రకం శబ్దం రావడం మొదలైంది. తాత చెవులు రిక్కించి విన్నాడు. అది కచ్చితంగా ఎలుక చేసే శబ్దమైతే కాదు. ఏమై ఉంటుందబ్బా???

అంతలో మంత్రసాని ‘ఎఱ్ఱది’ పరుగులాంటి నడకతో వరండాలోకి వచ్చింది.

‘పెద్ద దొరగారండీ, ఎలుక పుట్టింది’ – అనేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా మళ్లీ అదే పరుగులాంటి నడకతోనే లోపలకు వెళ్ళింది.

‘ఎలుక పుట్టడేమిటి..!!’ వెంటనే అర్థం కాక గుబురు మీసాల దగ్గర గోక్కున్నాడు తాత.

ఆ తర్వాత తెలిసింది అసలు సంగతి.

దక్షిణం వైపున ఉన్న వెనుక గది వైపు చూశాడు. తలుపు సందుల్లోంచి ఓ కొత్త వెలుగు ప్రసరించడాన్ని చాలా స్పష్టంగా గమనించాడు. కోడలు ప్రసవించింది. విషయం తెలియడంతో చేతి వేళ్లను పైకీ క్రిందకి కదిలిస్తూ ఏవేవో లెక్కలు వేసుకుంటున్నాడు తాత.

కాసేపటికి లోపలకు రావచ్చన్న పిలుపు రావడంతో తాత అడుగులు దక్షిణం గదివైపుకు కదిలాయి.

మనవడు పుట్టాడు. కానీ ఎలుక పిల్లలా ఉన్నాడు. అప్పటికే చీకటి పడింది. గుడ్డి దీపాల వెలుగులో కోడలి ప్రక్కన పడుకున్న ఓ చిన్న ఆకారాన్ని చూశాడు. జానెడు కూడా లేదు ఆకారం. ఎలుక పిల్లలా అది కదలాడుతోంది. పరీక్షగా చూశాడు తాత.

ఏదో ఒక రకమైన దిగులు తాత మొహంలో స్పష్టంగా కనిపించసాగింది. ఆ గుడ్డి వెలుతురులోనే పెద్ద దొరగారి ముఖంలోని దిగులును మంత్రసాని పసిగట్టినట్లుంది.

‘మరేం భయపడకండి పెద్ద దొరగారు. వీడు ఎలుక పిల్లలా పుట్టినా, రేపు ఎంతో ఎదిగి బోలెడన్ని విజయాలు సాధిస్తాడు.’

‘ఎలుక’కు తొలి దీవెన అందింది.

ఆ మాటలు విన్న తాత నవ్వుకున్నాడు. వరండాలోకి తిరిగి వచ్చి చెక్క కుర్చీలో కూలబడ్డాడు. ఆలోచనలు ముసురుకుంటున్నాయి.

ఎఱ్ఱది అన్నట్లు ఈ ఎలుకే రేపు అందరి మన్ననలు అందుకుంటుందేమో.. ఏమో..

ఈ ఎలుక కథ ఆ దేవునికే ఎరుక.

సరిగా అప్పుడే రేడియో పెట్టెలో నుంచి గుఱ్ఱం జాషువా గారి ‘శిశువు’ పద్యాలు ఘంటసాల గళంలో వినబడుతున్నాయి.

‘నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!..
నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ
బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలో చేరినాడు,
కానీ..
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత
కరపి యున్నది వీని కాకలియు నిద్ర!’

రోజులు, నెలలు దొర్లుతున్నాయి. ఈ తాతకు మనవడే లోకమయ్యాడు. చిట్టిపాపాయి చుట్టునే ఊహలు. వాడితోనే ఊసులు.

వాడు నోరు తెరిస్తే ముల్లోకాలు కనపడతాయోమోనని తాత తొంగి చూసేవాడు. బుజ్జాయికి భాష రాదు, లేస్తాడు, ఏడుస్తాడు, పాలు త్రాగుతాడు. అంతలో పడుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఈ ఇంట ఆనందాలు పంచి పెడుతున్నాడు. ముందు ముందు వీడు ఏం చదువుతాడో, ఏ రాజ్యాలను ఏలుతాడో తెలియదు కానీ, ప్రస్తుతానికి ‘ఉ ఊ’లు మాత్రం నేర్చిన వింత చదువరి. ఏ పని సాధించాలని ఈ భూమి మీదకు వచ్చాడో తెలియదు కదా.. ఏళ్లు గడిచాక ఎలా ఉంటాడో ఎవరు చెప్పగలరు.. కానీ ఇప్పటికి బాగా ముద్దొస్తున్నాడనుకుంటూ తాత మురిసిపోతున్నాడు. ఆరోగ్యంగా ఎదిగి, బాగా చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు మురిసిపోతారు కదా..అంటూ సంబరపడుతున్నాడు తాత.

***

చాలా సంవత్సరాలైంది. ఆ ఎలుక ముసలిదైపోయింది. రెండవ మనవడు పుట్టబోతున్నాడని తెలిసి ఎగురుకుంటూ ఇంగ్లండ్ చేరింది. తాత మదిలో ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతున్నాయి.

ఓ పల్లె.. ఆ పల్లెలో ఓ పెంకుటిల్లు, తన పుట్టుక గురించి బామ్మ చెప్పిన కబుర్లు, ఆపైన చిన్న వయసులో ఆడిన ఆటలు.. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి.

అంతలో.. ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది.

‘ఎలుక పిల్లలా పుట్టాడు నాన్నా. జానెడు కూడా లేడు..’ అటునుంచి అబ్బాయి చెప్పుకు పోతున్నాడు. ఆ పై మాటలు తాత చెవికి ఎక్కడం లేదు.

‘మళ్ళీ ఎలుక పుట్టింది..’ – గొణిగాడు తాత.

***

మనిషి జీవితం చక్రభ్రమణం.

పుట్టుకతో ప్రారంభమయ్యే పరుగు మరణంతో ఆగుతుంది.

ఈ మధ్యన ఎన్నో అనుభవాలు, ఆనందాలు, విషాదాలు, ఉల్లాసాలు, మురిపాలు.

‘మనిషి పుట్టుక ఒక ఆశ్చర్యం.

మరణం ఓ వింత అనుభవం’ అన్నాడు ఓ కవి.

మృత్యువంటే భయం లేని బాటసారులు మాత్రమే తుది శ్వాస విడిచేటప్పుడు సైతం నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటారు. వీరే ధన్యజీవులు.

జీవితంలో ఎన్ని విజయాలు చవి చూసినా, మరెన్ని పరాభవాలు ఎదుర్కున్నా ఇవన్నీ కర్మ ఫలంలో ఒక భాగమని తలిచే వారు చరితార్థులు.

***

ఇంగ్లండ్ వెళ్ళిన తాత తన మనవడితో ఆడుకుంటున్నాడు. అప్పటికే తాతకు ముగ్గురు మనవళ్లు ఆటకి తోడయ్యారు. కాలం దొర్లిపోతున్నది. తన జీవితం ఓ తెరిచిన పుస్తకంలా కనబడుతోంది. తన చిన్ననాటి మధుర స్మృతులను కథలుగా పేర్చి మనవళ్లకు చెబుతూ ఆనందం అనుభవిస్తున్నాడు తాత. జీవన రాగాలను అక్షరబద్ధం చేస్తున్నాడు.

***

కాల చక్రం తిరుగుతోంది. ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో లాగా ప్రతి ఇంటా రేడియో పెట్టెలు కనబడటం లేదు. రేడియో కూడా మొబైల్ ఫోన్లోకి దూరేసి చాలా రోజులైంది.

ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) మానవ మేథను సవాలు చేస్తోంది.

కాలంలో వచ్చిన, వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు తాత. సెల్ ఫోన్ లోనే పాత పాటలు వింటున్నాడు. నేను ఎవరు? అన్న ప్రశ్న చాలా కాలంగా వేధిస్తోంది. సమాధానం కోసం అన్వేషణ కొనసాగుతోంది.

ఓ సారి సెల్ ఫోన్‌లో రేడియో ఆన్ చేస్తే..

జాషువా గారు వ్రాసిన ‘శ్మశాన వాటిక’ లోని పద్యం వస్తున్నది. విన్న పద్యమే.. మళ్ళీ వింటున్నాడు, శ్రద్ధగా, పాఠశాల విద్యార్థిలా..

‘ఇచ్చోట; నే సత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులతో గఱిగిపోయె
యిచ్చోట; నేభూములేలు రాజన్యుని
యధికార ముద్రికలంతరించె’

***

ఏది గెలుపు?

ఏది ఓటమి?

ఏది జీవన సాఫల్యం?

మరేది వైఫల్యం?

ఎవరు నేను?

సమాధానాలు తెలియని ప్రశ్నలు ఎన్నో చికాకు పరుస్తున్నాయి. మనసు, బుద్ధి, ఆత్మ.. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఆత్మ ఎక్కడుంది? రూప రహితంగా ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదేనా ఆత్మ అంటే??

శ్వాస ఆగగానే శక్తి బయటకు వెళ్ళిపోతుందా?

అలా బయటకు వెళ్ళిన శక్తి ఎక్కడకు పోతుంది, దాని గమ్యం ఏమిటి??

ఫిజిక్స్‌లో చదువుకున్న శక్తి నిత్యత్వ నియమం గుర్తుకు వచ్చింది. దాని గురించి ఆలోచిస్తుంటే.. ఈ విశ్వంలో శక్తి కూడా అంతేనేమో.. అది పెరగదు, తరగదు. కాకపోతే శక్తి ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతుంటుంది. అంటే, విశ్వంలోని శక్తి మనలోకి ప్రవేశించగానే కదలిక వస్తుంది. మన చేత ఎన్నో చేయిస్తుంది. చివరకు తన దారి తాను చూసుకుంటుంది.

మనిషిలోకి చేరిన ఆ శక్తినే మనం ‘ఆత్మ’ అని పిలుస్తున్నామేమో. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత అది మరో రూపంలోకి మారుతుంటుందేమే.. ఏమో.

రమణ మహర్షి- ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకోమన్నారు. నేను – అంటే ఈ శరీరమా? లోపల దాగున్న శక్తా??

అది తెలుసుకోవడం కోసమే తీర్థయాత్రలు. శక్తి పీఠాల దర్శనం ఆపైన అరుణాచలం, చిదంబరం యాత్రలు చేసినప్పుడు ఓ వెలుగు రేఖ లోపలకు ప్రవేశించింది. దేవుడు ఎక్కడో లేడు. నీలో ఉన్నాడు, నీ తోటి మనుషులుల్లో ఉన్నాడు. నీ చుట్టూ తిరిగే పశుపక్షాదుల్లో నిండి ఉన్నాడన్న తత్వం బలపడితే మనలోని ఇగోలు, భేషజాలు పటాపంచలవుతాయి. భగవద్గీత, సౌందర్యలహరి, మహా భారతం వంటివి చదువుతున్నప్పుడు ఇలాంటి అభిప్రాయాలే కలుగుతాయి. కానీ, అంతలో మాయ కమ్మేస్తుంది. మంచాన పడినప్పుడు కూడా ఈ మాయ వదిలిపెట్టదు. చివరి శ్వాస తీసుకునే వరకు ఆరాటం, మమకారం వదిలి పోవు. నీది నీది అనుకున్నది నీది కాదు అన్న ఎరుక నశిస్తుంది.

ఒక రకంగా చూస్తే ఈ జీవితం చాలా చిన్నది. మరో రకంగా చూస్తే చాలా సుదీర్ఘమైనది. అనుకూలంగా ఉన్నప్పుడు కాలం దొర్లిపోతున్నట్లు ఉంటుంది. నా అంతటి వాడు లేడన్న అహంకారం. ‘తగ్గేదే లే’ అంటూ ఒకటే పరుగు.

అదే, కష్టకాలం ఎదురైనప్పుడు రోజులు భారంగా సాగుతుంటాయి. జీవితం మీద విరక్తి కలుగుతుంది. జీవితం ముగిసిపోయిందని అనుకుంటాం.

ఆ ముగింపు శరీరానికే. ఆత్మకు కాదు. కట్టెలో కాలినా, మట్టిలో కలిసిపోయినా అది శరీరమే. ఆత్మ కాదు.

ఆత్మ ప్రయాణానికి ముగింపు లేదు. మరో జీవితో ఆత్మ తన యాత్రను కొనసాగిస్తుంటుంది.

అందుకే.. ముగింపుతోనే మొదలు, కొత్త జీవితానికి మూల బిందువు.

అప్పుడు సరికొత్త ‘జీవనరాగాలు’ మళ్ళీ వినబడతాయేమో..

(సమాప్తం)

Exit mobile version