Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-39

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ఎలుక ఎగిరింది!:

‘తాతా..తాతా.. ఏదైనా కొత్త కథ చెప్పవా?’

‘కథా.. అందులోనూ కొత్త కథా.. వెంటనే గుర్తుకు రావడం లేదురా’

‘నువ్వు కథ చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు తాతా’

‘ఇప్పటికే నీకు చాలా కథలు చెప్పాను కదారా. కొత్త కథ అంటున్నావ్ కదా, సర్లే, ఓ అద్భుతమైన కథ చెప్తాన్రా’

‘చెప్పు తాతా.. ఈ కథలో డైనోసార్లు ఉంటాయా?’

‘డైనోసార్లు ఉండవు, కానీ ఓ జంతువు అయితే తప్పకుండా ఉంటుందిరా, అది బోలెడు గమ్మత్తులు చేస్తుంటుందిరా’

‘ఏ జంతువబ్బా!!’

‘నీకు బాగా తెలిసిన జంతువేరా. అది ఎలుక’

‘ఎలుక కథా.. సర్లే చెప్పు’

‘ఎలుకే కదా అని తీసిపారేయకురోయ్. అది సాహసయాత్ర చేసింది’

‘అవునా తాతా, మరి ఆ కథ పేరేమిటి?

‘కథ పేరా?? ఊ.. ఆ.. కథ పేరు – ‘ఎలుక ఎగిరింది’

‘భలే భలే, ఎలుక ఎగిరిందా.. బాగుంది. చెప్పు తాతా.. చెప్పు..’

తాత కథ చెప్పుకుపోతున్నాడు. మనవడు ఊ.. కొడుతున్నాడు.

***

అనగా అనగా ఒక ఊర్లో చింటు అనే ఆరేడేళ్ళ అబ్బాయి ఉన్నాడ్రా. అచ్చు నీ లాగానే ఉంటాడు. నీలాగానే వాడికి కూడా జంతువులంటే చాలా ఇష్టమన్నమాట. వాటితో మాట్లాడుతుంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఆవు దూడలతో దోస్తీ కట్టేశాడు. మేక పిల్లలతో కలిసి తిరుగుతుంటాడు. చిలుకలతోనేమో బోలెడు కబుర్లు. ఇంకా ఉడతలతో ఊసులు. జామచెట్టు ఎక్కి దోరగా పండిన జామకాయలు తను తింటూ ఉడతలకు పెడుతుంటాడు.

అంతలో, ఓ రోజున.. వాడికి ఒక ఎలుకతో దోస్తీ కుదిరిందిరా. తన కొత్త ఫ్రెండ్‌కి గింజలు పెడుతూ దాంతో పాటుగా తానూ తింటూ గెంతుతుండే వాడన్న మాట.

ఎలుకతో చింటు గాడి స్నేహం

అలా కొద్ది రోజులు గడిచే సరికి ఆ ఎలుకకి కూడా చింటు అంటే బోలెడు ఇష్టం పుట్టేసింది. వాడి దగ్గరకు వచ్చి, ప్రేమతో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుండేది. వాడు చెప్పే కబుర్లు శ్రద్ధగా వింటుంటుంది. ఈ ఎలుకకేమో ‘రాజు’ అని పేరుపెట్టాడు చింటు.

ఓ సారి చింటు గాడు ప్రపంచ పటం తెరిచి దేశాల పేర్లు పైకి చదువుతుంటే ఎలుక రాజు స్కూల్ పిల్లాడిలా బుద్ధిగా వింటున్నాడు.

ప్రపంచ దేశాల గురించి చింటు చెబుతుంటే శ్రద్ధగా వింటున్న ఎలుక

చింటు దగ్గర ఉన్న అట్లాస్ బుక్ తాను లాక్కుని వరల్డ్ మ్యాప్‌ని ఎంతో ఆసక్తితో చూడటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన చింటు దేశాల గురించి చెప్పడం, రాజేమో శ్రద్ధగా వినడం జరిగిపోతున్నది.

అలా వినగా వినగా, ఎలుక రాజు చిట్టి బుర్రలో ఓ కోరిక పుట్టింది. తాను కూడా దేశాలు చుట్టుముట్టాలి. కనీసం ఏదో ఒక దేశమన్నా వెళ్ళాలి. అక్కడి వింతలు చూడాలి. తన కోరికని చింటుకి చెబితే, వాడేమో కాసేపు బుర్రగోక్కున్నాడు. తన ఫ్రెండ్ ఎలుక గాడిని విదేశాలకు ఎలా పంపాలా అని తెగ ఆలోచించాడు. వాడి బుర్రకు ఐడియా తట్టలేదు. వాడి బాబాయికి చెబ్తే, ఈ బాబాయి గాడేమో పాస్‌పోర్ట్, వీసా అంటూ ఏవో చింటూకి అర్థం కాని మాటలు చెప్పాడు.

‘ఈ రెండూ వచ్చేస్తే ఎవరైనా విమానం ఎక్కేసి వేరే దేశం వెళ్ళవచ్చా’ అని అడిగాడు చింటు.

‘ఎస్, వెళ్లవచ్చు’ అని చెప్పేసి బుక్‌లో తలదూర్చేశాడు బాబాయి గాడు.

ఈ సంగతంతా రాజుకి చెప్పాడు చింటు.

రాజు బుర్రలో మెరుపు మెరిసింది.

మర్నాడు పాస్‌పోర్ట్ కార్యాలయం ఎక్కడుందో కనుక్కుని వెళ్ళాడు. అక్కడేమో పెద్ద క్యూ ఉంది. తన వంతు రాగానే..

‘పాస్ పోర్ట్ కావాల’ని అడిగాడు.

పాస్పోర్ట్ కోసం వెళ్ళిన “రాజు”

‘నువ్వు ఎలుకవి, నీకు పాస్‌పోర్ట్‌లు, వీసాలు ఇవ్వరు’ అన్నది అక్కడ కూర్చున్న ఓ అధికారి. దీంతో పాపం రాజు హర్ట్ అయ్యాడు.

‘పాస్‌పోర్ట్, వీసాలు లేకుండా జంప్ చేయడం ఎలా..?’ అని ఆలోచించసాగాడు రాజు. పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి దగ్గర్లోనే ఓ గుడి ఉంటే అక్కడకు వెళ్ళాడు రాజు. దాహంతో అటూ ఇటూ చూశాడు. అక్కడో పాత్రలో నీళ్ళు ఉంటే దాహం తీర్చుకున్నాడు.

కానీ, ఆ తర్వాత ఏమైందో ఎలుక రాజుకి తెలియదు.

***

ఎలుక చెవులు ఉన్నట్లుండి పెద్దవయ్యాయి. అంతే కాదు, రెక్కలు పుట్టుకొచ్చాయి. రెక్కలను అటూ ఇటూ ఊపుతుంటే అదో రకం శబ్దం వినబడుతోంది. ఇదేదో బాగుందనుకుని రాజు గాడు చెవులను, రెక్కలను అదే పనిగా ఊపడం మొదలుపెట్టాడు.

ఎలుక చెవులు పెద్దవయియాయి. రెక్కలు మొలిచాయి. అంతే..

అంతే..

ఆకాశంలోకి ఎగర గలుగుతున్నాడు. వాడికి బోలెడు ఆశ్చర్యమేసింది.

మొదట్లో ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు గెంతాడు. క్రిందపడకుండానే నేర్పుగా ఎగురగలిగాడు వాడు. ఉత్సాహం ఉప్పెనలా ఎగిసింది. ఈసారి మరింత బలంగా వేగంగా చెవులు రెక్కలు ఊపుతూ ఎగిరాడు.

ఎలుక ఎగురగలుగుతోంది..

రాజు చాలా ఎత్తులో ఎగురుతున్నాడు. ఆకాశంలో పక్షిలా ఎగురగలుగుతున్నాడు. క్రింద నుంచి ఈ దృశ్యం చూస్తున్న పిల్లలు కేరింతలు కొడుతున్నారు. పెద్దవాళ్లు సైతం ‘ఏమిటీ వింత’ అని ఆశ్చర్యపోతున్నారు. ఎలుక ఎగరడం ఏమిటీ..!! ఎలుక పక్షిలా మారడమేమిటీ!!

ఈ వింత తెలుసుకుని మీడియా వాళ్లు పరుపరుగున వచ్చేశారు. టివీల్లో ఎగురుతున్న ఎలుక గురించి వార్తలు రావడం మొదలయ్యాయి. కొన్ని టీవీల్లో ఐతే చర్చా కార్యక్రమం కూడా పెట్టేశారు. మొత్తానికి ‘ఎలుక ఎగిరింది ..’ ఇదో సంచలన వార్త అయింది.

“ఎలుక ఎగిరింది” ..Breaking News

రాజుకి ఇవన్నీ తెలియవు. అది అలా ఎగురుతూ పోతుంటే తన పై నుంచి విమానం ఎగురుతూ వెళ్లడం చూసింది.

ఎగురుతున్న తన పైన విమానం వెళుతుంటే ఆ దారి వెంటే ఎగురసాగాడు “రాజు”

అంతే, ఆ విమానం వెళుతున్న దారిలోనే దాన్నే ఫాలో అవుతూ తానూ ఉత్సాహంగా ఎగరడం మొదలుపెట్టాడు. అలా ఎగిరి ఎగిరి, విమానం దిగుతుంటూ తాను దిగడం మొదలుపెట్టాడు. అక్కడో బోర్డ్ కనిపించింది.

WELCOME TO LONDON

చింటు మాటలు గుర్తుకు వచ్చాయి.

లండన్ – ఇది ఇంగ్లండ్ దేశానికి రాజధాని.

‘అంటే వేరే దేశానికి వచ్చేశానన్న మాట’ – రాజు గాడికి బోలెడు సంతోషమేసింది.

‘పాస్‌పోర్ట్, వీసా.. ఇవేవీ లేకుండానే లండన్‌లో దిగేశానోచ్’ – కిచ్.. కిచ్.. కిచ్’ అంటూ ఆనందంతో అరిచేశాడు.

లండన్ లో దిగిన “రాజు” గాడు వీధిలో నడుస్తున్నాడు.

‘ఇక ఇక్కడో ఫ్రెండ్ గాడిని పట్టుకోవాలి. వాడిని అడిగి బోలెడన్ని వింతలు చూడాలి’ – ఇలా అనుకుంటూ వాడు మహానగరంలో నడుచుకుంటూ పోతున్నాడు. నడవడం మొదలుపెట్టగానే రెక్కలు మాయమయ్యాయి. చెవులు కూడా మామూలు సైజ్‌కు వచ్చేశాయి.

లండన్ వీధిలో వడివడిగా నడుచుకుంటూ పోతుంటే వాడికి ఓ పిల్లాడు తగిలాడు. హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. అంతే వాడు వీడికి ఫ్రెండైపోయాడు. వాడి పేరు విరాజ్. మరో ఇద్దరు కూడా రాజుకి ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ల పేర్లేమో ఛోటు, విహాన్ అన్నమాట.

వీరంతా కలిసి ఇంగ్లండ్‌లో ఏమేమి చూడాలో ఏమేమి తినాలో ప్లాన్ చేసుకున్నారు. రాజు ముఖం వెలిగిపోయింది. కానీ ఒక్కోసారి మాత్రం ముఖం చిన్నబుచ్చుకుంటూనే ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు.

‘ఓరే ఎలుకరా, చూడరా ఎలా టోపీ పెట్టుకున్నాడో, ఎలుక గాడికి ఎన్ని ఫోజులో..’ – అంటూ తనను చూసిన వారు ఎవరైనా అన్నప్పుడు రాజు గాడికి కోపం వచ్చేది. రాదా మరి తానేమైనా మాములు ఎలుకనా ఏమిటీ, ఎగుర గలిగే ఎలుకనాయె- అర్థం చేసుకోరూ.. ఇది వాడి ఆలోచన. అయితే, ఈ కోపం కాసేపే. ‘ఇవన్నీ పట్టించుకోవద్దురా రాజు’ అంటూ మిత్రులు ప్రోత్సహింస్తుండటంతో ఇంగ్లండ్ లోని బోలెడు ప్రదేశాలు చూశాడు.

లార్డ్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది చూద్దామా అన్నాడు విరాజ్.

సరే అన్నాడు రాజుగాడు.

లార్డ్స్ లో టెస్ట్ మ్యాచ్ ఆనందంగా చూస్తున్న “రాజు”

స్టేడియం కిక్కిరిసి ఉంది. అయినా ఎలాగో వీరిద్దరు లోపలికి దూరారు. రాజు గాడు ఇండియన్ టీమ్ జెర్సీ వేసుకున్నాడు. కూలింగ్ గ్లాస్‌లు పెట్టుకున్నాడు. ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది అక్కడ. హాయిగా చలాకీగా క్రికెట్ మ్యాచ్ చూశాడు.

వింబుల్డన్

రాజుకి వింబుల్డన్ చూడాలనిపించింది. ఫ్రెండ్‌కి చెబితే “వెళ్దాం పద” అంటూ బస్సెక్కించి తీసుకెళ్ళాడు. వింబుల్డన్ అంటే అదో ఊరి పేరట. రాజు గాడికి తెలియదు. వింబుల్డన్ అంటే టెన్నిస్ ఆడే స్టేడియం అనే అనుకున్నాడు. మొత్తానికి రాజు కల నెరవేరింది. అక్కడ టెన్నిస్ ఆడుతున్నట్లు ఫోజులు పెడుతూ ఫొటోలు తీయించుకున్నాడు.

బొమ్మ కారు నడుపుతూ..

కారు ఎక్కి నడపాలని తెగ మనసుపడ్డాడు రాజు. నిజం కారుని లైసెన్స్ లేకుండా నడపకూడదని, బొమ్మ కారు ఎక్కమని విరాజ్ ఇచ్చిన సలహా రాజు గాడికి బాగా నచ్చేసింది. అంతే బొమ్మ కారు ఎక్కి రయ్యిరయ్యిన పోతున్నట్లు తెగ ఫీలైపోయాడు.

ఒక పెద్ద కొండ ఎక్కి క్రిందకు చూశాడు. భలే భలే.. క్రింద కార్లు, బస్సులు చాలా చిన్నవిగా కనబడుతుంటే ఆశ్చర్యపోయాడు రాజు.

కొండెక్కి క్రిందకు చూసి ఇళ్ళు, వీధులు, కార్లు చిన్నవిగా కనపడటంతో “రాజు” కి బోలెడు ఆశ్చర్యం

టౌన్ సెంటర్‌లో పోతుంటే ఓ రెస్టారెంట్ లో వాడికి బన్స్ కనిపించాయి. వెంటనే వాడికి రైమ్ గుర్తుకు వచ్చింది..

హాట్ క్రాస్ బన్స్

హాట్ క్రాస్ బన్స్..

వన్ ఏ పెన్నీ, టూ ఏ పెన్నీ అంటూ పాడుకుంటూ రెస్టారెంట్ లో హాట్ క్రాస్ బన్స్‌ని చప్పరించాడు.

హాట్ క్రాస్ బన్ చప్పరిస్తున్న “రాజు”

అలాగే మరో రైమ్ వాడికి గుర్తుకు వచ్చింది.

లండన్ బ్రిడ్జ్

లండన్ బ్రిడ్జ్

ఫాలింగ్ డౌన్..

లండన్ బ్రిడ్జి దగ్గర..

రైమ్‌లో ఉన్న లండన్ బ్రిడ్జ్ చూశాడు. కానీ అది పడిపోవడం లేదు. బాగానే ఉంది. కాలవలో నౌకలు వస్తున్నప్పుడల్లా పైన బ్రిడ్జ్ లేస్తున్నది. ఇదో వింతగా ఫీలైయ్యాడు రాజు గాడు.

తోటలో పండ్లను కోసి బుట్టలో పెట్టి “రాజు” గాడికి అందిస్తున్న ఫ్రెండ్ గాడు

ఆకలేస్తుందని అన్నాడు. ఆ మాట వినగానే విరాజ్ పండ్ల తోటలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కొన్ని పండ్లు కొని బుట్టలో పెట్టుకుని రాజుగాడికి అందించాడు విరాజ్. తోటలో పండ్లు ఛటక్కున తినేయకూడదట. నీట్‌గా కోసి ఓ బుట్టలో వేసుకుని తోట యజమానికి ఇస్తే వాటిని తూకం చూసి డబ్బులు కట్టమంటాడు. డబ్బులిచ్చాకనే తినాలట. ఇవన్నీ రాజు గాడికి తెలియవు కదా. విరాజ్ చెప్పాడు. వీడు విన్నాడు.

తన ఫ్రెండ్స్ తో “రాజు” దాగుడుమూతలు ఆట

మంచి స్నేహితుడు దొరికినందుకు రాజు చాలా సంతోషించాడు. కాసేపు స్ట్రాబెర్రీల తోటలో కలియతిరిగారు. తాను ఆకుల మాటున దాక్కుని ఫ్రెండ్స్‌తో దాగుడు మూతల ఆట ఆడాడు రాజు. అలా ఆకుల మాటున ముద్దుగా ఉన్నావంటూ విరాజ్ కెమెరా క్లిక్ అనిపించాడు.

ఇంగ్లండ్‌లో నాటకాలను ఇప్పటికీ బాగానే ఆదరిస్తుంటారని తెలుసుకుని నాటకం చూడటానికి బయలుదేరాడు. హారగేట్ లోని ఒక థియేటర్ దగ్గర నల్లటి టోపీ, కళ్లజోడు పెట్టుకుని ఫొటోకి ఫోజుచ్చేశాడు. అక్కడ థియేటర్‌లో పాప్ కార్న్ తింటూ ‘The EMPEROR’S NEW CLOTHS’ చూసి పగలబడి నవ్వాడు.

హారగేట్ థియేటర్ లో నాటకం చూడటానికి రెడీ

‘నాటకం చూపించావు, మరి సినిమా చూపించవా?’ అని అడిగితే రాజుని ‘రెక్స్’ అనే సినిమాహాలుకి తీసుకువెళ్ళాడు విరాజ్. అదేమో చాలా పాత సినిమా హాలు. దానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని తెలుసుకుని అక్కడో ఫోటో దిగాడు రాజు గాడు. అక్కడే అతి పురాతనమైన ప్రొజెక్టర్ చూసి బోలెడు సంగతులు తెలుసుకున్నాడు. చాలా ఇష్టమైన ‘బాహుబలి’ సినిమాను చూపించిన విరాజ్‌కి బోలెడు థాంక్యూలు చెప్పాడు రాజు.

Rex సినిమా హాల్ దగ్గర

సినిమా చూస్తున్న “రాజు”

అంతలో విరాజ్ పుట్టినరోజు వచ్చేసింది. ఆ పుట్టిన రోజు తనదే అన్నంతగా సంబరపడిపోయాడు రాజు గాడు. వీడి సంబరం చూసిన విరాజ్ రయ్యిన బయటకు వెళ్ళి, రాజు కోసం ఓ బుజ్జి కేక్ తెచ్చాడు. రాజు గాడి చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుక చేయించారు. తన జీవితంలో ఎప్పుడూ పుట్టన రోజు వేడుక జరగకపోవడంతో రాజు గాడి కళ్లు చెమ్మగిల్లాయి. విరాజ్‌కీ, విహాన్, ఛోటు గాళ్ల వైపు ప్రేమతో చూశాడు.

ఓ సారి, రాజు గాడు బుక్ స్టోర్స్‌కి వెళ్ళాడు. అక్కడ బోలెడు పుస్తకాలున్నాయి. ఒక చోట న్యూస్ పేపర్లున్నాయి. వాటిలో నుంచి ఓ పేపర్ తీసుకున్నాడు.

Book stall లో న్యూస్ పేపర్ తీసుకుంటూ

కొన్ని చోట్ల న్యూస్ పేపర్స్‌ని ఫ్రీగానే తీసుకోవచ్చట. మరేమో, వాళ్ల ఊర్లో చింటు గాడి బాబాయి గాడు లేడూ, వాడు రోజూ కుర్చీలో కూర్చుని పేపర్ చదవడం చూసిచూసి తానూ అలాగే చదవలానుకున్నాడు. కానీ ఆ ఊర్లో కుదరలేదు. ఇదిగో ఇప్పుడు ఆవకాశం వచ్చేసింది. న్యూస్ పేపర్ తీసుకుని ఇంటికి వెళ్ళాక బాబాయి గాడిలాగానే దర్జాగా కుర్చీలో కూర్చుని పేపర్ లోని వార్తాలు తెగ చదివేశాడు. ఇది చూసి ముచ్చట పడి విరాజ్ ఓ ఫోటో తీసేశాడన్న మాట.

News paper చదివేస్తూ..

వీకెండ్ వచ్చేసింది. విరాజ్‌తో పాటుగా ఫ్రెండ్స్ అంతా పల్లెటూరు వెళ్ళారు. అక్కడ పచ్చటి చేలు, పూలతోటలు చూడ ముచ్చటగా ఉన్నాయి. పంట చేలల్లో తిరుగుతూ కాలక్షేపం చేశారు.

పంట చేనులో..

‘అదేదో నీడిల్స్ అంట. సముద్రం మధ్యలో కోసుగా ఉండే మూడు రాళ్ళు ఉంటాయట. టూరిస్ట్‌లు తెగ ఎగబడి చూడటానికి పోతుంటారు. మనమూ వెళదామా’ అని విరాజ్ అంటే రాజు గాడు ఒకే అనేశాడు. అక్కడ చైర్ లిప్ఠ్ (రోప్ వే చైర్) ఎక్కి తెగ సంబడపడిపోయాడు. ఆ లిఫ్టేమో చెట్ల పై నుంచి ఎగురుతుంటే వాడికి భలే సరదాగా అనిపించింది.

రోప్ వేలో చైర్ లిఫ్ట్ ఎక్కేసి..

చింటు బాబాయి గాడికి – తనకు ఇంగ్లీష్ బాగా తెలుసని పెద్ద ఫోజు. షేక్స్పియర్, వర్డ్స్‌వర్త్ లాగా ఫోజిస్తుంటాడు. ఓసారి డఫెడిల్స్ పూలు చాలా అందంగా ఉంటాయని వర్డ్స్‌వర్త్ కవి వర్ణించాడని చదివితే విన్నాడు. ఆ పూల మొక్కలు ఇంగ్లండ్‌లో చాలా చోట్ల ఉంటాయని తెలిసింది. అదే చెబితే, ‘ఓస్, అంతేకదా ప్రక్కనే పార్క్‌లో డెఫడిల్స్ పూల మొక్కలు బోలెడన్ని ఉంటాయిరా పదా’ అంటూ రాజు గాడ్ని తీసుకు వెళ్ళాడు విరాజ్. అబ్బో రాజు గాడికి ఎంత సంతోషమేసిందో.

డెఫడిల్స్ పూలు చూసి మురిసిపోతూ..

‘I wandered Lonely as a Cloud’ – అని పాడుకుంటూ తానే Wordsworth అయినట్లు తెగ ఫీలయ్యాడు రాజు గాడు.

అక్కడితో ఆగలేదు. షేక్స్‌పియర్ పుట్టిన ప్లేస్ చూసి తానూ గొప్ప రచయితనైపోయినట్లు ఫీలైపోయాడు. అక్కడ ఉన్న లావుపాటి పుస్తకాల్లో కాసేపు తలదూర్చాడు. ఏలాగైనా ఇంటికెళ్ళాక బోలెడు నాటకాలు వ్రాసేయాలని అనుకున్నాడు.

Shakespeare birth place

Shakespeare నాటకాలు చదివేసి తానూ నాటకాలు రాసేద్దామనుకుంటున్న “రాజు”

ఓసారేమో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, మరోసారేమో కేమ్ బ్రిడ్జ్ యూనివర్శిటీ వెళ్ళి చూసొచ్చాడు. కేమ్ నదిలో పడవలో షికార్లు కొట్టాడు. ఈ నదిమీద బోలెడు వంతెనలు కనిపించాయి. ఒక వైపున యూనివర్శిటీ కాలేజీలను చూసి చదివితే ఇక్కడే చదవాలని అనుకున్నాడు రాజు గాడు.

కేంబ్రిడ్జ్ లోని కేమ్ నదిపై “లాహిరి లాహిరి”

ఎలుక రాజులో ఉన్నట్లుండి ఆధ్యాత్మిక చింతన పెరగసాగింది. రోజూ పొద్దున్నే లేచి పూజలు చేయడం మొదలెట్టాడు. ఎలాగైనా మంచి మంచి టెంపుల్స్ చూడాలని తన ఫ్రెండ్ విరాజ్ కి చెబితే వాడేమో బర్మింగ్ హామ్ తీసుకువెళ్ళి అక్కడ బాలాజీ టెంపుల్‌లో దర్శనం చేయించాడు.

ఎంత భక్తో.. ఆలయ దర్శనం

అంతే కాదు, లండన్‌లో ఒక చోట మహాలక్ష్మి టెంపుల్ ఉంటే తీసుకెళ్ళాడు విరాజ్. అమ్మవారిని చూసి మురిసిపోయాడు రాజు గాడు. అక్కడే గణపతి వారిని దర్శించుకున్నాడు. గణేశ్‌ని చూడగానే పరుపరుగున వెళ్ళి ఆయన పాదాల చెంత నిలిచాడు.

Madame Tussaud’s కి వెళ్ళి..

లండన్ లోని Madame Tussauds కి వెళ్ళి నిజంలా అనిపించే బోలెడు మైనపు బొమ్మలను చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడే విక్టోరియా రాణి మైనపు బొమ్మ చూసి ఆమె ప్రక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాడు. మోదీతో కరచాలనం చేసేశాడు.

Madame Tussaud’s లో తానూ ఓ బొమ్మలా నిలబడి సందర్శకులను ఆశ్చర్యపరిచాడు.

అక్కడో చిన్న వేదిక లాంటిది ఉంటే దాని మీద ఎక్కి తానే ఓ మైనపు బొమ్మలా కదలకుండా నిలుచుని సందర్శకులను ఆశ్చర్యపరిచాడు.

విరాజ్ ఓసారి – రోమన్ బాత్ గురించి చెబితే రాజు గాడు ఆశ్చర్యపోయాడు. ఆ కథ అంతా శ్రద్ధగా విన్నాడు. ‘మనం చూసి వద్దామా’ అడిగాడు. సరే అన్నాడు విరాజ్. రోమన్ బాత్‌కి వెళ్ళి అక్కడి వింతలు చూసేశాడు. సహజసిద్ధంగా ఉబికే వేడి నీటిని రోమన్లు కొలనులోకి తరలించి ఎంచక్కా జలకాలాడుకునే వారట. ఇది విన్న రాజు గాడు నేనూ కొలను దిగుతానని మారం చేస్తే విరాజ్ వద్దని వారించాడు. అక్కడే రోమన్ దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తితో కలిసి ఫోటో కూడా దిగాడు.

“రోమన్ బాత్” వద్ద

బీచ్ చూద్దామని ఓసారి బయలుదేరారు. అక్కడ పిల్లల కేరింతలు చూసి తానూ వాళ్లలో ఒకడిగా కలిసిపోయాడు రాజు గాడు. బీచ్‌లో ఎంజాయ్ చేశాడు. పిచ్చుక గూళ్లు, కోటలు ఇసుకతో కట్టేసి ఆనందపడిపోయాడు. కానీ అంతలో అలలు వచ్చి తుడిచిపెట్టేయడంతో దిగాలు పడ్డాడు.

బీచ్ వద్ద..

తన స్నేహితులైన విరాజ్, విహాన్, ఛోటులతో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. కాసేపు గోల్ కీపర్‌గా కూడా ఉన్నాడు. బాల్ గోల్ పడకుండా నేర్పుగా ఆపేసినప్పుడు బోలెడు సంతోషమేసింది రాజు గాడికి.

తన స్నేహితులతో గేమ్ కి రెడీ అవుతున్న “రాజ్”

గోల్ కీపర్ గా..

అప్పటికే ఇండియా వదిలేసి చాలా రోజులైంది. ఓ రోజున వాడికి తన ఊరి మీద దిగులేసింది. ఓ రాత్రి పూట ఎత్తైన టవర్ ఎక్కి నగరాన్ని ప్రేమగా చూస్తూ, తన ఫ్రెండ్స్‌కి బైబై చెబుతూ, కళ్లు తుడుచుకుంటూ ఎగిరాడు.

ఇండియాకి తిరుగు ప్రయాణమవుతున్న “రాజు”

వాడు ఎగరడం మొదలుపెట్టగానే చెవులు పెద్దవయ్యాయి. రెక్కలు మొలిచాయి. అంతే ఆకాశంలో ఎగురుతూ తన భారతదేశం దిశగా సాగిపోతున్నాడు రాజు.

***

తాత కథ చెప్పడం ఆపాడు.

మనవడికి నిద్ర ముంచుకొస్తున్నది.

ఆవలిస్తూనే అడిగాడు..

తాతా, ఆ ఎలుక నువ్వేనా? ఈ కథ నీదేనా??

అవునేమోరా మనవడా.

***

తాత మనసు తేలికైంది.

శరీరం కూడా తేలికైంది.

నడవలేని వయసులో పరిగెత్తమంటోంది మనసు.

కొత్తకొత్త ప్రాంతాలు చూడమంటోంది.

ఇంగ్లండ్‌కి వెళ్ళి మనవళ్లతో ఆడుకోమంటోంది.

తనకు రెక్కలు మొలిచిన భావన.

ఆకాశంలో ఎగిరి వెళుతున్నట్లు కలలు.

చిన్నప్పుడు ఇలాంటి కలలే వచ్చాయి.

మళ్ళీ ఇన్నాళ్లకు, ఈ ముసలి వయసులో.. ఏమిటో..

***

ఇంగ్లండ్‌లో చూసిన పర్యాటక ప్రదేశాలు కొన్ని సినిమా రీలులా కళ్లముందు కదలాడాయి.

 

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version