[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ పాఠకులకు అందిస్తున్నాము.]


ఆనందం ఆవిరి:
ఏడెనిమిదేళ్ల పిల్లాడు మంగళగిరిలోని ఓ పెంకుటింటి ముందు అమ్మ కొంగు పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఎందుకో, ఆ లేత కళ్లు ఎర్రబడ్డాయి. చిట్టి గుండెలు బరువెక్కాయి. ఏదో తెలియని దిగులు ఒళ్లంతా ఆవహించింది.
మంగళగిరి – ఇది 1960 దశకంలో ఇప్పుడున్నట్లు ఉండేది కాదు. పెంకుటిళ్లు, పూరి గుడిసెలు ఎక్కువగా కనిపించేవి. మంగళగిరి అనగానే కొండపైన పానకాల స్వామి, కొండ దిగువున నరసింహస్వామి గుర్తుకొస్తారు. ఈ రెండు ఆలయాలతో నాకు చిన్నప్పుడు చాలానే అనుబంధం ఉండేది. అందుకే నా జీవన యాత్ర గురించి చెప్పేటప్పుడు అప్పుడప్పుడు మంగళగిరి ప్రస్తావన వస్తూనే ఉంటుంది.
మా నాన్నగారు (టివీఎంవీ ప్రసాదరావు) 60వ దశకం ఆరంభంలో ఈ రెండు దేవాలయాల ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉండేవారు. ఆఫీసర్ హోదా కాబట్టి పెద్ద రథం వెనుక ఉన్న పెద్ద ఖాళీస్థలంలో బారుగా ఉండే పెంకుటిళ్లలో ఒకటి ఈయనకు అప్పగించారు. దీంతో మా కుటుంబం కొన్నేళ్లు అక్కడే ఆ ఇంట్లోనే ఉండేవాళ్లం. మంగళగిరిలోనే నేను ప్రాథమిక విద్య అభ్యసించాను. అడ్డతొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నది కూడా అక్కడే. సరే అలాంటి జ్ఞాపకాలు మరోసారి చెబుతాను. ప్రస్తుతానికి గుండె బరువెక్కి ఏడుస్తున్న పిల్లాడి దగ్గరకు వెళదాం, పదండి.
అమ్మ తన చీర కొంగుతో పిల్లాడి కంట నీరు తుడుస్తున్నది. ఓదారుస్తున్నది. సరిగా అదే సమయంలో గూడు రిక్షా (మంగళగిరిలో గూడు రిక్షాలు ఫేమస్) వచ్చేసింది. ఇంట్లోనుంచి సామాన్లు గూడు రిక్షాలోకి ఎక్కిస్తున్నారు.
మళ్ళీ వస్తానే అక్కా
వీలుగా ఉండే పెద్ద పండుగకి రావే.
అలాగే అక్కా, ఎక్కండర్రా రిక్షా.
రిక్షా నెమ్మదిగా కదులుతోంది. లేత కళ్లు వర్షిస్తున్నాయి. ఏదో శూన్యం ఆవహించినట్లు అనిపించింది. వెళుతున్న రిక్షా విరిగిపోయి ప్రయాణం ఆగిపోతే ఎంత బాగుండ్ను. పిన్ని, పిల్లలు వెనక్కి వచ్చేస్తారుగా.. మనసులో ఇలాంటి ఆలోచనలు. కానీ ఇవేవీ జరగలేదు. రిక్షా కనుమరుగైంది. ఓ వారం తర్వాత క్షేమ సమాచారం తెల్పుతూ లెటర్ వచ్చేది.


మా పిన్ని (కమల పిన్ని) అంటే బాగా ఇష్టం. ముగ్గురు పిన్నుల్లో కమల పిన్నే తరచు మా ఇంటికి వస్తుండేది. అమ్మా, పిన్ని తెల్లవారుఝామునే లేచి బోలెడు కబుర్లు చెప్పుకునేవారు. అదేమిటో, వీళ్లిద్దరి మధ్య ఇన్నేసి కబుర్లు ఎలా పుట్టుకువస్తాయా అని నాకు బోలెడు ఆశ్చర్యమేసేది. ఇద్దరూ సంగీతం నేర్చుకున్నారు. దీంతో అప్పుడప్పుడు ఇంట్లోనే సంగీత కచేరీ పెట్టేసేవారు.
సాధారణంగా అప్పచెల్లెళ్లు కలుసుకుంటే గంటల కొద్దీ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే అన్నాచెల్లెళ్లో, అక్కా తమ్ముళ్లో కలిస్తే అంతలా కబుర్లు దొర్లవు. ఈ రెంటి మధ్య తేడా ఎందుకుంటుందో అప్పట్లో తెలియదు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ తెలియదు.
వేసవి సెలవుల్లో పిన్ని, పిల్లలు వచ్చి ఓ నెలరోజులుండి వెళుతుంటే ఆ లేత మనసు కలత చెందదా మరి.
ఏడేళ్ల అబ్బాయి ఆ తర్వాతి కాలంలో డిగ్రీ పూర్తి చేసుకుని ఎమ్మెస్సీ కోసం బొంబాయి చేరి చదువుకుంటున్నప్పుడు దాదాపుగా ఇలాంటి సంఘటనలనే ఎదుర్కున్నాడు. కాకపోతే వాతావరణం వేరు, పరిస్థితులు వేరు.
వీడ్కోలు విలాపం:
బొంబాయి (ప్రస్తుత ముంబయి)లో 1978 నుంచి రెండేళ్ల చదువు కోసం ఉన్నప్పుడు ఈ ‘వీడ్కోలు విలాప’ సన్నివేశాలు తరచూ కలవర పరిచేవి. ఆ రోజుల్లో బొంబాయిలోని సెంట్రల్ స్టేషన్‌ని విక్టోరియా టెర్మినస్ (వి.టి.) అనేవారు (చూ. 6) ప్రయాణం ఉన్నప్పుడే కాకుండా అడపాదడపా ఈ స్టేషన్‌కి వెళ్ళి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ఓ హాబీగా మారింది. ఈ స్టేషన్ నుంచి ప్రతి రోజూ రాత్రి పది గంటలకు మీనార్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్‌కి బయలుదేరుతుండేది.
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు (చూ. 7) ఏ నెంబర్ ప్లాట్‌ఫామ్ మీద ఉంటుందో ఆ ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళి బెంచీల మీద కూర్చునేవాళ్లం. మా కబుర్లకు అదనం ప్రయాణీకుల మాటలు. అవి కూడా అచ్చ తెలుగు మాటలు.
ఎందుకంటే ఈ ట్రైన్ ఎక్కేవాళ్లలో చాలా మంది తెలుగువారే. పైగా వారికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చ వారు కూడా తెలుగువారై ఉంటారు కనుక ఆ రైలు వెళ్ళేదాకా అక్కడంతా తెలుగు వాతావరణం పరచుకునేది. ఆ కాసేపు నాకైతే మా ఊర్లో ఉన్నట్లే అనిపించేది. ఆ రైలు బయలుదేరడానికి ముందు ఫ్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకుల్లో కనిపించే భావోద్వేగాలు, వారి వీడ్కోలు విలాపాలు, విన్యాసాలు చూస్తుంటే నా మనసు సన్నగా మూలిగేది. కొన్ని ప్రేమ జంటలతై మరీను. ఏదో శాశ్వత ఎడబాటు కలగబోతుందన్నట్టుగా భోరున ఏడ్చేసేవారు. ఓదార్పు మాటలు, ఉత్సాహం కలిగించే కబుర్లు, కళ్లతోనే పలకరింపులు వెరసి మొత్తం సమాజపు సప్తవర్ణ చిత్రం అక్కడ సాక్షాత్కరించేది. కొంత మంది చేసే చేష్టలు చిత్రంగా ఉండేవి. ఓ సారి.. వీడ్కోలు చెప్పేవాడు కదులుతున్న రైలు ఎక్కేశాడు. రైలు వేగం పుంజుకుంటున్నది. ఆ గాభరాలో రైలు నుంచి దూకేసరికి నిలదొక్కుకోలేక పడిపోయాడు.
‘పాపం’ అనుకుంటూ జాలిపడేవాడ్ని. ఇవన్నీ చూస్తున్నప్పుడే ఏదేదో రాసేయాలనిపించేది. ఆ భావనతో నాలోని రచయిత లీలగా కదిలినట్లు అనిపించేది. కానీ ఆ రచయిత బయటకు వచ్చి భవిష్యత్తులో నా చేత రేడియో నాటికలు రాయిస్తాడనీ, వ్యాసాలు పుస్తకాలు రాయిస్తాడని నేను అప్పట్లో అనుకోలేదు. మీనార్ ఎక్స్‌ప్రెస్ కదలుతుంటే నాకు కళ్ళెంబడి నీళ్లు వచ్చేవి. ప్రేమ అనేది మనుషులతోనే కాదు, వస్తువులు, వాహనాలతో కూడా ముడిపడి ఉంటుందని అనిపించేది. రైలు వెళ్లగానే ప్లాట్‌ఫామ్ ఖాళీ అయ్యేది. నా మనసూ శూన్యంగా మారేది. దూరంగా వెళుతున్న రైలుకి టాటా చెప్తూ హాస్టల్‌కి చేరినా ఆ సంఘటనలు వెంటాడుతుండేవి.
విటి స్టేషన్ చాలా పెద్దది. కట్టడం పురాతనమైనది. కాసేపు రైల్వే స్టేషన్ కట్టడాల శైలి చూసి మురిసిపోయేవాడిని. ఇంత పెద్ద టవర్లు, గోపురాలు చూస్తుంటే ఆశ్చర్యమేసేది. నిశిత దృష్టితో చూడటం, వాటి గురించి ఆలోచించడం మొదలైంది. కానీ ఈ మానసిక మార్పుని గుర్తించలేదు.


ఏదైనా కొత్త ప్రాంతం చూసినా, వాటి గురించి రవ్వంత తెలుసుకున్నా అదనపు సమాచారం తెలుసుకోవాలన్న తపన మొదలయ్యేది. ఈ తపన చల్లార్చుకోవడానికి లైబ్రరీకి వెళ్ళి అధ్యయనం చేయడం, నోట్స్ రాసుకోవడం వంటివి చేసేవాడ్ని. ఇప్పుడున్నట్లుగా విషయ సేకరణ క్షణాల్లో అందుబాటులోకి వచ్చేది కాదు. గూగుల్ వంటి సౌకర్యాలు లేని కాలంలో పాత పేపర్లు, పుస్తకాలు గంటల కొద్దీ తిరగేస్తేనే కానీ అదనపు సమాచారం రాబట్టలేని పరిస్థితి.
సరే, సేకరించిన సమాచారాన్ని పేపర్ మీద పెట్టేవాడ్ని. అయినప్పటికీ ఏ పత్రికకూ పంపేవాడ్ని కాదు. అసలు ఎలా పంపాలో కూడా తెలియదు. పత్రికలో పాఠకుల రాసే లేఖల కోసం ఒక వేదిక దాదాపు అన్ని పత్రికల్లో ఉండేది. ఈ లేఖల కాలమ్‌లో కనీసం ఒక లేఖ అయినా పబ్లిష్ అవ్వాలని ఓ బలమైన కోరిక డిగ్రీ చదువుతున్నప్పుడే కలిగింది. కానీ గట్టి ప్రయత్నం చేసినట్లు లేదు. చిత్రమేమంటే ఇంతవరకు ఈ కోరిక తీరనే లేదు. కాకపోతే లేఖ ప్రింట్ కాకపోయినా ఏకంగా పత్రికల్లో వందల కొద్ది వ్యాసాలు రాసే అవకాశం మాత్రం వచ్చింది. వాటిలో కొన్ని ఎడిట్ పేజీలో కూడా వచ్చేవి.
అందుకే ఓ సినీ కవి ఇలా అంటారు..
“కోరిక ఒకటి జనించు
తీరక
ఎడద దహించు,
కోరనిదేదో వచ్చు,
శాంతి
సుఖాలను తెచ్చు
ఏది వరమ్మో ఏది శాపమో
తెలిసీ తెలియక అలమటించుటే,
ఇంతేరా ఈ
జీవితం
తిరిగే రంగుల రాట్నము”
– నిజమే కదా, జీవితంలో రాబోయే చిత్రమైన మలుపులకు ప్రారంభాలు కూడా విచిత్రంగానే ఉంటాయి. ఇది నా జీవితంలో చాలా స్పష్టంగా కనిపించింది. ముందు ముందు నాలోని రచయిత ఎదగడానికి ఈ లక్షణాలు దోహదపడ్డాయి. ఈ విషయం అప్పట్లో అర్థం కాలేదు. పుస్తక పఠనం వల్ల మనిషి లోని ఆలోచనలు ఎలా ఎదుగుతాయో, అవి ఎలా పరిపక్వత చెందుతాయో వచ్చేవారం చెబుతాను.
—–
ఫుట్ నోట్స్ :
(6) విక్టోరియా టెర్మినస్ (వి.టి): ఇది బొంబాయి సెంట్రల్ స్టేషన్. దీన్నే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ అని పిలుస్తున్నారు. బ్రిటీష్ వారి హయాంలో కట్టిన రైల్వే స్టేషన్. దీన్ని 1878లో మొదలుపెట్టారట. అంటే నేను బొంబాయి గడ్డమీద అడుగుపెట్టడానికి సరిగా వందేళ్ల ముందు అన్నమాట. దీన్ని పూర్తి చేయడానికి పదేళ్లు పట్టిందని చెప్పేవారు. ఎత్తైన టవర్ చూస్తుంటే బ్రిటీష్ వారి పెత్తందారీతనానికి నిలువెత్తు నిదర్శనంగా అనిపించేది. టవర్ క్లాక్ – శ్రమ ఎరుగని కార్మికుడు పనిచేస్తున్నట్లుండేది.
ఈ స్టేషన్‌ని మొదటిసారి నేను చూసింది మా నాన్నగారితో కలిసి. నన్ను యూనివర్శిటీలో చేర్చడానికి ఆయన కూడా నా వెంట వచ్చారు. ఆ సమయంలోనే నాన్నగారు మాటల మధ్యన, మగవాళ్ళు బంగారం ధరించడం గురించి మాట్లాడుతూ ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులు కావలసి వచ్చినప్పుడు చేతికున్న ఉంగరమో కాకుంటే మెడలోని గొలుసో అమ్ముకుని గండం నుంచి బయటపడవచ్చని చెప్పారు. బంగారం పట్ల నాకైతే పెద్ద ఆసక్తి లేదుకానీ, నాన్నగారు చెప్పిన మాటలు మాత్రం ప్రభావం చూపాయి. కనీసం ఒక్క ఉంగరమైనా పెట్టుకోవాలనుకునేవాడ్ని.
సరే, వి.టి స్టేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా.. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ల గురించి చెప్పాలంటే, అంతకు ముందు మద్రాస్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద రేల్వే స్టేషన్ చూడగలిగాను. బీఎస్సీ చదవుతున్నప్పుడు సైన్స్ టూర్‌గా మద్రాసు (ప్రస్తుతం చెన్నై) వెళ్ళాము. అప్పటి దాకా నాకు తెలిసిన రైల్వేస్టేషన్లకీ దీనికీ పోలికే లేదు. రైళ్ళు వచ్చి ఆగడమే కానీ ముందుకు వెళ్ళవు. ఎందుకంటే రైల్వే ట్రాక్ లన్నీ అక్కడితో ఎండ్ అవుతాయి. అందుకే టెర్మినస్ అంటారని తెలిసింది అప్పుడే. బొంబాయిలో నేనప్పుడు చూసింది కూడా టెర్మినస్.
అసలు మా ఊరోళ్ళకు రైలు కూతలు వినబడవు. నందిగామకు దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్ మధిర. అయితే మధ్యన మున్నేరు ఉండటంతో ఇటువైపు వాళ్ళు మధిరకు వెళ్ళి రైలెక్కడం సాహస యాత్ర లాంటిదే అవుతుంది. ఇప్పుడు పరిస్థితి మారింది. మున్నేరు మీద వంతెన వచ్చేసింది. దీంతో ఆటోల్లో కూడా మధిర రైల్వే స్టేషన్‌కి ప్రయాణీకులు చేరగలుగుతున్నారు.
నందిగామ లాంటి రైల్వే స్టేషన్ లేని ఉర్లలో ఉన్న వారు రైల్వే స్టేషన్‌కి వెళ్లడమే గగనం. ఊర్లో బస్టాండ్ ఉండటమే గొప్ప. నేను కాలేజీలో చదువుతున్నప్పుడే ఊర్లో బస్టాండ్ కట్టారు. అంతకు ముందు వరకు బస్సులు సెంటర్లో రోడ్డు పక్కనే ఆగేవి. దాన్నే ఇప్పుడు పాత బస్టాండ్ అంటున్నారు. కొత్త బస్టాండ్ కట్టాక వెళ్ళి చూస్తే బస్సులు వచ్చే స్థలం ఆగే ప్లాట్‌ఫామ్స్ చూసి మా మిత్రుడొకడు “ఒరే ఇది విమానాశ్రయమేరా. రేపో మాపో మనూర్లో విమానాలు ఆగుతాయేమో” అన్నాడు. నా బోటి అమాయకుడు వాడి విజ్ఞానానికి తల ఊచేవాళ్ళం.
అలాంటిది విక్టోరియా టెర్మినస్ చూడగానే అమితాశ్చర్యం చెందకుండా ఉండగలనా?
చర్చ్ గేట్ రైల్వేస్టేషన్ నుంచే లోకల్ రైళ్ళు బయలుదేరి పరుగులుపెడుతుంటాయి. సమయపాలన విషయంలో బొంబాయి జనాన్ని చూసి ఇవి నేర్చుకున్నాయా ? లేక ఈ లోకల్స్ ని చూసి బొంబాయి వాసులు నేర్చుకున్నారా?


లోకల్ ట్రైన్స్‌లో ‘డబ్బావాలాల’ సందడి వర్ణనాతీతం. అసలు ఆ నెట్ వర్క్ చూసి ఎవరైనా విస్తుపోవలసిందే. ఎక్కడో దూరప్రాంతంలో ఉద్యోగం చేసేవారికి లంచ్ బాక్సులను టైమ్‌కి చేర్చేవారు. డబ్బావాలాల చిత్తశుద్ధి, సమయపాలన చూసినప్పుడు అంతర్లీనంగా దాగున్న విజయ సూత్రం బోధపడింది.
(7) మీనార్/కోణార్క్ కథ: 1978లో నేను మొదటిసారి బొంబాయి వెళ్ళినప్పుడు మీనార్ ఎక్స్‌ప్రెస్ చూశాను. అంతకు ముందు నాకు బాగా గుర్తున్న రైలు సర్కార్ ఎక్స్‌ప్రెస్. ఈ మీనార్ ఎక్స్‌ప్రెస్ రైలు అప్పట్లో బ్లూ కలర్లో ముద్దొచ్చేలా ఉండేది. సికింద్రాబాద్ నుంచి బొంబాయి వి.టి.కి వెళ్ళే రైలు అది.


నాకో విషయం చిత్రంగా అనిపించేది. ఒకటే రైలు రెండు నెంబర్లు. అలాగే రెండు పేర్లు. మీనార్ ఎక్స్‌ప్రెస్ బొంబాయి నుంచి సికింద్రాబాద్ వరకు. ఆ తర్వాత రైలు అదే, కానీ నేమ్ బోర్డులు కోణార్క్గా మార్చేవారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం మీదగా భువనేశ్వర్ వెళ్ళే రైలుగా మారిపోతుంది. నేను బొంబాయి నుంచి విజయవాడ వరకు ఈ రైల్లో వచ్చేవాడిని కనుక నాకు ఈ విషయం బాగానే గుర్తుంది. ఈ మధ్యనే (2024 మార్చి 2) కోణార్క్ ఎక్కినప్పుడు ఈ పాత సంగతులు గుర్తుకువచ్చాయి.
ప్రతి రైలుకు చరిత్ర ఉంటుంది. అలాగే ప్రయాణీకులకు ఆ రైలుతో అనుబంధం, ప్రేమ పెరుగుతుంటుంది. 2028లో కోణార్క్ సర్వీస్ స్వర్ణోత్సవం జరుపుకుంటుందన్నమాట.
(మళ్ళీ కలుద్దాం)

శీ తుర్లపాటి నాగభూషణ రావు రచయిత, సీనియర్ జర్నలిస్ట్. తెలుగు భాషాభిమాని. కృష్ణా జిల్లా (ప్రస్తుత ఎన్టీ ఆర్ జిల్లా) అడవి రావులపాడు గ్రామంలో 1957లో కనీసం కరెంట్ సౌకర్యం లేని పల్లెలో పుట్టి మిడిమిడి చదువులతోనే అంచలంచలుగా ఎదిగారు. 1980లో సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పొంది, అనంతరం జర్నలిజం పట్ల ఆకర్షితులై అనేక పత్రికలు, టివీ సంస్థల్లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు. తెలుగు భాష పట్ల మక్కువతో వందలాదిగా విశిష్ట రచనలు చేసి పలువురి ప్రశంసలందుకున్నారు.
అదిగో హరివిల్లు (ఆకాశవాణి రూపకం), గంగ పుత్రుల వ్యథ, ఇస్లామిక్ కట్టడాలలో హిందూ శిల్ప శైలి (పరిశోధనాత్మక కథనం), గ్రామదేవతల పుట్టుక – సామాజిక అవసరాలు, క్రికెటానందం, నరుడే వోనరుడైతే (ఆకాశవాణి హాస్య నాటిక), సెలవుపెట్టి చూడు (ఆకాశవాణి హాస్య నాటిక), ఒక్క క్షణం (ఆకాశవాణి రూపకం), పంచతంత్రం (పంచ భూతాలు – పర్యావరణం), మంచి పాటలు – మనసులోని మాటలు, నిప్పు రవ్వ (డాక్యుమెంటరీ), బరువుల బాల్యం (ఆడపిల్లల వ్యథలు), బాలికలతో మరణమృదంగం, సూట్‌కేస్ (ఆంధ్రప్రభ కథ), తెలుగు భాషా పరిణామక్రమం – సోషల్ మీడియా పాత్ర (పరిశోధన పత్రం), చిదంబర రహస్యం – ఒక వినూత్న కోణం (పరిశోధనాత్మక రచన), భారత దేశ స్వాతంత్ర్యోద్యమం – తెలుగు తేజం పింగళి వెంకయ్య (పరిశోధన పత్రం), 90 ఏళ్ళ టాకీ: తెలుగు సినిమాకు పట్టాభిషేకం – ఒక పరిశీలన (రాబోయే రచన) ముఖ్యమైన రచనలు.
శ్రీ రామకృష్ణ పరమహంస , శ్రీ షిర్డీ సాయిబాబా, గిరీశం, శ్రీ రాఘవేంద్ర స్వామి – ఏకపాత్రలు రచించి, పాత్రలు పోషించారు.
ఓపెన్ హేమెర్ – చీకట్లో పరివర్తన – ప్రత్యేక కథనం.
40 ఏళ్ళుగా అనేక విశిష్ట రచనలు చేసి అనేక పురస్కారాలను, ప్రశంసలను అందుకున్న తుర్లపాటి అనన్య సేవలకు గుర్తింపుగా ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
2 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది కస్తల విజయబాబు గారి స్పందన: *చదివేశానోచ్! అనడం కన్నా “చదివేసేలా చేసిందోచ్” అనడం సబబు! చక్కని శైలి, నల్లేరు మీద బండి నడకలా ఉంది మీ రచన. ఆనాటి రోజులే వేరు! వేసుకోండి వీరతాడు!!
– కస్తల విజయబాబు (హైదరాబాద్)
కొల్లూరి సోమ శంకర్
This is a comment by Mr. Govindarajula Krishna Rayalu: *Very well written Turlapati garu , where, while reading am able to visualise as the scenes passing, very familiar which is live witness to me , 100% true to heart to pen or keyboard is great achievement. Keep up the gift you got by the blessings of Matha Saraswati, shine to star with Telugu readers & appreciators. A new fact, that I came to know now is: It was the 100th year of Victoria Terminal, V T station , when I got married 1978. * – Govindarajula Krishna Rayalu, Brazil