[పి. నిర్మల రాజు రచించిన ‘త్రిమూర్తులు..!’ అనే కవితని అందిస్తున్నాము.]
నేడు నా కలం కదులుతున్నది
నా జీవన రథం సాగుచున్నది
అంతరంగ ఆలోచనలు..
అక్షర రూపం దాల్చుతున్నవి
నాటి గురువులు నాటిన అక్షర విత్తులే
నేటి ఆశీర్వాద కల్పతరువులు!
ఉగ్గుతో ముద్దుల సుద్దులు రంగరించింది..
తొలి గురుకిరణం నా తల్లే;
చేయి పట్టుకొని అడుగులో అడుగు
వేయించి సాహసం నేర్పించింది..
మాన్యమలి మా మంచి గురువు నా ప్రియ తండ్రే;
మేటి విద్యలు గరిపి
నవరసభరిత లోకాన్ని చూపింది..
ఎందరో ఆదర్శ జ్ఞానమయులు ఆచార్య గురువర్యులే.
కష్టాల కడలిలో కృంగిపోక
నష్టాల ఊబిలో నలిగిపోక
ప్రాపంచిక సుఖమే శాశ్వతమని పొంగిపోక
నీతి నియమాలతో నిలబడి
సుఖదుఃఖాల సమదృష్టితో
శాశ్వతానందానికై నిత్య సత్యకృతులతో
మానవతకు మారుపేరుగా వర్ధిల్లమంటు..
నా అంతరాత్మను మలచి
హృదిలో పరంజ్యోతిని వెలిగించిన
పరమ గురువులు..
నా పాలిట త్రిమూర్తులగు నా
మాతాపితలు, ఆచార్యులందరికీ పాదాభివందనం.
పి. నిర్మల రాజుగా ప్రసిద్ధులైన శ్రీ పొలమరశెట్టి నిర్మల రాజు ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్టణంకి చెందినవారు. ఎం.ఎ., ఎం.ఈడి. చేసి, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఆంగ్ల అధ్యాపకులుగా పని చేసి రిటైరయ్యారు. ప్రవృత్తిరీత్యా రచయిత. వీరివి కథలు, వ్యాసాలు, బృందగానాలు, కవితలు పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. అమృతమయి (1998), మిలీనియం సోయగాలు (కవితా సంపుటి, 2000) అనే పుస్తకాలను ప్రచురించారు. పలు నాటకాలు వ్రాసారు. పలు సాహితీ బృందాలలో సభ్యులు.