Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రముఖ రచయిత కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‍ అస్తమయం – నివాళి

ప్రముఖ కథా, నవలా రచయిత, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం గౌరవ సలహాదారులు కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 18 డిసెంబర్ 2024న తెల్లవారుజామున వారి స్వగృహంలో మరణించారు. వారి వయస్సు 80 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

డిసెంబర్‌ 18 1946 న కృష్ణాజిల్లాలో జన్మించిన త్రివిక్రమ్‌, పుట్టిన రోజునే మరణించడం యాదృచ్చికం. ఆయన తొలి కథ 1974 నవంబర్‌10న ప్రచురింపబడి తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించగా, ఆ తరువాత పలు పత్రికలు నిర్వహించిన దీపావళి కథల పోటీలలో వరుసగా వీరి రచనలు బహుమతులు పొందడం విశేషం. ముఖ్యంగా ‘కార్గిల్‌ కథలు’ వీరికి మంచి పేరును సంపాదించి పెట్టాయి.

ఆకాశవాణిలో పలు కథలు, నాటకాలు, వ్యాఖ్యానాలు ప్రసారమైయ్యి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాలమిస్టుగా అనేక పత్రికలలో ‘అంతర్యామి’, ‘లా’ సలహాలు వంటి అనేక శీర్షికలు నాలుగు దశాబ్దాలుగా నిర్వహించిన వీరు, గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. 1965 నుంచి 75 వరకు భారతీయ వైమానిక దళంలో పనిచేసిన కాటూరు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోను, హైకోర్టు లాయరుగాను పలు బహుముఖీన సేవలు అందించారు. ఆయన రచించిన పలు రచనలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలూ లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘానికి గత కొంతకాలంగా గౌరవ సలహాదారులుగా వీరి సేవలు అందిస్తున్నారు.

కాటూరు మరణ వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్‌, కార్యదర్శి శర్మ సి.హెచ్‌. ప్రముఖ విద్యావేత్త ఎం.సి.దాస్‌, సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డా. జి.వి.పూర్ణచంద్‌ తదితర ఇతర సాహితీ సంస్థల ప్రతినిధులు త్రివిక్రమ్‌ భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు.

Exit mobile version