[ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి ‘తొలితరం తెలుగు రచయిత్రులు – అభ్యుదయ కథలు’ అనే వ్యాససంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
“భారత స్వాతంత్య్రానికి పూర్వమే కథయిత్రులు అద్భుతమైన స్త్రీ పాత్రలను సృష్టించి, స్త్రీల ఆత్మగౌరవాన్ని వెలువరించే విధంగా కథలు రచించడం ఒకింత ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. పైగా నాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల పట్ల వారికున్న అవగాహన కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది” అన్నారు శ్రీమతి సిహెచ్. సుశీలమ్మ తన ముందుమాటలో. ఆ విధంగానే ఈ వ్యాసాల రచన సాగింది. ఈ సంపుటిలో 25 మంది రచయిత్రుల కథల గురించిన వ్యాసాలున్నాయి.
~
కనుపర్తి వరలక్ష్మమ్మ గారు వ్రాసిన ‘కుటీరలక్ష్మి’ కథను విశ్లేషించారు. కథలో వస్త్రవ్యాపారిగా రాణిస్తున్న వెంకటస్వామి అకాలమరణం పాలయితే, అతని భార్య రామలక్ష్మి ధైర్యంతో పరిస్థితులకు ఎదురీది వ్యాపారాన్ని నిలబెట్టడమే కాకుండా, భారత స్వాతంత్రసమర యజ్ఞంలోభాగమై తనకు వీలైనంత సేవ చేస్తుంది. “వరలక్ష్మమ్మ గారు కేవలం రచయిత్రి మాత్రమే కాక గాంధీ ప్రబోధించిన ఖద్దరు ప్రాముఖ్యత, స్వాతంత్రోద్యమ పోరాటాలు, వాటిని స్త్రీలు కూడా అనుసరించవలసిన ఆవశ్యకతలను గురించి స్పష్టమైన అవగాహన ఉన్న దేశభక్తి గల మహిళ” అంటూ వరలక్ష్మమ్మ గారి వ్యక్తిత్వాన్ని పాఠకుల ముందుంచారు.
భండారు అచ్చమాంబ గారి ‘దంపతుల ప్రధమ కలహం’ కథను సూక్ష్మంగా వివరించారు. ‘నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహ మాడుట వలనను భర్తకు దాసినగుదునా యేమి..’ అనే తీవ్రమైన వాక్యాలతో మొదలవుతుంది కథ. ఈ కథలో లలిత, నారాయణరావు భార్యాభర్తలు. ఒకరోజు ఇద్దరూ గొడవ పడతారు. మాటామాటా పెరుగుతాయి. దాంతో నారాయణరావు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అమ్మమ్మ ఎంతో నచ్చజెప్పిన మీదట, లలిత తన తప్పుని గ్రహించి, భర్తని వెతకడానికి నౌకర్లని పంపిస్తుంది. అదే సమయంలో తన తప్పుని గ్రహించిన నారాయణరావు ఇంటికి తిరిగొస్తాడు. ప్రథమ కలహమే అంత్య కలహమైందని వ్యాఖ్యానిస్తారు రచయిత్రి. అచ్చమాంబ తొలి చరిత్రకారిణిగా, తొలి మహిళా చరిత్రకారిణిగా, తొలి కథా రచయిత్రిగా, తొలి స్త్రీ వాద రచయిత్రిగా – చరిత్రలో నిలిచిపోయారని అంటారు సుశీలమ్మ.
యల్లాప్రగడ సీతాకుమారి గారి ‘కులమా? ప్రేమా?’ అనే కథ గురించి వివరిస్తూ, “ప్రేమ త్యాగాన్ని కోరుతుందనీ, పెద్దలను ఎదరించకూడదని నమ్మే కాలంలో రాసిన కథ ఇది” అన్నారు సుశీలమ్మ. 1933 లో రాసిన ఈ కథని విశ్లేషిస్తూ, “హిందూ ముస్లిమ్ వివాహం అనే ఇతివృత్తాన్ని తీసుకోవడం ఆ రోజుల్లో ఒక సాహసమే” అన్నారు. శ్రీమతి యల్లాప్రగ్గడ సీతాకుమారి స్వాతంత్ర సమరయోధురాలు. సాంఘిక దురాచారాలను వ్యతిరేకించారు. 1957 లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గారి ‘నే ధన్యనైతి’ కథని వివరించే ముందు, ఆవిడ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని పాఠకులకు ప్రదర్శించారు. “తన వైవాహిక జీవితాన్ని వదులుకొని సమాజం కోసం స్థిర చిత్తంతో నిలబడి, తన పూర్తి శక్తి సామర్థ్యాలను దేశ సేవకే వినియోగించాలనుకోవడం – ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే” అని అంటారు సుశీలమ్మ. ‘నే ధన్యనైతి’ కథలో నాయిక శారదాబాయి బాల్య వితంతువు. బంధువుల, చుట్టుపక్కల వారి నిరాదరణ భరించలేక ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. పూనా పట్టణం చేరుకొని అక్కడ నాలుగేళ్ళ పాటు చదువుకుని తిరిగి సొంతూరుకు వచ్చి ‘శారదా భవనమ’ను పాఠశాలను స్థాపిస్తుంది. ఆపై ఆమెకు ఎదురైన ‘అనేక రాజకీయ సాంఘిక పరిస్థితులను వివరిస్తూ, విశ్లేషిస్తూ దీనిని పెద్ద కథగా మలిచారు దుర్గాబాయమ్మ’ అంటారు వ్యాసకర్త్రి.
దళితేతరురాలైన పులవర్తి కమలావతీదేవి ప్రథమ దళితోద్యమ కథా రచయిత్రి. ‘మాదిగ వెంకడు’ కథలో – డిప్యూటీ కలెక్టర్ గారి ఆఫీసులో మరుగుదొడ్డిని శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికుడైన వెంకడు అనారోగ్యం వల్ల విధులకి హాజరు కాలేకపోతే, కలెక్టర్ అతని ఇంటికి కబురు చేసి బలవంతంగా రప్పించి పనిచేయిస్తాడు. సరిగా చేయలేకపోతే వెంకడిని కొడతాడు. దాంతో వెంకడు తిరగబడి అధికారిని కొడతాడు. అంతే కాదు, కలెక్టర్‌పై కేసు వేయాలని ప్రయత్నిస్తాడు. లాయర్లు ఎవరు సహకరించరు. అయితే, జరిగిన ఘటనని అవమానంగా భావించిన కలెక్టర్ బదిలీపై వెళ్ళిపోతాడు. దీన్ని తన విజయంగా భావిస్తాడు వెంకడు.
ఆ. భాస్కరమ్మ రచించిన ‘ప్రభావతి’ అనే కథను విశ్లేషిస్తూ, – స్త్రీలకు సంబంధించిన ముఖ్యమైన విషాదకరమైన విషయాన్ని కథలో రచయిత్రి చెప్పారని వ్యాఖ్యానించారు సుశీలమ్మ. భర్త చనిపోయిన స్త్రీలు ఆనాటి సమాజంలో ఎదుర్కున అవమానాలను, హేళనలను, సమాజం బలవంతంగా రుద్దే ఆంక్షలను ప్రస్తావించారు ఈ కథలో. భాస్కరమ్మ గారి గురించిన సమాచారం లభించకపోవడం దురదృష్టం.
పొణకా కనకమ్మ గారు వ్రాసిన ‘నేను అభాగ్యుణ్ణి’ కథని సంక్షిప్తంగా వివరించారు, “ఈ రోజుల్లో ఈ కథ చదివితే నాన్సెన్స్ అనుకోవచ్చేమో. కానీ 1930ల్లో పురుషులతో పాటు స్త్రీలు కళాశాలలో చదువుకోవడం, తమ ఆశల్ని, ఆశయాలను స్వేచ్ఛగా వెల్లడించుకోవడం, ప్రేమ.. వంటి విషయాలు రాయడం అంటే – నాటి కాలానికి ఎదురీదడమే” అని వ్యాఖ్యానించారు సుశీలమ్మ. కనకమ్మ గారి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తూ, జైలు జీవితం గడిపినప్పుడు హిందీ నేర్చుకున్న విధానం, కథలను అనువదించిన వైనం తెలియజేశారు. ఓ ఫ్రెంచ్ కథని హిందీ అనువాదం ఆధారం తెలుగులోకి ‘ఉరి’ అనే పేరుతో అనువదించారు కనకమ్మ అని చెబుతూ, “ఈ కథను (అనువాదానికి) స్వీకరించడం లోనే కనకమ్మగారి మనసు, వ్యక్తిత్వం, ఆశయం కచ్చితంగా వెల్లడవుతోంది” అని అన్నారు.
సి.హెచ్.వు. రమణమ్మ గారి ‘ఆదర్శప్రాయురాలు’ కథలో కమల, విమల కాలేజీలో నేస్తులు. సంపదలోనూ, వ్యక్తిత్వంలోనూ ఇద్దరివీ భిన్నమైన దారులు. కమల తన చదువుని సమాజానికి వినియోగిస్తే, విమల స్వీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రతీకగా విమల. పేదల పక్షపాతిగా కమల నిలుస్తారీ కథలో. “పేదల కష్టాలు, కార్మికుల శ్రేయస్సు గురించి ఆ రోజుల్లో (1935) ఒక రచయిత్రి కథ వ్రాయడం గొప్ప విషయం” అని వ్యాఖ్యానించారు వ్యాసకర్త్రి.
ఆచంట కొండమ్మ గారు వ్రాసిన ‘శ్యామల’ కథ ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆ రోజుల్లో ఇలాంటి కథ రావడం సంచలనమేనన్నారు వ్యాసకర్త్రి. 1935 గృహలక్ష్మి పత్రిక జూన్ నెలలో ప్రచురింపబడిందీ కథ. స్త్రీ మనసులో ఏముందో తెలుసుకోకుండా తమ మానాన తాము ప్రేమ (?) పెంచుకోవడం, తనను కూడా ప్రేమించమని వేధించడం పరిపాటిగా మారిన ఈ రోజులకు భిన్నంగా; ప్రేమించకపోతే నరికెయ్యడమో, యాసిడ్ పోయడమో ఉన్మాదమయిన నేటి రోజులకు భిన్నంగా, శ్యామల తనపట్ల ప్రేమ భావనని మనసులో పెట్టుకున్న కమలాకరానికి స్పష్టంగా తన మనసును, తను కృష్ణారావుని ప్రేమించిన విషయంను నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్తుంది. అలాగే తన ప్రేమ విషయాన్ని తండ్రికి నిర్భయంగా చెప్తుంది. శ్యామల పాత్రని ధైర్యవంతురాలిగా, విద్యావంతురాలిగా, వివేకవతిగా చిత్రించిన ఆచంట కొండమ్మ అభినందనీయురాలని పేర్కొన్నారు సుశీలమ్మ.
స్థానాపతి రుక్మిణమ్మ గారు ‘తెలుగులో తొలి హారర్ కథల’ రచయిత్రి’. 1935లోనే తన 22 ఏళ్ళ వయసులో దెయ్యాల కథలు రాసి సంచలనం సృష్టించారు. వీరు వ్రాసిన ‘ఘనాపాఠి’ కథ హారర్ కథలా అనిపించినా, ఇందులో గొప్ప సందేశం ఉంది. గురుశిష్యుల మధ్య సంబంధంలోని సారాన్ని ఈ కథలో ఇమిడ్చి చెప్పారు రచయిత్రి అని వ్యాఖ్యానించారు సుశీలమ్మ. కథలోని కాశీపురం వర్ణన చదువుతుంటే, కాశీని చూసినట్టే ఉంటుంది.
ఆచంట సత్యవతమ్మ గారి ‘గుడ్డిగా నడిస్తే గోతిలో పడడమే’ కథ దొంగ సన్యాసుల గురించి చెబుతుంది. 1936 జూన్, గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమైన ఈ కథ రాసిన రోజులకీ, ఈనాటికీ తేడా ఏమీ లేదనిపిస్తోందని అన్నారు వ్యాసకర్త్రి. “1936 లోనే దొంగ స్వాములు వేషాల గురించి చెప్పడం ఆచంట సత్యవతమ్మ గారి అభ్యుదయ దృక్పథానికి నిదర్శనం” అంటూ, ఆమె వ్యక్తిగత వివరాలు లభ్యం కానందుకు బాధపడతారు వ్యాసకర్త్రి.
పులిపాక బాలాత్రిపురసుందరమ్మ గారి ‘పిల్లికి చరలాటము – ఎలుకకు ప్రాణ సంకటము’ వ్యాపార ప్రకటనలలో ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చూపడాన్ని, భోగవస్తువుగా ప్రదర్శించడాన్ని ఎండగడుతుంది. రామారావు తన భార్య సీతకు పత్రికలోని ఓ బొమ్మని చూపించగా, వాళిద్దరి మధ్యా వాదన జరుగుతుంది. చివరికి, ప్రకటనలలో స్త్రీలను అభ్యంతరకరంగా చూపడాన్ని నిలిపివేయాలంటూ ఉద్యమం చేపట్టి, సఫలమవుతుంది సీత. శ్రీమతి పులిపాక బాలాత్రిపురసుందరమ్మ గారి ఆత్మస్థైర్యాన్ని ప్రశంసించాంటూనే, 86 ఏళ్ల క్రితమే వ్యాపార ప్రకటనలలో స్త్రీలను అభ్యంతరకరంగా చూపడంపై ఓ స్త్రీ పోరాటం చేస్తే, ఇప్పటి కాలంలో మనమెంత చేయాలీ అని ప్రశ్నిస్తారు వ్యాసకర్త్రి.
శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ గారి ‘వింత విశాలాక్షి’ కథలో విశాలాక్షికి బొద్దింకలంటే ఉన్న భయాన్ని వర్ణిస్తారు. అయితే, ఆ భయమే ఓ పెళ్ళిలో ఎలా ఉపయోగిపడిందో చెప్తారు. కొన్ని భయాలు నిర్హేతుకమైనవే అయినా, అర్థం చేసుకుని భయపడుతున్నవారికి మద్దతునివ్వాలని వ్యాసకర్త్రి సూచిస్తారు.
శ్రీమతి పాకల చంద్రకాంతామణి గారి ‘దైవమేమి చేసినను మన మేలు కొరకే!’ కథ ముగ్గురు స్త్రీల భిన్న వ్యక్తిత్వాలను ప్రదర్శిస్తుంది. ఒక సవతి తల్లి, ఒక సవతి కూతురు, ఓ లాయర్ గారి భార్య – ఈ కథలో ప్రధాన పాత్రలు. ఈ ముగ్గురి మనస్తత్వాలను ప్రదర్శిస్తూ, సమాజంలోని మనుషుల స్వభావాలను వెల్లడిస్తారు రచయిత్రి.
సమయమంత్రి రాజ్యలక్ష్మి గారి ‘రెండు వరాలు’ కథ నాటి స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమంపైనా, సంఘసంస్కరణ పట్ల ఎంత అవగాహన ఉండేదో చెబుతుంది. భార్య అంటే దాసి మాత్రమే అన్న భావనలో ఆనందాన్ని పొందే కేశవరావుని భార్య సుశీల భర్తని సంస్కరించాలని ప్రయత్నించి విఫలమవుతుంది. గర్భం దాల్చాకా, ప్రసవ సమయంలో మరణం ఆసన్నమైందని గ్రహించిన సుశీల, రెండు వరాలు కోరుకుంటుంది. భర్తని మరో వివాహం చేసుకోమంటుంది, అది కూడా ఓ వితంతువుని చేసుకోమంటుంది, చేసుకున్న ఆమెకు అతనితో సమానంగా హక్కులు ఇవ్వమని అంటుంది. “80 ఏళ్ల క్రితం నాటి ఇలాంటి కథలు ఈనాడు ఎవరు చదువుతారు, ఏం అవసరం? అని కొందరు అనవచ్చు. స్త్రీల చైతన్యం కాలానికతీతంగా, క్రమానుసారంగా ఏ విధంగా వెల్లివిరిసిందో ఒక గ్రహింపుకు రావటం అవసరమే” అని వ్యాఖ్యానించారు సుశీలమ్మ.
నందగిరి ఇందిరాదేవి గారి ‘వాయిద్యం సరదా’ కథ 1941 మే నెల గృహలక్ష్మి మాసపత్రికలో ప్రచురితమైంది. ఆడపిల్ల ఏదైనా వాయిద్యాన్ని నేర్చుకోవాలంటే ఎంత పట్టుదల కావాలో, ఎన్ని ఆంక్షలను ఎదుర్కోవాలో ఈ కథ చెబుతుంది. మీనాక్షి చిన్నప్పడు హార్మోనియం నేర్చుకుంటుంది. కానీ పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళాకా, అక్కడ పాటలు పాడడంపై నిషేధిస్తారు. హార్మోనియంని అమ్మేస్తారు. ఆమెనే కాదు, ఆమెకు పుట్టిన కొడుకుని కూడా వాయిద్యాలను ముట్టుకోనీయరు. దాంతో తల్లీకొడుకులు ఎంతో మానసిక వేదనకి గురువతారు. కళాతృష్ణని అణచివేస్తే ఎంత వ్యథ కలుగుతుందో ఈ కథ చెబుతుంది. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక రంగాల్లో నిరంతరం కృషి చేసిన శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తెలంగాణ తొలి తరం కవయిత్రులలో ప్రముఖులని అంటారు వ్యాసకర్త్రి.
ఆచంట శారదాదేవి గారి ‘ఒక్క రోజు’ చక్కని కథ. భావుకురాలైన ఓ వివాహిత, భావుకత ఏ మాత్రం లేని కుటుంబంలో ఉండడం, భావుకతకీ, ఇంటి పనులకీ మధ్య ఆమె నలిగిపోవడాన్ని రచయిత్రి వాస్తవికంగా ప్రదర్శించారు. కాకపోతే కుటుంబ సభ్యులని మార్చడానికి ప్రయత్నించకుండా, తానే సర్దుకుపోవడం ఆశ్చర్యకరం! “1954 నుండి 1977 వరకూ తిరుపతి పద్మావతి కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసిన ఆచంట శారదాదేవి గారు తన కథల్లో దాదాపు అన్ని స్త్రీ పాత్రలనీ ఉద్యోగినిలా చిత్రించక పోవడం ఆశ్చర్యమే” అని వ్యాఖ్యానించారు సుశీలమ్మ.
శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం గారి ‘ఒడిదుడుకులు’ కథ ఓ గొప్ప స్టేట్మెంట్తో మొదలవుతుంది. దాంపత్యం కలకాలం సజావుగా సాగాలంటే, భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం ఉండాలని ఈ కథ చెబుతుంది. ఎదురింటి కుర్రవాడు తనకి రాసిన ఓ ఉత్తరం ద్వారా, భర్త ఆట కట్టించాలని ప్రయత్నిస్తుంది శారద. కథలో చాలా వివరాలను రచయిత్రి వాచ్యంగా చెప్పక పాఠకుల ఊహకు వదిలేశారని వ్యాసకర్త్రి పేర్కొన్నారు. “కాశీరత్నంగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. హిందీ పండిట్, కవయిత్రి, గాయని, రచయిత్రి, రాజకీయ నాయకురాలు, ఎడిటర్, జర్నలిస్టు, సామాజిక పరిశోధకురాలు” అంటూ ఆమె బహుముఖీన ప్రజ్ఞను పాఠకులకు పరిచయం చేశారు సుశీలమ్మ.
శ్రీమతి అలివేలు మంగతాయారు గారి ‘పరివర్తనము’ చక్కని కథ. రమేషు, విజయ భార్యాభర్తలు. విజయ ఇంటిపనులో ప్రవీణురాలు కానీ రూపసి కాదు. తనకి కాబోయే భార్య గొప్ప అందగత్తె అయి ఉండాలని కోరుకున్న రమేషు తల్లిదండ్రుల బలవంతం మీద విజయను పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమెను అసహ్యించుకుంటునే ఉంటాడు. అయితే ఓ సంఘటన జరిగి అతనిలో అంతర్మథనం సంభవించి, బాహ్య సౌందర్యం కంటే ఆత్మసౌందర్యమే మేలని గ్రహించి తనని క్షమించమని విజయను వేడుకుంటాడు. “ఈ రోజుల్లో ఈ కథ పూర్తిగా అసంబద్ధంగా ఉన్నదని అనుకోక తప్పదు. కానీ ఆ కాలపు అభిప్రాయాలు, నమ్మకాలు అవి” అని వ్యాఖ్యానించారు సుశీలమ్మ.
ఇల్లిందల సరస్వతీదేవి గారి ‘అక్కరకు రాని చుట్టము’ కథలో తన భర్త వెంకట్రావుకి సోకిన క్షయవ్యాధి ముదిరిపోయినా బంధువులెవరూ సాయానికి రాకపోవడంతో, ఒంటరినే ఆ సమస్యని ఎదుర్కుంటుంది సీతమ్మ. ఉన్న నగలన్నీ అమ్మి చికిత్స చేయిస్తుంటే, భర్త హెచ్చరిస్తాడు, ఆ పదిరోజులకి డబ్బు అవసరమవుతుందని. తాను చనిపోతానని ముందే గ్రహించిన వెంకట్రావు నగల్ని అమ్మితే వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసేలా చేస్తాడు. నిజంగానే అతడు చనిపోయాకా, దశదినకర్మ ఖర్చులకి ఉపయోగపడుతుందా ధనం. మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని ప్రదర్శిస్తుందీ కథ. “మధ్యతరగతి జీవితాలలోంచి సమకాలీన సమస్య లను తీసుకొని సమాజ పరిణామ క్రమంలోనే ఇతివృత్తానికి తగినట్లుగా పాత్రల్ని, సంఘ టనల్ని, సంభాషణల్ని సమకూర్చారు” అని రచయిత్రిని ప్రశంసిస్తారు సుశీలమ్మ.
వేదుల మీనాక్షీదేవి ప్రఖ్యాత కవి, రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి మనుమరాలు. మీనాక్షిదేవి గారి ‘మానివేసిన కథ’లో రచయిత్రి రాస్తున్న కథలోని ప్రధాన పాత్ర కలలో కనబడి, ఆమె ప్రవర్తనను దిద్దుతాడు. ఆమె కథలోని అనౌచిత్యాన్ని ప్రస్తావిస్తాడు. దాంతో, ఆత్మవిమర్శ చేసుకున్న ఆ రచయిత్రి, ఆ కథని రాయడం ఆపేస్తుంది. ఆనాటి కాలానికిది మంచి ఇతివృత్తమని వ్యాసకర్త్రి అభిప్రాయపడ్డారు.
కొమ్మూరి పద్మావతీదేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత్రి, రంగస్థల నటి, సినీనటి కూడా. వీరు రాసిన ‘శోభ’ కథ సినిమా నటి అవ్వాలని ప్రయత్నించిన సుబ్బులు – మద్రాసు వచ్చి ఎలాగొలా అవకాశం దక్కించుకుని సినీ రంగంలో ప్రవేశించి, ‘శోభారాణి’ పేరుతో నటిగా స్థిరపడుతుంది. ఆమెను బొమ్మను చేసి ఆడిస్తుంటాడు రామస్వామి. చివరికి తనకేం కావాలో తెలుసుకున్న శోభ – తిరిగి సుబ్బులుగా మారిపోతుంది. ఈ కథ ఎందరో నటీమణుల జీవితాలను గుర్తు చేస్తుంది. వెండితెర వెలుగుల వెనుక చీకటి కోణాలను ప్రదర్శిస్తుంది. “ఏది ఏమైనా ఇదొక విలక్షణమైన మంచి కథ. బహుశా యదార్థ గాధ అని చెప్పవచ్చు” అన్నారు వ్యాసకర్త్రి. కొమ్మూరి పద్మావతీదేవి గారికి గుడిపాటి వెంకటాచలం స్వయానా బావగారు. ప్రముఖ డిటెక్టివ్ రచయిత కొమ్మూరి సాంబశివరావు పద్మావతి గారి కుమారుడు. కొడవటిగంటి కుటుంబరావు గారు పద్మావతికి అల్లుడు(వరూధిని గారి భర్త). పద్మావతి గారి మరో కుమార్తె ఉషారాణి కూడా రచయిత్రే. ఇలా వీరిది రచయితల కుటుంబమని చెప్పుకోవచ్చు.
కల్యాణి గారి ‘ఇంటి నీడలో’ కథ 1954 లో ప్రచురితమైంది. చాలా కుటుంబాలలో భౌతికంగా కనిపించే హింస ఉండకపోవచ్చు కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల కూడా స్త్రీలు తమ జీవితంలో చాలా కోల్పోతారని ఈ కథలో విజయ పాత్ర ద్వారా రచయిత్రి వెల్లడించారని సుశీలమ్మ తెలిపారు. ఈ రచయిత్రి వివరాలు లభించకపోవడం బాధాకరం.
బి. ప్రేమలీల గారి ‘దూరపు కొండలు నునుపు’ కథ 27 ఫిబ్రవరి 1952 నాటి ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఎదుటివాళ్ళతో పోల్చుకుని తమ జీవన విధానాన్ని తామే కించపరుచుకోకూడదని.. ఆడంబరంగా జీవిస్తున్న వాళ్ళంతా ఆనందంగా ఉంటున్నట్టు కాదనీ, లేమిలో జీవిస్తున్నా, ఉన్నదానితో సంతృప్తిపడేవారి జీవితం ఎంతో సంతోషంగా సాగుతుందని ఈ కథ చెబుతుంది. ఈ వ్యాసం ప్రారంభంలో సుశీలమ్మ గారు వ్రాసిన వాక్యాలు అక్షరసత్యాలు.
కొమ్మూరి ఉషారాణి ‘అభ్యుదయం’ 1952 నవంబర్ గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమైంది. ఈ కథలో పార్వతి, “అభ్యుదయం.. ముందంజ.. సంస్కారం.. అంటే ఇవి కావు” అంటుది నిష్కర్షగా. మరి అసలైన అభ్యుదయం అంటే ఏమిటో చెప్పకనే చెబుతుంది. గొప్ప వ్యంగ్య కథ. పంజాబ్ కు చెందిన సుమీందర్ సింగ్ భాటియాని వివాహం చేసుకున్న ఉషారాణి గారు నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా తెలుగు శాఖకు తొలి ఎడిటర్ గా 1990 వరకు పదవీ బాధ్యతలు నిర్వహించారు.
~
అలనాటి కథా రచయిత్రులు, వారి కథలు, కథా వస్తువులు, రచనా సంవిధానం తదితర అంశాలతో పాటు రచయిత్రుల వ్యక్తిగత వివరాలు, వారి వ్యక్తిత్వాలను వీలైనంత మేర పాఠకులకు అందించారు సుశీలమ్మ.
విలువైన వ్యాసాల సంపుటి ‘తొలితరం తెలుగు రచయిత్రులు – అభ్యుదయ కథలు’.
***
రచన: ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ప్రచురణ: శ్రీ సిహెచ్. లక్ష్మీనారాయణ పబ్లికేషన్స్, గుంటూరు
పేజీలు: 112
వెల: ₹ 200.00
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖలు
నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఇతర శాఖలు
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
రచయిత్రి: 9849117879
~
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-prof-ch-suseelamma/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.