Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తొలిప్రేమ

[డా. సి. భవానీదేవి రచించిన ‘తొలిప్రేమ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

వమాసాలు ఉమ్మనీటిలో ఊగితూగి
అమాయకంగా భూమ్మీద కళ్ళు తెరిచినప్పుడు
అమ్మ చూపులతో తొలిసారిగా
నా చూపులు కలిసినప్పుడు
అదే నా తొలిప్రేమ అని గుర్తించేదెంతమంది!
అరచేతుల మృదుమమకారాన్ని రంగరించుకుని
నా శరీరాన్ని తడిమిన అమ్మస్పర్శ
జీవితమంతా అల్లుకుపోయినప్పుడు
పొత్తిళ్ళలో నన్ను పొదువుకున్నప్పుడు
స్వర్గం కూడా సరితూగదనిపించింది
అమ్మ పెట్టిన తొలిముద్దు ముద్ర
ఎన్ని అలంకారాలనైనా తలదన్నేది
పారాడినప్పుడు చేరిన అమ్మ ఒడి
ఆజీవనం అద్దుకున్న పుప్పొడి
తప్పటడుగులకు నడక నేర్పిన అమ్మకు
మూడోపాదంగా మారిపోయినప్పుడు
చిన్నప్పుడు అమ్మ పక్కన పడుకుని
ఆనందామృతం తాగుతున్నంత హాయి
క్లబ్బులు పబ్బుల వీరంగాల జడిలో
అపోహపడే తొలిచూపంత మాయ ఉంటుందా!
తొలిప్రేమ కురిపించి మురిసిన
అమ్మ కనుమరుగైన జీవితం
తిమిరసంద్రంలో తీరని తపనాన్వేషణ
సుదూరతీరాలనుంచి అమ్మపిలుపు
ఆలంబనగా పయనం ఆ ప్రేమతీరం వైపు!!

Exit mobile version