[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘తొలగిన తెర’. రచన శ్రీ రాజ మోహన్ ఇవటూరి.]
“సర్. దోమలగూడలో హత్య జరిగింది. మీకు లొకేషన్ పంపించాను. వెంటనే రండి” నా అసిస్టెంట్ భార్గవ ఫోన్ చేసాడు.
వెంటనే యూనిఫామ్ తొడుక్కుని వీలయినంత వేగంగా ఘటనా స్థలానికి చేరాను. ఇంటిముందు పోలీసులతో పాటు ఇరుగు-పొరుగు, మీడియా మనుషులతో నిండిపోయిన రోడ్డుని చూసాక ఇల్లు వెతుక్కోవలసిన పని లేకపోయింది.
అప్పటికే అక్కడ ఉన్న భార్గవ తన ప్రాథమిక పరిశోధన పూర్తి చేసినట్టున్నాడు. నేను రాగానే చెప్పాడు.
“సార్! ఇంటిలోకి ఎవరూ బలవంతంగా వచ్చిన ఛాయలు లేవు. హంతకుడు ఎవరో తెలిసిన వాడే అయ్యుండాలి. అతను వాడిన ఆయుధం పిల్లలు జామెట్రీ కోసం వాడుకునే డివైడర్. కానీ వేలిముద్రలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. హతుడు రామం బ్రతికే అవకాశం లేకుండా కాలేయంలోకి పొడిచాడు. రెండ్రోజుల క్రితమే ఇంట్లో కెమెరాలు పనిచేయటం లేదని హతుడు ఫిర్యాదు చేసిన రసీదు అతను పనిచేసుకునే బల్ల మీద దొరికింది. వాసన పసిగట్టే కుక్కలని తీసుకురమ్మని కబురు పెట్టాను.”
గుక్క తిప్పుకోకుండా అతను చెప్పిన విషయాలు విని నా శిక్షణలో అతను ఎంత తెలివిగా బాధ్యతగా సమాచారం సేకరించాడో గమనించి గర్వపడ్డాను. “ఈ వీధిలో కెమెరాలు ఉంటాయేమో కదా” అడిగాను.
“ఆ విషయం కూడా కనుక్కున్నాను సార్. పదిరోజులనుంచి రామం గారి ఇంట్లో ఒక్క కెమెరా కూడా పనిచేయటం లేదు. మూడు రోజుల క్రితమే ఎవరో వీధిలో కెమెరాలు కూడా విరగ్గొట్టారు. ఆ తర్వాతే రామం గారు ఆలస్యం చెయ్యకుండా తన కెమెరాల రిపేర్ కోసం మెకానిక్‌కి చెప్పారు.”
“ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు?”
“ఆయన పని మనిషి రాధ సార్! అదుగో అక్కడే కూతురుతో నిలబడింది చూడండి.” అన్నాడు భార్గవ.
“పద.” అంటూ ఆమె వైపు నడిచాను.
“చూడమ్మాయి. ఈరోజు రామం ఇంటికి ఎవరెవరు వచ్చారు? సాధారణంగా తరుచుగా ఎవరు వస్తుంటారు?” నేరుగా అడిగాను.
“గోపాల రావు గారు, ఆనందు బాబు, సీతాపతి బాబు ఎక్కువగా వస్తారు బాబు.” అందామె.
“వీళ్ళలో ఎవరంటే రామంకి ఇష్టం?”
“ఇష్టమంటే..” అని మౌనంగా ఉండిపోయింది.
“నీకేం భయం లేదు. నీ యజమానిని చంపిన వారిని పట్టుకోవాలంటే అన్ని వివరాలు చెప్పాలి” అన్నాను. ఆ మాటలకి నేను ఊహించిన ఉద్వేగం ఆమె ముఖంలో కనిపించలేదు గానీ చెప్పటం మొదలు పెట్టింది.
“ఆనందు బాబంటే బాబుగారికి చాలా ఇష్టం. దాదాపు ప్రతిరోజూ కలుస్తారు. వారు ఎంత దగ్గరంటే ఎప్పుడైనా ఆలస్యమైతే ఒకరింట్లో ఒకరు రాత్రిళ్ళు ఉండిపోతూ ఉంటారు. అడపాదడపా కలిసి భోజనాలు చేస్తుంటారు.”
“ఓహో. ఈ మధ్య అలా ఎప్పుడయినా జరిగిందా?” అని అడిగాను.
“చాలా రోజులనుంచి ఆయన ఒకరే వచ్చి పొద్దెక్కేలోపలే వెళ్లిపోతున్నారు.”
“అంటే! ఏమయినా గొడవలు జరిగాయా?”
ఆమె కొంచెం ఆలోచించి “అలాంటిదేమీ ఉండకపోవచ్చు బాబు. ఆ మధ్య ఆనందు ఏదో ఊరు వెళ్ళినపుడు ఆయన ఇంట్లో పిల్లకి సాయంగా మా బాబు అక్కడ రెండ్రోజులు ఉన్నారు. పది రోజుల క్రితమే ఆనందు బాబు పెద్ద మొత్తం రామం బాబుకి ఇవ్వటం కూడా అనుకోకుండా చూసాను. ఒకరికొకరు సాయం చేసుకుంటూనే ఉంటారు. అందుచేత ఎటువంటి గొడవలూ లేవనే చెప్పచ్చు. “ అంది.
“సరే. సరే. మిగతా వారి గురించి చెప్పు.”
“గోపాలం బాబు కూడా మరీ ఎక్కువ కాకపోయినా వస్తూ పోతూ ఉంటాడు. వారి మధ్యలో వ్యాపార విషయంలో ఏవో గొడవలు ఉన్నాయనుకుంటా. చాలా సార్లు గట్టిగా వాదించుకున్నారు.” అంది రాధ.
నేనింకా ఆశిస్తున్నానని అర్థమయింది గానీ “వాళ్ళు కలిసినప్పుడల్లా నన్ను దూరం వెళ్ళిపోమనేవారు సార్. అనుకోకుండా విన్న విషయాలే మీకు చెప్పాను” అంది.
నేను అడిగేలోపు సీతాపతి గురించి కూడా చెప్పింది. “సీతాపతి, రామం బాబు తమ్ముడే. తండ్రికి కర్మ చేసేటపుడు కలుసుకుంటారు. చాలా ముక్తసరిగా మాట్లాడుకుంటారు. కానీ వైరం ఉన్నట్టు కనిపించలేదు.”
కొంచెం ఆలోచించి “రామం ఎలాంటి వాడు?” అని అడిగాను. రాధ ఆశ్చర్యపోయి “పనిచేసుకునే వాళ్ళం మాకేం తెలుస్తుందండి. మాకు సంబంధించినంత వరకూ జీతాలు టంచనుగా ఇచ్చేస్తాడు. మా అమ్మాయికి కూడా బొమ్మలు, మిఠాయిలు ఇస్తూ ఉండేవాడు. అంతే.” అంది.
“సాధారణంగా అతని దినచర్య ఏమిటి?”
“ఎప్పుడూ టీవీ ముందే ఉంటారు బాబూ. అక్కడే ఫలహారం, భోజనం చేస్తారు. ఆ పడక్కుర్చీ ఆయనకి ఇష్టమైన స్థలం. వ్యాపారం కోసం కూడా చాలావరకూ ఫోన్లోనే పని చేయిస్తారు. టీవీ ముందే తింటూ ఒక పిల్లల పనిముట్టుతో (డివైడర్) పళ్ళు కుట్టుకుంటూ గడిపెయ్యటం ఆయనకున్న విచిత్రమైన అలవాటు.”
హు! ఆ డివైడరే అతని ప్రాణాలు తీసింది!
ఇంకేమీ ప్రశ్నించటానికి తోచక రాధ కొంగు పట్టుకుని మావైపు విడ్డూరంగా చూస్తున్న ఆమె కూతురుతో అన్నాను. “పాపా! కంగారు పడకు. మీ అంకుల్ని చంపిన వాడిని పట్టుకుని జైల్లో వేస్తాను” అన్నాను హాస్యంగా. ఆ పిల్ల నన్ను తోసేసి వాళ్ళ అవుట్ హౌస్ వైపు పరిగెత్తుకు వెళ్ళిపోయింది .
అప్పటికి భార్గవ ఇంకాస్త పని చేసుకుని వచ్చాడు. మా కుక్కలు కూడా ఈ ముగ్గురినే సూచించాయని ముందు చెప్పి “సర్! నెల రోజుల క్రితం రామం అకౌంటులో ఆనంద్ పది లక్షలు జమ చేసాడు. అది అప్పుగా ఇచ్చాడా లేక ఇచ్చినది తిరిగిచ్చాడో తెలియలేదు. రాధ చెప్పిన విషయాల బట్టీ కూడా వాళ్ళ స్నేహం ఈమధ్య కొంచెం బలహీనమైనట్టు అనిపించింది.” అన్నాడు.
“అంత తక్కువ వివరాలతో ఏమీ నిర్దారించలేం. కానీ అనుమానితుల జాబితాలో చేర్చు. మిగతా ఇద్దరి విషయం ఏమిటి?”
“అందరినీ రప్పించాను సార్. మనం విచారించచ్చు”
మరికొన్ని నిముషాలలో మా ఆఫీసులో వాళ్ళ ముగ్గురిని చూసాను.
గోపాల్ సఫారీ సూటులో ఉన్నాడు. కానీ ఆ దుస్తులు అతనికి నప్పలేదు. స్థలాల బ్రోకర్ లాగానే ఉన్నాడు. ఆనందం చూడటానికి చాలా సాత్త్వికంగా కనిపించాడు. దైవ భక్తి అతని వేషధారణలో కనిపిస్తోంది. సీతాపతి రమణ రెడ్డి గారిలా సన్నగా పొడవుగా ఉన్నాడు. నంగిరిగా, భయస్తుడిలా ఉన్నాడు.
చాలా క్రైమ్ సినిమాలలో ఒక మంచి మనిషిలా కనిపించేవాడే చివరికి హంతకుడిగా తేలతాడు. అందుకో మరెందుకో తెలియదు గానీ ముందు ఆనందుతో పరిశోధన ప్రారంభించాలనుకుని అతన్ని గదిలోకి పంపించమన్నాను.
“రండి. కూర్చోండి” అని కుర్చీ చూపించి నేరుగా విషయంలోకి వచ్చాను. “రామం గారితో మీ స్నేహం ఎలాంటిది?”
ఆనంద్ ముఖంలో చిరునవ్వు. “స్నేహం అనే పదం చాలా లోతైనదండి. పరిచయస్థులు చాలా మంది ఉంటారు” అన్నాడు.
నాకు చిరాకెత్తింది. “మీరు కవితలు బాగా రాస్తారేమో గానీ ఇప్పడు అలాంటి చర్చ చేసే మూడ్‌లో లేను. రామం గారితో మీ పరిచయం ఎలా ఉండేది?”
“మేము తరుచు కలుసుకునే వాళ్ళం. మాకిద్దరికీ నచ్చిన విషయాలు చాలా ఉండటం వలన ఆ సాంగత్యం మాకు ఇష్టంగా ఉండేది”
“వేరే మిత్రులెవరూ లేరా?”
“చెప్పానుగా. పరిచయస్థులు ఉన్నారు. నాకు మా పాప. పాపకి నేను. నా భార్య అయిదేళ్ల క్రితం మరణించింది.”
“అయ్యో” అని ఒక క్షణం ఆగి “రామంగారితో ఇతర లావాదేవీలేమైనా ఉన్నాయా?”
“అవి కూడా ఉండేవి. అవసరానికి డబ్బు సహాయం చేసుకున్నాం. ఈ మధ్యే అతనికి కొంత డబ్బు కావాలంటే ఇచ్చాను.” అన్నాడు రామం.
“వెనక్కి ఇచ్చాడా?”
“బ్రతికుంటే ఇచ్చేవాడే.”
“అతను డబ్బు వెనక్కివ్వటానికి నిరాకరించాడనీ, అందుకే మీరు చంపేశారని నేనంటే మీరేమంటారు?”
“మీరు జోకులు బాగా వేస్తారని అంటాను.” నవ్వాడు ఆనంద్. అతనితో పాటు నేను కూడా నవ్వేసాను.
“మరి మీకు ఇలాగే అవసరం పడితే అతను కూడా ఇచ్చి ఉండేవాడా?”
“ఇచ్చేవాడు కాదు.”
నేను ఆశ్చర్యపోయి “ఎందుకని?” అని అడిగాను.
“అతను ఇక లేడు కనుక.” అని చెప్పి లేచి నుంచున్నాడు ఆనంద్. “ఇంకేమీ చెప్పేది లేదనుకుంటాను. నేను వెళ్లవచ్చా?”
నాకు కూడా ఇంకేమీ అడిగాలనిపించలేదు. అయినా అడిగాను. “ఆఖరి ప్రశ్న. మీ ఉద్దేశంలో రామాన్ని ఎవరు చంపి ఉంటారు?”
ఆనంద్ ఒక్క క్షణం ఆలోచించి “చాలా మంది జీవితాల గురించి మనకి పూర్తిగా తెలియదు ఆఫీసర్. ఎక్కడ ఏమి తేడా వస్తుందో మనం చెప్పలేం.” అన్నాడు.
ఇతను అంత సులువుగా దొరికేలా లేడు.
“నేను వెళ్తాను. పాప స్కూల్ నుంచి వచ్చేస్తుంది” అని బయల్దేరాడు.
నేను ఆపలేదు. ఇతనే హంతకుడు అయిఉండచ్చని నాకు బలంగా అనిపిస్తోంది. మిత్రుడు చనిపోయాడని బాధ కనిపించలేదు. స్నేహం-పరిచయం మధ్య తేడాలు వివరించటం, ఏ ప్రశ్నకీ నేరుగా జవాబు చెప్పకపోవటం నాకు సహజంగా అనిపించలేదు. కానీ ప్రస్తుతానికి ఆధారాలు లేవు. అతను చంపివుండటానికి కారణం ఏమిటో ఇప్పటికి ఊహించలేం. అనుమానితుల జాబితాలో మాత్రం పేరు చేర్చాను. తర్వాత గోపాలాన్ని పిలిపించాను.
గోపాలం చాలా అసహనంగా ఉన్నాడు. లోపలకి వస్తూనే “నన్నెందుకు పిలిచారు ఇనస్పెక్టర్! వాడికీ నాకు వ్యాపారపరంగా వైరం ఉండచ్చు. అంత మాత్రాన నన్ను అనుమానించాలా?” అంటూ కూర్చున్నాడు.
“ఇప్పటికి మీరింకా నిందితులు కాదు. రామంతో సన్నిహితులు కనుక కేవలం వివరాలకోసం పిలిచాను.” అన్నాను.
“సన్నిహితమేమీ లేదు లెండి. నిజానికి వాడు చావటం నాకు ఉపయోగమే. మేము వద్దని బతిమాలుతున్నా వాడి ప్లాట్లని అందరూ అమ్మే రేట్ల కన్నా తక్కువలో అమ్మేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు.” అన్నాడు గోపాల్.
“నాకు తెలుసు. ఆ కారణం పైనే మిమ్మల్ని ఎందుకు అనుమానించకూడదు?”
అతను వెంటనే లేచి నుంచుని “ఇదేమిటండీ. ఈ లెక్కన వాడి వలన నష్టపోయిన వాళ్ళం పదిమంది ఉన్నాం. అందరినీ అనుమానిస్తారా?” అన్నాడు.
“కూర్చోండి. నా ఉద్దేశం అది కాదు. ఎవరి హత్య జరిగినా ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎందుకు చంపారు అనే మూడు కోణాల్లో ఆలోచిస్తాం. అందుకని..”
“అలా అయితే రెండేళ్ల క్రితమే చంపేసేవాడిని. వాడి ఇంట్లో ఎవరూ ఉండరు. వీధి చివరలో ఉన్న వీడి బంగళా నుంచి అర ఫర్లాంగు వరకూ ఒక్క ఇల్లు లేదు. ఈ వీధి కెమెరాలు ఎప్పుడూ ఎవడో ఒకరు పగలకొడుతూ ఉంటారు. అలాంటి రోజు గనక వాడు ఛస్తే మర్నాటి వరకూ ఎవరికీ తెలియదు” అన్నాడు గోపాల్ ఆవేశంగా.
“మీరు హత్య ఎలా చెయ్యచ్చో చాలా వివరాలు చెప్తున్నారు.” అన్నాను.
అతను తత్తరపడి “నా ఉద్దేశం అది కాదు. నాకు ఇన్నాళ్లూ అవకాశమున్నా చంపలేదని చెప్తున్నా.” అన్నాడు.
“సర్లెండి. మీరు ఈరోజు పన్నెండుకీ రెండుకీ మధ్యలో ఎక్కడున్నారు?”
అతను వెంటనే మొబైల్ తీసి ఫోటోలు చూపించాడు. “ఒక పార్టీకి స్థలం చూపించి వస్తున్నాను. ఫొటోలు తీసిన టైమ్ చూస్తే పది నుంచి మూడు గంటల వరకూ అక్కడే ఉన్నానని స్పష్టంగా తెలుస్తుంది” అన్నాడు.
అతను చెప్పింది నిజమే. “సరే. వెళ్ళండి.కానీ నేను చెప్పే వరకూ ఊరు దాటి ఎక్కడికీ వెళ్ళవద్దు” అన్నాను.
అతను ఆశ్చర్యపడుతూ “నా వృత్తికి అది కష్టమే. అయినా సహకరిస్తాను” అంటూ వెళ్ళిపోయాడు.
ఇతను శంషాబాదులో ఉన్నా వేరేవాడికి తాంబూలం ఇచ్చి చంపించే అవకాశం ఉంది. మాటల్లోనే హత్య ఎంత సులువుగా చేసి తప్పించుకోవచ్చో విపులంగా చెప్పాడు. అతన్ని కూడా అనుమానితుల లిస్టులో వేసాను.
ఇక మిగిలినది సీతాపతి. అతను వచ్చిన వెంటనే భోరుమంటూ ఏడుపు మొదలు పెట్టాడు. ఇలాంటి వ్యవహారం నాకు చికాకు. నిజాయితీగా బాధపడేవారు కూడా అంత దద్దరిల్లేలా ఏడవరు. అతను ఏడుపు ఆపేవరకూ సహనంగా ఆగాను.
దుఖంనుంచి తేరుకున్నట్టు నన్ను నమ్మించాక చెప్పాడు. రామం, సీతాపతి ఒకే తండ్రి బిడ్డలు. వారి తల్లులిద్దరూ సఖ్యతగా పరస్పర అంగీకారంతో ఆస్తి విభజనకి అంగీకరించినా అన్యాయం జరిగిందని ఇద్దరికీ ఆరోపణలు ఉన్నాయి. అందుచేత వారి మధ్య సంబంధాలు అంటీఅంటనట్టే ఉన్నాయి. తండ్రి కర్మకి సీతాపతి వస్తాడు కానీ ఎక్కువ మాటాడకుండా వెళ్ళిపోతాడు. అతను నేరుగా చెప్పకపోయినా నాకు ఇలా అర్ధమయ్యింది.
రామం చావు వలన సీతాపతికి వేరే లాభాలు ఏమైనా ఉన్నాయేమో అని భార్గవ కూడా పరిశోధించి ఏమీ లేవని తేల్చేసాడు. కానీ దాయాదుల మధ్య జరిగే వివాదాలు ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో కేవలం కడుపుమంటతో కూడా అఘాయిత్యం చేసిన సందర్భాలు లేకపోలేదు. అయితే అతను ఆ రోజు అతని కంపెనీలోనే రోజంతా ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్నాడనీ, ఒక్క క్షణం కూడ గది దాటి వెళ్లనేలేదని ఖచ్చితమైన సాక్ష్యం ఉంది. వేరే మనుషులని పెట్టి చంపించేటంత అవసరం గానీ ధైర్యంగానీ ఉన్న మనిషిలా అతను కనిపించలేదు.
ఇప్పటికి తెలిసిన ప్రకారం గోపాల్, సీతాపతి హత్య జరిగిన సమయానికి హత్యాస్థలంలో లేరని బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఆనంద్ ఆ సమయంలో ఎక్కడున్నాడు?
నా ప్రశ్నకి సమాధానంగా “అతను ప్రతిరోజూ భోజనానికి ఇంటికి వెళ్తాడు. వ్యాయామం అవుతుందని నడిచే వెళ్తాడట.” చెప్పాడు భార్గవ.
నేను ఆశ్చర్యపోయాను. “అవును సార్. దాదాపు సిబ్బంది మొత్తం భోజనానికి ఇంటికి వెళ్లి వస్తారు” అన్నాడు భార్గవ. కొంచెం విచిత్రంగా అనిపించినా ఊరుకున్నాను.
“మనం రేపు లంచ్ టైములో అతని ఆఫీసుకి వెళదాం” అన్నాను.
అనుకున్నట్టే మర్నాడు ఆనందుని కలవగానే “ఆనంద్ గారూ! మీతో ఇంకొంచెం వివరంగా మాట్లాడాలి. సమయం వృథా కాకుండా మీ ఇంటికి నడుస్తూ మాటాడుకుందాం.” అన్నాను.
ఈ తతంగం వెనక ఏదో ఆలోచన ఉందని ఊహించినా ఆనంద్ మాట్లాడకుండా “సరే పదండి” అని బయలుదేరాడు. కానీ అతనిలో ఎటువంటి ఆందోళన లేదు.
అతనితో మాట్లాడుతూనే దారి మొత్తం గమనించాను. అతని ఇంటికి చేరటానికి సరిగ్గా అరగంట పట్టింది. ఇల్లు చేరుతూనే నా సైగని అర్ధం చేసుకుని భార్గవ “నాకు ఇక్కడే కొంచెం పని ఉంది సర్. ఆ పని చూసుకుని నేరుగా ఆఫీసుకి వెళ్ళిపోతాను” అని చెప్పి బయల్దేరాడు. నిజానికి అతను మేము వచ్చిన దారి మొత్తం పరిశీలించటానికి వెళ్ళాడు.
నేను, రామం అతని ఇంట్లోకి వెళ్లాం. చిన్న ఇల్లు. కానీ ఇంటి ముందు పెద్ద తోట. ఒక ఉయ్యాల, ఒక ప్లాస్టిక్ గుడారం, ఆ పక్కన మట్టిలో చిన్న పిల్లలు నడిపే కిక్ స్కూటర్ గుర్తులు నేను చూస్తుంటే “అదంతా మా పాప ఇంట్లో ఆడుకోవటానికి నేను చేసిన ఏర్పాటులండి” అన్నాడు ఆనంద్.
అక్కడ వరండాలో కూర్చుని హోమ్ వర్క్ చేసుకుంటున్న పాపని చూపించి “మా అమ్మాయండి” అన్నాడు.
“పాపా! బాబాయికి మంచి నీళ్లు ఇవ్వు” అనగానే ఆ పాప చెంగుమని గెంతుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. నేను అతను ఇల్లుని గమనిస్తూ మాటాడుతున్నాను. ఈలోపు ఆనంద్ “రండి. మా ఇల్లు చూద్దురు గాని” అంటూ అతని ఇల్లు మొత్తం చూపించాడు. ఎక్కడా అనుమానించే విషయం ఏమీ లేదు.
అతని కూతురు ఇచ్చిన మంచి నీళ్లు తాగుతూ ఏమైనా పనికొచ్చే విషయం దొరుకుతుందేమో అని ఆశతో చూస్తూ ఒక చాకొలేట్ జేబులోంచి తీసి ఆ పిల్లకి ఇచ్చాను. ఆ పిల్ల తీసుకోకుండా తండ్రి వైపు చూసింది.
“పరవాలేదు. నేను నీ అంకుల్ నే కదా.” అంటూ చాకోలెట్ ఉన్న చేతిని ముందుకు చాచాను. ఆ పిల్ల నా చేతిని వెనక్కి తోసి తుర్రుమని వెనక్కి పరుగెత్తి ఆనందుని వెనకనుంచి గట్టిగా పట్టుకుని నా వైపు భయంగా చూసింది.
“పరవాలేదమ్మా. బాబాయ్ ఇచ్చాడు కదా. తీసుకో” అని ఆనంద్ అన్నాక “థాంక్స్ బాబాయ్” అంది పాప.
“నా గురించి ఏం చెప్పారు ఆనంద్. మీ అమ్మాయి నన్ను చూసి భయపడింది” అంటూ లేచి నిల్చున్నాను.
“అలాంటిదేమీ లేదండి. చిన్న పిల్ల. మీరు ఇంకేమీ అడిగేది లేకపోతే మేమిద్దరం భోజనం చేస్తాం” అన్నాడు ఆనంద్.
వెంటనే వీడ్కోలు పలికి నేను గమనించిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ వెనక్కి నడిచాను. భార్గవ కొత్త వివరాలతో నాకోసం ఎదురుచూస్తూ నేను రాగానే చెప్పటం ప్రారంభించాడు.
“సర్. ఆనంద్ ఆఫీసు దాటి పెద్ద రోడ్డు మీదికి రాగానే కెమెరాలు ఉన్నాయి. ఆశ్చర్యమేమిటంటే మనం నడిచిన మిగతా దారిలో అతని ఇంటి ముందు రోడ్డు వరకూ ఎక్కడా కెమెరాలు లేవు. దారంతా మధ్య తరగతి నివాసాలే ఎక్కువ. అక్కడక్కడ చిన్న చిన్న షాపులు లాంటివి ఉన్నా అక్కడ కూడా కెమెరాలు లేవు. చివరికి అతని ఇంటికి ముందు వీధిలో మాత్రమే కెమెరాలు ఉన్నాయి సార్.”
పరిశోధన ఓ కొలిక్కి రావటం లేదని నాకు ఉక్రోషం వచ్చింది. అయినా ఆ రెండు చోట్లా భాస్కర్ సేకరించిన కెమెరా ఫుటేజ్ చెక్ చేసాను. హత్య జరిగిన రోజు ఆనంద్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు మీద నడుస్తూ కనిపించాడు. ఇరవై అయిదు నిముషాల తర్వాత ఇంటి వైపు నడుస్తూ కనిపించాడు. భోజనానికి ఇరవై నిముషాలు తీసుకున్నట్టున్నాడు. ఆ తర్వాత అరగంటలో ఆఫీస్ చేరినట్టు కెమెరాలు చెప్తున్నాయి. అంటే ఈ మధ్యలో రామం ఇంటికి వెళ్లి అతన్ని చంపి రావటానికి అవకాశం లేదు.
ఆ ఒక్క రోజూ ఆనంద్ ఏ టాక్సీలోనో వెళ్లి హత్య చేసి నింపాదిగా సరైన సమయానికి ఆఫీస్ చేరి ఉండచ్చు కదా!
అదే మాట నేను అనగానే “ఆ విషయం నేను ఆలోచించాను సార్. ఊబర్, రాపిడో, ఓలా వారినందరినీ అడిగి ఈ సమయంలో ఇక్కడనుంచి అతని ఇంటి వైపు వెళ్లిన రైడ్స్ చెక్ చేసాను. పోనీ బైక్ గానీ కారు గానీ వాడాడా అంటే అతను ఎప్పుడూ ఏ వాహనం నడపటం చూడలేదని స్టాఫ్ అన్నారు.” చెప్పాడు భార్గవ.
నేను నిట్టూర్చాను.
అనుమానితులని పరిశోధించాం గానీ అసలు రామం ఎలాంటి వాడు అనే విషయం కొన్ని కోణాల్లోనే వెతికాం కదా! అందుకని అతని గురించి మరిన్ని వివరాలు సేకరించాను. అతని భార్య చనిపోయాక రామం మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు లేరు. చాలా దయామయుడనీ అనాథశరణాలయాలకి తరుచు దానాలు చేస్తాడని తెలిసింది. అతను పిల్లలంటే చాలా ప్రేమ చూపిస్తాడని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం అతని లాప్టాప్ అదుపులోకి తీసుకుని నా సిబ్బందితో అతని పాస్వర్డ్ క్రాక్ చెయ్యమని చెప్పాను.
అనుమానితుల్లో ఇద్దరు హత్యా సమయంలో అక్కడ లేరు. ఆనంద్ విషయంలో అనుమానించటానికి ఒక్క ఆధారం కూడా లేదు.
భోజనం తర్వాత పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్ధాలని తొలగించటానికి రామం డివైడరుని వాడతాడని రాధతో సహా అతని మిత్రులు చెప్పారు. పడక్కుర్చీలో కూర్చుని ఉండగా అక్కడే అందుబాటులో ఉన్న ఆ డివైడరుతో సరిగ్గా కాలేయంలో గుచ్చుకునేలా పొడిచాడు హంతకుడు. ఆ పోటు తాకిడి కన్నా రక్తస్రావం వలన చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది.
“భార్గవా. తక్కువ ఎత్తులో పొడిచే అవకాశం పిల్లలకి ఎక్కువ కదా! మనం రాధ కూతురిని కూడా ప్రశ్నించాలి” అన్నాను.
నా మాటలు విని భార్గవ అదో రకంగా చూసి అయినా నా మీద గౌరవంతో “మీరు చెప్పింది తర్కానికి దూరంగా ఉన్నా తీసిపారేయలేం. ఆయుధం కూడా పిల్లలు వాడుకునే డివైడర్. కానీ హత్య ఎందుకు చేసి ఉండచ్చో తెలుసుకోవాలి.” అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు. రాధ పైన కూడా అనుమానం వచ్చింది. హత్య జరిగినప్పుడు ఆమె అవుట్హౌసులోనే ఉంది. ఆనంద్ పెద్ద మొత్తం రాముకి ఇచ్చాడని తెలిసాక దురాశతో చంపేసిందా?
నేను ఆలోచిస్తుంటే “ఈ కేసులో విచిత్రమైన విషయం మరొకటి గమనించాను సర్. వేలిముద్రలు లేని చోట కూడా సాధారణంగా హంతకుడి గడియారమో, ఉంగరమో, రుమాలో ఏదో ఒకటి దొరికేవి. కానీ ఈసారి అలాంటివి ఏమీ లేవు” అన్నాడు భార్గవ.
ఆ మాటలు వినగానే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. “భార్గవా! ఒకసారి మన సేకరించిన ఎవిడెన్సుల ఫోటోలు చూపించు” అన్నాను. భార్గవ ఫైల్ తీసి నాకు చూపించసాగాడు.
ఒక ఫొటోలో రామం ఇంటి గేట్ పక్కన ఉన్న కంచె తాలూకు తీగకి చిక్కుకుని గాలికి ఎగురుతున్న ఎర్రటి చిన్న గుడ్డ ముక్క కనిపించింది.
“నేను పొద్దున్న చూసినా ఇది ఎందుకో దృష్టిలో ఉంచుకోలేదు.” అన్నాను ఫోటోని చూపిస్తూ.
భార్గవ పరిశీలనగా చూసి “మనకి పనికి రావచ్చు సార్. ఎవరిదో చొక్కా చిరిగి ఆ ముక్క ఇక్కడ ఉండిపోయింది. చొక్కా ఎవరిదో తెలుసుకోవాలి. హత్య జరిగిన రోజే చిరిగిందా లేదా కూడా తెలుసుకోవాలి” అన్నాడు.
నేను రామం ఇంటి దగ్గర చూసిన విషయాలు ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుంటూ “నువ్వు సేకరించిన కెమెరా ఫుటేజ్ మరో సారి చూద్దాం.” అన్నాను.
భార్గవ అతని మొబైలులోంచి వీడియో రన్ చేసాడు. కొన్ని నిముషాలలోనే నాకు విషయం అర్ధమయిపోయింది. ఆఫీసునుంచి బైటికి వచ్చినపుడు ఆనంద్ వేసుకున్న చొక్కా రామం ఇంటి దగ్గర కనిపించిన గుడ్డముక్కకి సరిపోయేలా ఉంది. ఇంకా అనుమానం తీరక అతని ఇంటికి నడుస్తున్న దారిలో కెమెరా ఫుటేజ్ చూసాను. నా కళ్ళు మెరిసాయి. హంతకుడిని దాదాపు పట్టుకున్న ఆనందంతో కలిగిన మెరుపు. ఎందుకంటే ఇంటివైపు నడుస్తున్న ఆనంద్ చొక్కా కుడివైపు నడుము దగ్గర చిరిగి ఉంది.
చిన్న పిల్లలు కాళ్లతో నడుపుకునే కిక్ స్కూటర్ తాలూకు గుర్తులు అతని ఇంటి ముందు తోటలో చూశానని జ్ఞాపకం రాగానే ఏమి జరిగి ఉంటుందో ఊహించగలిగాను. కనీసం అతన్ని గట్టిగా ప్రశ్నించటానికి ఈ వివరాలు చాలు. కానీ ఇప్పటికీ నాకు మోటివ్ ఏమయ్యుంటుందో అర్ధం కాలేదు. అతన్ని ప్రశ్నిస్తే తెలుస్తుంది.
ఇదంతా భార్గవకి చెప్పకుండా “భార్గవా. నేను రాధని ప్రశ్నించాలి” అని చెప్పి అతని చికాకుని గమనించనట్టు నటిస్తూ “నువ్వు డాక్టర్ పటేల్ గారిని కలిసి టీవీ ముందే తింటూ తాగుతూ రామం ముందుకు వంగినపుడో మరే కారణం వల్లనో ఆ డివైడర్ అతనికి గుచ్చుకునే అవకాశం ఉందేమో కనుక్కో.” అన్నాను.
నాకు మతి పోయిందేమో అన్నట్టు భార్గవ చూస్తుంటే “మనం అన్ని కోణాల్లోనూ పరిశోధించాలి. వెంటనే కనుక్కుని నాకు ఫోన్ చెయ్యి. నేనీ లోపల రాధతో పాటు ఆ పాపతో కూడా మాట్లాడతాను” అన్నాను.
భార్గవ భారంగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు.
రాధ, ఆమె కూతురుతో, ఆనందు, అతని కూతురుతో వేరు వేరుగా మాట్లాడాను. అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరికాయి. రెండు రోజుల తర్వాత కేసు క్లోజ్ చేసాను. ఇదే నా నివేదిక సారాంశం.
“రామం పనిమనిషితో పాటు అతన్ని చంపే అవకాశం ఉన్న అందరినీ ప్రశ్నించి, ఎన్నో విధాలుగా పరిశోధించాక అతని మరణం హత్య వలన కాదని అనిపిస్తోంది. అనుమానితుల్లో ఎవరికీ హత్య చేయటానికి తగిన కారణాలు దొరకకపోవడం ఒక కారణమైతే డాక్టర్ పటేల్ అనుమానించినట్టు అనుక్షణం టీవీ ముందే కూర్చున్న రామం ఒక దురదృష్టకరమైన భంగిమలో ముందుకు వంగినప్పుడు ప్రమాదకరంగా అతని వడిలోనే ఉన్న డివైడర్ గుచ్చుకుని చనిపోయి ఉండవచ్చని దాదాపు నిర్దారణకు వచ్చాము. ఆ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవటం వలనా రామం ఎవరినీ పిలవలేకపోవటం వలనా రక్త స్రావంతో రామం చనిపోయి ఉండవచ్చునని డాక్టర్ అభిప్రాయపడ్డారు.”
కేసు ఈ విధంగా ముగించినందుకు నాకేమీ బాధగా లేదు. అంకుల్ అనే మాట వినగానే చిన్నారులంతా భయభ్రాంతులవ్వటానికి కారణం అర్ధమయ్యింది. ఆనందుని ప్రశ్నించాక హంతకుడు ఎవరో నిర్దారణ అయింది. కానీ ఆనందు పట్టుబడితే హత్యా కారణం నా నివేదికలో రాయవలసి వస్తుంది. అప్పుడు ఒక చిన్నారి జీవితం అతలాకుతలం అవుతుంది.
తన కూతురిని రెండు రోజులు తండ్రిలా జాగ్రత్తగా చూసుకోమని రామంకి చెప్పి తనే ఒక కామ పిశాచికి అప్పజెప్పాననే విషయం గ్రహించాక కుమిలిపోయిన ఆనంద్ ఎన్నో రోజులు ఏమీ జరగనట్టు ప్రవర్తించి సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకున్న విధానం సాధారణ పరిస్థితుల్లో కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌గా పరిగణిస్తాం. కానీ రామం గతం మరింత లోతుగా పరిశోధించాక అనాథలకి సహాయం ముసుగులో జరిగిన మరెన్నో నిజాలు తెలిసాక నాకు పశ్చాత్తాపం అనిపించలేదు.
